కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/1 పేజీలు 4-7
  • మీ మనస్సాక్షిని మీరు నమ్మగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ మనస్సాక్షిని మీరు నమ్మగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనస్సాక్షికి తర్ఫీదివ్వడం
  • దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడడం
  • మనస్సాక్షికి తర్ఫీదునిచ్చేందుకు సహాయకం
  • “క్రీస్తు మనస్సును” సంపాదించుకోవడం
  • తర్ఫీదుపొందిన మనస్సాక్షి నుండి ప్రయోజనం పొందడం
  • మీరెలా మంచి మనస్సాక్షితో ఉండవచ్చు?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • మీ మనస్సాక్షి సుశిక్షితమైనదేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని ముందు మంచి మనస్సాక్షితో ఉండండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మీ మనస్సాక్షి చెప్పేది వినండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/1 పేజీలు 4-7

మీ మనస్సాక్షిని మీరు నమ్మగలరా?

సాధారణ పరిస్థితుల్లో, దిక్సూచి నమ్మదగిన పరికరం. దాని సూచి, భూ అయస్కాంత క్షేత్రంచేత నిర్దేశించబడినదై ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును చూపిస్తుంది. కాబట్టి మార్గనిర్దేశక సరిహద్దు గుర్తులు లేనప్పుడు ప్రయాణికులు మార్గనిర్దేశం కొరకు దిక్సూచిపై ఆధారపడవచ్చు. కాని దిక్సూచికి సమీపంలో ఒక అయస్కాంత పరికరాన్ని ఉంచినప్పుడు ఏమి జరుగుతుంది? సూచి ఉత్తరదిక్కును చూపించే బదులు అయస్కాంతంవైపుకు తిరుగుతుంది. అదిక ఎంతమాత్రం నమ్ముకొనదగిన మార్గనిర్దేశం కాదు.

మానవ మనస్సాక్షికి కూడా అటువంటిదే సంభవించవచ్చు. నమ్ముకొనదగిన మార్గనిర్దేశంగా ఉండేలా సృష్టికర్త మనలో ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని ఉంచాడు. మనం దేవుని స్వరూపమందు చేయబడ్డాము గనుక, మనం నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మనస్సాక్షి మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలోనే నడిపించాలి. దేవుని నైతిక ప్రమాణాలను ప్రతిఫలింపజేసేందుకు అది మనల్ని పురికొల్పాలి. (ఆదికాండము 1:27) తరచూ అది అలాగే చేస్తుంది. ఉదాహరణకు, బయల్పర్చబడిన దేవుని ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కొందరు “స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను” చేస్తారని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఎందుకు? ఎందుకంటే, ‘అట్టివారి మనస్సాక్షి వారికి సాక్ష్యమిస్తోంది.’—రోమీయులు 2:14, 15.

అయినప్పటికీ, మనస్సాక్షి తాను ప్రతిస్పందించవలసిన ప్రతిసారీ తప్పక ప్రతిస్పందిస్తుందని చెప్పలేము. మానవ అపరిపూర్ణత మూలంగా, మనకు తప్పు అని తెలిసిన వాటిని చేయడానికి మనం మొగ్గుచూపిస్తాము. “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది” అని పౌలు అంగీకరించాడు. (రోమీయులు 7:22, 23) మనం చాలా తరచుగా తప్పుడు కోరికలకు లొంగిపోతుంటే, క్రమంగా మన మనస్సాక్షి చచ్చుబడిపోయి, చివరికి అలాంటి ప్రవర్తన తప్పు అని మనకు చెప్పడాన్ని మానుకుంటుంది.

అయితే మనం అపరిపూర్ణులమైనప్పటికీ, మనం మన మనస్సాక్షిని దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా మలుచుకోవచ్చు. వాస్తవానికి, మనమలా చేయడం ప్రాముఖ్యం. చక్కగా తర్ఫీదివ్వబడిన నిర్మలమైన మనస్సాక్షి, దేవునితో వాత్సల్యపూరితమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని కల్గివుండడానికి నడిపిస్తుంది, అంతేగాక మన రక్షణకు అది ఆవశ్యకము. (హెబ్రీయులు 10:22; 1 పేతురు 1:15, 16) అంతేగాక, మన శాంతి సంతోషాలకు దోహదపడేలా మన జీవితంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది. అలాంటి మనస్సాక్షి ఉన్నవారి గురించి కీర్తనల గ్రంథకర్త ఇలా చెప్పాడు: “వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది. వారి అడుగులు జారవు.”—కీర్తన 37:31.

మనస్సాక్షికి తర్ఫీదివ్వడం

మనస్సాక్షికి తర్ఫీదివ్వడంలో, కేవలం ఒక సూత్రాల పట్టికను బట్టీపట్టి, వాటికి కచ్చితంగా కట్టుబడి ఉండడం కంటే ఎక్కువే ఇమిడివుంది. యేసు కాలంనాటి పరిసయ్యులు చేసిందదే. ఈ మత నాయకులకు ధర్మశాస్త్రం తెలుసు, ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉండేందుకు ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు అనేకమైన ఆచారాలను పెంపొందింపజేశారు. అందుకే, యేసు శిష్యులు విశ్రాంతి దినాన వెన్నులు త్రుంచి తిన్నప్పుడు వారు వెంటనే అసమ్మతిని తెలియజేశారు. విశ్రాంతి దినాన ఒక వ్యక్తి ఊచ చేతిని యేసు స్వస్థపర్చినప్పుడు వారు యేసును సవాలు చేశారు. (మత్తయి 12:1, 2, 9, 10) పరిసయ్యుల ఆచారం ప్రకారం ఈ రెండు చర్యలూ నాలుగవ ఆజ్ఞను అతిక్రమించినట్లే.—నిర్గమకాండము 20:8-11.

పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పఠించారన్నది సుస్పష్టమే. కానీ వారి మనస్సాక్షులు దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా మలచబడ్డాయా? ఎంతమాత్రం మలచబడలేదు! అంతెందుకు, విశ్రాంతిదిన ఆచారాన్ని ఘోరంగా అతిక్రమించడమని వారు భావించిన దాని గురించి విమర్శించిన కొంతసేపటికే, యేసును “ఏలాగు సంహరింతుమా” అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. (మత్తయి 12:14) ఒక్కసారి ఆలోచించండి—స్వనీతిమంతులైన ఈ మతనాయకులు, విశ్రాంతి దినాన తాజా వెన్నులను తెంపుకుని తినడం, స్వస్థపర్చడం అనే తలంపునే భరించలేకపోయారు; కాని యేసును సంహరించడానికి పథకాలు వేసేందుకు మాత్రం వారికి ఏ అభ్యంతరమూ లేకపోయింది!

ప్రధాన యాజకులు అదేవిధమైన వక్ర ఆలోచనా విధానాన్ని కనబర్చారు. భ్రష్టులైన ఈ వ్యక్తులు, యేసును అప్పగించడానికి ఆలయ ధనాగారంలో నుండి 30 వెండి నాణెములను యూదాకు ఇవ్వడం తప్పని ఏమాత్రం అనుకోలేదు. కాని యూదా ఆ డబ్బును ఆలయంలో పారవేయడంతో ఆ డబ్బు అనుకోనిరీతిగా తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రధాన యాజకుల మనస్సాక్షులు న్యాయపర సందిగ్ధంలో పడ్డాయి. “ఇవి [నాణెములు] రక్తక్రయధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయతగదని” వారు అన్నారు. (మత్తయి 27:3-6) యూదా డబ్బు ఇప్పుడు అపవిత్రమైనదని ప్రధాన యాజకులు చింతించారని స్పష్టమౌతుంది. (ద్వితీయోపదేశకాండము 23:18 పోల్చండి.) అయితే ఈ వ్యక్తులే, దేవుని కుమారుడ్ని అప్పగించడానికి ఆ డబ్బును మూల్యంగా చెల్లించడం తప్పని ఎంతమాత్రం తలంచలేదు!

దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడడం

మనస్సాక్షికి తర్ఫీదివ్వడంలో, చేయవలసిన లేక చేయకూడని సూత్రాల పట్టికతో మన మనస్సును నింపుకోవడం కంటే ఎక్కువే ఇమిడివుందని పై ఉదాహరణలు చూపిస్తున్నాయి. నిజమే, దేవుని సూత్రాలను గూర్చిన జ్ఞానం అవసరమే, రక్షణ కొరకు వాటికి విధేయత చూపించడం కూడా అవసరమే. (కీర్తన 19:7-11) అయితే, దేవుని సూత్రాల గురించి తెలుసుకోవడం మాత్రమే గాక, మన హృదయం దేవుని ఆలోచనా విధానంతో శృతిచేయబడాలి. అప్పుడు, యెషయా ద్వారా యెహోవా చేసిన ఈ ప్రవచన నెరవేర్పును మనం అనుభవిస్తాం, అదిలా చెబుతుంది: “కన్నులార నీ బోధకులను [“మహా బోధకుని,” NW] చూచెదవు. మీరు కుడి తట్టయనను ఎడమ తట్టయనను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”—యెషయా 30:20, 21; 48:17.

నిజమే, మనం ఏదైనా గంభీరమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ఏమి చేయాలనేదాన్ని అక్షరార్థంగా ఒక స్వరం మనకు చెబుతుందని దీని భావం కాదనుకోండి. అయితే, మన ఆలోచనా విధానం దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడినప్పుడు, ఆయనకు ప్రీతికరమైన నిర్ణయాలు తీసుకునేందుకు మనకు సహాయం చేయడానికి మన మనస్సాక్షి చక్కగా సంసిద్ధమై ఉంటుంది.—సామెతలు 27:11.

సా.శ.పూ. 18వ శతాబ్దంలో జీవించిన యోసేపు విషయాన్నే తీసుకోండి. తనతో శయనించమని పోతిఫరు భార్య యోసేపును కోరినప్పుడు, “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” చెబుతూ ఆయన దానికి నిరాకరించాడు. (ఆదికాండము 39:9) యోసేపు కాలంలో, వ్యభిచారాన్ని ఖండించే దేవుని వ్రాతపూర్వక ధర్మశాస్త్రం ఏదీ లేదు. అంతేగాక, యోసేపు కుటుంబ క్రమశిక్షణకు లేక పిత్రాచార కట్టడలకు ఎంతో దూరంగా ఐగుప్తులో నివసిస్తున్నాడు. ఆ ప్రలోభానికి లొంగిపోకుండా ఉండడానికి యోసేపుకు ఏది సహాయం చేసింది? ఒక్కమాటలో చెప్పాలంటే, తర్ఫీదు పొందిన ఆయన మనస్సాక్షే అలా సహాయం చేసింది. భార్యాభర్తలు “ఏక శరీరమై” ఉండాలనే దేవుని దృక్కోణాన్ని యోసేపు అలవర్చుకున్నాడు. (ఆదికాండము 2:24) కాబట్టి మరో పురుషుని భార్యను తీసుకోవడం తప్పవుతుందని ఆయన గ్రహించాడు. యోసేపు ఆలోచనా విధానం దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడింది. ఆయన దృష్టిలో వ్యభిచారం నైతిక విలువలకు విరుద్ధమైనది.

ఈరోజు, యోసేపులాంటి వారు చాలా తక్కువమంది ఉన్నారు. లైంగిక దుర్నీతి విస్తృతంగా పెరిగింది, అనేకులు తమ సృష్టికర్త పట్ల, తమ పట్ల, లేక చివరికి తమ వివాహ జత పట్ల నైతిక పరిశుభ్రతను కాపాడుకోవలసిన బాధ్యత తమకుందని అనుకోరు. పరిస్థితి చాలావరకు, “నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చత్తాపపడువాడొకడును లేకపోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు” అని యిర్మీయా గ్రంథంలో వర్ణించబడినట్లుగానే ఉంది. (యిర్మీయా 8:6) కాబట్టి, దేవుని ఆలోచనా విధానంతో శృతి కలపవలసిన అవసరత మనకు మునుపెన్నటికన్నా నేడు ఎక్కువగా ఉంది. మనమలా చేయడానికి మనకు సహాయం చేసేందుకు ఒక అద్భుతమైన ఏర్పాటు ఉంది.

మనస్సాక్షికి తర్ఫీదునిచ్చేందుకు సహాయకం

ప్రేరేపిత లేఖనాలు, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు . . . ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్న[వి].” (2 తిమోతి 3:16, 17) తప్పొప్పులను గ్రహించగలిగేలా, మన “జ్ఞానేంద్రియములు” అని బైబిలు చెబుతున్న వాటికి తర్ఫీదునిచ్చేందుకు బైబిలు పఠనం మనకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 5:14) దేవుడు ప్రేమించేవాటి పట్ల ప్రేమనూ ఆయన ద్వేషించేవాటి పట్ల ఏహ్యాన్నీ ఏర్పరచుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.—కీర్తన 97:10; 139:21.

కాబట్టి బైబిలు పఠనం యొక్క లక్ష్యం ఏమిటంటే, బైబిలును గూర్చిన వివరమైన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడమే కాదు గానీ, సత్యం యొక్క పరమార్థాన్నీ, మూలాంశాన్నీ గ్రహించడమే. కావలికోట 1976 సెప్టెంబరు 1వ సంచిక ఇలా చెప్పింది: “మనం లేఖనాల్ని పఠించేటప్పుడు, మనం దేవుని నీతి న్యాయ ప్రేమల పరమార్థాన్ని గ్రహించి, అవి ఆహారం తీసుకోవడంలా శ్వాసించడంలా మనలో ఒక భాగమైపోయేలా మన హృదయాల్లో లోతుగా నాటుకుపోయేందుకు మనం కృషి చేయాలి. తప్పొప్పుల గురించి సునిశితమైన అవగాహనను ఏర్పరచుకోవడం ద్వారా నైతిక బాధ్యతను పూర్తిగా గ్రహించేందుకు మనం ప్రయత్నించాలి. దీనికంటే ముఖ్యంగా, మన మనస్సాక్షి పరిపూర్ణ శాసకుడు, న్యాయాధిపతి అయిన వాని ఎదుట తన బాధ్యతను గుర్తించగలిగేలా చేసుకోవాలి. (యెష. 33:22) కాబట్టి దేవుని గురించిన విషయాలను తెలుసుకునేటప్పుడు, మనం జీవితంలోని ప్రతి అంకంలోనూ ఆయనను అనుకరించడానికి ప్రయత్నించాలి.”

“క్రీస్తు మనస్సును” సంపాదించుకోవడం

‘క్రీస్తు మనస్సును’ ఏర్పరచుకోవడానికి, అంటే యేసు చూపించినటువంటి విధేయమైన, వినయమైన మానసిక స్థితిని అలవర్చుకోవడానికి కూడా బైబిలు పఠనం మనకు సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 2:16) ఆయనకు తన తండ్రి చిత్తాన్ని చేయడం ఆలోచించకుండా యాంత్రికంగా అనుసరించే దినచర్య కాదుగానీ అది ఒక ఆనందకరమైన విషయం. ఆయన దృక్పథాన్ని కీర్తనల గ్రంథకర్త ప్రవచనార్థకంగా వర్ణించాడు, ఆయనిలా వ్రాశాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”a—కీర్తన 40:8.

మనస్సాక్షికి తర్ఫీదునిచ్చేందుకు, ‘క్రీస్తు మనస్సును’ సంపాదించుకోవడం ప్రాముఖ్యం. యేసు భూమి మీద పరిపూర్ణ మానవునిగా ఉన్నప్పుడు, తన తండ్రి లక్షణాలనూ, వ్యక్తిత్వాన్నీ మానవ పరిధిలో సాధ్యమైనంత మేరకు పూర్తిగా ప్రతిఫలించాడు. అందుకే, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని ఆయన చెప్పగలిగాడు. (యోహాను 14:9) యేసు తాను భూమి మీద ఎదుర్కున్న ప్రతి పరిస్థితిలోనూ తాను ఏమి చేయాలని తండ్రి కోరుకున్నాడో అదే చేశాడు. అందుకే, మనం యేసు జీవితాన్ని పఠించినప్పుడు, యెహోవా దేవుడు ఎలా ఉంటాడు అనేదాన్ని గూర్చిన స్పష్టమైన చిత్రం మనకు కనిపిస్తుంది.

యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” వాడని మనం చదువుతాం. (నిర్గమకాండము 34:6) యేసు తన అపొస్తలులతో వ్యవహరించేటప్పుడు ఈ లక్షణాలను పదే పదే కనబర్చాడు. ఎవరు గొప్పవారనే విషయం గురించి వారి మధ్య పదే పదే వాగ్వివాదం చెలరేగినప్పుడు, యేసు వారికి సహనంతో మాట ద్వారా ఉదాహరణ ద్వారా, “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను” అని బోధించాడు. (మత్తయి 20:26, 27) యేసు జీవితాన్ని పరిశీలించడం ద్వారా మనం దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడగలమని చూపించడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

మనం యేసు గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, మన పరలోక తండ్రియైన యెహోవాను అనుకరించడానికి మనం అంత ఎక్కువగా సంసిద్ధులమౌతాం. (ఎఫెసీయులు 5:1, 2) దేవుని ఆలోచనా విధానంతో శృతి చేయబడిన మనస్సాక్షి మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. తనయందు నమ్మకముంచే వారికి యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”—కీర్తన 32:8.

తర్ఫీదుపొందిన మనస్సాక్షి నుండి ప్రయోజనం పొందడం

అపరిపూర్ణ మానవుల చపల చిత్తాన్ని ఎరిగినవాడై మోషే ఇశ్రాయేలీయులను ఇలా హెచ్చరించాడు: “మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 32:46) మనం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని మన హృదయాలపై వ్రాసుకోవాలి. మనమలా చేస్తే, అప్పుడు మన మనస్సాక్షి మనకు సరైన మార్గనిర్దేశాన్నిస్తూ, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. బైబిలు సామెత ఇలా చెబుతుంది: “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయతే తుదకు అది మరణమునకు త్రోవతీయును.” (సామెతలు 14:12) పరిస్థితి తరచూ ఇలా ఎందుకుంటోంది? ఎందుకంటే, బైబిలు చెబుతున్నట్లుగా: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:9) కాబట్టి, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతలు 3:5, 6 నందు ఇవ్వబడిన ఉపదేశాన్ని మనమందరం అనుసరించవలసిన అవసరం ఉంది.

[అధస్సూచి]

a అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన తన పత్రికలో, కీర్తన 40లోని మాటలను యేసుక్రీస్తుకు అన్వయించాడు.—హెబ్రీయులు 10:5-10.

[7వ పేజీలోని చిత్రం]

బైబిలు తర్ఫీదు పొందిన మనస్సాక్షి దిక్సూచిలా మనకు సరైన దిశను చూపిస్తుంది

[క్రెడిట్‌ లైను]

Compass: Courtesy, Peabody Essex Museum, Salem, Mass.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి