మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
మీరు ఇటీవలి కావలికోటల శీర్షికలకు జాగ్రత్తగా అవధానమిచ్చారా? అలాగైతే, ఈ క్రింది వాటిని జ్ఞాపకం చేసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది:
◻ పూర్వనిర్ధారణ సిద్ధాంతం ఎందువల్ల నిర్హేతుకమైనది?
ఆదాము పాపంలో పడతాడని యెహోవా దేవునికి ముందుగా తెలిసివుంటే, అలా జరగాలని ఆయన ఆదేశించి ఉంటే, ఆయన మానవుణ్ణి చేసినప్పుడే, పాపానికి మూలకర్తయ్యుండేవాడు, అలా సమస్త మానవ దుష్టత్వానికీ, బాధలకూ ఆయనే బాధ్యుడయ్యేవాడు. దానికీ యెహోవా దుష్టత్వాన్ని అసహ్యించుకునే ప్రేమామయుడైన దేవుడు అనే వాస్తవానికీ పొందికే ఉండదు. (కీర్తన 33:5; సామెతలు 15:9; 1 యోహాను 4:8)— 4/15, 7, 8 పేజీలు.
◻ యెషయా 2:2-4 నెరవేర్పులో అనేక దేశాల్లోని జనులు ఏమి చేస్తున్నారు?
వాళ్ళు యెహోవా ఆరాధనా మందిరంలోనికి ప్రవాహముగా వస్తూ ఉండగా, “యుద్ధంచేయ నేర్చుకొనుట” నుండి దూరంగా ఉన్నారు. ఎందుకంటే, శాంతి శత్రువులనందరినీ హతమార్చేందుకు సిద్ధంగా ఉన్న దేవుని పరలోక సైన్యాలు ఇచ్చే కాపుదలలో తమ నమ్మకాన్నుంచారు.—4/15, 30వ పేజీ.
◻ యోవేలు 3:10, 11లో చెప్పబడిన యెహోవా పరాక్రమశాలులెవరు?
బైబిలులో దాదాపు 280 సార్లు సత్య దేవుడు “సైన్యములకధిపతియగు యెహోవా” అని పిలువబడ్డాడు. (2 రాజులు 3:14, NW) ఈ సైన్యాలు, యెహోవా ఆజ్ఞ మేరకు చేయడానికి సిద్ధంగా ఉండే పరలోక దూతలే.—5/1, పేజీలు 23, 24.
◻ యోబుకు వ్యతిరేకంగా విపరీతంగా మాట్లాడినవారి కోసం యోబు ప్రార్థన చేయాలని యెహోవా కోరిన దాని నుండి మనమేమి నేర్చుకోగలం? (యోబు 42:8)
యోబు ఆరోగ్యవంతమైన స్థితికి తిరిగి రాకముందు, ఆయన తనకు వ్యతిరేకంగా విపరీతంగా మాట్లాడినవారి కోసం ప్రార్థించాలని యెహోవా కోరాడు. మన సొంత పాపాలను క్షమించాలంటే, ముందు మనం, మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళను క్షమించాలని యెహోవా కోరుతున్నాడని ఇది చూపిస్తుంది. (మత్తయి 6:12; ఎఫెసీయులు 4:32)—5/1, 31వ పేజీ.
◻ “ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి” అని యాకోబు చెప్పిన మాటల అర్థమేమిటి? (యాకోబు 1:4)
ఓర్పు చేయవలసిన ఒక పని ఉంది, ఒక “క్రియ.” మనలను సమస్త విషయాల్లో సంపూర్ణులుగా చేయడమే దాని నియామకం. కనుక, శోధనలను త్వరగా అంతం చేసుకునేందుకు లేఖనవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించేందుకు ప్రయత్నించకుండా ఆ శోధనలు పూర్తయ్యేందుకు అనుమతించడం ద్వారా మన విశ్వాసం పరీక్షించబడి శుద్ధీకరించబడుతుంది.—5/15, 16వ పేజీ.
◻ మానవజాతి యొక్క సమస్యలను పరిష్కరించడానికి దేవుడు ఇంత ఎక్కువ కాలం ఎందుకు ఆగాడు?
సమయాన్ని గూర్చిన యెహోవా దృక్పథం మన దృక్పథానికి భిన్నంగా ఉంటుంది. నిత్యుడైన దేవుని దృష్టిలో, ఆదాము సృష్టి నుండి ఇప్పటి వరకు గడిచిన సమయం కనీసం ఒక వారం కూడా కాదు. (2 పేతురు 3:8) సమయాన్ని గూర్చిన మన దృక్పథం ఏదైనప్పటికీ, గడిచే ప్రతి దినమూ మనల్ని యెహోవా సంకల్ప నెరవేర్పుకు దగ్గర చేస్తుంది.—6/1, 5, 6 పేజీలు.
◻ యెహోవాసాక్షులను ఏది పురికొల్పుతుంది?
యెహోవా బోధ, ఒకరినొకరూ అలాగే తమ పొరుగువారినీ తమవలె ప్రేమించేలా బోధించబడిన ఒక విశేషమైన ప్రజలను ఉత్పన్నం చేసింది. (యెషయా 54:13) ఉదాసీనత లేక హింస ఉన్నప్పటికీ ప్రకటనాపనిని కొనసాగించడానికి యెహోవాసాక్షులను పురికొల్పేది ప్రేమే. (మత్తయి 22:36-40; 1 కొరింథీయులు 13:1-8)—6/15, 20వ పేజీ.
◻ “ఇరుకు ద్వారమున ప్రవేశింప మీరు తీవ్రంగా పోరాడండి; నేను చెప్పేదేమనగా, అనేకులు ప్రవేశింప జూస్తారు గాని వారివలన కాదు” (లూకా 13:24, NW) అన్న యేసు మాటల్లో ఏమి సూచించబడుతుంది?
మనం గట్టి పోరాటం చేయాలని, ఎక్కువ కృషిచేయాలని యేసు మాటలు సూచిస్తున్నాయి. కొందరు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో లేదా తాము కోరిన రీతిలో సావధానంగా మాత్రమే ద్వారమున ‘ప్రవేశింపజూతురని’ కూడా యేసు మాటలు సూచిస్తున్నాయి. ‘నేను కష్టించి, పరిశ్రమించి, ముందుకు సాగుతున్నానా?’ అని ప్రతి ఒక్కరమూ ప్రశ్నించుకోవాలి.—6/15, 31వ పేజీ.
◻ మరణమొందినవారు “ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున” ఎలా “తీర్పు”పొందుతారు? (ప్రకటన 20:12)
ఈ గ్రంథములు గత కాల క్రియల రికార్డులు కావు; వాళ్ళు మరణించినప్పుడు, వారు తమ తమ జీవితకాలంలో చేసిన పాపాల నుండి విముక్తులయ్యారు. (రోమీయులు 6:7, 23) అయితే, పునరుత్థానమైన మానవులు ఆదాము పాపం క్రిందే ఉంటారు. కనుక, అప్పుడు, యేసుక్రీస్తు బలి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందేందుకు అందరూ అనుసరించవలసిన దైవిక నిర్దేశాలను ఆ గ్రంథాలు అందజేస్తాయి.—7/1, 22వ పేజీ.
◻ పొరుగువాడైన సమరయుని గురించిన యేసు ఉపమానంలో ఏ పాఠాలు ఇమిడి ఉన్నాయి? (లూకా 10:30-37)
నిజంగా నీతిమంతుడైన వ్యక్తి దేవుని నియమాలకు విధేయుడవ్వడమే కాక ఆయన లక్షణాలను కూడా అనుకరిస్తాడని యేసు చెప్పిన ఈ ఉపమానం చూపిస్తుంది. (ఎఫెసీయులు 5:1) పొరుగు వారి పట్ల అనురాగం జాతీయ, సాంస్కృతిక, మరియు మతపర అడ్డంకులను అన్నింటినీ అధిగమించాలని ఈ ఉపమానం చూపిస్తుంది. (గలతీయులు 6:10)—7/1, పేజీ 31.
◻ మీ పిల్లలను అర్థం చేసుకుని, తల్లిదండ్రులుగా వారికి నడిపింపునివ్వగల మూడు రంగాలు ఏవి?
(1) మీ పిల్లలు సముచితమైన లౌకిక వృత్తిని ఎంపిక చేసుకునేందుకు సహాయపడండి; (2) స్కూల్లోనూ, పనిస్థలంలోనూ కలిగే భావోద్వేగపరమైన ఒత్తిడిని ఎదుర్కునేందుకు వారిని సిద్ధం చెయ్యండి; (3) తమ ఆధ్యాత్మిక అవసరతలను ఎలా సంతృప్తిపరచుకోవాలో వారికి చూపించండి.—7/15, 4వ పేజీ.
◻ “ఆ యేడవ దినమున” దేవుడు ఏ ఉద్దేశంతో విశ్రాంతి తీసుకున్నాడు? (ఆదికాండము 2:1-3)
ఆయన విశ్రమించింది అలసిపోయినందుకు కాదు. తన హస్తకృతి వృద్ధి చెంది తనకు స్తుతినీ ఘనతనూ తెచ్చేలా అది పూర్తి మహిమకు వచ్చేందుకుగాను ఆయన భూసంబంధ సృష్టి కార్యం నుండి విరమించుకున్నాడు.—7/15, 18వ పేజీ.
◻ మనం న్యాయాన్ని అనుసరించగల మూడు మార్గాలేవి?
మొదటిగా, మనం తప్పనిసరిగా దేవుని నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. (యెషయా 1:17) రెండవదిగా, యెహోవా మనలను ఎలా చూడాలని మనం కోరుకుంటామో ఇతరులను మనం అలా చూసినప్పుడు న్యాయాన్ని అనుసరించినవారమౌతాం. (కీర్తన 130:3, 4) మూడవదిగా, మనం ప్రకటనా పనిలో శ్రద్ధాపూర్వకంగా భాగం వహించడానికి కృషిచేసినప్పుడు మనం దైవిక న్యాయాన్ని ప్రదర్శించినవారమౌతాం. (సామెతలు 3:27)—8/1, 14, 15 పేజీలు.