సామ్రాజ్యాన్ని కోల్పోయిన గర్విష్ఠి పరిపాలకుడు
“రాజగు బెల్షస్సరు తన అధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందు చేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను” అని ప్రవక్తయైన దానియేలు వ్రాశాడు. అయితే, విందు జరుగుతుండగా రాజు “ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు కదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.” ఆ రాత్రి తెల్లవారకముందే, “కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు . . . సింహాసనమునెక్కెను.”—దానియేలు 5:1, 6, 30, 31.
ఎవరీ బెల్షస్సరు? ఆయనకు ‘కల్దీయుల రాజు’ అన్న పేరు ఎలా వచ్చింది? నూతన-బబులోను సామ్రాజ్యంలో ఆయన స్థానం ఏమిటసలు? ఆయన సామ్రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు?
సహపరిపాలకుడా లేక రాజా?
బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు అని దానియేలు చెబుతున్నాడు. (దానియేలు 5:2, 11, 18, 22) అయితే ఈ సంబంధం అక్షరార్థం కాదు. రేమండ్ పి. డౌహర్టీ వ్రాసిన నెబోనైడస్ అండ్ బెల్షస్సర్ అనే పుస్తకం, నెబుకద్నెజరు బహుశ బెల్షస్సరు తాత అయివుంటాడని, ఆయన కూతురైన నైటోక్రిస్ బెల్షస్సరుకు తల్లి అని సూచిస్తుంది. నెబుకద్నెజరు మునుపు రాజు అయ్యుండడం మూలాన కూడా ఆయన బెల్షస్సరుకు సింహాసన వారసత్వ దృష్ట్యా “తండ్రి” అయివుండవచ్చు. (ఆదికాండము 28:10, 13 పోల్చండి.) ఏదేమైనా, 19వ శతాబ్దంలో దక్షిణ ఇరాక్‌లో దొరికిన మట్టి ఫలకాలపై క్యూనిఫామ్లిపిలో ఉన్న మాటలు ఈ బెల్షస్సరు, బబులోను రాజైన నెబోనైడస్ జ్యేష్ఠ కుమారుడని గుర్తిస్తున్నాయి.
దానియేలు 5వ అధ్యాయంలోని వృత్తాంతం సా.శ.పూ. 539లో బబులోను పతనమైన రాత్రి జరిగిన సంఘటనలపై దృష్టి కేంద్రీకరిస్తుంది గనుక, అది బెల్షస్సరు రాచరిక అధికారానికి ఎలా వచ్చాడన్నది వివరించడం లేదు. కానీ నెబోనైడస్కూ బెల్షస్సరుకూ మధ్యనున్న సంబంధం గురించి పురాతత్వ సంబంధ ఆధారాలు కొంత అవగాహనను అందిస్తున్నాయి. “నెబోనైడస్ ఒక విపరీతపు పరిపాలకుడు అని బబులోను వ్రాతలు తెలియజేస్తున్నాయి” అని ప్రాచీన సెమిటిక్ భాషలపైని అధికారి, పురాతత్వ శాస్త్రజ్ఞుడైన ఆలన్ మిల్లర్డ్ అంటున్నాడు. మిల్లర్డ్ ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఆయన బబులోను దేవతలను అలక్ష్యం చేయకపోయినప్పటికీ, . . . మిగతా రెండు నగరాలైన ఉర్, హారాన్లలో చంద్ర దేవునికి చాలా ఎక్కువ అవధానాన్ని ఇచ్చాడు. తన పరిపాలనలో చాలా సంవత్సరాలు నెబోనైడస్ బబులోనులో నివసించలేదు; బదులుగా ఆయన సుదూరాన ఉత్తర అరేబియాలో టైమా [లేక, టేమా]లోని ఒయాసిస్సువద్ద నివసించాడు.” నెబోనైడస్ తన పరిపాలనలో చాలా సమయాన్ని రాజధాని నగరమైన బబులోనుకు దూరంగా గడిపాడన్నది స్పష్టమౌతుంది. ఆయన లేని సమయాల్లో రాజ్య పరిపాలనాధికారం బెల్షస్సరుకు ఇవ్వబడింది.
బెల్షస్సరు అసలు స్థానం ఏమిటన్న దానిపై మరింత వెలుగును ప్రసరింపజేస్తూ, “నెబోనైడస్ పద్య వృత్తాంతం” అని పిలువబడుతున్న క్యూనిఫామ్లిపిలోని ఒక ఫలకం ఇలా చెబుతుంది: “ఆయన [నెబోనైడస్] తన ‘దండును’ ప్రథమ సంతానానికి, తన జ్యేష్ఠ (కుమారుని) చేతికి అప్పగించాడు, దేశంలోని సైన్యాన్నంతటినీ ఆయన అతని ఆధీనం చేశాడు. ఆయన (అంతటినీ) అప్పగించేశాడు, [తన] రాచరికాన్ని అతనికి ధారపోశాడు.” ఆ విధంగా బెల్షస్సరు సహపరిపాలకుడయ్యాడు.
అయితే, ఒక సహపరిపాలకుడిని రాజుగా పరిగణించవచ్చా? 1970లలో ఉత్తర సిరియాలో దొరికిన ప్రాచీన పరిపాలకుని విగ్రహం ఒకటి, ఒక పరిపాలకునికి నిజానికి చూస్తే తక్కువ హోదా ఉన్నప్పటికీ అతడిని రాజు అని పిలవడం అసాధారణమైన విషయమేమీ కాదని చూపిస్తుంది. ఆ విగ్రహం గోజాన్ పరిపాలకుడిది, దానిపైన అస్సీరియా లిపిలోనూ, అరామిక్ లిపిలోను వ్రాతలు ఉన్నాయి. అస్సీరియా లిపిలో వ్రాయబడిన మాటలు ఆ వ్యక్తిని గోజాన్ పరిపాలకుడు అని పిలిచాయి, కానీ దానికి సమాంతరంగా ఆ ప్రక్కనే ఉన్న అరామిక్ లిపి ఆయన్ను రాజు అని పిలిచింది. అందుకని, అరామిక్ లిపిలోని దానియేలు వ్రాతలు బెల్షస్సరును రాజు అని పిలిచినప్పటికీ, బబులోను అధికారిక వ్రాతలు ఆయన్ను యువరాజు అని పిలవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.
నెబోనైడస్ బెల్షస్సరుల ఉమ్మడి పరిపాలనా ఏర్పాటు నూతన-బబులోను సామ్రాజ్యం చివరి రోజుల వరకూ కొనసాగింది. అందుకే బబులోను పతనమైన రాత్రి బెల్షస్సరు దానియేలును రాజ్యానికి మూడవ అధిపతిగా చేయడానికి ప్రతిపాదించాడు, రెండవ అధిపతిగా కాదు.—దానియేలు 5:16.
మితిమీరిన ఆత్మవిశ్వాసంగల గర్విష్ఠి పరిపాలకుడు
బెల్షస్సరు పరిపాలనలోని చివరి గడియల్లో జరిగిన సంఘటనలు సహపరిపాలకుడిగా ఉన్న ఈ యువరాజు మితిమీరిన ఆత్మవిశ్వాసం గలవాడని గర్విష్ఠి అని సూచిస్తున్నాయి. సా.శ.పూ. 539లో అక్టోబరు 5న నెబోనైడస్ పరిపాలనకు అంతం వచ్చిన సమయంలో నెబోనైడస్ మాదీయ-పారసీక బలగాలతో తలపడి, ఓటమిని చవిచూసి, బొర్సిప్పాలో తలదాచుకుంటున్నాడు. ఇటు చూస్తే బబులోను కూడా ముట్టడికి గురైంది. కానీ, ఆ నగరం చుట్టూ ఉన్న భారీ గోడల నడుమ ఉన్న బెల్షస్సరు తాను ఎంత భద్రతా భావంతో ఉన్నాడంటే, ఆ రాత్రి ఆయన “తన అధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందు” ఏర్పాటు చేసి ఉన్నాడు. సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన గ్రీకు చరిత్రకారుడైన హెరోడోటస్, నగరంలోపలి ప్రజలు “ఆ సమయంలో నాట్యమాడుతూ, ఆనంద డోలికల్లో తేలియాడుతూ” ఉన్నారని చెబుతున్నాడు.
అయితే, బబులోను గోడల వెలుపల మాత్రం మాదీయ-పారసీక సైన్యం చాలా చురుకుగా ఉంది. కోరేషు నాయకత్వం క్రింద ఆ సైన్యం నగరం మధ్యగా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నదీజలాల్ని దారిమళ్లించింది. నీటి మట్టం తగ్గిన వెంటనే ఆయన సైన్యం నీళ్ళల్లో నేలమీద నడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధంగా ఉంది. వారు నదీ తీరం వెంబడి ఉన్న గోడమీది తెరచివున్న రాగి తలుపుల వరకు నడుచుకుంటూ వెళ్లి గట్టుని ఎక్కి లోపలికి ప్రవేశించారు.
నగరం బయట జరుగుతున్న ఈ కార్యకలాపాల్ని బెల్షస్సరు గమనించి ఉంటే ఆయన ఆ రాగి ద్వారాలను మూసివేయించేవాడు, తన బలశాలురను నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న గోడలపై నిలబెట్టేవాడు, తద్వారా శత్రువుల్ని ఉచ్చులో బిగించేవాడు. దానికి విరుద్ధంగా, మద్యం మత్తులో అహంకారియైన బెల్షస్సరు యెహోవా దేవాలయంలోని పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు, ఆయనా ఆయన అతిథులు, ఆయన భార్యలు, ఆయన ఉపపత్నులు బబులోను దేవతలను స్తుతిస్తూ ధిక్కారపూర్వకంగా ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసుకుని త్రాగారు. అకస్మాత్తుగా, అద్భుతరీతిన ఒక హస్తం ప్రత్యక్షమై ఆ రాజభవనం గోడపైన వ్రాయడం ప్రారంభించింది. భయవిహ్వలుడైన బెల్షస్సరు బబులోనులోని జ్ఞానులను పిలిపించి ఆ సందేశ భావాన్ని తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ “ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.” చివరికి, వారు దానియేలును “పిలువనంపించిరి.” దైవిక ప్రేరేపణ క్రింద, నిర్భయుడైన ఈ యెహోవా ప్రవక్త ఆ అద్భుత సందేశ భావాన్ని వెల్లడిచేశాడు, బబులోను మాదీయ పారసీకుల చేతిలో పతనమౌతుందని ప్రవచించాడు.—దానియేలు 5:2-28.
మాదీయులు పారసీకులు నగరాన్ని సులభంగానే వశం చేసుకున్నారు, బెల్షస్సరుకు మాత్రం ఆ రాత్రి తెల్లవారలేదు. ఆయన మరణంతోనూ, నెబోనైడస్ కోరేషుకు ప్రత్యక్షంగా లొంగిపోవడంతోనూ నూతన-బబులోను సామ్రాజ్యానికి తెల్లవారిపోయింది.
[8వ పేజీలోని చిత్రం]
దానియేలు బబులోను సామ్రాజ్య నాశన సందేశ భావాన్ని తెలియజేస్తున్నాడు