మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తుండాలని మీరు కోరుకుంటారు?
మీ పిల్లలను ఎంతో విలువైన స్వాస్థ్యముగా మీరు దృష్టిస్తున్నారా? (కీర్తన 127:3) లేక వాళ్ళను పెంచడమంటే, సఫలీకృతులం కాగలమన్న ఏ భరోసా లేనటువంటి ఆర్థిక భారంగా దృష్టిస్తున్నారా? పిల్లలను పెంచడం వల్ల ఆర్థిక లాభం ఏమో గానీ, వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడగల్గే వరకు డబ్బు ఖర్చవుతుంది. వారసత్వంగా పొందిన ఆస్తిని కాపాడుకునేందుకు మంచి ప్లానింగ్ అవసరమైనట్లే, పిల్లలను పెంచడంలో సఫలీకృతులవ్వాలంటే కూడా మంచి ప్లానింగ్ అవసరం.
పిల్లలపై శ్రద్ధ చూపే తల్లిదండ్రులు వాళ్ళకు జీవితంలో మంచి పునాదిని వేయాలని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో క్రూరమైన, చాలా విచారకరమైన విషయాలు సంభవించవచ్చు, అయినప్పటికీ, తమ సంతానాన్ని కాపాడేందుకు తల్లిదండ్రులు చేయగల్గింది ఎంతో ఉంది. మొదటి శీర్షికలోని వెర్నర్, ఇవల గురించే తీసుకోండి.a
తల్లిదండ్రులు నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు
తన తల్లిదండ్రులు స్కూల్లో జరుగుతున్న విషయాల్లో అనాసక్తిని కనబరచక, యథార్థ ఆసక్తిని చూపించారని వెర్నర్ చెబుతున్నాడు. “వాళ్ళు నాకిచ్చిన ఆచరణాత్మక సలహాలను ఎంతో విలువైనవిగా ఎంచుతాను. వాళ్ళకు నా మీద శ్రద్ధ ఉందన్న అనుభూతిని, వాళ్ళు నాకు ఆలంబనగా ఉన్నారన్న అనుభూతిని పొందాను. తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. కాని వాళ్ళు నిజమైన స్నేహితులని నేనెరుగుదును.” ఇవ తన స్కూల్ వర్క్ విషయమై చాలా కలత చెందడం వల్ల, కృంగిపోయింది, తనకు రాత్రుల్లో నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. ఆమె తల్లిదండ్రులైన ఇనెజ్, ఫ్రాన్సీస్కూ ఆమెతో మాట్లాడేందుకూ, ఆమె మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యాన్ని తిరిగి పొందేలా సహాయపడేందుకు ఆమెతో కావలసినంత సమయాన్ని వెచ్చించారు.
ఫ్రాన్సీస్కూ మరియు ఇనెజ్ తమ పిల్లలను కాపాడేందుకూ, వయోజన జీవితం కోసం వారిని సిద్ధం చేసేందుకూ ఎలా కృషి చేశారు? తమ బిడ్డలు పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండే, ప్రేమగల ఈ తల్లిదండ్రులు తమ దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళను చేర్చుకునేవారు. వయోజనులైన తమ స్నేహితులతో మాత్రమే సహవసించక, తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తమ పిల్లలను తీసుకువెళ్ళేవాళ్ళు. ప్రేమగల తల్లిదండ్రులుగా, వాళ్ళు తమ కుమారునికీ, కుమార్తెకూ సరైన నడిపింపును కూడా ఇచ్చేవాళ్ళు. “ఇంటిని శుభ్రంగా ఉంచేందుకూ, మితవ్యయం చేసేవారిగా ఉండేందుకూ, తమ సొంత దుస్తులను జాగ్రత్తగా వాడేందుకూ పిల్లలకు తర్ఫీదునిచ్చాం. తమ వృత్తిని వ్యక్తిగతంగా ఎంపిక చేసుకునేందుకూ, ఆధ్యాత్మిక ఆసక్తులను, తమ బాధ్యతలను సమతుల్యంగా ఉంచేందుకూ ఇద్దరికీ సహాయపడ్డాం” అని ఇనెజ్ చెబుతుంది.
మీ బిడ్డను అర్థం చేసుకుని, తల్లిదండ్రులుగా వారికి నడిపింపునివ్వడం ఎంత ప్రాముఖ్యము! మీరలా చేయగల మూడు మార్గాలను పరిశీలిద్దాం: (1) మీ పిల్లలు సముచితమైన లౌకిక వృత్తిని ఎంపిక చేసుకునేందుకు సహాయపడండి; (2) స్కూల్లోనూ, పనిస్థలంలోనూ కలిగే భావోద్వేగపరమైన ఒత్తిడిని ఎదుర్కునేలా వారిని తీర్చిదిద్దండి; (3) తమ ఆధ్యాత్మిక అవసరతలను ఎలా సంతృప్తిపరచుకోవాలో వారికి చూపించండి.
తగిన వృత్తిని ఎంపిక చేసుకునేందుకు వారికి సహాయపడండి
ఒకరి వృత్తి అతని ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడమే కాక, అతని సమయంలో చాలా భాగాన్ని తీసుకుంటుంది కూడా. అందుకనే పిల్లలను సరైన విధంగా పెంచడంలో, ఒక్కో బిడ్డ యొక్క అభిరుచినీ, సామర్థ్యాలనూ పరిగణనలోకి తీసుకోవడం ఇమిడి ఉంటుంది. మనస్సాక్షిగల ఏ వ్యక్తి కూడా ఇతరులకు భారంగా ఉండడానికి ఇష్టపడడు కనుక, తన బిడ్డ తన కాళ్ళపై నిలబడగల్గేలా, అలాగే కుటుంబాన్ని పోషించగల్గేలా ఎలా తీర్చిదిద్దాలన్న విషయాన్ని గురించి తల్లిదండ్రులు గంభీరంగా తలంచాలి. మీ కుమారుడు గానీ లేదా కుమార్తెగానీ గౌరవంగా బ్రతకగల్గేందుకు అతడు గానీ, ఆమె గానీ ఏదైనా ట్రేడ్ నేర్చుకోవలసిన అవసరం ఉందా? కష్టపడి పనిచేసే కోరిక గల్గి ఉండడం, నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండడం, ఇతరులతో కలిసి పోగలగడం వంటి గుణాలను పెంపొందింపజేసుకునేందుకుగానూ మీ బిడ్డకు సహాయపడేందుకు మీరు శ్రద్ధ వహించే తల్లి/తండ్రిగా ఎడతెగక ప్రయత్నం చేస్తూనే ఉండండి.
నికోల్నే తీసుకోండి. “నా తల్లిదండ్రులు తమ క్లీనింగ్ వ్యాపారంలో నన్ను చేర్చుకున్నారు. మా ఇంటి ఖర్చులకు నేను నా సంపాదనలో కొంత భాగం ఇవ్వాలనీ, మిగిలిన దాన్ని నా సొంత ఖర్చులకు లేదా నా సేవింగ్స్ కోసం ఉంచుకోమని నా తల్లిదండ్రులు చెప్పారు. ఇది నాకు బాధ్యతను గురించిన గొప్ప స్పృహను కలుగజేసింది, అది నా తర్వాతి జీవితంలో చాలా ఉపయోగపడింది” అని ఆమె చెబుతుంది.
ఒక వ్యక్తి ఫలానా వృత్తిని ఎంపిక చేసుకోవాలని దేవుని వాక్యమైన బైబిలు చెప్పడం లేదు. కానీ అది సరైన మార్గదర్శకాలను ఇస్తుంది. ఉదాహరణకు, “ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని” అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన థెస్సలొనీకలోని క్రైస్తవులకు లేఖను వ్రాస్తూ, “మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము” అని కూడా అన్నాడు.—2 థెస్సలొనీకయులు 3:10-12.
అయినప్పటికీ, ఉద్యోగాన్ని సంపాదించడమూ, డబ్బు సంపాదించడమూ మాత్రమే జీవితం కాదు. కీర్తికెక్కాలన్న గాఢమైన కోర్కెగలవారు చివరికి, అసంతృప్తిపాలయ్యే సాధ్యతా, ‘గాలికై ప్రయాసపడినట్లయ్యే’ సాధ్యతా ఉంది. (ప్రసంగి 1:14) గుర్తింపు కోసం, సిరిసంపదల కోసం ప్రాకులాడేందుకు తమ పిల్లలను ప్రోద్బలపరచే బదులు, “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని అపొస్తలుడైన యోహాను వ్రాసిన దైవ ప్రేరేపిత మాటల్లోని జ్ఞానాన్ని పిల్లలు గ్రహించేలా తల్లిదండ్రులు సహాయపడడం మంచిది.—1 యోహాను 2:15-17.
మీరు వారి భావోద్వేగ అవసరాలను ఎలా తీర్చగలరు?
మీరు ఒక తల్లి/తండ్రిగా, క్రీడాకారులకు శిక్షణనిచ్చే కోచ్‌లా ఎందుకు ఉండకూడదు? ఆ కోచ్ తన తర్ఫీదులో ఉన్న క్రీడాకారుల యొక్క మరింత వేగంగా పరుగెత్తగల లేదా మరింత దూరం దూకగల శారీరక సామర్థ్యం యొక్క అభివృద్ధిపై మాత్రమే శ్రద్ధ చూపడు. ఏదైనా ప్రతికూల దృక్పథముంటే, దానిని అధిగమించేందుకు కూడా వారికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తూ, వాళ్ళ మానసిక స్థైర్యం మరింత అధికమయ్యేలా చేస్తాడు. మీ విషయానికొస్తే, మీరు మీ పిల్లలను ప్రోత్సహించేవారిగా, బలపరచేవారిగా, స్ఫూర్తినిచ్చేవారిగా ఎలా ఉండగలరు?
13 ఏండ్ల రోజార్యో విషయమే తీసుకోండి. శరీరంలోని మార్పుల వల్ల అంతర్గత సంక్షోభం కలగడమే కాక, తల్లిదండ్రుల మధ్య విభేదాల వల్లా, లేదా వారి అవధానం లేకపోవడం వల్లా అతడు భావోద్వేగ ఒత్తిడికి గురయ్యాడు. ఆయనలాంటి యౌవనస్థులకు సహాయపడేందుకు ఏమి చేయవచ్చు? మీ పిల్లలను ఉత్కంఠలన్నింటి నుండీ, చెడు ప్రభావాల నుండీ కాపాడడం అసాధ్యమైనప్పటికీ, ఒక తల్లి/తండ్రిగా మీ పాత్రను విరమించుకోకండి. పిల్లలందరూ ఒకేలా ఉండరన్న విషయాన్ని ఎల్లవేళలా జ్ఞాపకముంచుకుంటూ, మీరు అవగాహనాపూర్వకంగా పిల్లలకు క్రమశిక్షణనివ్వండి. అమిత రక్షణనిచ్చేవారిగా కాక, దయనూ, ప్రేమనూ కనబరుస్తూ, మీ చిన్నారికి భద్రతా భావం కలిగేలా మీ తరపు నుండి మీరు ఎంతో చేయగలరు. ఇది మీ బిడ్డ ఆత్మవిశ్వాసమూ, ఆత్మగౌరవమూ లేకుండా పెరిగి పెద్దవ్వడాన్ని కూడా నివారిస్తుంది.
మీ సొంత తల్లిదండ్రులు మీ భావోద్వేగ అవసరతలను తీర్చడంలో ఎంత సఫలీకృతులైనప్పటికీ, నిజంగా సహాయకరంగా ఉండే తల్లి/తండ్రిగా మీరు సఫలీకృతులయ్యేందుకు మీకు తోడ్పడే మూడూ విషయాలేవంటే: (1) మీ పిల్లలకున్నటువంటి చాలా అల్పమైనవిగా కనిపించగల సమస్యలను మీరు నిర్లక్ష్యం చేసేంతగా మీరు సొంత ఇబ్బందులను గురించే తలస్తూ ఉండకండి; (2) ప్రతీరోజూ వాళ్ళతో ఆహ్లాదకరమైన, అర్థవంతమైన సంభాషణను జరిపేందుకు ప్రయత్నం చేయండి; (3) సమస్యలను ఎలా పరిష్కరించాలి, ప్రజలతో ఎలా మెలగాలి అనే విషయంలో అనుకూల దృక్పథాన్ని వారిలో అలవర్చండి.
తను కౌమారప్రాయంలో ఉన్నప్పటి గతాన్ని తలపోస్తూ, బ్రిగిట్ ఇలా చెబుతోంది: “మనం ఆశించే విధంగా ఇతరులను మార్చలేమన్న విషయాన్ని నేను తెలుసుకోవలసి ఉండింది. ఇతరులలో నాకు నచ్చనిదేమైనా ఉంటే, నేను వారిలా ఉండకపోవడమే నేను చేయగల పనని మా అమ్మ నాతో తర్కించింది. నేను నా పద్ధతులను మార్చుకోగల సరైన సమయం నా యౌవన కాలమేనని కూడా అమ్మ నాకు చెప్పింది.”
అయినప్పటికీ, మీ పిల్లలకు ఉద్యోగమూ, భావోద్వేగ స్థిరతా మాత్రమే సరిపోవు. ‘పిల్లలను పెంచడం దైవదత్తమైన బాధ్యతగా నేను దృష్టిస్తున్నానా?’ అని మీకై మీరు ప్రశ్నించుకోండి. మీరు అలా దృష్టిస్తున్నట్లయితే, మీరు మీ పిల్లల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాలనుకుంటారు.
వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గాలు
కొండమీది తన ప్రసంగంలో యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “తమ ఆధ్యాత్మిక అవసరత విషయమై స్పృహగలవారు ధన్యులు, ఎందుకంటే పరలోకరాజ్యం అలాంటివారికి చెందుతుంది.” (మత్తయి 5:3, NW) ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో ఏమి ఇమిడి ఉంది? యెహోవా దేవునియందు విశ్వాసాన్ని కనబరచడంలో తల్లిదండ్రులు మంచి మాదిరినుంచినప్పుడు పిల్లలు చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) అయినప్పటికీ, విశ్వాసం నిజంగా అర్థవంతంగా ఉండాలంటే, ప్రార్థన అవసరం. (రోమీయులు 12:12) మీరు మీకున్న ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినట్లయితే, ఇశ్రాయేలులో కీర్తి గడించిన న్యాయాధిపతియైన సమ్సోను యొక్క తండ్రిలాగే మీరూ దైవిక నడిపింపు కోసం వెదుకుతారు. (న్యాయాధిపతులు 13:8) మీరు ప్రార్థన చేయడమే కాక, సహాయం కోసం దైవ ప్రేరేపిత వాక్యమైన బైబిలులోకి చూస్తారు కూడా.—2 తిమోతి 3:16, 17.b
సరైన నడిపింపునూ, భావోద్వేగ ఆసరానూ, ఆధ్యాత్మిక సహాయాన్ని ఇవ్వడంలో చాలా కష్టపడవలసి ఉన్నప్పటికీ, పిల్లలను పెంచడమన్నది ప్రతిఫలదాయకంగా ఉండగలదు. బ్రెజీల్లోని ఇద్దరు పిల్లల తండ్రి ఇలా చెబుతున్నాడు: “నా పిల్లలు లేకపోవడాన్ని ఊహించను కూడా ఊహించలేం. వాళ్ళతో మేము పంచుకోగల చాలా మంచి విషయాలున్నాయి.” తమ పిల్లలు ఎందుకు అంత బుద్ధిమంతులుగా ఉంటున్నారో వివరిస్తూ “మేము ఎల్లప్పుడూ కలిసి ఉంటాం, మేము కార్యాలను ఆనందకరంగా సంతోషకరమైనవిగా మార్చుకుంటాం. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం మేము పిల్లల కోసం ఎల్లవేళలా ప్రార్థిస్తుంటామన్నదే” అని ఆ పిల్లల తల్లి చెబుతుంది.
తనకు సమస్య వచ్చినప్పుడల్లా, తన తల్లిదండ్రులు తనపై చూపించిన ప్రేమను, ఓపికనూ ప్రీసీల్ల గుర్తు చేసుకుంటుంది. “వాళ్ళు నా నిజమైన స్నేహితులు, ప్రతి విషయంలోనూ వాళ్ళు నాకు సహాయం చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు వాళ్ళు నన్ను ‘యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము’గా భావిస్తున్నారన్న అనుభూతిని నిజంగా పొందాను” అని ఆమె అంటుంది. (కీర్తన 127:3) అనేక ఇతర తల్లిదండ్రులు చేస్తున్నట్లు, మీరు మీ పిల్లలతో ఉండి, బైబిలునూ, క్రైస్తవ ప్రచురణలనూ వాళ్ళతో కలిసి చదివేందుకు ఎందుకు షెడ్యూల్ వేయకూడదు? అనుకూల వాతావరణంలో బైబిలు వృత్తాంతాలనూ, సూత్రాలనూ పరిగణనలోకి తీసుకోవడం, మీ పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగి ఉండేందుకూ, భవిష్యత్తు విషయమై నిజమైన నిరీక్షణను కలిగివుండేందుకూ సహాయపడగలదు.
పిల్లలందరూ భద్రతాభావంతో ఉండే కాలం
నేడు చాలామంది పిల్లలకు భవిష్యత్తు అంధకారమయంగా కనిపించినప్పటికీ, ఈ భూమి మానవజాతి కోసం భద్రమైన గృహంగా త్వరలో మారుతుందని దేవుని వాక్యం అభయమిస్తోంది. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్తలోకంలో, తల్లిదండ్రులు తమ పిల్లల సురక్షితత్వాన్ని గురించి చింతించవలసిన అవసరం లేనటువంటి కాలాన్ని గురించి ఊహించండి! (2 పేతురు 3:13) “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును” అనే ప్రవచనం యొక్క గొప్ప నెరవేర్పును మీ మనో నేత్రాలతో దర్శించి చూడండి. (యెషయా 11:6) ఈ మాటల్లో వర్ణించబడిన ఆధ్యాత్మిక భద్రత యొక్క ప్రతీకాత్మక నెరవేర్పు యెహోవా సేవకుల మధ్య నేడు కనిపిస్తుంది. వాళ్ళ మధ్యన మీరు దేవుని ప్రేమపూర్వక శ్రద్ధను అనుభవిస్తున్న అనుభూతిని పొందుతారు. దేవుని ఎడల మీరు ప్రేమను కనబరుస్తున్నట్లయితే, ఆయన ఒక తండ్రి/తల్లిగా మీ అనుభూతులను అర్థం చేసుకుంటాడనీ, మీ మార్గంలో మీకు కలిగే ఉత్కంఠలను, పరీక్షలను అధిగమించేందుకు ఆయన మీకు సహాయపడతాడనీ మీరు హామీ కలిగి ఉండగలరు. ఆయన వాక్యాన్ని పఠించి, ఆయన రాజ్యం మీద మీ నిరీక్షణను ఉంచండి.
మంచి మాదిరినుంచడం ద్వారా, నిత్యజీవపు మార్గంలో నడిచేందుకు మీ పిల్లలకు సహాయపడండి. మీరు యెహోవా దేవుడ్ని ఆశ్రయించేటట్లయితే, మీ భవిష్యత్తూ, మీ పిల్లల భవిష్యత్తూ మీ నిరీక్షణలన్నింటి కన్నా గొప్పగా ఉండవచ్చు. “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” అని పాడిన కీర్తనరచయితకు ఉండినటువంటి అదే నమ్మకాన్ని మీరు కూడా కలిగి ఉండగలరు.—కీర్తన 37:4.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలో ఇవ్వబడినవి అసలు పేర్లు కావు.
b వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకంలోని 5 నుండి 7 అధ్యాయాలను చూడండి.