కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/15 పేజీలు 21-23
  • దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లేఖనాలను చదవండి
  • క్రమంగానూ, పట్టుదలగాను ప్రార్థన చేయండి
  • సృష్టిని గమనించండి
  • దేవునితో కూడ నడవండి
  • మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/15 పేజీలు 21-23

దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడా?

మిమ్మల్ని తీవ్రమైన కలతకు గురిచేసే సమస్యలతో సతమతమౌతున్నప్పుడు మీరు వెంటనే దేవునికి ప్రార్థన చేస్తారా? అలాగైతే, మీరు ఒక వాస్తవమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మీరు గ్రహిస్తారా?

తన పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు, “నన్ను పంపినవాడు సత్యవంతుడు [“వాస్తవమైన వ్యక్తి,” NW]” అని అన్నాడు. అవును, యెహోవా వాస్తవమైన వ్యక్తి, ఆయనకు ప్రార్థన చేయడం, సహాయం కోసం లేక సలహా కోసం చాలా సన్నిహితుడైన మానవ స్నేహితునివైపు మరలినట్లు ఉంటుంది. అయితే, దేవుడు ఆలకించాలంటే మన ప్రార్థనలు అంగీకారయోగ్యమైన ప్రార్థనలకు కావాల్సిన లేఖనాధార ఆవశ్యకతలను చేరుకోవాలి. ఉదాహరణకు, మనం ‘ప్రార్థన ఆలకించువాడిని’ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినయంతో సమీపించాలి.—కీర్తన 65:2; 138:6; యోహాను 14:6.

దేవుడు అదృశ్యుడు గనుక ఆయన ఒక వ్యక్తి కాదు అన్నట్లు భావించవచ్చు. వారికి దేవుడు అంటే ఒక అమూర్తమైన భావనగానే ఉండవచ్చు. దేవుని అద్భుతమైన లక్షణాలను తెలుసుకున్న కొంతమంది క్రైస్తవులు కూడా, ఆయన ఎంత వాస్తవమైన వ్యక్తి అన్న విషయాన్ని పూర్తిగా గ్రహించడం కొన్నిసార్లు కష్టంగా ఉన్నట్లు కనుగొంటారు. ఇది మీకు అనుభవమయ్యిందా? అలాగైతే, యెహోవా దేవుడు మీకు ఒక వాస్తవమైన వ్యక్తిగా చేసుకోవడానికి ఏమి సహాయపడగలదు?

లేఖనాలను చదవండి

మీరు పరిశుద్ధ లేఖనాలను క్రమంగా చదువుతారా? మీ బైబిలు పఠన సమయాలు ఎంత తరచుగా, ఎంత తీవ్రంగా ఉంటాయో యెహోవా దేవుడు మీకు అంత వాస్తవమైన వ్యక్తిగా ఉంటాడు. ఆ విధంగా మీ విశ్వాసం బలపర్చబడుతుంది, దాని ఫలితంగా మీరు ‘అదృశ్యుడైనవానిని చూడడం’ మీకు సాధ్యమౌతుంది. (హెబ్రీయులు 11:6, 27) మరోవైపు, అంత తరచుగా జరగని లేక ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చేసే బైబిలు పఠనం మీ విశ్వాసంపైన గమనార్హమైన ప్రభావం చూపించే సాధ్యత ఉండదు.

దీన్ని ఒక ఉదాహరణతో వివరించాలంటే: మీ శరీరంపైన ఎన్నటికీ తగ్గని దద్దురును పోగొట్టడానికి ఫలాని ఆయింట్‌మెంటుని రోజుకి రెండుసార్లు రాయమని డాక్టరు మీకు చెప్పాడనుకోండి. నెలకు ఒకటీ రెండుసార్లు మాత్రమే ఆ ఆయింట్‌మెంటుని రాస్తే మీ దద్దురు మాయమౌతుందా? అలా జరిగే అవకాశం లేదు. అదే విధంగా, మన ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం కీర్తనల రచయిత ఒక “ప్రిస్క్రిప్షన్‌” (మందులచీటీని) ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ‘దివారాత్రము ధ్యానించుము.’ (కీర్తన 1:1, 2) మరిన్ని ప్రయోజనాలను సాధించాలంటే, మనం ఆ “ప్రిస్క్రిప్షన్‌” చెప్పిన ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది, అంటే క్రైస్తవ సాహిత్యాల సహాయంతో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పరిశీలించాల్సిన అవసరముంది.—యెహోషువ 1:8.

మీ పఠనం, విశ్వాసాన్ని మరింత బలపర్చేదిగా ఉండేలా చేయాలనుకుంటున్నారా? ఒక సలహా: పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదములోగానీ లేక రెఫరెన్సులు ఉన్న మరో బైబిలులోగానీ మీరు ఒక అధ్యాయం చదివిన తర్వాత, ఆసక్తికరమైన ఒక వచనాన్ని ఎంపిక చేసుకుని అక్కడ రిఫరెన్సులో ఉన్న ఇతర లేఖనాలను కూడా చదవండి. దీనివల్ల మీ పఠనం మరింత రుచికరంగా తయారౌతుంది, బైబిలులోని అంతర్గత పొందికను చూసి మీరు నిస్సందేహంగా ముగ్ధులౌతారు. దీని ఫలితంగా, దాని గ్రంథకర్త అయిన యెహోవా దేవుడ్ని మీకు మరింత వాస్తవమైన వ్యక్తిగా చేస్తుంది.

క్రాస్‌ రెఫరెన్సులను ఉపయోగించడం బైబిలు ప్రవచనాలతోనూ వాటి నెరవేర్పులతోనూ మీరు మరింత సుపరిచితులయ్యేలా చేస్తుంది. బహుశ మీరు బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడానికి సంబంధించిన ప్రవచనాలవంటి ప్రాముఖ్యమైన ప్రవచనాలతో పరిచయం కలిగివుండవచ్చు. అయితే, బైబిలులో ఒకదానికొకటి సంబంధమున్న ప్రవచనాలూ వాటి నెరవేర్పులతో కూడిన ఒక నెట్‌వర్క్‌ వంటిది ఉంది. వీటిలో కొన్నింటి గురించి అందరికీ అంతగా తెలియదు.

ఉదాహరణకు, యెరికో పట్టణాన్ని పునర్నిర్మిస్తే వచ్చే శిక్షను గురించిన ప్రవచనాన్నీ దాని నెరవేర్పునూ పరిశీలించండి. యెహోషువ 6:26 ఇలా చెబుతుంది: “ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను—ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును.” నెరవేర్పు దాదాపు 500 సంవత్సరాల తర్వాత జరిగింది, ఎలాగంటే 1 రాజులు 16:34 ఇలా చెబుతుంది: “[రాజైన అహాబు] దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునులనెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.”a కేవలం ఒక వాస్తవమైన వ్యక్తి అయిన దేవుడు మాత్రమే అటువంటి ప్రవచనాలకు ప్రేరేపణనిచ్చి అవి నెరవేరేలా చేయగలడు.

బైబిలును చదువుతున్నప్పుడు ఒకానొక విషయం గురించి మీలో జిజ్ఞాస పెరగవచ్చు. ఉదాహరణకు ఒక ప్రవచనానికీ దాని నెరవేర్పుకూ మధ్య ఎంత కాలం గడిచిందని మీరు ఆలోచించవచ్చు. ఇతరులను అడిగేసే బదులు, కాస్త ప్రయత్నం చేసి మీకై మీరే జవాబును ఎందుకు కనుక్కోకూడదు? పట్టికలూ, బైబిలు పఠన సహాయకాలను ఉపయోగిస్తూ మీరు, నిధి ఎక్కడుందో సూచించే పటాన్ని అర్థంచేసుకోవడానికి చేసే ప్రయత్నంలా వీలైనంత ఎక్కువగా శ్రమించి జవాబుల జాడ తీయండి. (సామెతలు 2:4, 5) జవాబుల్ని కనుగొనడం మీ విశ్వాసంపైన గొప్ప ప్రభావాన్ని కలిగివుంటుంది, యెహోవా దేవుడ్ని మీకు ఇంకా వాస్తవమైన వ్యక్తిగా చేస్తుంది.

క్రమంగానూ, పట్టుదలగాను ప్రార్థన చేయండి

ప్రార్థనా, విశ్వాసాల ప్రాముఖ్యతను అలక్ష్యం చేయకండి. యేసు శిష్యులు ఈ సూటైన కోరికను కోరారు: ‘మా విశ్వాసము వృద్ధిపొందించుము.’ (లూకా 17:5) యెహోవా మీకు వాస్తవమైన వ్యక్తిగా అనిపించకపోతే, మీ విశ్వాసాన్ని వృద్ధిపొందించుమని ఆయనకు ఎందుకు ప్రార్థించకూడదు? మీరు ఆయనను ఒక వాస్తవమైన వ్యక్తిగా దృష్టించేందుకు సహాయం చేయమని మీ పరలోక తండ్రిని నమ్మకంతో అడగండి.

ఏదైనా సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే, హృదయపూర్వకంగా మీ పరలోక స్నేహితునికి మిమ్మల్ని మీరు వ్యక్తం చేసుకోవడానికి కావల్సినంత సమయాన్ని తీసుకోండి. యేసు తన మరణ సమయం సమీపిస్తుండగా ఆయన చాలా తీవ్రంగా ప్రార్థించాడు. ప్రజలకు చూపించుకోవడానికి సుదీర్ఘమైన ప్రార్థనలు చేసే మతపరమైన అభ్యాసాన్ని ఆయన ఖండించినప్పటికీ, తాను 12 మంది అపొస్తలులను ఎంపిక చేసుకోవడానికి ముందు పూర్తి రాత్రంతా ప్రార్థిస్తూ గడిపాడు. (మార్కు 12:38-40; లూకా 6:12-16) మనం హన్నా నుండి కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు, ఆమె ప్రవక్త అయిన సమూయేలు తల్లి. మగ సంతానం కోసం ఆకాంక్షిస్తూ, ‘ఆమె యెహోవా సన్నిధిని [“సుదీర్ఘంగా,” NW] ప్రార్థన చేయుచుండెను.’—1 సమూయేలు 1:11.

దీనంతటి నుండీ మనం ప్రాథమికంగా నేర్చుకునేదేమిటి? మీ ప్రార్థనలకు జవాబులను పొందాలని మీరు ఆశిస్తుంటే, మీరు ఆతురముగా, పట్టుదలగా, ఎడతెగకుండా ప్రార్థించాలి—కానీ దేవుని చిత్తానికి అనుగుణ్యంగా. (లూకా 22:44; రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17; 1 యోహాను 5:13-15) ఇలా చేయడంవల్ల దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తి అవుతాడు.

సృష్టిని గమనించండి

ఒక చిత్రకారుని వ్యక్తిత్వం ఆయన వేసిన చిత్రాల్లో వెల్లడి కావచ్చు. అదే విధంగా, ఈ విశ్వానికి రూపకర్తా సృష్టికర్తా అయిన యెహోవా “అదృశ్యలక్షణములు” సృష్టిలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. (రోమీయులు 1:20) మనం యెహోవా హస్తకృతిని జాగ్రత్తగా గమనించినప్పుడు, మనకు ఆయన వ్యక్తిత్వం గురించిన మరింత స్పష్టమైన అవగాహన లభిస్తుంది, తద్వారా ఆయన మనకు మరింత వాస్తవమైన వ్యక్తి అవుతాడు.

దేవుడు సృష్టించిన వాటిని మీరు కేవలం పైపైన కాకుండా, లోతుగా గమనిస్తే ఆయన లక్షణాల వాస్తవికతను గురించి మీరు గాఢంగా ప్రభావితులౌతారు. ఉదాహరణకు, పక్షుల నావికా సంబంధిత సామర్థ్యాల గురించిన సమాచారం మీలో యెహోవా జ్ఞానంపట్ల మీ మెప్పుదలను పెంచవచ్చు. విశ్వాన్ని గురించి చదివితే మీరు, 1,00,000 కాంతి సంవత్సరాల పొడవు ఉన్న మన పాలపుంత గెలాక్సీ, అంతరిక్షమంతటిలో ఉన్న కోట్లాది గెలాక్సీల్లో కేవలం ఒక్కటి మాత్రమే అని తెలుసుకుంటారు. సృష్టికర్త యొక్క జ్ఞానసంపద వాస్తవికమైనదని అది మీ మనస్సుపై ప్రగాఢమైన ముద్ర వేయదూ?

నిశ్చయంగా, యెహోవా జ్ఞానసంపద వాస్తవమైనదే! కానీ మీ విషయంలో దాని భావమేమిటి? మనమందరం ప్రార్థన ద్వారా ఆయనకు విన్నవించుకునే సమస్యలు ఆయనను గజిబిజిపెట్టవు. అవును, సృష్టిని గురించిన స్వల్పమైన జ్ఞానం కూడా మీకు యెహోవాను మరింత వాస్తవమైన వ్యక్తిగా చేయగలవు.

దేవునితో కూడ నడవండి

యెహోవా ఎంత వాస్తవమైన వ్యక్తో మీరు వ్యక్తిగతంగా అనుభవించ గల్గుతున్నారా? తప్పకుండా; ఒకవేళ మీరు విశ్వసనీయుడైన పితరుడైన నోవహు వంటివారైతే. ఆయన ఎల్లప్పుడూ యెహోవాకు విధేయత చూపించాడు, ఎంత వరకూ అంటే చివరికి ఆయన గురించి ఇలా చెప్పబడింది: “నోవహు దేవునితోకూడ నడిచినవాడు.” (ఆదికాండము 6:9) నోవహు, యెహోవా తన ప్రక్కనే ఉన్నాడా అన్నట్లు జీవించాడు. దేవుడు మీకు కూడా అంత వాస్తవమైన వ్యక్తిగా ఉండగలడు.

ఒకవేళ మీరు దేవునితోకూడ నడుస్తున్నట్లైతే, మీరు లేఖనాధారమైన వాగ్దానాలపై నమ్మకముంచుతారు, వాటికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీరు యేసు చెప్పిన ఈ మాటలను నమ్ముతారు: “మీరు [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:25-33) నిజమే, యెహోవా మీకు కావాల్సినవి ఎల్లవేళలా మీరు అనుకున్న రీతిలో అందించకపోవచ్చు. అయినా, మీరు ఆయనకు ప్రార్థించి తర్వాత దేవుని సహాయాన్ని పొందిన అనుభవం మీకు ఉంటే, అప్పుడు ఆయన మీకు, మీ ప్రక్కనే ఉన్న వ్యక్తి అన్నంత వాస్తవమైన వ్యక్తిగా ఉంటాడు.

యెహోవాతో అటువంటి సన్నిహితమైన సంబంధం ఒకరు పట్టుదలగా దేవునితోపాటు నడుస్తూ ఉంటే అభివృద్ధి చెందుతుంది. అనేక పరీక్షలను సహించిన స్పానిష్‌ భాష మాట్లాడే సాక్షి అయిన మాన్యువేలా విషయం చూడండి. ఆమె ఇలా అంటుంది: “నేనెప్పుడు కలతకు గురైనా లేక అవసరతలో ఉన్నా, సామెతలు 18:10లోని సిద్ధాంతాన్ని అన్వయించుకుంటాను. నేను సహాయం కోసం యెహోవా వద్దకు పరిగెడతాను. ఆయనెల్లప్పుడూ నాకు ‘బలమైన దుర్గము’గా ఉన్నాడు.” 36 సంవత్సరాలపాటు యెహోవాపై ఆధారపడి, ఆయన మద్దతును అనుభవించిన తర్వాత మాన్యువేలా ఆ మాటలను చెప్పింది.

మీరు యెహోవాను మీ నమ్మకానికి ఇప్పుడిప్పుడే ఆధారంగా చేసుకోవడం ప్రారంభిస్తున్నారా? ఒకవేళ ఇప్పటికీ ఆయనతో మీ సంబంధం మీరు కోరుకునేంతగా లేకపోతే నిరుత్సాహం చెందకండి. ప్రతిదినం దేవునితోపాటు నడుస్తున్న వ్యక్తిగా జీవించండి. విశ్వసనీయతతో కూడిన జీవన విధానాన్ని మీరు రూపొందించుకుంటుండగా మీరు యెహోవాతో మరింత సన్నిహితమైన సంబంధాన్ని అనుభవిస్తారు.—కీర్తన 25:14; సామెతలు 3:26, 32.

దేవునితోపాటు నడవడానికి మరో మార్గం ఏమిటంటే ఆయన సేవలో పూర్తిగా నిమగ్నం కావడమే. మీరు రాజ్య ప్రకటనా కార్యకలాపంలో పాల్గొంటూ ఉన్నప్పుడు మీరు యెహోవాతో జతపనివారిగా ఉంటారు. (1 కొరింథీయులు 3:9) ఇది తెలుసుకుని ఉండడం దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తిగా ఉండేలా చేయడానికి సహాయం చేస్తుంది.

కీర్తన గ్రంథకర్త ఇలా ఉద్బోధిస్తున్నాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.” (కీర్తన 37:5) మీరు మోస్తున్న భారాలు, చింతలు ఏవైనప్పటికీ మీ మార్గాన్ని దేవునికి అప్పగించడంలో విఫలం చెందకండి. సహాయం కోసం, నడిపింపు కోసం ఎల్లప్పుడూ ఆయనవైపు చూడండి. మీరు ప్రార్థనాపూర్వకంగా యెహోవా దేవునిపై ఆధారపడితే, ఆయనను ఎల్లప్పుడూ పూర్తిగా నమ్ముకొంటే మీరు భద్రతా భావాన్ని అనుభవిస్తారు, దానికి కారణం మీపక్షాన యెహోవా పనిచేస్తాడని మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. మీ వ్యక్తిగత చింతలతో యెహోవాను సమీపిస్తున్నప్పుడు మీరు పూర్తి నమ్మకంతో ఉంటారా? తప్పక ఉంటారు—దేవుడు మీకు వాస్తవమైన వ్యక్తయితే.

[అధస్సూచీలు]

a మరొక ఉదాహరణగా, యరొబాము కట్టించిన బలిపీఠాన్ని మలినపర్చడాన్ని గురించిన ప్రవచనాన్ని 1 రాజులు 13:1-3లో చదవండి. తర్వాత 2 రాజులు 23:16-18 వచనాల్లోని నెరవేర్పును చదవండి.

[21వ పేజీలోని చిత్రం]

మీ పఠన సమయాలను విశ్వాసాన్ని బలపర్చేవిగా చేసుకోండి

[22వ పేజీలోని చిత్రం]

క్రమమైన, తీవ్రమైన ప్రార్థన కోసం సమయం తీసుకోండి

[23వ పేజీలోని చిత్రం]

దేవుని లక్షణాలు సృష్టిలో ఎలా ప్రదర్శితమౌతున్నాయో గమనించండి

[క్రెడిట్‌ లైను]

Hummingbird: U.S. Fish and Wildlife Service, Washington, D.C./Dean Biggins; stars: Photo: Copyright IAC/RGO 1991, Dr. D. Malin et al, Isaac Newton Telescope, Roque de los Muchachos Observatory, La Palma, Canary Islands

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి