మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
1, 2. కావలికోట, తేజరిల్లు! పత్రికలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి?
1 “ఆసక్తికరమైనవి, సమయానికి తగినవి, ప్రోత్సాహకరమైనవి.” “నేను చదివిన పత్రికలన్నింటికన్నా ఇవి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి.” ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు కావలికోట, తేజరిల్లు! పత్రికల గురించి ఏమని భావిస్తున్నారో ఈ వ్యాఖ్యానాలు సరిగ్గా వివరిస్తున్నాయి. రాజ్య సువార్తతో ‘మనుష్యులందరినీ’ చేరేందుకు ఈ పత్రికలు అమూల్యమైన సాధనాలని నిరూపించబడ్డాయి.—1 తిమో. 2:4.
2 ఒక వ్యాపారి తనకు ఆసక్తి ఉన్న విషయాన్ని చర్చించిన తేజరిల్లు! పత్రికను తీసుకున్నాడు. తర్వాత దాని జత పత్రిక అయిన కావలికోటను కూడా చదివాడు, దానిలోని ఒక శీర్షిక, త్రిత్వ సిద్ధాంతం మీద అతనికున్న చిరకాల నమ్మకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొనేలా అతన్ని ప్రేరేపించింది. ఇది అతని ఆసక్తిని రేకెత్తించింది. ఆరు నెలల తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు. మరో వ్యక్తికి పత్రికలు క్రమంగా అందుతున్నా వాటిని ఎప్పుడూ చదివేవాడు కాదు. ఇకపోతే అతని భార్య సాక్షులతో మాట్లాడేదే కాదు, కానీ తన భర్తకు వచ్చే పత్రికలను మాత్రం చదివేది. నీతిమంతమైన ప్రజలతో నింపబడే భూపరదైసు గురించిన బైబిలు వాగ్దానం ఆమె హృదయాన్ని స్పృశించింది. కొద్దికాలానికే ఆమె, ఆమె కుమారుడు, ఆమె చెల్లెలు యెహోవా సేవకులయ్యారు.
3. పత్రికలను జతగా ప్రతిపాదించడంలో ఏ ప్రయోజనం ఉంది?
3 వాటిని జతగా ఇవ్వండి: పైనున్న ఉదాహరణలు చూపుతున్నట్లుగా, మన పత్రికలను ఎవరు చదువుతారు లేదా వారికి ఏ విషయం ఆసక్తి రేకెత్తింపజేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. (ప్రసం. 11:6) అందుకే, మన ప్రతిపాదనలో ఒక పత్రిక గురించే మాట్లాడినా, కావలికోట, తేజరిల్లు! పత్రికలను జతగా అందించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో, ఒక సందర్శనలో మన పత్రికల వివిధ సంచికలను ప్రతిపాదించడం సముచితంగా ఉండవచ్చు.
4. పత్రికా పని కోసం మనం సమయ పట్టిక ఎలా వేసుకోవచ్చు?
4 పత్రికా పనిలో భాగం వహించేందుకు సమయ పట్టికలో ప్రతీవారంలో ఒక దినాన్ని కేటాయించడం ప్రయోజనకరంగా ఉంటుంది. యెహోవాసాక్షుల క్యాలెండర్—2005 (ఆంగ్లం)లో ప్రతీ శనివారం “పత్రికా దినం”గా నియమించారు. అయితే స్థానిక, వ్యక్తిగత పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి, కొందరు మన పత్రికలను అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి వేరే దినాన్ని కేటాయించుకోవచ్చు. పత్రికా పనిలో పాల్గొనడం మీ వార సమయ పట్టికలో భాగంగా ఉందా?
5. పత్రికలను అందించే ఏ అవకాశాల విషయంలో మనం శ్రద్ధ వహించాలి, మనమలా చేయడానికి మనకు ఏమి సహాయం చేయవచ్చు?
5 వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకోండి: ప్రతీ నెల అందించవలసిన పత్రికల లక్ష్యాన్ని పెట్టుకోవడం పత్రికలను అందించడంలో మరింత అవధానం నిలపడానికి మనకు సహాయం చేస్తుంది. మీకు పత్రికా మార్గం ఉందా? పరిచర్యలో మీరు కలుసుకొనేవారికి పత్రికలను ప్రతిపాదిస్తున్నారా? వీధి సాక్ష్యంలో, వ్యాపార క్షేత్రంలో, బహిరంగ ప్రదేశాల్లో పత్రికలను మీరు ప్రతిపాదించగలరా? మీరు ప్రయాణిస్తున్నప్పుడు, షాపింగ్‌కు వెళ్తున్నప్పుడు, ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీతోపాటు పత్రికలను తీసుకువెళ్తున్నారా? కావలికోట, తేజరిల్లు! నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా సముచితమైన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
6. పత్రికల పాత సంచికలను మనం సరైన విధంగా ఎలా ఉపయోగించవచ్చు?
6 మనకు అందుబాటులో ఉన్న పాత సంచికలను అందించడం కూడా మన లక్ష్యంగా చేసుకోవచ్చు. సంచిక తేది తర్వాతి ఒకటి లేక రెండు నెలల్లో పత్రికలను అందించకపోయినా, దానిలోని సమాచారం విలువైనదే. ఆసక్తిగలవారికి వాటిని అందించండి. లక్షలాది మందికి కావలికోట, తేజరిల్లు! పత్రికలు “సమయోచితముగా పలుకబడిన మాట[ల్లా]” ఉన్నాయి. (సామె. 25:11) ఇంకా లక్షలాది మంది యెహోవాను తెలుసుకొని, ఆయనను సేవించేలా వాటిని ఉపయోగిద్దాం.