మీరు మీ పిల్లలను ఎలా కాపాడుకోగలరు?
వెర్నర్a పొరుగు ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కొన్ని సంవత్సరాలు పఠించిన తర్వాత, బ్రెజీల్లోని సావో పౌలోలో మరో 3,000 మంది యౌవనస్థులతోపాటు పై చదువులు చదవనారంభించాడు. తోటి విద్యార్థులు మత్తుమందులను అమ్మడాన్నీ, సేవించడాన్ని ఆయన మొదటిసారిగా అక్కడ గమనించాడు. రహస్య సంఘాల్లో క్రొత్త సభ్యులకు ఎదురయ్యే నీచమైన, అపాయకరమైన ప్రతిజ్ఞా ప్రక్రియను ఆకారంలో చాలా చిన్నవాడైన ఆయన చేత ఆయన కన్నా పెద్దవాళ్ళైన విద్యార్థులు చేయించారు.
వెర్నర్ చెల్లెలు ఇవకు కూడా సమస్యలు ఎదురయ్యాయి. ఆమె బాగా చదువుకోవాలన్న తపనతో, అమితంగా పఠించడం వల్ల, నిస్సత్తువకూ, మానసిక విభ్రాంతికీ గురైంది. మిగతా యౌవనస్థుల్లాగే, వెర్నర్కీ, ఇవకూ శారీరక, భావోద్వేగ సంరక్షణ అవసరమై ఉండింది. మీ పిల్లలకు ఎలాంటి సహాయం అవసరముంది? వయోజన జీవితానికి వారిని మీరెలా సిద్ధం చేయగలరు? క్లుప్తంగా చెప్పాలంటే, మీరు మీ పిల్లల కోసం ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటారు?
వారికి అవసరం పోషణ మాత్రమే కాదు
నేడు తమ పిల్లలను కాపాడుకోవడంలో తల్లిదండ్రులు ఎదుర్కునే సవాలును గురించి ఒక్క క్షణం ఆలోచించి చూడండి. కుటుంబ జీవిత నాణ్యత తగ్గడం వల్లా, పేదరికం పెరగడం వల్లా, వీధుల్లో బ్రతికే పిల్లల సంఖ్య అనేక దేశాల్లో పెరుగుతోంది. పిల్లలు దోపిడీకి గురికాకుండా కాపాడలేకపోవడం వల్ల కలిగిన పర్యవసానమే బాల కార్మికులు. మత్తుమందుల దురుపయోగం కూడా అనేక యౌవనస్థులను నాశనం చేస్తోంది. ఉదాహరణకు, బ్రెజీల్ దేశస్థుడైన ఒక యౌవనస్థుడు మత్తుమందుల వ్యసనపరుడైనప్పుడు, ఆయన ఇంట్లో శాంతి అన్నది కనుమరుగై పోయింది. ఆయన తల్లిదండ్రులు భావోద్వేగపరమైన బాధను అనుభవించడమే కాక, అతడ్ని అందులో నుండి కోలుకునేలా చేసేందుకవసరమైన డబ్బుకోసం కూడా నానాబాధలు పడవలసి వచ్చింది. నిర్దయులైన నార్కోటిక్ డీలర్లు వాళ్ళ ఇంటికి వచ్చి, డబ్బు చెల్లించమని వేధించేవాళ్ళు.
అయితే, జీవితంలో ఒత్తిళ్ళు ఉన్నా, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారాన్నీ, వస్త్రాలనూ, ఆశ్రయాన్నీ ఇవ్వడానికే కాక, హింసల నుండీ, మత్తుమందుల దురుపయోగం నుండీ, మరితర సమస్యల నుండీ తమ పిల్లలను కాపాడేందుకు కూడా ప్రయాసపడుతున్నారు. అది మెచ్చుకోదగినదే. కానీ అది మాత్రం సరిపోతుందా? భావోద్వేగ మరియు, ఆధ్యాత్మిక హాని నుండి వారిని కాపాడే విషయమేమిటి? పిల్లలను విజయవంతంగా పెంచడంలో, స్నేహితులనూ, వినోదాలనూ పిల్లలు ఎంపిక చేసుకునేటప్పుడు కలిగే సవాళ్ళను అధిగమించడంలో సహాయపడడం కూడా ఇమిడి ఉందని అనేకులు గుర్తిస్తారు. అయితే, తల్లిదండ్రులు మరీ అమితంగా రక్షణనిచ్చేవారిగానో, మరీ అమితంగా అనుమతించేవారిగానో కాకుండా ఎలా ఉండగలరు? తరువాయి శీర్షికలో ఇవ్వబడిన జవాబులను పరిశీలించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
[అధస్సూచి]
a ఈ శీర్షికలో ఇవ్వబడినవి అసలు పేర్లు కావు.