మీరు బైబిలును నమ్మగలరా?
ఈ ఆధునిక ప్రపంచంలో కూడా బైబిలు మీద నమ్మకం విస్తృతంగా ఉంది. ఉదాహరణకు, ఇటీవల అమెరికా వాసులపై జరిపిన ఒక సర్వేలో 80 శాతం మంది బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. మీ ప్రాంతంలో నమ్మేవారి శాతం అంత అధికంగా ఉన్నా లేకపోయినా, అలా విశ్వసించేవారు చర్చిలో బైబిలు గురించి బోధించాలని కోరుకుంటారని మీరు అర్థం చేసుకోవచ్చు. కాని సాధారణంగా అలా జరగడం లేదు. ఉదాహరణకు, మరణించాక శిక్ష అనుభవించడమనే సిద్ధాంతాన్నే తీసుకోండి.
పాపప్రాయశ్చిత్త లోకం గురించి లేక నరకాగ్ని గురించి బైబిలులో ఎక్కడైనా ఉందా? నేడు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకమంది పండితులు లేదు అని సమాధానమిస్తారు. న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియ ఇలా పేర్కొంటోంది: “తుది విశ్లేషణలో, పాపప్రాయశ్చిత్త లోకానికి సంబంధించిన క్యాథలిక్ సిద్ధాంతం పరిశుద్ధ లేఖనాలపై కాదుగాని సంప్రదాయంపై ఆధారపడి ఉంది.” నరకం గురించి ఎ డిక్షనరి ఆఫ్ క్రిస్టియన్ థియోలజి ఇలా వ్యాఖ్యానిస్తోంది: “క్రొత్త నిబంధనలో నరకాగ్ని అన్నది తొలి క్రైస్తవ ప్రకటనలో ఒక భాగంగా మనకు కనిపించదు.”
వాస్తవానికి, ఇటీవల చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు సంబంధించి డాక్టరిన్ కమీషన్ నరకాగ్ని బోధను మొత్తానికే తీసివేయడాన్ని సిఫారసు చేసినప్పుడు అది ప్రముఖ వార్త అయ్యింది. నరకాన్ని గురించిన గతంలోని ఊహ “దేవుడ్ని రాక్షసునిగా చేసి, అనేకులకు మానసికంగా కాలిన గాయాలయ్యేలా చేసిందని విచ్‌ఫీల్డ్ కేథడ్రల్‌లో డీన్ అయిన డా. టామ్ రైట్ చెబుతున్నాడు. ఆ కమీషన్ ఇచ్చిన నివేదిక నరకాన్ని “పూర్తిగా ఉనికిలో లేనిదని” వర్ణిస్తుంది.a అలాగే క్యాథలిక్ దృక్కోణానికి సంబంధించి న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియ ఇలా పేర్కొంటోంది: “నరక సమస్యను నేడు థియోలజి దేవుని నుండి వేరవ్వడమనే కోణం నుండి దృష్టిస్తుంది.”
వాస్తవానికి, మృతుల పరిస్థితి గురించి బైబిలు బోధిస్తున్న దానికి పాపప్రాయశ్చిత్త లోకం మరియు నరకాగ్నిలను గురించిన బోధకు పొంతన లేదు. బైబిలు చెబుతున్న దాని ప్రకారం, మృతులు స్పృహలో ఉండరు, వారికి బాధ తెలియదు. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) మృతుల కోసం బైబిలు ఇస్తున్న నిరీక్షణ భవిష్యద్ పునరుత్థానమే. యేసు స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు, యేసు మరణాన్ని నిద్రతో పోల్చాడు. లాజరు సహోదరియైన మార్త, “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదున[ని]” చెప్పినప్పుడు, బైబిలులో బోధించబడిన నిరీక్షణను వ్యక్తపర్చింది. లాజరును మృతులలో నుండి తిరిగి లేపడం ద్వారా, యేసు మానవజాతికి ఆ నిరీక్షణను ధృవీకరించాడు.—యోహాను 5:28, 29; 11:11-14, 24, 44.
మానవునిలో అమర్త్యమైనదేదో, వేరుగావున్నదేదో ఉందనే బోధ బైబిలు నుండి ఉద్భవించింది కాదుగాని గ్రీకు తత్త్వశాస్త్రం నుండి ఉద్భవించిందని చరిత్రకారులు చెబుతున్నారు. మానవుడు భౌతిక శరీరం మరియు ఆయనలో ఉన్న అభౌతికమైనదేదో కలిసి చేయబడిన జీవి అని ప్రాచీన హెబ్రీయులు తలంచలేదని న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియ పేర్కొంది.
క్యాథలిక్ పండితులు ఇటీవలనే “క్రొత్త నిబంధన అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతాన్ని హెల్లెనిస్టిక్ [గ్రీక్] భావంలో బోధించడం లేదని అంగీకరించారని” అదే ఎన్‌సైక్లోపీడియ పేర్కొంటుంది. “సమస్యకు ప్రాథమిక పరిష్కారాన్ని తాత్వికమైన ఊహలో కంటే పునరుత్థానమనే సహజాతీత బహుమానంలో ఎక్కువగా కనుగొనవచ్చు” అని అది ముగిస్తోంది.
బైబిలా లేక సంప్రదాయమా?
అయితే బైబిలేతర ఉద్దేశాలు చర్చి బోధలో ఎలా భాగమయ్యాయి? బైబిలు తమ అత్యున్నత అధికారమని అనేక చర్చీలు చెప్పుకుంటున్నాయి. ఉదాహరణకు, “లేఖనాలు పూర్తిగా సత్యమైనవని, అవి మన విశ్వాసానికి సర్వోన్నత ప్రమాణమని నమ్మకమైనవారు అంగీకరించవలసిన” అవసరత గురించి కొంతకాలం క్రితమే పోప్ జాన్ పాల్ II మాట్లాడాడు. అయితే, నేడు క్రైస్తవమత సామ్రాజ్య బోధలు మొదటి శతాబ్దపు క్రైస్తవుల బోధలతో పొందిక కల్గిలేవని సాధారణంగా అంగీకరించబడుతోంది. ఈ మార్పులు చర్చి సిద్ధాంతంలో క్రమంగా జరిగిన అభివృద్దిలో ఒక భాగమని చాలా చర్చీలు భావిస్తున్నాయి. అంతేగాక, చర్చి సాంప్రదాయానికి లేఖనాలకున్నటువంటి అధికారమే ఉందని క్యాథలిక్ చర్చి భావిస్తోంది. “సాంప్రదాయం మీద ఆధారపడకుండా కేవలం లేఖనాలపై ఆధారపడిగానీ లేక లేఖనాలపై ఆధారపడకుండా కేవలం సాంప్రదాయం మీదే ఆధారపడిగానీ చర్చీ ఏ సిద్ధాంతాన్నీ కలిగిలేదని” న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియ చెబుతుంది.
చారిత్రకంగా, చర్చీలు సాంప్రదాయంపైనే ఆధారపడిన బోధలను లేఖనాధార బోధల స్థానంలో ప్రవేశపెట్టాయి. వాస్తవానికి ఇప్పుడు అనేక చర్చీలు బైబిలు బోధలు తప్పని భావిస్తున్నాయి. ఉదాహరణకు, “ఆధునిక శాస్త్ర విజ్ఞాన వెలుగులో మరియు చరిత్ర వెలుగులో పరిశీలించినప్పుడు అనేక బైబిలు వ్యాఖ్యానాలు సత్యమైనవి కావన్నది స్పష్టమౌతుందని” న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపిడియ పేర్కొంటోంది. మృతులు స్పృహలో ఉండరనే బైబిలు బోధ గురించి ప్రస్తావిస్తూ అది ఇలా జత చేస్తోంది: “మతసంబంధమైన విషయాల్లో కూడా, పాత నిబంధన మరణానంతర జీవితం . . . గురించి అసంపూర్ణమైన జ్ఞానాన్నే అందజేస్తోంది.” దీనికి ఉదాహరణగా ఆ ఎన్‌సైక్లోపీడియ కీర్తన 6:5ను ఉల్లేఖిస్తోంది: “మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో [లేక హేడిస్‌లో] ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?” కొన్ని ప్రొటస్టెంట్ సెమినరీలు, కాలేజీలు బైబిలు లోపరహితమైనదని ఇక ఎంతమాత్రం బోధించడం లేదు. మరో వైపున, తనకు బోధించే అధికారం ఉందని క్యాథలిక్ చర్చి నమ్ముతోంది, ఆ అధికారంతోనే అది బైబిల్లో బోధించబడినదాని అర్థాన్ని వివరించి చెబుతుంది. అయితే, ‘అలా చెప్పే అర్థాలు లేఖనాలతో పొందికలేనివన్నట్లు అనిపించినప్పుడేమిటి?’ అని మీరు ఆలోచించవచ్చు.
లేఖనాల ప్రాముఖ్యత
యేసు పదే పదే లేఖనాలను అధికారంగా ఉల్లేఖించాడు, తాను చెప్పబోయే విషయానికి ముందు తరచూ ‘ఇలా వ్రాయబడివుంది’ అని చెప్పేవాడు. (మత్తయి 4:4, 7, 10; లూకా 19:46) వాస్తవానికి, యేసు ఒక వ్యక్తి వివాహ స్థితి గురించి మాట్లాడినప్పుడు, ఆయన గ్రీకు తత్వ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకోలేదు గాని ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకున్నాడు. (ఆదికాండము 1:27; 2:24; మత్తయి 19:3-9) లేఖనాలు దేవుని ప్రేరేపణతో వ్రాయబడినవనీ, అవి వాస్తవికమైనవనీ యేసు పరిగణించాడని స్పష్టమౌతుంది. దేవుడ్ని ప్రార్థిస్తూ ఆయనిలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.”—యోహాను 17:17.b
“మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. . . . మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” అని తన కాలంనాటి మతనాయకులపై యేసు చేసిన అభిశంసన బైబిల్లో వ్రాయబడి ఉంది. (మార్కు 7:6-13) అలాగే, అపొస్తలుడైన పౌలు గ్రీకు తత్త్వాన్ని గాని లోపభరితమైన ఆచారాలను గాని తన బోధలోకి ప్రవేశపెట్టాలనే ఒత్తిడిని ఎదిరించాడు. “మనుష్యుల పారంపర్యాచారమును . . . అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి” అని ఆయన హెచ్చరించాడు. (కొలొస్సయులు 2:8; 1 కొరింథీయులు 1:22, 23; 2:1-13) క్రైస్తవులు అనుసరించాలని పౌలు చెప్పిన ఆచారాలు లేక బోధలు కొన్ని ఉన్నాయి, కాని అవి లేఖనాలపై ఆధారపడి ఉండి, లేఖనాలతో పూర్తిగా పొందిక కలిగివున్నాయి. (2 థెస్సలొనీకయులు 2:13-15) పౌలు ఇలా వ్రాశాడు, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము . . . ప్రయోజనకరమై యున్నది.” (ఇటాలిక్కులు మావి.)—2 తిమోతి 3:16, 17.
లేఖనాల నుండి వైదొలగిపోవడాన్ని పౌలు ముందే ఊహించాడు. ఆయన తిమోతిని ఇలా హెచ్చరించాడు: “జనులు హితబోధను సహింపక, . . . సత్యమునకు చెవి నియ్యక . . . తిరుగుకాలము వచ్చును.” ఆయన తిమోతినిలా కోరాడు: “నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము.” (2 తిమోతి 4:3-5) కాని ఎలా? ఒక మార్గం ఏమిటంటే, “శ్రేష్ఠబుద్ధి” గలవారమై ఉండడం. ఒక గ్రీకు నిఘంటువు ఈ బైబిలు పదాన్ని “ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకుని దాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషించాలనే కోరిక” అని నిర్వచిస్తోంది. బెరయలోని మొదటి శతాబ్దంలోని పౌలు శ్రోతల గురించి వర్ణించడానికి లూకా ఈ పదాన్ని ఉపయోగించాడు. పౌలు బోధలు వారికి క్రొత్త, వాళ్లు తాము తప్పుదోవ పట్టాలని కోరుకోలేదు. వారిని మెచ్చుకుంటూ, లూకా ఇలా వ్రాశాడు: “[బెరయవారు] థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి [“శ్రేష్ఠబుద్ధిగలవారు,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” శ్రేష్ఠబుద్ధిగలవారై ఉండడం బెరయవారిని సందేహవాదులుగా, దేన్నీ నమ్మడానికి ఇష్టపడని వారిగా చేయలేదు. బదులుగా, వారి యథార్థమైన విచారణ మూలంగా ‘చాలమంది విశ్వసించిరి.’—అపొస్తలుల కార్యములు 17:11, 12.
బైబిలు అనుసారంగా జీవిస్తే కలిగే ప్రయోజనాలు
బైబిలును అంటిపెట్టుకుని ఉండడాన్ని బట్టి, తమ స్వయంత్యాగపూరిత ప్రేమను బట్టి తొలి క్రైస్తవులు పేరుపొందారు. అయితే నేడు, అనేకమంది ప్రజలు “పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయంచని” వారైయున్నారు. (2 తిమోతి 3:5) మూల క్రైస్తవత్వానికి కట్టుబడి లేని ఏ విధమైన క్రైస్తవత్వం కూడా నేడు ప్రజల జీవితాల్లో మంచి మార్పును కలుగజేసే నిజమైన శక్తిని కల్గివుండజాలదు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని అధిక భాగంలో దౌర్జన్యం, అనైతికత, కుటుంబ విచ్ఛిన్నం, వస్తుదాయకత్వం ఎందుకు అధికమౌతున్నాయో వివరించడానికి ఇది సహాయపడగలదా? కొన్ని “క్రైస్తవ” దేశాల్లో, హానికరమైన జాతి విద్వేష యుద్ధాలు ఒకే మతానికి చెందిన సభ్యుల మధ్య కూడా కొనసాగుతున్నాయి.
బెరయవారి శ్రేష్ఠమైన బుద్ధితో కూడిన స్ఫూర్తి అంతరించిపోయిందా? బైబిలును విశ్వసిస్తూ దాన్ని అనుసరించి జీవించే ప్రజల గుంపేదైనా ఈరోజుల్లో ఉందా?
ఎన్‌సైక్లోపీడియ కెనడియానా ఇలా పేర్కొంటోంది: “యెహోవాసాక్షుల పని, మన యుగంలోని మొదటి మరియు రెండవ శతాబ్దాల కాలంలోని యేసు, ఆయన శిష్యులు అనుసరించిన ప్రాచీన క్రైస్తవత్వం యొక్క పునరాగమనం మరియు పునరుద్ధరణ అయ్యుంది.” సాక్షులను ఉద్దేశించి న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియ ఇలా పేర్కొంది: “వారు బైబిలును తమ నమ్మకానికి ఏకైక మూలంగా, తమ ప్రవర్తనకు ఏకైక నిర్దేశక సూత్రంగా ఎంచుతారు.”
యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధ్యాత్మిక సమృద్ధికి, శాంతికి, సంతోషానికి పేరు పొందడానికి ముఖ్య కారణం ఇదే అనడంలో సందేహమేమీ లేదు. కాబట్టి బైబిల్లోవున్న ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన బోధల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోమని మేము మా పాఠకులను ప్రోత్సహిస్తున్నాము. అధిక జ్ఞానము బైబిలు నందు మరింత ఎక్కువ నమ్మకాన్నీ, దేవునియందు మరింత గట్టి విశ్వాసాన్నీ ఏర్పరచుకోవడానికి నడిపిస్తుంది. అలాంటి విశ్వాసం యొక్క నిత్య ప్రయోజనాలు కృషికి తగిన ప్రతిఫలాలే.
[అధస్సూచీలు]
a నేషనల్ పబ్లిక్ రేడియో—“మార్నింగ్ ఎడిషన్”
b బైబిలు విశ్వసనీయతపై మరింత సమాచారం కోసం వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ ఇండియావారు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌ను చూడండి.
[6వ పేజీలోని చిత్రం]
అపొస్తలుడైన పౌలు, మరితరులు సంతవీధిలో ప్రకటించారు
[7వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు “బైబిలును తమ నమ్మకానికి ఏకైక మూలంగా, తమ ప్రవర్తనకు ఏకైక నిర్దేశక సూత్రంగా ఎంచుతారు”