కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/15 పేజీలు 15-20
  • దేవుని నీతినందు మన నమ్మకాన్ని బలపర్చుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని నీతినందు మన నమ్మకాన్ని బలపర్చుకోవడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనవసరంగా బాధపడ్డామనే భావాలు
  • యోనా నుండి నేర్చుకోవడం
  • మన నమ్మకాన్ని బలపర్చుకునేందుకు ఇదే సమయం
  • యెహోవా తీర్పు న్యాయమైనది
  • మన నమ్మకం యెహోవాయై ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/15 పేజీలు 15-20

దేవుని నీతినందు మన నమ్మకాన్ని బలపర్చుకోవడం

“నీవు యెహోవాను ఆశ్రయంచునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?”—సామెతలు 22:19.

1, 2. (ఎ) యెహోవాసాక్షులు యెహోవాపై నమ్మకాన్ని ఎందుకు చూపిస్తారు? (సామెతలు 22:19) (బి) కొంతమంది వ్యక్తులు యెహోవాపై తమకున్న నమ్మకాన్ని బలపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఏది సూచిస్తోంది?

నిజ క్రైస్తవులు యెహోవాను గూర్చిన, ఆయన సంకల్పాల్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానంతో ఆశీర్వదించబడ్డారు. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ వారికి “తగినవేళ” ఆధ్యాత్మిక ‘ఆహారము’ను ప్రేమపూర్వకంగా పంచిపెడుతున్నాడు. (మత్తయి 24:45) వాళ్లు సంపాదించిన జ్ఞానం వారికొక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది, దేవునిపై నమ్మకానికి ఆ పునాది ఆధారమవ్వాలి. అలా యెహోవాసాక్షులు ఓ గుంపుగా యెహోవాపైనా, ఆయన నీతిపైనా విశిష్టమైన నమ్మకాన్ని చూపిస్తారు.

2 అయితే, వ్యక్తులుగా కొంతమంది సాక్షులు అలాంటి నమ్మకాన్ని బలపర్చుకోవాల్సిన అవసరమున్నట్టు కనబడుతోంది. సొసైటీ ప్రచురణల్లో ఇవ్వబడిన వివరణలను గూర్చి సందేహాన్ని వ్యక్తపర్చే ఉత్తరాలు అప్పడప్పుడూ సొసైటీకి వస్తున్నాయి. ఆ సందేహాలు ఇంతకు ముందున్న అవగాహనలో చేయబడిన సవరింపులకు ప్రతిస్పందనయై ఉండవచ్చు లేదా వివరాలను అడిగే వ్యక్తిని ప్రభావితంచేసిన, మరి విశేషంగా భావోద్రేకమైన రీతిలో ప్రభావితం చేసిన విషయాలకు సంబంధించినవైనా అయ్యుండవచ్చు.—యోహాను 6:60, 61 పోల్చండి.

3. యెహోవా దేవుని నమ్మకమైన సేవకులకు కూడా ఏమి సంభవించవచ్చు, ఎందుకు?

3 ప్రసంగి 9:11లో ఉన్న సత్యసంధతను యెహోవా నిజ సేవకులు కూడా అనుభవిస్తారు: “నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశముచేతనే అందరికి కలుగుచున్నవి.” విస్తృతార్థంలో లేదా ఆధ్యాత్మికార్థంలో ఇది వాస్తవమని ఎలా రుజువుకాగలదు? బైబిలు సలహాలను అన్వయించుకోవడంలో వేగిరపడే, సత్యం తరుపున వాదించడంలో యుద్ధవీరుల్లా బలంగా ఉండే, బైబిలు సలహాల్ని అన్వయించడంలో తెలివితేటలుగల, ఖచ్చితమైన జ్ఞానాన్ని వెంబడించడంలో ఆసక్తిపరులైన క్రైస్తవులు మనకు తెలిసివుండవచ్చు. అయినప్పటికీ, ‘అదృష్టవశాన్నిబట్టీ, కాలవశాన్నిబట్టీ’ కొంతమంది ప్రమాదాలకు గురవ్వడం మూలంగానో లేదా వృద్ధాప్యం మూలంగానో ఇంతకుముందు చేస్తున్నట్టుగా ఇప్పుడు చేయలేకపోవచ్చు. తాము ఎన్నటికీ మరణించకుండా దేవుని నూతన లోకంలోనికి ప్రవేశిస్తామా లేదా అని వాళ్లు ఆలోచిస్తుండవచ్చు.

4, 5. యెహోవా దేవుని నీతిపైనా నమ్మకాన్ని కోల్పోవడానికి క్రైస్తవులకు ఏవిధమైన కారణమూ ఎందుకు లేదు?

4 తన వివాహజత మరణించినప్పుడు ఒక క్రైస్తవుడు పడే బాధా, కోల్పోయామనే భావనా వర్ణనాతీతం. సంవత్సరాల తరబడి లేదా దశాబ్దాల తరబడి వాళ్లు దంపతులుగా కలిసి యెహోవా సేవచేసి ఉండవచ్చు. మరణం వివాహ బంధాన్ని అంతం చేస్తుందనే విషయం బ్రతికివున్న జతకు తెలుసు.a (1 కొరింథీయులు 7:39) ఇప్పుడు, తన నమ్మకం సన్నగిల్లిపోకుండా కాపాడుకోవడానికి ఆయన తన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకోవాలి.

5 వివాహజతనో, తల్లినో/తండ్రినో, బిడ్డనో లేదా సన్నిహిత క్రైస్తవ స్నేహితుడ్నో మరణమందు కోల్పోవడం అనే విషయాన్ని యెహోవా నీతినందు నమ్మకాన్ని చూపించేందుకొక అవకాశంగా తీసుకోవడం ఎంత జ్ఞానయుక్తమైనదో కదా! వ్యక్తిగతంగా కోల్పోయినప్పటికీ కూడా, యెహోవా అన్యాయస్థుడు కాదని మనం నమ్మకాన్ని కల్గివుండొచ్చు. ఈ విధానాంతాన్ని తప్పించుకోవడం ద్వారాగానీ లేదా పునరుత్థానం ద్వారాగానీ నిత్యజీవాన్ని సంపాదించుకునే వ్యక్తులు ధన్యులౌతారనే దృఢనమ్మకాన్ని మనం కల్గివుండవచ్చు. దేవుని గురించి కీర్తనల గ్రంథకర్త ఇలా చెబుతున్నాడు: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.”—కీర్తన 145:16-19.

అనవసరంగా బాధపడ్డామనే భావాలు

6, 7. (ఎ) గతంలో బాధలకు గురైన కొంతమంది సాక్షులు ఇప్పుడు భిన్నమైన అవగాహనను ఎందుకు కల్గివుండవచ్చు? (బి) గతంలో అలా బాధించబడడానికి అనుమతించినందువల్ల యెహోవాను అన్యాయస్థునిగా మనమెందుకు దృష్టించకూడదు?

6 తమ మనస్సాక్షి ఇప్పుడు చేయడానికి ఒప్పుకొనే ఒక కార్యకలాపంలో కొంతమంది సాక్షులు గతంలో భాగం వహించడానికి తిరస్కరించినందున వాళ్లు బాధల్ని అనుభవించారు. ఉదాహరణకు, కొన్ని రకాలైన పౌరసంబంధిత సేవలకు సంబంధించి కొన్ని సంవత్సరాల క్రిందట వాళ్ల ఎంపిక అదే అయివుండవచ్చు. ఒక సహోదరుడు, ప్రస్తుత విధానానికి సంబంధించి తన క్రైస్తవ తటస్థతను అతిక్రమించకుండా అలాంటి సేవల్ని తాను మనస్సాక్షిపూర్వకంగా చేయగలనని ఇప్పుడు భావించవచ్చు.

7 ఏ విధమైన పర్యవసానాలూ లేకుండా తానిప్పుడు చేసేదాన్ని ఇంతకు ముందు తిరస్కరించడం మూలంగా తాను బాధకు గురయ్యేలా అనుమతించడం యెహోవా అన్యాయంచేసినట్టౌతుందా? అలాంటి అనుభవాన్ని పొందిన అనేకులు, అలా భావించడం లేదు. దానికి బదులుగా, విశ్వ సర్వాధిపత్యాన్ని గూర్చిన వివాదాంశంపై తాము దృఢంగా ఉండేందుకు నిశ్చయించుకున్నామని బహిరంగంగానూ, స్పష్టంగానూ చూపించే అవకాశం తమకు లభించినందుకు వాళ్లు ఆనందిస్తారు. (యోబు 27:5 పోల్చండి.) యెహోవా కోసం దృఢమైన స్థానాన్ని తీసుకోవడంలో తమ మనస్సాక్షిని అనుసరించినందుకు బాధపడడానికి ఎవరికైనా ఏ కారణం ఉంటుంది? క్రైస్తవ సూత్రాల్ని తాము అర్థంచేసుకొన్న రీతిలోనే వాటిని యథార్థంగా అంటిపెట్టుకోవడం ద్వారా లేదా తమ మనస్సాక్షి గద్దింపులకు ప్రతిస్పందించడం ద్వారా వాళ్లు యెహోవా దేవుని స్నేహితులుగా ఉండడానికి అర్హులని రుజువుపర్చుకున్నారు. ఒకని మనస్సాక్షిని కలతపర్చే పనినిగానీ లేదా ఇతరులకు అభ్యంతరం కల్గించే అవకాశమున్న పనినిగానీ చేయకుండా ఉండడం నిశ్చయంగా జ్ఞానయుక్తమైన పని. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఉంచిన మాదిరిని గూర్చి మనం ఆలోచించవచ్చు.—1 కొరింథీయులు 8:12, 13; 10:31-33.

8. మొదట్లో ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకున్న యూదా క్రైస్తవులకు యెహోవా నీతిని ప్రశ్నించడానికి ఏ కారణమూ ఎందుకు లేదు?

8 యెహోవాను ప్రీతిపర్చడానికి, యూదులు పది ఆజ్ఞలకూ అలాగే విస్తృత వైవిధ్యంగల 600 అదనపు చట్టాలకూ లోబడాల్సి ఉంది. ఆ తర్వాత క్రైస్తవ ఏర్పాటు క్రింద, యెహోవా సేవ చేయడానికి ఆ చట్టాలకు విధేయత చూపించాల్సిన అవసరం ఇంకెంత మాత్రం లేదు. శరీరసంబంధమైన యూదులకు కూడా ఆ అవసరంలేదు. అలా విధేయత చూపించాల్సిన అవసరంలేని చట్టాల్లో సున్నతి, విశ్రాంతి దిన ఆచరణ, జంతు బలుల్ని అర్పించడం, ఆహారసంబంధమైన కొన్ని నిషేధాలను పాటించడం వంటి వాటితో వ్యవహరించే చట్టాలు ఇమిడి ఉన్నాయి. (1 కొరింథీయులు 7:19; 10:25; కొలొస్సయులు 2:16, 17; హెబ్రీయులు 10:1, 11-14) అపొస్తలులతోపాటుగా క్రైస్తవులైన యూదులు తాము ధర్మశాస్త్ర నిబంధనక్రింద ఉన్నప్పుడు విధేయత చూపించవలసి వచ్చిన చట్టాలను అనుసరించాల్సిన బాధ్యత నుండి విడుదల పొందారు. తాము ఇంకెంత మాత్రం ఆచరించాల్సిన అవసరంలేని వాటిని ఇంతకుముందు ఆచరింపజేసినందుకు దేవుని ఏర్పాటు అన్యాయమైనదని వాళ్లు ఫిర్యాదు చేశారా? లేదు, యెహోవా సంకల్పాల్ని గూర్చి విశాలపర్చబడిన అవగాహననుబట్టి వాళ్లు ఆనందించారు.—అపొస్తలుల కార్యములు 16:4, 5.

9. కొంతమంది సాక్షుల విషయంలో ఏది వాస్తవమై ఉంది, కానీ వాళ్లు విచారించాల్సిన అవసరం ఎందుకు లేదు?

9 ఆధునిక కాలాల్లో, తామేం చేయాలి లేదా ఏం చేయకూడదు అనే దాన్ని గూర్చి తమ అభిప్రాయం విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే సాక్షులు కొంతమంది ఉన్నారు. ఆ కారణాన్నిబట్టే వాళ్లు ఇతరులకన్నా ఎక్కువగా బాధల్ని అనుభవించారు. ఆ తర్వాత, వాటి విషయంలో తమ అభిప్రాయాన్ని విశాలపర్చుకునేందుకు వారికి పెరిగిన జ్ఞానం సహాయపడింది. కానీ గతంలో తమ మనస్సాక్షికి అనుగుణంగా పనిచేసినందుకూ, మరి అలా పనిచేయడంవల్ల బహుశా అధికంగా బాధల్ని అనుభవించాల్సి వచ్చినందుకూ వాళ్లు విచారించాల్సిన కారణమేమీ లేదు. ‘సువార్త కొరకు సమస్తాన్ని చేయడం’ ఎడలా, యెహోవా ఎడలా నమ్మకంగా ఉండడంలో బాధల్ని అనుభవించేందుకు వాళ్లు సుముఖతను చూపించడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అలాంటి దైవభక్తిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (1 కొరింథీయులు 9:23; హెబ్రీయులు 6:10) అపొస్తలుడైన పేతురు జ్ఞానంతో ఇలా రాశాడు: “మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.”—1 పేతురు 2:20.

యోనా నుండి నేర్చుకోవడం

10, 11. (ఎ) నీనెవెకు వెళ్లమనే నియామకాన్ని ఇచ్చినప్పుడూ, (బి) నీనెవె పట్టణవాసుల్ని దేవుడు నాశనం చేయనప్పుడూ యెహోవాపై నమ్మకాన్ని కోల్పోయినట్టు యోనా ఎలా చూపించుకున్నాడు?

10 నీనెవె పట్టణానికి వెళ్లమని చెప్పినప్పుడు, యోనా యెహోవా తనపై ఉంచిన నమ్మకం ఎడల ప్రశంసను చూపించలేదు. విధేయత చూపించడానికి ఇష్టపడనందువల్ల తనపైకి వచ్చిన భయానకమైన ఉపద్రవాన్ని అనుభవించిన తర్వాత, యోనా మూర్ఖంగా ఆలోచించడం మాని, తన తప్పును గ్రహించాడు, తన విదేశీ నియామకాన్ని అంగీకరించి, నీనెవె పట్టణవాసులపైకి రానైవున్న నాశనాన్ని గురించి హెచ్చరించాడు. ఆపై ఎదురుచూడనిదొకటి జరిగింది: నీనెవె పట్టణవాసులు చూపిన పశ్చాత్తాపాన్నిబట్టి, యెహోవా వాళ్లను నాశనం చేయకూడదని నిశ్చయించుకున్నాడు.—యోనా 1:1–3:10.

11 యోనా ప్రతిస్పందన ఏమిటి? నిరాశచెందినవాడై, ఆయన ప్రార్థనలో దేవునికి ఫిర్యాదు చేశాడు. ఆయన పడ్డ బాధను గురించి క్లుప్తంగా చెప్పాలంటే: ‘ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే నీనెవెకు వెళ్లకూడదని మొదట్లోనే అనుకున్నాను. పెద్ద చేప మ్రింగివేయడంవల్ల కల్గిన భయావమానాలతోపాటు నేనింత అనుభవించిన తర్వాతా, నీనెవె పట్టణవాసులపైకి రానున్న నాశనాన్ని గురించి హెచ్చరించడంలో నేనింతగా కష్టపడ్డ తర్వాతా, చివరికి జరిగిందిది! నేను పడ్డ కష్టాలూ, బాధలూ ఎందుకూ కొరగాకుండా పోయాయి! నేను చచ్చినా బాగుండేది!’—యోనా 4:1-3.

12. యోనా అనుభవాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 ఫిర్యాదు చేయడానికి యోనాకు తగిన కారణముందా? పశ్చాత్తాపపడ్డ తప్పిదస్థుల ఎడల దయను చూపించడంలో యెహోవా అన్యాయం చేసినట్లా? నిజం చెప్పాలంటే, యోనా ఆనందించి ఉండాల్సింది; నాశనంకాకుండా వేలాదిమంది ప్రజలు తప్పించబడ్డారు! (యోనా 4:11) కానీ ఆయన కల్గివున్న అమర్యాదకరమైన, ఫిర్యాదుచేసే దృక్పథం, యెహోవా నీతినందు ప్రగాఢమైన నమ్మకాన్ని ఆయన వ్యక్తపర్చలేదని చూపిస్తోంది. ఆయన తన గురించి మరీ ఎక్కువగా ఆలోచించాడు, ఇతరుల్ని గురించి మరీ తక్కువగా ఆలోచించాడు. మనకూ, మన వ్యక్తిగత భావాలకూ అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా ఉండడం ద్వారా మనం యోనా నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకుందాం. యెహోవాకు విధేయత చూపించడం, ఆయన సంస్థ ద్వారా ఇవ్వబడిన నడిపింపును అనుసరించడం, ఆయన నిర్ణయాల్ని అంగీకరించడం అనేవి చేయదగినటువంటి సరియైన విషయాలని మనం నిశ్చయత కలిగివుందాం. ‘[సత్య] దేవునికి భయపడువారు క్షేమముగా ఉందురని” మనం ఒప్పించబడ్డాం.—ప్రసంగి 8:12.

మన నమ్మకాన్ని బలపర్చుకునేందుకు ఇదే సమయం

13. యెహోవాపై మన నమ్మకాన్ని మనమంతా ఎలా బలపర్చుకోవచ్చు?

13 యెహోవాపై మన నమ్మకాన్ని బలపర్చుకోవడమనేది జ్ఞానయుక్తమైన పని. (సామెతలు 3:5-8) నిజమే, నమ్మకాన్ని దృఢపర్చుకోవడానికి మనకు సహాయంచేయమని యెహోవాను ప్రార్థించడంకన్నా మనమింకా ఎక్కువే చేయాలి. ఖచ్చితమైన జ్ఞానం ఆధారంగా నమ్మకం పెరుగుతుంది కాబట్టి వ్యక్తిగత బైబిలు పఠనాన్ని అంటే బైబిల్నీ, బైబిలును గురించి వివరించే సాహిత్యాల్నీ చదవడం మన దినచర్యలో ఓ భాగంగా చేసుకోవాలి. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవ్వడం ప్రాముఖ్యం. బాగా సిద్ధపడడమూ, సాధ్యమైనంత మేరకు భాగంవహించడమూ కూడా అంతే ప్రాముఖ్యం. ఇతరులతో బైబిలు సత్యాల్ని పంచుకోవడాన్ని ఓ అలవాటుగా చేసుకోవడం, ఆటంకాల్ని యుక్తిగా అధిగమించడం అనేవి యెహోవాపైనా ఆయన వాక్యంపైనా మన నమ్మకాన్ని పెంచుతాయి కూడా. ఆ విధంగా మనం ప్రతీ రోజూ ఆయనపై ఆధారపడేవారమౌతాం.

14. ఇంతకు మునుపెన్నటికన్నా ఎక్కువగా యెహోవాపై తమ నమ్మకాన్ని చూపించడానికి దేవుని ప్రజలు త్వరలోనే ఎందుకు పిలువబడతారు?

14 సమీప భవిష్యత్తులో, మానవజాతికి ఇంతవరకూ సంభవించని అతిగొప్ప శ్రమకాలం అకస్మాత్తుగా రానైవుంది. (మత్తయి 24:21) అది వచ్చినప్పుడు, దేవుని సేవకులు యెహోవా నీతిపైనా, ఆయన సంస్థ ఇచ్చే నడిపింపుపైనా ఇంతకు ముందు ఎన్నడూ చూపించనంత నమ్మకాన్ని చూపించడం అవసరం. సూచనార్థకంగా చెప్పాలంటే, అప్పుడు వాళ్లు “నా జనమా, . . . నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము” అనే దేవుని ఆజ్ఞకు నమ్మకంగా విధేయత చూపిస్తారు. (యెషయా 26:20, 21) వాళ్లిప్పటికే 232 దేశాల్లో 85,000కన్నా ఎక్కువగా ఉన్న సంఘాలయందున్న సురక్షిత వాతావరణంలోనికి ప్రవేశించారు. “నీ అంతఃపురములలో ప్రవేశించుము” అనే ఆజ్ఞకు అదనంగా ఇంకేది చేర్చబడినప్పటికీ, దానికి కూడా లోబడడానికి యెహోవా మనకు సహాయపడతాడనే నిశ్చయతను కల్గివుండవచ్చు.

15. నమ్మకాన్ని గూర్చిన విషయం 1998వ సంవత్సరంలో ఏ విధంగా నొక్కి చెప్పబడింది, మరి అదెందుకు సరియైనది?

15 మన నమ్మకాన్ని ఇప్పుడు బలపర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన క్రైస్తవ సహోదరులపైనా, యెహోవా సంస్థపైనా, అన్నింటికన్నా మిన్నగా యెహోవాపైనా నమ్మకంలేకపోతే, ఈ విధానాంతాన్ని తప్పించుకోవడం దుర్లభమౌతుంది. కాబట్టి “యెహోవా నామమునుబట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు రక్షించబడతారు” అనే వార్షిక వచనంలోని మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు 1998వ సంవత్సరంలో పదేపదే జ్ఞాపకం చేయబడడం ఎంత సముచితమో కదా! (రోమీయులు 10:13, NW) దాన్ని గురించి మనం నిశ్చింతగా ఉండాలి. ఈ నమ్మకంపై ఇసుమంతైనా అనుమానం ఉన్నట్టు మనం పసిగట్టినట్లైతే, దాన్నిప్పుడే, అవును ఈ రోజే సరిచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి.

యెహోవా తీర్పు న్యాయమైనది

16. నమ్మకాన్ని గనుక పెంపొందించుకోకపోతే దానికేం సంభవించవచ్చు, అలా జరగడాన్ని మనమెలా అరికట్టవచ్చు?

16 హెబ్రీయులు 3:14లో అభిషిక్త క్రైస్తవులు ఇలా హెచ్చరించబడ్డారు: “మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము [నమ్మకమును] అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.” సూత్రప్రాయంగా చెప్పాలంటే, భూనిరీక్షణగల క్రైస్తవులకు కూడా ఆ మాటలు అన్వయిస్తాయి. మొదట్లో ఉన్న నమ్మకాన్ని గనుక పెంచుకోకపోతే అది హరించుకుపోగలదు. ఖచ్చితమైన జ్ఞానాన్ని వెంబడించడంలో మనం కొనసాగడం, తద్వారా మన నమ్మకం దేనిపై ఆధారపడి ఉందో ఆ పునాదిని బలపర్చుకోవడమూ ఎంత ప్రాముఖ్యమో కదా!

17. విధానాంతాన్నుండి తప్పించుకోవడం విషయంలో యేసు సరియైనవిధంగా తీర్పు తీరుస్తాడని మనమెందుకు నమ్మకాన్ని కల్గివుండవచ్చు?

17 “గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన [క్రీస్తు] వారిని [జనాంగాల్ని] వేరుపర[చ]”గలిగేలా జనాంగములన్నింటినీ ఆయన త్వరలోనే పరీక్షిస్తాడు. (మత్తయి 25:31-33) రక్షించబడడానికి ఎవరు యోగ్యులౌతారని తీర్పుతీర్చడంలో క్రీస్తు న్యాయవంతుడని మనం నిశ్చయతకల్గి ఉండవచ్చు. “నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీ[ర్చేందుకు]” జ్ఞానాన్నీ, అంతర్దృష్టినీ, మరితర అవసరమైన లక్షణాల్నీ యెహోవా ఆయనకు ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 17:30, 31) “ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా”? అని చెప్పిన అబ్రాహాముకు ఎటువంటి ఒప్పుదల ఉందో మన ఒప్పుదల కూడా అలానే ఉండాలి!—ఆదికాండము 18:25.

18. ప్రస్తుతం మనకు తెలియని వాటిని గురించి మనమెందుకు అమితంగా చింతించకూడదు?

18 యెహోవా నీతిపై పూర్ణ నమ్మకాన్ని కల్గివుండడంద్వారా, ‘శిశువులూ, చిన్నపిల్లలూ ఎలా తీర్పుతీర్చబడతారు? అర్మగిద్దోను వచ్చేటప్పటికి అనేకమంది ప్రజలకు సువార్త గురించి అస్సలు తెలియకపోతే అప్పుడెలా? మానసిక రోగుల సంగతేమిటి? . . . సంగతేమిటి?’ వంటి ప్రశ్నలకు జవాబులను కనుగొనడాన్ని గురించి చింతించాల్సిన అవసరంలేదు. నిజమే, ఈ విషయాల్ని యెహోవా ఎలా పరిష్కరిస్తాడో ప్రస్తుతానికి మనకు తెలియదు. అయితే, ఆయన నీతియుక్తమైన రీతిలోనూ, దయాపూర్వకమైన రీతిలోనూ వాటిని పరిష్కరిస్తాడు. దాన్ని గురించి మనమెన్నటికీ సందేహించకూడదు. నిజానికి, మనమెన్నడూ తలంచని రీతిలో వాటిని ఆయన పరిష్కరించడాన్ని చూడడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉండవచ్చు.—పోల్చండి యోబు 42:3; కీర్తన 78:11-16; 136:4-9; మత్తయి 15:31; లూకా 2:47.

19, 20. (ఎ) సహేతుకమైన ప్రశ్నల్ని అడగడం ఎందుకు తప్పుకాదు? (బి) అవసరమైన జవాబుల్ని యెహోవా ఎప్పుడు ఇస్తాడు?

19 కొంతమంది వ్యతిరేకులు అంటున్నట్లుగా, యెహోవా సంస్థ యథార్థమైన ప్రశ్నలనూ, సమయోచితమైన ప్రశ్నలనూ అడగడాన్ని నిరుత్సాహపర్చదు. (1 పేతురు 1:10-12) అయినప్పటికీ, మనం మూర్ఖమైన, ఊహాగానాలతో కూడిన ప్రశ్నలను విడిచిపెట్టాలని బైబిలు సలహా ఇస్తోంది. (తీతు 3:9, NW) సహేతుకమైన ప్రశ్నల్ని అడగడమూ, లేఖనాధారమైన జవాబుల్ని పొందడానికి దేవుని వాక్యాన్నీ, క్రైస్తవ ప్రచురణల్నీ పరిశోధించడమూ మన ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుతాయి, ఆ విధంగా యెహోవాపై మనకున్న నమ్మకాన్ని బలపర్చగల్గుతాయి. సంస్థ యేసు మాదిరిని అనుసరిస్తోంది. కొన్ని ప్రశ్నలకు జవాబివ్వడానికి సరియైన సమయం రానప్పుడు వాటిపై వ్యాఖ్యానించడానికి ఆయన తెగించలేదు. ఆయనిలా వివరించాడు: “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యప్పుడు మీరు వాటిని సహింపలేరు.” (యోహాను 16:12) కొన్ని విషయాలు ఆ సమయంలో తనకు కూడా తెలియవని ఆయన ఒప్పుకున్నాడు.—మత్తయి 24:36.

20 బయల్పర్చడానికి యెహోవా దగ్గర ఇంకా ఎంతో ఉంది. ఆయన తన సంకల్పాల్ని తగిన సమయంలో బయల్పరుస్తాడనే నమ్మకంతో ఆయనపై ఆధారపడి ఉండడం ఎంత జ్ఞానయుక్తమో కదా! యెహోవా దేవుని నియమిత సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన మార్గాల్ని గూర్చి అదనపు జ్ఞానాన్ని పొందే ఆనందాన్ని మనం కల్గివుంటామనే నిశ్చయతను కల్గివుండవచ్చు. అవును, యెహోవాపైనా ఆయన ఉపయోగిస్తున్న సంస్థపైనా పూర్ణ నమ్మకాన్ని మనం పెంపొందించుకుంటే, మనం బహుమానాన్ని పొందుతాం. సామెతలు 14:26 మనకిలా అభయమిస్తోంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము [“నమ్మకము,” NW] పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు.”

[అధస్సూచీలు]

a కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 15, 1967, 638వ పేజీ; జూన్‌ 1 (ఆంగ్లం) 1987, 30వ పేజీ చూడండి.

మీరు ఏమనుకుంటున్నారు?

◻ యెహోవాపై మనకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేసేందుకు భావోద్రేకాల్ని అనుమతించడం ఎందుకు జ్ఞానయుక్తమైన పనికాదు?

◻ యోనా అనుభవం నుండి మనమేం నేర్చుకోగలం?

◻ బైబిలు పఠనమూ, కూటాలకు హాజరవ్వడమూ ఎందుకంత ప్రాముఖ్యం?

[16వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగతంగా కోల్పోయినప్పటికీ కూడా, యెహోవా నీతిమంతుడని మనం నమ్మకాన్ని కల్గివుండొచ్చు

[18వ పేజీలోని చిత్రాలు]

మీ నమ్మకం యెహోవాపైనే ఉందని మీరు నిశ్చయత కల్గివున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి