మతనాయకులందరూ తాము బోధించేదాన్ని నమ్ముతున్నారా?
ఒక స్త్రీ భర్త ఈ మధ్యనే మరణించాడు. ఆమె భర్త తిన్నగా పరలోకానికి వెళ్లగలిగేంత మంచివాడు కాదనీ, నరకాగ్నిని అనుభవించాల్సినంత చెడ్డవాడూ కాదనీ ప్రీస్టు ఆమెకు వివరించాడు. కాబట్టి ప్రీస్టు ఉద్దేశం ప్రకారం, ఆ స్త్రీ భర్త పరలోకానికి వెళ్లేందుకు అర్హుడయ్యేంత వరకు శిక్ష అనుభవిస్తున్నాడు. తన భర్త పాపప్రాయశ్చిత్త లోకం నుండి త్వరలోనే విడుదల పొందగలిగేలా ఆయన కోసం ప్రార్థనలు చేయడానికి ఆమె ప్రీస్టుకు డబ్బు చెల్లిస్తుంది. తనకున్న యథార్థమైన నమ్మకాలనే ప్రీస్టు కూడా కల్గివున్నాడని భావిస్తూ ఆ విధవరాలు సంతృప్తి పడుతుంది.
మరణించాక అనుభవించే శిక్షను ఆ ప్రీస్టు నిజంగా నమ్మడం లేదని ఆ విధవరాలికి తెలిస్తే నమ్మకం విషయంలో ఆమెకున్న భ్రమలు తొలగిపోతాయని మీరనుకుంటున్నారా? మతనాయకుల్లోని అనేక మంది తాము బోధిస్తున్నదాన్ని తామే చాలామేరకు నమ్మడం లేదని తెలుసుకుని ఎంతోమంది కలవరపడుతున్నారు. నేషనల్ క్యాథలిక్ రిపోర్టర్, “లైంగిక దుష్ప్రవర్తన కంటే లోతైన మతనాయక సంబంధిత సమస్య” అని పిలువబడిన దాని గురించి మాట్లాడుతూ ఇలా పేర్కొంది: “సాధారణంగా మతనాయకుల్లో, దేవుని ఉనికినిగానీ, ప్రతిఫల శిక్షల సిద్ధాంతాన్నిగానీ, పునరుత్థానాన్నిగానీ నమ్మని వాళ్లు చాలామందే ఉన్నారు . . . ఏదో పొగమంచులా, ఆ విధమైన అపనమ్మకం మతనాయకవర్గ వాతావరణంలోనే ఒక భాగమైపోయింది.”
ఇతర చర్చీలు కూడా అదే విధమైన సందిగ్ధావస్థలో ఉన్నాయి. అనేకులు “సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ విశ్వాసంలోని ప్రాథమిక అంశాలైన కన్యకు జన్మించడం, యేసు చేసిన అద్భుతాలు, మెస్సీయ రెండవ రాకడ వంటి వాటిని నమ్మడంలేదని” చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన విసార్లపై జరిపిన సర్వే వెల్లడిచేసినట్లు ఆస్ట్రేలియాకు చెందిన కాన్బెర్రా టైమ్స్ నివేదిస్తుంది.
తానే నమ్మని ఒక విశ్వాస సూత్రాన్ని ఒక మత పరిచారకుడు మంచి మనస్సాక్షితో ఎలా వల్లించగలడని మత సంబంధ రచయితైన జార్జ్ ఆర్. ప్లేగన్జ్ అడిగాడు. ఒక మత పరిచారకుడు, కేవలం విశ్వాస సూత్రంలోని “నేను నమ్ముతున్నాను” అనే ప్రారంభ మాటలను మార్చేస్తానని చెప్పాడు. ఆయనిలా చెప్పాడు: “నేను ఈ మాటలతో ఆ సూత్రాన్ని ప్రారంభిస్తాను, ‘సర్వశక్తిమంతుడైన తండ్రియైన దేవుని . . . వాళ్లు నమ్ముతున్నారు.’” అలాంటి వేషధారణను ప్లేగన్జ్, “దేశంలోకెల్లా అత్యంత పెద్ద వంచన” అంటున్నాడు.
విచారకరంగా, అలాంటి అపనమ్మకం మరియు వేషధారణ అనేకమంది ప్రజలకు సాధారణంగా మతం మీదున్న నమ్మకం పోయేలా చేస్తుంది. అయితే నేడు మతం గురించి కలవరం కలిగించే అంశం అదొక్కటి మాత్రమే కాదు. బైబిలు దేవుని వాక్యమని చర్చీకెళ్లే చాలా మందికి బోధించబడింది. ఎంతో కాలంగా అంగీకారం పొందిన చర్చి సిద్ధాంతాల్లో కొన్నింటిని బైబిలు బోధించడంలేదని తెలుసుకుని వాళ్లు ఆశ్చర్యపోతారా? తర్వాతి శీర్షిక ఒక ఉదాహరణను పరిశీలిస్తుంది.