కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/15 పేజీలు 12-16
  • మీరు యెహోవా సంస్థపట్ల మెప్పు కల్గివున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు యెహోవా సంస్థపట్ల మెప్పు కల్గివున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరలోక సైన్యాలను చూసినవాడు
  • వివేచించడానికి పఠించడం
  • అంతర్దృష్టి కొరకు త్రవ్వడం
  • యెషయా చూసినది
  • యెహెజ్కేలు ఏమి చూశాడు?
  • యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు
    నా బైబిలు పుస్తకం
  • ‘యెహోవా, అతని కళ్లు తెరువు’
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/15 పేజీలు 12-16

మీరు యెహోవా సంస్థపట్ల మెప్పు కల్గివున్నారా?

“యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము.”—యెషయా 66:1.

1, 2. (ఎ) యెహోవా సంస్థ యొక్క ఏ దృశ్య రుజువులను మీరు సూచించగలరు? (బి) యెహోవా నివాసం ఎక్కడ?

యెహోవాకు ఒక సంస్థ ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నట్లయితే, దానికి కారణమేమిటి? మీరిలా సమాధానమిస్తుండవచ్చు: ‘మాకొక రాజ్యమందిరం ఉంది. చక్కగా సంస్థీకరించబడిన సంఘమూ పెద్దల సభా మాకున్నాయి. తగినరీతిలో నియమించబడిన, మమ్మల్ని క్రమంగా సందర్శించే ప్రాంతీయ పైవిచారణకర్త మాకున్నాడు. సంస్థీకరింపబడిన సభలకూ సమావేశాలకూ మేము హాజరౌతాము. మా దేశంలో మాకు వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయం ఉంది. నిజంగా, ఇవన్నీ ఇంకా మరెన్నో విషయాలు, పని చేస్తున్న ఒక సంస్థ యెహోవాకు ఉందని నిరూపిస్తున్నాయి.’

2 అలాంటి అంశాలు ఒక సంస్థ ఉందనడానికి రుజువునిస్తాయి. అయితే మనం చూసేది, గుర్తించేది ఇక్కడ భూమిపై ఉన్నది మాత్రమే అయితే, మనం యెహోవా సంస్థను గురించిన పూర్తి అవగాహనను పొందనట్లే. భూమి తన పాదపీఠం మాత్రమే, కానీ ఆకాశము తన సింహాసనమని యెహోవా యెషయాకు చెప్పాడు. (యెషయా 66:1) ఇక్కడ యెహోవా ఏ “ఆకాశము” గురించి మాట్లాడుతున్నాడు? మన వాతావరణం గురించా? వెలుపలి అంతరిక్షం గురించా? లేక ఏదైనా మరితర స్థాయిలోని జీవితం గురించా? కీర్తనల గ్రంథకర్త ఈ ఆకాశమును “తానున్న [యెహోవావున్న] నివాసస్థలము” అని అభివర్ణిస్తున్నాడు. మరియు యెషయా దీనిని పరలోకమని, అంటే యెహోవా యొక్క “మహాగొప్ప పవిత్ర నివాసం” అని అంటున్నాడు. కాబట్టి యెషయా 66:1 నందలి “ఆకాశము,” అదృశ్య ఆత్మ సామ్రాజ్యాన్ని, అంటే పరలోకాన్ని సూచిస్తుంది. దానిలో యెహోవా సర్వోన్నతమైన లేక అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్గివున్నాడు.—కీర్తన 33:13, 14; యెషయా 63:15, పరిశుద్ధ బైబల్‌.

3. మనం సందేహాలను ఎలా నివృత్తి చేసుకోవచ్చు?

3 కాబట్టి, మనం నిజంగా యెహోవా సంస్థను గ్రహించి, దానిపట్ల మెప్పుదలను ప్రదర్శించాలంటే, మనం పరలోకంవైపు చూడాలి. కొంతమందికి ఈ విషయమే ఒక సమస్యగా ఉంటుంది. యెహోవా పరలోక సంస్థ అదృశ్యమైనది గనుక, నిజంగా అది ఉనికిలో ఉందని మనకెలా తెలుస్తుంది? ‘మనమంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం?’ అని అనుకుంటూ కొంతమంది సంశయాత్మకంగా ఉండవచ్చు. విశ్వాసం సందేహాన్ని ఎలా నివృత్తి చేయగలదు? కీలకమైన రెండు మార్గాలేమిటంటే, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా శ్రద్ధగా పఠించడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరై వాటిలో పాల్గొనడం. అప్పుడు సత్యపు వెలుగులో మన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సందేహాలు వ్యక్తం చేసిన ఇతర దేవుని సేవకులు కూడా ఉన్నారు. సిరియా రాజు ఇశ్రాయేలుపై దాడి చేస్తున్న సమయంలో ఎలీషాకు సేవకుడిగా ఉన్న వ్యక్తిని మనం పరిశీలిద్దాం.—పోల్చండి యోహాను 20:24-29; యాకోబు 1:5-8.

పరలోక సైన్యాలను చూసినవాడు

4, 5. (ఎ) ఎలీషా సేవకుడికి ఏ సమస్య ఉంది? (బి) ఎలీషా ప్రార్థనకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

4 సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి రాత్రికి రాత్రే గొప్ప సైన్యాన్ని దోతానుకు పంపించాడు. ఎలీషా సేవకుడు ఉదయాన్నే లేచి, మధ్యప్రాచ్యపు కట్టడమైన తమ మిద్దెమీదికి బహుశ తాజా గాలి కోసం వెళ్లినప్పుడు, ఆయన చూసిన దృశ్యం ఎంత దిగ్భ్రాంతిని కలిగించిందో కదా! గుఱ్ఱాలు, యుద్ధరథాలతో కూడిన సిరియనుల మొత్తం సైన్యం దేవుని ప్రవక్తను పట్టుకోవడానికి పట్టణాన్ని చుట్టుముట్టి వేచివుంది. “అయ్యో, మనం ఇప్పుడేం చెయ్యాలి?” అని సేవకుడు ఎలీషాతో బిగ్గరగా అన్నాడు. “భయపడవద్దు, వారి పక్షం వున్న వారికంటే మన పక్షం వున్నవారే ఎక్కువ మంది” అని ఎలీషా ప్రశాంతంగానూ దృఢవిశ్వాసంతోనూ సమాధానమిచ్చాడని స్పష్టమౌతుంది. ‘వారెక్కడున్నారు? నాకు కనిపించడం లేదే’ అని సేవకుడు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనకు కూడా అదే సమస్య తలెత్తవచ్చు—వివేచనా నేత్రాలతో పరలోక సైన్యాలను చూడలేకపోవడం లేక వివేచించలేకపోవడం.—2 రాజులు 6:8-16, పరిశుద్ధ బైబిల్‌; ఎఫెసీయులు 1:18.

5 తన సేవకుడి కళ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. తర్వాతేం జరిగింది? “యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.” (2 రాజులు 6:17) అవును, అతడు పరలోక సైన్యాన్నీ, దేవుని సేవకుడ్ని కాపాడేందుకు వేచివున్న దేవదూతల సైన్యాన్నీ చూశాడు. అప్పుడు అతడు ఎలీషా దృఢవిశ్వాసాన్ని అర్థం చేసుకోగలిగాడు.

6. యెహోవా పరలోక సంస్థను గూర్చిన అంతర్దృష్టిని మనం ఎలా పొందవచ్చు?

6 ఎలీషా సేవకుడిలాగానే మనకు కూడా కొన్నిసార్లు గ్రహించడం కష్టంగా ఉంటుందా? కొన్ని దేశాల్లో మనల్ని భయపెడుతున్న లేక క్రైస్తవ పరిచర్యకు ముప్పుతెస్తున్న పరిస్థితులకు సంబంధించి, భౌతిక నేత్రాలకు కనపడేదాన్ని మాత్రమే చూసేవారిగా మనం ఉంటున్నామా? అలాగైతే, మనకు జ్ఞానాన్నివ్వడానికి ప్రత్యేకమైన దర్శనం కొరకు మనం ఎదురు చూడవచ్చా? లేదు, ఎందుకంటే ఎలీషా సేవకుడికి లేనిదొకటి మనకుంది. అదే అనేక దర్శనాలతో నిండివున్న పుస్తకమైన బైబిలు. అది మనకు పరలోక సంస్థను గూర్చిన అంతర్దృష్టిని ఇవ్వగలదు. ఆ ప్రేరేపిత వాక్యం, మన ఆలోచనా విధానాన్నీ, మన జీవన విధానాన్నీ చక్కబరుచుకోవడానికి మార్గనిర్దేశక సూత్రాలను కూడా ఇస్తుంది. అయితే, మనం వివేచనను వెదకడానికీ, యెహోవా ఏర్పాట్ల ఎడల మెప్పును పెంపొందింపజేసుకోవడానికీ కృషి చేయాలి. దీన్ని మనం ప్రార్థన, ధ్యానాలతోపాటు వ్యక్తిగత పఠనం ద్వారా చేయవచ్చు.—రోమీయులు 12:12; ఫిలిప్పీయులు 4:6; 2 తిమోతి 3:15-17.

వివేచించడానికి పఠించడం

7. (ఎ) వ్యక్తిగత బైబిలు పఠనానికి సంబంధించి కొంతమందికి ఏ సమస్య ఉండవచ్చు? (బి) వ్యక్తిగత పఠనం ఎందుకు ప్రయాసకు తగిన ప్రతిఫలము?

7 పాఠశాలలో పఠనాన్ని ఎన్నడూ ఆస్వాదించని లేక పఠనం చేయడానికి ఎన్నడూ అవకాశం దొరకని అనేకులకు వ్యక్తిగత పఠనం ఆహ్లాదకరమైన విషయం కాకపోవచ్చు. అయితే, మనం మన వివేచనా నేత్రాలతో యెహోవా సంస్థను గ్రహించి, గుర్తించాలంటే, మనం పఠించాలనే అభిలాషను పెంపొందించుకోవాలి. సిద్ధపాటు లేకుండా మీరు కమ్మని భోజనాన్ని ఆస్వాదించగలరా? కమ్మని భోజనాన్ని తయారు చేయడానికి ఎంతో సిద్ధపాటు అవసరమని ఏ వంటవాడైనా మీకు చెబుతాడు. అయితే, దాన్ని ఆరగించడానికి అరగంటకన్నా ఎక్కువ సమయం పట్టదు. మరోవైపున, వ్యక్తిగత పఠన ప్రయోజనాలు జీవితాంతం నిలిచివుండగలవు. సాధించగల ప్రగతిని మనం చూసినప్పుడు, వ్యక్తిగత పఠన రుచిని మనం ఆస్వాదించనారంభిస్తాము. మనల్ని గూర్చీ మన బోధను గూర్చీ ఎడతెగని జాగ్రత్త కల్గివుండాలనీ, చదువుటయందు జాగ్రత్త కల్గివుండాలనీ అపొస్తలుడైన పౌలు సరిగ్గానే చెప్పాడు. ఎడతెగని కృషి అవసరం; అయితే దానివల్ల కలిగే ప్రయోజనాలు నిరంతరం నిలువగలవు.—1 తిమోతి 4:13-16.

8. సామెతలు ఏ దృక్పథాన్ని సిఫారసు చేస్తున్నాయి?

8 ప్రాచీన కాలానికి చెందిన ఒక జ్ఞాని ఇలా చెప్పాడు: “నా కుమారుడా [లేక, నా కుమారీ], నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు, దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.

9. (ఎ) బంగారం విలువను, “దేవుని గూర్చిన విజ్ఞానము”తో పోలిస్తే ఏమి తేలుతుంది? (బి) ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి మనకు ఏ ఉపకరణాలు అవసరము?

9 కృషి చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉందో మీరు గుర్తిస్తున్నారా? ‘నీవు . . . చేసిన యెడల’ అన్న పదబంధం పదే పదే నొక్కి చెప్పబడింది. ‘దాచబడిన ధనమును వెదకినట్లు వెదకినయెడల’ అనే వాక్యాన్ని గమనించండి. దక్షిణాఫ్రికా, బొలీవియ, మెక్సికో మరితర దేశాల్లో వెండి బంగారాల కొరకు శతాబ్దాలపాటు వెదికిన గని త్రవ్వకందారుల గురించి ఆలోచించండి. అమూల్యమైన లోహాలు లభించే శిలలను త్రవ్వడానికి వాళ్లు పలుగు పారలను ఉపయోగిస్తూ తీవ్రంగా కృషి చేశారు. వాళ్లు బంగారాన్ని ఎంత విలువైనదిగా ఎంచారంటే, అమెరికా నందలి కాలిఫోర్నియాలోని ఒక గనిలో వాళ్లు నిలువుగా 1.5 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న, 591 కిలోమీటర్ల పొడవుగల సొరంగాలను త్రవ్వారు—కేవలం బంగారం కోసమే. అయినా, మీరు బంగారాన్ని తినగలరా? త్రాగగలరా? మీరు ఎడారిలో ఆకలిదప్పులతో చనిపోబోతుంటే అది మిమ్మల్ని సజీవంగా ఉంచగలదా? లేదు, దాని విలువ కృత్రిమమైనది, నిర్హేతుకమైనది, అంతర్జాతీయ మార్కెట్లలో దాని విలువ దిన దినం మారుతుంది. అయినప్పటికీ మనుష్యులు దాని కోసం ప్రాణాలను బలి పెట్టారు. మరి, ఆధ్యాత్మిక బంగారమైన “దేవునిగూర్చిన విజ్ఞానము”ను సంపాదించుకోవడానికి ఇంకా ఎంత ఎక్కువగా కృషి చేయాలి? ఒక్క క్షణం ఆలోచించండి, విశ్వ సర్వోన్నతాధిపతిని గూర్చిన జ్ఞానము, ఆయన సంస్థను గూర్చిన జ్ఞానము, ఆయన సంకల్పాలను గూర్చిన జ్ఞానము! ఈ విషయంలో మనం ఆధ్యాత్మిక పలుగు పారలను ఉపయోగించవచ్చు. అవి, యెహోవా వాక్యాన్ని త్రవ్వి దాని భావాన్ని వివేచించడానికి సహాయం చేసే బైబిలు-ఆధారిత ప్రచురణలు.—యోబు 28:12-19.

అంతర్దృష్టి కొరకు త్రవ్వడం

10. దానియేలు తన దర్శనములో ఏమి చూశాడు?

10 యెహోవా పరలోక సంస్థను గూర్చిన జ్ఞానమును పొందడానికి మనం కొంత ఆధ్యాత్మిక త్రవ్వకాన్ని చేద్దాము. కీలకమైన అంతర్దృష్టి కొరకు మనం, తన సింహాసనంపై కూర్చునివున్న, దానియేలు దర్శనంలోని మహావృద్ధుడ్ని పరిశీలిద్దాం. దానియేలు ఇలా వ్రాస్తున్నాడు: “ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.” (దానియేలు 7:9, 10) యెహోవాకు పరిచారము చేస్తున్న ఈ వేవేలకొలది మంది ఎవరు? “పార” మరియు “పలుగుల” వలె ఉపయోగపడే నూతన లోక అనువాదము (ఆంగ్లం) నందలి మార్జినల్‌ రిఫరెన్సులు మనల్ని కీర్తన 68:17 మరియు హెబ్రీయులు 1:14 వంటి రెఫరెన్సుల వద్దకు తీసుకు వెళతాయి. అవును, పరిచారము చేస్తున్న వారు పరలోక దేవదూతలే!

11. ఎలీషా మాటలను అర్థం చేసుకోవడానికి దానియేలు దర్శనం మనకెలా సహాయం చేయగలదు?

11 దేవుని అధీనంలోవున్న నమ్మకమైన దేవదూతలనందరినీ ఆయన చూశాడని దానియేలు వృత్తాంతం చెప్పడం లేదు. ఇంకా కోటానుకోట్లమంది ఉండవచ్చు. కాని, “వారి పక్షంవున్న వారికంటె మన పక్షం వున్నవారే ఎక్కువమంది” అని ఎలీషా ఎందుకు చెప్పగలిగాడో మనం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తించవచ్చు. సిరియా రాజు సైన్యానికి అవిశ్వాసులైన దేవదూతల, అంటే దయ్యాల మద్దతు ఉన్నప్పటికి, యెహోవా పరలోక సైన్యము వారిని మించిపోయింది.—కీర్తన 34:7; 91:11.

12. దేవదూతల గురించి మీరు ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకోగల్గుతారు?

12 ఈ దేవదూతల గురించి బహుశ మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, అంటే యెహోవా సేవలో వారు నిర్వర్తించే పాత్ర గురించి తెలుసుకోవాలని కోరుకోవచ్చు. దేవదూత కొరకైన గ్రీకు పదాన్ని బట్టి, వారు సందేశకులు అని మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే దానికి “సందేశకుడు” అనే భావం కూడా ఉంది. కాని వారు నిర్వర్తించవలసిన ఇతర విధులు కూడా చాలా ఉన్నాయి. అయితే అవేమిటో తెలుసుకోవడానికి, మీరు త్రవ్వాలి. మీ వద్ద లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఉంటే, మీరు “దేవదూతలు” అనే శీర్షికను చదవవచ్చు, లేక కావలికోట నందలి గత శీర్షికలలో దేవదూతల గురించిన శీర్షికలను పరిశీలించవచ్చు. దేవుని ఈ పరలోక సేవకుల గురించి మీరు ఎంత తెలుసుకోగలరో చూసి మీరు ఆశ్చర్యచకితులైపోతారు, వారి మద్దతుపట్ల మెప్పును చూపించనారంభిస్తారు. (ప్రకటన 14:6, 7) అయితే, దేవుని పరలోక సంస్థలో, కొంతమంది ఆత్మ ప్రాణులు ప్రత్యేకమైన సంకల్పాలను నెరవేరుస్తారు.

యెషయా చూసినది

13, 14. యెషయా తన దర్శనములో ఏమి చూశాడు, ఇది ఆయనను ఎలా ప్రభావితం చేసింది?

13 ఇప్పుడు మనం యెషయా దర్శనంలో కొంత త్రవ్వుదాము. 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదివినప్పుడు మీరు చాలా ప్రభావితులౌతారు. “సింహాసనమందు ప్రభువు [“యెహోవా,” NW] ఆసీనుడైయుండగా నేను చూచితిని” మరియు “ఆయనకుపైగా సెరాపులు నిలిచియుండిరి” అని యెషయా చెబుతున్నాడు. వారు యెహోవా మహిమను ప్రకటిస్తున్నారు, ఆయన పరిశుద్ధతను స్తుతిస్తున్నారు. ఈ వృత్తాంతాన్ని చదివినప్పుడు మీరు కూడా ప్రభావితమౌతారు. యెషయా ప్రతిస్పందన ఏమిటి? “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.” ఈ దర్శనాన్నిబట్టి ఆయనెంతగా ప్రభావితుడయ్యాడో గదా! మరి మీరు?

14 అయితే ఈ మహిమాన్విత దృశ్యాన్ని చూసి యెషయా ఎలా తాళుకున్నాడు? ఒక సెరాపు తనను కాపాడడానికి వచ్చి, “నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను” అని చెప్పాడని ఆయన వివరిస్తున్నాడు. (యెషయా 6:7) యెషయా దేవుని దయను విశ్వసించి, యెహోవా మాటలకు అవధానమివ్వగలిగాడు. ఈ ఉన్నత స్థాయి ఆత్మ ప్రాణుల గురించి మరింత తెలుసుకోవాలని మీరు కోరుకోవడం లేదా? అయితే మీరేమి చేయాలి? మరింత సమాచారం కొరకు త్రవ్వండి. ఉపయోగించదగిన ఒక ఉపకరణం ఏమిటంటే, వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌. దాని రెఫరెన్సులు, స్పష్టపరిచే సమాచారపు అనేక మూలములకు నడిపిస్తాయి.

యెహెజ్కేలు ఏమి చూశాడు?

15. యెహెజ్కేలు దర్శనం నమ్మదగినదని ఏది సూచిస్తుంది?

15 తర్వాత మనం మరో విధమైన ఆత్మ ప్రాణులను పరిశీలిద్దాము. యెహెజ్కేలు బబులోనులో బందీగా ఉన్నప్పుడే ఒక ప్రేరణాత్మకమైన దర్శనాన్ని చూసే ఆధిక్యతను పొందాడు. మీ బైబిలును యెహెజ్కేలు 1వ అధ్యాయం, మొదటి మూడు వచనాలకు తెరవండి. ఆ వృత్తాంతం ఎలా ప్రారంభమౌతుంది? అది, ‘అనగనగా ఒకప్పుడు, ఒక సుదూర దేశంలో . . . ’ అని చెబుతుందా? లేదు, అది పురాణగాథల కాలానికి చెందిన అభూత కల్పన కాదు. 1వ వచనం ఇలా చెబుతుంది: “ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.” ఈ వచనం గురించి మీరు ఏమి గమనించారు? అది ఖచ్చితమైన తారీఖును, నిర్దిష్టమైన స్థలాన్ని తెలియజేస్తుంది. ఈ వివరాలు రాజైన యెహోయాకీను చెరపట్టబడిన ఐదవ సంవత్సరాన్ని అంటే సా.శ.పూ. 613వ సంవత్సరాన్ని సూచిస్తున్నాయి.

16. యెహెజ్కేలు ఏమి చూశాడు?

16 యెహోవా హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చింది, పూర్తిగా కళ్లతో నిండివున్న పెద్ద చక్రాలుగల అతిపెద్ద పరలోక రథంపైన యెహోవా ఒక సింహాసనంపై కూర్చునివున్న భీతిగొల్పే దర్శనాన్ని ఆయన చూడనారంభించాడు. ఇక్కడ మనకు ఆసక్తికరమైన వివరణ ఏమిటంటే, ఒక్కొక్క చక్రం వద్ద ఒక్కొక్కటి చొప్పున నాలుగు జీవులు నిలబడివుండడం. “వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు. . . . ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.”—యెహెజ్కేలు 1:5, 6, 10.

17. కెరూబుల నాలుగు ముఖాలు వేటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?

17 ఈ నాలుగు జీవులు ఏమైవుండెను? అవి కెరూబులని యెహెజ్కేలే మనకు చెబుతున్నాడు. (యెహెజ్కేలు 10:1-3, 14) వాటికి నాలుగు ముఖములు ఎందుకున్నాయి? సర్వోన్నత ప్రభువైన యెహోవా యొక్క నాలుగు విశేషమైన గుణాలకు ప్రాతినిధ్యం వహించడానికే. పక్షిరాజు ముఖము దూరదృష్టితో కూడిన జ్ఞానానికి చిహ్నం. (యోబు 39:27-29) ఎద్దు ముఖము దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? దాని మెడ, భుజాల్లోవున్న విపరీతమైన బలంతో, పోరాడే ఎద్దు గుఱ్ఱాన్నీ దాని రౌతునూ కూడా గాలిలోకి విసిరివేయగలదని ప్రతీతి. ఖచ్చితంగా, ఎద్దు యెహోవా యొక్క అపరిమితమైన బలానికి చిహ్నం. సింహం ధైర్యవంతమైన న్యాయానికి చిహ్నంగా ఉపయోగించబడుతుంది. చివరగా, మానవ ముఖం దేవుని ప్రేమను తగినవిధంగా సూచిస్తుంది, ఎందుకంటే ఈ లక్షణాన్ని వివేకవంతంగా ప్రదర్శించగల ఏకైక భూసంబంధ జీవి మానవుడు మాత్రమే.—మత్తయి 22:37, 39; 1 యోహాను 4:8.

18. పరలోక సంస్థను గూర్చిన మన అవగాహనకు అపొస్తలుడైన యోహాను మరింత ఎలా జతచేస్తున్నాడు?

18 దృశ్యాన్ని పూర్తి చేయడానికి మనకు సహాయం చేసే ఇతర దర్శనాలు కూడా ఉన్నాయి. బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథంలో చెప్పబడిన యోహాను దర్శనాలు వాటిలో ఇమిడివున్నాయి. యెహెజ్కేలులా ఆయన, యెహోవా మహిమకరమైన సింహాసనంపై కూర్చునివుండగా, ఆయన వద్ద కెరూబులు ఉండడాన్ని చూశాడు. కెరూబులు ఏమి చేస్తున్నాయి? యెషయా 6వ అధ్యాయంలోని సెరాపుల ప్రకటనలను అవి, “భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు [“యెహోవా,” NW] పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని ప్రతిధ్వనింపజేస్తున్నాయి. (ప్రకటన 4:6-8) సింహాసనం ప్రక్కన గొఱ్ఱెపిల్ల ఉండడాన్ని కూడా యోహాను చూశాడు. అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? దేవుని గొఱ్ఱెపిల్ల అయిన యేసుక్రీస్తుకు.—ప్రకటన 5:13, 14.

19. ఈ పఠనం ద్వారా, యెహోవా సంస్థ గురించి మీరు ఏమి గ్రహించారు?

19 కాబట్టి ఈ దర్శనాల ద్వారా, మనం ఏమి గ్రహించాము? పరలోక సంస్థలో యెహోవా దేవుడు అత్యుచ్ఛ స్థానంలో ఉన్నాడనీ ఆయన తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడనీ, ఆయనతోపాటు గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు ఉన్నాడనీ, ఆయనే వాక్యము లేక లోగోస్‌ అయ్యున్నాడనీ గ్రహించాము. తర్వాత మనం సెరాపులు మరియు కెరూబులతోపాటు పరలోక దేవదూతల సైన్యాన్ని చూశాము. యెహోవా సంకల్పాలను నెరవేరుస్తున్న అతిపెద్ద, ఐక్య సంస్థలో వారు భాగమైయున్నారు. ఆ సంకల్పాలలో ఒకటి ఈ అంత్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడం.—మార్కు 13:10; యోహాను 1:1-3; ప్రకటన 14:6, 7.

20. తరువాతి శీర్షికలో ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడుతుంది?

20 చివరిగా, సర్వోన్నత ప్రభువు యొక్క చిత్తాన్ని ఎలా చేయాలనేది నేర్చుకోవడానికి తమ రాజ్యమందిరాల్లో సమకూడుతున్న యెహోవాసాక్షులు భూమిపై ఉన్నారు. ఖచ్చితంగా, సాతానుతోనూ సత్యానికి శత్రువులైనవారితోనూ ఉన్నవారికంటే మనతో ఉన్నవారు ఎక్కువమందని మనమిప్పుడు గ్రహించవచ్చు. ప్రశ్నేమిటంటే, రాజ్యసువార్త ప్రకటనకు పరలోక సంస్థకు ఉన్న సంబంధమేమిటి? తరువాతి శీర్షిక దాన్నీ మరితర విషయాలనూ పరిశీలిస్తుంది.

పునఃసమీక్షా ప్రశ్నలు

◻ యెహోవా సంస్థపట్ల మెప్పు కల్గివుండడానికి మనం ఏమి గ్రహించాలి?

◻ ఎలీషా సేవకుడికి ఏ అనుభవం కలిగింది, ప్రవక్త అతనిని ఎలా ప్రోత్సహించాడు?

◻ వ్యక్తిగత పఠనాన్ని మనం ఎలా దృష్టించాలి?

◻ దానియేలు, యెషయా, యెహెజ్కేలు పరలోక సంస్థను గురించిన ఏ వివరాలను ఇచ్చారు?

[13వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగత పఠనం యొక్క ప్రయోజనాలు, చక్కగా సిద్ధం చేయబడిన భోజనం కంటే ఎంతో ఎక్కువైనవి

[15వ పేజీలోని చిత్రం]

ఎలీషా ప్రార్థనకు యెహోవా ఇచ్చిన సమాధానమే పరలోక సైన్యాన్ని గూర్చిన దర్శనం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి