యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
“ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నియు న్యాయములు, ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.”—ద్వితీయోపదేశకాండము 32:4.
1. న్యాయం కొరకు మనకు సహజసిద్ధమైన అవసరత ఎందుకుంది?
ప్రేమించబడాలనే సహజసిద్ధమైన అవసరాన్ని కల్గివున్నట్టుగానే మనమంతా న్యాయంగా వ్యవహరించబడాలని పరితపించిపోతాం. అమెరికా రాజనీతి విశారదుడు థామస్ జెఫర్సన్ ఇలా వ్రాశాడు: “మన స్పర్శ, చూపు, లేక వినికిడి ఎలాగైతే మన రూపనిర్మాణంలో ఒక భాగమో అలాగే . . . [న్యాయం] సహజసిద్ధమైనది, స్వాభావికమైనది.” ఇందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు, ఎందుకంటే యెహోవా మనల్ని తన స్వరూపమందు సృష్టించాడు. (ఆదికాండము 1:26) వాస్తవానికి, ఆయన తన స్వంత వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే లక్షణాలను మనకు అనుగ్రహించాడు, వాటిలో న్యాయం ఒకటి. అందుకే మనకు న్యాయం కోసం స్వాభావిక అవసరత ఉంది, అందుకే మనం నిజమైన నీతిన్యాయాలుగల ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతాము.
2. యెహోవాకు న్యాయం ఎంత ప్రాముఖ్యమైనది, దైవిక న్యాయం యొక్క భావాన్ని మనం ఎందుకు గ్రహించాలి?
2 యెహోవా గురించి బైబిలు మనకిలా అభయమిస్తుంది: “ఆయన చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీయోపదేశకాండము 32:4) కానీ అన్యాయంతో పీడించబడుతున్న లోకంలో, దైవిక న్యాయం యొక్క అర్థాన్ని గ్రహించడం అంత సులభం కాదు. అయితే దేవుని వాక్య పుటల ద్వారా, దేవుడు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తాడో తెలుసుకుని, దేవుని అద్భుతమైన మార్గాలను మనం మరింత ఎక్కువగా గుణగ్రహించవచ్చు. (రోమీయులు 11:33) బైబిలు భావంలో న్యాయం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం, ఎందుకంటే న్యాయాన్ని గూర్చిన మన తలంపు మానవ భావనలతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మానవ దృక్కోణం నుండి చూస్తే, న్యాయమంటే చట్టాన్ని నిష్పక్షపాతంగా అన్వయించడం కంటే ఎక్కువేమీ కాకపోవచ్చు. లేదా తత్త్వవేత్తయైన ఫ్రాన్సిస్ బేకన్ వ్రాసినట్లుగా, “ప్రతి మనిషీ దేన్ని పొందడానికి అర్హుడో దాన్ని ఇవ్వడమే న్యాయం.” అయితే యెహోవా న్యాయంలో అంతకంటే ఎక్కువే ఇమిడివుంది.
యెహోవా న్యాయం వాత్సల్యపూరితమైనది
3. నీతి న్యాయాల కొరకు బైబిల్లో ఉపయోగించబడిన ఆదిమ-భాషా పదాలను పరిశీలించడం ద్వారా ఏం నేర్చుకోవచ్చు?
3 బైబిల్లో ఆదిమ-భాషా పదాలు ఉపయోగించబడిన విధానాన్ని పరిశీలించడం ద్వారా దేవుని న్యాయ పరిధిని చక్కగా అర్థం చేసుకోవచ్చు.a ఆసక్తికరంగా, లేఖనాల్లో న్యాయానికీ నీతికీ చెప్పుకోదగిన తేడా ఏమీ లేదు. వాస్తవానికి, ఆమోసు 5:24 నందు మనం చూసేలా ఈ హెబ్రీ పదాలు కొన్నిసార్లు సమాంతరాలుగా ఉపయోగించబడ్డాయి, అక్కడ యెహోవా తన ప్రజలనిలా పురికొల్పుతున్నాడు: “నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.” అంతేగాక, ‘నీతి న్యాయములు’ అనే పదాలు, విషయాన్ని నొక్కిచెప్పడానికి చాలాసార్లు కలిపి ఉపయోగించబడినట్లుగా కనిపిస్తాయి.—కీర్తన 33:5; యెషయా 33:5; యిర్మీయా 33:15; యెహెజ్కేలు 18:21; 45:9.
4. న్యాయాన్ని అనుసరించడమంటే ఏమిటి, న్యాయం యొక్క తుది ప్రమాణం ఏది?
4 ఈ హెబ్రీ గ్రీకు పదాలు ఏ భావాన్ని తెలియజేస్తున్నాయి? లేఖన భావంలో, న్యాయాన్ని జరిగించడమంటే సరైనదాన్నీ, న్యాయమైనదాన్నీ చేయడమని భావం. నైతిక చట్టాలనూ సూత్రాలనూ లేదా సరైనదాన్నీ, న్యాయమైనదాన్నీ నెలకొల్పేది యెహోవాయే గనుక, పరిస్థితులతో యెహోవా వ్యవహరించే విధానమే న్యాయానికి తుది ప్రమాణం. నీతి (సెదెక్) అని అనువదించబడిన హెబ్రీ పదం, “నీతి ప్రమాణాన్నీ, నైతిక ప్రమాణాన్నీ సూచిస్తుంది, అయితే పాత నిబంధనలో ఆ ప్రమాణమే దేవుని నైజమూ, చిత్తమూ అయ్యుంది” అని థియలాజికల్ వర్డ్‌బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ వివరిస్తుంది. కాబట్టి, దేవుడు తన సూత్రాలను అన్వయించే విధానం, మరి ప్రాముఖ్యంగా ఆయన అపరిపూర్ణ మానవులతో వ్యవహరించే విధానం, నిజమైన నీతి న్యాయాలకున్న వాస్తవిక విశిష్టతను వెల్లడిస్తున్నాయి.
5. దేవుని న్యాయంతో ఏ లక్షణాలు సన్నిహితంగా జతచేయబడి ఉన్నాయి?
5 దైవిక న్యాయం కఠినమైనదీ, కఠోరమైనదీ కాదుగానీ వాత్సల్యపూరితమైనదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. దావీదు ఇలా పాడాడు: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు.” (కీర్తన 37:28) దేవుని న్యాయం, ఆయన తన సేవకుల పట్ల నమ్మకంగా, దయాపూర్వకంగా ఉండేలా ఆయనను పురికొల్పుతుంది. దైవిక న్యాయం మన అవసరతలను అర్థం చేసుకుని, మన అపరిపూర్ణతలను పరిగణలోకి తీసుకుంటుంది. (కీర్తన 103:14) అంటే దేవుడు దుష్టత్వాన్ని చూసీచూడనట్టు ఊరుకుంటాడని దాని భావంకాదు ఎందుకంటే, అలా చేస్తే అన్యాయాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. (1 సమూయేలు 3:12, 13; ప్రసంగి 8:11) తాను “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల”వాడనని యెహోవా మోషేకు వివరించాడు. దేవుడు దోషమును అపరాధమును క్షమించడానికి ఇష్టపడతాడు గానీ, శిక్షించబడడానికి అర్హులైన వారిని శిక్షనుండి మినహాయించడు.—నిర్గమకాండము 34:6, 7.
6. యెహోవా తన భూ సంబంధ పిల్లలతో ఎలా వ్యవహరిస్తాడు?
6 యెహోవా న్యాయాన్ని ఎలా జరిగిస్తాడనే విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు, ఆయన కేవలం తప్పిదస్థులకు శిక్ష విధించడం విషయంలో మాత్రమే శ్రద్ధకల్గివున్న చండశాసనుడైన న్యాయాధిపతి అని మనం భావించకూడదు. బదులుగా ఆయన, తన పిల్లలతో ఎల్లప్పుడూ సాధ్యమైనంత మంచిగా వ్యవహరిస్తూ, ప్రేమగలవాడే అయినప్పటికీ స్థిరచిత్తునిగా ఉండే తండ్రి అని మనం భావించాలి. “యెహోవా, నీవే మాకు తండ్రివి” అని ప్రవక్తయైన యెషయా అన్నాడు. (యెషయా 64:8) నీతి న్యాయాలుగల తండ్రిగా యెహోవా, కష్టతరమైన పరిస్థితుల మూలంగా లేదా శరీర బలహీనతల మూలంగా సహాయం కావాల్సిన లేదా క్షమాపణ అవసరమయ్యే తన భూసంబంధ పిల్లల పట్ల చూపించాల్సిన కనికరంతో, సరైనదాని పట్ల తనకున్న దృఢత్వాన్ని సమతూకపరుస్తాడు.—కీర్తన 103:6, 10, 13.
న్యాయమంటే ఏమిటో స్పష్టపర్చడం
7. (ఎ) యెషయా ప్రవచనం నుండి దైవిక న్యాయం గురించి మనం ఏమి నేర్చుకుంటాము? (బి) జనాంగాలకు న్యాయం గురించి బోధించడంలో యేసు ఏ పాత్ర నిర్వహించాడు?
7 యెహోవా న్యాయానికున్న దయాపూర్వక స్వభావం మెస్సీయ రాకతో ఉన్నతపర్చబడింది. ప్రవక్తయైన యెషయా ప్రవచించినట్లుగా, యేసు దైవిక న్యాయాన్ని బోధించి, దానికి అనుగుణంగా జీవించాడు. స్పష్టంగా, దైవిక న్యాయంలో, పీడిత ప్రజలను కనికరంతో చూడడం ఇమిడివుంది. వారికి శాశ్వతమైన నాశనం కలిగేందుకు ఆయన అనుమతించడు. దేవుని న్యాయం యొక్క ఈ అంశాన్ని “అన్యజనులకు . . . ప్రచురము చేయ”డానికి యెహోవా ‘సేవకుడైన’ యేసు భూమిమీదికి వచ్చాడు. అన్నిటికంటే ఎక్కువగా, దైవిక న్యాయమంటే ఏమిటనేదాని గురించి మనకు సజీవ ఉదాహరణనివ్వడం ద్వారా ఆయనలా చేశాడు. రాజైన దావీదు యొక్క “నీతి చిగురు”గా యేసు, ‘న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకు’ ఆతురత కల్గివున్నాడు.—యెషయా 16:5; 42:1-4; మత్తయి 12:18-21; యిర్మీయా 33:14, 15.
8. మొదటి శతాబ్దంలో నిజమైన నీతి న్యాయాలు ఎందుకు కనుమరుగైపోయాయి?
8 యెహోవా న్యాయం యొక్క స్వభావాన్ని గూర్చిన అలాంటి స్పష్టీకరణ సా.శ. మొదటి శతాబ్దంలో ప్రాముఖ్యంగా అవసరమయ్యింది. యూదా పెద్దలూ, మతనాయకులూ—శాస్త్రులూ, పరిసయ్యులూ, మరితరులూ—నీతిన్యాయాలను గురించిన వక్రీకరించబడిన దృక్కోణాన్ని ప్రచురపరిచి, అలాగే నడుచుకున్నారు. ఫలితంగా, శాస్త్రులూ, పరిసయ్యులూ విధించిన ఆంక్షలకు అనుగుణంగా జీవించడం అసాధ్యమని భావించిన సామాన్య ప్రజలు, దేవుని నీతికి అనుగుణంగా జీవించడం మరీ అసాధ్యమని ఊహించివుండవచ్చు. (మత్తయి 23:4; లూకా 11:46) విషయమది కాదని యేసు చూపించాడు. ఆయన తన శిష్యులను ఈ సామాన్య ప్రజల్లో నుండే ఎంపిక చేసుకుని, వారికి దేవుని నీతి ప్రమాణాలను బోధించాడు.—మత్తయి 9:36; 11:28-30.
9, 10. (ఎ) శాస్త్రులూ పరిసయ్యులూ తమ నీతిని ప్రదర్శించడానికి ఎలా ప్రయత్నించారు? (బి) శాస్త్రులూ పరిసయ్యుల ఆచారాలు వ్యర్థమైనవని యేసు ఎలా, ఎందుకు బయల్పరిచాడు?
9 మరోవైపున పరిసయ్యులు, బహిరంగంగా ప్రార్థించడం ద్వారానో లేదా చందాలను ఇవ్వడం ద్వారానో తమ “నీతి”ని ప్రదర్శించడానికి అవకాశాల కొరకు వెదికేవారు. (మత్తయి 6:1-6) అసంఖ్యాకమైన చట్టాలనూ ఆజ్ఞలనూ—వాటిలో అనేకం వారు స్వయంగా రూపొందించుకున్నవే—అనుసరించడం ద్వారా కూడా తమ నీతిని ప్రదర్శించడానికి వాళ్లు ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలు, వారు “న్యాయమును దేవుని ప్రేమను విడిచి”పెట్టడానికి దారితీశాయి. (లూకా 11:42) పైకి వారు నీతిమంతులుగానే కనిపించివుండవచ్చు, కాని లోపల వారు పూర్తిగా “అక్రమముతో” లేక అవినీతితో “నిండియున్నారు.” (మత్తయి 23:28) సరళంగా చెప్పాలంటే, నిజానికి వాళ్లకు దేవుని నీతి గురించి తెలిసింది అంతంత మాత్రమే.
10 ఆ కారణాన్ని బట్టే, “శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని” యేసు తన అనుచరులను హెచ్చరించాడు. (మత్తయి 5:20) యేసు ఉదాహరించిన దైవిక న్యాయానికీ, శాస్త్రులూ పరిసయ్యుల సంకుచిత స్వనీతికీ మధ్య కొట్టొచ్చినట్టు కనబడుతున్న భేదమే వారి మధ్య తరచూ వివాదాలు తలెత్తడానికి కారణమయ్యింది.
దైవిక న్యాయానికీ వక్రీకరించబడిన న్యాయానికీ పోటీ
11. (ఎ) విశ్రాంతిదినాన స్వస్థపర్చడం గురించి పరిసయ్యులు యేసును ఎందుకు ప్రశ్నించారు? (బి) యేసు సమాధానం ఏమి వెల్లడించింది?
11 యేసు సా.శ. 31వ సంవత్సరం వసంతకాలంలో గలిలయలో పరిచర్య చేస్తున్నప్పుడు ఊచ చెయ్యిగల ఒక వ్యక్తిని సమాజమందిరంలో చూశాడు. అది విశ్రాంతి దినం గనుక, పరిసయ్యులు యేసును ఇలా అడిగారు: “విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా?” ఈ పేద వ్యక్తి అనుభవిస్తున్న బాధ పట్ల శ్రద్ధ చూపాల్సిందిపోయి, వారి ప్రశ్న చూపిస్తున్నట్లుగా, యేసును నిందించడానికి ఒక సాకును పట్టుకోవాలని వారు అభిలషించారు. వారి దయలేని హృదయాలను బట్టి యేసు దుఃఖించడంలో ఆశ్చర్యం లేదు! ఆ తర్వాత ఆయన పరిసయ్యులకు ఈ ఎదురు ప్రశ్న వేశాడు: “విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా?” వాళ్లు కిమ్మనకుండా ఊరుకోవడంతో, విశ్రాంతి దినాన గుంటలో పడిన గొఱ్ఱెను పైకి తీయరా అని అడగడం ద్వారా యేసు తన ప్రశ్నకు తానే సమాధానం ఇచ్చాడు.b “గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు!” యేసు తిరుగులేని విధంగా తర్కించాడు. “కాబట్టి విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమే [లేక న్యాయమే]” అని ఆయన ముగించాడు. దేవుని న్యాయం మానవ పారంపర్యాచారంతో ఎన్నడూ అడ్డగించబడకూడదు. ఆ విషయాన్ని స్పష్టపరిచి, యేసు ముందుకు వెళ్లి ఆ వ్యక్తి చేతిని స్వస్థపరిచాడు.—మత్తయి 12:9-13; మార్కు 3:1-5.
12, 13. (ఎ) శాస్త్రులూ పరిసయ్యులకు భిన్నంగా, పాపులకు సహాయం చేయడంలో తనకున్న ఆసక్తిని యేసు ఎలా చూపించాడు? (బి) దైవిక న్యాయానికీ, స్వనీతికీ మధ్యనున్న తేడా ఏమిటి?
12 పరిసయ్యులు శారీరక అశక్తతలున్న వారి గురించి అంతగా పట్టించుకోలేదు అంతేగాక ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని అంతకంటే అసలే పట్టించుకోలేదు. నీతిని గురించిన వారి వక్రీకరించబడిన దృక్కోణం, వారు సుంకరులనూ, పాపులనూ అలక్ష్యం చేసి తృణీకరించేలా చేసింది. (యోహాను 7:49) అయినప్పటికీ, అలాంటివారిలో అనేకులు యేసు బోధకు ప్రతిస్పందించారు, తీర్పుతీర్చడానికి బదులు సహాయం చేయాలనే ఆయన కోరికను వారు గ్రహించి అలా ప్రతిస్పందించారనడంలో సందేహం లేదు. (మత్తయి 21:31; లూకా 15:1) అయితే, ఆధ్యాత్మికంగా రోగులైయున్న వారిని స్వస్థపర్చడానికి యేసు చేస్తున్న కృషిని పరిసయ్యులు చులకన చేశారు. “ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని” వాళ్లు తిరస్కారంగా సణిగారు. (లూకా 15:2) వారి నిందారోపణకు సమాధానంగా, యేసు మళ్లీ గొఱ్ఱెల సంబంధమైన ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు. తప్పిపోయిన గొఱ్ఱెను కనుగొన్నప్పుడు గొఱ్ఱెలకాపరి సంతోషించినట్లుగానే, పాపి పశ్చాత్తాప పడినప్పుడు పరలోకంలోని దేవదూతలు ఆనందిస్తారు. (లూకా 15:3-7) జక్కయ తన మునుపటి పాపపు మార్గంనుండి మరలడానికి తాను సహాయం చేయగలిగినప్పుడు యేసు కూడా ఆనందించాడు. “నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని” ఆయన చెప్పాడు.—లూకా 19:8-10.
13 స్వస్థపర్చేందుకూ, రక్షించేందుకూ ప్రయత్నించే దైవిక న్యాయానికీ, కొంతమందిని మాత్రం ఘనపర్చి అనేకులను నిందించే స్వనీతికీ మధ్యనున్న తేడాను ఈ వివాదాలు స్పష్టంగా బయల్పరుస్తున్నాయి. వ్యర్థమైన ఆచారాలూ, మానవనిర్మిత సంప్రదాయాలూ ఇతరులను అలక్ష్యం చేయడానికీ, తమకు తాము అధిక ప్రాముఖ్యతనిచ్చుకోవడానికీ శాస్త్రులనూ పరిసయ్యులనూ నడిపించాయి, కాని వాళ్లు “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి” పెట్టారని యేసు సూటిగా ఎత్తి చూపించాడు. (మత్తయి 23:23) మనం చేసే ప్రతిదాంట్లో నిజమైన న్యాయాన్ని అనుసరించడానికి మనం యేసును అనుకరిద్దాము, స్వనీతి అనే ఉరిలో చిక్కుకోకుండా కూడా జాగ్రత్త వహిద్దాము.
14. దైవిక న్యాయం ఒక వ్యక్తి యొక్క పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటుందని యేసు చేసిన అద్భుతాల్లో ఒకటి ఎలా ఉదహరిస్తుంది?
14 యేసు పరిసయ్యుల నిర్హేతుకమైన సూత్రాలను అలక్ష్యం చేసినప్పటికీ, ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాడు. (మత్తయి 5:17, 18) అలా చేయడంలో, నీతియుక్తమైన ధర్మశాస్త్రంలోని అక్షరాలు దాని సూత్రాలను అధిగమించడానికి ఆయన అనుమతించలేదు. 12 ఏళ్లపాటు రక్తస్రావరోగంతో బాధపడిన ఒక స్త్రీ తన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థతపొందినప్పుడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని” యేసు ఆమెతో చెప్పాడు. (లూకా 8:43-48) యేసు దయాపూర్వకమైన మాటలు, దైవిక న్యాయం ఆమె పరిస్థితులను పరిగణలోకి తీసుకుందని ధృవీకరించాయి. ఆచారానుసారంగా, ఆమె అపవిత్రురాలై, సమూహంలోకి రావడం ద్వారా మోషే ధర్మశాస్త్రాన్ని వాస్తవంగా అతిక్రమించినప్పటికీ, ఆమె విశ్వాసం ప్రతిఫలాన్ని పొందనర్హమైనది.—లేవీయకాండము 15:25-27; పోల్చండి రోమీయులు 9:30-33.
నీతి ప్రతి ఒక్కరి కొరకు
15, 16. (ఎ) పొరుగువాడైన సమరయుని గూర్చిన యేసు ఉపమానం న్యాయం గురించి మనకు ఏమి బోధిస్తుంది? (బి) ‘అధికముగా నీతిమంతులమై’ ఉండడాన్ని మనమెందుకు నివారించాలి?
15 దైవిక న్యాయం యొక్క కనికరంతో కూడిన నైజాన్ని నొక్కిచెప్పడమే కాకుండా, అది ప్రజలందరికీ చేరాలని కూడా యేసు తన శిష్యులకు బోధించాడు. అతడు ‘అన్యజనులకు న్యాయము కనుపర్చాలన్నది’ యెహోవా చిత్తం. (యెషయా 42:1) యేసు చెప్పిన, ప్రసిద్ధిగాంచిన ఉపమానాల్లో ఒకటైన, పొరుగువాడైన సమరయుని గురించిన ఉపమానంలో ఆయన చెప్పిన నీతి అదే. “తాను నీతిమంతుడైనట్లు కనబరచుకొనగోరి”న ధర్మశాస్త్రోపదేశకుడు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమే ఆ ఉపమానం. “నా పొరుగువాడెవడని” అతడు ప్రశ్నించాడు, పొరుగువాని సంబంధిత తన బాధ్యతలను యూదా ప్రజలకు మాత్రమే పరిమితం చేయాలని అతడు కోరుకొని ఉంటాడనడంలో సందేహం లేదు. యేసు ఉపమానంలోని సమరయుడు దైవిక నీతిని ప్రదర్శించాడు, ఎందుకంటే మరొక జనాంగానికి చెందిన అపరిచిత వ్యక్తికి సహాయం చేయడంలో తన సమయాన్నీ, డబ్బునూ వెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తనను ప్రశ్నించిన వ్యక్తితో, “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” ఉపదేశించడం ద్వారా యేసు తన ఉపమానాన్ని ముగించాడు. (లూకా 10:25-37) అలాగే మనం, ఏ జాతివారైనప్పటికీ ప్రజలందరికీ మేలు చేస్తే, మనం దేవుని న్యాయాన్ని అనుకరించిన వారమౌతాము.—అపొస్తలుల కార్యములు 10:34, 35.
16 మరోవైపున మనం దైవిక న్యాయాన్ని అనుసరిస్తున్నట్లయితే, మనం ‘అధికముగా నీతిమంతులమై’ ఉండకూడదని శాస్త్రులూ పరిసయ్యుల మాదిరి, మనకు జ్ఞాపకం చేస్తుంది. (ప్రసంగి 7:16) ఇతరులను ముగ్దులను చేయాలని నీతి క్రియలు చేయడానికి ప్రయత్నించడం, లేక మానవ నిర్మిత కట్టడలకు అధికమైన ప్రాముఖ్యతనివ్వడం, మనకు దేవుని అంగీకారాన్ని తీసుకురావు.—మత్తయి 6:1.
17. దైవిక న్యాయాన్ని ప్రదర్శించడం మనకు ఎందుకంత ప్రాముఖ్యం?
17 దైవిక న్యాయం యొక్క నైజాన్ని యేసు జనాంగాలకు స్పష్టం చేయడానికి గల ఒక కారణమేమిటంటే, తన శిష్యులందరూ ఈ లక్షణాన్ని ప్రదర్శించడానికి నేర్చుకోవాలన్నదే. ఇది ఎందుకంత ప్రాముఖ్యం? “దేవునిపోలి నడుచుకొనుడి” అని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి, దేవుని మార్గాలన్నీ న్యాయమైనవే. (ఎఫెసీయులు 5:1) అలాగే, మనం మన దేవునితో నడిచేటప్పుడు “న్యాయముగా నడుచు”కోవాలన్నది యెహోవా కోరేవాటిలో ఒకటని మీకా 6:8 వివరిస్తోంది. అంతేగాక, యెహోవా ఉగ్రత దినాన మనం దాచబడాలంటే, ఆ దినం రాకముందే మనం ‘నీతిని అనుసరించాలని’ జెఫన్యా 2:2, 3 మనకు జ్ఞాపకం చేస్తోంది.
18. తదుపరి శీర్షికలో ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది?
18 కాబట్టి న్యాయాన్ని విచారించడానికి, అపాయకరమైన ఈ అంత్యదినములే “మిక్కిలి అనుకూలమైన సమయము.” (2 కొరింథీయులు 6:2) యోబు వలె మనం “నీతిని వస్త్రముగా ధరించుకొని,” ‘న్యాయప్రవర్తనను వస్త్రముగా’ చేసుకుంటే, యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. (యోబు 29:14) యెహోవా న్యాయమందు నమ్మకముంచడం, భవిష్యత్తు వైపు దృఢనమ్మకంతో చూడడానికి మనకెలా సహాయం చేస్తుంది? అంతేగాక, మనం నీతియుక్తమైన “క్రొత్త భూమి” కొరకు ఎదురు చూస్తుండగా, దైవిక న్యాయం మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా కాపాడుతుంది? (2 పేతురు 3:13) తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[అధస్సూచీలు]
a హెబ్రీ లేఖనాల్లో, మూడు ప్రాథమిక పదాలు ఇమిడి ఉన్నాయి. వీటిలో ఒకటి (మిష్పాత్) తరచూ “న్యాయం” అని అనువదించబడింది. మిగతా రెండు పదాలు (సెదెక్ మరియు దాని సంబంధిత పదం సెదాకా) అనేక సందర్భాల్లో “నీతి” అని అనువదించబడ్డాయి. “నీతి” (డికాయ్ఓస్నే) అని అనువదించబడిన గ్రీకు పదం, “నీతిగా లేక న్యాయంగా ఉండడమనే లక్షణం” అని నిర్వచించబడింది.
b యేసు ఎంపిక చేసుకున్న ఉదాహరణ ఎంతో సరైనది ఎందుకంటే యూదుల మౌఖిక చట్టం ప్రకారం, విశ్రాంతిదినాన కష్టంలోవున్న జంతువుకు సహాయం చేయడం ప్రత్యేకంగా అనుమతించబడేది. విశ్రాంతి దినాన స్వస్థపర్చడం సరైనదా కాదా అనే ఈ అంశం మీదనే మరనేక ఇతర సందర్భాల్లో వివాదాలు చెలరేగాయి.—లూకా 13:10-17; 14:1-6; యోహాను 9:13-16.
మీరు వివరించగలరా?
◻ దైవిక న్యాయమంటే అర్థమేమిటి?
◻ యేసు జనాంగాలకు న్యాయాన్ని ఎలా బోధించాడు?
◻ పరిసయ్యుల నీతి ఎందుకు వక్రీకరించబడింది?
◻ మనం న్యాయాన్ని ఎందుకు అనుసరించాలి?
[8వ పేజీలోని చిత్రం]
దైవిక న్యాయపు పరిధిని యేసు స్పష్టపరిచాడు