పాఠకుల ప్రశ్నలు
మత్తయి 17:20 ప్రకారం, అపొస్తలులు పీడితుడైన బాలుడ్ని ‘తమ అల్పవిశ్వాసము’ కారణంగా స్వస్థపరచలేకపోయారు. అయితే, మార్కు 9:29లో వారి అసమర్థత ప్రార్థించవలసిన అవసరతతో ముడిపెట్టబడింది. వివిధ సువార్త వృత్తాంతాల్లో విభిన్న కారణాలు ఎందుకు ఇవ్వబడ్డాయి?
నిజానికి, ఆ రెండు వృత్తాంతాలు ఒకదానికొకటి పూరకాలుగా ఉన్నాయే కానీ, పరస్పర విరుద్ధంగా లేవు. మొదట, మత్తయి 17:14-20 చూడండి. తన కుమారునికి మూర్ఛరోగముందనీ, యేసు శిష్యులు ఆ కుర్రవాడ్ని స్వస్థపరచలేకపోయారనీ ఒక మనిషి తెలియజేశాడు. తర్వాత యేసు ఆ కుర్రవాడ్ని బాధిస్తున్న దయ్యాన్ని వెళ్ళగొట్టడం ద్వారా స్వస్థపరచాడు. మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని శిష్యులు అడిగారు. “మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి—ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని” యేసు “వారితో అనెను” అని మత్తయి వృత్తాంతం చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.)
ఇప్పుడు మార్కు 9:14-29 చూడండి. అక్కడ మీరు మరిన్ని వివరాలను కనుగొంటారు. ఉదాహరణకు, ఈ పిల్లవానికి ఈ రకమైన మూర్ఛ రావడానికి కారణం దుష్టాత్మేనన్న సమాచారాన్ని మార్కు 9:17 తెలియజేస్తుంది. యేసు మూర్ఛరోగాన్నీ, మరియు దయ్యం పట్టిన వ్యక్తులనూ స్వస్థపరిచాడని బైబిలులో మరోచోట కూడా చెప్పబడుతుందన్నది గమనార్హం. (మత్తయి 4:24) మునుపెన్నడూ ఏర్పడని ఈ పరిస్థితిలో, మూర్ఛ వచ్చినది ‘మూగదియును చెవిటిదియునైన దయ్యం’ మూలంగానే, అంటే ఒక దుష్టాత్మ మూలంగానే. దీనిని వైద్యుడైన లూకా స్థిరీకరిస్తున్నాడు. (లూకా 9:39; కొలస్సయులు 4:14) మార్కు 9:18లో “అది [దయ్యము] ఎక్కడ వానిని పట్టునో” అన్న పద బంధాన్ని గమనించండి. అంటే ఆ దయ్యం ఆ బాలుడ్ని ఎడతెగక కాక, అప్పుడప్పుడు మాత్రమే వేధించేది. అయినప్పటికీ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ చిన్నవాడ్ని స్వస్థపరచే పని చేయలేకపోయారు. మేము ఎందుకు చేయలేకపోయామని వాళ్ళు అడిగినప్పడు, “ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని” యేసు జవాబిచ్చాడు.
అయితే, మార్కు వృత్తాంతాన్ని జాగ్రత్తగా చదివితే, అది మత్తయి వృత్తాంతానికి విరుద్ధంగా లేదని తెలుస్తుంది. మార్కు 9:19లో ఆ తరం యొక్క అవిశ్వాసం విషయమై యేసు విచారాన్ని వ్యక్తపరచడాన్ని చదువుతాం. “నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని” ఆ బాలుని తండ్రికి యేసు చెప్పినట్లు 23వ వచనంలో వ్రాయబడి ఉంది. అంటే, మార్కు కూడా విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నాడు. 29వ వచనంలో, మార్కు అదనపు సమాచారాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన గురించి యేసు చెప్పిన విషయాన్ని మార్కు జతచేస్తున్నాడు. ఆ విషయాన్ని మత్తయిగానీ, లూకాగానీ తమ సువార్తల్లో చేర్చలేదు.
అయితే మనమేమి చెప్పగలం? ఇతర సందర్భాల్లో, 12 మంది అపొస్తలులూ, 70 మంది శిష్యులూ దుష్టాత్మలను వెళ్ళగొట్టారు. (మార్కు 3:15; 6:13; లూకా 10:17) కానీ ఈ సందర్భంలో శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకని? ఈ మూడు సువార్తల్లో ఇవ్వబడిన సమాచారాన్ని కలిపి చూస్తే, వాళ్ళు ఈ సందర్భంలో ఈ పని చేసేందుకు సిద్ధపడిలేరనే నిర్ధారణకు రావచ్చు. దయ్యాలకు విభిన్న వ్యక్తిత్వాలూ, ఆసక్తులూ, విభిన్న సామర్థ్యాలూ కూడా ఉంటాయని అనిపిస్తుంది కనుక, బహుశ భాగిక సమస్య ఎలాంటి దయ్యం ఇమిడి ఉందన్నదే అయ్యుండవచ్చు. ఇలాంటి దయ్యంతో వ్యవహరించేందుకు గట్టి విశ్వాసమూ, దేవుని సహాయం కోసం పట్టుదలతో కూడిన ప్రార్థనా అవసరమై ఉండినవి. అవును, యేసుకు అలాంటి విశ్వాసం ఉండింది. ఆయనకు ప్రార్థనను ఆలకించే, తన తండ్రి మద్దతు కూడా ఉండింది. (కీర్తన 65:2) యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టడం ద్వారా పీడితుడైన బాలుడ్ని స్వస్థపరచగల్గేవాడని మాత్రమే కాదు, ఆయన అలా చేశాడు కూడా.