నా సహోదరుడ్ని అప్పు అడగాలా?
సైమన్ చిన్న కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు. అర్జంటుగా చికిత్స చేయించవలసిన అవసరం ఉంది. కానీ సైమన్ చాలా బీదవాడు, చికిత్స చేయించే స్తోమత లేదు. ఆయన ఏమి చేయగలడు? సరే, తోటి క్రైస్తవుడైన మైకల్ ఆయనకన్నా ఆర్థికంగా కాస్త మంచి స్తోమతలో ఉన్నాడు. మైకల్ ఆయనకు ఒకవేళ డబ్బు అప్పివ్వవచ్చు. అయితే, ఆయన తనకు అప్పు ఇచ్చినా దాన్ని తీర్చే స్తోమత తనకు లేదని సైమన్‌కు తెలుసు.a
సైమన్ తన దగ్గరకు వచ్చినప్పుడు మైకల్ సందిగ్ధంలో పడ్డాడు. నిజంగానే అవసరం ఉందని ఆయన గ్రహిస్తాడు, కానీ సైమన్ తన కుటుంబాన్ని పోషించడానికే చాలా కష్టపడుతున్నాడు కనుక ఆయన అప్పు తీర్చలేడేమోనని సంశయిస్తాడు. మైకల్ ఏమి చేయాలి?
అనేక దేశాల్లో, ప్రజలు తమ జీవనాధారాన్ని ఒక్కరాత్రిలోనే కోల్పోతారు, తమ చికిత్సకయ్యే బిల్లులను చెల్లించేందుకు డబ్బుగానీ, ఇన్సూరెన్స్‌గానీ లేనివారౌతారు. బ్యాంక్ ఋణాలు లభ్యం కాకపోవచ్చు. ఒకవేళ లభించినా వడ్డీరేటు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఒక అత్యవసరం వచ్చినప్పుడు, అప్పు తీసుకోవడమే ఏకైక మార్గంగా కనిపించవచ్చు. అయితే, అప్పు అడిగేముందు, పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాలున్నాయి.
లెక్క చూసుకోండి
అప్పిచ్చేవారికీ, అప్పు తీసుకునేవారికీ లేఖనాలు మార్గనిర్దేశాలను ఇస్తున్నాయి. ఈ ఉపదేశాలను అనుసరించడం ద్వారా, మనం అనేక అపార్థాలను గాయపడిన అనుభూతులను నివారించుకోగలుగుతాం.
ఉదాహరణకు, డబ్బు అప్పు తీసుకునే విషయాన్ని తేలికగా తీసుకోకూడదు అని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు” అని రోమ్‌లోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు బోధించాడు. (రోమీయులు 13:8) క్రైస్తవుడు అచ్చివుండవలసినది ప్రేమ మాత్రమేనన్నది ఆదర్శసూత్రం. కనుక, ‘ఇప్పుడు అప్పు తీసుకోవడం నిజంగా అత్యవసరమా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.
అవును అన్నదే జవాబు అయితే, అప్పుల పాలవ్వడం వల్ల కలిగే పర్యవసానాలను గురించి అవలోకించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తలపోయడమూ, పథకంవేసుకోవడమూ అవసరం అని యేసుక్రీస్తు చూపించాడు. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని యేసు తన శిష్యులను అడిగాడు. (లూకా 14:28) ఒక సహోదరుడ్ని అప్పు అడగాలా వద్దా అని అవలోకించేటప్పుడు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. అప్పు తీసుకునే ముందు లెక్క చూసుకోవడం అంటే ఎలా ఎప్పుడు తిరిగి చెల్లించవచ్చని లెక్క చూసుకోవడమని అర్థం.
ఎలా, ఎప్పుడు తిరిగి చెల్లించగలరు అని తెలుసుకునే హక్కు అప్పు ఇచ్చే వ్యక్తికి ఉంది. మనం విషయాలను జాగ్రత్తగా తూచిచూసి, ఆయనకు నిర్దిష్ట జవాబులను ఇవ్వగల్గుతాం. సహేతుకమైన కాలవ్యవధిలోనే అప్పును తిరిగి చెల్లించగల్గేలా లెక్క చూసుకున్నామా? “సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇస్తాను. మీరు నన్ను నమ్మగలరని మీకు తెలుసు” అని మన సహోదరుడికి జవాబివ్వడం సులభమే. కానీ విషయాలను మరింత బాధ్యతాయుతమైన విధంగా మనం చేయవద్దా? అప్పు తిరిగి చెల్లించాలనే యెహోవా కోరుకుంటున్నాడు గనుక, అప్పు తీసుకున్నప్పటి నుండే దాన్ని తిరిగి చెల్లించాలని దృఢనిశ్చయం చేసుకుని ఉండాలి. “భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు” అని కీర్తన 37:21 చెబుతుంది.
మనం అప్పును ఎప్పుడు ఎలా చెల్లించగలమని లెక్కచూసుకోవడం ద్వారా, మనల్ని మనం గంభీరంగా బద్ధులను చేసుకుంటున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకుంటాం. అనవసరంగా అప్పు తీసుకునే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది. మనం అప్పులపాలు కాకుండా ఉంటే, దానివల్ల లాభాలు ఉన్నాయి. “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అని సామెతలు 22:7 చెబుతుంది. అప్పిచ్చేవాడూ, అప్పుతీసుకునేవాడు ఆధ్యాత్మిక సహోదరులే అయినప్పటికీ, అప్పు వాళ్ళ సంబంధంపై ప్రభావం చూపవచ్చు, కనీసం కొంతమేరకైనా. అప్పు గురించిన అపార్థాలు కొన్ని సంఘాల శాంతికి భంగం కలిగించాయి కూడా.
డబ్బు ఎందుకు అవసరమో వివరించండి
మనం అప్పు తీసుకునే డబ్బును ప్రాథమికంగా దేనికోసం వాడబోతున్నాం అనే విషయాన్ని తెలుసుకునే హక్కు అప్పిచ్చే వ్యక్తికి ఉంది. ఈ అప్పే కాకుండా మనం ఇతరుల నుండి అప్పు చేస్తున్నామా? అలాగైతే, మనం ఆ విషయాన్ని స్పష్టంగా తెలపాలి. ఎందుకంటే మనం అప్పు తిరిగి చెల్లించే మన స్తోమతకు దానితో సంబంధముంది.
వ్యాపార ఋణాలకు, ఏదో అత్యవసరాన్ని తీర్చుకోవడం కోసం చేసే అప్పుకూ మధ్య ఉన్న తేడాను వివేచించి చూడడం ప్రాముఖ్యం. ఒక వాణిజ్య సాహసం కోసం అప్పివ్వాల్సిన లేఖనాధార బాధ్యత సహోదరుడికి లేదు. కానీ, ఒక సహోదరుడి పొరపాటు ఏమీ లేకపోయినా, అన్నవస్త్రాలకు లేదా అత్యవసరమైన చికిత్సకు అవసరమైన డబ్బు ఆయన దగ్గర లేకపోతే, ఆయనకు సహాయం చేయడానికి మరో సహోదరుడు మొగ్గుచూపించవచ్చు. ఈ విషయాల్లో నిర్మొహమాటంగా, సత్యసంధంగా ఉండడం అపార్థాలను తొలగించేందుకు సహాయపడతాయి.—ఎఫెసీయులు 4:25.
వ్రాతలో పెట్టడం
మనం భవిష్యత్తులో అపార్థాలను నివారించుకోవాలంటే వ్రాతపూర్వక ఒప్పందం చాలా సహాయకరంగా ఉంటుంది. ఒప్పందంలోని నిర్దిష్ట వివరాలను వ్రాసిపెట్టకపోతే సులభంగా మరిచిపోవచ్చు. ఎంత అప్పు ఇచ్చారు, ఎప్పుడు తీరుస్తారు అనేది మనం వ్రాసిపెట్టుకోవలసిన అవసరం ఉంది. ఒప్పందంలో సంతకం పెట్టి, ఒక్కో కాపీని దగ్గరుంచుకోవాలన్నదే అప్పుతీసుకున్నవారికీ, అప్పిచ్చినవారికీ ఇచ్చే సలహా. ఆర్థిక వ్యవహారాలను వ్రాతపూర్వకంగా ఉంచాలని బైబిలు సూచిస్తుంది. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడానికి కొద్దికాలం ముందు, యిర్మీయా తన బంధువు స్థలాన్ని కొనుక్కోవలసిందిగా యెహోవా ఆయనకు చెప్పాడు. ఆయన పాటించిన పద్ధతిని మనం పునఃసమీక్షించి ప్రయోజనం పొందవచ్చు.
“నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలుచేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి యెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును ఆప్పగించి”తిని అని యిర్మీయా అన్నాడు. (యిర్మీయా 32:9-12) ఇక్కడ పేర్కొనబడిన ఉదాహరణ అప్పు గురించి కాక, కొనుగోలుకు సంబంధించినదే అయినా, డబ్బు వ్యవహారాలను స్పష్టంగా ఖండితంగా వ్రాసి ఉంచవలసినదాని ప్రాముఖ్యతను అది చూపుతుంది.—కావలికోట మే 1, 1973, 287-8 పేజీలను (ఇంగ్లీష్) చూడండి.
సమస్యలు ఎదురైతే, మత్తయి 18:15-17లో లిఖించబడిన యేసు ఉపదేశానికి అనుగుణ్యంగా పరిష్కరించుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నించాలి. అయితే, ఇలాంటి విషయాల్లో సహాయకరంగా ఉండడానికి ప్రయత్నించిన ఒక సంఘపెద్ద చేసిన వ్యాఖ్య ఇది: “దాదాపు ప్రతి కేసులోనూ, లిఖిత పత్రం లేదు. దానివల్ల, అప్పు ఎలా తీర్చాలి అనే విషయంలో ఇద్దరి మధ్య స్పష్టమైన అవగాహన లేకుండా పోయింది. ఈ విషయాలను లిఖిత రూపంలో పెట్టడం ప్రేమకు సంకేతమే కాని, అపనమ్మకానికి కాదని నాకు నమ్మకం కుదిరింది.”
మనం ఒకసారి ఒప్పందం చేసుకున్నాక, మనం మాట తప్పకుండా ఉండేందుకు గట్టిప్రయత్నం చేయాలి. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది” అని యేసు బోధించాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:37) అనుకోని సంఘటన వలన అప్పును షెడ్యూల్ ప్రకారం చెల్లించలేని పరిస్థితి ఎదురైతే, అప్పిచ్చిన వ్యక్తికి పరిస్థితిని వెంటనే వివరించాలి. బహుశా గడువును పెంచి చిన్న మొత్తాల్లో డబ్బు చెల్లించేందుకు ఆయన అనుమతించవచ్చు.
అయితే, ప్రతికూలమైన పరిస్థితులు మనలను మన బాధ్యతలను నుండి విముక్తులను చేయవు. యెహోవాకు భయపడే వ్యక్తి తన మాటను నెరవేర్చడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. (కీర్తన 15:4) విషయాలు మనం అనుకున్నట్లు జరగకపోయినప్పటికీ, మన అప్పులు తీర్చేందుకు మనం త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, అది మన క్రైస్తవ బాధ్యత.
అప్పిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి
నిజమే, విషయాలను జాగ్రత్తగా తూచి చూడవలసింది అప్పు తీసుకునేవాడు మాత్రమే కాదు. అప్పు ఇవ్వమని ఏ సహోదరుడ్నైతే అడుగుతారో ఆయన కూడా అంచనావేసి చూడవలసి ఉంది. డబ్బు అప్పిచ్చే ముందు, మనం విషయాలను జాగ్రత్తగా ఉద్దేశపూర్వకంగా అవలోకించి చూసేందుకు సమయం తీసుకోవడం జ్ఞానయుక్తం. “చేతిలో చెయ్య వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము” అని చెబుతూ బైబిలు హెచ్చరిస్తుంది.—సామెతలు 22:26.
ఇస్తామని మాటివ్వక ముందు, సహోదరుడు ఒకవేళ తిరిగి ఇవ్వలేకపోతే ఏమి జరగవచ్చు అనే విషయాన్ని గురించి ఆలోచించండి. మీకు గంభీరమైన ఆర్థికసమస్యలు కలగవచ్చా? ఒక సహోదరుడికి సదుద్దేశమే ఉన్నప్పటికీ, పరిస్థితులు మారవచ్చు లేదా ఆయన అంచనాలు తప్పవచ్చు. “రేపేమి సంభవించునో మీకు తెలియదు. . . . మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే” అని యాకోబు 4:14 చెబుతుంది.—పోల్చండి ప్రసంగి 9:11.
ముఖ్యంగా వ్యాపార ఋణాల విషయమైతే, అప్పు తీసుకునే వ్యక్తి ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో పర్యాలోచించడం జ్ఞానయుక్తం. సత్యసంధుడనీ, నమ్మదగినవాడనీ నిరూపించుకున్నాడా లేక ఆర్థిక వ్యవహారాల్లో అనుచితంగా ప్రవర్తిస్తాడని పేరు తెచ్చుకున్నాడా? సంఘంలో అందరి దగ్గరికీ వెళ్ళి ప్రతి ఒక్కొక్కరినీ అప్పు అడిగేందుకు మొగ్గు చూపుతున్నాడా? “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అనే మాటలను మనస్సులో ఉంచుకోవడం జ్ఞానయుక్తం.—సామెతలు 14:15.
ఒక్కోసారి అప్పుతీసుకోవడం ఆ వ్యక్తికి మంచిది కాకపోవచ్చు కూడా. అది ఆయనకు సులభంగా ఒక భారం అవుతూ అది ఆయన ఆనందాన్ని దోచేసుకోగలదు. అలాంటి ఒక సహోదరుడు మనకు “దాసుడు” అవ్వడానికి మనం ఇష్టపడతామా? ఆయన దానిని తిరిగి చెల్లించకపోతే, లేదా తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే, ఆ అప్పు ఏదో అసౌకర్య అనుభూతిని పెంచిపోషిస్తూ మన సంబంధంపై ప్రభావం చూపించగలదా?
నిజమైన అవసరత ఉంటే, చిన్న మొత్తమైనా సరే అప్పుగా ఇచ్చే బదులు, బహుమానంగా ఇవ్వడాన్ని గురించి ఆలోచించగలరా? మన సహోదరులు అవసరాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు మనం సానుభూతి చూపించాలని లేఖనాలు మనలను ప్రోత్సహిస్తున్నాయి. “దుష్టుడు బాకీ తీసుకుని అప్పు తీర్చడు. కాని సత్పురుషుడు ఉదారముగా ఇచ్చును.” (కీర్తన 37:21, క్యాతలిక్ అనువాదము) అవసరాల్లో ఉన్న సహోదరులకు మనం చేయగల క్రియాత్మక సహాయాన్ని అందించడానికి ప్రేమ మనలను కదిలించాలి.—యాకోబు 2:15, 16.
మీ అడుగులను జాగ్రత్తగా పరిశీలించండి
అప్పులు ఘర్షణలకు శక్తివంతమైన మూలాలు కాగలవు గనుక, మనం వాటిని సులభమైన మార్గంగా కాక, తుది మార్గంగా మాత్రమే దృష్టించాలి. ముందు పేర్కొన్నట్లుగా, అప్పు తీసుకునే వ్యక్తి అప్పిచ్చేవ్యక్తితో నిర్మొహమాటంగా ఉండి, తను అప్పును ఎప్పుడు ఎలా తిరిగి చెల్లిస్తాడు అనే విషయాన్ని వ్రాతపూర్వకంగా తెలియజేయాలి. నిజంగా చాలా ఇబ్బందులు ఉంటే, బహుమానంగా ఇవ్వడమే చక్కని పరిష్కారం.
మైకల్ సైమన్ అడిగినట్లు అప్పు ఇవ్వలేదు, కానీ కొంత డబ్బును బహుమానంగా ఇచ్చాడు. తన బిడ్డ చికిత్సకు అవసరమైన డబ్బును బహుమానంగా ఇచ్చినందుకు సైమన్ కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. తాను సహోదర ప్రేమను క్రియల్లో చూపించగల్గినందుకు సంతోషించాడు. (సామెతలు 14:21; అపొస్తలుల కార్యములు 20:35) మైకల్, సైమన్‌లు, రాజ్యపరిపాలన క్రింద, “దరిద్రులు మొఱ్ఱపెట్టగా” క్రీస్తు “వారిని విడిపించు” సమయం కోసం, “నాకు దేహములో బాగులేదని” ఎవరూ చెప్పని సమయం కోసం ఎదురుచూస్తున్నారు. (కీర్తన 72:12; యెషయా 33:24) అప్పటివరకూ, మనం ఒక సహోదరుడ్ని అప్పు అడగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, మనం వేసే ఒక్కో అడుగును జాగ్రత్తగా పరిశీలించుకుందాం.
[అధస్సూచీలు]
a పేర్లు మార్చబడ్డాయి.
[25వ పేజీలోని చిత్రం]
అప్పు ఒప్పందాన్ని వ్రాతపూర్వకంగా ఉంచడం ప్రేమకు సంకేతమే గానీ, అనుమానానికి కాదు