కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/15 పేజీలు 21-24
  • మక్కబీయులు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మక్కబీయులు ఎవరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హెల్లెనీయవాద ఉద్ధృత తరంగం
  • యాజకుల భ్రష్టత్వం
  • ఆంటియోకసు చర్య తీసుకోవడం
  • మక్కబీయుల ప్రతిస్పందన
  • దేవాలయాన్ని పునఃస్వాధీనం చేసుకోవడం
  • భక్తికన్నా మిన్నగా రాజకీయాలు
  • హస్మోనియన్లు వారి ప్రభావం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఓ అంధకార యుగాన్ని అంతమొందించిన వెలుగు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/15 పేజీలు 21-24

మక్కబీయులు ఎవరు?

అనేకమందికి మక్కబీయుల కాలం, హెబ్రీ లేఖనాల చివరి పుస్తకాలు రాయడం పూర్తైన కాలానికీ యేసు వచ్చే సమయానికీ మధ్య పట్టిన కాలాన్ని గూర్చిన సమాచారం దాగివున్న బ్లాక్‌ బాక్స్‌లాంటిది. విమానం ప్రమాదానికి గురైన తర్వాత దాని బ్లాక్‌ బాక్స్‌ను అధ్యయనం చేసినప్పుడు కొన్ని వివరాలు బయల్పర్చబడినట్లుగానే, యూదా జనాంగానికొక పరివర్తన శకమూ, రూపాంతర శకమూ అయిన మక్కబీయుల శకాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా కొంత అంతర్దృష్టిని పొందవచ్చు.

ఎవరీ మక్కబీయులు? ప్రవచించబడిన మెస్సీయా రావడానికి ముందు యూదా మతాన్ని వాళ్లెలా ప్రభావితం చేశారు?—దానియేలు 9:25, 26.

హెల్లెనీయవాద ఉద్ధృత తరంగం

(సా.శ.పూ. 336-323 మధ్య కాలంలో) గ్రీసు మొదలుకొని ఇండియా వరకు ఉన్న దేశాలన్నింటినీ అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ జయించాడు. హెల్లెనీయవాదాన్ని అంటే గ్రీకు భాషా సంస్కృతుల్ని వ్యాప్తిచేయడంలో ఆయన జయించిన విస్తృత సామ్రాజ్యం ఒక కారకమైంది. అలెగ్జాండర్‌ అధికారులూ, సైనిక గుంపులూ స్థానికులైన స్త్రీలను పెండ్లి చేసుకొని, గ్రీకు, విదేశీ సమ్మిళిత సంస్కృతులకు కారణమయ్యారు. అలెగ్జాండర్‌ మరణానంతరం, ఆయన సామ్రాజ్యాన్ని అతని సైన్యాధ్యక్షులు పంచుకున్నారు. సా.శ.పూ. రెండవ శతాబ్ద ఆరంభంలో, సిరియాలో సెల్యూకస్‌ రాజవంశావళి సభ్యుడైన ఆంటియోకసు III, ఐగుప్తును పాలించే గ్రీకు టోలమీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును తన వశం చేసుకున్నాడు. ఈ హెల్లెనీయుల పాలన ఇశ్రాయేలులో ఉన్న యూదుల్ని ఎలా ప్రభావితం చేసింది?

ఒక చరిత్రకారుడు ఇలా రాస్తున్నాడు: “యూదులు, గ్రీకులైన తమ పొరుగువారితో ఉన్న సంబంధాన్ని నివారించలేకపోయారు, ఇతర దేశాల్లో ఉన్న హెల్లెనీయులుగా మారిన తమ స్వంత సహోదరులతో సంబంధాన్ని అసలు నివారించలేకపోయారు. అందువలన గ్రీకు సంస్కృతిలోనూ గ్రీకు ఆలోచనా సరళుల్లోనూ విలీనంకావడాన్ని వారు నివారించలేకపోయారు. . . . హెల్లెనీయ కాలంలో ఊపిరిపీల్చుకుంటే చాలు గ్రీకు సంస్కృతి వంటబట్టేస్తుంది!” యూదులు గ్రీకు పేర్లను పెట్టుకున్నారు. వేర్వేరు మోతాదుల్లో వాళ్లు గ్రీకు ఆచారాల్నీ, వస్త్రధారణల్నీ అవలంబించారు. తమలో కలిపేసుకునే శక్తి నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది.

యాజకుల భ్రష్టత్వం

హెల్లెనీయ ప్రభావానికి సులభంగా గురైన యూదుల్లో యాజకులు ఉన్నారు. వారిలో అనేకులకు హెల్లెనీయవాదాన్ని అంగీకరించడమంటే కాలంతోపాటూ అభివృద్ధిచెందేలా యూదా మతాన్ని అనుమతించడమనే భావం. అలాంటి యూదుల్లో ఒకడు యాసోను (హెబ్రీ భాషలో యెహోషువ అని పిలువబడ్డాడు). అతడు ప్రధాన యాజకుడైన ఓనియాసు III తమ్ముడు. ఓనియాసు అంతియొకయలో ఉన్నప్పుడు, యాసోను గ్రీకు అధికారులకు లంచాన్ని ఇవ్వజూపాడు. ఎందుకు? ఓనియాసు స్థానంలో తనను ప్రధాన యాజకునిగా నియమించేలా వారిని ప్రలోభపెట్టేందుకే. సెల్యూకస్‌ రాజవంశావళికి చెందిన గ్రీకు పాలకుడైన ఆంటియోకసు ఎపిఫానెసు (సా.శ.పూ. 175-164) వెంటనే ఆ లంచాన్ని తీసుకున్నాడు. గ్రీకు పాలకులు యూదుల ప్రధాన యాజకత్వం విషయంలో ఇంతకు మునుపెన్నడూ అలా జోక్యం కలుగజేసుకోలేదుగానీ, తన సైనిక చర్యల నిమిత్తం ఆంటియోకసుకు నిధులు అవసరమయ్యాయి. హెల్లెనీయ సంస్కృతిని మరింత చురుకుగా వ్యాప్తిచేసే ఒక యూదుల నాయకుడ్ని కల్గివుండడానికి అతడు మక్కువ చూపించాడు. యాసోను విన్నపాన్ని మన్నించి, ఆంటియోకసు యెరూషలేముకు గ్రీకు నగరపు (పోలిస్‌) హోదాను ఇచ్చాడు. దానికి బదులుగా యాసోను క్రీడాగారాన్ని నిర్మించాడు, అక్కడ క్రీడల్లో యూదా యువకులూ, అలాగే యాజకులూ పోటీపడేవారు.

మోసం మోసాన్నే కన్నది. మూడేళ్లు గడిచిన తర్వాత మెనెలాసు అంతకన్నా ఎక్కువ లంచాన్ని ఇవ్వజూపాడు, అతడు యాజకవర్గానికి చెందినవాడు కాకపోయివుండవచ్చు. దాని ఫలితంగా యాసోను పారిపోవాల్సి వచ్చింది. ఆంటియోకసుకు చెల్లించేందుకు, మెనెలాసు దేవాలయపు ఖజానాలో నుండి పెద్ద మొత్తాల్లో ధనాన్ని తీసుకున్నాడు. (ఆంటియోకియా నగరంలో పరవాసమందుండు) ఓనియాసు III దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు గనుక, మెనెలాసు అతడ్ని హత్యచేయడానికి ఏర్పాట్లు చేశాడు.

ఆంటియోకసు చనిపోయాడనే గాలివార్త వ్యాపించినప్పుడు, మెనెలాసు చేతుల్లోనుండి మరలా ప్రధాన యాజకత్వాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో వెయ్యిమంది మనుష్యుల్ని కూడగట్టుకొని యాసోను యెరూషలేముకు తిరిగి వచ్చాడు. కానీ ఆంటియోకసు చనిపోలేదు. యాసోను చర్యల్నీ, తాను చేపట్టిన హెల్లెనీయకరణ పద్ధతుల్ని ధిక్కరించడంలో యూదుల మధ్య చెలరేగిన కలవరాన్ని గురించీ విన్నవాడై, ఆంటియోకసు ప్రతీకారేచ్ఛతో ప్రతిస్పందించాడు.

ఆంటియోకసు చర్య తీసుకోవడం

ది మక్కబీస్‌ అనే తన పుస్తకంలో మోషా పర్లమన్‌ ఇలా రాస్తున్నాడు: “రికార్డులు వివరంగా లేకపోయినప్పటికీ, యూదుల మతాన్ని సహనంతో అనుమతించడం ఒక రాజకీయ పొరపాటనే నిర్ధారణకు ఆంటియోకసు వచ్చినట్టు కనబడుతోంది. యెరూషలేములో ఇటీవల జరిగిన తిరుగుబాటు పూర్తిగా మతపరమైన దృక్పథాల మూలంగాగాక యూదయలో ఐగుప్తీయులకు ముందు ప్రబలంగా ఉన్న ఒక పరిస్థితి నుండే ఉద్భవించిందనీ, తన పాలన క్రిందనున్న ప్రజలందరిలో యూదులు మాత్రమే మతపర వేర్పాటువాదాన్ని వెదికినందుననే, వాళ్లకు మాత్రమే అది అనుమతించబడినందుననే ఆ రాజకీయపరమైన సెంటిమెంట్లు అపాయకరంగా పరిణమించాయనీ అతడు అనుకున్నాడు . . . దాన్ని నిలిపివేయాలని అతడు నిశ్చయించుకున్నాడు.”

ఇశ్రాయేలీ రాజనీతిజ్ఞుడూ, పండితుడూ అయిన అబ్బా ఇబన్‌ జరిగినదాన్ని ఇలా సంగ్రహంగా తెలియజేశాడు: “[సా.శ.పూ.] 168 నుండి 167 సంవత్సరాల మధ్య కాలంలో వరుసపెట్టి జరిగిన దాడుల్లో, యూదుల్ని సామూహికంగా వధించారు, ఆలయాన్ని దోచుకున్నారు, యూదా మత ఆచరణను నిషేధించారు. సబ్బాతు ఆచరణ విషయంలోలానే సున్నతి చేయించుకోవడం మరణ శిక్షార్హమైంది. దేవాలయంలోపల జియస్‌కు ఒక బలిపీఠాన్ని నిర్మించి, యూదా ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన పంది మాంసాన్ని గ్రీకుల దేవతకు అర్పించమని ఆంటియోకసు జారీ చేసిన ఆజ్ఞానుసారంగా యూదులు చేయవలసివచ్చినప్పుడు 167 డిసెంబరు నెలలో అతి గొప్ప అవమానం జరిగింది.” ఈ కాలంలోనే, మెనెలాసు, మరితర హెల్లెనీయ సంస్కృతిచే ప్రభావితులైన ఇతర యూదులు తమ ఉన్నత స్థానాల్లో కొనసాగుతూ, ఇప్పుడు కళంకపర్చబడిన దేవాలయంలో అధికారాన్ని చెలాయిస్తున్నారు.

హెల్లెనీయవాదాన్ని అనేకమంది యూదులు అంగీకరించినప్పటికీ, హాసిదీయులు—దానర్థం భక్తిపరులు—అని తమ్మును తాము పిల్చుకునే క్రొత్త గుంపొకటి మోషే ధర్మశాస్త్రానికి కఠోరమైన విధేయత చూపించాలని ప్రోత్సహించారు. హెల్లెనీయ సంస్కృతిచే ప్రభావితులైన యాజకులుచేసిన పనుల్ని చూసి వాళ్లను ఏవగించుకున్న సామాన్య ప్రజలు, అంతకంతకూ హాసిదీయుల పక్షంవైపు మ్రొగ్గు చూపించారు. స్వధర్మంకోసం ప్రాణత్యాగంచేసే కాలం ఆరంభమైంది, దేశమంతటా ఉన్న యూదులు అన్య ఆచారాల్ని ఆచరించి, బలుల్ని ఇస్తారో లేక చస్తారో తేల్చుకోవాల్సిందని బలవంతంచేయబడ్డారు. అప్రమాణిక గ్రంథాలైన మక్కబీయులు, రాజీపడడానికి బదులుగా మరణించడానికే సుముఖతను చూపించిన స్త్రీ పురుషులను గూర్చిన, పిల్లల్ని గూర్చిన అనేకమైన వృత్తాంతాల్ని తెలియజేస్తున్నాయి.

మక్కబీయుల ప్రతిస్పందన

ఆంటియోకసు విపరీతమైన చర్యలు తమ మతంకోసం పోరాడేలా అనేకమంది యూదుల్ని ప్రేరేపించాయి. యెరూషలేముకు వాయవ్య దిశలో ఆధునిక లిదియా నగరానికి సమీపాన ఉన్న మోదేను పట్టణంలో మత్తతీయ అనే పేరుగల ఒక యాజకుడు నివసిస్తున్నాడు, అతడ్ని ఆ పట్టణం మధ్యకు పిలిపించారు. మత్తతీయాకు స్థానిక ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి గనుక, అతని ప్రాణాన్ని కాపాడుకొని, ప్రజల ఎదుట ఒక మాదిరిని ఉంచేందుకు అన్యమత బల్యర్పణలో భాగంవహించమని అతడ్ని ఒప్పించడానికి రాజ ప్రతినిధులు ప్రయత్నించారు. మత్తతీయ దాన్ని తిరస్కరించగా, మరొక యూదుడు ముందుకు వచ్చి, రాజీపడడానికి సిద్ధపడ్డాడు. ఆగ్రహంతో నిండినవాడై మత్తతీయ ఆయుధాన్ని చేతిలోనికి తీసుకుని అతడ్ని చంపాడు. ఈ వృద్ధుని హింసాత్మక చర్యను చూసి నిగ్గాయించిపోయిన గ్రీకు సైనికులు వెంటనే ప్రతిస్పందించలేకపోయారు. కళ్లుమూసి తెరిచేంతలోనే మత్తతీయ గ్రీకు అధికారుల్ని కూడా చంపివేశాడు. గ్రీకు సైనికులు తమ్మును కాపాడుకోవడానికి ప్రయత్నించక ముందే మత్తతీయ ఐదుగురు కొడుకులూ, ఆ పట్టణ నివాసులూ వాళ్లపై దొమ్మిగా పడ్డారు.

మత్తతీయ ఇలా బిగ్గరగా అరిచాడు: ‘ధర్మశాస్త్రంపట్ల అభిమానంగలవారు నన్ను అనుసరించండి.’ ప్రతీకార దాడులనుండి తప్పించుకునేందుకు, అతడూ అతని కుమారులూ పర్వతాలకు పారిపోయారు. వాళ్ల చర్యల్ని గూర్చిన వార్త అంతటా వ్యాపిస్తుండగా, (అనేకమంది హాసిదీయులతోపాటు) యూదులు వారితో చేరారు.

మత్తతీయ సైనిక కార్యకలాపాలపై నాయకునిగా తన కుమారుడైన యూదాను నియమించాడు. యూదాకున్న సైనిక శూరత్వాన్నిబట్టే బహుశా అతడు మక్కబీ అని పిలువబడ్డాడు, దానికి “సుత్తి” అని అర్థం. మత్తతీయ, అతని కుమారులూ హాస్మోనియన్లు అని పిలువబడేవారు, ఆ పేరు హెస్మోను అను పట్టణపు పేరునుండి గానీ, అలాంటి పేరుగల ఒక పితరునినుండిగానీ వచ్చివుంటుంది. (యెహోషువ 15:27) అయినా, ఆ తిరుగుబాటు కాలంలో యూదా మక్కబీ ప్రముఖమైన వ్యక్తిగా తయారయ్యాడు గనుక, ఆ కుటుంబమంతా మక్కబీయులు అని పిలువబడ్డారు.

దేవాలయాన్ని పునఃస్వాధీనం చేసుకోవడం

తిరుగుబాటు చేసిన మొదటి సంవత్సరకాలంలో, మత్తతీయ అతని కుమారులూ కలిసి ఒక చిన్న సైన్యాన్ని సంస్థీకరించుకోగలిగారు. ఒకటికన్నా ఎక్కువ సందర్భాల్లో గ్రీకు సైన్యాలు హాసిదీయ పోరాటకుల గుంపులపై సబ్బాతు దినాన దాడి చేసేవి. తమ్మును తాము కాపాడుకునే స్థితిలో ఉన్నప్పటికీ, వాళ్లు సబ్బాతును ఉల్లంఘించేవారు కారు. అందుమూలంగా, సామూహిక వధకు గురయ్యేవారు. ఇప్పుడు ఒక మత అధికారిక శాసనంగా దృష్టించబడిన దాన్ని అంటే సబ్బాతు రోజున తమపై దాడిచేస్తే తమ్మును తాము కాపాడుకోవడానికి ఎదిరించేలా పోరాటం సాగించేందుకు యూదుల్ని అనుమతించే శాసనాన్ని మత్తతీయ ఏర్పాటు చేశాడు. ఈ శాసనం తిరుగుబాటుకు కొత్త జీవాన్ని పోయడం మాత్రమేగాక పరిస్థితులకు అనుగుణంగా యూదా ధర్మశాస్త్రాన్ని మలిచేలా మత నాయకుల్ని అనుమతించే ఒక నమూనాను కూడా యూదా మతంలో ఏర్పాటు చేసింది. ఆ ధోరణి టాల్ముడ్‌లో ఉన్న ఈ క్రింది వ్యాఖ్యానంలో ప్రతిబింబిస్తోంది: “వాళ్లనేక సబ్బాతు దినాల్ని పవిత్రపర్చేలా వాళ్లను ఒక సబ్బాతును ఉల్లంఘించనివ్వండి.”—యోమా 85బి.

వృద్ధుడైన తన తండ్రి మరణించిన తర్వాత, యూదా మక్కబీయుడు వివాదరహిత తిరుగుబాటు నాయకుడయ్యాడు. బాహాబాహి పోరాటంలో తన శత్రువుల్ని ఓడించే సామర్థ్యం తనకు లేదని గ్రహించినవాడై, అతడు కొత్త యుద్ధ తంత్రాల్ని పన్నాడు, అవి ఆధునికకాల గెరిల్లా యుద్ధాల్ని పోలి ఉండేవి. ఏ యే ప్రాంతాల్లోనైతే ఆంటియోకసు సైన్యాలు తమ సాధారణ సైనిక యుద్ధ పద్ధతుల్ని చేపట్టలేరో ఆ ప్రాంతాల్లోనే అతడు వారిపై దాడి చేసేవాడు. ఆ విధంగా యుద్ధాల పరంపరలో, యూదా తన సైన్యంకన్నా ఎంతో పెద్దవైన సైన్యాల్ని మట్టికరిపించడంలో సఫలీకృతుడయ్యాడు.

అంతర్గత తిరుగుబాటులతోనూ, అప్పుడప్పుడే ఎదుగుతున్న రోమా సామ్రాజ్య శక్తితోనూ సతమతమౌతున్న సెల్యూకస్‌ రాజవంశావళి సామ్రాజ్య పాలకులు యూదా వ్యతిరేక శాసనాల్ని అమలులో పెట్టేందుకు అంతగా శ్రద్ధను చూపించలేదు. అది యెరూషలేము గుమ్మాల వరకూ తన దాడిని శక్తియుక్తుల్ని ఒడ్డి చేసేలా యూదాకు మార్గాన్ని తెరిచింది. సా.శ.పూ. 165 డిసెంబరులో (లేక బహుశా సా.శ.పూ. 164లో) ఆయనా ఆయన సైన్యాలు దేవాలయాన్ని స్వాధీనంచేసుకొని, దాంట్లోని పరికరాల్ని శుద్ధి చేశారు, ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆ రోజుకి ఆ దేవాలయం అపవిత్రపర్చబడి మూడేళ్లైంది. ప్రతిష్ఠాపన పండుగ అనే హనుక్కా పండుగ కాలంలో దాన్ని యూదులు ప్రతీ సంవత్సరమూ జ్ఞాపకం చేసుకుంటారు.

భక్తికన్నా మిన్నగా రాజకీయాలు

తిరుగుబాటు లక్ష్యాల్ని చేరుకున్నారు. యూదా మతాన్ని అనుసరించకుండా చేసిన నిషేధాలు తొలగించబడ్డాయి. దేవాలయంలో ఆరాధనా అర్పణలు పునరుద్ధరించబడ్డాయి. దానికి సంతృప్తిచెందిన హాసిదీయులు యూదా మక్కబీయుల సైన్యాన్ని విడిచి, వాళ్ల వాళ్ల ఇళ్ళకు వెళ్లిపోయారు. కానీ యూదాకు ఇతర ఆలోచనలు కూడా ఉన్నాయి. సుశిక్షితులైన సైన్యం అతనికి ఉంది కాబట్టి, యూదా స్వతంత్ర రాష్ట్రాన్ని స్థాపించేందుకు దాన్నెందుకు ఉపయోగించకూడదు? తిరుగుబాటు చేయడానికి కారణమైన మతపరమైన కారణాలు ఇప్పుడు రాజకీయ దృక్పథాలతో మార్చబడ్డాయి. కాబట్టి పోరాటం సాగుతూనే ఉంది.

సెల్యూకస్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగించే తన పోరాటంలో మద్దతు కోసం యూదా మక్కబీ రోముతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సా.శ.పూ. 160లో జరిగిన యుద్ధంలో అతడు చంపబడినప్పటికీ, అతని సోదరులు యుద్ధాన్ని కొనసాగించారు. సెల్యూకస్‌ సామ్రాజ్యాధినేతల సర్వాధిపత్యం క్రిందే యూదా దేశం ఉన్నప్పటికీ దానిపై తనను పాలకునిగానూ, ప్రధాన యాజకునిగానూ నియమించేందుకు వాళ్లు అంగీకరించేలా విషయాల్ని యుక్తిగా యూదా సహోదరుడైన యోనాతాను నడిపించాడు. సిరియా దేశం పన్నిన కుట్ర ఫలితంగా యోనాతాను మోసగించబడి, బంధించబడి, చంపబడినప్పుడు, మక్కబీ సోదరుల్లో ఆఖరువాడైన అతని సహోదరుడగు సీమోను నాయకత్వాన్ని చేపట్టాడు. సీమోను పరిపాలన క్రింద, సెల్యూకస్‌ సామ్రాజ్యపు జాడలు పూర్తిగా (సా.శ.పూ. 141లో) తుడిచిపెట్టుకుపోయాయి. సీమోను రోముతో సంధిని పునరుద్ధరించాడు, యూదా నాయకత్వం అతడ్ని పాలకునిగానూ, ప్రధాన యాజకునిగానూ అంగీకరించింది. ఆ విధంగా స్వతంత్ర హాస్మోనియన్ల రాజవంశావళి మక్కబీయుల చేతుల్లో ఏర్పాటుచేయబడింది.

మక్కబీయులు మెస్సీయా రావడానికి మునుపు దేవాలయంలో ఆరాధనను పునరుద్ధరించారు. (పోల్చండి యోహాను 1:41, 42; 2:13-17.) హెల్లెనీయ సంస్కృతిచే ప్రభావితులైన యాజకుల చర్యల మూలంగా యాజకత్వంపై ఉన్న నమ్మకం వమ్మైనట్లే, హాస్మోనియన్ల ఆధ్వర్యంలో అది మరింత అధ్యాన్నంగా తయారైంది. నిజంగానే, నమ్మకమైన దావీదు వంశావళి నుండి వచ్చే రాజు పాలనగాక రాజకీయ దృక్పథంగల యాజకుల పాలన, యూదా ప్రజలకు నిజమైన ఆశీర్వాదాల్ని తీసుకురాలేకపోయింది.—2 సమూయేలు 7:16; కీర్తన 89:3, 4, 35, 36.

[21వ పేజీలోని చిత్రం]

యూదా మక్కబీ తండ్రియైన మత్తతీయ ‘ధర్మశాస్త్రంపట్ల అభిమానంగలవారు నన్ను అనుసరించండి’ అని బిగ్గరగా అరిచాడు

[క్రెడిట్‌ లైను]

Mattathias appealing to the Jewish refugees/The Doré Bible Illustrations/Dover Publications

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి