కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/15 పేజీలు 26-29
  • నిజమైన న్యాయం—ఎప్పుడు, ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన న్యాయం—ఎప్పుడు, ఎలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పుడు న్యాయం
  • మానవ బలహీనతలతో—మానవ న్యాయ వ్యవస్థలు
  • “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము”
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • జనాంగములన్నింటికి త్వరలోనే న్యాయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/15 పేజీలు 26-29

నిజమైన న్యాయం—ఎప్పుడు, ఎలా?

నిరపరాధులు నిజమైన న్యాయాన్ని గురించి భయపడవలసిన అవసరం లేదు. నిజానికి, న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నించే చట్ట వ్యవస్థ ఉన్న దేశంలోని పౌరులు వారెక్కడున్నప్పటికీ దాన్నిబట్టి కృతజ్ఞులై ఉండేందుకు కారణముంది. అలాంటి వ్యవస్థలో అనేక చట్టపరమైన న్యాయవిధులు ఉంటాయి, వాటిని అమలుపరిచేందుకు ఒక పోలీసుయంత్రాంగం ఉంటుంది, మరి న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టులు ఉంటాయి. నిజ క్రైస్తవులు, “పై అధికారులకు లోబడియుండ వలెను” అన్న బైబిలు ఆజ్ఞకు లోబడుతూ, తాము ఏ న్యాయ వ్యవస్థక్రింద జీవిస్తున్నారో దాన్ని గౌరవిస్తారు.—రోమీయులు 13:1-7.

అయితే, వివిధ దేశాల్లోని న్యాయ వ్యవస్థలు హానికరమైన, సిగ్గుకరమైన పొరపాట్లు చేశాయి.a నేరస్థులను శిక్షించి నిర్దోషులను కాపాడే బదులు, కొన్నిసార్లు నిర్దోషులను చేయని నేరాలకు శిక్షించడం జరిగింది. ఇతర వ్యక్తులు అనేక సంవత్సరాలు కారాగారంలో గడిపిన తర్వాత, వారు నిజంగా నేరస్థులేనా, వారు నేరస్థులని నిర్థారించడం న్యాయమేనా అనే గంభీరమైన సందేహాల నడుమ తమ శిక్షా సమయం గడవక ముందే వాళ్లు విడుదల చేయబడ్డారు. కాబట్టి అనేకులు అడిగేదేమంటే, అందరికీ నిజమైన న్యాయం ఎప్పటికైనా లభిస్తుందా? ఐతే ఎప్పుడు, ఎలా? నిర్దోషులను కాపాడేందుకు మనం ఎవరిని నమ్మగలం? అన్యాయం జరిగిన వారికి ఏ నిరీక్షణ ఉంది?

తప్పుడు న్యాయం

మరి 1980లలో, “యుద్ధం తర్వాతి కాలంలోని అత్యంత సంచలనాత్మక ప్రొసీడింగుల్లో” ఒకదాన్ని జర్మనీ చూసింది, ఆ ప్రొసీడింగులో ఒక తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపిందని ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. అయితే, అనేక సంవత్సరాల తర్వాత, ఆమెకు విరుద్ధంగా ఇవ్వబడిన సాక్ష్యాన్ని పునఃపరిశీలించారు, మరి క్రొత్త కేసు విచారణలో ఉండగా ఆమెను విడుదల చేశారు. మరి 1995లో, మొదటి తీర్పు “న్యాయ సంబంధ పొరపాటని నిరూపించబడగలదని” డీ ట్సైట్‌ నివేదించింది. ఈ శీర్షిక వ్రాయబడే సమయం వరకూ, ఆమె దోషో లేక నిర్దోషో అనే అనిశ్చయతతో చుట్టుముట్టబడినదై ఈ స్త్రీ తొమ్మిది సంవత్సరాలు కారాగారంలో గడిపింది.

1974లో, ఒక నవంబరు సాయంత్రాన, ఇంగ్లండ్‌నందలి బర్మింగ్‌హమ్‌ నగర మధ్యభాగంలో జరిగిన రెండు బాంబు ప్రేలుళ్ళ కారణంగా ఆ ప్రాంతం ధ్వంసమైంది, మరి 21 మంది చనిపోయారు. అది “బర్మింగ్‌హమ్‌లో వాళ్లు ఎవరూ, ఎన్నడూ మర్చిపోలేని” సంఘటన అని శాసన సభ సభ్యుడైన క్రిస్‌ మ్యూలెన్‌ వ్రాశాడు. తర్వాత, “బ్రిటీష్‌ చరిత్రలోని అతి ఘోరమైన హత్యాకాండ జరిపారని ఆరుగురు అమాయకులైన వ్యక్తులపై నేరం మోపబడింది.” ఆ తర్వాత వారిపై చేయబడిన నేరారోపణ రద్దుచేయబడింది, అయితే ఆ వ్యక్తులు 16 సంవత్సరాలు కారాగారంలో గడిపిన తర్వాతనే!

“ఆస్ట్రేలియా న్యాయ చరిత్ర రికార్డుల్లో, ప్రజల ఆలోచనలను ఎంతో ప్రత్యేకమైన రీతిలో ఆకర్షించిన” ఒక కేసును గురించి న్యాయ సంబంధ సలహాదారు అయిన కెన్‌ క్రిస్పన్‌ నివేదిస్తున్నాడు. ఒక కుటుంబం అయెర్స్‌ రాక్‌ వద్ద క్యాంపింగ్‌కి వెళ్లింది, అప్పుడు వాళ్ల పాప అదృశ్యమైంది, మరి మళ్లీ ఎన్నడూ కనిపించలేదు. ఆ తల్లి హత్య చేసిందని నేరారోపణ చేసి, ఆమెకు యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది. 1987లో, అంటే ఆమె మూడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం ఖైదులో గడిపిన తర్వాత, ఆమెకు విరుద్ధంగా లభించిన సాక్ష్యం ఆమెపై మోపబడిన నేరాన్ని రుజువు చేయడం లేదని ఒక అధికారిక దర్యాప్తు కనుగొన్నది. ఆమెను క్షమించి విడుదల చేయడం జరిగింది.

అమెరికా దక్షిణభాగంలో నివసిస్తున్న 18 సంవత్సరాల అమ్మాయి 1986లో హత్యకు గురైంది. నడివయస్సుగల ఒక వ్యక్తిపై నేరం మోపబడి, అతనికి మరణ శిక్ష విధించబడింది. అతడు తన మరణశిక్ష కొరకు ఎదురుచూస్తూ ఆరు సంవత్సరాలు కారాగారంలో గడిపాడు, దాని తర్వాత అతనికి ఆ నేరంతో ఎలాంటి సంబంధమూ లేదని నిరూపించబడింది.

ఇవి న్యాయ సంబంధ తప్పిదాల్లోని అరుదైన ఉదాహరణలా? యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా లా స్కూల్‌కు చెందిన డేవిడ్‌ రుడోఫ్‌స్కీ ఇలా పేర్కొంటున్నాడు: “న్యాయ వ్యవస్థలో నేను దాదాపు 25 సంవత్సరాలుగా ఉన్నాను, నేను అనేక కేసులను చూశాను. వాస్తవానికి నిర్దోషులైనప్పటికీ నేరారోపణ చేయబడి శిక్షను అనుభవించిన వారు . . . 5% నుండి 10% వరకు ఉంటారని నేననుకుంటున్నాను.” క్రిస్పన్‌ కలతపర్చే ఈ ప్రశ్నను అడుగుతున్నాడు: “నేడు ఇంకా అనేకమంది నిర్దోషులైన ప్రజలు నిరాశా నిస్పృహలతో కారాగారంలో మ్రగ్గుతున్నారా?” అలాంటి గంభీరమైన తప్పిదాలు ఎలా జరిగాయి?

మానవ బలహీనతలతో—మానవ న్యాయ వ్యవస్థలు

“ఏ మానవ వ్యవస్థా పరిపూర్ణంగా ఉంటుందని ఆశించలేము” అని బ్రిటిష్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ 1991లో నొక్కి చెప్పింది. ఒక న్యాయ వ్యవస్థ, దాని రూపనిర్మాణం చేసి దాన్ని అమలు చేసే ప్రజలు ఎంత న్యాయవంతంగా, ఆధారపడదగిన వారిగా ఉంటారో, ఆ వ్యవస్థ కూడా అంతే న్యాయవంతంగా ఆధారపడదగినదిగా ఉంటుంది. ప్రజలు పొరపాట్లు చేస్తారు, అన్యాయానికి పాల్పడతారు, పక్షపాత వైఖరిని కలిగి ఉంటారు. కాబట్టి, మానవుడు నిర్మించిన న్యాయ వ్యవస్థలు అవే లోపాలను చూపించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించ కూడదు. ఈ క్రింది విషయాలను పరిశీలించండి.

జర్మనీకి చెందిన రాల్ఫ్‌ బెండర్‌ అనే న్యాయమూర్తి ప్రకారం, క్రిమినల్‌ కేసులన్నింటిలోకీ 95 శాతం కేసుల్లో, సాక్షులు ఇచ్చిన వ్యాఖ్యానాలే అంతిమ రుజువులు. అయితే అలాంటి సాక్షులను న్యాయస్థానంలో ఎల్లప్పుడూ నమ్మవచ్చునా? నమ్మలేమని న్యాయమూర్తి బెండర్‌ భావిస్తున్నాడు. న్యాయస్థానంలో హాజరయ్యే సాక్షుల్లో సగంమంది అసత్యాలు చెబుతారని ఆయన అంచనా వేస్తున్నాడు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌నందు నేర న్యాయ విభాగంలో ప్రొఫెసర్‌ ఆర్డినారియస్‌గా పని చేస్తున్న బెర్నట్‌ షూనెమూన్‌ అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డీ ట్సైట్‌ ఇంటర్వ్యూలో, సాక్షుల వాఙ్మూలాలు—అవి అవిశ్వసనీయమైనవి అయినప్పటికీ—ముఖ్యమైన సాక్ష్యాలు అని షూనెమూన్‌ నిర్థారించాడు. “సాక్షుల అవిశ్వసనీయమైన వాఙ్మూలాలపై జడ్జి ఆధారపడడమే న్యాయ సంబంధ పొరపాట్లు జరిగేందుకుగల సాధారణ కారణమని నేను అంటాను” అని షూనెమూన్‌ నొక్కి చెప్పాడు.

సాక్షులు పొరపాటు పడగలరు; మరి పోలీసులు కూడా పొరపాటు పడగలరు. ప్రాముఖ్యంగా ప్రజల్లో ఆగ్రహావేశాలను కలిగించే నేరం జరిగిన తర్వాత, ఏదో ఒక అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, ఆయా పోలీసులు అబద్ధ సాక్ష్యాన్ని కల్పించాలనే లేక అనుమానితులు నేరాన్ని అంగీకరించేలా వారిపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రలోభానికి లొంగిపోవచ్చు. బర్మింగ్‌హమ్‌ బాంబు ప్రేలుళ్ళ విషయంలో నేరారోపణ చేయబడిన ఆరుగురు వ్యక్తులను విడుదల చేసినప్పుడు, బ్రిటీష్‌ వార్తాపత్రికైన ది ఇండిపెండెంట్‌, “ఆరుగురు వ్యక్తులపై అబద్ధ నేరారోపణ చేసినందుకు భ్రష్ట పోలీసులు నిందింపబడ్డారు” అనే పతాక శీర్షికను ప్రచురించింది. ది టైమ్స్‌ ప్రకారం, “పోలీసులు అబద్ధమాడారు, కుట్రపన్నారు, మోసగించారు.”

కొన్ని కేసుల్లో, పక్షపాత వైఖరి, ఒక ప్రత్యేక జాతికి మతానికి లేక దేశానికి చెందిన వ్యక్తులను పోలీసులు లేక ప్రజలు అనుమానించేలా చేయవచ్చు. యు.ఎస్‌.న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ వ్యాఖ్యానించిన విధంగా, ఒక నేరాన్ని పరిష్కరించడం “హేతువుకు సంబంధించిన విషయం కాక జాతికి సంబంధించిన వివాదం”గా దిగజారవచ్చు.

ఒక కేసు కోర్టులోకి ప్రవేశపెట్టబడిన తర్వాత, సాక్షులు చెప్పే వాటినిబట్టి మాత్రమేకాక వైజ్ఞానిక సాక్ష్యాధారాలను బట్టి కూడా నిర్ణయాలు ప్రభావితం చెందవచ్చు. రాను రానూ మరింత సంక్లిష్టంగా మారుతున్న ఫోరెన్సిక్‌ (న్యాయ వైద్య శాస్త్రం) రంగంలో, బాలిస్టిక్స్‌, వేలి ముద్రల గుర్తింపు, చేవ్రాత, రక్తగ్రూపు, వెంట్రుకల రంగు, బట్టల దారాలు, లేక డిఎన్‌ఎ శాంపిల్‌ల ఆధారంగా నేరస్థులో కాదో నిర్ణయించవలసిందిగా న్యాయమూర్తిని లేక న్యాయమూర్తుల బృందాన్ని కోరడం జరుగవచ్చు. న్యాయస్థానాలు, “విస్మయం కలిగించేంత జటిలమైన ప్రక్రియలను వివరించే వైజ్ఞానికుల గుంపులను” ఎదుర్కోవలసి ఉంటుందని ఒక న్యాయవాది పేర్కొన్నాడు.

అంతే కాకుండా, ఫోరెన్సిక్‌ సాక్ష్యం ధృవీకరిస్తున్న విషయాలపై వైజ్ఞానికులు అందరూ అంగీకరించరని నేచర్‌ అనే పత్రిక పేర్కొంటోంది. “ఫోరెన్సిక్‌ వైజ్ఞానికుల మధ్య నిజంగానే అభిప్రాయ భేదం ఉండవచ్చు.” “తప్పుడు ఫోరెన్సిక్‌ సాక్ష్యం ఇప్పటికే అనేక తప్పుడు నేరారోపణలకు కారణమైందనే విషయం” ఎంతో విచారకరమైనది.

మనం ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, ఇప్పుడు అమలులో ఉన్న న్యాయ వ్యవస్థలన్నీ మానవ అసమర్థతలకు అద్దంపడతాయి. అమాయకులను కాపాడేందుకు మనం ఎవరిని నమ్మగలం? మనం నిజమైన న్యాయాన్ని ఎప్పటికైనా పొందగలమని నిరీక్షించగలమా? న్యాయపర పొరపాట్లకు బలైన వారికి ఏ నిరీక్షణ ఉంది?

“న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము”

మీరు లేక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా న్యాయసంబంధ పొరపాటు బాధితులైతే, మీరు ఏమి అనుభవిస్తున్నారో యెహోవా దేవుడూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తూ అర్థం చేసుకుంటారన్న నమ్మకాన్ని కలిగి ఉండండి. క్రీస్తు హింసా కొయ్యపై వ్రేలాడదీయబడినప్పుడు అత్యంత ఘోరమైన అన్యాయం జరిగింది. యేసు ఏ “పాపము చేయలేదు” అని అపొస్తలుడైన పేతురు మనకు చెబుతున్నాడు. అయినప్పటికీ, అబద్ధ సాక్షులు ఆయనపై నేరారోపణ చేశారు, దోషియని నిరూపించారు, చంపేశారు.—1 పేతురు 2:22; మత్తయి 26:3, 4, 59-62.

తన కుమారుని పట్ల వారు అంత నీచంగా ప్రవర్తించడాన్ని బట్టి యెహోవా ఎలా భావించి ఉంటాడో ఊహించండి! న్యాయం యెహోవా యొక్క నాలుగు ముఖ్య గుణాల్లో ఒకటి. “ఆయన చర్యలన్నియు న్యాయములు” అని బైబిలు మనకు చెబుతోంది.—ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 33:5.

యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక ఉత్కృష్టమైన న్యాయ వ్యవస్థను ఇచ్చాడు. పరిష్కరించబడని హత్య కేసులో, ఒక బలి ద్వారా ఆ మరణానికి ప్రాయశ్చిత్తం జరుపబడేది. నిరపరాధులైన వ్యక్తులపై నేరారోపణ చేయడం ద్వారా ప్రతి నేరాన్నీ పరిష్కరించాలనే ఒత్తిడి ఉండేది కాదు. ప్రత్యక్ష సాక్ష్యం లేని వివరాలను లేక వైజ్ఞానిక సాక్ష్యాలను మాత్రమే ఆధారంగా తీసుకుని ఎవరిపైనా హత్యా నేరం మోపబడేందుకు వీలుండేది కాదు; కనీసం ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. (ద్వితీయోపదేశకాండము 17:6; 21:1-9) యెహోవాకు ఉన్నత ప్రమాణాలు ఉన్నాయనీ మరియు న్యాయం సరిగ్గా అమలు జరిపేందుకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడనీ ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. వాస్తవానికి, “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము” అని ఆయన చెబుతున్నాడు.—యెషయా 61:8.

అయితే, ఇశ్రాయేలీయుల న్యాయ వ్యవస్థ, మనవంటి లోపాలే ఉన్న మానవుల చేతుల్లో ఉండేది. మరి వారి మధ్య కూడా న్యాయం సరిగ్గా జరగని సందర్భాలు కొన్ని ఉన్నాయి. రాజైన సొలొమోను ఇలా వ్రాశాడు: “ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము.”—ప్రసంగి 5:8.

తన కుమారునికి జరిగిన అన్యాయాన్ని యెహోవా సరిచేయగలిగాడు. ఇది తప్పకుండా జరుగుతుందనే అభయం యేసును బలపర్చింది, మరి ఆయన “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై . . . సిలువను సహిం[చాడు].” అదే విధంగా, మెస్సీయా పరిపాలన క్రింద నిజమైన న్యాయం నెలకొల్పబడినప్పుడు, పరదైసు భూమిపై జీవించే ఆనందమయమైన ఉత్తరాపేక్ష, ఈ పాత వ్యవస్థలో అన్యాయాన్ని గురించి వినడాన్ని లేక దాన్ని అనుభవించడాన్ని సహించేందుకు మనలను కూడా బలపరుస్తుంది. యెహోవా తన నియమిత కాలంలో సరిచేయలేని హాని లేక అన్యాయం ఏదీ లేదు. న్యాయపర పొరపాటు మూలంగా తమ జీవితాలను పోగొట్టుకున్న వాళ్లు కూడా పునరుత్థానం పొందవచ్చు.—హెబ్రీయులు 12:1, 2; అపొస్తలుల కార్యములు 24:15.

మనం అన్యాయానికి బలై దుఃఖితులమై ఉంటే, మన పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు మనకు సహాయం చేయగల చట్టబద్ధమైన మాధ్యమాలు అనేక న్యాయ వ్యవస్థల్లో, ఉన్నాయనే విషయాన్నిబట్టి మనం కృతజ్ఞులమై ఉండగలం. క్రైస్తవులు అలాంటి మాధ్యమాలను ఉపయోగించవచ్చు. అయితే, వాళ్లు ఈ వాస్తవాన్ని మనస్సులో ఉంచుకుంటారు: అపరిపూర్ణ న్యాయ వ్యవస్థలు ఎంతో పెద్ద పునఃవ్యవస్థీకరణ అవసరమైన మానవ సమాజపు ప్రతిబింబమై ఉన్నాయి. ఆ పునఃవ్యవస్థీకరణ దేవుని ద్వారా చాలా త్వరలోనే జరుగబోతోంది.

యెహోవా త్వరలోనే అన్యాయంతో నిండిన ఈ ప్రస్తుత వ్యవస్థను తీసివేసి, దాని స్థానంలో క్రొత్త వ్యవస్థను స్థాపిస్తాడు, దాని“యందు నీతి నివసించును.” మన సృష్టికర్త తన మెస్సీయ రాజైన యేసుక్రీస్తు ద్వారా అప్పుడు న్యాయం చేస్తాడని మనం పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ నిజమైన న్యాయం త్వరలోనే జరుగుతుంది! ఈ ఉత్తరాపేక్ష విషయమై మనం ఎంత కృతజ్ఞులం!—2 పేతురు 3:13.

[అధస్సూచి]

a ఇక్కడ ప్రస్తావించబడిన కేసుల్లో, ఏ వ్యక్తులైనా దోషులనీ లేక నిర్దోషులనీ కావలికోట చెప్పడం లేదు, లేక ఒక దేశ న్యాయ వ్యవస్థ మరొక దానికంటే శ్రేష్ఠంగా ఉందని కూడా ఈ పత్రిక ఉన్నతపర్చడం లేదు. అంతే కాకుండా, ఈ పత్రిక ఒక విధమైన శిక్షకంటే మరొక విధమైనది మంచిదని కూడా సలహా ఇవ్వడం లేదు. ఈ శీర్షిక వ్రాయబడుతున్న సమయంలో తెలిసి ఉన్న వాస్తవాలనే ఇది తెలియజేస్తుంది.

[27వ పేజీలోని చిత్రం]

భ్రష్టమైన ప్రభుత్వాలు, నీచమైన మతం, మరియు సూత్ర రహితమైన వ్యాపారం, వీటితోపాటు—అపరిపూర్ణ న్యాయ వ్యవస్థలు—ఎంతో పెద్ద పునఃవ్యవస్థీకరణ అవసరమైన మానవ సమాజపు ప్రతిబింబమై ఉన్నాయి

[28వ పేజీలోని బాక్సు]

పరిశుద్ధ లేఖనాల నుండి ఆదరణ

1952 నవంబరులో, డెరిక్‌ బెంట్లే మరియు క్రిస్టఫర్‌ క్రేగ్‌లు ఇంగ్లండ్‌లోని లండన్‌కు సమీపానున్న క్రోయ్‌డన్‌లోని ఒక వేర్‌హౌస్‌ను దోచుకోవడానికి లోపలికి ప్రవేశించారు. బెంట్లేకు 19 సంవత్సరాలు మరి క్రేగ్‌కు 16. పోలీసులను పిలవడం జరిగింది, క్రేగ్‌ ఒక పోలీసును కాల్చి చంపేశాడు. క్రేగ్‌ చెరసాలలో తొమ్మిది సంవత్సరాలు గడిపాడు, అయితే 1953 జనవరిలో బెంట్లేను హత్యా నేరంపై ఉరితీశారు.

బెంట్లే సహోదరి ఐరిస్‌ 40 సంవత్సరాల పాటు తన సహోదరుడు చేయని హత్యా నేరాన్ని అతనిపైనుండి తొలగించేందుకు తీవ్రమైన కృషి చేసింది, ఆ విషయాన్ని గురించి ముమ్మర ప్రచారం చేసింది. మరి 1993లో, సార్వభౌమ పరిపాలనాధికారం శిక్షకు సంబంధించి ఒక క్షమాపణను జారీ చేసి, డెరిక్‌ బెంట్లేను అసలు ఉరితీయకుండా ఉండవలసిందని అంగీకరించింది. లెట్‌ హిమ్‌ హావ్‌ జస్టీస్‌ (ఆయనకు న్యాయం జరగనివ్వండి) అనే పుస్తకంలో ఐరిస్‌ బెంట్లే ఆ కేసును గురించి ఇలా వ్రాసింది:

“ఆ కాల్పులు జరగడానికి ఒక సంవత్సరం ముందు, అతడు వీధిలో ఒక యెహోవాసాక్షిని కలిశాడు . . . సిస్టర్‌ లేన్‌ మేము నివసించే ఫెయిర్‌ వ్యూ రోడ్‌కు కాస్త సమీపంలో నివసించేది, బైబిలు కథలు వినేందుకు ఆమె డెరిక్‌ బెంట్లేను తన ఇంటికి ఆహ్వానించింది. . . . సిస్టర్‌ లేన్‌ వద్ద బైబిలు కథల రికార్డులు ఉండేవి, [డెరిక్‌కు చదవడం అంతగా రాదు గనుక] వినేందుకు ఆమె వాటిని డెరిక్‌కు ఇచ్చింది. . . . అతడు ఇంటికి వచ్చి ఆమె చెప్పిన సంగతులను నాకు చెప్పే వాడు, అంటే మనం మరణించిన తర్వాత తిరిగి జీవిస్తాం వంటి విషయాలు.”

తాను ఉరితీయబడే దినం కొరకు డెరిక్‌ వేచి ఉన్నప్పుడు, ఐరిస్‌ బెంట్లే అతన్ని కలిసేందుకు వచ్చింది. అతడెలా ఉన్నాడు? “సిస్టర్‌ లేన్‌ అతడికి చెప్పిన సంగతులు ఆ చివరి కొన్ని దినాలను సహించేందుకు అతడికి సహాయం చేశాయి.”—ఇటాలిక్కులు మావి.

న్యాయపర పొరపాట్ల మూలంగా మీరు కష్టాలను అనుభవించవలసి వస్తే, బైబిలు సత్యాలను చదివి వాటిని ధ్యానించడం మంచిది. యెహోవా దేవుడు ‘కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఆయన మన శ్రమ అంతటిలో మనలను ఆదరించు’ను గనుక ఇది మనకు ఎంతో ఆదరణను అందించగలదు.—2 కొరింథీయులు 1:3, 4.

[29వ పేజీలోని చిత్రం]

క్రీస్తు మరణ కొయ్యపై వ్రేలాడదీయబడినప్పుడు అత్యంత ఘోరమైన అన్యాయం జరిగింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి