స్వేచ్ఛ కోసం హ్యూగనాట్ల పలాయనం
“ఇందునుబట్టి రాజు, రాణిల తరపున, . . . మేం ప్రకటించేదేమంటే, మా ఈ రాజ్యంలో ఆశ్రయాన్ని కోరుతూ ఇక్కడికి ప్రయాణమై వచ్చే ఫ్రెంచి ప్రొటెస్టెంట్లందరికీ రాజ రక్షణను ఇవ్వడమే కాక . . . వారికి మద్దతునూ, సహాయ సహకారాలనూ అందించేందుకు న్యాయయుక్తమైన మార్గాల్లో పద్ధతుల్లో మేం మా శాయశక్తులా ప్రయత్నాలు కూడా చేస్తాం . . . ఈ రాజ్యంలో వారికి జీవితం సుఖప్రదంగాను సౌకర్యవంతంగాను ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తాం.”
ఇంగ్లాండు రాజు రాణీలైన విలియం, మేరీలు 1689వ సంవత్సరంలో జారీ చేసిన ప్రకటన అలా సాగుతుంది. కానీ ఆ ఫ్రెంచి ప్రొటెస్టెంట్లకు, అంటే హ్యూగనాట్లు అని అటుతర్వాత పేరొందిన ఫ్రెంచి ప్రొటెస్టెంట్లకు ఫ్రాన్స్‌కి వెలుపల ఆశ్రయాన్నీ రక్షణనూ కోరే అవసరం ఎందుకు ఏర్పడింది? దాదాపు 300 సంవత్సరాల క్రితం వారు ఫ్రాన్స్ నుండి పారిపోతే, అది ఇప్పుడు మనకెందుకు ఆసక్తికరంగా ఉండాలి?
16వ శతాబ్దంలో యూరప్ ఖండం యుద్ధాలతో, మత వివాదాలతో అతలాకుతలమై ఉంది. ఫ్రాన్స్‌లో క్యాథలిక్కులకూ ప్రొటెస్టెంట్లకూ మధ్య మత యుద్ధాలు (1562-1598) జరగడంతో ఫ్రాన్స్ కూడా ఈ సంక్షోభాన్ని తప్పించుకో లేకపోయింది. అయితే 1598లో, ఫ్రాన్స్ రాజైన నాలుగవ హెన్రీ ప్రొటెస్టెంట్ హ్యూగనాట్లకు కొంత మత స్వాతంత్ర్యాన్నిస్తూ మతసహనానికి సంబంధించిన నాంటేస్ రాజశాసనం (ఎడిక్ట్ ఆఫ్ నాంటేస్)పై సంతకం చేశాడు. రెండు మతాలకు ఈ విధంగా చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం యూరప్‌లో వేరే ఏ దేశంలోనూ జరగ లేదు. దీంతో 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ని 30 సంవత్సరాలకుపైగా పట్టిపీడించిన మతకల్లోలాలకు కొంతకాలంపాటు తెరపడింది.
నాంటేస్ రాజశాసనం “శాశ్వతమైందిగాను, మార్చరానిదిగాను” ఉండాలని ఉద్దేశించబడినప్పటికీ, 1685లో ఫోంటైనెబ్లో రాజశాసనం అమల్లోకి వచ్చి దాన్ని రద్దు చేసింది. ఫ్రెంచి తత్త్వజ్ఞాని అయిన వోల్టేర్ ఈ రద్దును “ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటి” అని అటు తర్వాత వర్ణించాడు. తత్ఫలితంగా స్వల్ప వ్యవధిలోనే 2,00,000ల హ్యూగనాట్లు ఇతర దేశాలకు పారిపోవలసి వచ్చింది. అయితే దాని పర్యవసానాలు చాలా దూరం వెళ్లాయి. కానీ మతసహనంపట్ల మొగ్గుచూపిన మునుపటి రాజశాసనం ఎందుకు రద్దు చేయబడింది?
మొదట్నుండీ వ్యతిరేకతే
నాంటేస్ రాజశాసనం అధికారికంగా దాదాపు 90 ఏళ్లపాటు అమల్లో ఉన్నప్పటికీ, “ఆ రాజశాసనానికి 1685లో మృత్యువాత పడేనాటికే అది ముక్కుతూ మూలుగుతూ మంచానపడి ఉందని” ఒక చరిత్రకారిణి చెబుతుంది. నిజానికి చెప్పాలంటే ఆ రాజశాసనానికి అసలు సరైన పునాది లేదు. మొదట్నుండీ, అది క్యాథలిక్ పాదిరీలకూ, “ఆర్.పి.ఆర్” (సోకాల్డ్ రిఫార్మ్‌డ్ రిలీజియన్) అని వారు పిలిచిన దానికీ మధ్య “ప్రచ్ఛన్న యుద్ధం” అని వర్ణించబడింది జరగడానికి దోహదపడింది. 1598లో అది జారీ చేయబడినప్పటినుండి దాదాపు 1630 వరకూ, నాంటేస్ రాజశాసనానికి వ్యతిరేకత అనేది ప్రొటెస్టెంట్లకూ క్యాథలిక్కులకూ మధ్య బహిరంగ వాగ్వివాదాల చుట్టూ, చర్చి గుంపుల సాహిత్య రచనల ప్రచురణల చుట్టూ అల్లుకునే ఉంది. అయితే, ఈ మత అసహనానికి చాలానే ముఖాలు ఉన్నాయి.
1621 నుండి 1629 వరకు ప్రొటెస్టెంట్లకు విరుద్ధంగా పోరాడిన తర్వాత, ఫ్రెంచి ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా అణచివేత చర్యలను చేపట్టి వారిని క్యాథలిక్ దొడ్డిలోనికి వచ్చేలా బలవంతపెట్టడానికి ప్రయత్నించింది. ఈ వేధింపులు “సూర్య రాజు” పద్నాలుగవ లూయీ క్రింద తీవ్రతరమయ్యాయి. ఆయన హింసాత్మక విధానాలు నాంటేస్ రాజశాసనం రద్దయ్యేందుకు నడిపించాయి.
అణచివేత
అణచివేతలో భాగంగా ప్రొటెస్టెంట్ల పౌర హక్కులు క్రమంగా కాలరాయబడ్డాయి. 1657 నుండి 1685 సంవత్సరాల మధ్య దాదాపు 300 చట్టాలు హ్యూగనాట్లకు విరుద్ధంగా చేయబడ్డాయి, వీటిలో అత్యధికం పాదిరీలు సూచించినవే. ఆ చట్టాలు వారి జీవితపు ప్రతి కోణంపైనా దాడిచేశాయి. ఉదాహరణకు, అనేక రకాల వృత్తులు హ్యూగనాట్లు చేపట్టరాదని నిషేధించడం జరిగింది, వైద్య వృత్తి, న్యాయ వృత్తి చివరికి మంత్రసాని వృత్తి కూడా నిషిద్ధమే. మంత్రసాని వృత్తికి సంబంధించి ఒక చరిత్రకారిణి ఇలా తర్కించింది: “ఉన్న వ్యవస్థని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక మతభ్రష్టురాలికి ఒక నిండు జీవితాన్ని ఎలా అప్పగించగలం?”
అణచివేత భారం 1677లో మరింత పెరిగింది. ఒక క్యాథలిక్కుని మార్చడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డ ఏ హ్యూగనాట్‌కైనా వెయ్యి ఫ్రెంచి పౌండ్ల జరిమానా విధించబడుతుంది. హ్యూగనాట్లను మతమార్పిడి చేసుకునేలా ప్రభావితం చేయడానికి, వెన్ను విరిచే పన్నులద్వారా సమకూర్చిన దేశ నిధులు ఉపయోగించబడ్డాయి. 1675లో క్యాథలిక్ పాదిరీలు రాజైన పద్నాలుగవ లూయీకి 45 లక్షల ఫ్రెంచి పౌండ్లు ఇస్తూ ఇలా అన్నారు: “మతభ్రష్టులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇప్పుడు మీ అధికారాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మీ ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోవాలి.” మతం మార్చుకునేలా చేయడానికి మనుష్యులను “కొనే” ఈ పథకం మూడు సంవత్సరాల్లోనే 10,000 మంది క్యాథలిక్ మతానికి మారేందుకు కారణమయ్యింది.
1663లో ప్రొటెస్టాంటిజానికి మతమార్పిడి చేయడం చట్టవిరుద్ధం చేయబడింది. హ్యూగనాట్లు ఎక్కడ నివసించాలన్న దాని విషయంలో కూడా కొన్ని ఆంక్షలు ఏర్పడ్డాయి. ఈ తీవ్రమైన చర్యలకు ఒక ఉదాహరణ: తమ తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా ఏడు సంవత్సరాల పిల్లలు క్యాథలిక్కులుగా మారవచ్చు. జెసూట్లూ లేక ఇతర క్యాథలిక్ బోధకులద్వారా తమ పిల్లలు పొందిన విద్యకు ప్రొటెస్టెంటు తల్లిదండ్రులు డబ్బు చెల్లించబద్ధులై ఉన్నారు.
హ్యూగనాట్లను అణచివేసే మరొక ఆయుధంగా, కాన్‌పాన్యే డ్యూ సాన్-సాక్రమాన్ (పవిత్ర కర్మల కంపెనీ) అనే రహస్య సంస్థ ఉపయోగించబడింది. అదొక క్యాథలిక్ సంస్థ, అది పూర్తి ఫ్రాన్స్‌ను చుట్టుముట్టిన ఒక “విస్తారమైన వల”గా ఏర్పడిందని ఝానిన్ గారిసన్ అనే చరిత్రకారిణి చెబుతుంది. సమాజంలోని అత్యున్నత వర్గాల్లో వరకూ చొచ్చుకుపోయిన ఆ సంస్థకు అటు ఆర్థిక వనరులకూ, ఇటు రహస్య సమాచార వనరులకూ కొదువ లేకుండా ఉంది. దాని ఎత్తులు ఎన్నెన్నోనని గారిసన్ వివరిస్తుంది: “ప్రొటెస్టెంటు సమాజాన్ని బలహీనపర్చడానికిగాను, ఒత్తిడి చేయడం మొదలుకొని అడ్డంకులు పెట్టడం వరకు, నేర్పుగా ప్రభావితం చేయడం మొదలుకొని అధిక్షేపించడం వరకు ప్రతి విధమైన పద్ధతినీ కాన్‌పాన్యే ఉపయోగించింది.” అయినా హ్యూగనాట్లలో అధిక సంఖ్యాకులు ఈ హింసాకాలంలో ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. చరిత్రకారిణి గారిసన్ ఇలా అంటుంది: “తమపట్ల శత్రుభావం పెరుగుతుండే కొలది ప్రొటెస్టెంట్లు అధిక సంఖ్యలో రాజ్యాన్ని ఎందుకు విడిచిపోలేదో అర్థం చేసుకోవడం కష్టం.” ఏమైనా, స్వేచ్ఛకై హ్యూగనాట్ల పలాయనం చివరికి తప్పనిసరైంది.
మళ్లీ మొదటికి
నైమాగన్ సంధి (1678), రాటిస్బాన్ యుద్ధవిరమణ (1684), ఈ రెండూ, రాజైన పద్నాలుగవ లూయీని బయటి దేశాలతో యుద్ధాల నుండి విముక్తుడ్ని చేశాయి. ఇంగ్లీషు ఛానల్‌కి ఆవల ఇంగ్లాండులో చూస్తే, ఫిబ్రవరి 1685లో ఒక క్యాథలిక్ రాజయ్యాడు. పద్నాలుగవ లూయీ ఈ క్రొత్త పరిస్థితినుండి లాభం పొందగల్గాడు. కొన్ని సంవత్సరాల ముందు క్యాథలిక్ పాదిరీ వర్గం, ఫోర్ గాలికన్ ఆర్టికల్స్‌ను జారీ చేసింది, ఇది పోపు అధికారాన్ని పరిమితం చేసింది. పోప్ పదకొండవ ఇన్నొసెంట్ “ఫ్రెంచి చర్చి దాదాపు వర్గభేదాలతో ఉన్నట్లు దృష్టించాడు.” తత్ఫలితంగా, నాంటేస్ రాజశాసనాన్ని రద్దు చేయడం ద్వారా పద్నాలుగవ లూయీ మసిపట్టిన తన పేరుకు మళ్లీ మెరుగుపెట్టి, పోప్‌తో సత్సంబంధాలను తిరిగి ఏర్పర్చుకోగల్గాడు.
ప్రొటెస్టెంట్లపట్ల రాజు విధానాలు చాలా స్పష్టమయ్యాయి. మెత్తని విధానాలు (ఒప్పించడము, చట్టాలు చేయడము) పనిచేయలేదని స్పష్టంగానే రుజువయ్యింది. మరోవైపు అప్పుడప్పుడే జరిగిన డ్రాగనేడ్స్a దాడులు విజయవంతమయ్యాయి. అందుకని 1685లో పద్నాలుగవ లూయీ నాంటేస్ రాజశాసనాన్ని రద్దు చేస్తూ ఫోంటైనెబ్లో రాజశాసనంపై సంతకం చేశాడు. ఈ రద్దుతోపాటే చెలరేగిన హింసా జ్వాలల మూలంగా హ్యూగనాట్ల పరిస్థితి నాంటేస్ రాజశాసనం రాకమునుపటి పరిస్థితికన్నా ఘోరంగా తయారైంది. వాళ్లిప్పుడేం చేస్తారు?
రహస్య జీవనమా, పోరాటమా, పలాయనమా?
కొంతమంది హ్యూగనాట్లు రహస్యంగా ఆరాధన జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. వారి కూటాల స్థలాలు నాశనమై, బహిరంగ ఆరాధన నిషేధించబడడంతో వారు ‘ఎడారి చర్చి,’ లేక రహస్య ఆరాధన వైపుకి మరలారు. జూలై 1686లో చేయబడిన చట్టం ప్రకారం అటువంటి కూటాలు జరుపుకునే వారు మరణశిక్షకు గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ వారు అలా చేశారు. కొంతమంది హ్యూగనాట్లు, తర్వాత ఎప్పుడైనా మళ్లీ మతమార్పిడి చేసుకోవచ్చునన్న తలంపుతో తమ విశ్వాసాన్ని పరిత్యజించారు. అలా మతమార్పిడి చేసుకున్నవారు పైపైన మాత్రం క్యాథలిక్కు మతాన్ని అవలంబిస్తూ వచ్చారు, వారి తర్వాతి తరాలవారు వారి పద్ధతిని అనుసరించారు.
ప్రభుత్వం మతమార్పిడులను సంఘటితం చేయడానికి ప్రయత్నించింది. క్రొత్తగా మతమార్పిడి చేసుకున్నవారు, ఉద్యోగాలు పొందడానికై పారిష్ ప్రీస్టు సంతకం ఉన్న క్యాథలిక్ ధృవపత్రాన్ని చూపించాల్సివుంది, చర్చిలో వారి హాజరును ఆ ప్రీస్టు పరిగణలోనికి తీసుకునేవాడు. పిల్లలకు బాప్తిస్మం ఇవ్వక, క్యాథలిక్కులుగా పెంచనట్లైతే వారు తల్లిదండ్రుల నుండి వేరుచేయబడేవారు. స్కూళ్లు క్యాథలిక్ విద్యను ప్రోత్సహించాల్సి ఉంది. “[బైబిలు] గ్రంథానికి చెందిన ప్రజలు” అని పిలువబడిన ప్రొటెస్టెంట్ల కోసం క్యాథలిక్ మతానికి మద్దతునిచ్చే మతపరమైన సాహిత్యాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం పది లక్షలకుపైగా పుస్తకాలను ముద్రించి వాటిని పెద్ద సంఖ్యలో మతమార్పిడి చేసుకున్న ప్రజలున్న ప్రాంతాలకు రవాణా చేసింది. చర్యలు ఎంత తీవ్రంగా ఉండేవంటే, ఒకవేళ ఎవరైనా అస్వస్థతగా ఉండి క్యాథలిక్ మరణ కర్మకాండలను నిరాకరించినట్లైతే, కోలుకున్న తర్వాత ఆయన్ను జీవిత ఖైదుకో లేక జీవితాంతం ఓడల్లో తెడ్లువేసేవానిగా ఉండడానికో పంపించడం చేసేవారు. తర్వాత ఆ వ్యక్తి చనిపోయినప్పుడు శరీరాన్ని అదేదో చెత్త అన్నట్లు విసిరివేసేవారు, వస్తువులన్నీ జప్తు చేయబడేవి.
కొంతమంది హ్యూగనాట్లు సాయుధ పోరాటానికి తలపడ్డారు. మత ఉద్రేకానికి పేరొందిన సేవెన్ ప్రాంతంలో కామజార్డ్‌లు అని పిలువబడిన హ్యూగనాట్ మిలిటెంట్లు 1702లో తిరుగుబాటు చేశారు. కామజార్డ్‌లు పొంచివుండి చేసే దాడులకు, రాత్రిపూట దాడులకు ప్రతిచర్యగా ప్రభుత్వ దళాలు గ్రామాలకు నిప్పంటించి కాల్చివేసేవి. హ్యూగనాట్లు చెదురుమదురుగా చేసే దాడులు కొంతకాలంపాటు సాగినప్పటికీ, 1710కల్లా రాజైన లూయీ సైనిక బలం కామజార్డ్‌లను తుడిచిపెట్టేసింది.
హ్యూగనాట్ల మరో ప్రతిస్పందన—ఫ్రాన్స్‌ను విడిచి పారిపోవడం. ఈ వలస అసలైన వలసగా పిలువబడింది. విడిచిపోయే నాటికి అత్యధిక హ్యూగనాట్లు దిక్కులేని వారిగా ఉన్నారు, ఎందుకంటే ప్రభుత్వం వారి వస్తువులను జప్తు చేసుకుంది, ఆ సంపదలో కొంత భాగమేమో క్యాథలిక్ చర్చివశమైంది. అందుకని పారిపోవడం చాలా కష్టమైంది. పైగా ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దేశ రహదారులవద్ద కాపు కాయడంద్వారా, ఓడలను తనిఖీ చేయడంద్వారా చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్ నుండి బయల్దేరే ఓడలను సముద్రపు దొంగలు కొల్లగొట్టేవారు, ఎందుకంటే పారిపోతున్నవారిని పట్టుకుంటే వాళ్లకు పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టేది. పారిపోతూ పట్టుబడిన హ్యూగనాట్లు కఠినమైన శిక్షలను అనుభవించేవారు. ఇంకా ఘోరం ఏమిటంటే, తమలోనే పనిచేస్తున్న గూఢచారులు పారిపోవాలని పథకాలు వేస్తున్నవారి పేర్లను, వారు ఎన్నుకున్న మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఉత్తరాలను మార్గమధ్యంలోనే తెరిచి చదవడం, నకిలీ పత్రాలు, మోసాలు ఆ రోజుల్లో సర్వసాధారణమయ్యాయి.
ఆదరించే ఆశ్రయం
ఫ్రాన్స్‌నుండి హ్యూగనాట్లు పారిపోవడమూ, ఆతిథేయ దేశాలకు వారి స్వాగతమూ అసలైన ఆశ్రయం (ద రెఫ్యూజ్) అని పిలువబడింది. హ్యూగనాట్లు హాలెండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇంగ్లాండులకు పారిపోయారు. అటుతర్వాత కొంతమంది స్కాండినేవియా, అమెరికా, ఐర్లాండ్, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా, రష్యాలకు వెళ్లారు.
హ్యూగనాట్‌లను తమ దేశాల్లోకి వలస రమ్మని ఆహ్వానిస్తూ చాలా యూరప్ దేశాలు రాజశాసనాలను జారీచేశాయి. అనేకమైన ప్రోత్సాహకాల్లో ఉచిత పౌరసత్వ ప్రదానం, పన్నుల నుండి మినహాయింపు, వాణిజ్య సంఘాల్లో ఉచిత సభ్యత్వం వంటివి ఉన్నాయి. ఎలీసబెత్ లాబ్రూస్ అనే చరిత్రకారిణి ప్రకారం, హ్యూగనాట్‌లలో చాలామంది “యౌవన పురుషులే . . . వారు ఉత్సాహవంతులు, అత్యున్నతమైన నైతిక విలువలుగల చురుకైన పౌరులు.” అప్పట్లో శక్తిపరంగా ఉచ్ఛస్థితిలో ఉన్న ఫ్రాన్స్ అలా అనేక రంగాల్లో నిపుణులైన పనివారిని కోల్పోయింది. అవును, “వస్తుసంపదలు, కౌశలాలు, సాంకేతిక నైపుణ్యాలు” అన్నీ విదేశాలకు వలసపోయాయి. హ్యూగనాట్‌లకు ఆశ్రయం ఇవ్వడానికి మతపరమైన కారణాలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఈ వలస మూలంగా సంభవించిన దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటి?
నాంటేస్ రాజశాసనాన్ని రద్దు చేయడంపట్లా, దానితోపాటే చెలరేగిన హింసలపట్లా అంతర్జాతీయ ప్రతిస్పందన ప్రతికూలంగా వ్యక్తమైంది. విలియం ఆఫ్ ఆరెంజ్ ఫ్రెంచి-వ్యతిరేక భావాలను సొమ్ము చేసుకుని నెదర్లాండ్స్‌కి పరిపాలకుడయ్యాడు. హ్యూగనాట్ అధికారుల సహాయంతో ఆయన క్యాథలిక్ రాజైన రెండవ జేమ్స్‌ని కూలద్రోసి గ్రేట్ బ్రిటన్‌కి కూడా రాజు అయ్యాడు. ఫీలిప్ ఝూటార్ అనే చరిత్రకారుడు వివరిస్తూ, “పద్నాలుగవ లూయీ యొక్క ప్రొటెస్టెంటు వ్యతిరేక విధానం రెండవ జేమ్స్‌ని కూలద్రోయడానికీ, ఆగ్స్‌బర్గ్ కూటమి ఏర్పడడానికీ ప్రధానమైన కారణాల్లో ఒకటి. . . . [ఈ] సంఘటనలు యూరప్ చరిత్రలో ఒక మలుపురాయిగా ఉన్నాయి, అవి ఫ్రెంచి ఆధిపత్యాన్ని తగ్గించి ఇంగ్లీషు ఆధిపత్యానికి నడిపించాయి,” అని చెబుతున్నాడు.
యూరప్‌లో హ్యూగనాట్లు ఒక ప్రాముఖ్యమైన సాంస్కృతిక పాత్రను పోషించారు. వారు తాము క్రొత్తగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని, ప్రభోదాత్మక తత్త్వానికీ, సహనం గురించిన తలంపులకూ రూపాన్నిచ్చిన సాహిత్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, ఒక ఫ్రెంచి ప్రొటెస్టెంటు ఇంగ్లీషు తత్త్వజ్ఞాని అయిన జాన్ లాక్ కృతులను అనువదించి, తద్వారా సహజ హక్కుల భావనకు ప్రచారం కల్పించాడు. ఇతర ప్రొటెస్టెంట్ రచయితలు మనస్సాక్షి స్వాతంత్ర్యానికి ప్రాముఖ్యతనిచ్చారు. పరిపాలకులకు విధేయత చూపడం తప్పనిసరైనదేమీ కాదనీ, వారు తమకూ ప్రజలకూ మధ్యనున్న ఒప్పందాన్ని మీరితే ప్రజలు విధేయతను కనపర్చాల్సిన అవసరం లేదనీ, వంటి తలంపులు అభివృద్ధి చెందాయి. ఆ విధంగా, చరిత్రకారుడైన ఛార్ల్స్ రీడ్ వివరిస్తున్నట్లు, నాంటేస్ రాజశాసనాన్ని రద్దు చేయడం “ఫ్రెంచి విప్లవం తలెత్తడానికి దోహదపడిన ప్రత్యక్ష కారణాల్లో ఒకటి.”
నేర్చుకున్న పాఠాలు?
హింస మూలంగా, అంతమంది విలువైన ప్రజలను కోల్పోవడం మూలంగా ఏర్పడిన నిష్ప్రయోజనకరమైన పరిణామాలను చూసి, పద్నాలుగవ లూయీకి సైనిక సలహాదారైన మార్క్విస్ డ వాబాన్, “హృదయ పరివర్తనం అనేది దేవునికి మాత్రమే సంబంధించినది” అని చెబుతూ నాంటేస్ రాజశాసనాన్ని తిరిగి అమల్లో పెట్టమని లూయీని పురికొల్పాడు. మరి ఫ్రెంచి రాజ్యం గుణపాఠం నేర్చుకుని తన నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు? నిశ్చయంగా ఒక కారణం ఏమంటే దానివల్ల ప్రభుత్వం బలహీనం అవుతుందని రాజు భయపడ్డాడు. అంతేగాక, క్యాథలిక్ ఉజ్జీవానికీ 17వ శతాబ్దపు ఫ్రాన్స్ మత అసహనానికీ వంతపాడడం ఫ్రాన్స్‌కు చాలా లాభకరంగా ఉంది మరి.
రాజశాసనం రద్దుకి ముందూ వెనకా జరిగిన సంఘటనలు కొంతమంది, “సమాజం వైవిధ్యాన్ని ఎంతమట్టుకు అనుమతించగలదు, ఎంతమట్టుకు సహించగలదు?” అని ప్రశ్నించేందుకు కారణమైంది. నిజానికి చరిత్రకారులు గుర్తించినట్లే, హ్యూగనాట్ల గాథను పరిశీలిస్తూ, “అధికారం పనిచేసే విధానాన్నీ, ఆ విధానంలోని వక్రతనూ” గురించి తలంచకుండా ఉండడం అసాధ్యం. అనేక జాతులూ, మతపరంగా ఎంతో వైవిధ్యమూ ఉన్న నేటి సమాజాల్లో, ప్రజల ప్రయోజనాలకన్నా చర్చి పురికొల్పిన రాజకీయాలు ఎక్కువ ప్రాముఖ్యతను వహిస్తే ఏమి జరుగుతుందన్న దానికి, స్వేచ్ఛకై హ్యూగనాట్ల పలాయనం ఒక విషాదకరమైన జ్ఞాపిక.
[అధస్సూచీలు]
a పేజీ 28లోని బాక్సు చూడండి.
[28వ పేజీలోని బాక్సు]
డ్రాగనేడ్స్
భయోత్పాతాన్ని కలుగజేస్తూ మతమార్పిడిని చేయడం
డ్రాగూన్‌లను కొంతమంది “అమోఘమైన మిషనరీలు”గా దృష్టించారు. అయితే, హ్యూగనాట్‌లలో వారు భయాందోళనలు పుట్టించారు, కొన్ని సందర్భాల్లోనైతే వారు వస్తున్నారన్న వార్త విని పూర్తి గ్రామాలకు గ్రామాలే క్యాథలిక్ మతానికి మతమార్పిడి చేసుకునేవి. ఇంతకీ ఈ డ్రాగూన్‌లు ఎవరు?
డ్రాగూన్‌లు హ్యూగనాట్‌లను భయపెట్టాలనే ఉద్దేశంతో వారి ఇండ్లలో విడిదిచేసిన పూర్తిగా సాయుధులైన సైనికులు. డ్రాగూన్‌లను ఈ విధంగా ఉపయోగించే పద్ధతి డ్రాగనేడ్స్ అని పిలువబడింది. హ్యూగనాట్ కుటుంబాలపైని అప్పటికే ఉన్న భారాన్ని అధికం చేయడానికి ఒక ఇంటికి పంపబడే సైనికుల సంఖ్య కుటుంబపు వనరులను మించిపోయేది. కుటుంబాలపట్ల మొరటుగా ప్రవర్తించడానికీ, వారు నిద్రలేకుండా బాధలననుభవించేలా చేయడానికీ, వారి ధనసంపదలను నాశనం చేయడానికీ డ్రాగూన్‌లకు అధికారం ఉండేది. ఒకవేళ కాపురమున్నవారు తమ ప్రొటెస్టెంటు విశ్వాసాన్ని పరిత్యజిస్తే డ్రాగూన్‌లు వాళ్లని విడిచిపెట్టి పోయేవారు.
హ్యూగనాట్లు ఎక్కువగా నివసించే ప్రాంతమైన పశ్చిమ ఫ్రాన్స్‌లోని పోయిటౌ ప్రాంతంలో 1681లో మతమార్పిడి సాగించడానికి డ్రాగనేడ్స్ పద్ధతి ఉపయోగించబడింది. కొద్ది నెలల్లోనే 30,000 నుండి 35,000 మంది వరకు మతమార్పిడి చేయబడ్డారు. 1685లో మరితర హ్యూగనాట్ సమాజాల్లో కూడా అదే పద్ధతి ఉపయోగించబడింది. కొద్ది నెలల్లోనే 3,00,000 నుండి 4,00,000 వరకు మత మార్పిడులు జరిగాయి. ఝాన్ కేన్యార్ అనే చరిత్రకారుని ప్రకారం డ్రాగనేడ్స్ యొక్క విజయం, “[సహనాన్ని కనపర్చిన నాంటేస్ రాజశాసన] రద్దును అనివార్యం చేసింది, ఎందుకంటే ఇప్పుడు అంతా సాధ్యంగా ఉంది మరి.”
[క్రెడిట్ లైను]
© Cliché Bibliothèque Nationale de France, Paris
[25వ పేజీలోని చిత్రం]
మతపరమైన అణచివేత నుండి ఉపశమనాన్ని కోరుకుంటున్న ఫ్రెంచి ప్రొటెస్టెంట్లకు 1689వ సంవత్సరపు ఈ ప్రకటన ఆశ్రయాన్ని అందించింది
[క్రెడిట్ లైను]
By permission of The Huguenot Library, Huguenot Society of Great Britain and Ireland, London
[26వ పేజీలోని చిత్రం]
నాంటేస్ రాజశాసనం రద్దు పత్రం, 1685 (రద్దు పత్రం మొదటి పేజీ ఇక్కడ చూపించబడింది)
[క్రెడిట్ లైను]
Documents conservés au Centre Historique des Archives nationales à Paris
[26వ పేజీలోని చిత్రం]
అనేక ప్రొటెస్టెంట్ దేవాలయాలు నాశనం చేయబడ్డాయి
[క్రెడిట్ లైను]
© Cliché Bibliothèque Nationale de France, Paris