చివరికి—అందరికీ న్యాయం
“బాధితుల ఆక్రందనలనూ, చింతాక్రాంతుల ఆవేదనలనూ, నిరాశాతప్తుల ఆర్తనాదాలనూ . . . క్రొత్త మార్గాల్లో వినడానికి మేం కృషిచేస్తాం . . . చేయాల్సిందల్లా చట్టంలో ఉన్నవాటిని ఆచరణలో పెట్టడమే, అంటే జన్మతః దేవుని ఎదుట ప్రతి ఒక్కరికీ ఎలా సమాన గౌరవంవుందో అలాగే, మానవుని ఎదుటా ప్రతిఒక్కరికీ సమాన గౌరవం ఉండేలా చేయడం.”—అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ మిల్‌హౌస్ నిక్సన్, అధికార స్వీకారోత్సవ ప్రసంగం, జనవరి 20, 1969.
రాజులూ, అధ్యక్షులూ, ప్రధాన మంత్రులూ తమ అధికారాన్ని చేపట్టేటప్పుడు, వాళ్లు న్యాయాన్ని గురించి మాట్లాడ్డానికి మొగ్గుచూపిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన రిచర్డ్ నిక్సన్ అందుకు మినహాయింపేమీ కాదు. కానీ చరిత్ర వెలుగులో చూస్తే, ఇతరుల్లో ఉత్తేజాన్ని రేకెత్తించిన ఆయన మాటలు వాటి ప్రాభవాన్ని కోల్పోతాయి. ‘చట్టంకోసం ప్రాణం పెడతానని’ ఆయన ప్రతిజ్ఞ చేసినప్పటికీ, నిక్సన్ అటు తర్వాత చట్టోల్లంఘన చేసిన అపరాధిగా మారి, తన అధికారాన్ని విడిచిపెట్టేలా ఒత్తిడి చేయబడ్డాడు. మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా, ‘బాధితుల ఆక్రంధనలూ, చింతాక్రాంతుల ఆవేదనలూ, నిరాశాతప్తుల ఆర్తనాధాలూ’ వినబడుతూనే ఉన్నాయి.
సద్భావంగల అనేకమంది నాయకులు కనుగొన్నట్టు అలాంటి కేకలను వినడం, వాళ్ల బాధలపై అవధానాన్ని నిలపడం అంత సులభమైన పనేమీ కాదు. ‘అందరికీ న్యాయాన్ని చేకూర్చడం’ అనేది చేరుకోలేని గమ్యమని రుజువైంది. అయినప్పటికీ, అనేక శతాబ్దాల క్రిందట మన అవధానాన్ని చూరగొనదగ్గ ఓ వాగ్దానం చేయబడింది—న్యాయానికి సంబంధించిన నిరుపమానమైన వాగ్దానం.
దేవుడు తాను ఏర్పరచుకొనిన తన ‘సేవకుని’ తన ప్రజల కోసం పంపిస్తానని తన ప్రవక్తయైన యెషయా ద్వారా అభయమిచ్చాడు. “అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును” అని యెహోవా వారితో చెప్పాడు. (యెషయా 42:1-3) అన్ని జనాంగాలకూ శాశ్వతమైన న్యాయమనే అర్థాన్ని కల్గివున్న అలాంటి సమగ్రమైన ప్రకటనను చేయడానికి ఏ మానవ పరిపాలకుడూ సాహసించడు. ఆ వాగ్దానాన్ని విశ్వసించవచ్చా? అలాంటి అసాధారణమైన విషయం ఎప్పటికైనా వాస్తవ రూపం దాలుస్తుందా?
మనం విశ్వసించదగ్గ ఒక వాగ్దానం
వాగ్దానమనేది ఆ వాగ్దానాన్ని చేసినవాడు ఎంత విశ్వసించదగినవాడో అంతే విశ్వసించదగినదై ఉంటుంది. ఇక్కడ, వాగ్దానం చేస్తున్నది మరెవరో కాదు, తన ‘సేవకుడు’ ప్రపంచవ్యాప్తంగా న్యాయాన్ని స్థాపిస్తాడని ప్రకటించిన సర్వోన్నతుడైన దేవుడే. రాజకీయవేత్తలు చేస్తున్నట్టుగా, యెహోవా వాగ్దానాలను తేలికగా చేయడు. ఆయన ‘అబద్ధమాడజాలడని’ బైబిలు మనకు అభయమిస్తోంది. (హెబ్రీయులు 6:17) “నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును” అని దేవుడు స్థిరంగా ప్రకటిస్తున్నాడు.—యెషయా 14:24.
ఆ వాగ్దానంపై మనకున్న నమ్మకం దేవుడు ఏర్పరచుకొన్న ‘సేవకుడైన’ యేసుక్రీస్తును గూర్చిన రికార్డు ద్వారా మరింత బలపడుతుంది. న్యాయాన్ని స్థాపించబోయేవాడు న్యాయాన్ని ప్రేమించాలి, న్యాయానుసారంగా జీవించాలి. ‘నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషించిన’ మనుష్యునిగా యేసు నిష్కళంకమైన చరిత్రను కల్గివున్నాడు. (హెబ్రీయులు 1:9) ఆయన చెప్పినవీ, ఆయన జీవించిన విధానమూ, ఆయన మరణించిన విధానమూ అన్నీ కలిసి ఆయన నిజంగా న్యాయవంతుడని రుజువు చేశాయి. యేసుపై జరిగిన న్యాయ విచారణనూ, ఆయన శిక్షించబడడాన్నీ చూసిన రోమా సైన్యాధికారి యేసు మరణించినప్పుడు, ఇలా చెప్పడానికి కదిలించబడ్డాడు: “ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండె[ను].”—లూకా 23:47.
యేసు తాను నీతిమంతునిగా జీవించడమేగాక, తన కాలంలో ఎంతగానో ప్రబలిపోయిన అన్యాయాన్ని ప్రతిఘటించాడు. ఆయన దాన్ని, కూలదోయడంద్వారానో లేదా విప్లవంద్వారానో గాక, వినే ప్రతి ఒక్కరికీ నిజమైన న్యాయాన్ని గురించి బోధించడం ద్వారానే అలా చేశాడు. కొండపై ఆయన చేసిన ప్రసంగం అనేది నిజమైన న్యాయాన్నీ, నీతినీ ఎలా అనుసరించాలో తెలియజేసే ఒక ప్రజ్ఞావంతమైన వివరణ.—మత్తయి, 5-7 అధ్యాయాలు.
యేసు తాను ప్రకటించినదాన్ని ఆచరించాడు. యూదా సమాజంలోని ‘అస్పృశ్యులైన,’ అభాగ్యులైన కుష్ఠురోగుల్ని ఆయన ఈసడించుకోలేదు. బదులుగా, ఆయన వారితో మాట్లాడాడు, వారిని తాకాడు, వారిని బాగుచేశాడు కూడా. (మార్కు 1:40-42) బీదా బిక్కీతోపాటూ తనను కలుసుకొన్న ప్రజలంతా ఆయనకు ప్రాముఖ్యమైనవారే. (మత్తయి 9:36) “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని ఆయన వారితో చెప్పాడు.—మత్తయి 11:28.
అన్నింటికన్నా మిన్నగా, తన చుట్టూవున్న అన్యాయం తనను అవినీతిపరునిగా లేదా నిరాశాతప్తునిగా చేయడానికి ఆయన అనుమతించలేదు. ఆయన తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా అన్యాయాన్ని ఎన్నడూ చేయలేదు. (1 పేతురు 2:22, 23) తీవ్రమైన వేదనలో ఉన్నప్పుడు సహితం, ఆయన తనను కొరతవేసిన సైనికుల తరుపున తన పరలోకపు తండ్రికి ప్రార్థించాడు. “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” ఆయన వేడుకున్నాడు. (లూకా 23:34) నిశ్చయంగా, యేసు ‘అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము’ చేశాడు. (మత్తయి 12:18) న్యాయమైన లోకాన్ని స్థాపించాలనే దేవుని కోరికకు ఆయన సొంత కుమారుని సజీవ మాదిరికన్నా మిన్నయైన రుజువేముంది?
అన్యాయాన్ని అధిగమించవచ్చు
అన్యాయాన్ని అధిగమించవచ్చనడానికి సజీవమైన రుజువు నేటి లోకంలో లభ్యమౌతోంది కూడా. దురభిమానాన్నీ, పక్షపాతాన్నీ, జాతివాదాన్నీ, హింసనూ జయించేందుకు వ్యక్తులుగానూ, అలాగే సంస్థానుగతంగానూ యెహోవాసాక్షులు కృషిచేస్తారు. ఈ క్రిందనున్న మాదిరిని పరిశీలించండి.
స్పెయిన్ భూభాగంలో ఉన్న, తాను నివసించే బాస్క్యూ అనే దేశానికి న్యాయాన్ని చేకూర్చడానికున్న ఏకైక మార్గం ప్రభుత్వాన్ని కూలదోయడమేనని పెడ్రోa విశ్వసించేవాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఒక టెర్రరిస్ట్ సంస్థ సభ్యుడయ్యాడు. ఆ సంస్థ అతనికి ఫ్రాన్స్‌లో పారామిలటరీ ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తవ్వగానే, ఒక టెర్రరిస్ట్ యూనిట్‌ను తయారుచేసుకొని, పోలీసు క్వార్టర్సుని పేల్చివేయమని పైనుండి అతనికి ఆజ్ఞ వచ్చింది. పోలీసులు అతణ్ణి అరెస్టు చేసేనాటికి, అతని యూనిట్ బాంబులను సిద్ధం చేసుకుంటోంది. జైలులో 18 నెలలు గడిపినా, అతడు ఆ కటకటాల వెనుక కూడా తన రాజకీయ వ్యవహారాల్ని కొనసాగించాడు, నిరాహార దీక్షల్లో పాల్గొనేవాడు, ఒకానొక సందర్భంలో తన మణికట్టుల్ని కోసుకున్నాడు.
పెడ్రో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన యెహోవాను గురించీ ఆయన సంకల్పాల్ని గురించీ తెలుసుకున్నాడు. పెడ్రో జైల్లో ఉండగా, అతని భార్య యెహోవాసాక్షులతో బైబిల్ని పఠించడం ప్రారంభించింది. అతడు విడుదలై వచ్చినప్పుడు, వారి కూటాల్లో ఒక దానికి హాజరుకమ్మని ఆమె అతణ్ణి ఆహ్వానించింది. అతడు ఆ కూటాన్ని ఎంతగానో ఆనందించి, తనతో బైబిల్ని పఠించమని అడిగాడు. ఆ పఠనం అతని దృక్పథంలోనూ, జీవించే విధానంలోనూ గొప్ప మార్పులు చేసుకోవడానికి దారితీసింది. చివరకు, 1989లో పెడ్రో, అతని భార్యా ఇరువురూ బాప్తిస్మం తీసుకున్నారు.
“నేను టెర్రరిస్టుగా ఉన్న రోజుల్లో నా చేతుల్తో ఎవ్వరినీ చంపనందుకు యెహోవాకు కృతజ్ఞుణ్ణై ఉన్నాను, నిజమైన శాంతి, న్యాయాల్ని గూర్చిన సందేశాన్ని అంటే దేవుని రాజ్య సువార్తను ప్రజలకు తెలియజేసేందుకు దేవుని ఆత్మ ఖడ్గమైన బైబిల్ని నేనిప్పుడు ఉపయోగిస్తున్నాను” అని పెడ్రో అంటున్నాడు. ఇప్పుడు యెహోవాసాక్షుల సంఘంలో ఒక పెద్దగా సేవచేస్తున్న పెడ్రో తాను పేల్చేయాలనుకొన్న క్వార్టర్లను ఈ మధ్యనే సందర్శించాడు. కానీ ఈసారి వెళ్లింది మట్టుకు అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు శాంతి సందేశాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతోనే.
యెహోవాసాక్షులు నీతియుక్తమైన లోకం కోసం ఎదురుచూస్తున్నందుననే వాళ్లీ మార్పుల్ని చేసుకుంటారు. (2 పేతురు 3:13) దాన్ని తీసుకొస్తాడని దేవుని వాగ్దానమందు వాళ్లు పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పటికీ, న్యాయానుసారంగా జీవించడం తమ కర్తవ్యం అనే విషయాన్ని కూడా వాళ్లు గ్రహిస్తారు. మనవంతు మనం చేయాలని దేవుడు అపేక్షిస్తున్నాడని బైబిలు స్పష్టంగా తెలియజేసింది.
నీతి విత్తనాల్ని విత్తడం
నిజమే, అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు, “న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను?” అని కేకలు వేయడానికి బహుశా మనం మొగ్గుచూపిస్తాం. మలాకీ కాలంలోని యూదులు అలాగే కేకలు వేశారు. (మలాకీ 2:17) దేవుడు వారి ఫిర్యాదుల్ని తీవ్రంగా తీసుకొన్నాడా? అలా తీసుకోవడానికి బదులుగా, అది ఆయనకు ‘ఆయాసాన్ని’ కలుగజేసింది, ఎందుకంటే ఇతర విషయాలతోపాటూ, వాళ్లు వయస్సుపైబడ్డ తమ భార్యలతో కుయుక్తిగా ప్రవర్తిస్తూ, చిన్నచిన్న మిషలతో వారికి విడాకులిస్తున్నారు. ‘తాము యౌవన కాలమందు పెండ్లిచేసికొన్న తమ భార్యలు తమకు తోటివారిగానూ, తాము చేసిన నిబంధనకు పాత్రురాళ్లుగానూ ఉన్నప్పటికీ, వారితో కుయుక్తిగా వ్యవహరించినందున’ యెహోవా వారి విషయమై తనకుగల శ్రద్ధను వ్యక్తపర్చాడు.—మలాకీ 2:14.
మనమే అన్యాయం చేస్తున్నట్లైతే, అన్యాయాన్ని గురించి మనం న్యాయసమ్మతంగా ఫిర్యాదు చేయగలమా? మరోవైపున, దురభిమానాన్నీ, జాతివాదాన్నీ మన హృదయాల్లో నుండి తొలగించడం ద్వారా, పక్షపాతంలేనివారిగా అందర్నీ ప్రేమించేవారిగా ఉండడం ద్వారా, కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండడం ద్వారా మనం యేసును అనుకరించేందుకు ప్రయత్నిస్తే, మనం నిజంగా న్యాయాన్ని ప్రేమిస్తున్నామని చూపించుకుంటాం.
మనం న్యాయమనే కోతను కోయాలనుకుంటే, ‘నీతి ఫలించునట్లు విత్తనాన్ని విత్తమని’ బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (హొషేయ 10:12) అదెంత చిన్న విషయంగా కనిపించినప్పటికీ, అన్యాయంపై సాధించే ప్రతి వ్యక్తిగత విజయమూ ప్రాముఖ్యమైనదే. “అన్యాయమెక్కడ జరిగినా అది అంతటా ఉన్న న్యాయానికి ముప్పే”నని బ్రిమింగ్‌హామ్ జైల్ నుండి రాసిన ఉత్తరములో (ఆంగ్లం) మార్టిన్ లూథర్ కింగ్, జూ. తెలియజేశాడు. ‘నీతిని అనుసరించే’ ప్రజలనే దేవుడు త్వరలో రానైవున్న తన నీతియుక్తమైన నూతన లోకాన్ని స్వతంత్రించుకునేందుకు ఎంపికచేసుకుంటాడు.—జెఫన్యా 2:3.
మానవ వాగ్దానాలనే కదిలిపోయే పునాదిపై న్యాయం కోసమైన మన నిరీక్షణను మనం నిర్మించుకోలేకపోయినప్పటికీ, మన ప్రేమగల సృష్టికర్త మాటను మనం విశ్వసించవచ్చు. దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తూ ఉండమని తన అనుచరులకు యేసు చెప్పిందందుకే. (మత్తయి 6:9, 10) ఆ రాజ్యానికి నియమిత రాజుగా యేసు “దరిద్రులు మొఱ్ఱపెట్టగా . . . వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును.”—కీర్తన 72:12, 13.
అన్యాయం శాశ్వతంకాదని స్పష్టమౌతోంది. “నేను . . . చేసిన ప్రమాణమును నిలబెట్టుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకనిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమందంతటను నీతిని ధర్మమును పాటించును” అని తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా దేవుడు అభయమిస్తుండగా క్రీస్తు పరిపాలన భూమిపైనున్న అన్యాయాన్నంతటినీ ఇక ఎన్నటికీ లేకుండా పూర్తిగా జయిస్తుంది.—యిర్మీయా 33:14, 15, పవిత్ర గ్రంథము క్యాతలిక్ అనువాదము.
[అధస్సూచీలు]
a పేరు మార్చబడింది.