రాజ్య ప్రచారకుల నివేదిక
మునుపటి వ్యతిరేకి సత్యాన్ని తెలుసుకుంటాడు
లైబీరియాలో జరిగిన అంతర్యుద్ధాన్ని గురించిన అనేక నివేదికలు వచ్చాయి. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. అంతకన్నా ఎక్కువ మంది స్వస్థలాలనుండి పారిపోవడం తప్పనిసరైంది. ఇన్ని కష్టాల మధ్యన కూడా, క్రింది అనుభవం చెబుతున్నట్లు, యథార్థ హృదయులైన ప్రజలు సత్యాన్ని హత్తుకుని ఉండడంలో కొనసాగుతున్నారు.
జేమ్స్‌ను అతనికి పదేండ్ల వయస్సున్నప్పటి నుండి లూథరన్స్ చర్చి చదివించింది. జేమ్స్ ఒక చర్చి వార్తాపత్రిక సంపాదకుడైన తర్వాత, యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా వ్రాసేందుకు తన పదవిని ఉపయోగించుకున్నారు. ఆయన వాళ్ళను ఎన్నడూ కలవకపోయినప్పటికీ ఆయన అలా చేశారు.
కొంత కాలం తర్వాత, జేమ్స్ వార్తాపత్రిక సంపాదకీయాన్ని వదిలిపెట్టి చక్కని మోటల్ (హోటల్ ప్లస్ లాడ్జ్) పెట్టుకుని అందులో సఫలీకృతుడయ్యారు. ఒకరోజు ఆయన తన మోటల్ రిసెప్షన్ ఏరియాలో కూర్చొని ఉండగా చక్కగా వస్త్రధారణ చేసుకున్న ఇద్దరు సహోదరీలు ఆయనను సందర్శించారు. వాళ్ళ శుభ్రమైన వస్త్రధారణను చూసి, ఆయన వాళ్ళను లోపలికి ఆహ్వానించారు. వాళ్ళు తమ సందర్శన ఉద్దేశాన్ని వివరించినప్పుడు, “నేను చాలా బిజీగా ఉన్నాను, మాట్లాడడానికి సమయం లేదని” ఆయన వారితో చెప్పారు. ఆ సాక్షులు ఆయనకు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందా కట్టవచ్చని ప్రతిపాదించారు. వాళ్ళను వదిలించుకోవడానికని ఆయన దానికి అంగీకరించారు. ఆ పత్రికలు 12 నెలల వరకు ఆయన ఇంటికి వచ్చాయి. కానీ ఆయన అవి ఉన్న కవరును కూడా తీసేయకుండా ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచారు.
అంతర్యుద్ధం చెలరేగింది. ఆక్రమించే మొదటి సూచన కనిపించిన వెంటనే పారిపోయేందుకుగానూ, జేమ్స్ ఒక బ్యాగ్‌లో డబ్బునూ, విలువైన వస్తువులను సర్దుకున్నారు. ఒక రోజు ఉదయం ఆయన ఇంటి వెనుక తలుపు వెనుక నుండి గ్రెనేడ్ ప్రేలింది. భయకంపితుడైన జేమ్స్ తన బ్యాగ్‌ను తీసుకుని తన ప్రాణాలను అరచేత పట్టుకుని పలాయనమయ్యారు. పలాయనమౌతున్న పౌరులతో చేరి అనేక చెక్పాయింట్లను ఆయన దాటవలసి ఉంది. అక్కడ, నిరపరాధులైన పౌరులను ఏ కారణమూ లేకుండా దోచుకోవడమూ చంపడమూ తరచూ జరిగింది.
మొదటి చెక్‌పాయింట్‌లో, జేమ్స్‌ను కొన్ని ప్రశ్నలు వేసి, ఆ తర్వాత ఆయన బ్యాగ్‌ను తెరవమన్నారు. ఆయన అలా తెరిచి చూసినప్పుడు, తన బ్యాగ్ లోపల ఉన్నవి చూసి, తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. తను తెచ్చుకున్న బ్యాగ్ తన విలువైన వస్తువులను సర్దుకున్న బ్యాగ్ కాదని గ్రహించినప్పుడు భయపడిపోయారు. భయంతో కంగారులోవున్న జేమ్స్ ఇంతవరకూ తెరవని వాచ్‌టవర్, అవేక్! పత్రికలన్నీ ఉన్న బ్యాగ్‌ను తెచ్చుకున్నారు. అయితే, ఆ సైనికుడు ఆ పత్రికలను చూసినప్పుడు, వాటిపైనున్న లేబల్లను చదివి, “ఓహో మీరు యెహోవాసాక్షుల్లో ఒకరా. మేము మీ కోసం చూడడం లేదు. మీరు అబద్ధం చెప్పరని మాకు తెలుసు.” ఆ బ్యాగ్‌లో నుండి కొన్ని పత్రికలను తీసుకున్న తర్వాత, ఆ సైనికుడు జేమ్స్‌ను వెళ్ళిపొమ్మని చెప్పాడు.
మిగతా తొమ్మిది చెక్‌పోస్టుల్లోనూ అలాగే జరిగింది. కమాండర్లందరూ జేమ్స్ యెహోవాసాక్షుల్లో ఒకరనుకుని, ఆయనకు ఏ హానీ చేయకుండా వెళ్ళనిచ్చారు. జేమ్స్ తనతోపాటు తన విలువైన వస్తువులను తీసుకువెళ్ళనిది మంచిదైందని ఇప్పుడు గ్రహించారు. ఎందుకంటే, తాను చూసిన దానిని బట్టి, తన వస్తువుల మూలంగా తాను ఒకవేళ చంపబడి ఉండేవాడని ఆయన గ్రహించారు.
ఆయన చివరి చెక్‌పాయింట్‌ను, అతి భయానకమైన చెక్‌పాయింట్‌ను చేరుకున్నప్పుడు, అనేక మృతదేహాలు నేలపై పడి ఉండడం చూసి వణికిపోయారు. ఆయన భయకంపితుడై, యెహోవా నామమున మొఱపెట్టుకున్నారు. ఈ మరణ క్షేత్రం నుండి తనను దేవుడు రక్షిస్తే, తన శేష జీవితంలో ఆయనను సేవిస్తానని ప్రార్థన చేశారు.
జేమ్స తన బ్యాగ్‌ను సైనికులకిచ్చారు. “మేము ఈ ప్రజల కోసం కాదు చూస్తున్నది” అని వాళ్ళు కూడా అన్నారు. ఆయనవైపుకు తిరిగి, వాళ్ళు, “మీ సహోదరుల్లో ఒకరు ఈ కొండ దిగువన నివసిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆయనతోపాటు ఉండండి” అని కూడా అన్నారు. అప్పటికే, సాక్షులను గురించిన జేమ్స్ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆయన ఆ సహోదరుడ్ని వెంటనే సంప్రదించారు. మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరుa అనే పుస్తకంలో నుండి బైబిలు పఠించే ఏర్పాట్లు చేయబడ్డాయి.
కొన్ని రోజుల తర్వాత, ఒక దాడి ఆయన ఆ ప్రాంతం నుండి పారిపోవడాన్ని తప్పనిసరి చేసింది. ఈసారి ఆయన నిరంతరం జీవించగలరు అనే పుస్తకం మాత్రం తీసుకుని పొదల గుండా పరుగు లంకించుకున్నారు! సాక్షులకు దూరంగా ఒంటరిగా ఉన్న ఆ 11 నెలల కాలంలో, జేమ్స్ ఆ పుస్తకాన్ని ఐదు సార్లు పఠించారు. ఆయన చివరికి నగరానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన పఠనాన్ని మళ్ళీ ఆరంభించి, త్వరితగతిన పురోభివృద్ధి సాధించారు. కొంత కాలం తర్వాత, ఆయన బాప్తిస్మం తీసుకున్నారు, ఇప్పుడు తన ఆధ్యాత్మిక సహోదరులతో నమ్మకంగా సేవచేస్తున్నారు.
[అధస్సూచి]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.