కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/1 పేజీలు 3-4
  • అన్యాయం ఇలా కొనసాగాల్సిందేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అన్యాయం ఇలా కొనసాగాల్సిందేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అన్యాయానికున్న వికృత రూపాలు
  • అన్యాయం ప్రాముఖ్యమైన విషయమేనా?
  • అన్యాయం జరిగితే ఏం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • అన్యాయాన్ని మీరు సహించగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుడు అన్యాయమును గూర్చి ఎప్పుడైన ఏమైన చేస్తాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/1 పేజీలు 3-4

అన్యాయం ఇలా కొనసాగాల్సిందేనా?

“ఎన్ని జరిగినప్పటికీ ప్రజలు నిజంగా మంచివారని నేనిప్పటికీ నమ్ముతున్నాను. గందరగోళమూ, బాధా, మరణాలతో కూడిన పునాదిపై నా ఆశల్ని ఊరకనే నిర్మించుకోలేను.—యాన ఫ్రాంక్‌.

యాన ఫ్రాంక్‌ అనే 15 ఏళ్ల యూదా బాలిక తాను మరణించడానికి కొంత కాలం ముందు హృదయవిదారకమైన ఆ పై మాటల్ని తన డైరీలో రాసుకొంది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు రెండేళ్లకు పైగా ఆమ్‌స్టర్‌డామ్‌ నగరంలో ఒక అటకపై రహస్యంగా దాక్కొని ఉన్నారు. ఒక ఇన్‌ఫార్మర్‌ వాళ్లు దాక్కొన్న చోటును గురించిన సమాచారాన్ని నాజీలకు చేరవేసినప్పుడు శ్రేష్ఠమైన లోకాన్ని గూర్చిన ఆ అమ్మాయి ఆశలన్నీ పటాపంచలైపోయాయి. ఆ తర్వాతి సంవత్సరంలో అంటే 1945లో యాన, టైఫూస్‌ అనే విషజ్వరం మూలంగా బెర్గన్‌ బెల్ఝన్‌ నిర్బంధ శిబిరంలో మరణించింది. అరవై లక్షలమంది ఇతర యూదులకు కూడా అలాంటి దుర్గతే పట్టింది.

యావత్తు యూదుజాతినీ సమూలంగా తుడిచిపెట్టాలని హిట్లర్‌ పన్నిన దారుణమైన ప్రణాళిక, మన శతాబ్దం చవిచూసిన జాతివిద్వేషక అన్యాయానికి సంబంధించిన నీచాతి నీచమైన సంఘటనయై ఉండవచ్చు కానీ, అదే ఆఖరుది మాత్రం కాదు. 1994లో రువాండాలో ఐదు లక్షలకన్నా ఎక్కువమంది టుట్సీలు వధించబడ్డారు, కారణం వాళ్లు ‘మరొక’ తెగకు చెందినవారవ్వడమే. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, ఒక జాతి ప్రక్షాళనలో దాదాపు పది లక్షలమంది అర్మెనియన్లు మరణించారు.

అన్యాయానికున్న వికృత రూపాలు

అన్యాయానికున్న వికృత రూపం జాతి నిర్మూలన మాత్రమే కాదు. మానవజాతిలోని దాదాపు ఐదవవంతు మంది బీదరికపు ఉక్కు పిడికిళ్లలో జీవితాంతం మగ్గిపోయేలా సామాజిక అన్యాయం శాసిస్తోంది. అంతకన్నా హీనమైన పరిస్థితి ఏమిటంటే, అంతర్జాతీయ దాస్య వ్యతిరేక సంస్థ 20,00,00,000కన్నా ఎక్కువమంది ప్రజలు దాస్యపు సంకెళ్లలో మగ్గిపోతున్నారని అంచనావేస్తోంది. చరిత్రలో మునుపెన్నటికన్నా నేడే లోకంలో బహుశా ఎక్కువమంది బానిసలు ఉండివుండొచ్చు. బహిరంగ వేలాల్లో వాళ్లు అమ్మబడి ఉండకపోవచ్చుగానీ, వాళ్లు పనిచేసే స్థలాల్లో ఉన్న పరిస్థితులు గతకాలాల్లో అనేకమంది బానిసలు పనిచేసే స్థలాల్లో ఉన్న పరిస్థితులకన్నా మరింత అధ్వాన్నంగా ఉన్నాయి.

చట్టబద్ధమైన అన్యాయాలు లక్షలాదిమంది ప్రాథమిక హక్కుల్ని కాలరాచివేశాయి. “ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ మానవ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి. మరింత బాధాతప్తులు ఎవరంటే బీదలూ, అభాగ్యులూ, మరి ముఖ్యంగా స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులూ, శరణార్థులే”నని ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దాని 1996 రిపోర్టులో తెలియజేసింది. ఆ రిపోర్టు ఇలా పేర్కొంది: “కొన్ని దేశాల్లో, బలిష్టులచేతిలో నుండి బలహీనుల్ని కాపాడడానికి చట్టబద్ధమైన అధికారమేదీలేకుండాపోయేంతగా ప్రభుత్వాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి.”

1996వ సంవత్సరంలో వందకన్నా ఎక్కువ దేశాల్లో లక్షలాదిమంది నిర్బంధించబడి, హింసించబడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో, లక్షలాదిమంది ప్రజలు కనబడకుండా పోయారు, వాళ్లను సెక్యూరిటీ దళాలుగానీ లేదా టెర్రరిస్ట్‌ గుంపులుగానీ బలవంతంగా ఎత్తుకుపోయినట్టు స్పష్టమౌతోంది. వాళ్లలో అనేకులు చనిపోయి ఉంటారని భావించబడుతోంది.

నిజమే, యుద్ధాలు నిస్సందేహంగా అన్యాయమైనవే అయినా, అతి తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక యుద్ధం తన గురిని సామాన్య పౌరులపైకి ఎక్కుపెడుతుంది, వారిలో స్త్రీలూ, పిల్లలూ చేరివున్నారు. ఇదంతా విచక్షణారహితంగా నగరాలపై బాంబుల్ని కురిపించడం మూలంగా మాత్రమే కాదు. మహిళలపైనా, బాలికలపైనా అత్యాచారం జరపడం సైనిక కార్యకలాపాల్లో భాగమైపోయింది. తిరుగుబాటు చేసే అనేక గ్రూపులు పిల్లలు హంతకులుగా తయారయ్యేలా వారికి తర్ఫీదునివ్వడానికి వారిని బలవంతంగా ఎత్తుకుపోతున్నారు. అలాంటి ధోరణులపై వ్యాఖ్యానిస్తూ, “పిల్లలపై సాయుధపోరాటం చూపిన ప్రభావం” అనే ఐక్యరాజ్యసమితి నివేదిక ఇలా తెలియజేస్తోంది: “ప్రపంచంలో అనేకమంది అంతకంతకూ నైతిక శూన్యులుగా తయారయ్యారు.”

ఈ నైతిక శూన్యత అన్యాయంతో—అది జాతి సంబంధమైనదైనా, సామాజిక, న్యాయవ్యవస్థలకు సంబంధించినదైనా లేదా సైనికశక్తికి సంబంధించినదైనాగానీ—అన్యాయంతో నిండిపోయిన లోకానికి దారితీసిందనడంలో సందేహమేమీలేదు. ఇదేమీ క్రొత్త విషయం కాదనుకోండి. రెండువేల ఐదువందల సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం క్రిందట ఒక హెబ్రీ ప్రవక్త ఇలా వాపోయాడు: “న్యాయవ్యవస్థ బలహీన పడింది. ప్రజలకు న్యాయం జరుగుట లేదు. మంచివారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు.” (హబక్కూకు 1:4, పరిశుద్ధ బైబల్‌) అన్యాయమనేది అన్నికాలాల్లోనూ ప్రబలంగా ఉన్నప్పటికీ, ఈ 20వ శతాబ్దం అన్యాయపు స్థాయి క్రొత్త శిఖరాగ్రాల్ని చేరుకున్న యుగంగా వర్గీకరించబడాలి.

అన్యాయం ప్రాముఖ్యమైన విషయమేనా?

అన్యాయం మూలంగా మీరు వ్యక్తిగతంగా బాధకు గురైనప్పుడు అది మీకు ప్రాముఖ్యమైనదవుతుంది. అది మానవజాతిలో అనేకమందికున్న సంతోషించే హక్కును కాలరాస్తుంది గనుక ప్రాముఖ్యమైన విషయమవుతుంది. అన్యాయం రక్తసిక్తమైన పోరాటాలకు తరచుగా ఆజ్యంపోసి, ఆ విధంగా అన్యాయపు జ్వాలలు ప్రజ్వరిల్లేలా చేస్తోంది గనుక అది ప్రాముఖ్యమైన విషయమవుతుంది.

శాంతి సమాధానాలు న్యాయంతో పెనవేసుకుపోయి ఉన్నాయిగానీ, అన్యాయం ఆశల్ని పటాపంచలుచేసి, ఆశావాదాన్ని తునాతునకలు చేస్తోంది. యాన ఫ్రాంక్‌ విషాదభరితంగా కనుగొన్నట్టు, ప్రజలు తమ ఆశల్ని గందరగోళమూ, బాధా, మరణాలతో కూడిన పునాదిపై నిర్మించుకోరు. ఆ అమ్మాయిలానే, మనమంతా శ్రేష్ఠమైనదాని కోసం పరితపిస్తున్నాం.

ఆ అభిలాషే, మానవ సమాజానికి కొంతమేరకైనా న్యాయాన్ని తీసుకురావడానికి కృషిచేసేందుకు యథార్థవంతులైన ప్రజల్ని నడిపించింది. దాన్ని చేరుకోవడానికి, 1948లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దారాదత్తం చేసుకున్న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇలా తెలియజేస్తోంది: “మానవులందరూ స్వతంత్రులుగా జన్మించారు, గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. వారందరికీ హేతుబద్దత, మనస్సాక్షి ఇవ్వబడ్డాయ, వారు ఒకరి యెడల ఒకరు సహోదర భావాన్ని ప్రదర్శించాలి.”

ఇవి ఖచ్చితంగా ప్రశస్తమైన మాటలేగానీ, ప్రతీ ఒక్కరూ సమానమైన హక్కుల్ని అనుభవించే, ప్రతీ ఒక్కరూ తనతోటివానిని తన సహోదరునిగా భావించి వ్యవహరించే న్యాయమైన సమాజం అనే విలువైన గమ్యాన్ని చేరుకోవడంలో మానవజాతి ఇంకా ఎంతో దూరంలో ఉంది. యుఎన్‌ డిక్లరేషన్‌ పీఠిక సూచిస్తున్నట్టుగా ఈ గమ్యాన్ని చేరుకోవడం, “లోకంలోని స్వేచ్ఛకూ, న్యాయానికీ, శాంతికీ పునాది”గా పనిచేస్తుంది.

అన్యాయమనేది ఎప్పటికీ నిర్మూలించబడలేనంతగా మానవ సమాజపు నిర్మాణంలో పాతుకుపోయిందా? లేదా స్వేచ్ఛా న్యాయాల కొరకూ, శాంతి కొరకూ ఓ బలమైన పునాది ఏదో విధంగా వేయబడుతుందా? అలా అయితే, అందరూ ప్రయోజనాన్ని పొందుతారని నిశ్చయపర్చుకొనగల్గేలా అలాంటి పునాదిని ఎవరు వేయగలరు?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

UPI/Corbis-Bettmann

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి