మన కాలాల్లో మీరు మేల్కొని ఉన్నారా?
అపాయాన్ని చూసి మేల్కోవడమనేది, చావు బ్రదుకులను నిర్ణయించగలదు. అగ్ని పర్వతాలున్న రెండు ద్వీపాల్లో జరిగినదానితో దీన్ని ఉదహరించవచ్చు.
కరేబియన్ సముద్రంలోని మార్టినిక్ ద్వీపంలో ఉన్న పీలీ పర్వతం, 20వ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతమని పేరుగాంచింది. ఆ అగ్ని పర్వతం మే 8, 1902న బ్రద్దలైంది. ఆ అగ్ని పర్వతపు పాదపీఠం దగ్గర ఉన్న నగరమైన సెయింట్ పియర్‌లో నివసిస్తున్న దాదాపు 30,000 మందినది పొట్టనపెట్టుకుంది.
జూన్ 1991లో, పినాటుబో అగ్నిపర్వతం బ్రద్దలైంది. అది ఈ శతాబ్దంలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటాల్లోకెల్లా అతి పెద్ద విస్ఫోటమై ఉండొచ్చు. ఈ విస్ఫోటం, ఫిలిప్పైన్స్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగింది, దాదాపు 900 మంది ప్రాణాల్ని బలిగొంది. అయితే, ఈసారి రెండు కారకాలు అంటే (1) అపాయాన్ని చూసి మేల్కోవడం (2) హెచ్చరికలకు అనుగుణంగా చర్య తీసుకోవడానికి సుముఖత చూపించడం అనే కారకాలు, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వేలాదిమందికి సహాయపడ్డాయి.
సమయానికి తగ్గ చర్యను తీసుకోవడం ప్రాణాలను కాపాడింది
1991 ఏప్రిల్ నెలలో పినాటుబో అగ్నిపర్వతం నుండి ముంచుకురానైవున్న ఉపద్రవానికి సంబంధించిన సూచనలు కనిపించనారంభించాయి. అప్పటికి వందలాది సంవత్సరాలనుండి అది నిద్రాణంగా ఉంది. ఆవిర్లూ, సల్ఫర్‌డయాక్సైడూ అగ్నిపర్వతపు శిఖరంనుండి వెలువడనారంభించాయి. భూమి అదే పనిగా కంపిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. రాబోతున్న నాశనాన్ని సూచించే లావా అంటే ఘనరూపంలో ఉన్న లావా పర్వతంలోనుండి పైకి తన్నుకురావడం మొదలుపెట్టింది. ఫిలిప్పైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వొల్కనాలజీ అండ్ సెసిమోలజీ ఇన్‌స్టిట్యూట్ నుండి వచ్చిన సైంటిస్టులు అగ్నిపర్వతపు పోకడల్ని చాలా జాగ్రత్తగా గమనించి, దానికి సమీపంలో ఉన్న పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ నివసిస్తున్న 35,000 మందినీ ఖాళీచేయించడం మంచిదని సకాలంలో అధికారులను ఒప్పింపచేశారు.
ప్రజలు తమ ఇళ్లను అకారణంగా విడిచి మరోచోటికి తరలి వెళ్లడానికి అంతగా సమ్మతించకపోవడం అర్థంచేసుకోదగిన విషయమే అయినా, అగ్నిపర్వతం బ్రద్దలవ్వడం మూలంగా వాటిల్లే నష్టాలను స్పష్టంగా తెలియజేసే వీడియో చిత్రాన్ని చూపించడం ద్వారా ఆ అసమ్మతిని అధిగమించారు. సరియైన సమయంలోనే జనాలు తరలి వెళ్లారు. వాళ్లా ప్రాంతాన్ని విడిచిన రెండు రోజులకి, అగ్నిపర్వతం ఒక్కసారిగా బ్రద్దలైపోయింది, దాన్లో నుండి 8 క్యూబిక్ కిలోమీటర్ల బూడిద ఉవ్వెత్తున పైకి ఎగిసిపడింది. అగ్నిపర్వతం నుండి వెలువడ్డ బురద ప్రవాహాలూ, లేదా లహార్‌లూ వందలాదిమందిని కబళించాయి. అయినా, ప్రజలు రానైవున్న అపాయానికి అప్రమత్తులై, హెచ్చరికలకు అనుగుణంగా చర్య తీసుకున్నందున వేలాదిమంది తప్పించుకున్నారు.
మానవ నిర్మిత విపత్తు నుండి తప్పించుకోవడం
మన సామాన్య శకపు మొదటి శతాబ్దంలో, యెరూషలేములో జీవిస్తున్న క్రైస్తవులు కూడా తమ ఇళ్లను విడిచిపెట్టాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. సా.శ. 66లో ఆ నగరాన్నుండి పారిపోవడం, ఆ నగరంలో ఉన్న ఇతర నివాసులపైకీ, సా.శ. 70లో పస్కాపండుగ కోసం యెరూషలేముకి వచ్చిన వేలాదిమంది యూదులపైకీ వచ్చిన నాశనం నుండి వారిని కాపాడింది. తప్పించుకోడానికి ఏ మాత్రం ఆస్కారంలేని రీతిలో రోమా సైన్యాలు చుట్టూ గోడలతో ఉన్న యెరూషలేము నగరాన్ని ముట్టడించినప్పుడు, పస్కా ఆచరణకోసం వచ్చిన పది లక్షలమంది కన్నా ఎక్కువమంది ప్రజలు ఆ నగరంలోనే ఉన్నారు. క్షామమూ, అధికారం కోసం సాగించే పోరాటాలూ, రోమన్ల పట్టువీడని దాడులూ కలిసి పది లక్షలకన్నా ఎక్కువమంది ప్రాణాల్ని బలిగొన్నాయి.
రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన యూదా తిరుగుబాటును అణచివేసిన విపత్తు, అకస్మాత్తుగా వచ్చిందికాదు. కొన్ని దశాబ్దాల క్రిందటే, యెరూషలేము ముట్టడివేయబడుతుందని యేసుక్రీస్తు ప్రవచించాడు. ఆయనిలా తెలియజేశాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:20, 21) ఆ సూచనలు స్పష్టంగా ఉన్నాయి, యేసు అనుచరులు వాటిని గంభీరంగా తీసుకున్నారు.
యూదయలో ఉన్న క్రైస్తవులందరూ యేసు ఇచ్చిన హెచ్చరికకు అనుగుణంగా పనిచేశారని నాల్గవ శతాబ్దానికి చెందిన చరిత్రకారుడూ, కైసరయకు చెందినవాడూ అయిన యూసీబియస్ నివేదించాడు. సా.శ. 66లో యెరూషలేముపై చేసిన తమ మొదటి దాడిని రోమన్లు మధ్యలో విడిచిపెట్టినప్పుడు, పెరయా అనే రోమా రాష్ట్రంలో ఉన్న పెల్లా అను అన్య పట్టణంలో నివసించడానికి అనేకమంది యూదా క్రైస్తవులు తరలి వెళ్లిపోయారు. తమ కాలంనాటి పరిస్థితులకు మేల్కొనడం ద్వారా, యేసుక్రీస్తు ఇచ్చిన హెచ్చరికకు అనుగుణంగా పనిచేయడం ద్వారా, వాళ్లు “చరిత్రయంతటిలో అత్యంత దారుణమైన దాడుల్లో ఒకటి”గా వర్ణించబడిన దానినుండి తప్పించుకున్నారు.
నేడు కూడా అలాంటి జాగరూకతే అవసరం. అలాగే నిర్దిష్టమైన చర్య కూడా. అలా ఎందుకు చేయాలనే విషయాన్ని గురించి దీని తర్వాతి శీర్షిక వివరిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Godo-Foto, West Stock