పవిత్ర సేవాధిక్యతలను ఉన్నతంగా ఎంచడం
పవిత్ర సేవకు సంబంధించిన నియామకాలను తేలికగా తీసుకోకూడదు. ప్రాచీన యూదాలోని యాజకులు యెహోవా ఆలయ సంబంధంగా తమకున్న ఆధిక్యతల విషయమై ఉదాసీన వైఖరిని చూపించినప్పుడు, ఆయన వారిని తీవ్రంగా గద్దించాడు. (మలాకీ 1:6-14) ఇశ్రాయేలులోని కొందరు, పవిత్ర సేవ సంబంధంగా తాము స్వీకరించిన బాధ్యతలను తేలిగ్గా తీసుకోమని నాజీరులను ఉద్బోధించినప్పుడు, యెహోవా ఆ పాపులైన ఇశ్రాయేలీయులను గట్టిగా మందలించాడు. (ఆమోసు 2:11-16) నిజ క్రైస్తవులు కూడా పవిత్ర సేవలో పాల్గొంటారు. వాళ్ళు దానిని గంభీరంగా తీసుకుంటారు. (రోమీయులు 12:1) ఈ పవిత్ర సేవకు అనేక ముఖాలున్నాయి. అవన్నీ ప్రాముఖ్యమైనవే.
యేసు తన శిష్యులతో భూమి మీద ఉన్నప్పుడు, ఆయన వారిని దేవుని రాజ్య ప్రచారకులుగా తీర్చిదిద్దాడు. కాలక్రమేణా, వారి సందేశం భూదిగంతముల వరకూ చేరనుండింది. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) ప్రస్తుత విధానపు అంత్యదినాల్లో ఈ ప్రకటనా పని మరింత అత్యవసర భావంతో చేపట్టబడుతుంది.
యెహోవాసాక్షులందరూ ఈ పనిలో భాగం వహిస్తారు. లక్షలాది మంది పయినీర్లుగా ఉంటూ అలా చేయడంలో ఆనందాన్ని పొందుతారు. ఈ ప్రపంచవ్యాప్త పనిలోని ముఖ్యమైన అవసరతలను తీర్చేందుకు వేలాది మంది ప్రత్యేక పూర్తికాల సేవకులుగా బేతేలులోనూ, ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణ కర్తలుగా ప్రయాణ పనిలోనూ లేదా మిషనరీ సేవలోను తమను అందుబాటులో ఉంచుకున్నారు. అలాంటి ప్రత్యేక సేవలో కొనసాగాలని ఆశించేవారు తమ వైపు నుండి ఏం చేయవలసి ఉంటుంది?
కుటుంబంలో తప్పనిసరి అవసరాలు ఉన్నప్పడు
ఒక వ్యక్తి ప్రత్యేక పూర్తికాల సేవను చేపట్టే ముందు, సాధారణంగా కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం తప్పనిసరి. అందరూ ఆ పని చేయలేరు. ఒక వ్యక్తికి అప్పటికే ఉన్న లేఖనాధార బాధ్యతలు దానిని అసాధ్యం చేయవచ్చు. అయితే, అత్యావశ్యక కుటుంబ అవసరాలు, బహుశ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పరిస్థితి వంటివి ప్రత్యేక సేవలోవున్నవారికి ఎదురైతే అప్పుడేమిటి? బైబిలు సూత్రాలు మరియు క్రింద ఇవ్వబడినటువంటి ఉపదేశాలు అవసరమైన నిర్దేశాన్నిస్తాయి.
మన జీవితమంతా కూడా యెహోవాతో మనకు గల సంబంధంతో అల్లుకుని ఉండాలి. (ప్రసంగి 12:13; మార్కు 12:28-30) మనకు అప్పజెప్పబడిన పవిత్ర విషయాలను ఉన్నతంగా ఎంచాలి. (లూకా 1:74, 75; హెబ్రీయులు 12:16) తన ప్రాధాన్యతలను మార్చుకోవలసిన అవసరమున్న వ్యక్తితో అతడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో పూర్తిగా నిమగ్నమై తీరాలని ఒక సందర్భంలో యేసు చెప్పాడు. ఆ వ్యక్తి అలాంటి పనిని తన తండ్రి మరణించేంతవరకు వాయిదావేసే ఉద్దేశంతో ఉన్నాడన్నది స్పష్టం. (లూకా 9:59, 60) మరో వైపు, సమస్తాన్నీ దేవునికి అర్పించామని చెప్పి, “తన తండ్రికైనను తల్లికైనను . . . ఏమియు చేయ”నివారి తప్పుడు తలంపును యేసు బయటపెట్టాడు. (మార్కు 7:9-13) తల్లిదండ్రులూ, తాతమామ్మలతో సహా “స్వకీయులను” సంరక్షించవలసిన గంభీరమైన బాధ్యతను అపొస్తలుడైన పౌలు కూడా తెలియజేశాడు.—1 తిమోతి 5:3-8.
అంటే అత్యవసరం వచ్చినప్పుడు, ప్రత్యేక సేవలో ఉన్నవారు సంరక్షణా పాత్రను నిర్వహించేందుకు తమ నియామకాలను విడిచిపెట్టి తీరాలని భావమా? జవాబు అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం వ్యక్తిగతమైనది. (గలతీయులు 6:5) అనేకులు తమకు తమ నియామకమంటే ఎంత మక్కువ ఉన్నప్పటికీ, తమ తల్లిదండ్రులతో ఉండి వారికి అవసరమైన సహాయం చేయడమే జ్ఞానయుక్తమని నిర్ణయించుకున్నారు. ఎందుకని? ఎందుకంటే అది తప్పనిసరి అవసరమై ఉండవచ్చు. కుటుంబంలో సహాయం చేయగల సభ్యులు వేరే లేకపోవచ్చు. లేదా ఆ అవసరతను స్థానిక సంఘం తీర్చగల స్థితిలో ఉండకపోవచ్చు. కొందరు అలాంటి సహాయాన్ని చేస్తూ పయినీరింగ్ చేయగల్గుతున్నారు. మరి కొందరు కుటుంబ అవసరాన్ని తీర్చాక మళ్ళీ ప్రత్యేక పూర్తికాల సేవను చేపట్టగల్గారు. అయినప్పటికీ, అనేకుల విషయానికొస్తే, పరిస్థితిని ఇతర విధాల్లో పరిహరించడం సాధ్యమైంది.
తమ బాధ్యతను తీసుకోవడం
అత్యావశ్యక అవసరాలు వచ్చినప్పుడు, ప్రత్యేక సేవలో ఉన్న కొందరు తమ నియామకాలను విడిచిపెట్టకుండానే ఆ అవసరాలను తీర్చడంలో అవధానముంచగల్గుతున్నారు. అలాంటి అనేక మాదిరులలో కొన్నింటిని పరిశీలించండి.
ప్రాంతీయ మరియు జిల్లా సేవల్లో పాల్గొన్న తర్వాత 1978లో బేతేలు సేవలో ప్రవేశించిన ఒక దంపతులు యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నారు. సహోదరుని నియామకంలో దైవపరిపాలన సంస్థలోని ఎంతో భారం గల బాధ్యత ఇమిడి ఉంది. అయితే ఆయన తల్లిదండ్రులకు కూడా సహాయం అవసరం ఉంది. ఈ బేతేలు దంపతులు ఆ తల్లిదండ్రుల అవసరాలను చూసుకునేందుకు ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చేవారు—రాను పోను దాదాపు 3,500 కిలోమీటర్ల ప్రయాణం. తల్లిదండ్రుల అవసరాలను తీర్చేందుకు వాళ్ళు ఒక ఇల్లు కట్టించారు. అత్యవసర వైద్య సంప్రదింపులు అవసరమైనప్పుడెల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేవారు. వాళ్ళు ఈ బాధ్యతను నెరవేర్చేందుకే 20 సంవత్సరాలుగా తమ సెలవులనన్నింటినీ ఉపయోగించారు. వాళ్ళు తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అయితే, తమ పవిత్ర సేవాధిక్యతలను అమూల్యమైనవిగా ఎంచుతారు కూడా.
మరొక సహాదరుడు తన జీవితంలోని అత్యధిక సవాలుదాయకమైన పరిస్థితుల్లో ఒకటి అని ఆయన వర్ణిస్తున్న ఆ పరిస్థితిని 36 ఏండ్లుగా ప్రయాణ పనిలో ఉన్నప్పుడు ఎదుర్కున్నాడు. యెహోవా యొక్క నమ్మకమైన సేవకురాలైన, 85 ఏండ్లున్న ఆయన అత్తగారు తనకు సహాయం చేయగల ఒకరితో నివసించవలసిన అవసరం వచ్చింది. ఆ సమయంలో, ఆమె పిల్లల్లో దాదాపు అందరూ ఆమె తమతో నివసించడం వీలుకాదని తలంచారు. బంధువుల్లో ఒకరు ప్రయాణ పైవిచారణకర్తతో, ఆయనా, ఆయన భార్యా ఆ సేవను వదిలిపెట్టి, ఆ కుటుంబం పక్షాన, తల్లి సంరక్షణా బాధ్యతను తీసుకుని తీరాలని చెప్పారు. అయితే ఆ దంపతులు తమ అమూల్యమైన సేవాధిక్యతను వదిలిపెట్టనూ లేదు; ఆ తల్లి అవసరాలను తేలిగ్గా తీసుకోనూ లేదు. తర్వాతి తొమ్మిది సంవత్సరాలు, ఆమె ఎక్కువ సమయం వాళ్ళతోనే ఉండింది. మొదట్లో వాళ్ళు మొబైల్ హోమ్‌లో (సంచార గృహంలో) ఉండేవారు. ఆ తర్వాత, వివిధ సర్క్యూట్లలోని వారు ఇచ్చిన అపార్ట్మెంట్లలో ఉండేవారు. సుదూర ప్రయాణాలు అయితే, జిల్లా పైవిచారణకర్త తన నియామకాలను నిర్వర్తించేందుకు ఒంటరిగా వెళ్లేవాడు, ఆయన భార్య తన తల్లికి ప్రేమపూర్వకంగా నిరంతరం శ్రద్ధ చూపేందుకు ఆమెతో ఉండిపోయేది. ప్రతివారం ఆదివారం కూటం తర్వాత, భర్త వారికి సహాయం చేసేందుకు అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చేవాడు. ఈ పరిస్థితిని గురించి తెలిసినవారనేకులు ఈ దంపతులు చేస్తున్న పనికి ప్రగాఢమైన మెప్పుదలను వ్యక్తం చేశారు. కొంతకాలం గడిచే సరికి, కుటుంబంలోని మిగతా సభ్యులు కూడ కొంత చేయూతనందించేలా పురికొల్పబడ్డారు. ఆ దంపతులు తమ ప్రత్యేక పూర్తికాల సేవాధిక్యతను నిలుపుకున్నారు గనుక, వారి స్వయం త్యాగపూరిత సేవ నుండి యెహోవా యొక్క వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందడంలో కొనసాగుతున్నారు.
కుటుంబ సహకారంతో
కుటుంబంలోని వివిధ సభ్యులు ప్రత్యేక పూర్తికాల సేవ విలువను గుణగ్రహించినప్పుడు, తమలో కనీసం కొందరైన అందులో భాగం వహించేలా సహకరించవచ్చు.
అలాంటి కుటుంబ సహకార మనోభావం పశ్చిమ ఆఫ్రికాలో మిషనరీలుగా పని చేస్తున్న కెనడా దేశస్థులైన ఒక దంపతులకు సహాయకరంగా ఉంటోంది. ఏమీ జరగదులెమ్మన్న కేవల నిరీక్షణతో అలాంటి ఒక పరిస్థితి వచ్చేదాక వాళ్ళు ఊరికే వేచి ఉండలేదు. వాళ్ళు వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు వెళ్ళే ముందు, విదేశీ సేవ కొరకైన సిద్ధపాటులో భాగంగా, ఒకవేళ అమ్మకు బాగోలేకపోతే, లేదా ఆరోగ్యం దెబ్బతింటే ఏమి చేయాలన్న విషయాన్ని ఆ భర్త తన తమ్ముడితో చర్చించాడు. ఆయన తమ్ముడు తమ అమ్మమీద తనకున్న ప్రేమనూ, అలాగే, మిషనరీ పని విలువ విషయమై తనకున్న మెప్పుదలనూ ప్రదర్శిస్తూ, “నాకు ఇప్పుడు కుటుంబముంది, పిల్లలున్నారు. నేను ఎక్కువ దూరం వెళ్ళలేను. నువ్వు చేసే పనులను నేను చేయలేను. కనుక అమ్మకు ఏమన్నా అయితే, నేను చూసుకుంటాను” అన్నాడు.
దక్షిణ అమెరికాలో సేవ చేస్తున్న ఒక దంపతులకు, భార్య యొక్క వృద్ధురాలైన తల్లిని చూసుకునే విషయంలో ఆమె కుటుంబం నుండి చాలా మంచి సహకారం లభించింది. భార్య అక్కా, బావలు వాళ్ళ అమ్మను చూసుకున్నారు. ఆ అక్కకు భయంకరమైన వ్యాధి వచ్చేవరకు చూసుకున్నారు. తర్వాత ఏమి జరిగింది? ఆ దంపతులు నిశ్చింతగా ఉండేందుకు, వాళ్ళ బావగారు ఇలా వ్రాశారు: “నేనూ, పిల్లలు బ్రతికి ఉన్నంత కాలం, మీరు మిషనరీ సేవ వదలిపెట్టవలసిన అవసరం ఉండదు.” తర్వాత, వాళ్ళ చెల్లెలూ, మరిదీ వాళ్ళ అమ్మను చూసుకోవడానికి తమ ఇల్లు వదిలిపెట్టి, వాళ్ళ అమ్మ ఉన్నచోటికి తరలి వెళ్ళడంతో అదనపు కుటుంబ సహాయం దొరికింది. అమ్మ మరణం వరకూ వాళ్ళు ఆమెను చూసుకున్నారు. ఎంత చక్కని సహకార స్ఫూర్తి! మిషనరీ సేవకు మద్దతునిచ్చేందుకు వాళ్ళందరూ సహాయం చేశారు.
యెహోవాకు ఉదారంగా ఇచ్చే తల్లిదండ్రులు
పవిత్ర సేవ విషయమై తమకున్న గొప్ప మెప్పుదలను తల్లిదండ్రులు తరచూ చూపిస్తున్నారు. యెహోవాను ఘనపరచేందుకు తాము ఉపయోగించగల తమకున్న అత్యంత విలువైన సొత్తులో తమ సొంత పిల్లలు కూడా భాగమే. (సామెతలు 3:9) చాలామంది తల్లిదండ్రులు పూర్తికాల సేవలో చేరమని తమ పిల్లలను ప్రోత్సహిస్తారు. కొందరు హన్నాలా భావిస్తారు. ఆమె తన కుమారుడైన సమూయేలును “శాశ్వతంగా,” అంటే, “జీవితాంతం” యెహోవా సేవకోసం ఇచ్చింది.—1 సమూయేలు 1:22, 28, పరిశుద్ధ బైబల్.
అలాంటి ఒక తల్లి, “నీకున్న అద్భుతమైన ఆధిక్యతను బట్టి మేము యెహోవాకు కృతజ్ఞతలు చెబుతున్నాం. నువ్వు మా ఆశలను నెరవేర్చావు” అని ఆఫ్రికాలో ఉన్న తన కూతురుకు వ్రాశారు. “మనం ఎడబాటు అనే త్యాగాన్ని చేయడం తప్పనిసరి అన్నది నిజమే, కానీ యెహోవా మిమ్మల్ని సంరక్షిస్తున్న తీరును చూడడం ఎంత ఆనందంగా ఉంటుందో!” అని మరో సందర్భంలో ఆమె అన్నారు.
ఈక్వడార్‌లోని ఒక మిషనరీ తన వృద్ధ తల్లిదండ్రులకు అవసరమైన శ్రద్ధను చూపడంలో తలెత్తిన వివిధ పరిస్థితులను పునఃపరిశీలించిన తర్వాత, ఇలా వ్రాశారు: “నేనూ నా భార్యా పొందిన అతి పెద్ద సహాయం మా నాన్న చేసిన ప్రార్థనలేనని నేను అనుకుంటున్నాను. ‘మీరిద్దరూ మీ నియామకంలో కొనసాగాలనీ మీ నాన్న యెహోవాకు ప్రార్థించని ఒక్క రోజు కూడా లేదు’ అని ఆయన మరణం తర్వాత, మా అమ్మ మాతో చెప్పారు.”
అమెరికాలోని, కాలిఫోర్నియాలోని వృద్ధ దంపతులు తమ కుమారులలో ఒకరు పూర్తికాల సేవలో ఉన్నందుకు సంతోషించారు. ఆ అమ్మ చనిపోయినప్పుడు ఆ కుమారుడూ, ఆయన భార్యా స్పెయిన్‌లో ఉన్నారు. తండ్రిని చూసుకునే ఏర్పాట్లు చేయవలసిన అవసరముందని, కుటుంబంలోని మిగతా సభ్యులు భావించారు. తమకు లౌకిక ఉద్యోగంతో, పిల్లల పెంపకంతో తీరిక లేనందువల్ల, తాము ఆ బాధ్యతను తీసుకోలేమని వాళ్ళు అనుకున్నారు. అందుకని, ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్న దంపతులు ఇంటికి తిరిగి వచ్చి ఆయనను చూసుకోవాలని వాళ్ళు స్థిరంగా చెప్పారు. అయితే, తండ్రికి 79 ఏండ్లున్నప్పటికీ, ఆయనకు మంచి ఆరోగ్యం ఉంది, ఆయన ఆధ్యాత్మిక దృష్టి కూడా తేటగా ఉంది. కుటుంబ సమావేశంలో, ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత, తండ్రి లేచినిలబడి, “వాళ్ళు స్పెయిన్‌కు తిరిగివెళ్ళి, తమ పని కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని స్థిరంగా అన్నారు. వాళ్ళు అలా చేశారు. అయితే, భౌతికమైన విధాల్లో ఆయనకు సహాయం చేశారు కూడా. వాళ్ళ ప్రస్తుత నియామకం స్పెయిన్‌లో సర్క్యూట్ పని. విదేశ సేవలో ఆ దంపతులు చేస్తున్న పనిని కుటుంబంలోని మిగతా సభ్యులు ఆ కుటుంబ సమావేశమైనప్పటి నుండి మెప్పుదలతో దృష్టించనారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, మిగతా కుమారుల్లో ఒకరు తండ్రిని తమ ఇంట చేర్చుకుని, ఆయన మరణం వరకూ ఆయనను చూసుకున్నారు.
అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, 40 సంవత్సరాలుగా పయినీరింగ్ చేసిన అభిషిక్త సహోదరుని భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురై, చనిపోయినప్పుడు ఆయన వయస్సు 90 కన్నా ఎక్కువే ఉంది. ఆయనకు ఒక కుమారుడూ, ముగ్గురు కూతుళ్ళూ ఉన్నారు. దానికి తోడు అనేకానేక ఆధ్యాత్మిక పిల్లలూ ఉన్నారు. ఆయన కూతుళ్ళలో ఒకరు 40 సంవత్సరాలుగా పూర్తికాల సేవలో ఉన్నారు. ఆమె తన భర్తతో మిషనరీగాను, ప్రయాణ పనిలోను సేవచేసి, తర్వాత బేతేలులోనూ సేవచేస్తుంది. ఆమె తన తండ్రికి తగిన సంరక్షణ ఇవ్వబడేలా ఏర్పాట్లు చేసింది. స్థానిక సహోదరులు ఆయనను కూటాల కోసం రాజ్యమందిరంలోనికి తీసుకువెళ్ళడానికి సహాయపడ్డారు. తర్వాత, తన భర్త చనిపోయిన తర్వాత, నాన్నగారూ మిమ్మల్ని చూసుకునేందుకు బేతేలు విడిచిపెట్టెయ్యనా అని తన తండ్రిని అడిగింది. ఆయన పవిత్ర కార్యాలను చాలా ఉన్నతంగా ఎంచుతారు, తన అవసరాలు మరో విధంగా తీరుతాయని ఆయన భావించారు. కనుక ఆయన, “నువ్వు అలా చేయడం చాలా పెద్ద పొరపాటవుతుంది. నువ్వు అలా చేయడానికి నేను అనుమతిస్తే, అది అంతకన్నా పెద్ద పొరపాటవుతుంది” అని జవాబిచ్చారు.
మద్దతునిచ్చే సంఘాలు
పూర్తికాల ప్రత్యేక సేవలో ఉన్నవారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘాలు చాలా సహాయకరంగా ఉంటున్నాయి. అలాంటి సేవలో ఎన్నో సంవత్సరాలను అంకితం చేసినవారంటే వారికి ప్రత్యేక మెప్పుదల ఉంది. ఈ సంఘాలు వాళ్ళను లేఖనాధార బాధ్యతల నుండి విముక్తులను చేయలేకపోయినప్పటికీ, వాళ్ళు తమ ప్రత్యేక నియామకాలను విడిచిపెట్టనవసరం లేనివిధంగా, వాళ్ళ భారాన్ని తేలికపరచేలా ఎంతో సహాయం చేస్తున్నాయి.
జర్మనీ నుండి వచ్చిన ఒక జంట తమ విదేశీ నియామకంలో దాదాపు 17 సంవత్సరాలుగా ఉన్నారు. అందులో ఎక్కువ కాలం ప్రయాణ పనిలోనే ఉన్నారు. ఆ సమయంలోనే వృద్ధురాలైన అమ్మ అవసరాలు పెరిగాయి. ప్రతి సంవత్సరమూ వాళ్ళు ఆమెకు సహాయపడేందుకు తమ సెలవులను ఉపయోగించారు. సాక్షులైన పొరుగువాళ్ళు కూడా వాళ్ళకు ప్రేమపూర్వక సహాయాన్నిచ్చారు. పూర్తికాల సేవలో ఉండే ఆ దంపతులు ఆయన తల్లి విషమ స్థితిలో ఉన్నప్పుడు ఆమెతో ఉన్నారు. ఆ సమయంలోనే, స్థానిక సంఘ పెద్దలు వారిని కలిసే ఏర్పాటు చేసుకున్నారు. ఆ దంపతులు ఆ తల్లి కోసం క్రమంగా ఏమి చేస్తున్నారో వాళ్ళకు చాలా బాగా తెలుసు. అలాగే ఆ దంపతులు భాగం వహిస్తున్న ప్రత్యేక సేవ విలువను కూడా వాళ్ళు గుణగ్రహించారు. కనుక, పెద్దలు వాళ్ళ అమ్మను చూసుకునే ప్రతిపాదిత ప్రోగ్రామ్‌ను సంక్షిప్తపరచి, “మీరు ఆమె కోసం చేస్తున్నదానికన్నా ఎక్కువగా ఏమీ చేయలేరు; మీరు స్పెయిన్‌లో మీ నియామకంలో కొనసాగగల్గేలా మేము మీకు సహాయం చేస్తాం” అని చెప్పారు. గత ఏడు సంవత్సరాలుగా, ఈ పెద్దలు అలా చేయడంలో కొనసాగుతున్నారు.
అదేవిధంగా, 1967 నుండి సెనెగల్‌లో సేవచేస్తున్న ఒక సహోదరుడు, ఆయన తండ్రి ఉంటున్న సంఘం నుండి ప్రేమపూర్వకమైన మద్దతును ఎంతో పొందాడు. విషమ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయన తన ప్రేమామయురాలైన భార్య యొక్క ఇష్టపూర్వక సహకారంతో తన తల్లిదండ్రులకు సహాయపడేందుకు అమెరికాకు ఒంటరిగా ప్రయాణమై వెళ్ళాడు. ఆయన అక్కడ అనేక నెలలు ఉండడం అవసరమని కనుగొన్నాడు. ఈ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. కానీ ఆయన చేయగలిగింది చేసినప్పుడు, సంఘం ముందుకు వచ్చి, ఆయన తన మిషనరీ సేవలో కొనసాగేలా సహాయం చేసింది. దాదాపు 18 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా సంఘం అనేక విధాలుగా ప్రేమపూర్వక సహాయాన్ని అందించింది. మొదట తండ్రికి (ఆయన వారిలో అనేకులను గుర్తు పట్టలేకపోయినప్పటీకీ) ఆ తర్వాత వాళ్ళ అమ్మకూ ఆసరా ఇచ్చింది. అది ఆ కుమారుడ్ని తన బాధ్యత నుండి విముక్తుడ్ని చేసిందా? లేదు; ఆయన తరచూ సెనెగల్ నుండి వచ్చేవాడు, తనకు సాధ్యమైనంత మేరకు సహాయం చేసేందుకు తన సెలవులను ఉపయోగించేవాడు. సెనెగల్‌లో కష్టపడి సేవచేసే ఆ దంపతులు ప్రత్యేక పూర్తికాల సేవలో కొనసాగేలా చేయడంలో తమ వంతు ఉందని తెలుసుకోవడంలో ఆ సంఘంలోని చాలామంది సంతోషించారు.
సువార్త కోసం సమస్తాన్నీ వదిలిపెట్టినవారు అన్నదమ్ములనూ, అక్కచెల్లెండ్రనూ, తల్లులనూ, పిల్లలనూ నూరంతలుగా పొందుతారని యేసు చెప్పాడు. (మార్కు 10:29, 30) యెహోవా సేవకుల మధ్య అది నిజం. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌లో సేవచేస్తున్న ఒక దంపతులతో తల్లిదండ్రుల విషయమై చింతించవద్దని వారి సొంత ఊరులోని సంఘంలోని ఇద్దరు సాక్షులు చెప్పినప్పుడు వారు ఈ నెరవేర్పును ఒక ప్రత్యేక విధంగా అనుభవించారు. “మీ తల్లిదండ్రులు మాకూ తల్లిదండ్రులే” అని కూడా వాళ్ళు అన్నారు.
అవును, పవిత్ర సేవాధిక్యతలను ఉన్నతంగా ఎంచుతామని చూపించగల అనేక మార్గాలున్నాయి. మీరు దీనిని మరింత సంపూర్ణంగా చేయగల మార్గాలున్నాయా?
[26వ పేజీలోని చిత్రాలు]
వాళ్ళు తమను తాము ప్రత్యేక పూర్తికాల సేవకు అందుబాటులో ఉంచుకున్నారు