వారు యెహోవా చిత్తాన్ని చేశారు
యేసు పిల్లలతో సమయాన్ని గడిపాడు
యేసు మూడున్నర సంవత్సరాల పరిచర్య ముగియబోతోంది. త్వరలోనే ఆయన యెరూషలేములో ప్రవేశించి అతి వేదనాకరమైన మరణానికి గురికాబోతున్నాడు. మున్ముందు ఏమి జరగనుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు” అని చెప్పాడు.—మార్కు 9:31.
అందుకే మిగిలివున్న ప్రతి రోజునూ, ప్రతి గంటనూ, ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఉపయోగించుకోవాలని యేసు ఖచ్చితంగా కోరుకున్నాడు. ఆయన శిష్యులకు ఇప్పటికీ ఆయన అవధానం అవసరమై ఉంది. అణుకువ ఉండవలసిన అవసరత విషయమై, ఎల్లప్పుడూ పొంచివుండే తప్పుటడుగు వేసే ప్రమాదం విషయమై వారికి శక్తివంతమైన ఉద్బోధను ఇవ్వవలసిన అవసరత ఇప్పటికీ ఉందని యేసు గ్రహించాడు. (మార్కు 9:35-37, 42-48) వివాహం, విడాకులు, అవివాహితులుగా ఉండడం వంటి విషయాల్లో కూడా వారికి నిర్దేశం అవసరమై ఉండింది. (మత్తయి 19:3-12) తాను త్వరలోనే చనిపోబోతున్నాడని తనకు తెలుసు కనుక, యేసు తన శిష్యులతో క్లుప్తంగా, అత్యవసర భావంతో మాట్లాడాడన్నదానికి సందేహం లేదు. ఆ సమయం చాలా ప్రాముఖ్యమైనది—యేసు తర్వాత చేసిన పనిని మరింత గమనార్హమైనదిగా చేసిన వాస్తవం అదే.
యేసు పిల్లలను ఆహ్వానిస్తాడు
“తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి” అని బైబిలు వృత్తాంతం చెబుతుంది. శిష్యులు అది చూసినప్పుడు, వాళ్ళు తమ అసమ్మతిని వెంటనే తెలిపారు. యేసు పిల్లలను పట్టించుకోలేనంత చాలా ప్రముఖుడనీ లేదా అంత బిజీగా ఉన్నాడని వాళ్ళు తర్కించివుండవచ్చు. యేసు తమపై కోపపడినప్పుడు శిష్యులు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో ఊహించండి! “చిన్నచిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే” అని ఆయన వారితో చెప్పాడు. తర్వాత, “చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని” కూడా ఆయన అన్నాడు.—మార్కు 10:13-15.
పిల్లల్లో ప్రశంసనీయమైన గుణాలను యేసు చూశాడు. పిల్లలు సాధారణంగా జిజ్ఞాసగలవారు, నమ్మగలవారు అయ్యుంటారు. వాళ్ళు తమ తల్లిదండ్రుల మాటలను అంగీకరిస్తారు. ఇతర పిల్లల ముందు తమ తల్లిదండ్రులను సమర్థిస్తారు కూడా. వాళ్ళకుండే అంగీకరించే స్వభావము, బోధించబడగల స్వభావము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశించే ప్రతి ఒక్కరు అనుకరించదగినవి. యేసు చెప్పినట్లు, “దేవునిరాజ్యము ఈలాటివారిదే.”—పోల్చండి మత్తయి 18:1-5.
యేసు ఆ పిల్లలను కేవలం ఉదాహరణగా ఉపయోగించలేదు. తను పిల్లల మధ్య ఉండడాన్ని యేను యథార్థంగానే ఇష్టపడేవాడన్న విషయాన్ని ఆ వృత్తాంతం స్పష్టం చేస్తుంది. యేసు “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను” అని మార్కు నివేదిస్తున్నాడు. (మార్కు 10:16) యేసు పిల్లలను ‘ఎత్తి కౌగిలించుకున్నాడు’ అని ఆప్యాయతను తెలిపే ఆ వివరణ మార్కు వృత్తాంతంలో మాత్రమే కనిపిస్తుంది. అలా తమ బిడ్డలను తను కేవలం ‘ముట్టుకునేందుకే’ తన దగ్గరకు తీసుకువచ్చిన పెద్దలు ఎదురు చూసినదానికన్నా ఎక్కువే యేసు చేశాడు.
యేసు ఆ పిల్లలపై ‘చేతులుంచడం’లోని ప్రాముఖ్యతేమిటి? దీనికి బాప్తిస్మంవంటి మతాచార కర్మతో సంబంధమున్నట్లు ఏ సూచనా లేదు. చేతులుంచడం అంటే కొన్ని సందర్భాల్లో ఒక నియామకాన్ని అప్పజెప్పడమని భావం, మరితర సందర్భాల్లో, ఆశీర్వదించడమనే భావం. (ఆదికాండము 48:14; అపొస్తలుల కార్యములు 6:6) కాబట్టి ఇక్కడ యేసు పిల్లలను ఆశీర్వదిస్తున్నాడంతే.
ఏది ఏమైనా, తీవ్రతరమైన శక్తిని సూచించే “ఆశీర్వాదము”కు (కాట్యూలోజీయో) శక్తివంతమైన పదాన్నే మార్కు ఉపయోగిస్తున్నాడు. యేసు పిల్లలను ఆర్ద్రతతో, మృదుత్వంతో, వాత్సల్యంతో ఆశీర్వదించాడని ఇది సూచిస్తుంది. పిల్లల్ని సమయాన్ని వృథాచేసే భారంగా యేసు దృష్టించలేదన్నది స్పష్టం.
మనకు పాఠం
యేసు పిల్లలతోనైనా, వయోజనులతోనైనా వ్యవహరించిన తీరు భయపెట్టేదిగానో, లేక తలదించుకునేలా చేసేదిగానో ఉండేది కాదు. ఒక రెఫరెన్సు పుస్తకం చెబుతున్నట్లు, “ఆయన చాలా సులభంగా చిరునవ్వు చిందించడము, ఆనందంగా నవ్వడమూ చేసి ఉంటాడు.” ఆయన దగ్గరికి చేరిన అన్ని వయస్సుల్లోని ప్రజలూ చాలా ఆహ్లాదాన్ని అనుభవించి ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. యేసు మాదిరిని ధ్యానిస్తూ, ‘నేను సమీపించదగిన వ్యక్తినని ఇతరులు అనుకుంటున్నారా?’ ‘ఇతరుల క్రియాశీలతలను, ఇతరుల విషయాలను పట్టించుకోలేనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ప్రజల్లో యథార్థమైన ఆసక్తిని పెంచుకోవడం యేసు చేసినట్లు, మనల్ని మనం వారికి ఇచ్చుకోవడానికి మనల్ని పురికొల్పుతుంది. మనం చూపించే యథార్థమైన ఆసక్తిని ఇతరులు గ్రహించి, మనకు దగ్గరౌతారు.—సామెతలు 11:25.
మార్కు వృత్తాంతం చూపిస్తున్నట్లు, యేసు పిల్లలతో ఉండడంలో ఆనందించాడు. పిల్లలు ఆడుకుంటుంటే చూడడానికి కూడా యేసు సమయం తీసుకుని ఉండవచ్చు. అందుకే, ఆయన తన ఉపమానంలో వాళ్ళ ఆటలను పేర్కొన్నాడు. (మత్తయి 11:16-19) ఆయన ఆశీర్వదించిన పిల్లల్లో కొందరు, ఆయన ఎవరు, ఆయన ఏమి బోధించాడు అనేది గ్రహించలేనంత చిన్నపిల్లలై ఉండవచ్చు. కాని తను సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని భావించేందుకు యేసుకు అది కారణం కాలేదు. ఆయన పిల్లలను ప్రేమించాడు గనుక, వారితో సమయాన్ని వెచ్చించాడు. యేసు పరిచర్యలో కలిసిన పిల్లల్లో చాలా మంది ఆ తర్వాత ఆయన ప్రేమకు ప్రతిస్పందిస్తూ ఆయన శిష్యులుగా అయ్యేందుకు కదిలించిబడి ఉండవచ్చు.
యేసు తన జీవితంలోని నిర్ణాయకమైన చివరి వారాల్లో పిల్లలతో సమయాన్ని గడిపాడంటే, మనం కూడా మన బిజీ షెడ్యూల్లో పిల్లల కోసం సమయాన్ని తప్పకుండా కేటాయించవచ్చు. తండ్రిలేని అబ్బాయిలు అమ్మాయిలు వంటి ప్రత్యేక అవసరాలు ఉన్నవారి విషయమై మనం మరింత శ్రద్ధను కలిగి ఉండవచ్చు. అవధానాన్ని చూపించాలేగాని, ప్రతి బిడ్డా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. మనం పిల్లలకు మన ప్రేమను సాధ్యమైనంతమట్టుకు చూపించాలన్నదే, మనం సాధ్యమయ్యేంత మేరకు సహాయం అందించాలన్నదే యెహోవా కోరిక.—కీర్తన 10:14.