“మబ్బు పొరల్లో బుద్ధిని ఉంచినవాడెవడు?”
మీరు పడమటనుండి మబ్బు పైకిరావడం చూసినప్పుడు—ఒక పెద్దవాన కురుస్తుంది అని వెంటనే చెబుతారు; ఆలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి విసరడాన్ని చూసినప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు; ఆలాగే జరుగుతుంది.’ సువార్త రచయితయైన లూకా వ్రాసిన ఈ యేసు మాటలు ప్రాచీన పాలస్తీన్వారు వాతావరణాన్ని ముందుగానే సూచించగల్గేవారనేదానికి ఉదాహరణ. (లూకా 12:54, 55) కొన్ని పరిస్థితుల్లో, ప్రాచీనకాలంలోనివారు వాతావరణ సూచనలను గ్రహించగల్గేవారు, స్వల్పకాలానికి సంబంధించి వాతావరణాన్ని గురించి ముందే తెలియజేయగల్గేవారు.
నేడు, వాతావరణ శాస్త్రజ్ఞులు వాతావరణాన్ని దీర్ఘకాలం మేరకు అంచనావేసేందుకు భూమి చుట్టూ సంచరించే ఉపగ్రహాలు, డాప్లర్ రాడార్, శక్తివంతమైన కంప్యూటర్లు వంటి సంకీర్ణమైన ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. కాని తరచూ వారి అంచనాలు తప్పిపోతున్నాయి. ఎందుకని?
వాతావరణాన్ని కచ్చితంగా ముందుగా చెప్పడాన్ని అనేక కారకాలు కష్టతరం చేస్తున్నాయి. ఉదాహరణకు, ఉష్ణోగ్రత, తేమ, గాలి ఒత్తిడి, గాలివేగం, దిశ వంటి వాటిలోని అనూహ్యమైన మార్పులు వాతావరణాన్ని అంచనావేయడాన్ని మరింత కష్టతరమైనదిగా చేస్తాయి. వీటికి తోడు, సూర్యుడు, మేఘాలు, సముద్రాలు మొదలైనవాటి మధ్య ఉండే సంక్లిష్టమైన పరస్పర ప్రభావాలను శాస్త్రజ్ఞులు ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆ కారణం వల్లే, వాతావరణాన్ని గురించి ముందుగా చెప్పడమన్నది కచ్చితంకాని విజ్ఞానశాస్త్రంగా ఉంటోంది.
వాతావరణాన్ని గురించిన మానవుడి పరిమిత జ్ఞానం యోబును అడిగిన ప్రశ్నలను, “మంచుబిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? . . . జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? . . . అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? [“మబ్బు పొరల్లో బుద్ధిని ఉంచినవాడెవడు?” NW] హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు? [“ఆకాశ ప్రతిభాసానికి అవగాహననిచ్చినదెవరు?” NW] జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు? [“లెక్కించగలవాడెవడు?” NW] . . . ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?”—యోబు 38:28-37.
మనిషి కాదు యెహోవా దేవుడు అన్నది ఈ ప్రశ్నలకన్నింటికీ జవాబు. అవును, మానవులు ఎంత బుద్ధిశాలులుగా అనిపించినప్పటికీ, మన సృష్టికర్తకున్న బుద్ధి చాలా చాలా ఉన్నతమైనది. మనం మన మార్గాన్ని విజయవంతం చేసుకోగల్గేలా ఆయన తన బుద్ధిని బైబిలు పుటల్లో మనకు లభ్యం చేయడం ఆయనవైపునుండి చాలా ప్రేమపూర్వకమైన పని.—సామెతలు 5:1, 2.