యెరూషలేము—అది ‘మీ ముఖ్య సంతోషంకన్నా హెచ్చుగా ఉన్నదా’?
“నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.”—కీర్తన 137:6.
1. దేవుడు ఎంపిక చేసుకున్న పట్టణంపట్ల యూదా పరవాసుల్లో అనేకులు ఏ వైఖరిని చూపించారు?
సా.శ.పూ. 537లో యెరూషలేముకు యూదా పరవాసుల మొదటి తరం తిరిగి వచ్చినప్పటి నుండీ దాదాపుగా ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి. దేవుని ఆలయం పునర్నిర్మించబడిందిగానీ, నగరమింకా శిథిలావస్థలోనే ఉంది. ఈ లోగా, క్రొత్త తరం పరవాసాంతరంలో చేతికి అందొచ్చింది. ఆ తరంలో అనేకమంది, “యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయ తన నేర్పు మరచును గాక.” అని పాడిన కీర్తనల గ్రంథకర్తలానే భావించారనడంలో సందేహమేమీ లేదు. (కీర్తన 137:5) కొందరైతే యెరూషలేమును గూర్చి ఊరకే జ్ఞాపకం చేసుకోవడంకన్నా ఇంకా ఎక్కువే చేశారు; వాళ్లు తమ చర్యల ద్వారా దాన్ని “[తమ] ముఖ్య సంతోషముకంటె . . . హెచ్చుగా” ఎంచుతున్నామని రుజువు చేసుకున్నారు.—కీర్తన 137:6.
2. ఎజ్రా ఎవరు, ఆయనెలా ఆశీర్వదించబడ్డాడు?
2 ఉదాహరణకు, యాజకుడైన ఎజ్రా సంగతే తీసుకోండి. అతడు తన స్వదేశానికి తిరిగి రాకముందునుండే యెరూషలేములోని పవిత్రారాధనను పెంపొందింపజేశాడు. (ఎజ్రా 7:6, 10) అందునుబట్టి ఎజ్రా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. యూదా పరవాసుల రెండో గుంపును తిరిగి వెనక్కి యెరూషలేముకు నడిపించే ఆధిక్యతను ఎజ్రాకు ఇచ్చేలా పారసీక రాజు హృదయాన్ని యెహోవా దేవుడు ప్రేరేపించాడు. అంతేగాక, “యెహోవా మందిరమును అలంకరించుటకు” వెండి బంగారాలను రాజు భారీ ఎత్తున ఇచ్చాడు.—ఎజ్రా 7:21-27.
3. యెరూషలేము తన ముఖ్య శ్రద్ధయై ఉందని నెహెమ్యా ఎలా రుజువు చేసుకున్నాడు?
3 దాదాపు 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత, మరొక యూదుడు నిర్ణయాత్మకమైన చర్యను తీసుకున్నాడు—అతడే నెహెమ్యా. పారసీక కోటయైన షూషనులో అతడు పనిచేసేవాడు. అర్తహషస్త రాజు దగ్గర పానదాయకునిగా అతనికొక గౌరవనీయమైన స్థానముండేదిగానీ నెహెమ్యా ‘ముఖ్య సంతోషానికి’ కారణమది కాదు. దానికి బదులుగా, అతడు యెరూషలేముకు వెళ్లి, దాన్ని పునర్నిర్మించాలనే అపేక్షను కల్గివుండేవాడు. దాన్ని గురించి నెలలు తరబడి నెహెమ్యా ప్రార్థించాడు, అలా చేసినందుకు యెహోవా దేవుడు అతడ్ని ఆశీర్వదించాడు. నెహెమ్యాకున్న శ్రద్ధను ఎరిగినవాడై, పారసీక రాజు అతనికి సైన్యాన్నీ, యెరూషలేము పునర్నిర్మాణానికి సంబంధించిన అధికారపూర్వక ఉత్తరువులనూ ఇచ్చి పంపించాడు.—నెహెమ్యా 1:1–2:9.
4. యెహోవా ఆరాధనే ఆనందించడానికి బహుశా మనకున్న ఏ ఇతర కారణాలకన్నా మిన్నయైనదని మనమెలా చూపించగలం?
4 నిస్సందేహంగా, ఎజ్రా నెహెమ్యాలూ, వారితో సహకరించిన అనేకమంది యూదులూ యెరూషలేములో కేంద్రీకృతమైన యెహోవా ఆరాధన, దేనికన్నా కూడా ప్రాముఖ్యమైనదని అంటే అది ‘వారి ముఖ్య సంతోషంకన్నా,’ తాము సంతోషించే దేనికన్నా కూడా మిన్నయైనదని రుజువుపర్చారు. యెహోవా దేవుడ్నీ, ఆయన ఆరాధననూ, ఆయన ఆత్మ నడిపిస్తున్న సంస్థనూ నేడు అదే విధంగా దృష్టిస్తున్న వారందరికీ ఆ వ్యక్తులు ఎంత ప్రోత్సహకరంగా ఉన్నారో గదా! మీ విషయంలో కూడా అది నిజమేనా? యెహోవా దేవుని సమర్పిత ప్రజలతో ఆయనను ఆరాధించే ఆధిక్యతే మీ ఆనందానికి మూల కారణమని దైవిక క్రియల్లో సహనం కల్గివుండడం ద్వారా చూపిస్తారా? (2 పేతురు 3:11) ఆ విషయంలో చేరుకోవడానికి మరొక ప్రోత్సాహంగా, యెరూషలేముకి ఎజ్రా సాగించిన ప్రయాణం మూలంగా కల్గిన చక్కని ఫలితాల్ని పరిశీలిద్దాం.
ఆశీర్వాదాలు, బాధ్యతలు
5. ఎజ్రా కాలంలో యూదా నివాసులు ఏ ఆశీర్వాదాలను విస్తారంగా పొందారు?
5 ఎజ్రా నడిపింపు క్రింద పరవాసం నుండి తిరిగి వస్తున్న దాదాపు 6,000మంది వ్యక్తుల సమూహం, యెహోవా ఆలయం కోసం బంగారాన్నీ, వెండినీ తమతోపాటు తీసుకొచ్చారు. వాటిని ప్రస్తుతపు ద్రవ్యమానంలోకి మారిస్తే, అవి దాదాపు 140 కోట్ల రూపాయలకు సమానం. పరవాసుల మొదటి గుంపు తెచ్చిన బంగారంకన్నా, వెండికన్నా ఇది దాదాపు ఏడురెట్లు ఎక్కువ. మానవ రూపేణా, ద్రవ్య రూపేణా ఇంత మద్దతును పొందినందుకు యెరూషలేము, యూదా నివాసులు యెహోవాకు ఎంత కృతజ్ఞులై ఉన్నారో గదా! అయితే దేవుని నుండి వచ్చే విస్తారమైన ఆశీర్వాదాలతోపాటు బాధ్యత కూడా వస్తుంది.—లూకా 12:48.
6. ఎజ్రా తన స్వదేశంలో ఏం కనుగొన్నాడు, మరి ఆయనెలా ప్రతిస్పందించాడు?
6 కొంతమంది యాజకులూ, పెద్దలతోసహా అనేకమంది యూదులు, అన్య స్త్రీలను పెండ్లిచేసుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారన్న విషయాన్ని ఎజ్రా త్వరలోనే కనుగొన్నాడు. (ద్వితీయోపదేశకాండము 7:3, 4) దేవుని నిబంధన చట్టాన్ని ఇలా ఉల్లంఘించడం విషయంలో ఆయన ఎంతో కలతచెందాడు. “నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, . . . విభ్రాంతిపడి కూర్చుంటిని.” (ఎజ్రా 9:3) ఆ తర్వాత, చింతాక్రాంతులైన ఇశ్రాయేలీయుల సమక్షంలో, ఎజ్రా యెహోవాకు చేసిన ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించాడు. ఎజ్రా ఇశ్రాయేలీయులు గతంలో చూపించిన అవిధేయతనూ, దేశంలోని అన్య నివాసులను వాళ్లు పెండ్లిచేసుకుంటే జరగబోయేదాన్ని గూర్చిన దేవుని హెచ్చరికనూ అందరికీ వినిపించేలా పునఃసమీక్షించాడు. ఆయనిలా ముగించాడు: “యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవైయున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కా[ము].”—ఎజ్రా 9:14, 15.
7. (ఎ) తప్పిదంతో వ్యవహరించడంలో ఎజ్రా ఎలాంటి చక్కని మాదిరిని ఉంచాడు? (బి) ఎజ్రా దినాల్లో తప్పిదస్థులు ఎలా ప్రతిస్పందించారు?
7 ఎజ్రా “మేము” అనే పదాన్ని ఉపయోగించాడు. అవును, అతడు వ్యక్తిగతంగా అపరాధికాకపోయినా, అతడు తనను కూడా అందులో చేర్చుకున్నాడు. ఎజ్రా తీవ్రంగా కలతచెందడమూ, ఆయన దీనంగా చేసిన ప్రార్థనా ప్రజల హృదయాల్ని తాకి, పశ్చాత్తాపానికి తగ్గ క్రియల్ని చేసేలా వారిని ప్రేరేపించింది. వాళ్లు బాధాకరమైన నివారణాచర్యను స్వచ్ఛందంగా చేపట్టారు, అంటే దేవుని చట్టాన్ని అతిక్రమించినవారంతా అన్యురాండ్రైన తమ భార్యలను వాళ్లకు పుట్టిన పిల్లలతోపాటుగా తిరిగి వెనక్కి వారి వారి స్వదేశాలకు పంపించివేశారు. ఈ చర్యను చేపట్టడానికి అంగీకరించి, దానికి అనుగుణంగా ప్రవర్తించమని ఎజ్రా అపరాధులను ప్రోత్సహించాడు. పారసీకరాజు అతని చేతికి అప్పగించిన అధికారంతో, చట్టాన్ని అతిక్రమించిన వారందర్నీ శిక్షించడానికిగానీ, యెరూషలేము యూదాలనుండి బహిష్కరించడానికిగానీ ఎజ్రాకు హక్కుంది. (ఎజ్రా 7:12, 26) కానీ అతను అలాంటి చర్య తీసుకోవలసి వచ్చినట్టు కనిపించడంలేదు. “సమాజకులందరు” ఇలా అన్నారు: “నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.” అంతేగాక వాళ్లు “ఈ విషయములో అనేకులము అపరాధులము” అని ఒప్పుకున్నారు. (ఎజ్రా 10:11-13) అన్యులైన తమ భార్యలనూ వారికి పుట్టిన పిల్లలనూ పంపించివేయడం ద్వారా ఆ నిర్ణయానికి విధేయత చూపించిన 111 మంది పురుషుల పేర్లు ఎజ్రా 10వ అధ్యాయంలో నమోదు చేయబడ్డాయి.
8. అన్యురాండ్రైన భార్యల్ని పంపించేయడమనే తీవ్రమైన చర్య ఎందుకు సమస్త మానవాళికీ ప్రయోజనకరమైనది?
8 ఆ చర్యను తీసుకోవడంవల్ల ఇశ్రాయేలు వారికేగాక సమస్త మానవాళికీ మేలు జరిగింది. విషయాల్ని చక్కదిద్దడానికి ఏ చర్యా తీసుకోకపోయి ఉంటే, ఇశ్రాయేలీయులు ఇరుగు పొరుగునున్న జనాంగాల్లో అంతర్లీనమైపోయి ఉండేవారు. అదే గనుక జరిగితే, సమస్త మానవాళికీ ఆశీర్వాద కారణమైన వాగ్దాన సంతానం రాబోయే వంశక్రమం కలుషితమై ఉండేది. (ఆదికాండము 3:15; 22:18) యూదా గోత్రికుడైన దావీదు రాజు సంతానంగా వాగ్దాన సంతాన గుర్తింపును ధ్రువపర్చడం కష్టమైవుండేది. దాదాపు 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత, “ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలోనుండి ప్రత్యేకింపబడినవారై నిలువబడి”నప్పుడు, ఈ ప్రాముఖ్యమైన సమాచారంపై మరలా శ్రద్ధ నిలపడం జరిగింది.—నెహెమ్యా 9:1, 2; 10:29, 30.
9. అవిశ్వాసులైన భార్యలు లేక భర్తలువున్న క్రైస్తవులకు బైబిలు ఏ చక్కటి సలహాను ఇస్తోంది?
9 ఈ వృత్తాంతం నుండి యెహోవా దేవుని ప్రస్తుతదిన సేవకులు ఏం నేర్చుకోగలరు? నిజమే, క్రైస్తవులు ధర్మశాస్త్ర నిబంధన క్రింద లేరు. (2 కొరింథీయులు 3:14) దానికి బదులుగా, వాళ్లు “క్రీస్తు నియమము”నకు లోబడతారు. (గలతీయులు 6:2) అందుకే, అవిశ్వాసియైన భార్యవున్న క్రైస్తవుడు పౌలు ఇచ్చిన ఈ సలహాకు అనుగుణంగా ప్రవర్తించాలి: “ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.” (1 కొరింథీయులు 7:12) అంతేగాక, అవిశ్వాసులైన భార్యలు లేక భర్తలు క్రైస్తవులకు, తమ వైవాహిక జీవితాన్ని విజయవంతం చేసుకునే లేఖనాధార బాధ్యత ఉంది. (1 పేతురు 3:1, 2) ఈ చక్కని సలహాకు విధేయత చూపించడం, అవిశ్వాసులైన వివాహ జతలు సత్యారాధనపట్ల తమ హృదయ వైఖరిని మార్చుకునే ఆశీర్వాదానికి తరచూ కారణమైంది. కొందరు బాప్తిస్మం తీసుకొన్న విశ్వాసులుగా కూడా మారారు.—1 కొరింథీయులు 7:16.
10. అన్యురాండ్రైన తమ భార్యల్ని పంపించివేసిన 111 మంది ఇశ్రాయేలీయులైన పురుషుల నుండి క్రైస్తవులు ఏ గుణపాఠాన్ని నేర్చుకోగలరు?
10 అయినప్పటికీ, అన్యురాండ్రైన తమ భార్యల్ని పంపించివేసిన ఇశ్రాయేలీయుల వృత్తాంతం, పెండ్లికాని క్రైస్తవులకు చక్కటి గుణపాఠాన్ని అందిస్తోంది. అవిశ్వాసులైన వ్యక్తులతో వీళ్లు ప్రేమకలాపాల్ని ప్రారంభించకూడదు. అలాంటి పరిస్థితిని విడనాడడం బహుశా క్లిష్టమైన విషయమై ఉండొచ్చు, బాధాకరంగా కూడా ఉండొచ్చు, అయినా దేవుని ఆశీర్వాదాల్ని ఎడతెగకుండా అనుభవించేందుకు ఒకరిలా చేయడం శ్రేయస్కరం. క్రైస్తవులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:14) వివాహం చేసుకోవాలని కోరుకునే ఏ క్రైస్తవుడైనా సరే, నిజమైన తోటి విశ్వాసిని పెండ్లి చేసుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి.—1 కొరింథీయులు 7:39.
11. ఇశ్రాయేలీయ పురుషులవలే, మన ముఖ్య సంతోషానికి సంబంధించి మనమెలా పరిశోధించబడవచ్చు?
11 క్రైస్తవులు లేఖన విరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తున్నారని వారి దృష్టికి తేబడినప్పుడు వాళ్లు అనేక ఇతర విధాల్లో కూడా సర్దుబాట్లు చేసుకున్నారు. (గలతీయులు 6:1) మీ చేతిలో ఉన్న ఈ పత్రిక దేవుని సంస్థలో భాగస్థునిగా ఉండడానికి ఒకరిని అనర్హుల్నిచేసే లేఖనాధారంకాని ప్రవర్తనను క్రమంగా గుర్తించింది. ఉదాహరణకు, 1973లో యెహోవా ప్రజలు మాదక ద్రవ్యాల్నీ, పొగాకునూ ఉపయోగించడం గంభీరమైన పాపాలని పూర్తిగా గ్రహించారు. దైవిక జీవిత విధానాన్ని వెంబడించేందుకు, “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా” చేసుకోవాలి. (2 కొరింథీయులు 7:1) అలాంటి బైబిలు సలహాను అనేకమంది హృదయంలోనికి తీసుకున్నారు; దేవుని పవిత్ర ప్రజల్లో భాగమైవుండేందుకు అలాంటి చెడు అలవాట్లను మానుకోవడం వల్ల కలిగే ప్రారంభ బాధల్ని అనుభవించడానికి వాళ్లు సుముఖంగా ఉన్నారు. లైంగిక విషయాలకూ, దుస్తులకూ, కేశాలంకరణలకూ సంబంధించీ, ఉద్యోగాన్నీ వినోదాన్నీ సంగీతాన్నీ జ్ఞానయుక్తంగా ఎంపికచేసుకునే విషయానికి సంబంధించీ స్పష్టమైన లేఖనాధార నిర్దేశకాలు ఇవ్వబడ్డాయి. ఏ లేఖనాధార సూత్రాలు మన దృష్టికి తేబడినప్పటికీ, ఆ 111 మంది ఇశ్రాయేలీయులైన పురుషులవలే “దిద్దుబాటు చేసుకునేందుకు” సిద్ధంగా ఉన్నామని మనం రుజువుపర్చుకుందాం. (2 కొరింథీయులు 13:11, NW) యెహోవా దేవుని పరిశుద్ధ ప్రజలతో కలిసి ఆయనను ఆరాధించే ఆధిక్యత ‘మన ముఖ్య సంతోషంకన్నా హెచ్చుగా ఉన్నదని’ అది చూపిస్తుంది.
12. సా.శ.పూ. 455లో ఏం జరిగింది?
12 అన్యురాండ్రైన భార్యలు చేరివున్న వృత్తాంతాన్ని నివేదించిన తర్వాత, తర్వాతి 12 ఏళ్ల కాలంలో, యెరూషలేములో ఏం జరిగిందో బైబిలు మనకు తెలియజేయడం లేదు. అనేక వైవాహిక బంధాల్ని రద్దుచేసినందువల్ల ఇశ్రాయేలు ఇరుగుపొరుగునున్న జనాంగాలు నిస్సందేహంగా మరింత శత్రుత్వాన్ని పెంచుకొని ఉంటాయి. సా.శ.పూ. 455లో నెహెమ్యా రక్షకదళంతో యెరూషలేముకి వచ్చాడు. ఆయన యూదా దేశానికి అధిపతిగా నియమించబడ్డాడు, నగరాన్ని పునర్నిర్మించేందుకు తనకు అధికారాన్ని ఇస్తూ పారసీకరాజు రాసిన సిఫారసు లేఖల్ని ఆయన తీసుకొచ్చాడు.—నెహెమ్యా 2:9, 10; 5:14.
ఈర్ష్యాపరులైన ఇరుగుపొరుగు జనాంగాల వ్యతిరేకత
13. యూదా దేశానికి ఇరుగుపొరుగునున్న అబద్ధమత జనాంగాలు ఏ వైఖరిని ప్రదర్శించాయి, దానికి నెహెమ్యా ఎలా ప్రతిస్పందించాడు?
13 అబద్ధ మతాలకు చెందిన ఇరుగుపొరుగు జనాంగాలు, నెహెమ్యా వచ్చిన సంకల్పం నెరవేరకుండా అడ్డుకున్నారు. “రాజుమీద తిరుగుబాటు చేయుదురా?” అని ప్రశ్నించడం ద్వారా వాళ్ల నాయకులు నెహెమ్యాను భయపెట్టారు. యెహోవాపై తనకున్న నమ్మకాన్ని కనబరుస్తూ, నెహెమ్యా “ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకసూచనయైనను లేదని ప్రత్యుత్తరమి[చ్చాడు].” (నెహెమ్యా 2:19, 20) గోడలకు మరమ్మతులు చేయడం ప్రారంభమైనప్పుడు, ‘దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తున్నారు? చెత్త కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేస్తారా? కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవును’ అని అదే శత్రువులు అపహసించారు. ఈ పరిహాసాలకు ప్రత్యుత్తరమివ్వడానికి బదులు, నెహెమ్యా ఇలా ప్రార్థించాడు: “మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము.” (నెహెమ్యా 4:2-4) యెహోవాపై ఆధారపడడం విషయంలో ఈ చక్కని మాదిరిని నెహెమ్యా ఎడతెగకుండా ఉంచాడు.—నెహెమ్యా 6:14; 13:14.
14, 15. (ఎ) శత్రువుల హింసాత్మక బెదిరింపులతో నెహెమ్యా ఎలా వ్యవహరించాడు? (బి) భయంకరమైన వ్యతిరేకత ఉన్నా యెహోవా సాక్షులు తమ ఆధ్యాత్మిక నిర్మాణ కార్యక్రమంలో ఎలా ముందుకు సాగగలిగారు?
14 ప్రకటించాలనే తమ ప్రాముఖ్యమైన నియామకాన్ని నెరవేర్చేందుకు నేడు యెహోవాసాక్షులు కూడా దేవునిపై ఆధారపడతారు. అపహసించడం ద్వారా ఈ పనిని ఆపుచేయడానికి వ్యతిరేకులు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు, రాజ్య సందేశమందు ఆసక్తి ఉన్న వ్యక్తులు అపహాసకులుచేసే అపహాసాన్ని భరించలేక పఠనం మానుకుంటారు. అవి పనిచేయకపోతే, వ్యతిరేకులు ఆగ్రహంచెంది, హింసాత్మక బెదిరింపులను ఆశ్రయించవచ్చు. యెరూషలేము ప్రాకార నిర్మాణకులు ఎదుర్కొన్నదిదే. కానీ నెహెమ్యా ఆ బెదిరింపులకు జడిసిపోలేదు. దానికి బదులుగా, “వారికి మీరు భయపడకుడి, మహాఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి” అని చెబుతూ శత్రు వర్గాల దాడిని ఎదుర్కొనేందుకు వాళ్లు ఆయుధాల్ని చేపట్టేలా చేశాడు, వారి విశ్వాసాన్ని బలపర్చాడు.—నెహెమ్యా 4:13, 14.
15 నెహెమ్యా కాలంలోలాగే, యెహోవాసాక్షులు భయంకరమైన వ్యతిరేకత ఉన్నా తమ ఆధ్యాత్మిక నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సంసిద్ధులై ఉన్నారు. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ విశ్వాసాన్ని బలపర్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడు, అది సాక్ష్యమిచ్చేపని నిషేధించబడిన దేశాల్లో కూడా ప్రతిఫలదాయకంగా ఉండేలా దేవుని ప్రజల్ని సన్నద్ధుల్ని చేస్తోంది. (మత్తయి 24:45) తత్ఫలితంగా, యెహోవా తన ప్రజల్ని భూవ్యాప్తంగా పురోభివృద్ధితో ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.—యెషయా 60:22.
అంతర్గత సమస్యలు
16. యెరూషలేము ప్రాకార నిర్మాణకుల స్ఫూర్తికి ఏ అంతర్గత సమస్యలు ముప్పు తెచ్చాయి?
16 యెరూషలేము ప్రాకార పునర్నిర్మాణం సాగి, గోడలు పైకి లేచినప్పుడు, పని మరింత కష్టమైంది. సరిగ్గా అప్పుడే ఓ సమస్య వెలుగులోకి వచ్చింది, అది నిర్మాణ కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసతో సాగిస్తున్న వారి స్ఫూర్తికి ముప్పు తెచ్చింది. ఆహార కొరత మూలంగా, తమ కుటుంబ సభ్యులకు కడుపునిండా తిండి పెట్టడం, పారసీక ప్రభుత్వానికి పన్నులు కట్టడం అనేది కొంతమంది యూదులకు ఎంతో కష్టంగా తయారైంది. బాగా డబ్బున్న యూదులు వారికి ఆహారాన్నీ, డబ్బునూ అప్పుగా ఇచ్చారు. అయితే, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, బీదలైన ఇశ్రాయేలీయులు తాము తిరిగి వడ్డీతో వారి డబ్బును తీరుస్తామనడానికి హామీగా తమ పొలాల్నీ, పిల్లల్నీ కుదువపెట్టాల్సి వచ్చింది. (నిర్గమకాండము 22:25; లేవీయకాండము 25:35-37; నెహెమ్యా 4:6, 10; 5:1-5) ఇప్పుడు అప్పిచ్చినవాళ్లు వాళ్ల భూముల్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ, వాళ్ల పిల్లల్ని బానిసలుగా అమ్మివేయమని వారిపై ఒత్తిడి తెచ్చారు. అలాంటి ప్రేమరహితమైన, వస్తుదాయకమైన దృక్పథానికి నెహెమ్యా ఆగ్రహం చెందాడు. యెరూషలేము ప్రాకార పునర్నిర్మాణ పనిపై యెహోవా ఆశీర్వాదాలు ఎడతెగకుండా ఉండేలా ఆయన సత్వరమైన చర్యల్ని చేపట్టాడు.
17. నిర్మాణపు పనిపై యెహోవా దేవుని ఆశీర్వాదం ఎడతెగకుండా ఉండేలా నెహెమ్యా ఏం చేశాడు, ఏ ప్రతిఫలంతో?
17 ‘మహా సమాజాన్ని’ సమకూర్చారు, ధనవంతులైన ఇశ్రాయేలీయులు చేసినది యెహోవాను ప్రీతిపర్చలేదని నెహెమ్యా వారికి స్పష్టంగా చూపించాడు. కొంతమంది యాజకులతోసహా అపరాధులైనవాళ్లు వసూలు చేసిన వడ్డీలన్నింటినీ తిరిగి ఇచ్చివేయమనీ, వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉన్న వారి దగ్గరనుండి అన్యాయంగా స్వాధీనంచేసుకున్న భూములను తిరిగి ఇచ్చివేయమనీ నెహెమ్యా వేడుకున్నాడు. మెచ్చుకోదగినరీతిలో, అపరాధులైన వాళ్లు “నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి.” అవి వట్టి మాటలుకావు. ఎందుకంటే బైబిలు “జనులందరును [నెహెమ్యా] మాట చొప్పుననే జరిగించిరి” అని నివేదిస్తోంది. సమాజమంతా యెహోవాను కొనియాడింది.—నెహెమ్యా 5:7-13.
18. యెహోవాసాక్షులు ఏ దృక్పథాన్నిబట్టి సుపరిచితులుగా ఉన్నారు?
18 మరి ఈనాటి సంగతేంటి? యెహోవాసాక్షులు తమ తోటి విశ్వాసుల్ని దోచుకోవడానికి బదులు వాళ్లు, ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుపోయిన తమ తోటి విశ్వాసులపట్లా, మరితరులపట్లా చూపించిన దాతృత్వాన్నిబట్టి అందరికీ సుపరిచితులే. నెహెమ్యా కాలాల్లోలానే, ఇది యెహోవాకు ఎంతో స్తుతిని తేవడానికి కారణమైంది. అయినా, అదే సమయంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయాలపైనా, అత్యాశతో ఇతరులను దోచుకోవడాన్ని విడనాడాల్సిన అవసరతపైనా లేఖనాధారపూర్వకమైన సలహాను ఇవ్వడం అవసరమని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ కనుగొన్నాడు. కొన్ని దేశాల్లో విపరీతమైన కన్యాశుల్కాన్ని అడగడం సర్వసాధారణమైపోయింది, కానీ అత్యాశాపరులైనా, దోచుకొనువారైనా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని బైబిలు తేటతెల్లంగా హెచ్చరిస్తోంది. (1 కొరింథీయులు 6:9, 10) అలాంటి సలహాకు అనేకమంది క్రైస్తవులు చూపించిన చక్కటి ప్రతిస్పందన అనేది బీదవారైన తమ సహోదరుల్ని దోచుకునే పాపాన్ని ఆ కాలంనాటి యూదులు ఎలా గ్రహించారనే విషయాన్ని మదిలోకి తీసుకొస్తుంది.
యెరూషలేము ప్రాకార నిర్మాణం పూర్తైంది
19, 20. (ఎ) యెరూషలేము ప్రాకార నిర్మాణం పూర్తవ్వడం మత వ్యతిరేకులపై ఏ ప్రభావాన్ని చూపించింది? (బి) అనేక దేశాల్లో యెహోవాసాక్షులు ఏ విజయాన్ని చవిచూశారు?
19 అన్ని వ్యతిరేకతలు ఉన్నా, యెరూషలేము ప్రాకార నిర్మాణం 52 రోజుల్లో పూర్తైంది. వ్యతిరేకులపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? నెహెమ్యా ఇలా తెలియజేశాడు: “మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.”—నెహెమ్యా 6:16.
20 నేడు, దేవుని పనికి శత్రువుల వ్యతిరేకత అనేక విధాల్లో, అనేక స్థలాల్లో కొనసాగుతోంది. అయినా, యెహోవాసాక్షుల్ని వ్యతిరేకించడం నిష్ప్రయోజనమని లక్షలాదిమంది ప్రజలు గ్రహించారు. ఉదాహరణకు, నాజీ జర్మనీలోనూ, తూర్పు యూరప్‌లోనూ, ఆఫ్రికాలోని అనేక దేశాల్లోనూ ప్రచార పనిని నిలిపివేసేందుకు గతంలో జరిగిన ప్రయత్నాల్ని పరిశీలించండి. అలాంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, “ఈ పని మా దేవునివలన జరిగినదని” అనేకమంది ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ఆ దేశాల్లో ‘తమ ముఖ్య సంతోషంకన్నా మిన్నగా’ యెహోవా ఆరాధనను ‘హెచ్చుగా’ ఎంచిన పాత కాలానికి చెందిన విశ్వాసులకు ఇదెంతటి ప్రతిఫలమో గదా!
21. తర్వాతి శీర్షికలో ఏ ప్రాముఖ్య సంఘటనలు పరిశీలించబడతాయి?
21 తర్వాతి శీర్షికలో, పునరుద్ధరించబడిన యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించే ఆనందమయ సమయానికి నడిపించిన ప్రాముఖ్య సంఘటనల్ని మనం పునఃసమీక్షిద్దాం. సమస్త మానవాళి ప్రయోజనార్థమై మరింత మహిమాన్విత నగర నిర్మాణం ఎలా పూర్తికావస్తోందన్నదాన్ని కూడా మనం పరిశీలిస్తాం.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ఎజ్రా, మరితరులు యెరూషలేమునుబట్టి ఎలా ఆనందించారు?
◻ ఏ తప్పిదాల్ని సరిదిద్దేందుకు ఎజ్రా, నెహెమ్యాలు అనేకమంది యూదులకు సహాయం చేశారు?
◻ ఎజ్రా, నెహెమ్యాలు చేరివున్న వృత్తాంతాలనుండి మీరే గుణపాఠాలను నేర్చుకోగలరు?
[15వ పేజీలోని చిత్రం]
షూషనులో తనకున్న గౌరవనీయమైన ఉద్యోగంకాదుగానీ యెరూషలేమే నెహెమ్యాకు ముఖ్య శ్రద్ధయై ఉంది
[16, 17వ పేజీలోని చిత్రం]
నెహెమ్యావలే, అన్నింటికంటే అతి ప్రాముఖ్యమైన ప్రచార నియామకంలో కొనసాగేందుకు యెహోవా నడిపింపు కోసమూ, బలం కోసమూ మనం ప్రార్థించాలి