ఎంతో ప్రత్యేకమైన వివాహ వేడుక
మొజాంబిక్‌కు ఉత్తరాన, చుట్టూ అందమైన పర్వతాలతో, పచ్చని తివాచీ పరిచినట్టుగా ఏపుగా పెరిగిన గడ్డితో, పచ్చని చెట్లుగల ఒక లోయ ఉంది. ఆ పర్వతాల్లో కొన్ని రాళ్లూ గుట్టలుగలవిగా ఉంటే మిగతావి పచ్చని చెట్లతో కప్పినట్లున్నాయి. ఫిన్‌గోయి అనే గ్రామం ఇక్కడే వుంది. ప్రశాంతమైన శీతాకాల రాత్రుల్లో, నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమిణుకు మంటుంటాయి, పుచ్చపువ్వులాంటి వెన్నెల వెలుగులో గ్రామస్థుల గడ్డి గుడిసెలు వింత శోభతో మెరుస్తున్నట్లున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఒక ప్రత్యేకమైన వివాహ వేడుక జరిగింది.
వందలాది మంది ప్రజలు, ఈ ప్రత్యేక వేడుకకు హాజరయ్యేందుకు గంటల కొద్దీ, కొందరైతే దినాలతరబడి నడిచి వచ్చి అక్కడికి చేరుకున్నారు. కొందరు సివంగులూ, సింహాలూ ఏనుగులు తిరుగాడే, బంజరుగా ఉన్న ఎంతో ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుని వచ్చారు. తమ వ్యక్తిగత వస్తువులే కాకుండా చాలామంది సందర్శకులు కోళ్లూ, మేకలూ కూరగాయలను తమతోపాటూ తీసుకువచ్చారు. గ్రామం చేరుకున్న తర్వాత, సాధారణంగా క్రైస్తవ సమావేశాల కొరకు ఉపయోగించే ఒక ఆరుబయలు ప్రాంతంలోకి అందరూ వెళ్లారు. ప్రయాణ బడలికతో ఉన్నా, వాళ్లు ఆనందంగా ఉన్నారు, మరి చిరునవ్వులు చిందిస్తున్న వాళ్ల ముఖాలు జరుపుకోబోయే వేడుక కొరకు వారు ఆతురతతో ఎదురు చూస్తున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
వివాహం చేసుకోబోతున్న వాళ్లు ఎవరు? చాలామందే ఉన్నారు! అవును, డజన్ల కొద్దీ దంపతులు ఉన్నారు. వీళ్లు ఏదో సంచలనాత్మకమైన సామూహిక వివాహ వేడుకలో భాగం కాదు. బదులుగా, వాళ్లు రిజిస్ట్రారు కార్యాలయానికి ఎంతో దూరంలో ఉండే సుదూర ప్రాంతాల్లో జీవిస్తున్నందున, తమ వివాహాలను మునుపు రిజిస్టరు చేయించుకోలేక పోయిన యథార్థవంతులైన, మంచి ప్రవర్తనగల దంపతులు. ఈ దంపతులందరూ యెహోవాసాక్షులతో బైబిలును పఠించిన తర్వాత వివాహం విషయంలో దైవిక ప్రమాణాలు ఏమిటో తెలుసుకున్నారు. యేసు జనన సమయంలోని నమోదు చేయించుకోవలసిన అవసరతల విషయంలో యోసేపు మరియలు ఎలా విధేయతను చూపించారో అదే విధంగా, వీరు కూడా వివాహానికి ఆరంభకుడైన తమ సృష్టికర్తను ప్రీతిపర్చేందుకు తాము ఆ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వివాహం చేసుకోవలసిన అవసరత ఉందని తెలుసుకున్నారు.—లూకా 2:1-5.
ఆ సందర్భం కొరకు సిద్ధపాటు
మొజాంబిక్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం సహాయం చేయాలని తీర్మానించుకుంది. మొదట, చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఆ దేశం యొక్క రాజధానియైన మపూటోలోని న్యాయ మరియు ఆంతరంగిక ప్రభుత్వశాఖలను సంప్రదించడం జరిగింది. దాని తర్వాత, టేటే ప్రావిన్స్ యొక్క రాజధాని నగరంలోని మిషనరీలు అదనపు ఏర్పాట్లు చూసుకునేందుకు స్థానిక అధికారులను కలుసుకున్నారు. మిషనరీలూ మరియు నోటరీ, పౌర గుర్తింపు శాఖ అధికారులూ ఫిన్‌గోయి గ్రామానికి ప్రయాణం చేసి వచ్చేందుకు ఒక తేదీని నిర్ణయించారు. ఈలోపు, ఆ వేడుకలో ఇమిడివున్న సంఘాలకన్నింటికీ సూచనలనిస్తూ వివరణలుగల ఒక ఉత్తరాన్ని బ్రాంచి కార్యాలయం పంపించింది. సాక్షులూ, స్థానిక అధికారులూ కూడా ఈ ప్రత్యేక సందర్భం కొరకు ఆతురతతో ఎదురు చూశారు.
1997 మే 18 ఆదివారం నాడు, ప్రభుత్వ అధికారులతో పాటు ముగ్గురు మిషనరీలు ఫిన్‌గోయి చేరుకున్నారు. పరిపాలనా భవంతి ప్రక్కనే అధికారుల కొరకు స్థానిక అధికారులు మంచి సౌకర్యవంతమైన వసతిని సిద్ధం చేశారు. అయితే, సందర్శిస్తున్న అధికారులు యెహోవాసాక్షుల ఆతిథ్యాన్నిబట్టి ఎంతగా ఆనందించారంటే, వాళ్లు మిషనరీలు ఉంటున్న కాస్త మెరుగులు దిద్దబడిన గుడిసెల్లో వాళ్లతోపాటూ బస చేసేందుకే ఇష్టపడ్డారు. వంట చేస్తున్న వాళ్లలో ఒకతను స్థానిక సంఘంలోని పెద్ద అనే విషయాన్నీ మరియు వివాహం కొరకు సిద్ధపాట్లు చేయడంలో ఎంతో తక్కువరకం పనులని భావించే పనులను చేస్తున్న స్వచ్ఛంద సేవకుల్లో ఒక ప్రయాణ పైవిచారణకర్త కూడా ఉన్నాడనే విషయాన్నీ తెలుసుకుని వాళ్లెంతో ఆశ్చర్యపోయారు. ఏమీ ఫిర్యాదు చేయకుండా, చాలా మామూలుగా ఉన్న గుడిసెలో నివసించిన, చిన్న రేకు క్యాన్‌ను ఉపయోగించి స్నానం చేసిన మిషనరీల ఎంతో హాస్య మనోభావాన్ని కూడా వాళ్లు గమనించారు. అలాంటి విభిన్నమైన పూర్వ చరిత్రలుగల ప్రజలు అంత పటిష్ఠమైన సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉండటాన్ని వాళ్లు ఇంతకు మునుపెన్నడూ చూడలేదు. అయితే, ఆ దేశ చట్టానికి తగిన విధంగా ఉండేందుకూ దేవుని ఏర్పాట్లకు తగిన విధంగా ఉండేందుకూ వాళ్లు ఎంతో గొప్ప త్యాగాలు చేయడంలో తమ విశ్వాసాన్ని ప్రదర్శించడమే వాళ్లను ఎక్కువగా ప్రభావితం చేసింది.
ఒక ఆనందకర సందర్భం
జంటలు ఆ ప్రాంతానికి చేరుకుంటుండగా, వాళ్లు వివాహం యొక్క మొదటి రంగం కొరకు సిద్ధపడ్డారు: అది తమ జన్మ ధృవీకరణపత్రం తీసుకోవడం. తమ వ్యక్తిగత డేటాను అందించేందుకు అందరూ పౌర రిజిస్ట్రీ జట్టు ఎదురుగా ఎంతో ఓపికగా వరసకట్టి నిలుచున్నారు. తర్వాత వాళ్లు తమ ఫోటోలు తీయించుకునేందుకు మరొక వరుసలో నిలబడటం ప్రారంభించారు, దాని తర్వాత వాళ్లు తమ గుర్తింపు కార్డులను తీసుకునేందుకు పౌర గుర్తింపు శాఖ నుండి వచ్చిన జట్టు ఎదుటకు వెళ్లారు. తర్వాత, తాము ఎంతగానో ఎదురుచూసిన తమ వివాహ ధృవీకరణపత్రాన్ని సిద్ధం చేయించుకునేందుకు పౌర రిజిస్ట్రీ జట్టు వద్దకు వచ్చారు. దీని తర్వాత, లౌడ్‌స్పీకర్‌లో తమ పేర్లు పిలిచేంత వరకూ వాళ్లు ఓపికగా ఎదురుచూశారు. వివాహ ధృవీకరణపత్రాలను తీసుకోవడం ఎంతో భావోద్రేకపరమైన దృశ్యంగా ఉంది. జంటలు తమ వివాహ ధృవీకరణపత్రాన్ని ఒక అమూల్యమైన ట్రోఫీ వలె పైకి ఎత్తిపట్టి చూపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇదంతా కూడా తీవ్రమైన ఎండలో జరిగింది. అయినప్పటికీ, ఎండా, దుమ్మూ ఆ సందర్భంలోని ఆనందాన్ని తగ్గించలేకపోయాయి.
పురుషులు కోట్లు వేసుకుని టైలు కట్టుకుని చూడ ముచ్చటగా తయారయ్యారు. స్త్రీలు తమ పారంపర్య పద్ధతిలో ముస్తాబయ్యారు, ముదురు రంగులు ఉండే కపూలూన అని పిలువబడే పొడవైన బట్టను వాళ్లు తమ నడుములకు చుట్టూ కట్టుకున్నారు. కొందరు అదే విధమైన బట్టను తమ పిల్లలకు చుట్టి వాళ్లను ఎత్తుకుని ఉన్నారు.
పనంతా సవ్యంగా సాగింది, అయితే అందరివీ ఒక దినంలోనే జరిగేందుకు వీలు కుదరలేదు. అయితే చీకటి పడినప్పుడు, ప్రభుత్వ అధికారులు దయతో మిగతా దంపతుల పని కూడా పూర్తి చేయాలని తీర్మానించుకున్నారు. అక్కడికి వచ్చేందుకు వాళ్లు అంత త్యాగం చేసినందుకు మేము “మా సహోదరులను” ఎలా వదిలి వెళ్లగలమని ఆ అధికారులన్నారు. ఈ విధమైన సహకార స్ఫూర్తినీ స్వయం త్యాగ స్ఫూర్తినీ ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాము.
రాత్రి అయ్యే సరికి తీవ్రమైన చలి ప్రారంభమైంది. కొద్దిమందికి గుడిసెల్లో వసతి లభించినప్పటికీ, చాలామంది జంటలు బయట మంటల చుట్టూ ముడుచుకుని కూర్చోవలసి వచ్చింది. ఆ సందర్భంలోని ఆనందాన్ని ఈ చలి తగ్గించలేక పోయింది. నవ్వుల, పాటల శబ్దాలు మంటల చిటపట శబ్దాలను మించిపోయాయి, వాళ్లు నాలుగు భాగాల హార్మనీ రీతిలో పాట పాడారు. అనేకులు తమ ప్రయాణంలో ఎదురైన సంగతులను వినిపించారు, అలా చేస్తూ వాళ్లు తాము అప్పుడే అందుకున్న ధృవీకరణపత్రాలను ఆనందంతో గట్టిగా పట్టుకున్నారు.
తెల్లవారినప్పుడు కొందరు తమ కోళ్లనూ, మేకలనూ, కూరగాయలనూ అమ్మేందుకు గ్రామంలోకి వెళ్లారు, ఆ వచ్చిన డబ్బును వాళ్లు తమ వివాహాన్ని రిజిస్టరు చేసుకునేందుకు అయిన ఖర్చులకు చెల్లిస్తారు. అనేకులు ఆ జంతువుల అసలు ధరకంటే చాలా తక్కువకు వాటిని అమ్మడం ద్వారా వాస్తవంగానే వాటిని “బలి” అర్పించారు. పేద ప్రజలకు ఒక మేక ఎంతో ప్రశస్తమైన మరియు ఖరీదైన వస్తువు; అయినప్పటికీ వివాహం చేసుకుని తమ సృష్టికర్తను ప్రీతిపర్చేందుకు వాళ్లు ఈ త్యాగాలు చేసేందుకు సుముఖత చూపారు.
ప్రయాణ ఒడుదుడుకులు
కొందరు దంపతులు అక్కడికి చేరుకునేందుకు చాలా దూరాలు నడిచి వచ్చారు. షంబోకో, ఆయన భార్య హకూలీర అలాగే వచ్చారు. వాళ్లు రెండవ రాత్రి మంటల వద్ద తమ కాళ్లు వెచ్చబెట్టుకుంటూ తమ కథను చెప్పారు. ఆయనకు 77 సంవత్సరాలు ఉన్నప్పటికీ, ఒక కన్ను లేకుండా మంచి కనుదృష్టి లేకున్నప్పటికీ, షంబోకో తన సంఘం తనతో పాటూ వస్తుండగా తమ 52 సంవత్సరాల కలయికను చట్టబద్ధం చేసుకునేందుకు మూడు దినాలు ఉత్తి కాళ్లతో నడుచుకుంటూ వచ్చాడు.
72 సంవత్సరాల అన్సెల్‌మూ కెమ్‌బో నెరీతో ఇప్పటికే 50 సంవత్సరాలు కలిసి జీవించాడు. తాను ప్రయాణం ప్రారంభించేందుకు కొన్ని దినాల ముందు, తన తోటలో పని చేస్తుండగా ఆయన కాలికి ఒక పెద్దముల్లు గుచ్చుకుని తీవ్రమైన గాయమైంది. చికిత్స కొరకు ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి త్వరగా తీసుకెళ్లారు. అయినప్పటికీ, తాను ఈ ప్రయాణం చేయాలని ఆయన తీర్మానించుకున్నాడు, మరి ఫిన్‌గోయి గ్రామానికి కుంటుకుంటూ నడుస్తూ వస్తుంటే ఆయన కాలికి ఎంతో నొప్పి కలిగింది. అందువల్ల మూడు రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది. అన్‌సెల్‌మూ తన వివాహ ధృవీకరణపత్రాన్ని పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు.
ఇప్పుడు వివాహం చేసుకున్న వారిలో మరొక గణనీయమైన వ్యక్తి ఎవాన్స్ సినాయియా, ఆయన పూర్వం బహుభార్యాత్వాన్ని అవలంబించాడు. ఆయన దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన తన మొదటి భార్యతో తన కలయికను చట్టబద్ధం చేసుకోవాలని తీర్మానించుకున్నాడు, అయితే ఆమె అందుకు నిరాకరించి, ఆయన్ను విడిచిపెట్టి వేరొక వ్యక్తితో వెళ్లిపోయింది. అయితే ఆయన రెండవ భార్య కూడా బైబిలు పఠనం చేస్తూ ఉంది, ఆమె ఆయనను వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. వాళ్లు ఇద్దరూ కూడా సింహాలూ ఇతర అడవి మృగాలు ఉండే ఎంతో ప్రమాదకరమైన ప్రాంతంగుండా నడుచుకుంటూ వచ్చారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత, వాళ్లు కూడా చట్టబద్ధంగా వివాహితులవ్వడంలో సఫలీకృతులు అయ్యారు.
శుక్రవారం నాడు, అంటే మిషనరీలూ అధికారులూ అక్కడికి చేరుకున్న ఐదు రోజుల తర్వాత, ఆ పని పూర్తిగా ముగిసింది. దాని ఫలితంగా 468 గుర్తింపు కార్డులూ, 374 జన్మ ధృవీకరణపత్రాలూ ఇవ్వబడ్డాయి. జారీ చేయబడిన వివాహ ధృవీకరణపత్రాల సంఖ్య 233! ఆ వాతావరణం అత్యానందంతో నిండి పోయింది! బాగా అలసిపోయినప్పటికీ, అందరూ అది యుక్తమైనదేనని అంగీకరించారు. అందులో ఇమిడి ఉన్న వారందరి హృదయాల్లో మనస్సుల్లో ఈ సందర్భం చెరగని ముద్రవేసిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది నిజంగానే ఎంతో ప్రత్యేకమైన వివాహవేడుక!