కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/15 పేజీలు 10-15
  • మన నమ్మకం యెహోవాయై ఉండాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన నమ్మకం యెహోవాయై ఉండాలి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తెలుసుకోవడంపైనా, స్నేహంపైనా ఆధారపడిన నమ్మకం
  • యెహోవా నియమించిన వారిపై నమ్మకాన్ని చూపించడం
  • యెహోవా చేసే నియామకాలను సందేహించకండి
  • యెహోవా నీతియందు నమ్మకాన్ని చూపించడం
  • దేవుని నీతినందు మన నమ్మకాన్ని బలపర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/15 పేజీలు 10-15

మన నమ్మకం యెహోవాయై ఉండాలి

“యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.”—సామెతలు 3:26.

1. అనేకమంది దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటున్నా, వాళ్లు అన్నివేళలా నమ్మకాన్ని ఉంచరని ఏది సూచిస్తోంది?

“దేవుని మీద మాకు నమ్మకముంది” అనే సూక్తి అమెరికా కరెన్సీపై కనబడుతుంది. అయితే, ఆ దేశంలోనైనా లేదా మరో దేశంలోనైనా సరే ఆ కరెన్సీని ఉపయోగించే వాళ్లంతా తమ నమ్మకాన్ని దేవునిపై నిజంగా ఉంచుతారా? లేదా వాళ్లు డబ్బుపైనే మరింతగా తమ నమ్మకాన్ని ఉంచుతారా? ఆ దేశంలోనైనా లేదా మరే ఇతర దేశంలోనైనా డబ్బుపై ఉంచే అలాంటి నమ్మకానికి, తన అధికారాన్ని ఎన్నటికీ దుర్వినియోగపర్చని, ఏ విధంగానూ అత్యాశపరుడుకాని ప్రేమగల సర్వశక్తునిపై ఉంచే నమ్మకంతో పొత్తుకుదర్చలేం. నిజం చెప్పాలంటే, ఆయన అత్యాశను స్పష్టంగా ఖండిస్తున్నాడు.—ఎఫెసీయులు 5:5, పవిత్రగ్రంథం వ్యాఖ్యానసహితం.

2. ఐశ్వర్యాన్నికున్న శక్తిని గూర్చి నిజ క్రైస్తవులు ఏ దృక్పథాన్ని కల్గివున్నారు?

2 నిజ క్రైస్తవులు తమ నమ్మకాన్ని ‘మోసపూరితమైన శక్తి’గల ఐశ్వర్యంపై కాదుగానీ దేవునిపై ఉంచుతారు. (మత్తయి 13:22, NW) సంతోషాన్ని పెంపొందించేందుకూ, జీవితాన్ని కాపాడేందుకూ డబ్బుకున్న శక్తి ఎంతో పరిమితమైనదని వాళ్లు గుర్తిస్తారు. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి విషయంలో మాత్రం ఇది వాస్తవం కాదు. (జెఫన్యా 1:18) కాబట్టి, “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా” అనే ఉద్బోధన ఎంత జ్ఞానయుక్తమైనది!—హెబ్రీయులు 13:5.

3. పౌలు ఎత్తి రాసిన ద్వితీయోపదేశకాండము 31:6పై ఆ వచనపు పూర్వాపరాలు ఎలా వెలుగును ప్రసరింపజేశాయి?

3 అపొస్తలుడైన పౌలు పై మాటలను హెబ్రీ క్రైస్తవులకు రాస్తున్నప్పుడు, ఆ మాటలను ఆయన మోషే తాను మరణించడానికి కొంచెం కాలం ముందు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఉపదేశాలనుండి ఉల్లేఖించాడు: “భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.” (ద్వితీయోపదేశకాండము 31:6) తమ భౌతికావసరాల్ని తీరుస్తాడని పైపై నమ్మకాన్ని కల్గివుండడంకన్నా మిన్నయైన నమ్మకాన్ని యెహోవాపై ఉంచాలని మోషే ప్రోత్సహిస్తున్నాడని ఆ సందర్భం చూపిస్తోంది. అదెలా?

4. తాను నమ్మదగిన దేవుడినని యెహోవా ఇశ్రాయేలీయులకు ఎలా రుజువు చేసుకున్నాడు?

4 ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించాల్సి వచ్చిన 40 ఏళ్ల కాలంలో, దేవుడు వారి జీవితావసరాలను తీర్చడంలో నమ్మకంగా ఉన్నాడు. (ద్వితీయోపదేశకాండము 2:7; 29:5) ఆయన నాయకత్వాన్ని కూడా దయచేశాడు. పగటివేళలో కన్పించిన మేఘమూ, రాత్రివేళలో కన్పించిన అగ్నిస్తంభమూ దానికొక వ్యక్తీకరణయై ఉన్నాయి. ఇవి ఇశ్రాయేలీయులను ‘పాలు తేనెలు ప్రవహించు దేశానికి’ నడిపించాయి. (నిర్గమకాండము 3:8; 40:36-38) వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోయే సమయం ఆసన్నమైనప్పుడు, మోషే తర్వాతి నాయకునిగా యెహోషువను యెహోవా ఎంపికచేసుకున్నాడు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు తిరగబడే అవకాశముంది. అయినా, యెహోవా తన ప్రజలతోపాటూ దశాబ్దాలుగా సంచరించాడు, కాబట్టి భయపడాల్సిన అవసరమేమీ లేదు. యెహోవా నమ్మదగిన దేవుడని తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులకు బలమైన కారణముంది!

5. నేటి క్రైస్తవుల పరిస్థితి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకముందున్న ఇశ్రాయేలీయుల పరిస్థితిని ఎలా పోలివుంది?

5 క్రైస్తవులు దేవుని నూతన లోకానికి చేసే తమ ప్రయాణంలో ప్రస్తుత దుష్టలోకమనే అరణ్యం గుండా నేడు సంచరిస్తున్నారు. వారిలో కొంతమంది 40 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నుండి ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్లిప్పుడు దేవుని నూతన లోక సరిహద్దు దగ్గర నిలబడివున్నారు. అయినప్పటికీ, పాలు తేనెలు ప్రవహించిన ప్రాచీనకాలంనాటి వాగ్దాన దేశంకన్నా మరెంతో దివ్యమైన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా వారిలో ప్రతిఒక్కరినీ అడ్డుకోవాలనే ఉద్దేశంతో శత్రువులు ఆటంకాలు కలుగజేస్తున్నారు. కాబట్టి “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని అపొస్తలుడైన పౌలు పునరుద్ఘాటించిన మోషే మాటలు, నేడు క్రైస్తవులకు ఎంత తగినవిగా ఉన్నాయో కదా! దృఢంగానూ, ధైర్యంగానూ, పూర్ణ విశ్వాసంతోనూ ఉండి, యెహోవాపై నమ్మకాన్ని కల్గివున్న వారందరికీ ప్రతిఫలం నిశ్చయంగా దొరుకుతుంది.

తెలుసుకోవడంపైనా, స్నేహంపైనా ఆధారపడిన నమ్మకం

6, 7. (ఎ) యెహోవాపై అబ్రాహాముకున్న నమ్మకాన్ని ఏది శోధించింది? (బి) తాను ఇస్సాకును దహనబలిగా అర్పించాల్సిన ప్రదేశానికి ప్రయాణం చేస్తుండగా అబ్రహాము ఎలా భావించి ఉండొచ్చు?

6 ఒక సందర్భంలో, తన కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రాహాము ఆజ్ఞాపించబడ్డాడు. (ఆదికాండము 22:2) ఆ ప్రేమగల తండ్రి ఆ ఆజ్ఞకు తక్షణమే ఇష్టపూర్వకంగా విధేయత చూపించేంత అచంచలమైన నమ్మకాన్ని యెహోవాపై కల్గివుండేలా చేసిందేమిటి? హెబ్రీయులు 11:17-19 ఇలా జవాబిస్తోంది: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,—ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.”

7 దహనబలిని అర్పించాల్సిన స్థలానికి చేరుకోవడానికి అబ్రాహాము ఇస్సాకులకు మూడు రోజులు పడుతుందనే విషయాన్ని జ్ఞాపకంచేసుకోండి. (ఆదికాండము 22:4) దేవుడు చేయమని ఆజ్ఞాపించిన దానిని గురించి పునరాలోచించుకోవడానికి అబ్రాహాముకు ఎంతో సమయం ఉంది. ఆయన భావాలనూ, భావోద్రేకాలనూ మనం ఊహించగలమా? ఇస్సాకు జననం ఎదురుచూడని ఆనందాన్ని తెచ్చింది. ఆ విషయంలో దేవుడు జోక్యం కలుగజేసుకున్నాడనే రుజువు అబ్రాహాముకూ, గతంలో గొడ్రాలుగా ఉన్న ఆయన భార్యయైన శారాకూ దేవునితో ఉన్న సంబంధాన్ని మరింత పటిష్టం చేసింది. అటు తర్వాత వాళ్లు ఇస్సాకుకూ, అతని సంతానానికీ వేచివున్న భవిష్యత్తును గూర్చిన నిరీక్షణతోనే గడిపారు. దేవుడు ఇప్పుడు అడిగినదాన్నిబట్టి చూస్తే, వాళ్ల ఆశలు అడియాశలు కాబోతున్నట్టు అన్పించిందా?

8. దేవునిపై అబ్రాహాముకున్న నమ్మకం, దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేస్తాడని తెలుసుకోవడంకన్నా ఏ విధంగా మించినదై ఉంది?

8 అయినప్పటికీ, సన్నిహిత స్నేహితులకు ఒకరిని గురించి మరొకరికి ఎలా తెలిసివుంటుందో అలా అబ్రాహాము నమ్మకం యెహోవాను గురించి తనకు తెలిసివున్న దానిపై ఆధారపడింది. ‘యెహోవా స్నేహితునిగా’ అబ్రాహాము “దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను.” (యాకోబు 2:23) యెహోవాపై అబ్రాహాముకున్న నమ్మకం దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేయగలడని తెలుసుకోవడం కన్నా ఇంకా ముందుకు సాగింది. అబ్రాహాముకు వాస్తవాలన్నీ తెలియకపోయినప్పటికీ, తనను చేయమని యెహోవా అడుగుతున్నది సరియైనదని అబ్రాహాము అదే విధంగా ఒప్పించబడ్డాడు. ఇలా చేయమని అడగడం యెహోవాకు న్యాయమేనా అని ప్రశ్నించడానికి ఆయనకు ఏ కారణమూ లేదు. అయితే, ఇస్సాకును బలి ఇవ్వడానికి చంపబోతుండగా యెహోవా దూత జోక్యంచేసుకొని ఆపుచేయడంతో అబ్రాహాము నమ్మకం బలపర్చబడింది.—ఆదికాండము 22:9-14.

9, 10. (ఎ) అబ్రాహాము యెహోవాపై నమ్మకాన్ని ముందెప్పుడు చూపించాడు? (బి) అబ్రాహామునుండి మనమే ప్రాముఖ్యమైన గుణపాఠాన్ని నేర్చుకోగలం?

9 దాదాపు 25 ఏళ్ల క్రిందట అబ్రాహాము యెహోవా న్యాయమందు ఇదే విధమైన నమ్మకాన్ని చూపించాడు. సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు నాశనంకాబోతున్నాయని హెచ్చరించబడ్డప్పుడు, ఆయన అక్కడ నివసిస్తున్న తన సోదరుని కుమారుడైన లోతు క్షేమంతోపాటూ, నీతిమంతులంటూ ఎవరైనా ఉంటే వారి క్షేమాన్ని గురించీ సహజంగానే చింతించాడు. అబ్రాహాము దేవునికిలా విజ్ఞప్తి చేశాడు: “ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా”?—ఆదికాండము 18:25.

10 యెహోవా ఎన్నడూ అన్యాయం చేయడని మూలపురుషుడైన అబ్రాహాము ఒప్పించబడ్డాడు. ఆ తర్వాత కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు.” (కీర్తన 145:17) మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా న్యాయాన్ని సందేహించకుండా, ఆయన దేన్ని అనుమతిస్తే దాన్ని అనుభవించడానికి నేను అంగీకరిస్తున్నానా? ఆయన దేన్ని అనుమతించినా చివరికది నాకూ, మరితరులకూ మేలు తీసుకొచ్చేదిగానే మారుతుందని నేను ఒప్పించబడ్డానా?’ మనం అవునని జవాబు చెప్పగల్గినట్లైతే, అబ్రాహాము నుండి మనమొక ప్రాముఖ్యమైన గుణపాఠాన్ని నేర్చుకొన్నట్టే.

యెహోవా నియమించిన వారిపై నమ్మకాన్ని చూపించడం

11, 12. (ఎ) దేవుని సేవకులకు ఎలాంటి నమ్మకం అవసరం? (బి) కొన్నిసార్లు మనకు ఏది ఒక సమస్యగా ఉండవచ్చు?

11 యెహోవాను తమ నమ్మకంగా దృష్టించేవారు, తన సంకల్పాల్ని నెరవేర్చడంలో ఉపయోగించుకునేందుకు ఆయన నియమించిన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని చూపించాలి. ఇశ్రాయేలీయులకైతే, మోషేపైనా, ఆయన తర్వాత నాయకత్వాన్ని చేపట్టిన యెహోషువపైనా నమ్మకాన్ని చూపించడమే దీని అర్థమైవుంది. తొలి క్రైస్తవులకైతే, యెరూషలేము సంఘంలో ఉన్న అపొస్తలులపైనా పెద్దలపైనా నమ్మకాన్ని చూపించడమని దీని అర్థం. నేడు మనకైతే, “తగినవేళ” మనకు ఆధ్యాత్మిక ‘ఆహారాన్ని పెట్టడానికి’ నియమించబడిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’పైనా, అలాగే వారిలో నుండి పరిపాలక సభగా రూపొందించబడినవారిపైనా నమ్మకాన్ని ఉంచడమని దీనర్థం.—మత్తయి 24:45.

12 నిజానికి, క్రెస్తవ సంఘంలో నడిపింపునిస్తున్న వారిపై మనం నమ్మకముంచడం, మన మేలు కొరకే. మనకిలా చెప్పబడింది: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.”—హెబ్రీయులు 13:17.

యెహోవా చేసే నియామకాలను సందేహించకండి

13. నడిపింపునివ్వడానికి నియమించబడినవారిపై నమ్మకాన్ని ఉంచడానికి మనకే కారణముంది?

13 యెహోవా ప్రజల్లో నడిపింపునిస్తున్న వారిపై నమ్మకాన్ని చూపించడంలో సమతూకాన్ని కల్గివుండేందుకు బైబిలు మనకు సహాయం చేస్తోంది. మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘మోషే ఎన్నడూ తప్పులు చేయలేదా? యేసు కోరుకున్నట్టుగానే అపొస్తలులు ఎల్లప్పుడూ క్రీస్తులాంటి దృక్పథాన్ని చూపించారా? జవాబులు స్పష్టంగా ఉన్నాయి. యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి అసంపూర్ణులే అయినప్పటికీ యథార్థవంతులూ, అంకితభావంగల వారూ అయిన వ్యక్తులను ఎన్నుకొన్నాడు. అదే ప్రకారంగా, నేటి పెద్దలు కూడా అపరిపూర్ణులే అయినప్పటికీ, “[దేవుని] సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ[చే నియమించబడిన] . . . అధ్యక్షు[లుగా]” వారిని మనం గుర్తించాలి. మన మద్దతూ, గౌరవమూ పొందడానికి వాళ్లు పాత్రులు.—అపొస్తలుల కార్యములు 20:28.

14. నాయకునిగా అహరోనునో లేదా మిర్యామునో గాక మోషేను యెహోవా ఎంపికచేసుకోవడంలో గుర్తించదగిన విషయమేమైవుంది?

14 అహరోను, మోషేకన్నా మూడేళ్లు పెద్దవాడు, కానీ వాళ్లిద్దరూ తమ సహోదరియైన మిర్యాముకన్నా చిన్నవాళ్లే. (నిర్గమకాండము 2:3, 4; 7:7) మోషేకన్నా అహరోను ధారాళంగా మాట్లాడగలడు గనుక, ఆయన తన సహోదరునికి వాగ్దూతగా నియమించబడ్డాడు. (నిర్గమకాండము 6:29–7:2) అయినప్పటికీ, ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి, వాళ్లకన్నా పెద్దదైన మిర్యామునుగానీ, ఎంతో ధారాళంగా మాట్లాడే అహరోనునుగానీ యెహోవా ఎంపిక చేసుకోలేదు. ఆ కాలంలోని వాస్తవాలన్నింటినీ, అవసరాలన్నింటినీ పూర్తిగా గుర్తించిన మీదటే ఆయన మోషేను నియమించడం జరిగింది. స్పష్టంగా ఉన్న ఈ అంతర్దృష్టిని అహరోను మిర్యాములు కొంతకాలంపాటు కోల్పోయి, ఇలా ఫిర్యాదు చేశారు: “మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా?” మిర్యామూ, అహరోనులు “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికు[నిగా]” గుర్తించాల్సిన, యెహోవా నియమిత సేవకుని ఎడల అగౌరవప్రదమైన దృక్పథాన్ని చూపించారు. ఆ దృక్పథాన్ని ప్రేరేపించిన మూలకర్త మిర్యామే అయ్యుండవచ్చు గనుక, ఆమె శిక్షించబడింది.—సంఖ్యాకాండము 12:1-3, 9-15.

15, 16. యెహోవాపై తనకు నమ్మకముందని కాలేబు ఎలా రుజువు చేసుకున్నాడు?

15 వాగ్దాన దేశంలో వేగుచూచి రావడానికి 12మంది వేగులవారు పంపబడినప్పుడు, అందులో పదిమంది ప్రతికూలమైన రిపోర్టును తీసుకువచ్చారు. వాళ్లు ‘ఉన్నత దేహులైన’ కనానీయుల్ని గురించి చెప్పడం ద్వారా ఇశ్రాయేలీయుల హృదయాల్లో భయం పుట్టించారు. ఇది, ఇశ్రాయేలీయులు ‘మోషే అహరోనులపైని సణగడానికి’ కారణమైంది. అయితే వేగు చూడడానికి వెళ్లినవాళ్లంతా మోషేపైనా, యెహోవాపైనా అపనమ్మకాన్ని చూపించలేదు. మనమిలా చదువుతాం: “కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి—మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయంచుటకు మన శక్తి చాలుననెను.” (సంఖ్యాకాండము 13:2, 25-33; 14:2) కాలేబు తీసుకున్న దృఢమైన స్థానాన్నే ఆయన తోటి వేగులవాడైన యెహోషువ కూడా తీసుకున్నాడు. “యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. . . . ఆ దేశ ప్రజలకు భయపడకుడి, . . . యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకు[డి]” అని వాళ్లిద్దరూ చెప్పినప్పుడు, వాళ్లు యెహోవాను తమ నమ్మకంగా చేసుకున్నామని చూపించారు. (సంఖ్యాకాండము 14:6-9) యెహోవాపై వాళ్లుంచిన ఆ నమ్మకానికి ప్రతిఫలం లభించింది. ఆ సమయంలో జీవించి ఉన్న పెద్దల తరంలో కాలేబు, యెహోషువ, కొందరు లేవీయులు మాత్రమే వాగ్దానదేశంలోనికి ప్రవేశించే ఆధిక్యతను పొందారు.

16 కొన్ని సంవత్సరాల తర్వాత కాలేబు ఇలా తెలియజేశాడు: “నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. . . . యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటినుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బలమున్నది.” (యెహోషువ 14:6-11) కాలేబు అనుకూల దృక్పథాన్నీ, నమ్మకత్వాన్నీ, భౌతిక సామర్థ్యాల్నీ గమనించండి. అయినప్పటికీ, మోషే తర్వాత నాయకత్వాన్ని చేపట్టడానికి యెహోవా కాలేబును ఎంచుకోలేదు. ఆ ఆధిక్యత యెహోషువకు ఇవ్వబడింది. యెహోవా యెహోషువను ఎంచుకోవడానికి తగిన కారణాలు ఆయనకు ఉన్నాయని మనం నమ్మకంగా ఉండవచ్చు, మరి ఆ ఎంపిక శ్రేష్ఠమైనది.

17. బాధ్యతల్ని అప్పగించడానికి పేతురును అనర్హునిగా చేస్తున్నట్టు అన్పించేవి ఏవి?

17 అపొస్తలుడైన పేతురు తన యజమానిని ఎరుగనని మూడు సార్లు అన్నాడు. ఆయన అనాలోచితంగా పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగనరికాడు కూడా. (మత్తయి 26:47-55, 69-75; యోహాను 18:10, 11) పేతురు పిరికివాడనీ, సంయమనంలేని వ్యక్తనీ, ప్రత్యేక ఆధిక్యతల్ని పొందడానికి యోగ్యుడుకాదనీ కొందరనవచ్చు. అయినప్పటికీ, మూడుగుంపులకు పరలోకానికి వెళ్లే పిలుపునిచ్చేందుకు మార్గాన్ని తెరిచే ఆధిక్యతతో రాజ్య తాళాలు ఎవరికివ్వబడ్డాయి? పేతురుకే.—అపొస్తలుల కార్యములు 2:1-41; 8:14-17; 10:1-48.

18. యూదా చెప్పినట్టుగా, ఏ తప్పిదాన్ని మనం చేయకూడదు?

18 పైకి కన్పించేదాన్నిబట్టి తీర్పుతీర్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఈ మాదిరులు చూపిస్తున్నాయి. మనం యెహోవాపై నమ్మకాన్ని ఉంచితే, మనమాయన చేసే నియామకాలను సందేహించం. మేము తప్పులు చేయనివారమని ఎన్నడూ చెప్పుకొనని అపరిపూర్ణ మానవులతో భూసంబంధమైన ఆయన సంఘం రూపొందించబడినప్పటికీ, ఆయన వారిని శక్తివంతమైన రీతిలో ఉపయోగిస్తున్నాడు. యేసు సహోదరుడైన యూదా మొదటి శతాబ్దంలోని క్రైస్తవులను “ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషిం[చే]” వ్యక్తుల విషయమై జాగ్రత్తవహించమని హెచ్చరించాడు. (యూదా 8-10) మనం ఎన్నటికీ వారిలా ఉండకూడదు.

19. యెహోవా నియామకాలను మనం సందేహించడానికి ఏ కారణమూ ఎందుకు లేదు?

19 యెహోవా ఫలానా సమయంలో తన ప్రజలు ఏ మార్గంలో వెళ్లాలని అనుకుంటాడో ఆ మార్గంలో వారిని నడిపించేందుకు కావాల్సిన నిర్దిష్టమైన లక్షణాలున్న వ్యక్తులను కొన్ని బాధ్యతలకోసం ఎంపికచేసుకుంటాడని స్పష్టమౌతుంది. దేవుడు చేసే నియామకాలను సందేహించక, ఆయా వ్యక్తులుగా మనలను యెహోవా ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలోనే ఉండి వినయంగా సేవ చేయడంలో సంతృప్తి పొందుతూ ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మనం కృషిచేయాలి. ఆ విధంగా, మనం యెహోవాను మన నమ్మకంగా చేసుకొన్నామని చూపిస్తాం.—ఎఫెసీయులు 4:11-16; ఫిలిప్పీయులు 2:3.

యెహోవా నీతియందు నమ్మకాన్ని చూపించడం

20, 21. మోషేతో దేవుడు వ్యవహరించిన తీరు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

20 యెహోవాపై నమ్మకాన్ని అంతంత మాత్రంగా ఉంచి, మనపై అతినమ్మకాన్ని పెట్టుకోవడానికి కొన్నిసార్లు మనం మొగ్గుచూపిస్తే, మోషే నుండి గుణపాఠాన్ని నేర్చుకుందాం. ఆయన 40 ఏళ్ల వయస్సులో, ఐగుప్తు నిర్బంధంలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి తన సొంత ప్రయత్నాల్ని తాను చేశాడు. ఆయన ప్రయత్నాలు నిస్సందేహంగా సదుద్దేశంతో కూడినవేకానీ, అవి ఇశ్రాయేలీయులకు తక్షణమే విడుదలనూ కలుగజేయలేదు, పరిస్థితినీ ఏ విధంగానూ ఆయన మెరుగుపర్చలేదు. నిజానికి, ఆయన పారిపోవడానికి ఒత్తిడి చేయబడ్డాడు. 40 ఏళ్లు పరాయి దేశంలో క్లిష్టమైన శిక్షణ పొందిన తర్వాతనే, ఆయన మొదట్లో తాను చేయాలనుకున్న పనిని చేయడానికి ఎంపికచేసుకొనబడేందుకు అర్హుడయ్యాడు. యెహోవా దేవుని నియమితకాలంలో ఆయన అనుకున్న విధంగా ఇప్పుడా పని జరుగుతున్నందున ఈసారి తనకు యెహోవా మద్దతు ఉందనే నమ్మకాన్ని మోషే కల్గివుండగలిగాడు.—నిర్గమకాండము 2:11–3:10.

21 మనలో ప్రతి ఒక్కరూ తనను తాను ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘పనుల్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తూ లేదా వాటిని నా సొంత పంథాలోనే చేస్తూ నేను కొన్నిసార్లు యెహోవాకన్నా, సంఘంలో నియమించబడిన పెద్దలకన్నా ముందుగా పరిగెడుతున్నానా? ఆయా ఆధిక్యతల విషయంలో నిర్లక్ష్యపర్చబడ్డానని భావించడానికి బదులు, ఎడతెగకుండా నాకివ్వబడుతున్న శిక్షణను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ ప్రధానంగా, మోషేనుండి మనమొక ముఖ్యమైన గుణపాఠాన్ని నేర్చుకున్నామా?

22. గొప్ప ఆధిక్యతను కోల్పోయినప్పటికీ, మోషే యెహోవాను గురించి ఎలా భావించాడు?

22 అంతేగాక, మోషే నుండి మనం మరొక గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆయన చేసిన తప్పును గురించి సంఖ్యాకాండము 20:7-13 మనకు చెబుతోంది, ఆ తప్పు చేయడం మూలంగా ఆయన భారీగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోనికి నడిపించే ఆధిక్యతను ఆయన కోల్పోయాడు. ఆ విషయంలో యెహోవా తీసుకొన్న నిర్ణయం అన్యాయమైనదని ఆయన ప్రతిస్పందించాడా? అలంకారికంగా చెప్పాలంటే, దేవుడు ఆయనతో సరిగా వ్యవహరించలేదని ముఖం ముడుచుకొని ఓ మూలన కూర్చున్నాడా? మోషే యెహోవా నీతియందు నమ్మకాన్ని కోల్పోయాడా? తాను మరణించడానికి ముందు ఇశ్రాయేలీయులతో మోషే మాట్లాడిన మాటల్లోనే మనం జవాబును కనుగొనవచ్చు. యెహోవాను గురించి, మోషే ఇలా తెలియజేశాడు: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) మోషే తన జీవితాంతం యెహోవాపై నమ్మకాన్ని ఉంచాడు. మన సంగతేమిటి? యెహోవాపైనా, ఆయన నీతిపైనా మనకున్న నమ్మకాన్ని బలపర్చుకునేందుకు మనం వ్యక్తిగతంగా చర్యల్ని తీసుకుంటున్నామా? మనమదెలా చేయగలం? మనం చూద్దాం.

మీరెలా జవాబిస్తారు?

◻ యెహోవాపై నమ్మకం ఉంచడానికి ఇశ్రాయేలీయులు ఏ కారణాలను కల్గివున్నారు?

◻ నమ్మకం ఉంచడానికి సంబంధించి, అబ్రాహాము నుండి మనమేం నేర్చుకోవచ్చు?

◻ యెహోవా చేసే నియామకాలను సందేహించకుండా మనమెందుకు జాగ్రత్తవహించాలి?

[13వ పేజీలోని చిత్రం]

యెహోవాపై నమ్మకం ఉంచడంలో సంఘమందు నడిపింపునిస్తున్న వారిని గౌరవించడం కూడా చేరివుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి