“మీ చేతుల్ని దించకండి”
“మీ చేతుల్ని దించకండి. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. శక్తిమంతునిగా, ఆయన కాపాడతాడు.”—జెఫన్యా 3:16, 17, NW.
1. జెకర్యా ప్రవచనాన్ని గురించి ఒక బైబిలు పండితుడు ఏమని తెలియజేశాడు?
జెఫన్యా ప్రవచనం సా.శ.పూ. ఏడవ శతాబ్దం మరియు ఆరవ శతాబ్దంలోని దాని మొదటి నెరవేర్పును మించి విస్తరించివుంది. జెఫన్యా గ్రంథంపై తన వ్యాఖ్యానమందు ప్రొఫెసరు సి. ఎఫ్. కైల్ ఇలా వ్రాశాడు: “జెఫన్యా ప్రవచనం . . . యూదా పాపాల్నిబట్టి దానిపైకి మరియు యెహోవా ప్రజలపై ప్రపంచ దేశాలు అతిశయించడాన్నిబట్టి వాటిపైకి వచ్చే తీర్పు చేరివున్న విశ్వవ్యాప్త తీర్పు యావత్ ప్రపంచంపై ప్రకటింపబడడంతో ప్రారంభమౌతుంది అంతేగాక యెహోవా యొక్క భయంకరమైన మహా దినంతో కూడా వ్యవహారిస్తుంది.”
2. జెఫన్యా కాలంలోని పరిస్థితులకు నేటి క్రైస్తవమత సామ్రాజ్యంలోని పరిస్థితులకు మధ్య ఏ సమపోలికలు ఉన్నాయి?
2 నేడు, నాశనం చేయడం కొరకు జెఫన్యా కాలంలో కన్నా మరింత విస్తృతమైన పరిమాణంలో దేశాల్ని సమకూర్చడమే, యెహోవా న్యాయ నిర్ణయం. (జెఫన్యా 3:8) క్రైస్తవులమని చెప్పుకుంటున్న దేశాలు, దేవుని దృష్టిలో విశేషంగా నిందార్హితమైనవి. యెహోవా ఎడల తన అవిశ్వాసాన్నిబట్టి యెరూషలేము భయంకరమైన మూల్యాన్ని చెల్లించినట్లే, క్రైస్తవమత సామ్రాజ్యం తన విశృంఖలమైన ప్రవర్తనారీతుల్నిబట్టి దేవునికి జవాబు చెప్పుకోవాలి. జెఫన్యా కాలంలో యూదా, యెరూషలేములకు వ్యతిరేకంగా ప్రకటింపబడిన దైవిక తీర్పులు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకు, శాఖలకు మరింత శక్తివంతంగా అన్వయింపబడతాయి. వారు కూడా, దేవుని అగౌరవపరిచే తమ సిద్ధాంతాలతో పరిశుద్ధ ఆరాధనను మలినపర్చారు, ఈ సిద్ధాంతాల్లో అనేకం అన్యమతం నుండి ఆవిర్భవించినవే. వారు లక్షలాదిమంది ఆరోగ్యవంతులైన తమ కుమారుల్ని ఆధునిక యుద్ధ బలిపీఠంపై బలి ఇచ్చారు. అంతేకాకుండా, సాదృశ్య యెరూషలేము నివాసులు, క్రైస్తవత్వమని పిలువబడుతున్న దానిని జ్యోతిశ్శాస్త్రం, అభిచార సంబంధమైన ఆచారాలు మరియు బయలు ఆరాధనను గుర్తుకుతెచ్చే నీచమైన లైంగిక దుర్నీతిలతో మిళితం చేస్తున్నారు.—జెఫన్యా 1:4, 5.
3. నేడున్న అనేకమంది లౌకిక నాయకుల గురించి, అనేక రాజకీయ ప్రభుత్వాల గురించి ఏమని చెప్పవచ్చు, జెఫన్యా ఏమని ప్రవచించాడు?
3 క్రైస్తవమత సామ్రాజ్య రాజకీయ నాయకుల్లో అనేకులు చర్చిలో ప్రధానత్వాన్ని కల్గివుండడాన్ని కోరుకుంటున్నారు. కాని యూదా ‘అధిపతుల’వలె, వీరిలో అనేకులు “గర్జనచేయు సింహాముల”వలె మరియు క్రూరమైన “తోడేళ్ల”వలె ప్రజల్ని దోచుకుంటున్నారు. (జెఫన్యా 3:1-3) అటువంటి వారి రాజకీయ తొత్తులు, “యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపు”తున్నారు. (జెఫన్యా 1:9) లంచగొండితనం, అవినీతి విస్తరించింది. క్రైస్తవమత సామ్రాజ్యానికి వెలుపటివైనా లోపటివైనా రాజకీయ ప్రభుత్వాలు అనేకం సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రజలైన ఆయన సాక్షుల్ని, అలక్ష్యం చేయబడిన ఓ “శాఖ”గా పరిగణించి, వారిపై ‘అతిశయిస్తున్నాయి.’ (జెఫన్యా 2:8; అపొస్తలుల కార్యములు 24:5, 14, NW) అలాంటి రాజకీయ నాయకులు మరి వారి అనుయాయులు అందరికీ సంబంధించి జెఫన్యా ఇలా ప్రవచించాడు: “యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.”—జెఫన్యా 1:18.
‘యెహోవా ఉగ్రతదినమున దాచబడుదురు’
4. యెహోవా మహా దినాన్నుండి తప్పింపబడేవారు ఉంటారని ఏది చూపిస్తుంది కాని వారు చేయాల్సినదేమిటి?
4 సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో యూదా నివాసులందరూ నాశనం చేయబడలేదు. అదేవిధంగా, యెహోవా మహాదినమున తప్పించుకొనువారూ ఉంటారు. అటువంటి వారి గురించి యెహోవా తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఇలా తెలియజేశాడు: “విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:2, 3.
5. ఈ అంత్యకాలంలో జెఫన్యా హెచ్చరికను మొదటిగా విన్న వారు ఎవరు, యెహోవా వారిని ఎలా ఉపయోగించుకున్నాడు?
5 ఈ ప్రపంచాంత సమయంలో, ప్రవచనాత్మక ఆహ్వానాన్ని మొదట లక్ష్యపెట్టినవారు, అభిషిక్త క్రైస్తవులైన ఆత్మీయ ఇశ్రాయేలీయ శేషం. (రోమీయులు 2:28, 29; 9:6; గలతీయులు 6:16) నీతిని దీనత్వాన్ని వెదకి, యెహోవా న్యాయ నిర్ణయాల ఎడల గౌరవాన్ని చూపినందున, ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహా బబులోను నుండి వారు విడుదలపొంది, 1919లో దైవిక అనుగ్రహానికి పునరుద్ధరించబడ్డారు. అప్పటి నుండి, విశేషంగా 1922 నుండి ఈ నమ్మకమైన శేషం క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకు, శాఖలకు మరియు రాజకీయ దేశాలకు వ్యతిరేకంగా యెహోవా తీర్పుల్ని నిర్భయంగా ప్రకటిస్తున్నారు.
6. (ఎ) విశ్వాసులైన శేషం గురించి జెఫన్యా ఏమని ప్రవచించాడు? (బి) ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?
6 ఈ నమ్మకమైన శేషాన్ని గురించి, జెఫన్యా ఇలా ప్రవచించాడు: “దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు.” (జెఫన్యా 3:12, 13) ఈ అభిషిక్త క్రైస్తవులు యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ, కాని విశేషంగా 1931 నుండీ అంటే యెహోవాసాక్షులు అనే పేరును వారు స్వీకరించినప్పటి నుండీ ప్రాముఖ్యమైనదిగా ఎంచారు. (యెషయా 43:10-12) యెహోవా సర్వాధిపత్య వివాదాంశాన్ని ఉన్నతపర్చడం ద్వారా, వారు దైవిక నామాన్ని ఘనపర్చారు, మరి ఇది వారికొక ఆశ్రయ దుర్గమని రుజువైంది. (సామెతలు 18:10) యెహోవా సమృద్ధికరమైన రీతిలో ఆత్మీయంగా వారిని పోషించాడు మరి వారు ఆత్మీయ పరదైసులో నిర్భయంగా నివసిస్తారు.—జెఫన్యా 3:16, 17.
‘జనులందరిలో ఖ్యాతి, మంచి పేరు’
7, 8. (ఎ) ఆత్మీయ ఇశ్రాయేలీయ శేషం విషయంలో మరే ప్రవచనం నెరవేరింది? (బి) లక్షలాదిమంది ప్రజలు దేనిని గుర్తించారు, ఈ విషయంలో మీ స్వంత భావాలేమిటి?
7 శేషం, యెహోవా నామాన్ని మరి ఆయన వాక్యంలోని నీతియుక్తమైన సూత్రాల్ని గాఢంగా హత్తుకోవడం గుర్తింపబడకుండా పోలేదు. శేషం యొక్క ప్రవర్తనకు, ఈ ప్రపంచ రాజకీయ మత నాయకుల అవినీతి వేషధారణలకు మధ్యగల వ్యత్యాసాన్ని యథార్థవంతులైన ప్రజలు గుర్తించారు. ‘[ఆత్మీయ] ఇశ్రాయేలీయ శేషాన్ని’ యెహోవా ఆశీర్వదించాడు. తన నామాన్ని కల్గివుండే ఆధిక్యతతో ఆయన వారిని ఘనపర్చాడు, భూమిపైనున్న ప్రజల్లో శ్రేష్ఠమైన పేరును వారు కల్గివుండేలా చేశాడు. ఇది జెఫన్యా ప్రవచించినట్లుగానే ఉంది: “ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.”—జెఫన్యా 3:20.
8 యెహోవా ఆశీర్వాదాలు శేషంపైనే ఉన్నాయని 1935 నుండి అక్షరార్థంగా లక్షలాదిమంది ప్రజలు గుర్తించారు. ఇలా చెబుతూ వారు ఈ ఆత్మీయ యూదుల్ని లేక ఇశ్రాయేలీయుల్ని సంతోషంగా అనుసరిస్తున్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:23) ఈ “వేరే గొఱ్ఱెలు,” క్రీస్తు “తన [భూ సంబంధమైన] యావదాస్తిమీద” నియమించిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”నిగా వారిని గుర్తించారు. వారు దాసుని తరగతి “తగినవేళ”కు సిద్ధపర్చిన ఆత్మీయాహారాన్ని కృతజ్ఞతాపూర్వకంగా తీసుకుంటున్నారు.—యోహాను 10:16; మత్తయి 24:45-47.
9. ఏ ‘భాషను’ లక్షలాదిమంది మాట్లాడడం నేర్చుకున్నారు, ఏ గొప్ప పనిలో వేరేగొఱ్ఱెలు, అభిషిక్త శేషంతో ‘భుజాల్ని కలిపి’ సేవిస్తున్నారు?
9 శేషంతోపాటు వేరే గొఱ్ఱెలలోని ఈ లక్షలాదిమంది, “స్వచ్ఛమైన భాష”కు అనుగుణంగా జీవించడం, మాట్లాడడం నేర్చుకుంటున్నారు.a జెఫన్యా ద్వారా యెహోవా ఇలా ప్రవచించాడు: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై [“భుజములు కలిపి,” NW] ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [“స్వచ్ఛమైన భాషను,” NW] నిచ్చెదను.” (జెఫన్యా 3:9) అవును, “చిన్నమంద”కు చెందిన అభిషిక్త సభ్యులతో వేరే గొఱ్ఱెలు “భుజములు కలిపి,” ‘ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా . . . ప్రకటించడమనే,’ అత్యావశ్యకమైన పనిలో ఐక్యంగా యెహోవాను సేవిస్తారు.—లూకా 12:32; మత్తయి 24:14.
‘యెహోవా దినము వస్తుంది’
10. అభిషిక్త శేషం ఏ విషయంలో ఇప్పటికే ఒప్పింపబడ్డారు, ఓ తరగతిగా వారు దేనిని చూడడానికి జీవించివుంటారు?
10 అపొస్తలుడైన పేతురు చేసిన ఈ ప్రేరేపిత వ్యాఖ్యానాన్ని అభిషిక్త శేషం ఎప్పుడూ మనస్సులో ఉంచుకుంది: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు [“యెహోవా,” NW] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు [“యెహోవా,” NW] దినము దొంగవచ్చినట్లు వచ్చును.” (2 పేతురు 3:9, 10) నమ్మకమైన దాసుని తరగతి సభ్యులు, మనకాలంలో యెహోవా దినం రావడాన్ని గూర్చి ఎన్నడూ ఏ సందేహాల్ని కల్గిలేరు. సాదృశ్య యెరూషలేమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి, మహాబబులోనులోని మిగిలిన వాటికి వ్యతిరేకంగా దేవుని తీర్పులు అమలు చేయబడడంతో ఆ మహాదినం ఆరంభమౌతుంది.—జెఫన్యా 1:2-4; ప్రకటన 17:1, 5; 19:1, 2.
11, 12. (ఎ) జెఫన్యా ప్రవచనంలోని ఏ ఇతర భాగం, శేషం విషయంలో నెరవేరింది? (బి) “మీ చేతుల్ని దించకండి” అనే పిలుపును అభిషిక్త శేషం ఎలా లక్ష్యపెట్టింది?
11 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను యొక్క ఆత్మీయ చెర నుండి 1919లో విడుదల చేయబడినందుకు నమ్మకమైన శేషం ఆనందిస్తుంది. వారు జెఫన్యా ప్రవచన నెరవేర్పును అనుభవించారు: “సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు—యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును.”—జెఫన్యా 3:14-17.
12 యెహోవా తమ మధ్య ఉన్నాడనే ఒప్పుదల మరియు అత్యధికమైన రుజువుతో, అభిషిక్త శేషం తమ దైవిక నియామకాన్ని నెరవేర్చుటలో నిర్భయంగా ముందుకు వెళ్లారు. వారు రాజ్యసువార్తను ప్రకటించి, క్రైస్తవమత సామ్రాజ్యానికి, మహాబబులోనులోని మిగిలిన వాటికి, సాతాను యొక్క యావత్ దుష్ట విధానానికి వ్యతిరేకంగా యెహోవా తీర్పుల్ని తెలియజేశారు. కష్టాలెన్ని వచ్చినప్పటికీ, 1919 నుండి దశాబ్దాలుగా వారు ఈ దైవిక ఆజ్ఞకు విధేయత చూపించారు: “భయపడకుము, సీయోనూ, మీ చేతుల్ని దించకండి.” యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తున్న కోట్లాది కరపత్రాలు, పత్రికలు, పుస్తకాలు, చిన్నపుస్తకాలు పంచిపెట్టడంలో వారు సడలిన చేతులతో పనిచేయలేదు. 1935 నుండి వారి పక్షంగా చేరిన వేరేగొఱ్ఱెలకు వారు విశ్వాసాన్ని ప్రేరేపించే మాదిరిగా ఉన్నారు.
“వీ చేతుల్ని దించకండి”
13, 14. (ఎ) యెహోవాను సేవించడం నుండి కొంతమంది యూదులు ఎందుకు వెనుకంజవేశారు మరి ఇది ఎలా వ్యక్తపర్చబడింది? (బి) మనం దేనిని చేయడం జ్ఞానయుక్తం కాదు, ఏ పనిలో మనం మన చేతుల్ని దించకుండా ఉండాలి?
13 యెహోవా మహా దినం కొరకు మనం ‘కనిపెడ్తుండగా’ జెఫన్యా ప్రవచనాన్నుండి మనం ఎలా ఆచరణాత్మకమైన సహాయాన్ని పొందగలం? మొదటిగా, యెహోవా దినం సమీపించడాన్ని గురించి తమ హృదయంలో సందేహాల్ని ఉంచుకొన్నందున యెహోవాను వెంబడించుటలో తప్పిపోయిన జెఫన్యా కాలంలోని యూదులవలె ఉండకుండా మనం జాగ్రత్తపడాలి. అలాంటి యూదులు తమ సందేహాల్ని బహిరంగంగా వ్యక్తపర్చి ఉండకపోవచ్చు గాని వారి చర్యలే, యెహోవా మహా దినం సమీపంలో ఉందని వారు నిజంగా విశ్వసించ లేదని తెలియజేశాయి. వారు యెహోవా కొరకు కనిపెడ్తూ ఉండడానికి బదులు సంపదను సమకూర్చుకోవడంపై శ్రద్ధ నిలిపారు.—జెఫన్యా 1:12, 13; 3:8.
14 సందేహాలు, మన హృదయాల్లో వేళ్లూనుకొనేందుకు అనుమతించడానికి ఇది సమయం కాదు. యెహోవా దిన రాకడను మన మనస్సుల్లో లేక హృదయాల్లో వాయిదా వేయడం జ్ఞానయుక్తం కాదు. (2 పేతురు 3:1-4, 10) యెహోవాను వెంబడించడం నుండి వెనుకకు మరలడాన్ని లేక ఆయన సేవలో ‘మన చేతుల్ని దించి వేయడాన్ని’ మనం విడనాడాలి. ఇందులో, మనం “సువార్త” ప్రకటించడంలో “బద్ధకముగా [“సడలిన చేతులతో,” NW] పనిచే”యకుండా ఉండడం చేరివుంది.—సామెతలు 10:4; మార్కు 13:10.
ఉదాసీనతలతో పోరాడడం
15. యెహోవా సేవలో మనం బద్ధకంగా ఉండడానికి ఏది కారణం కాగలదు, ఈ సమస్య జెఫన్యా ప్రవచనంలో ఎలా ముందే తెలియజేయబడింది?
15 రెండవది, ఉదాసీనత యొక్క బలహీనపరిచే ప్రభావాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అనేక పాశ్చాత్య దేశాల్లో, ఆత్మీయ విషయాల ఎడల శ్రద్ధ లేకపోవడం, సువార్త ప్రచారకుల్లో కొంతమంది నిరుత్సాహం చెందడానికి కారణంకాగలదు. జెఫన్యా కాలంలో అటువంటి ఉదాసీనత ఉంది. తన ప్రవక్త ద్వారా యెహోవా ఇలా తెలియజేశాడు: “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.” (జెఫన్యా 1:12) కేంబ్రిడ్జ్ బైబిల్ ఫర్ సల్స్ అండ్ కాలేజ్స్ అనే పుస్తకంలో ఈ ప్రకరణంపై వ్రాస్తూ ఎ. బి. డేవిడ్సన్ ఇది మానవజాతి వ్యవహారాల్లో ఓ ఉన్నత శక్తి జోక్యం చేసుకోవడాన్ని గూర్చి “భావరహితమైన ఉదాసీనతలోనికి లేక విశ్వాసలేమిలోనికి దిగిపోయిన” ప్రజలను, సూచిస్తుందని తెలియజేశాడు.
16. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలోని అనేకమంది సభ్యుల్లో ఏ రకమైన మనఃస్థితివుంది కాని యెహోవా మనకు ఏ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు?
16 భూమిపై నేడు అనేక భాగాల్లో, విశేషంగా మరింత సంపన్నవంతమైన దేశాల్లో, ఉదాసీనత ప్రబలమవుతున్న వైఖరిగావుంది. మన కాలంలో మానవ వ్యవహారాలయందు యెహోవా దేవుడు జోక్యం చేసుకొనబోతున్నాడని, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలోని సభ్యులు కూడా విశ్వసించడం లేదు. రాజ్య సువార్తతో వారిని సమీపించాలనే మన ప్రయత్నాల్ని వారు సంశయాత్మకమైన చిరునవ్వుతోనో లేక “నాకు ఆసక్తి లేదు!” అని క్లుప్తంగా జవాబివ్వడంతోనో త్రోసిపుచ్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో, సాక్ష్యమిచ్చే పనియందు పట్టుదల కల్గివుండడం నిజమైన సవాలు కాగలదు. అది మన సహనాన్ని పరీక్షిస్తుంది. కాని జెఫన్యా ప్రవచనం ద్వారా, ఇలా చెబుతూ యెహోవా తన నమ్మకమైన ప్రజల్ని బలపరుస్తున్నాడు: “ధైర్యము తెచ్చుకొనుము. [“మీ చేతుల్ని దించకండి,” NW] నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతమువహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.”—జెఫన్యా 3:16, 17.
17. వేరేగొఱ్ఱెల్లోని క్రొత్తవారు ఏ శ్రేష్ఠమైన మాదిరిని అనుసరించాలి మరియు ఎలా?
17 శేషం అలాగే వేరేగొఱ్ఱెల్లోని వృద్ధులు ఈ అంత్యదినాల్లో పెద్దెత్తున సమకూర్పు పనిని నెరవేర్చడమన్నది, యెహోవా ప్రజల ఆధునిక కాల చరిత్రలో వాస్తవమైన విషయమైవుంది. ఈ నమ్మకమైన క్రైస్తవులందరూ దశాబ్దాలకుపైగా సహనాన్ని చూపించారు. తమను నిరుత్సాహపర్చేందుకు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అధిక సంఖ్యాకుల్లోవున్న ఉదాసీనతను వారు అనుమతించలేదు. కాబట్టి నేడు అనేక దేశాల్లో ఆత్మీయ విషయాల ఎడల ఎంతగానో పెరిగిపోయిన ఉదాసీనత, తమ్మును అధైర్యపరచడానికి వేరేగొఱ్ఱెల్లోని క్రొత్తవారు అనుమతించకూడదు. వారు తమ ‘చేతుల్ని దించడానికి’ లేక సడలిపోవడానికి అనుమతించకూడదు. వారు కావలికోట, తేజరిల్లు! మరియు యెహోవా దినాన్ని గూర్చిన, దానివెంబడి వచ్చే ఆశీర్వాదాల్ని గూర్చిన సత్యాల్ని గొఱ్ఱెలాంటి ప్రజలు తెలుసుకోవడానికి సహాయపడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఇతర శ్రేష్ఠమైన ప్రచురణలను అందించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందురు గాక.
ఆ మహా దినం కొరకు ఎదురుచూస్తూ ముందుకు సాగండి!
18, 19. (ఎ) మత్తయి 24:13, యెషయా 35:3, 4 వచనాల్లో సహించుకొనేందుకు ఏ ప్రోత్సాహాన్ని మనం కనుగొనగలం? (బి) యెహోవా సేవలో మనం ఐక్యంగా ముందుకు సాగితే మనం ఎలా ఆశీర్వదించబడతాం?
18 యేసు ఇలా తెలియజేశాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) గనుక, యెహోవా మహా దినం కొరకు ఎదురుచూస్తూండగా “సడలిన చేతులు” లేక ‘తొట్రిల్లే మోకాళ్లు’ ఉండకూడదు! (యెషయా 35:3, 4) జెఫన్యా ప్రవచనం యెహోవాను గురించి అభయపూర్వకంగా ఇలా తెలియజేస్తోంది: “ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును.” (జెఫన్యా 3:17) అవును, తన ప్రజలకు వ్యతిరేకంగా ‘అతిశయిస్తున్న’ రాజకీయ దేశాల్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి ఆయన తన కుమారునికి ఆజ్ఞాపించినప్పుడు వచ్చే “మహా శ్రమ” యొక్క చరమాంకం నుండి ‘గొప్ప సమూహాన్ని’ యెహోవా రక్షిస్తాడు.—ప్రకటన 7:9, 14; జెఫన్యా 2:10, 11; కీర్తన 2:7-9.
19 యెహోవా మహా దినం సమీపిస్తుండగా, “భుజములు కలిపి” ఆయనను సేవించుటలో మనం ఆసక్తిదాయకంగా ముందుకు సాగిపోదాం! (జెఫన్యా 3:9, NW) అలా చేయడం ద్వారా, మనంతట మనమూ అనేకులైన ఇతరులూ ‘యెహోవా ఉగ్రతదినమున దాచబడి,’ ఆయన పవిత్ర నామం పరిశుద్ధపర్చబడ్డాన్ని చూసే స్థానమందు ఉంచుకుంటాం.—జెఫన్యా 2:3.
[అధస్సూచీలు]
a “స్వచ్ఛమైన భాష”ను గురించిన పూర్తి చర్చ కొరకు కావలికోట ఏప్రిల్ 1, 1991 (ఆంగ్లం) పేజీలు 20-5, మే 1, 1992 పేజీలు 16-26 చూడండి.
పునఃసమీక్ష
◻ ఏ విషయాల్లో క్రైస్తవమత సామ్రాజ్యంలోని మత పరిస్థితి జెఫన్యా కాలంలోని మత పరిస్థితికి సామ్యంగావుంది?
◻ నేడున్న అనేకమంది రాజకీయ నాయకులు, జెఫన్యా కాలంలోని లౌకిక ‘అధిపతులను’ ఎలా పోలి ఉన్నారు?
◻ జెఫన్యాలోని ఏ వాగ్దానాలు, శేషం విషయంలో నెరవేరాయి?
◻ లక్షలాదిమంది ప్రజలు దేనిని గుర్తించారు?
◻ యెహోవా సేవలో మనం మన చేతుల్ని ఎందుకు దించకూడదు?
[15వ పేజీలోని చిత్రం]
జెఫన్యావలె, నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల శేషం యెహోవా తీర్పుల్ని నిర్భయంగా ప్రకటిస్తున్నారు
[18వ పేజీలోని చిత్రం]
“వేరేగొఱ్ఱెలు,” ప్రజల ఉదాసీనత తమ్మును నిరుత్సాహపర్చడానికి అనుమతించలేదు