రాజ్య ప్రచారకుల నివేదిక
నమ్రతగా యెహోవా మార్గానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం
“దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి.” 26 శతాబ్దాల క్రితం, జెఫన్యా ప్రవక్త ప్రకటించిన ఈ ఆహ్వానం నేడు భూదిగంతముల వరకూ ఉన్న ప్రజలకు కూడా ఇవ్వబడుతుంది. (జెఫన్యా 2:3) యెహోవాను వెదకడమంటే ఏమిటి? అద్వితీయ సత్య దేవుడును, జీవముగల దేవుడునైన యెహోవాను గురించిన జ్ఞానాన్ని సంపాదించడంతో అలా వెదకడం ప్రారంభమౌతుంది.—యిర్మీయా 10:10; యోహాను 17:3.
అయితే, జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన దేవుని ఎదుట అంగీకృత స్థానాన్ని పొందలేం. ఒక వ్యక్తి దేవుని ప్రీతిని సంపాదించేందుకు, ఆ జ్ఞానాన్ని అమలులో పెట్టడం కూడా తప్పనిసరి. ఎలా? క్రింద ఇవ్వబడిన సూరినామ్లోని అనుభవం చెబుతున్నట్లు ఒకరు నమ్రతగా దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా తన ఆలోచనా సరళినీ, ప్రవర్తననూ మలచుకోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని అమలులో పెట్టవచ్చు.—ఎఫెసీయులు 4:22-24.
30వ పడిలో ఉన్న ఎడీ అనే స్కూల్ టీచర్, ‘నేటి సమాజంలో మతం ఎలాంటి పాత్రను నిర్వహిస్తుంది? పురాతన పుస్తకమైన బైబిలు ఆధునిక విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తుందా?’ అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను వాంఛించాడు. యెహోవాసాక్షులు ఆయనను సందర్శించి, ఈ ప్రశ్నలకు బైబిలు ఆధార సమాధానాలను చెప్పినప్పడు ఎడీ శ్రద్ధగా ఆలకించాడు. సాక్షులు ఇచ్చిన విశదీకరణలు వాస్తవమైనవేనా అని పరిశీలించేందుకు వాటిని వ్రాసిపెట్టుకున్నాడు కూడా.
తోకలేని కోతుల్లో దేవుడు కొంత మార్పును చేయగా మానవులు అయ్యారని తనకు నేర్పించిన మతంతో ఎడీ మునుపు సహవసించేవాడు. జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే ప్రచురణను సాక్షులు ప్రతిపాదించినప్పుడు ఆయన దానిని వెంటనే తీసుకున్నాడు. బైబిలు చెబుతున్న సృష్టి వృత్తాంతాన్ని ఆ పుస్తకం స్పష్టంగా వివరించడాన్ని చూసి ఆయన ముగ్ధుడయ్యాడు. బైబిలును పఠించడం ద్వారా తాను సత్యాన్ని కనుగొన్నాడని ఆయనకు బోధపడింది!
కానీ ఆయనకు ఇప్పుడు ఒక పరీక్ష ఎదురైంది. ఎడీ నివసించిన ఇంట్లో దొంగతనమూ, నిజాయితీ లేకపోవడమూ జీవన సరళిగా ఉండేది. తన రూమ్మేట్ల అవినీతికరమైన జీవన విధానాన్ని అనుసరించాలా లేక దేవుడ్ని మహిమపరచే జీవన సరళి కోసం అలాంటి ప్రవర్తనను విడనాడాలా అనే ప్రశ్న ఆయన ముందు నిలిచింది. ఎడీ జ్ఞానపూర్వకంగా రెండవదాన్నే ఎంచుకున్నాడు. ఆయన ఆ చెడు సహవాసాన్నంతా మానేసి, ఆ ఇంటి నుండి బయట పడ్డాడు.—1 కొరింథీయులు 15:33, 34.
ఎడీ రాజ్య మందిరంలో కూటాలకు హాజరు కానారంభించాక, చాలా వేగంగా పురోగతి సాధించాడు. ఆయన తన వస్త్రధారణలోనూ, కేశాలంకరణలోను మెరుగుపడ్డాడు. ఆయన తన స్నేహితులతోనూ, బంధువులతోనూ తను నేర్చుకుంటున్న విషయాలను గురించి మాట్లాడసాగాడు. తర్వాత, “సువార్త”ను బహిరంగంగా ప్రకటించే పనిలో భాగం వహించేందుకు తను అంగీకరించబడినప్పుడు ఎంతో ఆనందించాడు. (మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 20:20) 1996 డిశెంబర్లో, ఆయన ఎంతో కాలంగా ఎదురు చూసిన రోజు వచ్చింది. ఆయన యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను ఆ రోజు నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేశాడు.
“యెహోవాను వెదకుడి” అనే ఆహ్వానానికి ప్రతి సంవత్సరం లక్షలాదిమంది యథార్థ హృదయులు ప్రతిస్పందిస్తున్నారు. అలా చేయడంలో, సామెతలు 22:4లోని నిజాన్ని వారు గ్రహించగల్గుతున్నారు. ఆ వచనం ఇలా చెబుతుంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” అవును, నమ్రతగా యెహోవా మార్గానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం ద్వారా, సత్య ప్రేమికులు అలాంటి ఆశీర్వాదాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఈ భూమి మీదే రానున్న నిత్య ఆశీర్వాదాల కోసం నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.—కీర్తన 37:29.
[18వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
కరీబియన్ సముద్రం
గైయానా
సూరినామ్
ఫ్రెంచ్ గీయానా
బ్రెజిల్
[క్రెడిట్ లైను]
Globe: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.