కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/15 పేజీలు 8-13
  • యెరూషలేము—“మహారాజు పట్టణము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెరూషలేము—“మహారాజు పట్టణము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా సింహాసనముండు’ స్థలం
  • శాంతి నుండి అశాంతికి
  • అబద్ధ మతాలకు చెందిన పొరుగువారి వ్యతిరేకత
  • మెస్సీయా కన్పించడం!
  • శాశ్వత సమాధానపు ముంగుర్తులు
  • యెరూషలేము—సార్థకనామధేయ పట్టణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కొత్త యెరూషలేము అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేదీప్యమానమైన పట్టణము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/15 పేజీలు 8-13

యెరూషలేము—“మహారాజు పట్టణము”

“యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము.”—మత్తయి 5:34, 35.

1, 2. యెరూషలేము విషయంలో కొందరు గందరగోళానికి గురయ్యేలా ఏది చేసి ఉండొచ్చు?

యెరూషలేము (జెరూసలేమ్‌)—దాని పేరే వివిధ మతాలకు చెందిన ప్రజల్లో బలమైన భావాల్ని ప్రేరేపిస్తుంది. నిజం చెప్పాలంటే, ఈ ప్రాచీన పట్టణం తరచుగా వార్తల్లో చోటు చేసుకుంటున్నది గనుక ఆ పట్టణపు ఉనికిని మనలో ఎవ్వరమూ కాదనలేం. విచారకరంగా, యెరూషలేము సమాధానకరమైన స్థలంగా అన్నికాలాల్లోనూ లేదని అనేక రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

2 బహుశా ఇది, కొంతమంది బైబిలు పాఠకుల్ని గందరగోళంలో పడేస్తుండవచ్చు. గతకాలంలో యెరూషలేముకు షాలేము అనే క్లుప్తరూపంలో ఉన్న పేరు ఉండేది, దానికి ‘సమాధానం’ లేదా ‘శాంతి’ అని అర్థం. (ఆదికాండము 14:18; కీర్తన 76:2; హెబ్రీయులు 7:1, 2) కాబట్టి, ‘అలాంటి అర్థాన్నిచ్చే పేరున్న ఒక పట్టణానికి ఇటీవల దశాబ్దాల్లో ఎందుకంత సమాధానం లేకుండా పోయిందా?’ అని మీరు ఆలోచనలో పడవచ్చు.

3. యెరూషలేమును గురించిన విశ్వసనీయమైన సమాచారాన్ని మనమెక్కడ కనుగొనగలం?

3 ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనం చరిత్ర పుటల్ని వెనక్కి తిరగేసి, ప్రాచీన కాలాల్లోని యెరూషలేము గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ‘ప్రాచీనకాల చరిత్రను అధ్యయనం చేసేంత సమయం మాకులేదు’ అని కొందరనుకోవచ్చు. అయినప్పటికీ, యెరూషలేము తొలి చరిత్రను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం మనందరికీ ఎంతో విలువైనది. ఎందుకనేది బైబిలు ఈ మాటల్లో తెలియజేస్తోంది: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) యెరూషలేమును గూర్చిన బైబిలు జ్ఞానం, మనకు ఓదార్పును ఇవ్వగలదు—అవును, ఆ పట్టణంలో మాత్రమేగాక భూవ్యాప్తంగా శాంతిని గూర్చిన నిరీక్షణను ఇవ్వగలదు.

‘యెహోవా సింహాసనముండు’ స్థలం

4, 5. యెరూషలేముకు సహాయపడడంలో దావీదు చేరివుండడం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన పాత్రను ఎలా నిర్వర్తించింది?

4 సా.శ.పూ. పదకొండవ శతాబ్దంలో, యెరూషలేము సురక్షితమైన శాంతియుతమైన దేశానికి రాజధానిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆ ప్రాచీన దేశమైన ఇశ్రాయేలుపై రాజుగా యెహోవా దేవుడు దావీదు అనే యౌవనస్థుడ్ని అభిషేకించాడు. యెరూషలేములో ప్రభుత్వాధిపత్యంతో దావీదూ, ఆయన వంశస్థులూ “యెహోవా రాజ్యసింహాసనము మీద” లేదా “యెహోవా సింహాసనమందు” కూర్చుండేవారు.—1 దినవృత్తాంతములు 28:5; 29:23.

5 యూదా గోత్రానికి చెందిన ఇశ్రాయేలీయుడైన దావీదు అను దైవభయం గల వ్యక్తి, విగ్రహారాధకులైన యెబూసీయుల నుండి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. అప్పట్లో ఆ పట్టణం సీయోను అని పిలువబడిన ఓ పర్వతానికి మాత్రమే పరిమితమై ఉండేది, అయినా సీయోను అనే ఆ పేరు యెరూషలేముకు మారుపేరుగా మారింది. కాలక్రమేణా, ఇశ్రాయేలులో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని దావీదు యెరూషలేముకు తరలించాడు, అక్కడ దాన్ని ఒక గుడారంలో ఉంచాడు. అనేక సంవత్సరాల క్రిందట, ఆ పవిత్ర మందసం మీదుగా ఉన్న మేఘంలో నుండి దేవుడు తన ప్రవక్తయైన మోషేతో మాట్లాడాడు. (నిర్గమకాండము 25:1, 21, 22; లేవీయకాండము 16:2; 1 దినవృత్తాంతములు 15:1-3) ఆ మందసం దేవుని ప్రత్యక్షతకు సూచనార్థకంగా ఉండేది, ఎందుకంటే ఇశ్రాయేలీయులకు యెహోవాయే నిజమైన రాజుగా ఉండేవాడు. కాబట్టి రెండు విధాలైన భావంలో, యెహోవా దేవుడు యెరూషలేము పట్టణం నుండి పరిపాలించాడని చెప్పవచ్చు.

6. దావీదు గురించీ, యెరూషలేము గురించీ యెహోవా ఏ వాగ్దానాన్ని చేశాడు?

6 దావీదు రాజవంశ గృహమైన రాజ్యానికి సీయోను లేదా యెరూషలేము ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ రాజ్యం అంతంకాదని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు. దేవుని అభిషిక్తునిగా అంటే మెస్సీయాగా లేదా క్రీస్తుగా నిరంతరమూ పరిపాలించే వారసత్వపు హక్కు దావీదు వంశస్థుల్లో ఒకరికి ఉంటుందని దాని భావమై ఉంది.a (కీర్తన 132:11-14; లూకా 1:31-33) చిరకాలం ‘యెహోవా సింహాసనంపై’ కూర్చుండబోయే ఆ వారసుడు, యెరూషలేమును మాత్రమేగాక అన్ని దేశాల్ని ఏలతాడని కూడా బైబిలు బయల్పరుస్తోంది.—కీర్తన 2:6-8; దానియేలు 7:13, 14.

7. దావీదు రాజు పవిత్రారాధనను ఎలా పెంపొందింపచేశాడు?

7 దేవుని అభిషిక్తుడైన దావీదు రాజుని సింహాసన భ్రష్టుడ్ని చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. దానికి బదులుగా శత్రు రాజ్యాలే లొంగిపోవాల్సి వచ్చింది, వాగ్దానదేశపు సరిహద్దులు దేవుడు సూచించినంత మేరకు విస్తరించాయి. దావీదు సత్యారాధనను పెంపొందించేందుకు ఈ పరిస్థితిని ఉపయోగించుకున్నాడు. దావీదు రచించిన కీర్తనల్లో అనేకం, సీయోనులో నుండి పరిపాలిస్తున్న నిజమైన రాజుగా యెహోవాను కీర్తించాయి.—2 సమూయేలు 8:1-15; కీర్తన 9:1, 11; 24:1, 3, 7-10; 65:1, 2; 68:1, 24, 29; 110:1, 2; 122:1-4.

8, 9. సొలొమోను రాజు పాలనలో యెరూషలేములోని సత్యారాధన ఏ విధంగా విస్తరించింది?

8 దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలనా కాలంలో, యెహోవా ఆరాధన ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మోరీయా పర్వతాన్ని (ఈనాటి డోమ్‌ ఆఫ్‌ ది రాక్‌ అనే ప్రాంతం) కలుపుకునేందుకు సొలొమోను యెరూషలేము పట్టణ సరిహద్దుల్ని ఉత్తర దిశగా విస్తరింపచేశాడు. ఈ ఉన్నత శిఖరంపై, అతడు యెహోవాను స్తుతించేందుకు మహిమాన్వితమైన ఒక ఆలయాన్ని కట్టాడు. ఆ ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసాన్ని ఉంచాడు.—1 రాజులు 6:1-38.

9 ఇశ్రాయేలు జనాంగం, యెరూషలేములో కేంద్రీకరించబడిన యెహోవా ఆరాధనకు హృదయపూర్వకమైన మద్దతును ఇచ్చినంత కాలమూ వాళ్లు సమాధానాన్ని అనుభవించారు. ఆ పరిస్థితిని గురించి ఎంతో రమ్యంగా వర్ణిస్తూ, లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. . . . [సొలొమోను] కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను. . . . ఇశ్రాయేలువారేమి యూదావారేమి . . . తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజారపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.”—1 రాజులు 4:20, 24, 25.

10, 11. సొలొమోను పాలనలోని యెరూషలేమును గురించి బైబిలు చెబుతున్న దాన్ని పురావస్తు శాస్త్రం ఎలా ధ్రువపరుస్తుంది?

10 సుఖశాంతులతో విలసిల్లిన సొలొమోను పరిపాలనను గూర్చిన ఈ వృత్తాంతానికి పురావస్తు శిథిలాలు మద్దతునిస్తున్నాయి. ఇశ్రాయేల్‌ దేశ పురాతత్వశాస్త్రం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ప్రొఫెసర్‌ యోహన్నన్‌ అహరోనీ ఇలా తెలియజేశాడు: “నలుదిశల నుండీ రాజదర్బారులోకి ప్రవహించిన సంపదా, వర్ధిల్లిన వర్తకవాణిజ్యాలూ . . . వస్తుదాయక సంస్కృతికి సంబంధించిన అన్ని కోణాల్లో చెప్పుకోదగిన రీతిలో విప్లవాన్ని తీసుకొచ్చాయి. . . . వస్తుదాయక సంస్కృతిలో మార్పు . . . విలాస వస్తువుల్లో మాత్రమేగాక పింగాణీతో చేసిన కళాత్మక వస్తువుల్లో కూడా కొట్టొచ్చినట్టు కనబడింది. . . . పింగాణీ వస్తువుల నాణ్యతా, వాటిని మలచడానికి కాల్చేతీరూ ఎంతగానో మెరుగుపర్చబడింది.”

11 అలాగే, జెర్రీ యమ్‌. లాన్‌డే ఇలా రాశాడు: “సొలొమోను పరిపాలనలో, ఇశ్రాయేలీయుల వస్తుసంబంధ సంస్కృతి అంతకు ముందున్న రెండు వందల ఏళ్లలోకన్నా అటు తర్వాతి మూడు దశాబ్దాల్లో ఎంతగానో పురోభివృద్ధి చెందింది. సాల్మానిక్‌ స్ట్రాటాలో బయటపడిన మహత్తరమైన కట్టడాల శిథిలాల్లోనూ, పటిష్టమైన గోడలతో ఉన్న మహా నగరాల శిథిలాల్లోనూ, తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఐశ్వర్యవంతుల యొక్క నివాస గృహాలతో నానాటికి పెరిగిపోయిన ఆవాసిత వాడల శిథిలాల్లోనూ, కుమ్మరివాళ్ల సాంకేతిక నైపుణ్యాల్లోనూ, వాళ్లు తయారుచేసే విధానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాల్లోనూ ఎంతో పురోభివృద్ధిని మనం చూడవచ్చు. దూర దేశాల్లో తయారైన వస్తువుల అవశేషాలను కూడా మనం కనుగొనవచ్చు, అవి పటిష్టమైన అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలకు సూచనలుగా ఉన్నాయి.”—ది హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌.

శాంతి నుండి అశాంతికి

12, 13. యెరూషలేములో సత్యారాధనను పెంపొందించడం ఎందుకు కొనసాగలేదు?

12 యెహోవా ఆలయమున్న యెరూషలేము పట్టణపు శాంతి సంపదలనేవి ప్రార్థనకు తగిన విషయాంశాలై ఉన్నాయి. దావీదు ఇలా రాశాడు: “యెరూషలేము యొక్క క్షేమము (శాంతి) కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.” (కీర్తన 122:6-8) ఆ సమాధానకరమైన నగరంలో మహత్తరమైన ఆలయాన్ని కట్టించే ఆధిక్యత సొలొమోనుకు లభించినప్పటికీ, చివరికి అతడు అనేకమంది అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. వాళ్లు అతని వృద్ధాప్యంలో, అబద్ధ దేవతల ఆరాధనను పెంపొందింపచేసేలా వాళ్లు అతడ్ని ప్రేరేపించారు. ఈ భ్రష్టత్వం యావత్‌ జనాంగంపై దుష్ప్రభావాన్ని చూపించి, ఆ దేశానికీ, దేశవాసులకూ ఉన్న నిజమైన శాంతిని దోచుకుంది.—1 రాజులు 11:1-8; 14:21-24.

13 సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన తొలి నాళ్లలో, ఇశ్రాయేలు పది గోత్రాలవారు తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లు విగ్రహారాధనలో మునిగిపోవడం మూలంగా, దేవుడు ఆ రాజ్యాన్ని అష్షూరీయుల చేతికి అప్పగించాడు. (1 రాజులు 12:16-30) రెండు గోత్రాల దక్షిణ రాజ్యమైన యూదాకు యెరూషలేము రాజధానిగా కొనసాగింది. కానీ కాలక్రమేణా వాళ్లూ పవిత్రారాధననుండి తొలగిపోయారు, కాబట్టి దేవుడు అడ్డూ అదుపూలేని ఆ నగరాన్ని సా.శ.పూ. 607లో బబులోనీయులు నాశనం చేయడానికి అనుమతించాడు. యూదా దేశాంతరవాసులు 70 ఏళ్లు బబులోనులో బంధీలుగా ఉన్నారు. తర్వాత, దేవుని కనికరాన్నిబట్టి వాళ్లు తిరిగి యెరూషలేముకు వెళ్లి, సత్యారాధనను పునరుద్ధరించడానికి అనుమతించబడ్డారు.—2 దినవృత్తాంతములు 36:15-21.

14, 15. బబులోను పరవాసానంతరం యెరూషలేము మరలా కీలకమైన పాత్రను ఎలా చేజిక్కించుకొంది, అయితే ఏ మార్పుతో?

14 పాడుగా 70 ఏళ్లు విడువబడిన తర్వాత, శిథిల భవనాలపై పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉండవచ్చు. యెరూషలేము ప్రాకారం కూలిపోయింది, ఒకప్పుడు ద్వారాలూ, గోపురాలూ ఉన్న స్థానే ఇప్పుడు పెద్ద పెద్ద ఖాళీలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, తిరిగి వచ్చిన యూదులు ధైర్యాన్ని కోల్పోలేదు. మునుపటి ఆలయమున్న స్థలంలో వాళ్లు బలిపీఠాన్ని కట్టి, దానిపై యెహోవాకు అనుదిన బలుల్ని అర్పించడం మొదలు పెట్టారు.

15 ఇది ఆశాజనకమైన ఆరంభమే అయినా పునరుద్ధరించబడిన యెరూషలేము, రాజైన దావీదు వంశస్థుడు సింహాసనాధీశుడై పాలించే రాజ్యానికి రాజధానిగా మరెన్నటికీ కాలేకపోయింది. దానికి బదులుగా, బబులోనును జయించిన రాజులు నియమించిన అధిపతి యూదులను పరిపాలించేవాడు, వాళ్లు తమ పారసీక అధిపతులకు శిస్తులను చెల్లించాల్సి వచ్చేది. (నెహెమ్యా 9:34-37) యెరూషలేము “త్రొక్కబడు” స్థితిలోనే ఉన్నప్పటికీ, అది భూమ్మీదున్న నగరాలన్నింటిలో యెహోవా దేవుని అనుగ్రహాన్ని విశేషంగా పొందిన నగరంగానే ఉంది. (లూకా 21:24) పవిత్రారాధనకు కేంద్ర స్థానంగా, అది రాజైన దావీదు వంశస్థుడి ద్వారా భూమిపై దేవుడు తన సర్వాధిపత్యాన్ని అమలుచేయడానికి ఆయనకున్న హక్కుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది.

అబద్ధ మతాలకు చెందిన పొరుగువారి వ్యతిరేకత

16. బబులోను నుండి తిరిగి వచ్చిన యూదులు, యెరూషలేము పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎందుకు ఆపివేశారు?

16 పరవాసం నుండి యెరూషలేముకు తిరిగొచ్చిన యూదులు త్వరలోనే క్రొత్త ఆలయానికి పునాదిని వేశారు. కానీ అబద్ధ మతాలకు చెందిన పొరుగువాళ్లు, యూదులు తిరుగుబాటుదారులు అవుతారని నిందమోపుతూ పారసీక రాజైన అర్తహషస్తకు ఒక లేఖను పంపించారు. దాని పర్యవసానంగా, అర్తహషస్త రాజు యెరూషలేములో ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని నిషేధించాడు. ఆ కాలంలో మీరే గనుక ఆ పట్టణంలో జీవించివుంటే, యెరూషలేము భవిష్యత్తేమిటా అని మీరకొని ఉండేవారు. ఆ విధంగా, యూదులు ఆలయ నిర్మాణ పనుల్ని ప్రక్కనపెట్టి, సంపదల్ని సమకూర్చుకోవడంలో మునిగిపోయారు.—ఎజ్రా 4:11-24; హగ్గయి 1:2-6.

17, 18. యెరూషలేము పునర్నిర్మించబడేలా చూసేందుకు యెహోవా ఏ మాధ్యమాల్ని ఉపయోగించాడు?

17 యూదులు తిరిగి వచ్చిన దాదాపు 17 సంవత్సరాల తర్వాత, దేవుడు తన ప్రజల ఆలోచనా సరళిని సరిదిద్దడానికి హగ్గయి, జెకర్యా ప్రవక్తలను ప్రేరేపించాడు. పశ్చాత్తాపాన్ని కనుపర్చడానికి కదిలింపబడినవారై, యూదులు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈలోగా, పారసీక దేశానికి దర్యావేషు రాజయ్యాడు. యెరూషలేము ఆలయం పునర్నిర్మించబడాలని రాజైన కోరెషు ఇచ్చిన ఆజ్ఞను ఆయన పరిశీలించాడు. ‘యెరూషలేము జోలికి పోవద్దని’ హెచ్చరిస్తూ, ఆలయ నిర్మాణపు పనులు పూర్తయ్యేలా వారికి కావాల్సిన ఆర్థిక మద్దతును రాజు ఖజానాలో నుండి ఇమ్మని యూదుల ఇరుగు పొరుగునున్న దేశస్థులకు ఒక తాకీదును పంపించాడు.—ఎజ్రా 6:1-13.

18 బబులోను నుండి తిరిగి వచ్చిన 22వ సంవత్సరంలో యూదులు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గొప్ప ఆనందంతో పండుగ చేసుకోదగిన సందర్భంగా ఆ మైలురాయిని మీరు గ్రహించవచ్చు. అయినప్పటికీ, చెప్పుకోదగినంత మేరకు యెరూషలేమూ, దాని గోడలూ ఇంకా శిథిలావస్థలోనే ఉన్నాయి. “అధికారియైన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోను” ఆ పట్టణం అవసరమైన శ్రద్ధను చూరగొంది. (నెహెమ్యా 12:26, 27) సా.శ.పూ. ఐదవ శతాబ్దాంతంనాటికి ఆ ప్రాచీన ప్రపంచంలో ఒక మహానగరంగా యెరూషలేము పూర్తిగా పునర్నిర్మించబడిందని స్పష్టమౌతోంది.

మెస్సీయా కన్పించడం!

19. యెరూషలేముకున్న అసమానమైన హోదాను మెస్సీయా ఎలా గుర్తించాడు?

19 అయితే, మనం కొన్ని శతాబ్దాల్ని దాటి విశ్వంలోనే ప్రాముఖ్యమైన సంఘటనయైన యేసుక్రీస్తు జననం నాటికి వెళదాం. యెహోవా దేవుని దూత కన్యయైన యేసు తల్లికి ఇలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. . . . ఆయన రాజ్యము అంతములేనిదై యుండు[ను].” (లూకా 1:32, 33) అనేక సంవత్సరాల తర్వాత, యేసు ప్రఖ్యాతిగాంచిన తన కొండమీది ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగంలో, ఆయన అనేక విషయాలపై ప్రోత్సాహాన్నీ, సలహాల్నీ ఇచ్చాడు. ఉదాహరణకు, దేవునికి చేసిన ప్రమాణాల్ని నెరవేర్చమనీ, నిరర్థకమైన ప్రమాణాల్ని చేయకుండా జాగ్రత్తవహించమనీ తన శ్రోతలకు ఆయన ఉద్బోధించాడు. యేసు ఇలా అన్నాడు: “నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా—ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము.” (మత్తయి 5:33-35) యెరూషలేముకున్న అసమానమైన హోదాను అంటే అది శతాబ్దాలుగా అనుభవించిన స్థితిని యేసు గుర్తించడం గమనార్హం. అవును, “అది మహారాజు” అయిన యెహోవా దేవుని “పట్టణము.”

20, 21. అనేకమంది యెరూషలేము నివాసుల వైఖరిలో ఏ నాటకీయమైన మార్పు వచ్చింది?

20 తన భూసంబంధమైన జీవితపు చివరి దశలో, యేసు తనను తాను యెరూషలేము నివాసులకు వారి అభిషిక్త రాజుగా వెల్లడి చేసుకున్నాడు. ఒడలు పులకరించే ఆ సంఘటనకు ప్రతిస్పందనగా, అనేకమంది ఆనందంతో ఇలా కేకలు వేశారు: “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక.”—మార్కు 11:1-10; యోహాను 12:12-15.

21 వారం తిరక్కుండానే, యెరూషలేము మత నాయకులు తమ మనస్సుల్ని యేసుకు విరుద్దంగా త్రిప్పేయడానికి అదే జన సమూహాలు అవకాశాన్నిచ్చాయి. యెరూషలేము పట్టణమూ, యావత్‌ జనాంగమూ దేవుని ఎదుట తమకున్న అనుగ్రహపూరితమైన హోదాను కోల్పోతాయని ఆయన హెచ్చరించాడు. (మత్తయి 21:23, 33-45; 22:1-7) ఉదాహరణకు, యేసు ఇలా ప్రకటించాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:37, 38) సా.శ. 33లో పస్కా కాలంలో, యేసు వ్యతిరేకులు ఆయన్ని అన్యాయంగా యెరూషలేముకు వెలుపల మ్రానుపై వ్రేలాడదీశారు. అయినా, యెహోవా తన అభిషిక్తుడ్ని పునరుత్థానంచేసి, అమర్త్యమైన ఆత్మ జీవితంతో పరలోక సీయోనులో మహిమపర్చాడు. ఈ ఏర్పాటు నుండి మనమందరమూ ప్రయోజనం పొందవచ్చు.—అపొస్తలుల కార్యములు 2:32-36.

22. యేసు మరణించిన తర్వాత, యెరూషలేముకు సంబంధించిన అనేక లేఖనాలు ఏ అన్వయింపును కల్గివున్నాయి?

22 అప్పటి నుండీ, సీయోనును గూర్చిన లేదా యెరూషలేమును గూర్చిన నెరవేరని ప్రవచనాల్లో అనేకం పరలోక ఏర్పాట్లకు లేక యేసు అభిషిక్త అనుచరులకు అన్వయిస్తాయని అర్థం చేసుకోవచ్చు. (కీర్తన 2:6-8; 110:1-4; యెషయా 2:2-4; 65:17, 18; జెకర్యా 12:3; 14:12, 16, 17) యేసు మరణించిన తర్వాత “యెరూషలేము” లేదా “సీయోను” గురించి రాయబడిన అనేక లేఖనాలకు స్పష్టంగా అలంకారిక భావమే ఉంది, అవి ఆ అక్షరార్థ పట్టణానికిగానీ, స్థలానికిగానీ అన్వయించవు. (గలతీయులు 4:26; హెబ్రీయులు 12:22; 1 పేతురు 2:6; ప్రకటన 3:12; 14:1; 21:2, 10) దానియేలు, యేసుక్రీస్తులు ప్రవచించినట్లుగానే రోమా సైన్యాలు ఆ పట్టణాన్ని నాశనంచేసినప్పుడు అదిక ఎంతమాత్రమూ “మహారాజు పట్టణము”గా లేదనడానికున్న చివరి రుజువు సా.శ. 70లో రుజువైంది. (దానియేలు 9:26; లూకా 19:41-44) యెరూషలేము ఒకప్పుడు అనుభవించిన యెహోవా దేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందేందుకు భూసంబంధమైన యెరూషలేము మరలా పునరుద్ధరించబడుతుందని బైబిలు రచయితలుగానీ, యేసుగానీ ప్రవచించలేదు.—గలతీయులు 4:25; హెబ్రీయులు 13:14.

శాశ్వత సమాధానపు ముంగుర్తులు

23. యెరూషలేమునందు మనమిప్పటికీ ఎందుకు ఆసక్తిని కల్గివుండాలి?

23 భూసంబంధమైన యెరూషలేము తొలి చరిత్రను పునఃసమీక్షించాక, సొలొమోను రాజు శాంతియుతమైన పరిపాలనా కాలంలో ఆ పట్టణం దాని పేరుకు తగ్గట్టుగానే ఉందన్న విషయాన్ని అంటే “రెండు విధాలుగా శాంతిని కల్గివుందన్న [లేక శాంతికి పునాదిగా ఉందన్న]” విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయినప్పటికీ, పరదైసుగా మార్చబడిన భూమిపై జీవించే దైవ ప్రేమికులు త్వరలో అనుభవించబోయే శాంతి సంపదలకు అది ముంగుర్తు మాత్రమే.—లూకా 23:43.

24. సొలొమోను పరిపాలనలో విలసిల్లిన పరిస్థితుల నుండి మనమేం నేర్చుకోగలం?

24 సొలొమోను రాజు పరిపాలనా కాలంలో విలసిల్లిన పరిస్థితుల్ని 72వ కీర్తన ప్రతిబింబిస్తోంది. కానీ మెస్సీయా అయిన యేసు క్రీస్తు పరలోక పరిపాలన క్రింద మానవజాతి పొందే ఆశీర్వాదాలనే ఆ రమ్యమైన కీర్తన ప్రవచిస్తోంది. ఆయన్ని గురించి, కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. . . . దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:7, 8, 12-14, 16.

25. యెరూషలేమును గురించి మనం మరింతగా ఎందుకు నేర్చుకోవాలి?

25 యెరూషలేములోగానీ, భూమిపై మరెక్కడైనాగానీ ఉన్న దైవ ప్రేమికుల కోసం ఆ మాటలు ఎంతటి ఓదార్పునూ, నిరీక్షణనూ ఇస్తున్నాయో గదా! దేవుని మెస్సీయా రాజ్యం క్రింద భూవ్యాప్తంగా శాంతిని అనుభవించబోయే వారిలో మీరూ ఒకరిగా ఉండగలరు. యెరూషలేమును గూర్చిన గత జ్ఞానం, మానవజాతిపట్ల దేవునికున్న సంకల్పాన్ని అర్థంచేసుకునేందుకు మనకు సహాయపడగలదు. యూదులు బబులోను పరవాసానంతరం తిరిగి వచ్చిన తర్వాత ఏడెనిమిది దశాబ్దాల్లో జరిగిన సంఘటనలను తర్వాతి శీర్షికలు చర్చిస్తాయి. మహారాజైన యెహోవా దేవునికి అంగీకృతమైన ఆరాధనను చెల్లించాలని కోరుకునే వాళ్లందరికీ ఇది ఓదార్పును ఇస్తుంది.

[అధస్సూచీలు]

a (హెబ్రీ పదం నుండి వచ్చిన) “మెస్సీయా” అనే బిరుదుకూ, (గ్రీకు నుండి వచ్చిన) “క్రీస్తు” అనే బిరుదుకూ “అభిషిక్తుడు” అని అర్థం.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ యెరూషలేము ‘యెహోవా సింహాసనమున్న’ పట్టణంగా ఎలా అయ్యింది?

◻ సత్యారాధనను పెంపొందింపచేయడంలో సొలొమోను ఏ ప్రాముఖ్యమైన పాత్రను నిర్వర్తించాడు?

◻ యెహోవా దేవుని ఆరాధనకు కేంద్ర స్థానంగా ఉండకుండా యెరూషలేము విడనాడబడిందని మనకెలా తెలుసు?

◻ యెరూషలేమును గురించి మరింత నేర్చుకోవడంలో మనమెందుకు ఆసక్తిని కల్గివున్నాం?

[10వ పేజీలోని చిత్రం]

దావీదు పట్టణం దక్షిణ భాగాన ఉన్నా సొలొమోను ఆ పట్టణపు సరిహద్దుల్ని ఉత్తరదిశగా విస్తరింపచేసి, ఆలయాన్ని నిర్మించాడు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి