‘మరణము నశింపజేయబడును’
“కడపట నశింపజేయబడు శత్రువు మరణము.”—1 కొరింథీయులు 15:26.
1, 2. (ఎ) అపొస్తలుడైన పౌలు మృతుల ఎదుట ఏ నిరీక్షణనుంచుతున్నాడు? (బి) పునరుత్థానాన్ని గురించి ఏ ప్రశ్నను పౌలు అడిగాడు?
“నేను . . . శరీర పునరుత్థానాన్నీ, నిత్యజీవాన్నీ నమ్ముతున్నాను” అని అపొస్తలుల విశ్వాససూత్రం చెబుతుంది. తమ నమ్మకాలు అపొస్తలులు నమ్మినవాటితోగాక గ్రీకు తత్త్వంతోనే మరింత ఎక్కువ పొందికను కల్గివున్నాయనే విషయాన్ని ఎంతమాత్రం గుర్తించకుండా, క్యాథలిక్‌లు, ప్రొటెస్టెంట్లు ఒకేలా విధిగా ఆ అపొస్తలుల విశ్వాససూత్రాన్ని వల్లిస్తారు. అయితే, అపొస్తలుడైన పౌలు గ్రీకు తత్త్వాన్ని నిరాకరించాడు, అమర్త్యమైన ఆత్మయందు నమ్మకముంచలేదు. అయినప్పటికీ, ఆయన భవిష్యద్ జీవితమందు దృఢంగా విశ్వసించి, ప్రేరేపించబడినవాడై ఇలా వ్రాశాడు: “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:26) మరణిస్తున్న మానవజాతికి దాని భావమేమిటి?
2 దానికి సమాధానంగా, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో వ్రాయబడివున్న పునరుత్థానాన్ని గూర్చిన పౌలు చర్చవైపుకు మనం దృష్టి మరల్చుదాము. ప్రారంభ వచనాల్లో, క్రైస్తవ సిద్ధాంతంలో ఒక ప్రాముఖ్యమైన భాగంగా పునరుత్థానాన్ని పౌలు స్థిరపరిచాడనే విషయం మీకు జ్ఞాపకం ఉండేవుంటుంది. ఇప్పుడాయన ఒక నిర్దిష్టమైన ప్రశ్నను ప్రస్తావిస్తున్నాడు: “అయతే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.”—1 కొరింథీయులు 15:35.
ఏ విధమైన శరీరం?
3. కొంతమంది పునరుత్థానాన్ని ఎందుకు నిరాకరించారు?
3 ఈ ప్రశ్నను లేవనెత్తడంలో, పౌలు ప్లేటో తత్త్వ ప్రభావాన్ని ఎదుర్కోవాలని ఉద్దేశించి ఉండవచ్చు. శరీర మరణాన్ని తప్పించుకుని జీవించే అమర్త్యమైన ఆత్మ మానవునికి ఉందని ప్లేటో బోధించాడు. అలాంటి తలంపుతో పెరిగిన వారికి, క్రైస్తవ బోధ అనవసరమైనదిగా అనిపించడంలో సందేహమేమీలేదు. మరణాన్ని తప్పించుకుని జీవించగల ఆత్మ ఉన్నట్లైతే, పునరుత్థానంలో అర్థమేముంది? అంతేగాక, పునరుత్థానం బహుశ నిర్హేతుకమైనదిగా అనిపించివుండవచ్చు. శరీరం ఒకసారి మట్టిలో కలిసిపోయిన తర్వాత, పునరుత్థానం ఎలా సంభవిస్తుంది? కొంతమంది కొరింథీయుల అకారణ ద్వేషం బహుశ “శరీర పదార్థాన్ని తిరిగి పూర్వస్థితికి తేవడం అసాధ్యమనే తత్త్వంపై” ఆధారపడి ఉండవచ్చునని బైబిలు వ్యాఖ్యానకర్త అయిన హైన్రీక్ మెయర్ చెబుతున్నాడు.
4, 5. (ఎ) అవిశ్వాసుల అభ్యంతరాలు ఎందుకు నిర్హేతుకమైనవి? (బి) “వట్టి గింజ”ను గురించిన పౌలు ఉపమానాన్ని వివరించండి. (సి) పునరుత్థానులయ్యే అభిషిక్తులకు దేవుడు ఏవిధమైన శరీరాలను ఇస్తాడు?
4 వారి తర్కంలోని వ్యర్థతను పౌలు ఇలా బయల్పరుస్తున్నాడు: “ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనేగాని బ్రదికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయతే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు.” (1 కొరింథీయులు 15:36-38) భూమిపైనున్నప్పుడు ప్రజలకున్న శరీరాలనే దేవుడు తిరిగి లేపబోవడం లేదు. బదులుగా, మార్పు ఉంటుంది.
5 పౌలు పునరుత్థానాన్ని విత్తనం మొలకెత్తడంతో పోలుస్తున్నాడు. చిన్న గోధుమ గింజకూ, దాని నుండి మొలకెత్తే మొక్కకూ పోలికుండదు. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “విత్తనం మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, అది పెద్ద మొత్తంలో నీటిని పీల్చుకుంటుంది. ఆ నీరు విత్తనం లోపల అనేక రసాయనిక మార్పులను కలుగజేస్తుంది. విత్తనం లోపలి కణధాతువులు ఉబ్బి విత్తనం పైపొరలో నుండి బయటికి వచ్చేలా కూడా అది చేస్తుంది.” ఫలితంగా, విత్తనం ఒక విత్తనంగా మరణించి, మొలకెత్తుతున్న మొలకగా తయారౌతుంది. “దేవుడే . . . దానికి శరీరము ఇచ్చును.” ఆ శరీరంలో దాని ఎదుగుదలను నిర్ణయించే శాస్త్రపరమైన సూత్రాలను ఆయన ఉంచాడు, ప్రతి విత్తనం దాని జాతి ప్రకారం ఒక శరీరాన్ని పొందుతుంది. (ఆదికాండము 1:11) అలాగే అభిషిక్త క్రైస్తవులు మొదట, మానవులుగా మరణిస్తారు. ఆ తర్వాత దేవుని నియమిత సమయంలో, పూర్తిగా క్రొత్త శరీరాలతో ఆయన వారిని తిరిగి జీవానికి తెస్తాడు. పౌలు ఫిలిప్పీయులకు చెప్పినట్లుగా, “యేసుక్రీస్తు . . . మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.” (ఫిలిప్పీయులు 3:20, 21; 2 కొరింథీయులు 5:1, 2) వాళ్లు మహిమగల శరీరాల్లో పునరుత్థానం చేయబడి, పరలోక రాజ్యంలో జీవిస్తారు.—1 యోహాను 3:2.
6. పునరుత్థానులయ్యేవారికి దేవుడు తగిన ఆత్మ శరీరాలను ఇవ్వగలడని నమ్మడం ఎందుకు సహేతుకమైనది?
6 దీన్ని విశ్వసించడం మరీ కష్టమా? కాదు. జంతువులు అనేక విభిన్న శరీరాలను కల్గివున్నాయని పౌలు తర్కిస్తున్నాడు. అంతేగాక, “ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు” అని చెబుతూ, ఆయన పరలోక దూతలకూ రక్తమాంసాలుగల మానవులకూ ఉన్న తేడాలను చూపిస్తున్నాడు. నిర్జీవ సృష్టిలో కూడా గొప్ప వైవిధ్యం ఉంది. నీలివర్ణపు నక్షత్రాలూ, అరుణవర్ణంగల మహా నక్షత్రాలూ, శ్వేతవర్ణ కుబ్జలూ (నక్షత్రాలూ) వంటి ఖగోళ రూపాలనూ విజ్ఞానశాస్త్రం కనుగొనడానికి ఎంతోకాలం పూర్వమే, “మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదముకలదు” అని పౌలు చెప్పాడు. దీని దృష్ట్యా, పునరుత్థానులైన అభిషిక్తులకు దేవుడు తగిన పరలోక శరీరాలను ఇవ్వగలడన్నది సహేతుకమైన విషయం కాదా?—1 కొరింథీయులు 15:39-41.
7. అక్షయత అంటే ఏమిటి? అమర్త్యత అంటే ఏమిటి?
7 తర్వాత పౌలు ఇలా చెబుతున్నాడు: “మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును.” (1 కొరింథీయులు 15:42) మానవ శరీరం, పరిపూర్ణమైనదిగా ఉన్నప్పుడు కూడా క్షయమైనదే. కాబట్టి పరిపూర్ణ శరీరం చంపబడే ఆస్కారం ఉంది. ఉదాహరణకు, పునరుత్థానం చేయబడిన యేసు “కుళ్లుపట్టకుండ” ఉండేలా చేయబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 13:34) ఆయన ఇక మరెన్నడూ క్షయమైన మానవ శరీరంతో జీవానికి తిరిగిరాడు, అది పరిపూర్ణ శరీరమైనా సరే. పునరుత్థానులైన అభిషిక్తులకు దేవుడిచ్చే శరీరాలు అక్షయమైనవి—మరణానికీ లేక క్షయానికీ అతీతమైనవి. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు: “ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును.” (1 కొరింథీయులు 15:43, 44) పౌలు ఇంకా అంటున్నాడు: “మర్త్యమైన యూ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.” అమర్త్యత అంటే అంతంలేని, నాశనంచేయబడలేని జీవం. (1 కొరింథీయులు 15:53; హెబ్రీయులు 7:16) ఈ విధంగా, పునరుత్థానమైనవారు తమ పునరుత్థానాన్ని సాధ్యం చేసిన “పరలోకసంబంధి” అయిన యేసు “పోలిక”ను ధరిస్తారు.—1 కొరింథీయులు 15:45-49.
8. (ఎ) పునరుత్థానులైనవారు, మునుపు ఈ భూమిపైన జీవించినవారేనని మనకెలా తెలుస్తుంది? (బి) పునరుత్థానం జరిగినప్పుడు ఏ ప్రవచనాలు నెరవేరుతాయి?
8 ఇలా మార్పు చెందినప్పటికీ, పునరుత్థానం చేయబడినవారు తాము మరణించడానికి మునుపు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కల్గివున్నారో అలాంటి వ్యక్తిత్వాన్ని కల్గివున్న వ్యక్తులే. వాళ్లు అవే జ్ఞాపకాలతో, అవే ఉన్నతమైన క్రైస్తవ లక్షణాలతో లేపబడతారు. (మలాకీ 3:3; ప్రకటన 21:10, 18) ఈ విషయంలో వాళ్లు యేసుక్రీస్తును పోలి ఉంటారు. ఆయన పరలోక సంబంధమైన రూపం నుండి మానవ రూపానికి మారాడు. తర్వాత ఆయన మరణించి, పరలోక సంబంధిగా పునరుత్థానం చేయబడ్డాడు. అయినప్పటికీ, “యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.” (హెబ్రీయులు 13:8) అభిషిక్తులు ఎంత మహిమాన్వితమైన ఆధిక్యతను కల్గివున్నారోగదా! పౌలు ఇలా చెబుతున్నాడు: “ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు,—విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”—1 కొరింథీయులు 15:54, 55; యెషయా 25:8; హొషేయ 13:14.
భూ పునరుత్థానమా?
9, 10. (ఎ) మొదటి కొరింథీయులు 15:24 సందర్భంలో, “అంతము” అంటే ఏమిటి, దానికి సంబంధించి ఏ సంఘటనలు జరుగుతాయి? (బి) మరణం నశింపజేయబడాలంటే ఏమి జరగాలి?
9 పరలోకంలో అమర్త్యమైన ఆత్మ జీవిత నిరీక్షణ లేని కోట్లాదిమందికి ఎటువంటి భవిష్యత్తైనా ఉందా? వాస్తవంగా ఉంది! క్రీస్తు ప్రత్యక్షత సమయంలో పరలోక పునరుత్థానం జరుగుతుందని వివరించిన తర్వాత, పౌలు ఇలా చెబుతూ తర్వాత జరిగే సంఘటనలను తెలియజేసాడు: “అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.”—1 కొరింథీయులు 15:23, 24.
10 “అంతము” అంటే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతము, అప్పుడు యేసు వినయంగా, యథార్థంగా రాజ్యాన్ని తన తండ్రియైన దేవునికి అప్పగిస్తాడు. (ప్రకటన 20:4) “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలె”నన్న దేవుని సంకల్పం అప్పటికి నెరవేరుతుంది. (ఎఫెసీయులు 1:9, 10) అయితే, దేవుని సర్వాధిపత్య చిత్తాన్ని వ్యతిరేకించే “సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును” క్రీస్తు మొదట నాశనం చేస్తాడు. అర్మగిద్దోనులో జరగబోయే నాశనంకన్నా మరింత అధికంగా నాశనం జరుగుతుంది. (ప్రకటన 16:16; 19:11-21) పౌలు ఇలా చెబుతున్నాడు: “ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు [క్రీస్తు] రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:25, 26) అవును, ఆదాము ద్వారా వచ్చిన పాప మరణాల జాడలన్నీ తీసివేయబడతాయి. అయితే తర్వాత, మృతులను తిరిగి జీవింపజేయడం ద్వారా దేవుడు తప్పక “సమాధుల”ను ఖాళీ చేస్తాడు.—యోహాను 5:28.
11. (ఎ) దేవుడు మృతులైన మానవులను పునఃసృష్టించగలడని మనకెలా తెలుసు? (బి) భూమిపైకి పునరుత్థానం చేయబడేవారికి ఏ విధమైన శరీరాలు ఇవ్వబడతాయి?
11 మానవులను పునఃసృష్టించడమని దీని భావం. అసాధ్యమా? కాదు, ఎందుకంటే మానవులతోపాటూ తన యావత్ సృష్టినీ దేవుడు పునఃసృష్టించగలడని కీర్తన 104:29, 30 హామీ ఇస్తోంది: “నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును.” (కీర్తన 104:29, 30) పునరుత్థానం చేయబడిన వారు తమ మరణానికి ముందు ఉన్న అదే వ్యక్తులే అయినప్పటికీ, వారికి అవే శరీరాలు ఉండవలసిన అవసరం లేదు. పరలోకానికి లేపబడినవారికైతే, దేవుడు తనకిష్టమైన శరీరాన్ని ఇస్తాడు. వారి క్రొత్త శరీరాలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాయనడంలోనూ, వారి ప్రియమైనవారు వారిని గుర్తించగలిగేలా కొంతమేరకు వారి మునుపటి శరీరాన్ని పోలినట్లుగానే ఉంటాయనడంలోనూ సందేహం లేదు.
12. భూ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది?
12 భూ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? మరణించిన తన సహోదరుడైన లాజరు గురించి మార్త ఇలా చెప్పింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదు[ను].” (యోహాను 11:24) అది ఆమెకెలా తెలుసు? పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్మేవారుగాని సద్దూకయ్యులు నమ్మేవారు కాదు గనుక, ఆమె దినాల్లో పునరుత్థానం ఒక వివాదాస్పదమైన అంశమైవుంది. (అపొస్తలుల కార్యములు 23:8) అంతేగాక, పునరుత్థానమందు నిరీక్షణ ఉంచిన క్రైస్తవ పూర్వ సాక్షుల గురించి మార్తకు తెలిసి ఉండవచ్చు. (హెబ్రీయులు 11:35) ఇంకా, పునరుత్థానం అంత్య దినములో జరుగుతుందని ఆమె దానియేలు 12:13 నుండి గ్రహించివుండవచ్చు. ఆమె దాని గురించి స్వయంగా యేసు నుండి కూడా తెలుసుకుని ఉండవచ్చు. (యోహాను 6:39) ఆ “అంత్యదినము” క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా ఒకే సమయంలో జరుగుతాయి. (ప్రకటన 20:6) ఈ ఘనమైన ఘట్టం ప్రారంభమైనప్పుడు ఆ “దినము”లో ఉండే ఉత్సుకతను ఊహించండి!—పోల్చండి, లూకా 24:41.
ఎవరు పునరుత్థానులౌతారు?
13. ప్రకటన 20:12-14 నందు పునరుత్థానాన్ని గూర్చిన ఏ దర్శనం నివేదించబడింది?
13 భూ పునరుత్థానాన్ని గూర్చిన యోహాను దర్శనం ప్రకటన 20:12-14లో ఇలా వ్రాయబడివుంది: “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.”
14. పునరుత్థానమైనవారిలో ఎవరు ఉంటారు?
14 “గొప్పవారేమి కొద్దివారేమి” అంటే జీవించి మరణించిన ప్రముఖులూ, సామాన్యులూ పునరుత్థానం చేయబడతారు. అంతెందుకు, పునరుత్థానమయ్యేవారిలో పసివారు కూడా ఉంటారు! (యిర్మీయా 31:15, 16) అపొస్తలుల కార్యములు 24:15 నందు మరో ప్రాముఖ్యమైన వివరణ బయల్పర్చబడింది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన స్త్రీ పురుషులైన హేబేలు, హనోకు, నోవహు, అబ్రాహాము, శారా, రాహాబు వంటివారు “నీతిమంతుల”లో ప్రముఖులై ఉంటారు. (హెబ్రీయులు 11:1-40) అలాంటివారితో సంభాషించి, పూర్వం జరిగిన బైబిలు సంఘటనలను గూర్చిన ప్రత్యక్ష వివరాలను పొందగలగడం ఎలా ఉంటుందో ఊహించండి! ఇటీవలి కాలాల్లో మరణించిన, పరలోక పునరుత్థాన నిరీక్షణలేని దైవభయంగల వేలాదిమంది వ్యక్తులు కూడా ఆ “నీతిమంతుల”లో చేరి ఉంటారు. వీరిలో చేరివుండే కుటుంబ సభ్యులుగానీ లేక ప్రియమైన వ్యక్తులుగానీ మీకున్నారా? వారిని మీరు మళ్లీ చూడగలరని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుందో కదా! అయితే, పునరుత్థానులయ్యే “అనీతిమంతు”లైన వ్యక్తులు ఎవరు? బహుశ, బైబిలు సత్యాన్ని తెలుసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకునే అవకాశం లభించకుండానే మరణించిన కోట్లాదిమంది వారిలో చేరివుండవచ్చు.
15. పునరుత్థానమయ్యేవారు ‘గ్రంథములలో వ్రాయబడిన వాటి ప్రకారం తీర్పుపొందుతారు’ అనేదాని భావమేమిటి?
15 ‘ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున తీర్పును’ పునరుత్థానులయ్యే వ్యక్తులెలా ‘పొందుతారు’? ఈ గ్రంథములు వారి గత క్రియల రికార్డు కాదు; వారు మరణించినప్పుడు, వారు తమ జీవితకాలంలో చేసిన పాపాల నుండి రుణ విముక్తులయ్యారు. (రోమీయులు 6:7, 23) అయితే, పునరుత్థానమైన మానవులు ఇంకా ఆదాము పాపం క్రిందనే ఉంటారు. మరైతే, యేసుక్రీస్తు బలి నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి అందరూ అనుసరించవలసిన దైవిక నిర్దేశక సూత్రాలను ఈ గ్రంథములు అందజేస్తుండవచ్చు. ఆదాము పాపం యొక్క చివరి జాడ కూడా నిర్మూలించబడిన తర్వాత, సంపూర్ణ భావంలో ‘మరణం నాశనం చేయబడుతుంది.’ వెయ్యేండ్ల పరిపాలనాంతానికి, దేవుడు ‘సర్వములో సర్వమౌతాడు.’ (1 కొరింథీయులు 15:28) అప్పుడిక మానవునికి ప్రధాన యాజకుని లేక విమోచకుని అవసరం ఉండదు. మానవజాతి అంతా, మునుపు ఆదాము అనుభవించిన పరిపూర్ణ స్థితికి తిరిగి తీసుకురాబడుతుంది.
క్రమమైన పునరుత్థానం
16. (ఎ) పునరుత్థానం క్రమానుసారమైన ప్రక్రియ అయివుంటుందని నమ్మడం ఎందుకు సహేతుకమైనది? (బి) మృతులలో నుండి లేపబడే మొదటివారిలో బహుశ ఎవరు ఉండవచ్చు?
16 పరలోక పునరుత్థానం క్రమమైనది, “ప్రతివాడును తన తన వరుసలోనే” లేపబడతాడు గనుక, భూ పునరుత్థానం గందరగోళంతో కూడిన జనాభా విస్ఫోటాన్ని కలుగజేయదని స్పష్టమౌతుంది. (1 కొరింథీయులు 15:23) అర్థం చేసుకొనదగినట్లుగా, క్రొత్తగా పునరుత్థానం చేయబడినవారి గురించి శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంటుంది. (పోల్చండి, లూకా 8:55.) వారికి శారీరక బలం—మరింత ప్రాముఖ్యంగా—యెహోవా దేవుని గురించి యేసుక్రీస్తు గురించి జీవదాయక జ్ఞానాన్ని పొందడంలో ఆధ్యాత్మిక సహాయం అవసరమౌతుంది. (యోహాను 17:3) అందరూ ఒకేసారి జీవానికి తిరిగి వస్తే, వారి గురించి తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడం అసాధ్యమౌతుంది. పునరుత్థానం క్రమానుసారంగా జరుగుతుందని భావించడం సహేతుకమైనదౌతుంది. సాతాను విధానపు అంతానికి కొంచెం ముందు మరణించిన నమ్మకమైన క్రైస్తవులు, మొదట లేపబడేవారిలో ఉండే ఆస్కారముంది. ‘అధికారులుగా’ సేవచేయబోయే ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన వ్యక్తులు, ముందుగా పునరుత్థానం చేయబడతారని కూడా మనం ఎదురుచూడవచ్చు.—కీర్తన 45:16.
17. పునరుత్థానాన్ని గూర్చి బైబిలు జవాబు ఇవ్వని కొన్ని అంశాలు ఏవి, అలాంటి విషయాల గురించి క్రైస్తవులు ఎందుకు అనవసరమైన శ్రద్ధ కల్గివుండకూడదు?
17 ఏదేమైనప్పటికీ, మనం అలాంటి విషయాల గురించి పిడివాదం చేసేవారిగా ఉండకూడదు. అనేక విషయాలకు బైబిలు జవాబును ఇవ్వడంలేదు. ఆ యా వ్యక్తులు ఎలా, ఎప్పుడు, లేక ఏ స్థలంలో పునరుత్థానం చేయబడతారనే దాన్ని గూర్చిన వివరాలను అది తెలియజేయడంలేదు. పునరుత్థానమయ్యేవారికి వసతిసౌకర్యాలూ, ఆహారమూ, వస్త్రాలూ ఎలా సమకూర్చబడతాయనే దాని గురించి బైబిలు మనకు చెప్పడం లేదు. పునరుత్థానమైన పిల్లల పెంపకం గురించి, సంరక్షణా బాధ్యతను గురించి, మన స్నేహితులూ లేక ప్రియమైనవారూ ఇమిడివున్న కొన్ని పరిస్థితుల గురించి యెహోవా ఎలా వ్యవహరిస్తాడనేదాని గురించి మనం ఖచ్చితంగా ఏమి చెప్పలేము. నిజమే, అలాంటి విషయాల గురించి ఆలోచించడం సహజమే; కాని ప్రస్తుతం జవాబు చెప్పడానికి వీల్లేని ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ప్రయత్నించడానికి సమయాన్ని వెచ్చించడం అవివేకమౌతుంది. నమ్మకంగా యెహోవా సేవ చేసి, నిత్యజీవాన్ని పొందడంపై మన దృష్టిని కేంద్రీకరించాలి. అభిషిక్త క్రైస్తవులు మహిమాన్విత పరలోక పునరుత్థానంపై నిరీక్షణనుంచుతారు. (2 పేతురు 1:10, 11) ‘వేరే గొర్రెలు’ దేవుని రాజ్యపు భూపరిధిలో నిత్య నివాసం కొరకు నిరీక్షిస్తారు. (యోహాను 10:16; మత్తయి 25:33, 34) పునరుత్థానాన్ని గురించి మనకు తెలియని అనేక వివరాలకు సంబంధించి, మనం కేవలం యెహోవాపై నమ్మకం ఉంచుతాము. ‘ప్రతిజీవి కోరికను తృప్తిపరచగల’ వాని చేతుల్లో మన భవిష్యద్ ఆనందం సురక్షితంగా ఉంది.—కీర్తన 145:16; యిర్మీయా 17:7.
18. (ఎ) పౌలు ఏ విజయాన్ని ఎత్తిచూపిస్తున్నాడు? (బి) మనం పునరుత్థాన నిరీక్షణను దృఢంగా ఎందుకు నమ్ముతాము?
18 “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” అని చెబుతూ పౌలు తన వాదనను ముగిస్తున్నాడు. (1 కొరింథీయులు 15:57) అవును, యేసు క్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా ఆదాము మూలంగా సంక్రమించిన మరణంపై విజయం సాధించడం జరిగింది, అభిషిక్తులూ, ‘వేరే గొర్రెలూ’ ఆ విజయంలో పాలుపంచుకుంటారు. అయితే నేడు సజీవంగా ఉన్న ‘వేరే గొర్రెలకు’ ఈ తరానికే విశేషమైనదైన నిరీక్షణ ఉంది. నిరంతరం అధికమౌతున్న ‘గొప్ప సమూహంలో’ భాగంగా, వారు రానైయున్న ‘మహా శ్రమను’ తప్పించుకుని, మరెన్నడూ భౌతిక మరణాన్ని రుచిచూడరు! (ప్రకటన 7:9, 14) అయితే ‘అదృష్టవశము చేతను, కాలవశము చేతను’ లేక సాతాను ప్రతినిధుల చేతుల్లో మరణించే వారు పునరుత్థాన నిరీక్షణలో తమ నమ్మకాన్ని ఉంచవచ్చు.—ప్రసంగి 9:11.
19. నేడు క్రైస్తవులందరూ ఏ ఉపదేశాన్ని వినాలి?
19 కాబట్టి, మరణం నిర్మూలించబడే ఆ మహిమాన్విత దినం కొరకు మనం ఆత్రంగా ఎదురు చూస్తాము. పునరుత్థానాన్ని గూర్చిన యెహోవా వాగ్దానమందలి మన దృఢమైన విశ్వాసం, మనకు విషయాలను గూర్చిన వాస్తవిక దృక్పథాన్నిస్తుంది. ఈ జీవితంలో మనకు ఏమి జరిగినప్పటికీ—చివరికి మనం మరణించవలసి వచ్చినప్పటికీ—యెహోవా వాగ్దానం చేసే ప్రతిఫలం నుండి మనల్ని ఏది దూరం చేయలేదు. గనుక, పౌలు కొరింథీయులకు ఇచ్చిన చివరి ఉపదేశం రెండు వేల సంవత్సరాల క్రితం ఎంత తగినదో నేడూ అంతే తగినదైవుంది: “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరింథీయులు 15:58.
మీరు వివరించగలరా?
◻ అభిషిక్తులు పునరుత్థానం చేయబడినప్పుడు వారికి ఎలాంటి శరీరాలు ఉంటాయనే ప్రశ్నకు పౌలు ఎలా సమాధానమిచ్చాడు?
◻ మరణం ఎలా, ఎప్పుడు చివరికి నాశనం చేయబడుతుంది?
◻ భూ పునరుత్థానంలో ఎవరు చేరివుంటారు?
◻ బైబిలు జవాబివ్వకుండా ఉన్న విషయాల గురించి మన దృక్పథం ఏమైవుండాలి?
[20వ పేజీలోని చిత్రం]
ఒక విత్తనం విశేషమైన మార్పులు చెందడం ద్వారా “మరణిస్తుంది”
[23వ పేజీలోని చిత్రాలు]
ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన స్త్రీ పురుషులైన నోవహు, అబ్రాహాము, శారా, రాహాబులు పునరుత్థానమయ్యేవారిలో ఉంటారు
[24వ పేజీలోని చిత్రం]
పునరుత్థానం గొప్ప ఆనందకరమైన సమయమై ఉంటుంది!