కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/15 పేజీలు 4-7
  • ఇది మేల్కోవాల్సిన సమయం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇది మేల్కోవాల్సిన సమయం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్తం ఆరంభమునున్నట్టే ఉందా?
  • మేల్కొని ఉండాల్సిన నిజమైన అవసరం
  • లోకాంతం దగ్గర్లో ఉందా?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ‘మెలకువగా నుండుడి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/15 పేజీలు 4-7

ఇది మేల్కోవాల్సిన సమయం!

“మనం జీవిస్తున్న యుగాన్ని గురించి పొరపాటు పడకండి; ఇది మనం నిద్రమేలుకోవాల్సిన సమయం.” (రోమీయులు 13:11, నాక్స్‌) సా.శ. 70లో యూదా విధానం విపత్కరమైనరీతిలో అంతంకావడానికి దాదాపు 14 ఏళ్ల మునుపే రోములోని క్రైస్తవులకు పౌలు ఆ మాటల్ని రాశాడు. వాళ్లు ఆధ్యాత్మికంగా మేల్కొని ఉన్నారు గనుక, యూదా క్రైస్తవులు ఆ నిర్ణాయక కాలంలో యెరూషలేమును విడిచిపెట్టి వెళ్లిపోయారు, అందుకే వాళ్లు మరణాన్ని లేదా బానిసత్వాన్ని తప్పించుకున్నారు. అయితే, ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలనే విషయం వారికెలా తెలుసు?

శత్రువులు యెరూషలేమును చుట్టుముడతారనీ, దాని నివాసులు సమూలంగా నాశనం చేయబడతారనీ యేసుక్రీస్తు హెచ్చరించాడు. (లూకా 19:43, 44) అటు తర్వాత, యేసు తన నమ్మకమైన అనుచరులకు సంయుక్త సూచనను ఇచ్చాడు, దాన్ని గుర్తించడం అంత కష్టమేమీ కాదు. (లూకా 21:7-24) యెరూషలేములో నివసించిన క్రైస్తవులకైతే, నగరాన్ని విడిచిపెట్టడమంటే ఇళ్లనూ, వృత్తుల్నీ విడిచిపెట్టడమని అర్థం. అయినప్పటికీ, వాళ్లు చూపించిన జాగరూకతా, నగరాన్ని విడిచి తరలివెళ్లడమూ వాళ్ల ప్రాణాల్ని కాపాడాయి.

యెరూషలేము నాశనాన్ని యేసు ప్రవచించినప్పుడు, ఆయన శిష్యులు ఇలా అడిగారు: “ఆయన ఒలీవ కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి—ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి [“సూచన ఏది,” పరిశుద్ధ బైబిల్‌]?” (మత్తయి 24:3) తన ప్రత్యుత్తరంలో, నోవహు దినాల్లో భూగోళవ్యాప్తంగా వచ్చిన జలప్రళయానికి నడిపించిన కాలంతో తన భవిష్య ప్రత్యక్షతను యేసు పోల్చాడు. జలప్రళయం వచ్చి దుష్టుల్నందర్నీ తుడిచిపెట్టివేసిందని యేసు సూచించాడు. (మత్తయి 24:21, 37-39) ఆ విధంగా ఆయన, దేవుడు మరలా మానవ వ్యవహారాల్లో జోక్యంచేసుకోబోతున్నాడని సూచించాడు. ఎంతమేరకు? యావత్‌ దుష్టలోకాన్నీ లేదా దుష్ట విధానాన్నీ తొలగించేంత మేరకు! (పోల్చండి 2 పేతురు 3:5, 6.) మన కాలంలో అది సంభవిస్తుందా?

సమస్తం ఆరంభమునున్నట్టే ఉందా?

మొదటి శతాబ్దానికి చెందిన కొంతమంది యూదులు, తమ పరిశుద్ధ నగరమైన యెరూషలేము నాశనంకాదనే ఊహాలోకాల్లో ఎప్పుడూ తేలియాడేవారు. అగ్నిపర్వతానికి సమీపంగా ఉన్న ప్రాంతంలో జీవిస్తున్నప్పటికీ, అగ్నిపర్వతం బ్రద్దలవ్వడాన్ని చూడని ప్రజల్లో అలాంటి అపనమ్మకం తరచుగా కనబడుతుంది. హెచ్చరికలు వినబడుతున్నప్పుడు వచ్చే సామాన్యమైన ప్రతిస్పందన ఏమిటంటే “మా జీవితకాలంలో రాదులే.” “సాధారణంగా అగ్నిపర్వతాలు ప్రతి రెండు, మూడు శతాబ్దాలకు బ్రద్దలౌతాయి” అని అగ్నిపర్వత శాస్త్రజ్ఞుడు లొయ్‌నెల్‌ విల్సన్‌ వివరిస్తున్నాడు. “[అగ్నిపర్వతం] బ్రద్దలవ్వడం మూలంగా మీ తల్లిదండ్రులు మరోచోటికి తరలివెళ్లినట్లైతే మీరు దాన్ని గురించి చింతిస్తారు. కానీ అదే మీ తాతామామ్మలు తరలివెళ్లినట్లైతే, అప్పుడది [మీరు] ఓ కట్టుకథగానే తలస్తారు.”

అయినప్పటికీ ఖచ్చితమైన సమాచారం, అపాయ సంకేతాలను గుర్తించి, వాటిని గంభీరంగా తీసుకునేలా మనల్ని సంసిద్ధుల్ని చేయగలదు. పీలీ పర్వత ప్రాంతం నుండి తరలివెళ్లిపోయిన వాళ్లలో ఒకరికి అగ్నిపర్వతాలతో బాగా పరిచయముంది, అపాయ సంకేతాల్ని అవగాహనచేసుకున్నాడు. పినాటుబో అగ్నిపర్వతం బ్రద్దలవ్వడానికి కొద్దికాలం ముందు అలాంటి సంకేతాలు దేనికి దారితీస్తాయో నిర్దిష్టంగా వివరించడం జరిగింది. అగ్నిపర్వతంలోపల పైకి కనబడకుండా పేరుకుపోతున్న శక్తుల్ని పరిశీలించి కనిపెట్టే అగ్నిపర్వత శాస్త్రజ్ఞులు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేలా స్థానికులను ఒప్పింపచేశారు.

కొందరు అపాయ సంకేతాల్ని ఎల్లప్పుడూ అలక్ష్యంచేసి, ఏమీ జరగదులే అని సరిపుచ్చుకుంటారు. వాళ్లు, నిర్ణయాత్మకమైన చర్యను తీసుకున్న వారిని అపహసించవచ్చు కూడా. అలాంటి దృక్పథం మన కాలంలో సామాన్యమైన విషయమవుతుందని అపొస్తలుడైన పేతురు ప్రవచించాడు. ఆయనిలా తెలియజేశాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—ఆయన రాకడను [“ప్రత్యక్షతను,” NW] గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.”—2 పేతురు 3:3, 4.

మనం “అంత్యదినములలో” ఉన్నామని మీరు నమ్ముతారా? ది కొలంబియా హిస్టరీ ఆఫ్‌ ది వరల్డ్‌లో జాన్‌ ఎ. గారటె, పీటర్‌ గే ఇలా ప్రశ్నించారు: “మన నాగరికత చిన్నాభిన్నం కావడాన్ని మనం చూస్తున్నామా?” ఆ తర్వాత ఈ చరిత్రకారులు ప్రభుత్వ సమస్యల్నీ, భూగోళవ్యాప్తంగా పెరుగుతున్న నేరాల్నీ, శాసన ధిక్కారాలనూ, కుటుంబ జీవితం విచ్ఛిన్నంకావడాన్నీ, సమాజంలోని సమస్యల్ని పరిష్కరించడంలో సాంకేతిక విజ్ఞానశాస్త్రాలు పొందిన వైఫల్యాల్నీ, అధికార సంక్షోభాన్నీ, ప్రపంచవ్యాప్తంగా నైతిక పతనాన్నీ, మత సంబంధమైన పతనాన్నీ విశ్లేషించారు. వాళ్లిలా ముగించారు: “తప్పకరానై ఉన్న అంతానికివి సూచనలు కాకపోతే, ఆ సూచనలు ఖచ్చితంగా వీటినిపోలినవే అయివుంటాయి.”

‘అంతం’ రాబోతుందని నమ్మడానికి మనకు గట్టి కారణమే ఉంది. “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన [దేవుడు] దానిని పునాదులమీద స్థిరపరచెను” అని బైబిలు చెబుతోంది గనుక భూమి అంతమవుతుందని మనం భయపడాల్సిన అవసరంలేదు. (కీర్తన 104:5) అయినప్పటికీ, మానవజాతి అధికంగా బాధించబడడానికి కారణమైన దుష్ట విధానానికి అంతం త్వరలోనే వస్తుందని మనం ఎదురుచూడాలి. ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు తెలియజేసినట్టుగా, ఈ విధానపు అంత్యదినాల్ని గుర్తిస్తున్న అనేక సంఘటనలను మనం చూడవచ్చు. (“అంత్యదినాల్ని గూర్చిన కొన్ని సంఘటనలు” అనే బాక్సును చూడండి.) యేసు మాటల్ని ప్రపంచ సంఘటనలతో ఎందుకు పోల్చిచూడకూడదు? అలా చేయడం, మీకూ మీ కుటుంబానికీ సంబంధించి మీరు తెలివైన నిర్ణయాల్ని తీసుకునేలా సహాయపడవచ్చు. కానీ చర్యను ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి?

మేల్కొని ఉండాల్సిన నిజమైన అవసరం

అగ్నిపర్వతం త్వరలోనే బ్రద్దలవ్వబోతుందని బహుశా సైంటిస్టులకు తెలిసినప్పటికీ, అదెప్పుడు ప్రేలబోతుందో వాళ్లు ఖచ్చితంగా చెప్పలేరు. అదే విధంగా, ఈ విధానాంతాన్ని గూర్చి యేసు ఇలా తెలియజేశాడు: “ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:36) ప్రస్తుత విధానం ఖచ్చితంగా ఎప్పుడు అంతమౌతుందో మనకు తెలియదు గనుక, యేసు మనకీ హెచ్చరికను ఇచ్చాడు: “ఏ జామున దొంగవచ్చునో యంటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యంటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు [యేసు] వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.”—మత్తయి 24:43, 44.

ఈ విధానంపైకి రాబోతున్న వినాశనకరమైన అంతం, ఈ లోకాన్ని హఠాత్తుగా చుట్టుముడుతుంది. మనమాయన అనుచరులమైనప్పటికీ, ‘మనం సిద్ధంగా ఉన్నామని’ రుజువుచేసుకోవాల్సిన అవసరముంది. దొంగ ఎప్పుడొచ్చి తన ఇంటిని దోచుకుంటాడో తెలియని ఇంటి యజమాని పరిస్థితిని పోలి మన పరిస్థితి ఉంది.

అదే విధంగా, థెస్సలొనీకయలో ఉన్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. . . . సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.” పౌలు ఇలా ఉద్బోధించాడు: “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” (1 థెస్సలొనీకయులు 5:2, 4, 6) ‘మెలకువగా ఉండి మత్తులంకాకుండా ఉండడం’ అంటే అర్థమేమిటి?

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు తరలివెళ్లిపోవడంలో యెరూషలేమును విడిచిపెట్టడం చేరివున్నట్టుగా, మనం సురక్షితమైన చోటుకి తరలివెళ్లిపోవడంలో ఏదో ఒక నగరాన్ని విడిచిపెట్టడం చేరివుండదు. నిద్రలోనుండి మేల్కొనమని రోములో ఉన్న తన తోటి విశ్వాసులకు బోధించిన తర్వాత, పౌలు “అంధకార క్రియలను విసర్జించి,” “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొ”నమని వారికి ఉద్బోధించాడు. (రోమీయులు 13:12, 14) యేసు అడుగుజాడలయందు సన్నిహితంగా నడుచుకోవడం ద్వారా, ఈ కాలాల్లో మనం మేల్కొన్నామని చూపించుకుంటాం. ఈ ఆధ్యాత్మిక జాగరూకత, ప్రస్తుత దుష్టవిధానం అంతమయ్యేటప్పుడు మనం దైవిక కాపుదలను పొందేలా సాధ్యంచేస్తుంది.—1 పేతురు 2:21.

యేసుక్రీస్తును అనుసరించేవాళ్లు అర్థవంతమైన సంతృప్తికరమైన జీవితాల్ని అనుభవిస్తారు. క్రైస్తవ శిష్యరికమనే కాడి సుళువుగానూ, విశ్రాంతినిచ్చేదిగానూ ఉన్నట్టు లక్షలాదిమంది యెహోవాసాక్షులు కనుగొన్నారు. (మత్తయి 11:29, 30) శిష్యునిగా తయారవ్వడంలో చేరివున్న మొదటి అడుగు ఏమిటంటే ‘దేవుని గూర్చిన, ఆయన పంపించిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని గైకొనడమే.’ (యోహాను 17:3) “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము”ను సంపాదించేలా ప్రజలకు సహాయపడేందుకు ప్రతీవారమూ సాక్షులు లక్షలాది గృహాల్ని సందర్శిస్తుంటారు. (1 తిమోతి 2:4) మీ ఇంట్లోనే మీతో ఉచిత బైబిలు పఠనాల్ని నిర్వహించేందుకు వాళ్లు సంతోషిస్తారు. దేవుని వాక్యాన్ని గూర్చిన జ్ఞానంలో మీరు ఎదుగుతుండగా, మన దినాలు భిన్నమైనవని మీరు కూడా నిస్సందేహంగా ఒప్పించబడతారు. నిశ్చయంగా, ఇది నిద్రలోనుండి మేల్కొనడానికి ఆవశ్యకమైన సమయం!

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

అంత్యదినాల్ని గూర్చిన కొన్ని సంఘటనలు

“జనముమీదికి జనము . . . లేచును”; ‘భూలోకములో సమాధానము లేకుండ చేయబడును.’ (మత్తయి 24:7; ప్రకటన 6:4)

ఈ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలూ, వాటితోపాటూ జరిగిన అనేక ఇతర యుద్ధాలూ కలిసి భూమిపై సమాధానంలేకుండా చేశాయి. “మొదటి ప్రపంచ యుద్ధమూ, అలాగే రెండవ ప్రపంచ యుద్ధమూ గతంలో జరిగిన యుద్ధాలన్నింటికన్నా భిన్నంగా ఉన్నాయి, యుద్ధపరిధిలో, తీవ్రతలో, విస్తీర్ణతలో, ప్రాణాలకూ ఆస్తులకూ వాటిల్లిన ముప్పు విషయంలో ఎంతో భిన్నంగా ఉన్నాయి. . . . గతంలో జరిగిన ఏ యుద్ధాలకన్నా ప్రపంచ యుద్ధాలు అనేకమంది ప్రజల్ని పొట్టనబెట్టుకున్నాయి, సంపదను హరించివేశాయి, గతంలో జరిగిన ఏ యుద్ధంకన్నా ఇవి భూమ్మీద అనేక ప్రాంతాల్లో మరింత బాధను కలిగించాయి” అని చరిత్రకారుడైన జాన్‌ కీగన్‌ రాస్తున్నాడు. యుద్ధాలిప్పుడు సైనికులకన్నా ఎక్కువగా స్త్రీలనూ పిల్లల్నీ బాధిస్తున్నాయి. గత పదేళ్లకాలంలో, యుద్ధాల్లో ఇరవై లక్షల మంది పిల్లలు చనిపోయారని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

“కరవులు” (మత్తయి 24:8; ప్రకటన 6:5, 6, 8)

1996లో జొన్న, గోధుమల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కారణం? ప్రపంచంలో ధాన్యాల నిల్వలు, 50 రోజులకు మాత్రమే సరఫరా చేయగల్గేంత స్థాయికి పడిపోయాయి. ఇంతవరకూ నమోదైన వాటిలో ఇది అతి తక్కువ. కనీస ఆహారపదార్థాల ధరలు పెరిగిపోవడమంటే బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాదిమంది ప్రజలు కడుపులోకాళ్లు పెట్టుకొని పడుకోవడమేనన్నమాట. వారిలో ఎక్కువమంది పిల్లలే.

‘అక్కడక్కడ . . . భూకంపములు కలుగును’ (మత్తయి 24:8)

గత 2,500 ఏళ్ల కాలంలో, 1,00,000కన్నా ఎక్కువమందిని పొట్టనపెట్టుకున్న భూకంపాలు తొమ్మిది జరిగాయి. వాటిలో నాలుగు 1914 తర్వాత నుండి ఇప్పటివరకూ జరిగాయి.

‘అక్రమము విస్తరించడం’ (మత్తయి 24:12)

20వ శతాబ్దం ముగిసిపోతుండగా, అక్రమము లేదా చట్టాన్ని అతిక్రమించడం అనేది అంతకంతకూ పెరిగిపోయింది. సామాన్య పౌరులపై టెర్రరిస్టులు చేసే దాడులూ, దయాదాక్షిణ్యాల్లేని హంతకులూ, సామూహిక హత్యలూ అనేవి ఈ హింసాత్మకపు అంత్య దినాల యొక్క భయానకమైన అంశాల్లో చేరివున్నాయి.

“అక్కడక్కడ . . . తెగుళ్లు . . . తటస్థించును” (లూకా 21:11)

ఈ 1990లలో, క్షయవ్యాధి మూలంగా 3 కోట్లమంది ప్రజలు చనిపోయే అవకాశముంది. వ్యాధిని వ్యాపింపచేసే సూక్ష్మజీవులు మందులకు లొంగకుండా నానాటికీ మొండికెత్తుతున్నాయి. మరొక ప్రాణాంతక రోగమైన మలేరియా ప్రతీ సంవత్సరమూ 30 నుండి 50 కోట్లమంది ప్రజల్ని ముప్పుతిప్పలు పెట్టి, 20 లక్షలమంది ప్రాణాల్ని బలిగొంటుంది. ఈ దశాబ్దాంతానికల్లా, ఎయిడ్స్‌ సంవత్సరానికి 18 లక్షల మరణాలకు కారణంకాగలదని అంచనావేయబడింది. “నేడు మానవజాతి మహామారితో సతమతమౌ”తోందని స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ 1996 ప్రకటిస్తోంది.

“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:14)

1997లో యెహోవాసాక్షులు, రాజ్య సువార్తను ప్రకటించడంలో 100కోట్లకన్నా ఎక్కువ గంటల్ని వెచ్చించారు. యాభై లక్షలకన్నా ఎక్కువమంది సాక్షులు 232 దేశాల్లో ఉన్న ప్రజలకు క్రమంగా ఈ సందేశాన్ని తీసుకెళుతున్నారు.

[క్రెడిట్‌ లైను]

FAO photo/B. Imevbore

U.S. Coast Guard photo

[4, 5వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నందుననే వాళ్లు యెరూషలేము నుండి తరలి వెళ్లిపోయారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి