103వ అధ్యాయం
ఆలయాన్ని మళ్లీ శుభ్రం చేశాడు
మత్తయి 21:12, 13, 18, 19 మార్కు 11:12-18 లూకా 19:45-48 యోహాను 12:20-27
యేసు అంజూర చెట్టును శపించాడు, ఆలయాన్ని శుభ్రం చేశాడు
చాలామందికి జీవాన్ని ఇవ్వాలంటే యేసు చనిపోవాలి
యేసు, ఆయన శిష్యులు యెరికో నుండి వచ్చిన తర్వాత బేతనియలో మూడు రాత్రుళ్లు ఉన్నారు. తర్వాతి రోజు అంటే సోమవారం నీసాను 10 తెల్లవారుజామున వాళ్లు యెరూషలేముకు బయల్దేరారు. యేసుకు ఆకలేయడంతో ఒక అంజూర చెట్టు కనిపించగానే దాని దగ్గరికి వెళ్లాడు. ఇంతకీ ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయా?
అది మార్చి నెలాఖరు. నిజానికి అంజూర పండ్లు కాసే కాలం జూన్‌లో గానీ మొదలవ్వదు. కానీ ఆ చెట్టు ముందే చిగురించింది, దానికి ఆకులు వచ్చేశాయి. కాబట్టి దానికి పండ్లు కూడా ముందే కాసివుంటాయని యేసు అనుకున్నాడు. కానీ ఆయన వచ్చి చూసేసరికి ఒక్క పండు కూడా లేదు. చెట్టుకు ఆకులు రావడంవల్ల, చూసేవాళ్లు పండ్లు వచ్చాయనుకొని మోసపోయే అవకాశం ఉంది. యేసు ఆ చెట్టుతో ఇలా అన్నాడు: “ఇంకెప్పుడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు.” (మార్కు 11:14) వెంటనే చెట్టు ఎండిపోవడం మొదలైంది, దాని అర్థమేంటో తర్వాతి రోజు ఉదయం తెలుస్తుంది.
కాసేపటికి యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు చేరుకున్నారు. ఇప్పుడు యేసు మళ్లీ ఆలయంలోకి వెళ్లాడు. ముందు రోజు మధ్యాహ్నమే ఆయన ఆలయంలో జరుగుతున్న వాటిని గమనించాడు. అయితే ఈ రోజు గమనించడం కన్నా ఎక్కువే చేశాడు; మూడు సంవత్సరాల క్రితం, అంటే సా.శ. 30 పస్కా పండుగ సమయంలో ఏ చర్య తీసుకున్నాడో ఇప్పుడూ అలాంటి చర్యే తీసుకున్నాడు. (యోహాను 2:14-16) ఈసారి యేసు, “ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను బయటికి వెళ్లగొట్టాడు. డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలకిందులుగా పడేశాడు.” (మార్కు 11:15) ఆలయ ప్రాంగణాన్ని అడ్డదారిగా ఉపయోగించి, వస్తువుల్ని నగరంలోని వేరేచోటికి తీసుకెళ్తున్న వాళ్లను కూడా ఆయన అడ్డుకున్నాడు.
ఆలయంలో డబ్బులు మార్చేవాళ్ల మీద, జంతువుల్ని అమ్మేవాళ్ల మీద యేసు ఎందుకంత కఠినమైన చర్య తీసుకుంటున్నాడు? ఆయన ఇలా అన్నాడు: “‘నా మందిరం అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’ అని లేఖనాల్లో రాసిలేదా? కానీ మీరు దాన్ని దోపిడీదొంగల గుహగా మార్చేశారు.” (మార్కు 11:17) యేసు వాళ్లను దోపిడీదొంగలని ఎందుకు అన్నాడంటే, వాళ్లు బలికి అవసరమైన జంతువుల్ని మరీ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. వాళ్లు ప్రజల దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటున్నట్టు, దోచుకుంటున్నట్టు ఆయనకు అనిపించింది.
ముఖ్య యాజకులు, శాస్త్రులు, ప్రముఖులు యేసు చేసినదాని గురించి విని ఆయన్ని చంపడానికి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సమస్య ఏంటంటే, ఆయన చెప్పేది వినడానికి ప్రజలు గుంపులుగుంపులుగా వస్తున్నారు. కాబట్టి ఆయన్ని ఎలా చంపాలో వాళ్లకు తెలియలేదు.
సహజ యూదులు మాత్రమే కాదు, యూదులుగా మారిన అన్యులు కూడా పస్కాకు వచ్చారు. పండుగ ఆచరించడానికి వచ్చినవాళ్లలో గ్రీకువాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఫిలిప్పు దగ్గరికి వచ్చి యేసును చూడాలనుకుంటున్నామని చెప్పారు. బహుశా ఫిలిప్పుది గ్రీకు పేరు కావడం వల్ల వాళ్లు అతని దగ్గరికి వచ్చివుంటారు. కానీ వాళ్లను యేసు దగ్గరికి తీసుకెళ్లడం సరైనదో కాదో ఫిలిప్పుకు తెలిసుండకపోవచ్చు. కాబట్టి అతను ఆ విషయం గురించి అంద్రెయతో మాట్లాడాడు. ఇద్దరూ వెళ్లి యేసుకు ఆ విషయం చెప్పారు. అప్పటికింకా ఆయన ఆలయంలోనే ఉండివుంటాడు.
ఇంకొన్ని రోజుల్లో చనిపోతానని యేసుకు తెలుసు కాబట్టి ప్రజల కుతూహలం తీర్చడానికో, పేరు సంపాదించుకోవడానికో ఇది సమయం కాదు. అందుకే, ఆ ఇద్దరు అపొస్తలులతో యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “మానవ కుమారుడు మహిమపర్చబడే సమయం వచ్చేసింది. నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గోధుమ గింజ నేలమీద పడి చనిపోకపోతే అది ఒక్క గింజగానే ఉండిపోతుంది; కానీ అది చనిపోతే ఎంతగానో ఫలిస్తుంది.”—యోహాను 12:23, 24.
ఒక్క గోధుమ గింజకు ఎలాంటి విలువ లేదని అనిపించవచ్చు. కానీ భూమిలో విత్తబడి గింజగా “చనిపోతే,” అది మొలకెత్తి కొంతకాలానికి ఎన్నో గింజలున్న కాండంగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా, యేసు కూడా ఒక్క పరిపూర్ణ మనిషే. అయినా, ఆయన దేవునికి నమ్మకంగా ఉండి చనిపోతే, తనలాగే స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించే అనేకులకు శాశ్వత జీవితం ఇవ్వగలుగుతాడు. అందుకే యేసు ఇలా అన్నాడు: “తన ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తి దాన్ని కోల్పోతాడు, కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించే వ్యక్తి శాశ్వత జీవితం కోసం దాన్ని కాపాడుకుంటాడు.”—యోహాను 12:25.
యేసు తన ఒక్కడి గురించి కాదుగానీ, తనను అనుసరించేవాళ్ల గురించి కూడా చెప్తూ ఇలా అన్నాడు: “ఎవరైనా నాకు సేవకుడిగా ఉండాలనుకుంటే అతను నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. ఎవరైనా నాకు సేవచేస్తే తండ్రి అతన్ని ఘనపరుస్తాడు.” (యోహాను 12:26) ఎంత గొప్ప బహుమానమో కదా! తండ్రి ఘనపర్చే వ్యక్తులు, పరలోక రాజ్యంలో క్రీస్తు సహచరులు అవుతారు.
తీవ్రమైన బాధను, వేదనను అనుభవించి చనిపోవాలనే విషయం మనసులో ఉంచుకుని యేసు ఇలా అన్నాడు: “ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది, నేను ఏమనాలి? తండ్రీ, జరగబోయేదాని నుండి నన్ను కాపాడు. అయినా, దీని కోసమే నేను వచ్చాను.” (యోహాను 12:27) తన త్యాగపూరిత మరణంతో సహా, దేవుని సంకల్పాలన్నిటి విషయంలో యేసుకు కూడా తన తండ్రికి ఉన్నలాంటి ఆలోచనే ఉంది.