యెహోవా సంస్థ మీ పరిచర్యకు మద్దతునిస్తుంది
“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు . . . ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.”—ప్రకటన 14:6.
1. యెహోవాసాక్షులు ఎలా పరీక్షించబడ్డారు, వాళ్లు ఎందుకు తప్పించుకున్నారు?
క్రైస్తవ పరిచర్యకు మద్దతునివ్వడంలో యెహోవా పరలోక సంస్థ నిర్వర్తిస్తున్న పాత్రను గుర్తించడం ఎందుకంత ప్రాముఖ్యమైనది? సరే ఇది చూడండి, యెహోవాసాక్షులు యెహోవా పరలోక సైన్యాల మద్దతు లేకుండా ప్రతికూలంగావున్న లోకమంతటిలో దేవుని రాజ్యసువార్తను ప్రకటించగల్గి ఉండేవారా? విపరీతమైన జాతివాదం, ఏకపక్ష ప్రభుత్వ రాజకీయ విధానాలు, ప్రపంచ యుద్ధాలు, ఇంకా వివిధ ప్రతికూల పరిస్థితుల్లో సాక్షులు అలాంటి ప్రకటనా పనిని కొనసాగించారు. యెహోవా సహాయం లేకుండా సాక్షులు జాత్యభిమానపు అంతర్జాతీయ అడ్డంకు, పక్షపాతం, తరచూ తమకు వ్యతిరేకంగా రేకెత్తిన దౌర్జన్యపూరితమైన హింస వంటి వాటిని తాళుకుని జీవించగలిగేవారా?—కీర్తన 34:7.
ప్రపంచవ్యాప్త వ్యతిరేకత ఉన్నా తాళుకుని నిలువడం
2. మొదటి శతాబ్దపు నిజ క్రైస్తవులకూ నేటి నిజ క్రైస్తవులకూ ఏ సాదృశ్యం ఉంది?
2 ఈ ఇరవయ్యవ శతాబ్దంలో, మతసంబంధ మరియు రాజకీయ శత్రువులు యెహోవా పనిని ఆటంకపర్చడానికి లేక అణచివేయడానికి సాధ్యమైన చట్టపరమైన లేక మరితరమైన ప్రతీ అవాంతరాన్నీ కలుగజేశారు. క్రైస్తవ సహోదర సహోదరీలు హింసించబడ్డారు, తప్పుగా చిత్రించబడ్డారు, దూషించబడ్డారు, అపనిందలపాలయ్యారు—చివరికి అనేకులు చంపబడ్డారు కూడా—ఇదంతా తరచూ మహాబబులోనుకు చెందిన మతనాయక వర్గపు ప్రోద్బలంతోనే జరిగింది. తొలి క్రైస్తవుల విషయంలోలాగానే, “ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు” అని చెప్పవచ్చు. క్రీస్తు కాలంలోని యూదా మతనాయక వర్గం ఆయన పరిచర్యను ఆపడానికి అదేపనిగా ప్రయత్నించినట్లుగానే, మతనాయకులు మరియు మతభ్రష్టులైనవారు తమ రాజకీయ జతగాళ్లతో కలిసి యెహోవా ప్రజల గొప్ప విద్యా సాక్ష్యపు పనిని అణచివేయడానికి ప్రయత్నించారు.—అపొస్తలుల కార్యములు 28:22; మత్తయి 26:59, 65-67.
3. హెన్రికా జుర్ చూపించిన యథార్థత నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
3 పోలండ్‌లో 1946 మార్చి 1న జరిగినదాన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. కెల్మ్ సమీపంలోని హెన్రికా జుర్ అనే 15 ఏళ్ల అమ్మాయి సాక్షియైన మరో సహోదరునితో కలిసి సమీపంలోని గ్రామంలో ఆసక్తిగల ప్రజలను దర్శించడానికి వెళ్లింది. నారడోవె షీవి బ్రోన్ (జాతీయ సాయుధ దళం) అని పిలువబడే క్యాథలిక్ సైనిక జట్టుకు చెందిన సభ్యులు వారిని బంధించి తీసుకెళ్లారు. సహోదరుడ్ని తీవ్రంగా కొట్టారు, కాని ఆయన సజీవంగా తప్పించుకోగలిగాడు. అది హెన్రికాకు సాధ్యం కాలేదు. క్యాథలిక్ చిహ్నమైన సిలువ గుర్తును వేసుకోమని వారు ఆమెను బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తూ, ఆమెను అనేక గంటలపాటు భయంకరంగా హింసించారు. ఆమెను హింసిస్తున్నవారిలో ఒకరు ఇలా అన్నారు: “మనస్సులో నీ ఇష్టమొచ్చింది అనుకో, కేవలం క్యాథలిక్ చిహ్నమైన సిలువను మాత్రం వేసుకో. లేకపోతే నీకోసం బులెట్ ఎదురు చూస్తుంది!” ఆమె తన యథార్థత విషయంలో బలహీనమయ్యిందా? లేదు. మత పిరికిపందలు ఆమెను దగ్గరలోని అడవిలోకి లాక్కెళ్లి కాల్చేశారు. అయినప్పటికీ, ఆమె విజయం సాధించింది! ఆమె తన యథార్థతను కోల్పోయేలా చేయడంలో వాళ్లు విఫలమయ్యారు.a—రోమీయులు 8:35-39.
4. రాజ్యప్రకటన పనిని అణచివేయడానికి రాజకీయ మరియు మత శక్తులు ఎలా ప్రయత్నించాయి?
4 వందేళ్లకుపైగా దేవుని ఆధునిక-దిన సేవకులు కఠినంగా, అగౌరవంగా వ్యవహరించబడ్డారు. యెహోవాసాక్షులు సాతాను యొక్క ప్రధాన మతాలలో భాగం కాదు గనుకా, భాగమై ఉండడానికి ఇష్టపడరు గనుకా, వారు పక్షపాతంతో కూడిన ఏ విమర్శకుడికైనా లేక ఉన్మాదంతో కూడిన ఏ వ్యతిరేకికైనా సులభంగా బలికాదగిన వారిగా దృష్టించబడుతున్నారు. రాజకీయ శక్తులు వారిపై క్రూరంగా దాడి చేశాయి. అనేకమంది సాక్షులు తమ విశ్వాసాన్నిబట్టి హతసాక్షులయ్యారు. ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకుంటున్న దేశాలు కూడా సువార్త ప్రకటనను అణచివేయడానికి ప్రయత్నించాయి. పూర్వం 1917లో, కెనడా అమెరికాలలో బైబిలు విద్యార్థులు విద్రోహక చర్యలు చేపడుతున్నారని మతనాయకులు వారిపై నిందారోపణ చేశారు, అప్పట్లో సాక్షులు బైబిలు విద్యార్థులని పిలువబడేవారు. వాచ్‌టవర్ సొసైటీ అధికారులు అన్యాయంగా జైల్లో వేయబడ్డారు కాని ఆ తర్వాత నిర్దోషులుగా నిరూపించబడ్డారు.—ప్రకటన 11:7-9; 12:17.
5. యెహోవా సేవకులకు ఏ మాటలు ప్రోత్సాహకంగా పనిచేశాయి?
5 క్రీస్తు సహోదరుల, యథార్థవంతులైన వారి సహవాసుల సాక్ష్యపు పనిని ఆపడానికి ప్రయత్నించడంలో సాతాను తనకు అందుబాటులో ఉన్న మాధ్యమాలనన్నింటినీ ఉపయోగించాడు. అయినప్పటికీ, ఎన్నో అనుభవాలు చూపిస్తున్నట్లుగా, బెదిరింపులు, జడిపింపులు, శారీరక దౌర్జన్యం, జైళ్లు, కాన్సంట్రేషన్ క్యాంపులు, చివరికి మరణం కూడా యెహోవాసాక్షులను ఆపలేకపోయాయి. చరిత్రంతటిలోనూ ఇది వాస్తవమైయుంది. “వారి పక్షం వున్నవారికంటే మన పక్షం వున్నవారే ఎక్కువమంది” అని చెప్పిన ఎలీషా మాటలు పదే పదే ఒక ప్రోత్సాహకంగా పని చేశాయి. ఒక కారణమేమిటంటే, నమ్మకమైన దేవదూతల సంఖ్య అపవాది సైన్యంకంటే ఎక్కువగా ఉంది.—2 రాజులు 6:16, పరిశుద్ధ బైబిల్; అపొస్తలుల కార్యములు 5:27-32, 41, 42.
ఆసక్తితోకూడిన ప్రకటనాపనిని యెహోవా ఆశీర్వదిస్తాడు
6, 7. (ఎ) సువార్తను ప్రకటించడానికి ఏ తొలి ప్రయత్నాలు జరిగాయి? (బి) 1943 మొదలుకొని ఏ ప్రయోజనకరమైన మార్పు సంభవించింది?
6 అంతం రాకముందు గొప్ప ప్రకటనాపనిని విస్తృతం చేయడానికీ, త్వరపెట్టడానికీ యెహోవాసాక్షులు ఇరవయ్యవ శతాబ్ద గమనంలో అనేక సాంకేతిక పురోభివృద్ధులను ఉపయోగించుకున్నారు. మునుపు 1914లో, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ మొదటి అధ్యక్షుడైన పాస్టర్ రస్సెల్ స్లైడ్లు చలనచిత్రాల తొలి ఉపయోగాన్ని ప్రోత్సహించాడు. అందులో, ఫోనోగ్రాఫ్ రికార్డులపై బైబిలు-ఆధారిత వ్యాఖ్యానంతో సింక్రొనైజ్ చేయబడిన “ది ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్” అని పిలువబడే, స్లైడ్లు చలనచిత్రాలతో కూడిన ఎనిమిది-గంటల కాలనిడివిగల బైబిలు నాటకం కూడా ఒకటి. ఆ సమయంలోని అనేక దేశాల ప్రేక్షకులను అది అబ్బురపర్చింది. ఆ తర్వాత 1930లలోనూ 1940లలోనూ, సంస్థ రెండవ అధ్యక్షుడైన జె. ఎఫ్. రథర్‌ఫోర్డ్ ఇచ్చిన బైబిలు ప్రసంగాల రికార్డింగులను, పోర్టబుల్ ఫోనోగ్రాఫ్లను ఉపయోగిస్తూ సాక్షులు తమ ఇంటింటి ప్రకటనాపనికి పేరుగాంచారు.
7 సంస్థ మూడవ అధ్యక్షుడైన నేథన్ హెచ్. నార్ నడిపింపు క్రింద 1943లో ఒక ధైర్యవంతమైన చర్య తీసుకోవడం జరిగింది, అదేమిటంటే ప్రతి సంఘంలోనూ పరిచారకుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించబడింది. ఫోనోగ్రాఫ్ రికార్డింగులను ఉపయోగించకుండా ఇంటింటికి ప్రకటించి బోధించడానికి సాక్షులకు తర్ఫీదివ్వబడుతుంది. అప్పటి నుండి, మిషనరీలకు, పూర్తికాల పయినీరు పరిచారకులకు, సంఘ పెద్దలకు, వాచ్‌టవర్ సంస్థ బ్రాంచీలలోని బాధ్యతగల పైవిచారణకర్తలకు తర్ఫీదిచ్చేందుకు ఇతర పాఠశాలలు సంస్థీకరించబడ్డాయి. ఫలితమేమిటి?
8. సాక్షులు 1943లో గొప్ప విశ్వాసాన్ని ఎలా చూపించారు?
8 మునుపు 1943లో, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో, 54 దేశాల్లో కేవలం 1,29,000 మంది సాక్షులే చురుగ్గా ఉన్నారు. అయినప్పటికీ, అంతం రాకముందు మత్తయి 24:14 నెరవేరుతుందనే విశ్వాసం మరియు దృఢనిశ్చయం వారికున్నాయి. ఈ భ్రష్ట విధానానికి అంతం తెచ్చే సంఘటనల పరంపరకు ముందు ముఖ్యమైన హెచ్చరికా సందేశం ప్రకటించబడేలా యెహోవా చూస్తాడని వాళ్లు దృఢంగా విశ్వసించారు. (మత్తయి 24:21; ప్రకటన 16:16; 19:11-16, 19-21; 20:1-3) వారి ప్రయాసలకు ప్రతిఫలం లభించిందా?
9. సాక్ష్యపు పని వర్థిల్లిందని ఏ వాస్తవాలు చూపిస్తున్నాయి?
9 ఇప్పుడు ఒక్కో దేశంలో 1,00,000 కంటే ఎక్కువమంది చురుకైన సాక్షులుగల దేశాలు కనీసం 13 ఉన్నాయి. వీటిలో అనేకం క్యాథలిక్ చర్చి ఆధిపత్యం వహిస్తున్న దేశాలే. అయినప్పటికీ, పరిస్థితి చూడండి. బ్రెజిల్లో 4,50,000 మంది సువార్త ప్రచారకులు ఉన్నారు, 1997లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 12,00,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు. మెక్సికో మరో ఉదాహరణ, దాదాపు 5,00,000 మంది సాక్షులున్నారు, 16,00,000 కంటే ఎక్కువమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు. ఇతర క్యాథలిక్ దేశాల్లో సాక్షుల సంఖ్య ఇలా ఉంది, ఇటలీ (దాదాపు 2,25,000 మంది), ఫ్రాన్సు (దాదాపు 1,25,000 మంది), స్పెయిన్ (1,05,000 కంటే ఎక్కువమంది), అర్జెంటీనా (1,15,000 కంటే ఎక్కువమంది). ప్రొటెస్టెంట్, క్యాథలిక్, యూదా మతాల వారు అధిక సంఖ్యలో ఉన్న అమెరికాలో దాదాపు 9,75,000 మంది సాక్షులున్నారు, 20,00,000 కంటే ఎక్కువమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు. ఖచ్చితంగా, మర్మమైన బోధలుగల ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనులో నుండి గొప్ప సమూహాలు బయటికి వచ్చి, “క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి” కొరకైన దేవుని సరళమైన, ఖచ్చితమైన వాగ్దానాల వైపుకు మరలుతున్నారు.—2 పేతురు 3:13; యెషయా 2:3, 4; 65:17; ప్రకటన 18:4, 5; 21:1-4.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మారడం
10. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా మారాయి?
10 క్రీస్తుయేసు ద్వారా యెహోవా వైపుకు తిరిగినవారిలో అనేకులు ఇంటింటి సేవలో కనుగొనబడిన వారే. (యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 20:20) కాని ఇతర పద్ధతులు కూడా ఉపయోగించబడ్డాయి. కాలాలు మారాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంతోమంది స్త్రీలు ఇప్పుడు ఇంటి బయట అడుగుపెట్టి పని చేస్తున్నారు. తరచూ, వారమంతటిలో, ఇళ్ల దగ్గర కేవలం కొద్దిమంది ప్రజలనే కనుగొనడం సాధ్యమౌతుంది. కాబట్టి, యెహోవాసాక్షులు పరిస్థితికి అనుగుణంగా మారారు. యేసు మరియు తొలి శిష్యులవలె వాళ్లు ప్రజలను ఎక్కడ, ఎప్పుడు కనుగొనవచ్చో అక్కడికి అప్పుడు వెళ్తారు.—మత్తయి 5:1, 2; 9:35; మార్కు 6:34; 10:1; అపొస్తలుల కార్యములు 2:14; 17:16, 17.
11. యెహోవాసాక్షులు నేడు ఎక్కడ ప్రకటిస్తున్నారు, ఏ ఫలితాలతో?
11 సాక్షులు చొరవ తీసుకుని, పెద్ద పార్కింగ్ స్థలాల్లో, షాపింగ్ సెంటర్లలో, ఫ్యాక్టరీలలో, ఆఫీసుల్లో, వ్యాపార స్థలాల్లో, పాఠశాలల్లో, పోలీస్ స్టేషన్లలో, పెట్రోల్ బంకుల్లో, హోటళ్లూ రెస్టారెంట్లలో, వీథుల్లో యుక్తిగా ప్రజలకు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, వారు ప్రజలను ఎక్కడ కనుగొనగల్గితే అక్కడ ప్రకటిస్తారు. ప్రజలు ఇళ్లలో ఉన్నప్పుడు, సాక్షులు వారిని ఇళ్లల్లోనే కలవడాన్ని కొనసాగిస్తారు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా మారే ఆచరణాత్మకమైన విధానం ఫలితంగా బైబిలు సాహిత్యం ఎక్కువగా పంపిణీ చేయబడుతోంది. గొఱ్ఱెలవంటి వారిని కనుగొనడం జరుగుతోంది. క్రొత్త బైబిలు పఠనాలు ప్రారంభించబడుతున్నాయి. యాభై ఐదు లక్షలకంటే ఎక్కువమంది స్వచ్ఛంద పరిచారకులు, మానవ చరిత్రలోనే అత్యంత గొప్పదైన విద్యా కార్యక్రమాన్ని ఆసక్తితో కొనసాగిస్తున్నారు! వారిలో ఒకరై ఉండే ఆధిక్యత మీకుందా?—2 కొరింథీయులు 2:14-17; 3:5, 6.
యెహోవాసాక్షులను ఏది పురికొల్పుతుంది?
12. (ఎ) యెహోవా తన ప్రజలకు ఎలా బోధిస్తున్నాడు? (బి) ఈ బోధ ఏ ప్రభావాన్ని చూపిస్తోంది?
12 దీనంతటిలో పరలోక సంస్థ ఏ పాత్ర నిర్వహిస్తుంది? యెషయా ఇలా ప్రవచించాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:13) యెహోవా భూమిపైనున్న తన దృశ్య సంస్థ ద్వారా, ఈ ప్రపంచవ్యాప్త ఐక్య సహోదరత్వానికి రాజ్యమందిరాల్లోనూ, సభలూ సమావేశాల్లోనూ బోధిస్తున్నాడు. దాని ఫలితమే శాంతి సమైక్యతలు. యెహోవా బోధ, ఒకరినొకరూ అలాగే తమ పొరుగువారినీ తమవలె ప్రేమించేలా, ఈ అనైక్య విభాగిత లోకంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ తమ పొరుగువారిని ద్వేషించకుండా ఉండేలా బోధించబడిన ఒక విశేషమైన ప్రజలను ఉత్పన్నం చేసింది.—మత్తయి 22:36-40.
13. ప్రకటన పనిలో దేవదూతల నడిపింపు ఉందని మనమెలా నిశ్చయత కల్గివుండవచ్చు?
13 ఉదాసీనత లేక హింస ఉన్నప్పటికీ ప్రకటనాపనిని కొనసాగించడానికి యెహోవాసాక్షులను పురికొల్పేది ప్రేమే. (1 కొరింథీయులు 13:1-8) ప్రకటన 14:6 చెబుతున్నట్లుగా, జీవాన్ని రక్షించే తమ పనికి నడిపింపు పరలోకం నుండి లభిస్తుందని వారికి తెలుసు. దేవదూత నడిపింపు క్రింద ప్రకటించబడుతున్న సందేశం ఏమిటి? “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” రాజ్యసువార్త ప్రకటన యెహోవా నామాన్ని ఉన్నతపరుస్తుంది. సృష్టాన్ని మరియు గ్రుడ్డి పరిణామ సిద్ధాంతాన్ని కాకుండా సృష్టికర్తయైన దేవుడ్ని మహిమపర్చడానికి ప్రజలు ఆహ్వానించబడుతున్నారు. ప్రకటనా పని ఎందుకు అంత అత్యవసరమైనది? ఎందుకంటే, మహాబబులోనుకూ, సాతాను దృశ్య విధానపు ఇతర భాగాలన్నిటికీ వ్యతిరేకంగా తీర్పు తీర్చబడే గడియ వచ్చింది.—ప్రకటన 14:7; 18:8-10.
14. ఈ గొప్ప బోధనా ప్రచారంలో ఎవరు చేరివున్నారు?
14 ఈ ప్రకటనాపని నుండి ఏ సమర్పిత క్రైస్తవుడూ మినహాయించబడలేదు. సంఘంతోపాటు ప్రకటించడంలో ఆధ్యాత్మిక పెద్దలు నాయకత్వం వహిస్తారు. తర్ఫీదు పొందిన పయినీర్లు పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. రాజ్య సందేశాన్ని ఆసక్తితో ప్రకటించే ప్రచారకులు నెలలో కేవలం కొన్ని గంటలే ప్రకటించగల్గినా లేక ఎక్కువ గంటలు ప్రకటించగల్గినా, సందేశాన్ని భూమి నాలుగు చెరగులా వ్యాపింపజేస్తున్నారు.—మత్తయి 28:19, 20; హెబ్రీయులు 13:7, 17.
15. యెహోవాసాక్షుల ప్రకటనాపని ప్రభావాన్ని చూపుతోందనడానికి ఏది ఒక రుజువు?
15 ఈ కృషి అంతా ప్రపంచంపై ప్రభావాన్ని చూపించిందా? ప్రభావాన్ని చూపించిందనే దానికి, టీవీ కార్యక్రమాల్లోనూ వార్తా కాలమ్లలోనూ యెహోవాసాక్షుల గురించి తరచూ ప్రస్తావించబడుతోందన్నది ఒక చిన్న రుజువు మాత్రమే. ప్రతి ఒక్కరినీ చేరాలనే పట్టుదలనూ, కృతనిశ్చయాన్నీ ఇవి తరచూ ఉన్నతపరుస్తాయి. అవును, ఎక్కువశాతం మంది సందేశాన్నీ సందేశకులనూ నిరాకరించినప్పటికీ, మన ఆసక్తీ ఎడతెగని మన సాక్ష్యమూ ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి!
సాక్ష్యపుపనిని కడతేర్చాలనే మన ఆసక్తి
16. మిగిలివున్న కొద్ది సమయంలో ఇప్పుడు ఏ దృక్పథాన్ని కనబర్చాలి?
16 ఈ విధానానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు, యెహోవా సేవ చేయాలనే మన కోరిక స్వచ్ఛమైనదైనంత వరకూ ఆ విషయం తెలుసుకోవలసిన అవసరతా మనకు లేదు. (మత్తయి 24:36; 1 కొరింథీయులు 13:1-3) కానీ యెహోవా ప్రేమ, శక్తి, న్యాయం ప్రదర్శించబడడానికి “ముందుగా” సువార్త ప్రకటించబడాలని మనకు తెలుసు. (మార్కు 13:10) కాబట్టి, దుష్ట అన్యాయ దౌర్జన్యపూరిత ఈ లోక అంతం కొరకు మనం ఆతురతతో ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నప్పటికీ, మన పరిస్థితులకు అనుగుణంగా మనం మన సమర్పణ అనుసారంగా ఆసక్తితో జీవించాల్సిందే. మనం వృద్ధులమైనప్పటికీ లేక అనారోగ్యులమైనప్పటికీ, మనం యౌవనంలో ఉన్నప్పుడు లేక ఆరోగ్యంగావున్న రోజుల్లో కలిగివున్న ఆసక్తితోనే ఇప్పటికీ యెహోవా సేవ చేయాలి. అయితే మనం పరిచర్యలో మునుపు వెచ్చించినంత సమయాన్ని ఇప్పుడు వెచ్చించలేక పోతుండవచ్చు, కాని యెహోవాకు స్తుతియాగం చెల్లించడంలోని అదే నాణ్యతను మనం ఖచ్చితంగా కాపాడుకోవచ్చు.—హెబ్రీయులు 13:15.
17. మనకందరికీ సహాయం చేయగల ఒక ప్రోత్సాహకరమైన అనుభవాన్ని చెప్పండి.
17 కాబట్టి, మనం యౌవనులమైనా లేక వృద్ధులమైనా ఆసక్తి కల్గివుండి, నూతన లోకాన్ని గూర్చిన అనుకూల సందేశాన్ని మనం కలిసే ప్రతి ఒక్కరితో పంచుకుందాము. ఆస్ట్రేలియాలో, తన తల్లితోపాటు దుకాణానికి వెళ్లిన, బిడియస్థురాలైన ఏడేళ్ల అమ్మాయిలా ఉందాము. అందరూ ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైనదనేది ఆమె రాజ్యమందిరంలో విన్నది, కాబట్టి ఆమె రెండు బైబిలు-ఆధారిత బ్రోషూర్లను తన బాగ్‌లో ఉంచుకుంది. తల్లి కౌంటర్ వద్ద బిజీగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. తల్లి ఆ అమ్మాయి కోసం వెదుకుతున్నప్పుడు, దూరంలో ఒక స్త్రీకి బ్రోషూర్‌ను అందజేస్తూ కనిపించింది! తన పాప ఏమైనా ఇబ్బంది కలిగించిందేమో అని ఆమెకు క్షమాపణలు చెప్పాలని తల్లి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళింది. కాని ఆ స్త్రీ సంతోషంగా బ్రోషూర్‌ను స్వీకరించింది. ఆ తర్వాత ఆ తల్లి తన కుమార్తెతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక అపరిచిత వ్యక్తిని సమీపించడానికి నీకు ధైర్యమెలా వచ్చిందని అడిగింది. “నేను రెడీ, వన్ టూ త్రీ! అనుకున్నాను, అంతే ముందుకు కదిలాను!”
18. మనం మెచ్చుకోదగిన స్ఫూర్తిని ఎలా చూపించవచ్చు?
18 ఆ ఆస్ట్రేలియా అమ్మాయి వంటి స్ఫూర్తి మనకందరికీ అవసరం, ప్రాముఖ్యంగా అపరిచితులను లేక చివరికి అధికారులను సువార్తతో సమీపించడానికి నిరాకరించబడతామేమోనని మనం భయపడవచ్చు. కాని, “ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పు[ను]” అని యేసు చెప్పాడని మనం మరిచిపోకూడదు.—లూకా 12:11, 12.
19. మీ పరిచర్య గురించి మీరెలా భావిస్తున్నారు?
19 కాబట్టి మీరు దయాపూర్వకంగా సువార్తతో ప్రజలను సమీపించేటప్పుడు దేవుని ఆత్మ సహాయం ఉంటుందని నమ్మకముంచండి. నేడుండి రేపు లేకుండా పోయే అయోగ్యులైన స్త్రీపురుషుల మీద కోట్లాదిమంది ప్రజలు తరచూ తమ విశ్వాసాన్ని ఉంచుతారు. మనం యెహోవా మీద, ఆయన పరలోక సంస్థ మీద—నిరంతరం సజీవులుగా ఉండే యేసుక్రీస్తు, పరిశుద్ధ దేవదూతలు, పునరుత్థానమైన అభిషిక్త క్రైస్తవుల మీద—మన నమ్మకాన్ని ఉంచుతాము! కాబట్టి, “వారి పక్షం వున్న వారికంటె మన పక్షం వున్నవారే ఎక్కువమంది” అని జ్ఞాపకముంచుకోండి!—2 రాజులు 6:16, పరిశుద్ధ బైబిల్.
[అధస్సూచి]
a మరిన్ని ఉదాహరణల కొరకు, యెహోవాసాక్షుల 1994 వార్షిక పుస్తకం (ఆంగ్లం), 217-20 పేజీలను చూడండి.
మీరెలా సమాధానమిస్తారు?
◻ యెహోవా ప్రజలు తాళుకుని నిలువడంలో దేవుని పరలోక సంస్థ ఏ పాత్ర నిర్వహించింది?
◻ ఇరవయ్యవ శతాబ్దంలో యెహోవాసాక్షులపై ఏ రాజకీయ మత శక్తులు దాడి చేశాయి?
◻ యెహోవాసాక్షులు తమ పరిచర్యను కాలానుగుణంగా ఎలా మార్చుకున్నారు?
◻ ప్రకటించడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?
[17వ పేజీలోని చిత్రం]
హెన్రికా జుర్
[18వ పేజీలోని చిత్రం]
జపాన్
మార్టినిక్
అమెరికా
కెన్యా
అమెరికా
ప్రజలు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తే యెహోవాసాక్షులు అప్పుడు అక్కడ ప్రకటిస్తారు
[20వ పేజీలోని చిత్రం]
మునుపు ఈ శతాబ్దంలో, రాజ్యసందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఫోనోగ్రాఫ్లు ఉపయోగించబడ్డాయి