నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు!
నమ్మకం లేకపోవడాన్ని గూర్చిన ప్రస్తుత సంకటస్థితి “అంత్య దినముల” సూచన అయినప్పటికీ, ఈ నమ్మక లేమి వేల సంవత్సరాల క్రితమే స్పష్టమయ్యింది. (2 తిమోతి 3:1) అది మొదట, మనమెంత మాత్రం ఊహించలేనంతటి, సంతోషానందాలకు నిలయమైన తోటలో మొదలైంది. ఆ స్థలం గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.”—ఆదికాండము 2:8, 9.
నేడున్న నమ్మకం లేని పరిస్థితికి దానితో ఏమి సంబంధం ఉందనేదాని గురించి, తర్వాతి వచనాలు కొంత తెలియజేస్తాయి. మనమిలా చదువుతాము: “దేవుడైన యెహోవా—ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” (ఆదికాండము 2:16, 17) యెహోవా చెప్పినదాన్ని ఆదాము సందేహించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
మనమింకా ఇలా చదువుతాము: “దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో—ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ—ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము—మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను.”—ఆదికాండము 3:1-6.
దేవుని స్పష్టమైన హెచ్చరికను అలక్ష్యం చేయడం ద్వారా, ఆదాము హవ్వలు యెహోవా మీద తమకు నమ్మకం లేదని చూపించారు. అక్షరార్థమైన సర్పము ద్వారా హవ్వతో మాట్లాడిన, దేవుని శత్రువైన సాతానును వాళ్లు ప్రతిబింబించారు. యెహోవా పరిపాలనా విధానంలో సాతానుకు నమ్మకం లేదు. దీని మూలంగా, అహంకారంతో కూడిన కోరికతో నిండిన హృదయం మూలంగా, అతడు దేవుడ్ని వ్యతిరేకించి, మానవులు కూడా అలాగే వ్యతిరేకించేలా వారిని తప్పుదారి పట్టించాడు. దేవుడు నమ్మదగినవాడు కాదని వాళ్లు అనుకునేలా ఆయన వాళ్లను ప్రభావితం చేశాడు.
ఫలితం? చెడిపోయిన సంబంధాలు
ఇతరులను నమ్మనివారికి, స్నేహసంబంధాలను కాపాడుకోవడం కష్టంగా ఉంటుందని మీరు బహుశ గమనించేవుంటారు. సా.శ.పూ. మొదటి శతాబ్దానికి చెందిన లాటిన్ రచయితయైన పబ్లీలస్ సైరస్ ఇలా వ్రాశాడు: “స్నేహానికి పునాది నమ్మకమే.” ఆదాము హవ్వలు తమ తిరుగుబాటు చర్య ద్వారా, దేవుడ్ని తాము నమ్మలేదని చూపించారు. కాబట్టి, దేవుడు వారిని నమ్మడానికీ హేతువు లేదు. నమ్మకం పటాపంచలైపోవడంతో, మొదటి మానవులు దేవుని స్నేహాన్ని పోగొట్టుకున్నారు. వారు చేసిన తిరుగుబాటును బట్టి వారికి తీర్పు విధించిన తర్వాత, యెహోవా మళ్లీ వారితో మాట్లాడిన సూచన యేదీ లేదు.
ఆదాము హవ్వల మధ్యనున్న సంబంధం కూడా దెబ్బతిన్నది. “వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని” యెహోవా హవ్వను హెచ్చరించాడు. (ఇటాలిక్కులు మావి.) (ఆదికాండము 3:16) పవిత్ర గ్రంథము-క్యాతలిక్ అనువాదము ఇలా చెబుతుంది: “అతడు నీ మీద పెత్తనము చేయును.” దేవుడు కోరినట్లుగా తన భార్యపై ప్రేమపూర్వక శిరసత్వాన్ని నెరిపే బదులు, ఆదాము ఇప్పుడు ఆమె యజమానియై, ఆమెపై పెత్తనం చేయడం ప్రారంభించాడు.
వాళ్లు పాపం చేసిన తర్వాత, ఆదాము నిందను తన భార్య మీదికి నెట్టడానికి చూశాడు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఆమె చేసినదాన్ని బట్టే వారు పరిపూర్ణమైన తోటలోనుండి అసంపూర్ణంగా ఉన్న భూమి మీదికి వెళ్లగొట్టబడి, తిరిగి నేలకు చేరే వరకూ అపరిపూర్ణ పరిస్థితుల్లో బానిసత్వం చేసే శిక్ష విధించబడింది. (ఆదికాండము 3:17-19) ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డానికి ఇది కారణమై ఉంటుందని మనం ఊహించవచ్చు. తాను ఇక ఎన్నడూ హవ్వ మాట విననని చెబుతూ ఆదాము బహుశా అతిగా ప్రతిస్పందించి ఉండవచ్చు. తత్ఫలితంగా ‘ఇప్పటి నుండీ, నేను బాస్‌ను’ అని తాను ఆమెతో చెప్పడం న్యాయమేనని బహుశ ఆయన భావించి ఉండవచ్చు. అయితే మరో వైపున హవ్వ, కుటుంబ శిరస్సుగా ఆదాము తన పాత్రను నిర్వహించడంలో విఫలమవ్వడం చూసి, ఆయనలో తనకున్న నమ్మకాన్ని ఆమె కోల్పోయి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, దేవుని మీద తమకు నమ్మకం లేదని చూపించడం ద్వారా మానవులు ఆయనతో తమకుగల స్నేహాన్ని పోగొట్టుకుని, తమ ఇద్దరి మధ్యవున్న సంబంధాన్ని పాడుచేసుకున్నారు.
మనమెవరిని నమ్మగలం?
ఆదాము హవ్వల ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, ప్రతి ఒక్కరూ మన నమ్మకాన్ని పొందడానికి అర్హులుకాకపోవచ్చు. మనం ఎవరిని నమ్మవచ్చు ఎవరిని నమ్మకూడదు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు?
కీర్తన 146:3 ఇలా ఉపదేశిస్తుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.” యిర్మీయా 17:5-7 నందు మనమిలా చదువుతాము: “నరులను ఆశ్రయంచి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.” మరోవైపున, “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.”
నిజమే, మానవులపై నమ్మకం ఉంచడం తప్పేమీ కాదు. ఆ లేఖనాలు చెబుతున్నదేమిటంటే, దేవునిపై ఉంచిన నమ్మకం ఎన్నటికీ వమ్ముకాదు గానీ, అపరిపూర్ణ మానవులను నమ్మడం కొన్నిసార్లు నాశనానికి నడిపించవచ్చు. ఉదాహరణకు, కేవలం దేవుడు మాత్రమే సాధించగల్గేదాన్ని, అంటే రక్షణ చేకూర్చి పూర్తి శాంతి భద్రతలను తీసుకురావడాన్ని, మానవులు సాధిస్తారని వారిపై నమ్మకాన్నుంచే ప్రజలు నిరాశకు గురౌతారు.—కీర్తన 46:9; 1 థెస్సలొనీకయులు 5:3.
వాస్తవానికి, మానవులూ మానవ సంస్థలూ దేవుని సంకల్పాలకు అనుగుణ్యంగా పని చేస్తూ దైవిక సూత్రాలను ఆచరించినప్పుడే నమ్మకాన్ని చూరగొనడానికి అర్హత కల్గివుంటాయి. అందుకే, ఇతరులు మనపట్ల నమ్మకం కల్గివుండేలా మనం వారిని పురికొల్పాలనుకుంటే, మనం యథార్థమైనవారిగా నమ్మదగినవారిగా ఉంటూ, సత్యమే మాట్లాడాలి. (సామెతలు 12:19; ఎఫెసీయులు 4:25; హెబ్రీయులు 13:18) బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే, ఇతరులు మనపై ఉంచే నమ్మకం న్యాయమైనదౌతుంది, అది పరస్పరం బలపర్చుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి కారణమౌతుంది.
నమ్మకాన్ని పునరుద్ధరించడం
దేవునియందు నమ్మకం ఉంచి, ఇతరులు అలాగే చేయడానికి వారిని ప్రోత్సహించేందుకు యెహోవాసాక్షులకు బలమైన ఆధారం ఉంది. యెహోవా యథార్థవంతుడు, నమ్మకమైనవాడు, ఆయన చెప్పింది చేస్తాడని మనం ఎల్లప్పుడూ పూర్తిగా ఆయనపై ఆధారపడవచ్చు, ఎందుకంటే ‘ఆయన అబద్ధమాడజాలడు.’ ప్రేమగల దేవునియందు ఉంచబడే నమ్మకం ఎన్నడూ నిరాశకు గురిచేయదు.—హెబ్రీయులు 6:18; కీర్తన 94:14; యెషయా 46:9-11; 1 యోహాను 4:8.
యెహోవాపై నమ్మకం ఉంచడంలో ఐక్యపర్చబడిన, ఆయన సూత్రాలకు అనుగుణ్యంగా జీవించే ప్రజలు, ఒకరియందొకరు నమ్మకం కల్గివుండడానికి బలంగా పురికొల్పబడుతున్నారు. ఒకరినొకరు నమ్మలేకపోతున్న ఈ లోకంలో, నమ్మదగిన ప్రజలను కనుగొనగల్గడం ఎంత ఆనందకరమైన విషయం! ఇతరులు చెప్పే లేక చేసే ప్రతి దానిపైనా మనం పూర్తి నమ్మకాన్ని ఉంచగల్గితే ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించండి. దేవుడు వాగ్దానం చేసిన, రానైయున్న నూతన లోకంలో పరిస్థితి అలాగే ఉంటుంది. ఒకరినొకరు నమ్మకపోవడమన్నదే ఉండదిక!
అలాంటి పరిస్థితుల్లో జీవించడానికి మీరు ఇష్టపడతారా? అలాగైతే, జీవాన్ని పొందడానికి దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడనే దాని గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడం ద్వారా దేవునిపైనా, ఆయన వాగ్దానాలపైనా మీ నమ్మకాన్ని దృఢపర్చుకోవడానికి యెహోవాసాక్షులు మిమ్మల్ని ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు. దేవుడు ఉన్నాడనే రుజువులను, మానవజాతి సంక్షేమంపట్ల ఆయనకు శ్రద్ధ ఉందనే రుజువులను, త్వరలోనే తన రాజ్యం ద్వారా ప్రపంచ సమస్యల్ని సరిచేయడానికి ఆయన చర్యతీసుకుంటాడనే రుజువులను బైబిలు పఠనం ఇస్తుంది. దేవునియందూ, ఆయన వాక్యమైన బైబిలునందూ నమ్మకం ఉంచడం లక్షలాదిమంది నేర్చుకున్నారు. యెహోవాసాక్షులు తాము ఉచితంగా ఇస్తున్న బైబిలు పఠన కోర్సును మీకు సంతోషంగా నిర్వహించి చూపిస్తారు. లేదా మరింత సమాచారం కొరకు ఈ పత్రిక ప్రచారకులకు వ్రాయండి.
[5వ పేజీలోని చిత్రం]
దేవునియందు నమ్మకం లేకపోవడం, మానవ సంబంధాలు పాడైపోవడానికి దారితీస్తుంది
[6వ పేజీలోని చిత్రం]
మానవులు దైవిక సూత్రాలకు అనుగుణ్యంగా ప్రవర్తించినప్పుడే మన నమ్మకాన్ని చూరగొనడానికి అర్హులు