పశ్చిమ ఆఫ్రికాలో దొంగతనానికి భంగపాటు
యూనస్ యబు ఇలా చెప్పింది
“మా ఇంట్లో సాధారణంగా సంఘ పుస్తక పఠనం జరిగే రోజునే దాడిచేయాలని సాయుధులైన దొంగలు అనుకున్నారు. పుస్తకపఠనానికి వచ్చే సహోదర, సహోదరీల కోసం, ఆసక్తిగల వ్యక్తుల కోసం ఆ రోజున మేము మా గేట్లను పూర్తిగా తెరచి ఉంచుతాం. దాన్ని గురించీ, పుస్తక పఠనం జరుపుకునే సమయం గురించీ ఆ దొంగలకు బహుశ తెలిసివుండవచ్చు. వాళ్లు ఎక్కడనుండో ఎత్తుకొచ్చిన ఒక కార్లో వచ్చి, సరిగ్గా పుస్తక పఠనం జరిగే రోజున, అదే సమయానికి మా గేటుకి దగ్గర్లో కాపువేశారు.
“వాళ్లు దాడిచేసిన వారమూ, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శించే వారమూ కాకతాళీయంగా ఒకటే అయ్యింది. మా ఇంటిలో కూటాన్ని జరుపుకోవడానికి బదులుగా, మేం రాజ్యమందిరంలో కూడుకున్నాం. మీటింగ్ అయిపోయిన తర్వాత, పెద్దల కూటం ఏర్పాటుచేయబడింది. అలాంటి సందర్భాల్లో సాధారణంగా నేనూ, పిల్లలూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ సంఘంలో ఒక పెద్దగా సేవచేస్తున్న మా ఆయన పెద్దల కూటం తొందరగానే అయిపోతుంది, మనమంతా కలిసే వెళ్లిపోదాం కాస్సేపు ఆగండని అన్నారు. అందుకని మేం ఆగాము.
“ఆ కూటం అయిపోయిన తర్వాత మా కారును స్టార్ట్ చేయబోతే అది కాస్తా కదలనని మొరాయించింది. మా ఆయనా, ప్రాంతీయ కాపరీ ఇద్దరూ కలిసినా దాన్ని బాగుచేయలేకపోయారు. మెకానిక్‌ని తీసుకొచ్చినా, ఆయన వల్లా కాలేదు.
“పిల్లలు నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కొంతసేపైన తర్వాత, నేను కూడా ఇంటికి వెళ్లాను. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దాదాపు పది గంటలైంది. నేను గానీ నా పిల్లలు గానీ కాంపౌండ్‌లోకి కార్లో వెళ్లివుంటే, కాంపౌండ్‌వాల్ కున్న పెద్ద గేట్‌ను తెరవాల్సి వచ్చేది.
“నేను పడగ్గదిలోకి వెళ్లగానే, తుపాకి పేలినట్టు పెద్ద శబ్దాన్ని విన్నాను. ఏం జరుగుతుందా అని అనుకున్నాను. పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తే, అది కాస్తా పనిచేయడంలేదు. అప్పుడు నేను గబగబ క్రిందకు వెళ్ళి స్టీల్ ఎంట్రన్స్ తలుపులకు తాళం వేశాను, ఆ తర్వాత మధ్య తలుపులకు తాళం వేయడానికి పరుగుతీశాను. లైట్లను ఆర్పేశాను. పిల్లలు భయంతో బిక్కచచ్చిపోయారు, వాళ్లను నెమ్మదిగా ఉండమని చెప్పాను. యెహోవా దేవుని కాపుదల కోసం మేం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇంత జరుగుతున్నా, రాజ్యమందిరం దగ్గర మా ఆయన ఇంకా కారుతో కుస్తీపడుతూనే ఉన్నారు.
“నేను కిటికీలోంచి బయటకి చూసినప్పుడు వీధిలో గేటు దగ్గర ఒకతను పడిపోయి ఉన్నాడు. వాతావరణాన్నిబట్టి చూస్తే దొంగలు వెళ్లిపోయినట్టు అన్పించింది, గాయపడ్డ ఆ వ్యక్తిని వెంటనే నేను కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. అది ఎంతో రిస్క్‌తో కూడినదే అయినా ప్రాణాన్ని కాపాడ్డానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయినా, మరుసటి రోజు ఆయన చనిపోవడం ఎంతో విచారకరమైన విషయం.
“విషాదకరమైన ఆ సంఘటనేగాక, మరీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొని ఉండాల్సి వచ్చేది. ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనాన్ని బట్టి మా ఇంటిలో పుస్తక పఠనం జరగలేదు. కారు పాడైపోవడం వల్ల అందరం కలిసి కార్లో రాలేకపోయాము. మా ఆయన ఇంటికి మరీ లేటుగా గనుక రాకపోయివుంటే దొంగలు ఆయన్ని చుట్టిముట్టి ఉండేవారు. ఇవీ, మరి ఇతర కారణాలూ, ఆ రాత్రి మా పాలిట సానుకూల విషయాలుగా మారాయి.
“యెహోవాయే మా బలమైన దుర్గము, మా ఆశ్రయము. అది ‘యెహోవా పట్టణమును కాపాడనియెడల దానికావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే’ అని లేఖనం చెబుతున్నట్టుగా ఉంది.”—కీర్తన 127:1.