కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/1 పేజీలు 19-24
  • ‘మేము చేయవలసినవే చేశాము’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మేము చేయవలసినవే చేశాము’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సత్యం ఎదురవ్వడం
  • సత్యంలో పురోగతి
  • నియామకంలో మార్పులు
  • బేతేలులో జీవితం అర్థవంతమైనది
  • విస్తరణలో ఆధిక్యతాపూర్వకమైన వంతు
  • నేను నేర్చుకున్న పాఠాలు
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • పూర్తికాల సేవ​—⁠నన్ను ఎంతోదూరం తీసుకెళ్లింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/1 పేజీలు 19-24

‘మేము చేయవలసినవే చేశాము’

జార్జ్‌ కవుచ్‌ చెప్పినట్లు

మేము ఉదయంపూట ఇంటింటి పరిచర్యలో గడిపిన తర్వాత, నా సహచరుడు రెండు సాండ్‌విచ్‌లను తెచ్చాడు. మేము తినడం ముగించిన తర్వాత, నేను ఒక దమ్ము లాగిద్దామని సిగరెట్‌ బయటకు తీశాను. “మీరు ఎంత కాలంగా సత్యంలో ఉన్నారు?” అని ఆయన అడిగారు. “నిన్న రాత్రే మొదటిసారిగా కూటానికి హాజరయ్యాను” అని ఆయనకు చెప్పాను.

నేను 1917 మార్చి 3న, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న పొలంలో, అవన్‌మోర్‌ అనే చిన్న టౌన్‌కు సమీపంలో జన్మించాను. మా అక్కా, మేము ఐదుగురు అన్నదమ్ములమూ అక్కడే పెరిగాం.

మాకు మత సంబంధమైన తర్ఫీదు అంతగా లభించలేదు. ఒకప్పుడు మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవారు. కానీ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, వాళ్ళు చర్చికి వెళ్ళడం మానేశారు. అయినప్పటికీ, మేము సృష్టికర్త ఉన్నాడని విశ్వసించేవాళ్ళం. మా కుటుంబ జీవితం బైబిలులో కనుగొనబడిన ప్రాథమిక సూత్రాల అనుసారంగా ఉండేది.

నేను నా తల్లిదండ్రుల నుండి పొందిన అత్యంత శ్రేష్ఠమైన తర్ఫీదు బాధ్యతను ఎలా తీసుకోవాలి, దానిని ఎలా నెరవేర్చాలి అన్న విషయంలోనే. రైతు జీవితమంటే అదే. అయితే మా జీవితం కేవలం పని చేయడంగా మాత్రమే ఉండేదికాదు. బాస్కెట్‌ బాల్‌, బేస్‌ బాల్‌, గుర్రపు స్వారీ, ఈత కొట్టడం వంటి ఆరోగ్యకరమైన వినోదాలను ఆస్వాదించేవాళ్ళం. ఆ కాలంలో డబ్బు చాలా తక్కువగా ఉండేది. అయినా పొలంలో జీవితం ఆహ్లాదకరంగా ఉండేది. ప్రాథమిక తరగతుల కోసం ఒక్క గదే ఉన్న పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. మేము హై స్కూల్‌ చదువు కోసం పట్టణానికి వెళ్ళాం.

ఒక రోజు రాత్రి నేను స్నేహితునితో పట్టణంలో నడుస్తున్నాను. చూడ చక్కని ఒక అమ్మాయి నా స్నేహితుడ్ని పలకరించేందుకు తన ఇంటి వెలుపలికి వచ్చింది. అతడు నన్ను ఫర్న్‌ ప్రూకు పరిచయం చేశాడు. స్కూలున్న వాడలోనే ఆమె ఇల్లు. నేను ఫర్న్‌ ఇంటి ముందు నుండి వెళ్తున్నప్పుడెల్లా ఆమె బయట ఏవో పనులు చేస్తూ కనిపించేది. ఆమె కష్టించి పని చేసే వ్యక్తి అని స్పష్టం. ఆ విషయం నన్ను ఆకట్టుకుంది. మేము మెల్లగా సన్నిహిత స్నేహాన్ని పెంపొందించుకున్నాం. అది మా మధ్య ప్రేమకు దారితీసింది. చివరికి 1936 ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్నాం.

బైబిలు సత్యం ఎదురవ్వడం

నేను జన్మించక మునుపు, టౌన్‌లో ఒక వృద్ధురాలుండేది. ఆమె మతం కారణంగా పట్టణంలోని ప్రజలు ఆమెతో నీచంగా వ్యవహరించేవారు. మా అమ్మ శనివారాల్లో టౌన్‌లోని దుకాణానికి వెళ్ళేటప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళేది. అమ్మ ఆమె ఇంటిని శుభ్రం చేసేది. ఆమె కోసం బయటిపనులు చేసి పెడ్తుండేది. ఆమె చనిపోయేంతవరకూ అమ్మ అలా చేసింది. బైబిలు విద్యార్థినియైన ఆ స్త్రీతో చాలా దయగా ప్రవర్తించినందుకు యెహోవా అమ్మను ఆశీర్వదించాడని నమ్ముతున్నాను. యెహోవాసాక్షులను అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలిచేవారు.

కొంత కాలం తర్వాత, మా మేనత్త పాప అకస్మాత్తుగా చనిపోయింది. చర్చి మా మేనత్తను ఏమాత్రం సాంత్వనపర్చలేదు. కానీ బైబిలు విద్యార్థినియైన పొరుగు స్త్రీ ఆమెను ఎంతో సాంత్వనపర్చింది. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగుతుందో ఆ బైబిలు విద్యార్థిని వివరించింది. (యోబు 14:13-15; ప్రసంగి 9:5, 10) అది ఆమెను ఎంతో సాంత్వనపర్చింది. అలా మా మేనత్త మా అమ్మతో పునరుత్థాన నిరీక్షణ గురించి మాట్లాడింది. మా అమ్మ తల్లిదండ్రులు అమ్మ చిన్నప్పుడే మరణించారు గనుక, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి సంభవిస్తుందన్న జిజ్ఞాస అమ్మలో ఉంది గనుక, ఇది అమ్మలో ఆసక్తిని రేకెత్తించింది. ఆ అనుభవం అనియతంగా సాక్ష్యమిచ్చే అవకాశాలను ఎల్లప్పుడూ ఉపయోగించడం ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని నా హృదయఫలకంపై ముద్రించింది.

1930లలో, ఉదయం రేడియోలో ప్రసారమయ్యే, జోసఫ్‌ ఎఫ్‌. రథర్‌ఫర్డ్‌—అప్పట్లో వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌—ఇచ్చే ప్రసంగాల్ని అమ్మ వినడం మొదలుపెట్టింది. ఆ సంవత్సరాల్లో, మేము నివసించిన ప్రాంతంలో సాక్షులు ఇంటింటి పరిచర్య కూడా మొదలు పెట్టారు. వాళ్ళు మా ఇంటి ఆవరణలో, ఒక చెట్టు నీడలో పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌ పెట్టి, బ్రదర్‌ రథర్‌ఫర్డ్‌ ప్రసంగ రికార్డులను వినిపించేవారు. ఆ రికార్డులూ, వాచ్‌టవర్‌ మరియు గోల్డన్‌ ఏజ్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికలూ మా అమ్మ ఆసక్తిని సజీవంగా ఉంచాయి.

కొన్ని సంవత్సరాల తర్వాత, 1938లో, దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకరి ఇంట్లో జరగనున్న ప్రత్యేక కూటం కోసం, కావలికోట చందాదారులను ఆహ్వానిస్తూ ఒక పోస్ట్‌ కార్డ్‌ పంపించబడింది. మా అమ్మ ఆ కూటానికి వెళ్ళాలని కోరుకుంది కనుక, నేనూ, ఫర్నూ, మా అన్నయ్యలిద్దరూ అమ్మ వెంట వెళ్ళాం. యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తలైన జాన్‌ బూత్‌ మరియు చాల్స్‌ హెస్లర్‌ అక్కడ హాజరైన దాదాపు 12 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత, మరుసటి రోజు నుండి పరిచర్యలో పాల్గొనేందుకు వాళ్ళు ఒక గుంపును సంస్థీకరించనారంభించారు. వాళ్ళతో వెళ్ళేందుకు ఎవరూ స్వచ్ఛందంగా ముందుకు రానందువల్ల, “మాతోపాటు ఎందుకు రాకూడదు?” అని సహోదరుడు హెస్లర్‌ నన్ను అడిగారు. వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. అయినా, వాళ్ళకు ఎందుకు సహాయం చేయకూడదు అని నాలో నేను తర్కించుకున్నాను.

మేము మధ్యాహ్నం దాకా ఇంటింటికి వెళ్ళాం. తర్వాత సహోదరుడు హెస్లర్‌ రెండు సాండ్‌విచ్‌లను తీసుకువచ్చారు. మేము చర్చి మెట్ల మీద కూర్చుని తినడం మొదలుపెట్టాం. నేను సిగరెట్‌ బయటకు తీసినప్పుడు సహోదరుడు హెస్లర్‌ తెలుసుకున్నారు నేను కేవలం ఒక్క కూటానికే హాజరయ్యానని. ఆయన ఆ రోజు సాయంకాలం మా ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, బైబిలు చర్చ కోసం మా పొరుగువారిని ఆహ్వానించమని మమ్మల్ని కోరారు. భోజనం తర్వాత, ఆయన మాతో బైబిలు పఠనం నిర్వహించారు, అక్కడికి వచ్చిన పది మందితో ప్రసంగించారు. మేము ప్రతివారం బైబిలు పఠించాలని ఆయన మాకు చెప్పాడు. మా పొరుగువారు అందుకు అంగీకరించనప్పటికీ, నేనూ, ఫర్నూ, ప్రతివారం బైబిలు పఠనం చేసే ఏర్పాటు చేసుకున్నాం.

సత్యంలో పురోగతి

ఆ తర్వాత, త్వరలోనే, నేనూ, ఫర్నూ ప్రాంతీయ పరిచర్యకు బయలుదేరాం. మేము కారు వెనుక సీట్లో కూర్చున్నాం. అలా మేము సిగరెట్‌ వెలిగించామా, అంతలోనే మా అన్నయ్య వెనక్కు తిరిగి, “సాక్షులు పొగ త్రాగరని ఈ మధ్యే గమనించాను” అన్నాడు. ఆయన అలా చెప్పనిది ఆలస్యం ఫర్న్‌ తన సిగరెట్‌ను కిటికీ గుండా బయట పడేసింది—నేను నా సిగరెట్‌ ముగించేశాను. మేము పొగత్రాగడాన్ని ఆస్వాదించినవాళ్ళమే అయినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ సిగరెట్‌ ముట్టుకోలేదు.

1940లో మేము బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నేనూ, ఫర్నూ ఒక కూటంలో ఉన్నప్పుడు మేము పఠించిన ఒక శీర్షిక పయినీరింగ్‌ చేసేందుకు ప్రోత్సహించింది. పూర్తికాల ప్రకటనా పని పయినీరింగ్‌ అని పిలువబడుతుంది. మేము ఇంటికి వెళ్తుండగా, “మీరూ, ఫర్నూ పయినీరింగ్‌కు ఎందుకు వెళ్ళకూడదు? మీకు ఏ ఆటంకమూ లేదు కదా” అని ఒక సహోదరుడు అడిగాడు. మేము ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోయాం. అలా అందుకు మమ్మల్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం. ఉద్యోగ స్థలంలో 30 రోజుల నోటీసు ఇచ్చాను. ఆ తర్వాత మేము పయినీరింగ్‌ చేసే ఏర్పాట్లు చేసుకున్నాం.

మేము ఎక్కడ సేవ చేయాలో వాచ్‌ టవర్‌ సొసైటీని అడిగి, ఆ తర్వాత మేరీల్యాండ్‌లోని బాల్టమోర్‌కు తరలి వెళ్ళాం. అక్కడ పయినీర్‌ల కోసం ఒక ఇల్లు ఉంచబడింది. గదికీ, భోజనానికి నెలకు అయ్యే ఖర్చు 10 అమెరికా డాలర్లు. మా దగ్గర ఉన్న ఆదా చేసిన డబ్బు అర్మగిద్దోను దాకా సరిపోతుందని మేము అనుకున్నాం. (ప్రకటన 16:14, 16) అర్మగిద్దోను చాలా సమీపంలో ఉందని మేము ఎల్లప్పుడూ అనుకునేవాళ్ళం. కనుక పయినీరింగ్‌ ప్రారంభించినప్పుడు, మేము మా ఇంటినీ, సమస్తాన్నీ వదిలిపెట్టేశాం.

మేము 1942 నుండి 1947 వరకు బాల్టమోర్‌లో పయినీరింగ్‌ చేశాం. ఆ సంవత్సరాల్లో యెహోవాసాక్షుల పని ఎడల వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉండేది. మా బైబిలు విద్యార్థుల ఇండ్లకు మా అంతట మేము కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్ళే బదులు, మమ్మల్ని అక్కడ దించమని కొన్నిసార్లు ఇతరులను కోరుకునే వాళ్ళం. ఆ విధంగా మా కారు టైర్లు కోయబడడం తప్పేది. ఎవరూ అలాంటి వ్యతిరేకతను ఇష్టపడరు. కానీ ప్రాంతీయ పరిచర్యను మేమెల్లప్పుడూ ఆస్వాదించేవాళ్ళమని నేను చెప్పగలను. వాస్తవానికి, ప్రభువు పని చేయడంలో కాస్త అలాంటి ఉత్తేజం కోసం ఎదురు చూసేవాళ్ళం.

మేము ఆదా చేసిన డబ్బంతా త్వరలోనే ఖర్చయిపోయింది. మా కారు టైర్లూ అరిగిపోయాయి, మా బట్టలూ, షూలూ పాతబడ్డాయి. రెండు మూడు సార్లు దీర్ఘకాలంపాటు అనారోగ్యం పాలయ్యాం. అయినా పయనీరింగ్‌లో అలాగే కొనసాగడం అంత సులభంగా ఉండలేదు. అయినా విడిచిపెట్టే తలంపు మాకెన్నడూ రాలేదు. మేము అలా మాట్లాడుకోవడం కూడా చేయలేదు. మేము పయినీర్‌ సేవలో ఉండగల్గేందుకు మా జీవన విధానాన్ని నిరాడంబరమైనదిగా చేసుకున్నాం.

నియామకంలో మార్పులు

1947లో కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన సమావేశానికి వెళ్ళాం. అక్కడున్నప్పుడు నాకూ, మా విలియమ్‌ అన్నయ్యకూ సంఘాలను దర్శించి, సహాయం చేసే ప్రయాణ పని చేయమంటూ చెరొక లేఖ లభించింది. అప్పట్లో ఆ పని చేసేందుకు మాకు ప్రత్యేక తర్ఫీదు ఏమీ ఇవ్వలేదు. మేమలా వెళ్ళిపోయామంతే. తర్వాతి ఏడు సంవత్సరాల్లో, నేనూ, ఫర్నూ ఒహాయోలోనూ, మిచిగన్‌లోనూ, ఇండియానాలోనూ, ఇలనోయ్‌లోనూ, మరియు న్యూయార్క్‌లోనూ సేవ చేశాం. 1954లో, మిషనరీలకు తర్ఫీదు ఇచ్చే గిలియడ్‌ 24వ తరగతికి హాజరవ్వమని మాకు పిలుపు వచ్చింది. అక్కడున్నప్పుడు ఫర్న్‌కు పోలియో వచ్చింది. తర్వాత ఆమె బాగా కోలుకుందన్నది సంతోషకరమైన విషయం. మమ్మల్ని న్యూయార్క్‌లోనూ, కనెటికట్‌లోనూ ప్రయాణ పనికి నియమించారు.

మేము కనటికట్‌లోని స్టామ్‌ఫోర్డ్‌లో సేవ చేస్తుండగా, అప్పట్లో వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ అయిన నేథన్‌ హెచ్‌. నార్‌ ఆ వారాంతం ఆయనతోనూ, ఆయన భార్య ఆడ్రీతోనూ గడపవల్సిందిగా కోరారు. సకల అలంకరణలతో కూడిన బీఫ్‌స్టీక్‌ భోజనం వడ్డించారు. ఇంతకు మునుపే వాళ్ళు మాకు సుపరిచితులు. నాకు సహోదరుడు నార్‌ గురించి బాగా తెలుసు గనుక, ఆయన మమ్మల్ని పిలిచింది సహవాసానికి మరియు భోజనానికీ మాత్రమే కాదనీ, ఆయన మదిలో మరేదో ఉందనీ గ్రహించగల్గాను. ఆ రోజు సాయంకాలం, ఆ తర్వాత, “బేతేలుకు వచ్చే విషయాన్ని గురించి మీరెలా భావిస్తారు?” అని ఆయన నన్ను అడిగారు.

“నాకు నిజానికి కచ్చితంగా తెలియదు; బేతేలు జీవితం గురించి నాకు అంతగా తెలియదు” అని జవాబిచ్చాను.

ఆ విషయాన్ని గురించి అనేక వారాలు ఆలోచించిన తర్వాత, మేము బేతేలుకు రావాలని మీరు అనుకుంటే మేము వస్తామని సహోదరుడు నార్‌కు చెప్పాము. 1957, ఏప్రిల్‌ 27న బేతేలుకు రమ్మంటూ ఒక లేఖ ఆ తర్వాతి వారమే మాకు అందింది. ఆ తేదీ సరిగ్గా మా 21వ వివాహ వార్షిక దినం.

బేతేలులోని ఆ మొదటి రోజు, ఏమి చేయాలని ఎదురుచూడబడుతుందన్న విషయంలో సహోదరుడు నార్‌ నాకు స్పష్టమైన నిర్దేశమిచ్చారు. ఆయన ఇలా చెప్పారు: “మీరు ఇక మీదట సర్క్యూట్‌ సేవకుడు కాదు; మీరు ఇక్కడ ఉన్నది బేతేలు పని చేయడానికే. ఇది మీరు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని. ఇక్కడ బేతేలులో మీకు ఇవ్వబడే తర్ఫీదులో మీరు మీ సమయాన్ని శక్తినీ ఉపయోగించాలని మేము ఆశిస్తున్నాం. మీరు ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం.”

బేతేలులో జీవితం అర్థవంతమైనది

నాకు మొదట లభించిన నియామకం మ్యాగజిన్‌ అండ్‌ మెయిలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లలో. తర్వాత, దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, తన కార్యాలయానికి రమ్మంటూ సహోదరుడు నార్‌ కబురు చేశారు. నిజానికి నన్ను అక్కడికి పిలిపించింది నేను హోమ్‌ విభాగంలో పని చేయడానికే అని ఆయన నాకు చెప్పారు. ఆయన నిర్దేశాలు చాలా సూటిగా ఉన్నాయి. “మీరు బేతేలు గృహాన్ని నడిపించాలనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది” అని ఆయన అన్నారు.

బేతేలు గృహాన్ని నడిపించడం నేను పొలంలో పెరుగుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు నేర్పిన పాఠాలను గుర్తు చేశాయి. బేతేలు గృహం సాధారణ కుటుంబంవంటిదే. అక్కడ బట్టలు ఉతికే పని, వంటపని, గిన్నెలు కడిగే పని, పడక సర్దే పని, ఇలాంటి ఎన్నో పనులు జరగాలి. ఒకరు బేతేలు తన ఇల్లు అనగల్గేలా సౌకర్యప్రదంగా ఉండేలా చేయడానికి గృహ సంస్థీకరణ విభాగం ప్రయత్నిస్తుంది.

బేతేలు నిర్వహించబడే తీరు నుండి కుటుంబాలు చాలా పాఠాలను నేర్చుకోవచ్చని నేను నమ్ముతున్నాను. మేము ఉదయాన్నే లేస్తాం. బైబిలు పాఠ్యభాగాన్ని ప్రతిదినం పరిశీలించడం ద్వారా ఆధ్యాత్మిక తలంపులతో ప్రతిరోజును మొదలుపెడతాం. మేము కష్టపడి పని చేయాలని, సమతుల్యమైనదే అయినా పనిరద్దీగల జీవితాన్ని గడపాలని ఎదురు చూడబడుతుంది. బేతేలు కొంతమంది అనుకుంటున్నట్లు మఠం వంటిది కాదు. షెడ్యూల్‌ చేయబడినటువంటి జీవన విధానం కారణంగా మేము చాలా సాధిస్తాం. ఇక్కడ తమకు లభించిన శిక్షణ ఆ తర్వాత తమ కుటుంబాల్లోనూ, క్రైస్తవ సంఘంలోనూ బాధ్యతలను అంగీకరించేందుకు తోడ్పడిందని అనేకులు చెప్పారు.

బేతేలుకు వచ్చే యువతీ యువకులు శుభ్రం చేసే పనికి, లాండ్రీలోకి, లేదా ఫ్యాక్టరీలో పని చేయడానికి నియమించబడవచ్చు. అలాంటి పని అవమానకరమైనదని, మన హోదాకు తగనిదని మనం నమ్మేలా లోకం చేస్తుంది. అయితే, బేతేలులోని యౌవనస్థులు అలాంటి పని నియామకాలు మా కుటుంబం సరైన విధంగా, సంతోషంగా ముందుకు సాగేందుకు అవసరమని గ్రహిస్తారు.

మీరు నిజంగా సంతోషంగా ఉండాలంటే పలుకుబడీ, హోదా అవసరం అనే తలంపును కూడా లోకం పెంపొందించవచ్చు. అది పొరపాటు. మాకు నియమించబడినది మేము చేస్తున్నప్పుడు ‘మేము చేయవలసినదే చేస్తున్నాం,’ అలా మేము యెహోవా ఆశీర్వాదాన్ని పొందుతాం. (లూకా 17:10) మా పని యొక్క ఉద్దేశం, యెహోవా చిత్తం చేయడమూ, రాజ్యాసక్తులను పురోగమింపజేయడమూ అని గుర్తుంటే మాత్రమే మాకు నిజమైన సంతుష్టి, సంతోషం ఉండగలదు. మేము దానిని మనస్సులో ఉంచుకుంటే, ఏ నియామకమైనా ఆస్వాదించదగినదిగానూ, సంతృప్తికరంగానూ ఉంటుంది.

విస్తరణలో ఆధిక్యతాపూర్వకమైన వంతు

మేము బేతేలుకు రావడానికి ఒక దశాబ్దం కన్నా ముందు, ఒహాయోలోని క్లివ్‌ల్యాండ్‌లో 1942లో జరిగిన సమావేశంలో, “శాంతి—అది నిలవగలదా?” అనే ప్రసంగాన్ని సహోదరుడు నార్‌ ఇచ్చారు. అప్పుడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తుందనీ, శాంతియుతమైన సమయం ఉంటుందనీ, అది విస్తృతమైన ప్రకటనా ప్రచారానికి అవకాశమిస్తుందనీ చెప్పారు. మిషనరీలకు శిక్షణనిచ్చేందుకు గిలియడ్‌ స్కూల్‌నూ, బహిరంగంగా మాట్లాడే సామర్థ్యాన్ని సహోదరులు మెరుగుపరచుకునేందుకు దైవపరిపాలనా పాఠశాలనూ 1943లో స్థాపించడం జరిగింది. పెద్ద సమావేశాలు కూడా సంస్థీకరించబడ్డాయి. ముఖ్యంగా 1950లలో న్యూయార్క్‌లోని యాన్‌కీ స్టేడియమ్‌లో అలాంటి సమావేశాలు జరిగాయి. 1950 మరియు 1953లలో జరిగిన ఎనిమిది రోజుల సమావేశాల సంబంధంగా ఆ సమావేశాలు జరిగిన ప్రతిసారి, హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఆ ఎనిమిది రోజులూ వసతి కల్పించే పెద్ద ట్రెయిలర్‌ సిటీనీ ఏర్పాటు చేయడంలో సహాయపడే అవకాశం లభించింది.

1958లో జరిగిన అన్నింటికన్నా పెద్ద సమావేశంతో సహా ఆ పెద్ద సమావేశాలు జరిగిన తర్వాత, రాజ్య ప్రచారకుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. ఇది బేతేలులో మా పనిపై నేరుగా ప్రభావం చూపింది. 1960ల తుది భాగంలోనూ, 1970ల తొలి భాగంలోనూ, పని చేసేవారికి పని స్థలాన్నీ, గదులనూ కల్పించడం మాకు చాలా కష్టమైంది. పెరుగుతున్న మా బేతేలు కుటుంబానికి వసతి కల్పించడంలో మరిన్ని పడకగదులూ, వంటగదులూ, భోజన గదులూ సిద్ధం చేయవలసి వచ్చింది.

విస్తరణకు తగిన స్థలాన్ని కనుగొనమని నన్నూ, ఫ్యాక్టరీ పైవిచారణకర్తయైన సహోదరుడు మాక్స్‌ లార్సన్‌ను సహోదరుడు నార్‌ కోరారు. 1957లో నేను బేతేలుకు వచ్చినప్పుడు, ఒక పెద్ద నివాస గృహంలో 500 మంది బేతేలు కుటుంబ సభ్యులు ఉండేవారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, సొసైటీ దగ్గర్లో ఉన్న మూడు పెద్ద హోటళ్ళను—ద టవర్స్‌, ద స్టాండిష్‌, ద బాసర్ట్‌—అలాగే అనేక చిన్న అపార్ట్‌మెంట్‌ కట్టడాలనూ కొని, వాటిని నవీకరించింది. 1986లో, మునుపు హోటల్‌ మార్గరెట్‌ ఉండిన స్థలాన్ని సొసైటీ కొని, ఆ అందమైన క్రొత్త కట్టడాన్ని దాదాపు 250 మంది నివసించగల భవనంగా మార్చింది. ఆ తర్వాత, 1990ల తొలి భాగంలో, మరో 1,000 మంది పనివారికి వసతిని కల్పించేందుకు 30 అంతస్థుల కట్టడం నిర్మించబడింది. ఇప్పుడు బ్రూక్లిన్‌ బేతేలు 3,300 కన్నా ఎక్కువ మంది సభ్యులకు వసతిని కల్పించి, పోషించగలదు.

న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌లో కూడా స్థలం కొనడం జరిగింది. అది బ్రూక్లిన్‌ బేతేలుకు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1960ల తుది భాగం మొదలుకొని, అనేక సంవత్సరాలుగా, నివాసగృహాలూ, పెద్ద ముద్రణాలయమూ కూడా నిర్మించబడ్డాయి. ఇప్పుడు అక్కడ బేతేలులో 1,200 మంది సభ్యులు నివసిస్తున్నారు, పని చేస్తున్నారు. 1980లో, హైవే సౌలభ్యం ఉన్న, న్యూయార్క్‌ నగరానికి దగ్గర్లో ఉన్న దాదాపు 600 ఎకరాల స్థలం కోసం అన్వేషణ ఆరంభమైంది. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ నవ్వి, “అలాంటి స్థలం మీకెక్కడ దొరుకుతుంది? అది అసాధ్యం” అన్నారు. కానీ మరుసటి రోజు ఆయన మమ్మల్ని కలిసి, “మీక్కావలసిన స్థలాన్ని కనుగొన్నాను” అన్నారు. న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌లో అది నేడు వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌ అని పిలువబడుతుంది. అక్కడ స్కూళ్ళు నిర్వహించబడుతున్నాయి, అక్కడ 1,300 కన్నా ఎక్కువమంది పరిచారకుల కుటుంబముంది.

నేను నేర్చుకున్న పాఠాలు

మంచి పైవిచారణకర్త అంటే ఇతరుల నుండి విలువైన సమాచారాన్ని పొందగలగడమేనన్న పాఠాన్ని నేర్చుకున్నాను. బేతేలు పైవిచారణకర్తగా నేను అమలులో పెట్టడానికి ఆధిక్యత పొందిన తలంపుల్లో అనేకము ఇతరుల నుండి వచ్చినవే.

నేను బేతేలుకు వచ్చినప్పుడు, నేటి నాలాగా అనేకులు వయస్సులో పెద్దవాళ్ళే. వారిలో అనేకులు ఇప్పుడు లేరు. వృద్ధులై చనిపోయేవారి స్థానంలో ఎవరు వస్తారు? ఎల్లప్పుడూ మంచి సామర్థ్యంగలవారే రారు. తమను అందుబాటులో ఉంచుతూ, తమ పనిని నమ్మకంగా చేస్తూ ఇక్కడ ఉన్నవారు వాళ్ళ స్థానంలోకి వస్తారు.

గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం మంచి భార్య విలువ. నా ప్రియతమ భార్య ఫర్న్‌ మద్దతు నా దైవపరిపాలనా నియామకాలను పూర్తి చేయడంలో నాకు ఎంతో సహాయకరంగా ఉంటోంది. తమ భార్యలు తమ నియామకాలను ఆస్వాదిస్తున్నారా అన్న విషయాన్ని నిశ్చయపరచుకోవలసిన బాధ్యత భర్తలకుంది. నేనూ, ఫర్నూ ఇష్టపడే పనిని చేయడానికి ముందుగా పథకం వేస్తాను. అది అంత ఖరీదైనదై ఉండాలని లేదు. కేవలమొక గాలిమార్పే కావచ్చు. తన భార్యను సంతోషపరచే పనులను చేయడమన్నది భర్త బాధ్యత. ఆయన ఆమెతో గడిపే సమయం విలువైనది. అది త్వరగా గడిచిపోతుంది. గనుక ఆయన ఆ సమయాన్ని దాని గరిష్ట పరిమితి వరకూ ఉపయోగించాలి.

నేను యేసు చెప్పిన చివరి దినాల్లో జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నాను. మానవుని మొత్తం చరిత్రలో ఇది అత్యంత ఆశ్చర్యకరమైన సమయం. వాగ్దత్త లోకపు ఆగమనం కొరకైన సిద్ధపాటులో ప్రభువు తన సంస్థను ఎలా వికసింపజేస్తున్నాడో మన విశ్వాస నేత్రాలతో గమనించగల్గుతున్నాం, చూడగల్గుతున్నాం. యెహోవా సేవలో నేను నా జీవితకాలాన్ని వెనుదిరిగి చూస్తే, ఈ సంస్థను నడుపుతున్నది మనుష్యులు కాదు గానీ యెహోవాయేనని గ్రహించగల్గుతున్నాను. మనం కేవలం ఆయన సేవకులం. అందుకే మనం ఎల్లప్పుడూ ఆయన నిర్దేశం కోసం చూడాలి. మనమేమి చేయాలో అయన ఒకసారి స్పష్టం చేసిన తర్వాత, మనం వెంటనే దానికి సిద్ధమై, కలిసి కట్టుగా పని చేయాలి.

మీరు సంస్థతో పూర్తిగా సహకరించండి. అలా మీకు నిండుదనంగల, సంతోషంగల జీవితం నిశ్చయపర్చబడుతుంది. మీరు ఏమి చేస్తున్నప్పటికీ,—అది పయినీరింగైనా, సర్క్యూట్‌ పనైనా, సంఘంతో ప్రచారకునిగా పని చేస్తున్నా, బేతేలు సేవైనా, లేదా మిషనరీ పనైనా—ఇవ్వబడిన నిర్దేశాన్ని అనుసరించండి. మీ నియామకాన్ని విలువైనదిగా ఎంచండి. ప్రతి నియామకాన్నీ, ప్రతిరోజూ యెహోవా సేవలో చేసిన పనినీ ఆస్వాదించేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించండి. కొన్నిసార్లు, మీరు అలసిపోతారు, పని ఎక్కువై ఉండవచ్చు, నిరుత్సాహం చెందవచ్చు. అప్పుడే మీరు యెహోవాకు మీ జీవితాన్ని సమర్పించుకున్నదాని ఉద్దేశాన్ని గుర్తుంచుకోవల్సింది. ఆ ఉద్దేశం మీ ఇష్టానుసారం చేయడం కాదు గానీ, ఆయన చిత్తాన్ని చేయడమే.

నేను పని చేయడానికి వచ్చి, నేను చేసిన పనిని ఆస్వాదించని ఒక్క రోజు కూడా లేదు. ఎందుకని? మనల్ని మనం యెహోవా గృహానికి ఇచ్చుకున్నప్పుడు, ‘మనం చేయవలసినవే చేశాం’ అన్న సంతృప్తి ఉంటుంది గనుకనే.

[19వ పేజీలోని చిత్రం]

మ్యాగజిన్‌ డిపార్ట్‌మెంట్‌

[19వ పేజీలోని చిత్రం]

1950లో ట్రెయిలర్‌ సిటీలో ఫర్న్‌తో

[19వ పేజీలోని చిత్రం]

1946లో బాల్ట్‌మోర్‌లో పయినీరింగ్‌

[19వ పేజీలోని చిత్రం]

1950లో ట్రెయిలర్‌ సిటీ

[22వ పేజీలోని చిత్రం]

ఆడ్రీ మరియు నేథన్‌ నార్‌లతో

[23వ పేజీలోని చిత్రం]

న్యూయార్క్‌లో పాటర్‌సన్‌ దగ్గర వాచ్‌ టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌

[24వ పేజీలోని చిత్రం]

నేడు ఫర్న్‌తో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి