యెహోవా కనికరాన్ని అనుకరించండి
“మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.”—లూకా 6:36.
1. తాము కనికరంలేనివారమని పరిసయ్యులెలా చూపించుకున్నారు?
దేవుని పోలిక చొప్పున సృష్టించబడినప్పటికీ, మానవులు ఆయన కనికరాన్ని అనుకరించడంలో తరచుగా విఫలులౌతున్నారు. (ఆదికాండము 1:27) ఉదాహరణకు, పరిసయ్యులనే తీసుకోండి. ఊచచెయ్యిగల వ్యక్తిని యేసు సబ్బాతు (విశ్రాంతి) దినాన కనికరంతో స్వస్థపర్చినప్పుడు వాళ్లు ఓ గుంపుగా ఆనందించలేదు. దానికి బదులుగా వాళ్లు యేసుకు విరోధముగా “ఆయనను ఏలాగు సంహరింతుమా అని” ఆలోచన చేశారు. (మత్తయి 12:9-14) మరో సందర్భంలో, యేసు పుట్టుకతోనే గ్రుడ్డివాడైన ఒక వ్యక్తిని స్వస్థపర్చాడు. యేసు కనికరాన్ని చూసి “పరిసయ్యులలో కొందరు” ఈసారి కూడా ఆనందించలేదు. బదులుగా, వాళ్లిలా ఫిర్యాదు చేశారు: “ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కా[డు].”—యోహాను 9:1-7, 16.
2, 3. పరిసయ్యులు అను వారి “పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడ”ని వ్యాఖ్యానించడంలో యేసు భావమేమైవుంది?
2 కఠిన హృదయులైన పరిసయ్యులు, మానవులకు విరోధముగా నేరంచేసి, దేవునికి విరోధంగా పాపాన్ని మూటగట్టుకున్నారు. (యోహాను 9:39-41) ఉన్నత వర్గస్థులూ, సద్దూకయులు వంటి మరితర మతోన్మాదులూ అనే వారి “పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని” యేసు తన శిష్యుల్ని సకారణంగానే హెచ్చరించాడు. (మత్తయి 16:6) బైబిల్లో పులిపిండి పాపానికీ లేదా భ్రష్టత్వానికి ప్రాతినిధ్యంగా ఉపయోగించబడింది. కాబట్టి ‘శాస్త్రులూ, పరిసయ్యుల’ బోధ పవిత్రారాధనను భ్రష్టుపర్చగలదని యేసు చెబుతున్నాడు. ఎలా? తమకు తోచిన విధంగా చెప్పుకున్న సూత్రాలూ, ఆచార సంబంధమైన వ్యవహారాల దృక్కోణంలోనే దేవుని ధర్మశాస్త్రాన్ని దృష్టించేలా అది ప్రజలకు బోధించి, కనికరంతోపాటూ “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను” అలక్ష్యంచేసింది. (మత్తయి 23:23) ఈ ఆచారవ్యవహారాలతో ఉన్న మత విధానం, దేవుని ఆరాధనను మోయజాలని బరువుగా చేసింది.
3 తప్పిపోయిన కుమారుని గూర్చిన తన ఉపమానపు రెండవ భాగంలో, యూదా మత నాయకుల భ్రష్ట ఆలోచనను యేసు బయల్పర్చాడు. ఆ ఉపమానంలో యెహోవా దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి, పశ్చాత్తాపం చెందిన తన కుమారుడ్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ‘పరిసయ్యులకూ, శాస్త్రులకూ’ సాదృశ్యంగా ఉన్న అతని అన్న, ఆ విషయంలో పూర్తిగా భిన్నమైన భావాల్ని కల్గివున్నాడు.—లూకా 15:2.
మండిపడ్డ అన్న
4, 5. తప్పిపోయిన కుమారుని సహోదరుడు ఏ భావంలో ‘తప్పిపోయాడు’?
4 “అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి—ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో—నీ తమ్ముడు వచ్చి యున్నాడు; అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయతే అతడు కోపపడి [“మండిపడి,” క్యాతలిక్ అనువాదము] లోపలికి వెళ్ల నొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:25-28.
5 యేసు చెప్పిన నీతికథలో సమస్యవున్నది తప్పిపోయిన కుమారుడొక్కడికే కాదు. “ఇక్కడ ఇద్దరు కుమారులూ తప్పిపోయినవాళ్లగానే వర్ణించబడ్డారు. ఒకడు తనను నీచమైన స్థితికి దిగజార్చిన అనీతి మూలంగానూ, మరొకడు తనను [మంచి చెడులు వివేచించకుండా] గ్రుడ్డివానిగా చేసిన స్వనీతి మూలంగానూ తప్పిపోయారు” అని ఒక రిఫరెన్సు పుస్తకం చెబుతోంది. తప్పిపోయిన కుమారుని సహోదరుడు ఆనందించలేదు సరికదా, పైగా ‘మండిపడ్డాడు.’ ‘మండిపడడం’ అనే పదం కోసం ఉపయోగించిన గ్రీకు మూల పదం, కోపాన్ని అధికంగా వెళ్లగ్రక్కడాన్నిగాక మనస్సులో దాన్నలానే ఉంచుకునే స్థితిని సూచిస్తోంది. తప్పిపోయిన కుమారుని సహోదరుడు అంతరాంతరాల్లో ఆగ్రహాన్ని అలాగే ఉంచుకున్నాడు. కాబట్టి ఇంటిని అస్సలు వదిలిపెట్టి పోకుండా ఉండి ఉండాల్సినవాడు తగుదునమ్మా అంటూ తిరిగివచ్చినందుకు విందును చేయడం సముచితమైన విషయంకాదని అతడు భావించాడు.
6. తప్పిపోయిన కుమారుని సహోదరుడు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఎందుకు?
6 పాపులపట్ల యేసు చూపించిన దయా, శ్రద్ధలను చూసి మండిపడిన వారికి తప్పిపోయిన కుమారుని సహోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ స్వనీతిపరులు యేసు చూపించిన కనికరాన్నిబట్టి కదిలించబడలేదు; పాపి క్షమాపణను పొందడం మూలంగా పరలోకంలో కలిగే ఆనందాన్నైనా వాళ్లు ప్రతిబింబించలేదు. బదులుగా, యేసు చూపించిన కనికరం వాళ్ల ఆగ్రహాన్ని రేపింది, వాళ్లు తమ హృదయాలలో “దురాలోచనలు చేయ”డం మొదలుపెట్టారు. (మత్తయి 9:2-4) ఒక సందర్భంలో కొంతమంది పరిసయ్యుల కోపం ఎంత తీవ్రంగా ఉందంటే, యేసు స్వస్థపర్చిన ఒకానొక మనుష్యుడ్ని వెదకి పట్టుకొని, సమాజమందిరంలో నుండి “వాని వెలివేసిరి”—అతడ్ని బయటికి గెంటివేసినట్టు కనబడుతోంది ! (యోహాను 9:22, 34) ‘లోపలికి వెళ్ల నొల్లక పోయిన’ తప్పిపోయిన కుమారుని సహోదరునివలే యూదా మత నాయకులు, “సంతోషించు వారితో సంతోషిం[చే]” అవకాశమున్నప్పుడు సంతోషించ నిరాకరించారు. (రోమీయులు 12:15) యేసు తన నీతికథను ఇంకా చెబుతూ వాళ్ల దురాలోచనలను బయల్పర్చాడు.
లోపభూయిష్టమైన యోచనలు
7, 8. (ఎ) తప్పిపోయిన కుమారుని సహోదరుడు, కుమారత్వానికున్న భావాన్ని గ్రహించడంలో ఏ విధంగా తప్పిపోయాడు? (బి) తన తండ్రిలా గాక పెద్ద కుమారుడు మరే విధంగా ఉన్నాడు?
7 “గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో—ఇదిగో యన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయనను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయతే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యూ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:28-30.
8 ఈ మాటలతో, తప్పిపోయిన కుమారుని సహోదరుడు కుమారత్వానికున్న నిజమైన భావాన్ని తాను గ్రహించలేకపోయాననే విషయాన్ని సుస్పష్టం చేశాడు. యజమానికి నౌకరు సేవ చేసినట్టుగానే అతడు తన తండ్రికి సేవ చేశాడు. ‘నేను నిన్ను సేవించుచున్నాను’ అని అతడు తన తండ్రితో అన్నట్టుగానే అది ఉంది. నిజమే, పెద్ద కుమారుడు ఇంటిని ఎన్నడూ విడిచిపోలేదు, లేక తన తండ్రి ఆజ్ఞను జవదాటలేదు. కానీ అతను చూపించిన విధేయత ప్రేమచే ప్రేరేపించబడిందా? తన తండ్రి సేవ చేయడంలో అతడు నిజమైన ఆనందాన్ని పొందాడా, దానికి బదులుగా అతడు “పొలములో” తాను చేయాల్సిన పనులను చేసినందుకే తానొక మంచి కుమారుణ్ణని అనుకుంటూ, ఆత్మసంతృప్తిలో మునిగిపోయాడా? నిజంగా అతడు అంకితభావంగల కుమారుడే అయితే, తన తండ్రికున్న మనస్సును ప్రతిబింబించడంలో అతడెందుకు విఫలుడయ్యాడు? తన సహోదరునికి కనికరాన్ని చూపించే అవకాశం ఇవ్వబడినప్పుడు, అతని హృదయంలో కనికరాన్ని చూపించడానికి అసలు తావే లేకుండా ఎందుకు పోయింది?—పోల్చండి కీర్తన 50:20-22.
9. యూదా మతనాయకులు పెద్ద కుమారుడ్ని ఎలా పోలివున్నారో వివరించండి.
9 యూదా మత నాయకులు ఆ పెద్ద కుమారుడ్ని ప్రతిబింబించారు. వాళ్లు శాసన నియమావళి సూత్రాలకు అంటిపెట్టుకున్నందున తాము దేవుని విషయంలో యథార్థవంతులుగా ఉన్నామని అనుకున్నారు. నిజమే, విధేయత చూపించడం ఎంతో ప్రాముఖ్యం. (1 సమూయేలు 15:22) కానీ అదే పనిగా క్రియలపై వాళ్లు నొక్కిచెబుతూ ఉండడం, దైవారాధనను యాంత్రిక విధానంగా మార్చివేశాయి అంటే నిజమైన ఆధ్యాత్మిక చింతనలేని భక్తి ప్రదర్శనగా మార్చివేశాయి. వాళ్ల మనస్సులు పారంపర్యాచారాలతో నిండిపోయాయి. వాళ్ల హృదయాల్లో ప్రేమ ఇసుమంతైనా లేదు. వాళ్లు సామాన్య ప్రజానీకాన్ని తమ పాదాల క్రిందనున్న ధూళిలాంటి వారిగా పరిగణించి, “శాపగ్రస్తమైన” వారని తిరస్కారయుతంగా కూడా వారిని సూచించారు. (యోహాను 7:49) వాళ్ల హృదయాలు దేవునికి దూరంగా ఉండగా అలాంటి నాయకులు చేసిన క్రియలనుబట్టి ఆయనెలా ముగ్దుడౌతాడు?—మత్తయి 15:7, 8.
10. (ఎ) “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను” అన్న మాటలు ఎందుకు సముచితమైన సలహాయై ఉన్నాయి? (బి) కనికరం లేకపోవడం ఎంత గంభీరమైన విషయమైవుంది?
10 “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని” యేసు పరిసయ్యులకు చెప్పాడు. (మత్తయి 9:13; హొషేయ 6:6) వాళ్ల ప్రాధాన్యతలు కలగాపులగమై పోయాయి, ఎందుకంటే కనికరంలేకుండా వాళ్లర్పించే బలులన్నీ వ్యర్థమౌతాయి. దేవుడు ‘నిర్దయులైన’ వ్యక్తులు “మరణమునకు తగినవా[రి]”గా దృష్టించే వ్యక్తుల్లో, ఉంటారని బైబిలు చెబుతోంది గనుక నిజానికదొక గంభీరమైన విషయమైవుంది. (రోమీయులు 1:31, 32) కాబట్టి, ఒక తరగతిగా మతనాయకులు నిత్యనాశనానికి నిర్ణయించబడ్డారని యేసు తెలియజేయడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. వారు చూపించిన నిర్దయ వాళ్లీ తీర్పును పొందడానికి ఎక్కువగా దోహదపడింది. (మత్తయి 23:33) ఈ తరగతికి చెందిన ఆయా వ్యక్తులు, బహుశా సహాయాన్ని పొందవచ్చు. ఈ ఉపమాన ముగింపులో, తండ్రి తన పెద్ద కుమారుడికి చెప్పిన మాటల ద్వారా అలాంటి యూదుల ఆలోచనా సరళిని సరిదిద్దడానికి యేసు కృషి చేశాడు. అదెలాగో మనం చూద్దాం.
ఒక తండ్రి చూపించిన కనికరం
11, 12. యేసు ఉపమానంలోని తండ్రి తన పెద్ద కుమారునితో సహేతుకంగా తర్కించడానికి ఎలా ప్రయత్నించాడు, “నీ తమ్ముడు” అని తండ్రి ఉపయోగించిన మాటల్లో ఏం ఉట్టిపడుతోంది?
11 “అందుకతడు—కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడ ఉన్నావు; నావన్నియు నీవి; మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయ తిరిగి బ్రదికెను, తప్పిపోయ దొరకెనని అతనితో చెప్పెను.” (ఇటాలిక్కులు మావి.)—లూకా 15:31, 32.
12 “నీ తమ్ముడు” అని ఆ తండ్రి ఉపయోగించిన మాటను గమనించండి. ఎందుకలా ఉపయోగించాడు? పెద్ద కుమారుడు తన తండ్రితో మాట్లాడుతున్నపుడు తప్పిపోయిన కుమారుడ్ని “నా తమ్ముడు” అనిగాక “నీ కుమారుడు” అని పిలవడాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అతడు తనకూ, తన తమ్మునికీ మధ్యనున్న రక్త సంబంధాన్ని గుర్తించినట్టు కనబడ్డంలేదు. అందుకని ఇప్పుడా తండ్రి తన పెద్ద కుమారుడితో ‘వీడు నా కొడుకు మాత్రమేకాదు, నీతో పాటు నా రక్తమాంసాలు పంచుకు పుట్టిన నీ తమ్ముడు కూడాను. వాడు తిరిగి వచ్చినందుకు సంతోషించడానికి ప్రతీ కారణముంది.’ యేసు సందేశం యూదా మత నాయకులకు ఎంతో స్పష్టంగా ఉంది. వాళ్లు తిరస్కరించిన పాపులు వాస్తవానికి వాళ్ల ‘సహోదరులే.’ నిజం చెప్పాలంటే “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.” (ప్రసంగి 7:20) పాపులు పశ్చాత్తాపాన్ని చూపించినప్పుడు ఆనందించడానికి ప్రతీ కారణాన్నీ యూదా ప్రముఖులు కల్గివున్నారు.
13. అకస్మాత్తుగా ముగిసిన యేసు ఉపమానం, ఏ ఆలోచనాపూర్వక ప్రశ్నను గురించి తలంచేలా మనల్ని విడిచిపెట్టింది?
13 ఆ తండ్రి చేసిన విజ్ఞప్తితో ఆ ఉపమానం అకస్మాత్తుగా ముగిసిపోతుంది. యేసు తాను చెప్పిన ఆ కథను విన్న శ్రోతల్ని ఆ కథకు వాళ్ల సొంత ముగింపును ఇమ్మని ఆహ్వానిస్తున్నట్టుంది. ఆ పెద్ద కుమారుడి ప్రతిస్పందన ఏదైనా సరే గానీ, దాన్ని విన్న ప్రతీ శ్రోతా ‘పాపి పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో అనుభవించిన ఆనందంలో మీరూ భాగం వహిస్తారా?’ అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు తమ జవాబేమిటో తెలియజేసే అవకాశం నేడు క్రైస్తవులకు కూడా ఉంది. ఎలా?
నేడు దేవుని కనికరాన్ని అనుకరించడం
14. (ఎ) కనికరం విషయానికి వస్తే, ఎఫెసీయులు 5:1లో ఉన్న పౌలు సలహాను మనమెలా అన్వయించుకోగలం? (బి) దేవుని కనికరానికి సంబంధించి ఏ అపోహ విషయంలో మనం జాగ్రత్త వహించాల్సి ఉంది?
14 పౌలు ఎఫెసీయులకు ఇలా ఉద్బోధించాడు: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:1) కాబట్టి, క్రైస్తవులుగా మనం దేవుని కనికరాన్ని గుర్తించాలి, దాన్ని మన హృదయాల్లో లోతుగా నాటాలి, ఆపై ఆ లక్షణాన్ని ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు చూపించాలి. అయితే, జాగ్రత్త వహించడం సముచితం. దేవుని కనికరాన్ని పాప గంభీరతను తగ్గించివేసేదన్న రీతిలో తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఉదాహరణకు, ‘నేను పాపం చేస్తే, క్షమించమని అడగడానికి నేను దేవుడ్ని ఎప్పుడైనా ప్రార్థించవచ్చు, ఆయన కనికరిస్తాడు’ అని ఉదాసీనంగా తర్కించే వాళ్లు కొందరుంటారు. అలాంటి దృక్పథం “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు”చున్నారని బైబిలు రచయితయైన యూదా పిలిచినదానితో సమానమౌతుంది. (యూదా 4) యెహోవా కనికరంగలవాడే అయినప్పటికీ, పశ్చాత్తాపాన్ని చూపని తప్పిదస్థులతో ఆయన వ్యవహరించినప్పుడు, “ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచ”డు.—నిర్గమకాండము 34:7; పోల్చండి యెహోషువ 24:19; 1 యోహాను 5:16.
15. (ఎ) కనికరం విషయంలో పెద్దలు సమతూకమైన దృక్పథాన్ని ఎందుకు కాపాడుకోవాలి? (బి) ఇష్టపూర్వకంగా చేసే తప్పిదాన్ని సహించకపోయినప్పటికీ, పెద్దలు ఏం చేయడానికి కృషిచేయాలి, ఎందుకు?
15 మరో వైపున, నిజమైన పశ్చాత్తాపాన్నీ, తమ పాపముల విషయమై దైవిక విచారాన్నీ వ్యక్తపర్చిన వాళ్లపట్ల కఠినంగానూ, తీర్పుతీర్చే విధంగానూ తయారయ్యే ప్రవృత్తికి భిన్నంగా మనం అదే విధంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. (2 కొరింథీయులు 7:11) యెహోవా గొఱ్ఱెల్ని కాసే బాధ్యత పెద్దలకు అప్పగించబడింది గనుక, ఈ విషయంలో వాళ్లు సమతూకమైన దృక్పథాన్ని కాపాడుకోవడం, మరి ముఖ్యంగా న్యాయవిచారణ సంబంధమైన విషయాల్ని నిర్వహించేటప్పుడు అలా కాపాడుకోవడం ఆవశ్యకం. క్రైస్తవ సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, బహిష్కరించడం ద్వారా ‘దుర్మార్గుని వెలివేయడం’ లేఖనాధారంగా సరియైనదే. (1 కొరింథీయులు 5:11-13) అదే సమయంలో, కనికరాన్ని చూపించడానికి స్పష్టమైన ఆధారం ఉన్నప్పుడు దాన్ని చూపించడం మంచిది. ఉద్దేశపూర్వకంగా చేసే తప్పిదాన్ని పెద్దలు సహించనప్పటికీ, వాళ్లు న్యాయం పరిధిలో ప్రేమపూర్వకమైన, కనికరంతో కూడిన విధానాన్ని చేపట్టడానికి కృషి చేస్తారు. ఈ బైబిలు సూత్రాన్ని వాళ్లెప్పుడూ గ్రహించినవారై ఉంటారు: “కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.”—యాకోబు 2:13; సామెతలు 19:17; మత్తయి 5:7.
16. (ఎ) తప్పిదం చేసినవాళ్లు తన దగ్గరకు తిరిగి రావాలని నిజంగా యెహోవా ఎలా కోరుకుంటున్నాడో బైబిలు ఉపయోగిస్తూ చూపించండి. (బి) పశ్చాత్తాపాన్ని చూపిన పాపుల రాకను మనం కూడా స్వాగతిస్తున్నామని ఎలా చూపించగలం?
16 తప్పిదస్థులు తిరిగి తన దగ్గరకు రావాలని యెహోవా కోరుకుంటున్నాడని తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానం స్పష్టంచేస్తోంది. నిజానికి, వాళ్లు తిరిగి వస్తారనడానికి ఇక ఆశలేమాత్రం లేవు అనే విషయం రుజువయ్యేంతవరకూ ఆయన వారిని ఆహ్వానిస్తాడు. (యెహెజ్కేలు 33:11; మలాకీ 3:7; రోమీయులు 2:4, 5; 2 పేతురు 3:9) తప్పిపోయిన కుమారుని తండ్రివలే, తిరిగి వచ్చిన వారిని తన కుటుంబ సభ్యులుగానే మరలా అంగీకరిస్తూ వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలగని రీతిలో యెహోవా వారితో వ్యవహరిస్తాడు. ఈ విషయంలో మీరు యెహోవాను అనుకరిస్తున్నారా? కొంతకాలంపాటు బహిష్కరించబడిన తోటి విశ్వాసి తిరిగి చేర్చుకోబడినప్పుడు, మీరెలా ప్రతిస్పందిస్తారు? ‘పరలోకమందు సంతోషించడం’ జరిగిందని మనకిప్పటికే తెలుసు. (లూకా 15:7) భూమిపై మీ సంఘంలో, మీ హృదయంలో సంతోషించడం జరిగిందా? లేక, ఉపమానంలోని పెద్ద కుమారునిలా, దేవుని మందను అస్సలు విడిచిపెట్టి పోకుండా ఉండాల్సినవాడికి స్వాగతం పలకడం ఎంత మాత్రం తగదన్నట్టుగా ఏదైనా కొంత కినుక వహించడం జరిగిందా?
17. (ఎ) మొదటి శతాబ్దంలోని కొరింథునందు ఏ పరిస్థితి తలెత్తింది, దానితో సరిగ్గా వ్యవహరించేందుకు సంఘంలో ఉన్న వారికి పౌలు ఏ విధంగా సలహాను ఇచ్చాడు? (బి) పౌలు ఇచ్చిన ఉద్బోధన ఎందుకు ఆచరణాత్మకమైనది, మరి దాన్ని నేడు మనమెలా అన్వయించుకోగలం? (కుడివైపునున్న బాక్సును కూడా చూడండి.)
17 ఈ విషయంలో మనకుగా మనం పరిశీలించుకునేలా మనకు సహాయపడేందుకు, కొరింథులో దాదాపు సా.శ. 55వ సంవత్సరంలో జరిగినదాన్ని పరిశీలించండి. అక్కడ, సంఘంనుండి వెలివేయబడిన ఓ వ్యక్తి చివరకు తన జీవితాన్ని పరిశుభ్రపర్చుకున్నాడు. మరి సహోదరులు ఏం చేయాలి? అతడు చూపించిన పశ్చాత్తాపాన్ని వాళ్లు అనుమానించి, అతడి రాకను అడ్డుకోవాలా? దానికి బదులుగా, పౌలు కొరింథీయులను ఇలా వేడుకున్నాడు: “మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 2:7, 8) తరచూ, పశ్చాత్తాపపడే తప్పిదస్థులను విశేషంగా తాము అవమాన నిరాశలకు గురౌతామనే సందేహం పట్టిపీడిస్తుంది. అందుకే, తమ తోటి విశ్వాసులూ, యెహోవా దేవుడూ తమను ప్రేమిస్తున్నారనే భరోసా వాళ్లకు అవసరం. (యిర్మీయా 31:3; రోమీయులు 1:12) ఇది ప్రాముఖ్యం. ఎందుకు?
18, 19. (ఎ) కొరింథు సంఘంలోని వాళ్లు తాము ముందు మరీ మెతకగా వ్యవహరించామని ఎలా చూపించుకున్నారు? (బి) ‘సాతానుచే మోసగించబడు’వారిగా కొరింథీయుల్లో కనికరంలేని దృక్పథం ఎలా ఏర్పడింది?
18 క్షమాగుణాన్ని ఆచరించమని కొరింథీయులకు ఉద్బోధించడంలో, “సాతాను మనలను మోసపరచకుండునట్లు, . . . సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము” అని పౌలు ఒక కారణాన్ని ఇస్తున్నాడు. (2 కొరింథీయులు 2:11) ఆయన భావమేమిటి? మునుపు మరీ మెతకగా వ్యవహరించినందుకు కొరింథు సంఘాన్ని పౌలు గద్దించాల్సి వచ్చింది. వాళ్లు శిక్షార్హుడైన ఆ వ్యక్తిని శిక్షించకుండా అలా పాపంలో కొనసాగేలా అనుమతించారు. అలా చేయడం ద్వారా సంఘం, మరి ముఖ్యంగా దాని పెద్దలు సాతానును ప్రీతిపర్చేరీతిలో పనిచేశారు, ఎందుకంటే సంఘానికి చెడ్డపేరు రావడం వాడిని ప్రీతిపరుస్తుంది.—1 కొరింథీయులు 5:1-5.
19 ఇప్పుడా పెద్దలు దానికి భిన్నమైన స్థానాన్ని తీసుకొని, పశ్చాత్తాపాన్ని చూపించిన ఆ వ్యక్తిని క్షమించడానికి తిరస్కరిస్తే, సాతాను వారిని మరో విధంగా మోసగించడానికి నడిపిస్తుంది. ఏ విధంగా? వాళ్లు కఠినంగానూ, కనికరంలేని విధంగానూ ఉండడం నుండి వాడు ప్రయోజనాన్ని పొందగలడు. పశ్చాత్తాపాన్ని చూపించిన పాపి “అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును”—లేదా టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ చెబుతున్నట్టుగా “పూర్తిగా వదిలిపెట్టేసేంతటి విచారసాగరంలో మునిగిపోతాడు”—గనుక యెహోవా ఎదుట పెద్దలు ఎంత బరువైన బాధ్యతను మోయాల్సివుందో కదా! (పోల్చండి యెహెజ్కేలు 34:6; యాకోబు 3:1) “చిన్నవారిలో ఒకనికి” అభ్యంతరం కలుగజేయవద్దని తన అనుచరుల్ని హెచ్చరించిన తర్వాత సకారణంగానే, యేసు ఇలా అన్నాడు: “మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.”a (ఇటాలిక్కులు మావి.)—లూకా 17:1-4.
20. ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు పరలోకమందూ, భూమిపైనా ఏ విధంగా సంతోషం ఉంటుంది?
20 ప్రతీ సంవత్సరమూ పవిత్ర ఆరాధనకు తిరిగి వస్తున్న వేలాదిమంది, వారిపట్ల యెహోవా చూపిస్తున్న కనికరాన్నిబట్టి కృతజ్ఞులై ఉన్నారు. “నా జీవితంలో నేనింత సంతోషంగా ఉన్న గడియలు ఏవైనా ఉన్నట్టు నాకు జ్ఞాపకంలేదు” అని సంఘంలోకి తాను తిరిగి చేర్చుకొనబడడం గురించి ఒక క్రైస్తవ సహోదరి చెబుతోంది. నిజమే, ఆమె సంతోషం దేవదూతల మధ్య కూడా ప్రతిధ్వనించింది. ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు “పరలోకమందు” కలిగే “సంతోషము”లో మనం కూడా చేరదాం. (లూకా 15:7) అలా చేయడంద్వారా, మనం యెహోవా కనికరాన్ని అనుకరించినవారమౌతాం.
[అధస్సూచీలు]
a కొరింథులోని తప్పిదస్థుడు సాపేక్షికంగా చూస్తే తక్కువ కాలంలోనే తిరిగి చేర్చుకొనబడినట్టు కనబడుతున్నప్పటికీ, బహిష్కరించబడిన వ్యక్తులందరి విషయంలోనూ దీన్నొక ప్రామాణికంగా ఉపయోగించకూడదు. ఇది వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఉంటుంది. కొంతమంది తప్పిదస్థులు దాదాపుగా వెలివేయబడిన వెనువెంటనే నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించనారంభిస్తారు. మరి కొందరి విషయంలోనైతే, అలాంటి దృక్పథాన్ని స్పష్టంగా చూపించడానికి కొంతకాలం పడుతుంది. అయితే, బహిష్కరణకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ, తిరిగి చేర్చుకొనబడేవాళ్లు దైవిక విచారాన్ని కల్గివున్నారనడానికి గల రుజువును మొదట చూపించుకోవాలి. సాధ్యమైనచోటల్లా, పశ్చాత్తాపానికి తగిన క్రియల్ని చూపించాలి.—అపొస్తలుల కార్యములు 26:20; 2 కొరింథీయులు 7:11.
పునఃసమీక్షలో
◻ తప్పిపోయిన కుమారుని సహోదరుడు ఏ విధంగా యూదా మత నాయకుల్ని పోలి ఉన్నాడు?
◻ తప్పిపోయిన కుమారుని సహోదరుడు, కుమారత్వానికి ఉన్న నిజమైన భావాన్ని గ్రహించడంలో ఏ విధంగా తప్పిపోయాడు?
◻ దేవుని కనికరాన్ని ప్రతిబింబించడంలో, మనమే రెండు విపరీతమైన స్థాయిలను విడనాడాల్సి ఉంది?
◻ దేవుని కనికరాన్ని నేడు మనమెలా అనుకరించగలం?
[17వ పేజీలోని బాక్సు]
‘వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెను’
సంఘంనుండి వెలివేయబడి అటు తర్వాత పశ్చాత్తాపాన్ని కనుపర్చిన తప్పిదస్థుడ్ని గురించి పౌలు కొరింథు సంఘానికి ఇలా చెప్పాడు: “వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 2:8) ఇక్కడ “స్థిరపరచవలె[ను]” అని అనువదించబడిన గ్రీకు పదమనేది చట్టపారిభాషిక పదం, దానికి “ధ్రువీకరించు” అని అర్థం. అవును, తిరిగి చేర్చుకోబడిన పశ్చాత్తాపతప్తులైన వ్యక్తులు, తాము ప్రేమించబడుతున్నామనీ, సంఘంలోని సభ్యులుగా మరోసారి ఆహ్వానించబడుతున్నామనీ గ్రహించాల్సిన అవసరం ఉంది.
అయితే, ఒకానొక వ్యక్తి సంఘం నుండి వెలివేయబడడానికి గానీ, తిరిగి చేర్చుకోవడానికి గానీ దారితీసిన పరిస్థితుల్ని గురించి సంఘంలో ఉన్న అనేకులకు తెలియదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాక, పశ్చాత్తాపాన్ని చూపించిన తప్పిదస్థుని మూలంగా వ్యక్తిగతంగా ప్రభావితులైన లేదా బాధించబడిన వ్యక్తులు కొందరు.
సంఘంలో ఉండవచ్చు, బహుశా వాళ్లు ఎంతో కాలంనుండి వాటికి గురైవుండవచ్చు. కాబట్టి వాటిని పరిగణలోనికి తీసుకున్న వారంగా మనం, తిరిగి చేర్చుకోబడడాన్ని గూర్చిన ప్రకటన చేసినప్పుడు ఆ వ్యక్తి తనను తాను తిరిగిచేర్చుకోబడడానికి తగినవాడనని రుజువుపర్చుకునేంత వరకూ ఆహ్వాన వచనాల్ని పలకకుండా ఉంచడం మంచిది.
క్రైస్తవ సంఘ సభ్యులుగా తిరిగి ఆహ్వానించబడ్డామని తిరిగి చేర్చుకొనబడివారు తెలుసుకోవడమనేది వారి విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తుందో కదా! వారితో మాట్లాడడం ద్వారా, రాజ్యమందిరాల్లోనూ, పరిచర్యలోనూ, మరితర సముచితమైన సందర్భాల్లోనూ వారి సహవాసాన్ని ఆనందించడం ద్వారా మనం, పశ్చాత్తాపాన్ని చూపించిన అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించగల్గుతాం. ఆ విధంగా ప్రియులైన అలాంటి వారిపట్ల మనకున్న ప్రేమను స్థిరపర్చడం ద్వారా, లేదా ధ్రువపర్చడం ద్వారా వాళ్లు చేసిన పాపముల గంభీరతను మనమేవిధంగానూ తగ్గించివేయం. దానికి బదులుగా, వాళ్లు పాపభరితమైన పనిని తిరస్కరించి, యెహోవావైపుకు తిరిగారనే వాస్తవాన్నిబట్టి పరలోకంలోని దూతల సమూహంతోపాటుగా మనమూ ఆనందిస్తాం.—లూకా 15:7.
[15వ పేజీలోని చిత్రం]
తన తమ్ముని రాకకు పెద్దకుమారుడు ఆనందించలేదు