అగ్నిపర్వతపు మరణఛాయలో జీవిస్తూ, ప్రకటిస్తూ ఉండడం
“అదెంతో భీతిగొలిపే అనుభవం. అది బైబిలు చెబుతున్న ప్రపంచాంతంలా ఉండవచ్చు. మనం ప్రతి నిముషమూ అప్రమత్తంగా ఉండాలి, యెహోవా ఎదుట సరైన యోగ్యతను కలిగి ఉండాలి.” యెహోవాసాక్షుల్లో ఒకరైన బీక్టార్, మెక్సికోలో పొపొ అని సాధారణంగా పిలువబడే పొపొకెటిపీటల్ అగ్నిపర్వతానికి చాలా దగ్గరగా జీవించడంలోని తన అనుభవాన్ని వివరించేందుకు చెప్పిన మాటలవి.
గర్జిస్తోన్న ఈ అగ్నిపర్వతం 1994లోనే అంతర్జాతీయ వార్తలకెక్కింది.a ఆ పర్వత బిలానికి దాదాపు 30 కిలోమీటర్ల చుట్టుప్రక్కలున్న ప్రతీదీ తీవ్ర ప్రమాదకర ప్రాంతంలో ఉన్నవని అధికారులు చెప్పారు. పర్వత బిలం దక్షిణం వైపుకు కాస్త ఒరిగివుంది గనుక అగ్నిపర్వతానికి ఆ వైపున ప్రత్యేకంగా ప్రమాదకరమైనది, పైగా అటు ప్రక్క పర్వత బిలపు అంచున అక్కడక్కడా లోతైన గంట్లున్నాయి వాటి ద్వారా లావా, బురద బయటికి వెల్లువలా రావచ్చు.
ఆ అగ్నిపర్వతం బ్రద్దలైతే మెక్సికో నగరానికి ఏమి సంభవిస్తుందని అనేకులు ఆశ్చర్యపోవడం సహజమే. ఆ నగరం ప్రమాదంలో ఉందా? అగ్నిపర్వతానికి దక్షిణానుండే మోరెలోస్ రాష్ట్రంలోని ప్రజల సంగతేంటి, ఆ ప్రాంతంలోని వాళ్లంతా కూడా ప్రమాదంలో ఉన్నారా? ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియక, అగ్నిపర్వత మరణఛాయలో జీవించడం ఎలా ఉంటుంది?
అగ్నిపర్వతం బ్రద్దలయ్యే ప్రమాదం
డౌన్టౌన్ మెక్సికో పట్టణం పొపొకెటిపీటల్కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, అయితే నగరపరిసర ప్రాంతాలు కొన్ని దాదాపు 40 కిలోమీటర్ల సమీపానున్నాయి. ఖచ్చితంగా చూస్తే, దాని రెండు కోట్ల జనాభాతో ఈ నగరమంతా కూడా ప్రమాద ప్రాంతం బయటనే ఉంది. అయితే, వీచే గాలి దిశను బట్టి, అగ్నిపర్వతం ఎక్కువ మోతాదులో బూడిదను వెదజల్లితే ఆ ప్రాంతం కూడా ప్రభావితం కావచ్చు.
అగ్నిపర్వతపు బూడిద వలన కలిగే ప్రభావాలు సాధారణంగా అగ్నిపర్వతం తూర్పు వైపున తీవ్రంగా ఉంటాయి. ఆ వైపున ప్యూబ్లా నగరమూ, అనేక చిన్న నగరాలూ, పట్టణాలూ కూడా వున్నాయి, అంటే దాదాపు 2,00,000 మంది ఎక్కువ ప్రమాదకరమైన ప్రాంతంలో జీవిస్తున్నారన్నమాట. 1997, మే 11, ఆదివారం నాడు, అగ్నిపర్వతం టన్నుల కొద్దీ బూడిదను వెదజల్లింది, అది ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలకూ మరి తూర్పువైపున 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానున్న వెరాక్రూస్ రాష్ట్రం వరకూ వ్యాపించింది. అగ్నిపర్వతానికి దక్షిణాన ఉన్న ప్రాంతంలో, మరెలోస్ రాష్ట్రంలో, మొత్తం 40,000 మంది జనాభాతో అనేక నగరాలూ పట్టణాలూ ఉన్నాయి, అవి కూడా తీవ్ర ప్రమాదంలో ఉన్న ప్రాంతాలే కావచ్చు.
ఇలాంటి పరిస్థితిలో జీవిస్తూ యెహోవాసాక్షులు పని చేస్తున్నారు. మెక్సికో నగరంలోని దాదాపు 1,700 సంఘాల్లో 90,000 కంటే ఎక్కువమంది సాక్షులున్నారు. వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి మెక్సికో నగరం వెలుపల ఈశాన్యాన, అగ్నిపర్వతానికి 100 కిలోమీటర్ల దూరాన ఉంది. బ్రాంచిలో 800 కంటే ఎక్కువమంది స్వచ్ఛందసేవకులు సేవ చేస్తున్నారు, వారికి తోడు దాదాపు 500 మంది స్వచ్ఛందసేవకులు ఒక పెద్ద నిర్మాణ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారు. వారందరూ కూడా ప్రమాద ప్రాంతం పరిధికి వెలుపలే ఉన్నారు.
మరెలోస్ రాష్ట్రంలో, 2,000 కంటే ఎక్కువ రాజ్య ప్రచారకులతో యెహోవాసాక్షుల సంఘాలు దాదాపు 50 ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘాలు, అంటే టెటెలా డెల్ బోల్కోన్, వేయాపాన్లలో ఉన్నవి పర్వత బిలానికి దాదాపు 20 కిలోమీటర్ల సమీపాన ఉన్నాయి. దానికి తోడు, తూర్పున ఉన్న ప్యూబ్లా రాష్ట్రంలో ఉన్న సంఘాల్లోని దాదాపు 600 మంది ప్రచారకులు అగ్నిపర్వతానికి 20 నుండి 30 కిలోమీటర్ల సమీపంలో జీవిస్తున్నారు. ఈ ప్రాంతాలు గంభీరమైన ప్రమాదంలో ఉండవచ్చు.
యెహోవాసాక్షులు చురుకుగా పని చేస్తున్నారు
ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, యెహోవాసాక్షులు ఈ ప్రాంతంలో తమ ప్రకటనాపనిని ఆపుజేయలేదు. ఈ విపరీత పరిస్థితుల్లో తమకు ఐక్యతా భావాన్నీ దృఢవిశ్వాసాన్నీ కలిగించే క్రైస్తవ కూటాలను కూడా వాళ్లు క్రమంగా జరుపుకుంటూనే ఉన్నారు. (హెబ్రీయులు 10:24, 25) ఈ సంఘాల్లో ఒకదాని నుండి వచ్చిన రిపోర్టు ఇలా పేర్కొంటోంది: “రాజ్య సువార్తపట్ల ప్రజలు చూపే దృక్పథంలో ఎంతో గణనీయమైన మార్పు వచ్చింది. ఉదాహరణకు, ఒక చిన్న గ్రామంలో, 18 మంది ఇటీవల గృహ బైబిలు పఠనాలను స్వీకరించారు.”
అగ్నిపర్వతానికి 20 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మరొక సంఘం ఇలా నివేదిస్తోంది: “పెరుగుదల ఎంతో గణనీయంగా ఉంది. ఈ సంఘం 1996 నవంబరులో స్థాపించబడింది. ఆ తర్వాతి ఆరు నెలల్లో, 10 మంది క్షేత్ర సేవలో పాల్గొనేందుకు అర్హులయ్యారు. కొంతమంది ప్రచారకులు పర్వత బిలానికి దాదాపు 20 కిలోమీటర్ల సమీపంలో నివసిస్తున్నారు. అక్కడ క్రైస్తవ కూటాలు జరుగుతున్నాయి, దాదాపు 40 మంది హాజరౌతారు.”
ప్యూబ్లాలో, అగ్నిపర్వతానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఆగస్టిన్ ఇక్స్టావీక్స్ట్లాలో నివసించే మాగ్డలేన బైబిలు పఠనాలను నిర్వహిస్తూ ఎంతో క్రియాశీలంగా ఉంది. ఒకసారి అగ్నిపర్వతం బూడిదను చిమ్మినప్పుడు ఏమి జరిగిందో ఆమె చెబుతోంది.
“మేము మా ఇళ్లను వదిలి వచ్చేయమని మాకు చెప్పారు, మేము బూడిద వర్షం కురుస్తుండగా వచ్చేశాం. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, నేను బైబిలు పఠనం చేస్తున్న డొరాడో కుటుంబం నాకు జ్ఞాపకం వచ్చింది. నేనూ కొంతమంది సహోదరులు డొరాడో వాళ్ల ఇంటికి వెళ్లి సురక్షితమైన ప్రాంతానికి తరలి వెళ్లేందుకు వాళ్లకు సహాయం చేశాము. సమీపానున్న ప్యూబ్లా నగరంలో, యెహోవాసాక్షుల సహాయక కమిటీ అప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ మాకు లభించిన ఆదరణను బట్టి డొరాడో కుటుంబం ఎంతో ముగ్ధులయ్యారు. మా కొరకు మన క్రైస్తవ సహోదరులు అంతకు ముందే సిద్ధం చేసిన వేర్వేరు స్థలాల్లో వసతి లభించింది. మేము మా ఇంటినుండి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ మాకేమీ కొదువకాలేదు. ఈ కుటుంబం రాజ్యమందిరంలో జరిగే కూటాలకు కొన్నింటికి హాజరైంది, అయితే వాళ్లు ఇంత వరకు ఎన్నడూ కలవని సహోదరులు వాళ్ల పట్ల చూపిన ప్రేమనుబట్టి వాళ్లెంతో ఆశ్చర్యచకితులయ్యారు. మా ఇళ్లకు తిరిగి వచ్చిన కొన్ని వారాల తర్వాత, ఈ కుటుంబం కూటాలన్నింటికీ క్రమంగా హాజరవ్వడం ప్రారంభించింది. త్వరలోనే వాళ్లు సువార్త ప్రచారకులయ్యేందుకు అర్హులయ్యారు. వాళ్లలో ఇద్దరు ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లు కొన్ని నెలలపాటు సహాయ పయినీర్లుగా సేవ చేశారు, క్రమ పయినీరు సేవలో చేరాలని వాళ్లిప్పుడు పథకాలు వేసుకుంటున్నారు.”
పర్వత బిలం నుండి 21 కిలోమీటర్ల సమీపంలో ఉండే 20 సంవత్సరాల మార్తా అనే అమ్మాయి, ప్రకటించేందుకు లభించిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకునేందుకు తన అంగవైకల్యాన్ని తనకు అడ్డురానీయలేదు. అగ్నిపర్వతం మళ్లీ ఒకసారి క్రియాశీలమైనప్పుడు అంటే మూడేళ్ళ క్రితం ఆమె సత్యాన్ని నేర్చుకుంది. తాను నివసించే ఏటవాలు ప్రాంతంలో చక్రాల కుర్చీని ఉపయోగించడం కష్టం గనుక దానికి బదులు, ప్రకటనాపనిలో భాగం వహించేందుకు ఆమె గాడిదపై వెళ్తుంది. ఆమె కూటాలకు కూడా దానిపైనే వస్తుంది. ఆమె గాడిదపై ఎక్కేందుకూ దిగేందుకూ సంఘంలోని సహోదరీలపై ఆధారపడుతుంది గనుక ప్రేమగల సహోదరత్వంలో ఒక భాగమై ఉండగలిగినందుకు మార్తా యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలై ఉంది. ప్రతి నెలా ఆమె పరిచర్యలో 15 కంటే ఎక్కువ గంటలు గడుపుతుంది.
ఈ మారుమూల ప్రాంతాల్లో, మతపర సెలవుదినాలను ఆచరించడానికి తమతో కలవమని పొరుగువారి నుండి వచ్చే ఒత్తిడిని యెహోవాసాక్షులు తరచూ ఎదుర్కుంటుంటారు. అగ్నిపర్వతం నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరానున్న గ్రామమైన టుల్సింగోలో, ఆ వేడుకల కొరకు సాక్షుల నుండి చందాలను సేకరించేందుకు ఒక వ్యక్తిని నియమించారు. తామా మతపర సెలవుదినాల్లో ఎందుకు భాగం వహించలేమో సహోదరులు ఓపికగా వివరించారు. సహోదరులనుండి ఎలాగైనా సరే చందా వసూలు చేయాలని ఆ వ్యక్తి ఎంత పట్టుదలతో ఉన్నాడంటే, అతడు సాక్షులతో సహవసించడం ప్రారంభించి, వారి నమ్మకాల్లో కొన్నింటిని తెలుసుకున్నాడు. అతడు తన ప్రశ్నలకు స్వంత క్యాథోలిక్ బైబిలునుండి సమాధానాలను కనుగొని ఎంతో సంతోషించాడు. అతడు తన భార్యా, కుమార్తెతో కలిసి దాదాపు ఒక సంవత్సరం నుండీ కూటాలకు క్రమంగా హాజరౌతున్నాడు, ఇంకా సువార్త ప్రచారకుడు కావాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు.
మీరెలా సిద్ధపడి ఉండగలరు?
అగ్నిపర్వత శాస్త్రజ్ఞులు తమ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు, భీతిగొలిపే పొపొకెటిపీటల్ను గురించి అధికారిక నివేదికలను అందిస్తున్నారు, అయితే ఎప్పుడు, ఏమి సంభవిస్తుందో వాస్తవంగా ఎవరికీ తెలియదు. వార్తా మాధ్యమాల ప్రకారం, చుట్టుప్రక్కల నివసించే ప్రజల ప్రకారం, అగ్నిపర్వతం ఎప్పుడైనా బ్రద్దలుకావచ్చు. ఆ ప్రమాదం వాస్తవమైనది. అయితే, అధికారులు ఎంతో అప్రమత్తత కలిగి ఉన్నారు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సిద్ధంగా ఉండేందుకు తమకు వీలైనదంతా చేయాలనుకుంటున్నారు. అయితే, హెచ్చరికనిచ్చే విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలనేది అర్థం చేసుకోగల విషయమే, ఎందుకంటే ఎలాంటి ప్రమాదమూ లేనప్పటికీ ప్రజలు భయపడి మూకుమ్మడిగా బయల్దేరేలా చేయకుండా ఉండాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒకరేమి చేయాలి?
“బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని ఒక బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 22:3) కాబట్టి, అలాంటి భీకరమైన ప్రకృతి శక్తులపట్ల ఉపేక్షాభావంతో, ఎన్నటికీ ఏమీ జరగదన్నట్లువుండి ఆపదలో పడకుండా, అవకాశమనే ద్వారం తెరిచివున్నప్పుడే సురక్షితమైన ప్రాంతానికి చేరుకునేందుకు చర్యలు తీసుకోవడం జ్ఞానవంతమైన చర్య. ఈ ప్రాంతంలోని యెహోవాసాక్షులు ఆ విషయాన్ని అలాగే దృష్టిస్తున్నారు.
ఇటీవలనే, వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయ ప్రతినిధులు, ప్రమాద ప్రాంతంలోని సంఘాలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న ప్యూబ్లా రాష్ట్రంలోని ప్రయాణపైవిచారణకర్తలతో సమావేశమయ్యారు. ప్రయాణ పైవిచారణకర్తలూ, సహాయక కమిటీ సభ్యులూ కూడా, పర్వత బిలానికి 25 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్నీ కలిసేందుకు పథకాలు వేయడం జరిగింది. పర్వతం బ్రద్దలు కాకముందే ప్రమాద క్షేత్రం నుండి బయటపడటాన్ని గురించి ఆలోచించేందుకు ఈ కుటుంబాలకు సహాయం చేశారు. అగ్ని పర్వతం బ్రద్దలైనట్లైతే 1,500 మంది ప్రజలను ప్యూబ్లా నగరానికి తరలించేందుకుగాను రవాణా మరియు నివాస ఏర్పాట్లు చేశారు. కొన్ని కుటుంబాలు ఇతర నగరాల్లోని తమ బంధువులతోపాటూ ఉండేందుకు వెళ్లారు.
విస్తృత పరిధిలో హెచ్చరిక
పొపొకెటిపీటల్ నుండి వస్తున్న పొగ, అగ్ని, గర్జన శబ్దాలు ప్రేలుడు సంభవిస్తుందనే దానికి స్పష్టమైన సూచనలు. తప్పించుకోవాలనుకునే వారందరూ అధికారులిస్తున్న హెచ్చరికలను తప్పకుండా చెవినబెట్టి, సరైన చర్య తీసుకోవాలి. అగ్నిపర్వతానికి చాలా సమీపానున్న యెహోవాసాక్షులు తమ స్వంత భద్రత విషయంలోనూ అలాగే మరీ ఆలస్యం కాకముందే ప్రమాదం విషయంలో ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇతరులకు సహాయపడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.
విస్తృత ప్రాతిపదికపై, బైబిలు ప్రవచనాల వెలుగులో ప్రపంచ సంఘటనల విషయమైకూడా యెహోవాసాక్షులు అప్రమత్తంగా ఉన్నారు. యుద్ధాలూ, భూకంపాలూ, కరవులూ, వ్యాధులూ అలాగే నేరం అనేవి అగ్నిపర్వతపు గర్జనలు, ప్రేలుళ్లు వంటివాటి వలెనే ఎంతో గమనార్హమైనవి. ఇవి, ‘విధానాంతాన్ని’ సూచించే సంయుక్త సూచనైవుంటుందని యేసుక్రీస్తు చెప్పిన దాని భాగాలు. ఆ అంతం ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియనప్పటికీ, అది వస్తుందన్నదాన్లోనూ అది ఎంతో సమీపంలో ఉందనే దాని విషయంలోనూ మాత్రం ఎలాంటి సందేహమూ లేదు.—మత్తయి 24:3, 7-14, 32-39.
అన్నిచోట్లా ఉన్న ప్రజలు యేసు హెచ్చరికను చాలా గంభీరంగా తీసుకోవలసిన అత్యవసర పరిస్థితి ఉంది: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34) కాబట్టి, అదే తీసుకోవలసిన జ్ఞానవంతమైన చర్య అన్నది స్పష్టమైన విషయం. అగ్నిపర్వతం యొక్క హెచ్చరికా సంకేతాలను ఎలా ‘ఏం పర్లేదులే’ అన్నట్లు తీసుకోమో, “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి” అని ఉద్బోధించిన మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు వచ్చే సమయం దగ్గర పడుతుండడాన్ని కూడా మనం అలక్ష్యం చేయకూడదు.—మత్తయి 24:44.
[అధస్సూచీలు]
a 1997, మార్చి 8, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రిక భీతిగొలిపే ఈ పర్వతాన్ని గురించి నివేదించింది.
[23వ పేజీలోని చిత్రాలు]
పొపొకెటిపీటల్ ఛాయలో మార్తా [గాడిదపైన ఉన్న ఆమె] ఇతరులూ సాక్ష్యమిస్తున్నారు