కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీలు 10-11
  • దయ్యము పట్టిన బాలుడు స్వస్థపరచబడెను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దయ్యము పట్టిన బాలుడు స్వస్థపరచబడెను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయ్యముపట్టిన బాలుడు స్వస్థపరచబడెను
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • చెడ్డదూత పట్టిన అబ్బాయిని యేసు బాగుచేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యేసు కపెర్నహూములో అద్భుతాలు చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీలు 10-11

యేసుయొక్క జీవితము పరిచర్య

దయ్యము పట్టిన బాలుడు స్వస్థపరచబడెను

యేసు, పేతురు, యాకోబు మరియు యోహానులు దూరముగా బహుశ హెర్మోనుకొండ దిగువన ఉన్నప్పుడు, మిగిలిన శిష్యులు ఒక సమస్యలో చిక్కుకొనిరి. తిరిగివచ్చినప్పుడు, యేసు వెంటనే ఏదో తప్పిదము జరిగెనని గ్రహించెను. ఎందుకనగా జన సమూహము ఆయన శిష్యులచుట్టూ ఉండిరి. శాస్త్రులు వారితో తర్కించుచుండిరి. యేసును చూడగానే జనసమూహము విభ్రాంతినొంది ఆయనకు వందనము చేయుటకై పరుగెత్తిరి. “మీరు దేనినిగూర్చి వారితో తర్కించుచున్నారు?” అని ఆయనడిగెను.

జనసమూహములోనుండి ఒకడు ముందుకువచ్చి యేసు ఎదుట మోకాళ్లూని, “బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దీనిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదు” అని వివరించెను.

బాలుని స్వస్థపరచలేక పోయినందున శిష్యులను శాస్త్రులు ఎగతాళి చేయుచున్నారు. ఆ క్లిష్ట సమయములో యేసువచ్చి, “విశ్వాసములేని తరము వారలారా, నేనెంత కాలము మీతోనుందును? ఎంతవరకు మిమ్మును సహింతును?” అని అనెను.

యేసు ఈ మాటలు అక్కడున్న అందరిని ఉద్దేశించి మాట్లాడినట్లు కన్పించుచున్నది, కాని అవి ప్రత్యేకముగా శాస్త్రులనుద్దేశించి అనబడిన వనుటలో సందేహము లేదు. ఎందుకనగా వారు శిష్యులను యిబ్బంది పెట్టుచున్నారు. తరువాత యేసు ఆ బాలుని “నాయొద్దకు తీసికొనిరండని” చెప్పెను. ఆ బాలుడు యేసునొద్దకు రాగా వానిని పట్టిన దయ్యము వానిని నేలకు పడద్రోయగా, వాడు వణకుచు మెలికలు తిరుగుచు నురుగు కార్చుకొనుచు నేలపై పొర్లాడెను.

“ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది?” అని యేసు అడిగెను.

అందుకు వాని తండ్రి, “బాల్యమునుండియే. అది వానిని నాశనము చేయవలెనని తరచు అగ్నిలోను, నీళ్లలోను పడద్రోయును,” అని చెప్పిన తర్వాత, అతడు: “ఏమైననూ, నీ వలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుము” అని వేడుకొనెను.

బహుశ అనేక సంవత్సరములనుండి, అతని తండ్రి సహాయము కొరకు వెదకుచుండెను. ఇప్పుడైతే, యేసు శిష్యులు విఫలమైనందున అతని నిరాశ ఎక్కువాయెను. అతడు నిరాశతో “నీవలననైతే” అని అనిన మాటలకు యేసు అతనిని ప్రోత్సహించుచు, “నమ్మువానికి సమస్తము సాధ్యమేనని” చెప్పెను.

వెంటనే ఆ బాలుని తండ్రి “నమ్ముచున్నానని” బిగ్గరగా అనెను. అయితే “నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని” అతడు అర్ధించెను.

జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తుకొని వచ్చుట చూచిన యేసు ఆ దయ్యమును గద్దించుచు ఇట్లనెను: “మూగవైన చెవిటి దయ్యమా! వానిని వదలిపొమ్ము. ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను” అని అనెను. దయ్యము వాని విడిచిపోవుచు వానినెంతో విలవిలలాడించెను. ఆ బాలుడు కదలికలేనివాడై నేలపై పడెను. అనేకులు అతడు “చనిపోయెనని” అననారంభించిరి. అయితే యేసు ఆ బాలుని చేయిపట్టి, లేవనెత్తగా వాడు నిలువబడెను.

అంతకుముందు, శిష్యులు ప్రకటించుటకు పంపబడినప్పుడు వారు దయ్యములను వెళ్లగొట్టిరి. ఇప్పుడు వారు ఒక ఇంటిలోనికి వెళ్లినప్పుడు యేసుతో ఏకాంతముగా, “మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమి?” అని అడిగిరి.

వారికి విశ్వాసము లేనందుకేనని సూచించుచు, యేసు “ప్రార్థనవలననేగాని, మరిదేనివలననైనను ఈ విధమైనవి వదలిపోవుట అసాధ్యమని” వారితో అనెను. దీనివలె శక్తివంతమైన దయ్యములను వెళ్లగొట్టుటకు సిద్ధబాటు అవసరమని స్పష్టమగుచున్నది. ప్రార్థనతోబాటు మంచి విశ్వాసము కలిగి దేవుని శక్తినొందుటకు సహాయమడుగుట అవసరము.

అప్పుడు యేసు “మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి, ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనదేదియు నుండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

ఎంత బలమైన విశ్వాసము! యెహోవా సేవ అభివృద్ధి కాకుండ, ఆటంకములు, యిబ్బందులు, అధిగమించలేనంత, తీసివేయలేనంత నిజమైన కొండలవలెనుండును. అయినను యేసు చెప్పునదేమనగా, మన హృదయములో విశ్వాసమును పెంచి, నీరుపోసి, చిగురించుటకు ప్రోత్సహించిన, అది పరిణతి చెందును. అది మనలను కొండంత ఆటంకములను, ఇబ్బందులను అధిగమించునట్లు చేయును. మార్కు 9:14-29; మత్తయి 17:19, 20; లూకా 9:37-43.

◆ హెర్మోను కొండదిగి వచ్చుచుండగా యేసు ఏ పరిస్థితిని చూసెను?

◆ దయ్యము పట్టిన బాలుని తండ్రికి యేసు ఎటువంటి ప్రోత్సాహమునిచ్చెను?

◆ శిష్యులు దయ్యమునెందుకు వెళ్లగొట్టలేక పోయిరి?

◆ విశ్వాసము ఎంతో బలమైనదగునని యేసు ఎట్లు చూపెను? (w88 1/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి