మీ జీవితాన్ని అమూల్యమైనదిగా చేసుకోండి
తన తండ్రి క్యాన్సరుతో ఇంట్లో అవసానదశలో ఉన్నాడు. తన తండ్రి చెక్క పనిముట్లను సర్దుతూ కుమారుడు వర్క్‌షాప్‌లో ఉన్నాడు. ఆయన పనిముట్లను చక్కబెడుతూ, ఆ పనిముట్లతో తన తండ్రి చేసిన అద్భుతమైన వస్తువుల గురించి ఆలోచించాడు. వర్క్‌షాప్ ఇంటిప్రక్కనే ఉన్నా, తన తండ్రి ఇక మరెన్నడూ మళ్లీ ఇక్కడికి రాలేడనీ, ఆయన ఎంతో నైపుణ్యవంతంగా ఉపయోగించిన పనిముట్లను ఇక మరెన్నడూ ఉపయోగించలేడనీ ఆయనకు తెలుసు. ఆ కాలం ఇక తిరిగి రాదు.
ప్రసంగి 9:10 నందలి లేఖనాన్ని గురించి కుమారుడు ఆలోచించాడు: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” ఆయనకా లేఖనం బాగా తెలుసు. మరణమంటే నిష్క్రియా స్థితియనే బైబిలు సత్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు, ఆయన ఆ లేఖనాన్ని ఎన్నోసార్లు ఉపయోగించాడు. సొలొమోను చేస్తున్న వాదన ఆయన హృదయాన్నిప్పుడు బలంగా తాకింది—మనం ఆనందించగల సమయంలోనే మనం జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ, మన దినాలను ఆనందంగా గడపాలి ఎందుకంటే మనమిక అలా చేయలేని కాలం వస్తుంది.
జీవితాన్ని అనుభవించండి
ప్రసంగి పుస్తకమంతటిలోనూ, జ్ఞానవంతుడైన రాజగు సొలొమోను, జీవితంలో ఆనందాన్ని కనుగొనమని తన పాఠకులను ప్రోత్సహిస్తున్నాడు. ఉదాహరణకు, మూడవ అధ్యాయం ఇలా చెబుతుంది: “కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.”—ప్రసంగి 3:12, 13.
ఈ తలంపును పునరుద్ఘాటించడానికి సొలొమోను దేవునిచే ప్రేరేపించబడ్డాడు: “కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.”—ప్రసంగి 5:18.
అలాగే, యౌవనస్థులను ఆయనిలా పురికొల్పుతున్నాడు: “యౌవనుడా, [యౌవనురాలా,] నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యష్టము చొప్పునను ప్రవర్తింపుము.” (ప్రసంగి 11:9ఎ) యౌవనపు పూర్తి బలాన్ని శక్తినీ అనుభవించడం ఎంత చక్కగా ఉంటుందోకదా!—సామెతలు 20:29.
‘మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి’
అయితే, మన హృదయానికీ లేక నేత్రాలకూ నచ్చిన ప్రతిదాన్ని చేయడం జ్ఞానయుక్తమైనదని సొలొమోను చెప్పడం లేదు. (పోల్చండి 1 యోహాను 2:16.) ఆ తర్వాత ఆయన వ్రాసినదాన్నిబట్టి ఇది స్పష్టమౌతుంది: “అయతే వీటన్నిటినిబట్టి [మీ కోరికను తృప్తిపర్చే వాటిని బట్టి] దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము.” (ప్రసంగి 11:9బి) మన వయస్సు ఎంతైనప్పటికీ, మనం మన జీవితాలతో ఏమి చేస్తున్నామనే విషయాన్ని దేవుడు గమనిస్తాడనీ, తదనుగుణంగా మనకు తీర్పు తీరుస్తాడనీ మనం జ్ఞాపకముంచుకోవాలి.
ఇప్పుడు స్వార్థ జీవితాన్ని గడిపి, దైవభక్తి కల్గివుండడాన్ని తర్వాతి సంవత్సరాలకు వాయిదా వేయవచ్చునని తర్కించడం ఎంత మూర్ఖంగా ఉంటుందోకదా! మన జీవితం ఏ క్షణంలోనైనా అంతం కావచ్చు. అలా కాకపోయినా, వృద్ధాప్యంలో దేవుని సేవ చేయడం సులభమేమీ కాదు. ఈ వాస్తవాన్ని గుర్తించి, సొలొమోను ఇలా వ్రాస్తున్నాడు: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 12:1, 2.
వృద్ధాప్యానికి, దానికుండే సమస్యలు ఉండనే ఉన్నాయి. తర్వాత సొలొమోను సూచనార్థక పదాల్లో వృద్ధాప్య ప్రభావాలను వర్ణిస్తున్నాడు. చేతులు వణుకుతాయి, కాళ్లు బలహీనమౌతాయి, పళ్లు ఊడిపోతాయి. వెంట్రుకలు తెల్లబడి, రాలిపోతాయి. కేవలం పైపై నిద్ర పడుతుంది, అదీ కేవలం పక్షి శబ్దానికే మెలకువ వచ్చేస్తుంది. చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి వంటి ఇంద్రియాలు బలహీనమౌతాయి. బలహీనమైపోయిన శరీరం పడిపోతామనే భయాన్నీ, మార్గాల్లోని ఇతర “భయంకరమైన” వాటిని గూర్చిన భయాన్నీ ఉత్పన్నం చేస్తుంది. చివరికి వ్యక్తి మరణిస్తాడు.—ప్రసంగి 12:2-7.
తమ యౌవనదశలో ‘తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడంలో’ విఫలమైన వారికి ప్రాముఖ్యంగా వృద్ధాప్యం భయంకరమైనదిగా ఉంటుంది. తమ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నందుకు, ఆమెకు లేక ఆయనకు తర్వాతి సంవత్సరాల్లో ‘సంతోషము ఉండదు.’ భక్తిహీన జీవన విధానం వృద్ధాప్య సమస్యలనూ బాధలనూ అధికం చేయవచ్చు. (సామెతలు 5:3-11) దుఃఖకరంగా, అలాంటి వారు రాబోయే కాలం గురించి ఆలోచించినప్పుడు వారికి సమాధి తప్ప భవిష్యత్తేమి కనిపించదు.
వృద్ధాప్యమందు ఆనందించడం
అంటే దీని భావం, వృద్ధులు జీవితాన్ని ఆనందించలేరని కాదు. బైబిల్లో, ‘దీర్ఘాయువు, సుఖజీవముతో గడచు సంవత్సరములు’ దేవుని దీవెనతో ముడిపెట్టబడ్డాయి. (సామెతలు 3:1, 2) యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముతో ఇలా చెప్పాడు: “మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.” (ఆదికాండము 15:15) వృద్ధాప్యం తెచ్చే అసౌకర్యాలు ఉన్నప్పటికీ, యెహోవాకు సమర్పించబడిన తన జీవితాన్ని చూసుకుని సంతృప్తిచెందిన అబ్రాహాము తన వృద్ధాప్యంలో శాంతి సమాధానాలను అనుభవించాడు. “పునాదులుగల ఆ పట్టణము” అయిన దేవుని రాజ్యం కొరకు ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు. (హెబ్రీయులు 11:10) అందుకే, ఆయన “మంచి ముసలితనమున” మరణించాడు.—ఆదికాండము 25:8.
అందుకే సొలొమోను ఇలా ఉద్బోధించాడు: “ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల . . . తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను.” (ప్రసంగి 11:8) మనం యౌవనులమైనా లేక వృద్ధులమైనా, నిజమైన ఆనందం దేవునితో మనకుగల సంబంధంతో జతచేయబడివుంది.
వర్క్‌షాప్‌లోని యౌవనస్థుడు తన తండ్రి యొక్క చివరి పనిముట్టును ఎత్తిపెడుతుండగా, ఈ విషయాల గురించి ఆలోచించాడు. తమ జీవితాలను శ్రేష్ఠంగా గడపాలని ప్రయత్నించి, తమ సృష్టికర్తతో సంబంధం లేనందున సంతోషాన్ని కనుగొనలేకపోయిన, తనకు తెలిసిన ప్రజలందరి గురించీ ఆయన ఆలోచించాడు. ఒకరు తన జీవితంలో ఆనందాన్ని పొందాలని ప్రోత్సహించిన తర్వాత సొలొమోను ఈ మాటల్లో విషయాన్ని పొందుపర్చడం ఎంత తగినట్లుగా ఉందోకదా: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి”!—ప్రసంగి 12:13.