ఒక సంతోషకర సందర్భం—104వ గిలియడ్ తరగతి గ్రాడ్యుయేషన్
“ఇది సంతోషకరమైన దినం, మనందరమూ ఎంతో ఆనందంగా ఉన్నాము.” యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన కేరీ బార్బర్, 1998 మార్చి 14న వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 104వ తరగతి గ్రాడ్యుయేషన్ వేడుకను, ఆ మాటలతో ఆరంభించాడు. “ఎ సాంగ్ ఆఫ్ రిజాయ్సింగ్” అనే శీర్షికగల 208వ సంఖ్య రాజ్య గీతాన్ని పాడేందుకు, హాజరైన 4,945 మంది ప్రేక్షకులను ఆహ్వానించడంతో ఆ సందర్భం ప్రారంభించబడింది.
సంతోషంగా ఉండేందుకు ఆచరణాత్మక సలహాలు
ఆ కార్యక్రమం యొక్క ప్రారంభ భాగంలోని ఐదు చిన్న బైబిలు ఆధారిత ప్రసంగాల పరంపరలో, గ్రాడ్యుయేషన్ దినం అంతటిలో నెలకొన్నటువంటి ఆనందమయ స్ఫూర్తిని ఎల్లప్పుడూ ఎలా కలిగి ఉండాలనే విషయంపై ఆచరణాత్మక సలహాలు ఇవ్వబడ్డాయి.
రైటింగ్ విభాగానికి చెందిన జోసెఫ్ ఈమ్స్ మొదటి ప్రసంగాన్ని ఇచ్చాడు. 2 సమూయేలు 15, 17 అధ్యాయాలలోని వృత్తాంతం ఆధారంగా, “యథార్థవంతుల స్ఫూర్తిని అనుకరించండి” అనే అంశంపై ఆయన మాట్లాడాడు. ఆ అధ్యాయాల్లో దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటును పురికొల్పుతూ, తన తండ్రికి దేవుని ద్వారా ఇవ్వబడిన రాజ్యాన్ని లాగేసుకోవాలని పన్నాగం పన్నిన వృత్తాంతం ఉంది. అయితే, యెహోవా అభిషేకించిన రాజైన దావీదుపట్ల యథార్థంగా నిలిచిన వారూ ఉన్నారు. దీని నుండి కొత్త మిషనరీలు ఏ పాఠాన్ని నేర్చుకోగలరు? “మీ మిషనరీ నియామకంలో మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ, సహకార స్ఫూర్తినీ దైవపరిపాలనా అధికారానికి గౌరవాన్నీ యథార్థంగా పురికొల్పండి. ఇతరులు కూడా అదే చేసేందుకు వాళ్లకు సహాయం చేయండి” అని బ్రదర్ ఈమ్స్ ముగించాడు.
కార్యక్రమంలో తర్వాత ప్రసంగించిన డేవిడ్ సింక్లేర్, ‘యెహోవా గుడారంలో’ అతిథులుగా ఉండేందుకు 15వ కీర్తనలో పేర్కొనబడిన పది అవసరతలను ప్రస్తావించాడు. “మీ మిషనరీ గుడారంలో అతిథులుగా కొనసాగండి” అనే శీర్షికగల తన ప్రసంగం, గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులు తాము అతిథులుగా ఉండే మిషనరీ నియామకాల్లో ఈ కీర్తనను అన్వయించుకోవాలని ప్రోత్సహించింది. అన్నివేళలా దైవిక ప్రమాణాలకు తగిన విధంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను బ్రదర్ సింక్లేర్ ఉన్నతపర్చాడు. దాని ఫలితం? “ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు” అని కీర్తన 15:5 చెబుతుంది.
తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన జాన్ బార్, క్రైస్తవ కూటాల్లో పాటలు పాడటం వల్ల కలిగే ఉత్తేజకరమైన ప్రభావం వైపుకు అవధానాన్ని మళ్లించాడు. అయితే నేడు భూవ్యాప్తంగా పాడబడుతున్న అత్యంత ఆనందమయమైన పాట ఏది? అది దేవుని మెస్సీయా రాజ్యాన్ని గురించిన సువార్తే. రాజ్యాన్ని గురించి పాడటం లేక ప్రకటించడం ద్వారా వస్తున్న ఫలితం ఏమిటి? 208 సంఖ్యగల పాటలోని రెండవ పాదం క్లుప్తంగా ఇలా చెబుతుంది: “రాజ్య ప్రకటన ద్వారా, క్రైస్తవ బోధ ద్వారా, అనేకులు యెహోవా వైపుకు మరల్చబడుతున్నారు. వీరు కూడా ఆనందగీతాలు పాడటంలో తమ శృతి కలుపుతున్నారు, వారి స్వరాలు చాలా దూరం వరకూ వినిపిస్తున్నాయి!” అవును, ప్రతిదినం దాదాపు 1,000 మంది కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకుంటున్నారు. “బ్రదర్స్! మీ స్తుతి గీతాలను వినేందుకు ఆసక్తితో వేచివుండే ప్రజలను కలవగల ప్రాంతాలకు మీరు పంపబడుతున్నారని ఆలోచించడం ఎంతో ఉత్తేజకరంగా లేదంటారా” అని అడుగుతూ బ్రదర్ బార్ ముగించాడు.
“అనుభవజ్ఞులు చెప్పేవి వినండి” అనేది, రైటింగ్ విభాగానికి చెందిన జేమ్స్ మాంజ్ ఇచ్చిన ప్రసంగం శీర్షిక. కొన్ని విషయాలను కేవలం వ్యక్తిగత అనుభవం ద్వారానే నేర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు. (హెబ్రీయులు 5:8) అయినప్పటికీ, “చెవి యొగ్గి జ్ఞానుల” అంటే అనుభవం గడించిన వారి “ఉపదేశము ఆలకింపుము” అని సామెతలు 22:17 మనలను ప్రోత్సహిస్తోంది. గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులు, తమకంటే ముందు వెళ్లిన వారి నుండి ఎంతో నేర్చుకోగలరు. “స్థానిక దుకాణదారులతో ఎలా బేరమాడాలో వాళ్లకు తెలుసు. శారీరక లేక నైతిక ప్రమాదాల మూలంగా నగరంలోని ఏ ప్రాంతాల్లోకి వెళ్లడం మానుకోవాలో వాళ్లకు తెలుసు. స్థానిక ప్రజల మనస్తత్వాలు వాళ్లకు తెలుసు. మీ నియామకంలో మీరు ఆనందంగానూ విజయవంతంగానూ ఉండాలంటే మీరేమి చేయాలో పాత మిషనరీలకు తెలుసు” అని బ్రదర్ మాంజ్ చెప్పాడు.
“మీ దైవపరిపాలనా నియామకంపట్ల మెప్పుదల కనపర్చండి” అనే అంశంపై మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు, తిమోతి మరియు బర్నబాల వంటి మిషనరీలకు కొంతమందికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నుండి లేక ఏదో అద్భుతకరమైన ప్రకటన ద్వారా నియామకాలు లభించినప్పటికీ, గిలియడ్ తర్ఫీదు పొందిన మిషనరీలు ప్రపంచ వ్యాప్త పొలంలో “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా తమ తమ స్థానాల్లో నియమించబడ్డారని గిలియడ్ పాఠశాల రిజిస్ట్రార్ అయిన వాలేస్ లివరన్స్ వివరించాడు. (మత్తయి 24:45-47) మిషనరీల నియామకాలను, మిద్యానీయులకు విరోధంగా పోరాడుతున్న తన మనుష్యులకు గిద్యోను నియమించిన స్థానాలతో ఆయన పోల్చాడు. (న్యాయాధిపతులు 7:16-21) “మీ దైవపరిపాలనా మిషనరీ నియామకంపట్ల మెప్పుదల కనపర్చండి. గిద్యోను సైనికులు ‘ప్రతివాడు తన చోటున నిలిచి ఉన్న’ విధంగా, మీ నియామకాన్ని మీరు ఉండవలసిన చోటుగా దృష్టించండి. గిద్యోను మూడువందల మందిని యెహోవా ఉపయోగించుకున్న విధంగానే ఆయన మిమ్మల్ని కూడా ఉపయోగిస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండండి” అని బ్రదర్ లివరన్స్ పురికొల్పాడు.
ప్రజల ఎడల శ్రద్ధగలవారిగా ఉండటం సంతోషాన్ని తెస్తుంది
ఒకసారి కావలికోట ఇలా వ్యాఖ్యానించింది: “ఈ ప్రస్తుత వ్యవస్థ తయారు చేసిన వస్తువులూ పరికరాల చుట్టూ అంటే ఏ విధంగానూ కొనసాగే సాధ్యత లేని వాటిపట్ల ఆసక్తి కలిగివుండి వాటి చుట్టూ మన జీవితాలను అల్లుకునే బదులు, ప్రజల ఎడల నిజమైన ఆసక్తిని పెంచుకుని, ఇతరుల కొరకు ఏదైనా చేయడంలో నిజమైన ఆనందాన్ని కనుగొనడాన్ని నేర్చుకోవడం ఎంతో మంచిది కాదా.” దానికి అనుగుణ్యంగా, గిలియడ్ పాఠశాల ఉపదేశకుల్లో ఒకరైన బ్రదర్ మార్క్ న్యూమర్, విద్యార్థుల ఒక గుంపుతో వారి క్షేత్రసేవ అనుభవాలను గురించి చర్చించి, “ఇతరులపట్ల వ్యక్తిగత ఆసక్తిని చూపడమే మిమ్మల్ని మంచి మిషనరీలుగా చేస్తుందని” వ్యాఖ్యానించాడు.
విదేశీ క్షేత్రంలో ఆనందాన్ని పొందేందుకు కీలకాలు
మిషనరీ పనిలో విజయాన్ని సాధించి, సంతోషాన్ని పొందేందుకుగల కొన్ని కీలకాలు ఏవి? సేవా విభాగానికి చెందిన బ్రదర్ చార్లెస్ వుడ్డీ, మరియు లాటిన్ అమెరికాలో పూర్వం మిషనరీగా ఉండిన, ఇప్పుడు టీచింగ్ కమిటీకి ఒక అసిస్టెంటుగా ఉన్న హెరాల్డ్ జాక్సన్, బ్రాంచి పర్సనల్ కొరకైన పాఠశాల యొక్క తొమ్మిదవ తరగతికి హాజరౌతున్న వివిధ బ్రాంచి కమిటీ సభ్యులను ఇంటర్వ్యూ చేశాడు. వీరు ఇచ్చిన సలహాల్లో కొన్ని ఇక్కడున్నాయి:
జాంబియా నుండి వచ్చిన ఆల్బర్ట్ ముసొండా ఇలా గమనించి చెప్పాడు: “ఒక మిషనరీ వెళ్లి సహోదరులను పలకరించేందుకు చొరవ తీసుకుంటే అది ఎంతో మంచి స్ఫూర్తిని ఉత్పన్నం చేస్తుంది, ఎందుకంటే సహోదరులు మిషనరీకి సన్నిహితులౌతారు మరి మిషనరీ వారికి సన్నిహితుడౌతాడు.”
స్నేహపూర్వకమైన ప్రజలు కొత్త మిషనరీలకు ఏదైనా త్రాగేందుకు అందిస్తే, “నేనీ దేశానికి కొత్త. మీరిచ్చింది తీసుకోవాలనే ఉంది నాకు, అయితే మీ శరీరానికి ఉన్న సహజ వ్యాధి నిరోధక శక్తి నా శరీరానికి లేదు. నేను కూడా ఏదో ఒక రోజు అలా త్రాగగలుగుతానని అనుకుంటున్నాను, అందుకు నేను సంతోషిస్తాను” అని మర్యాదగానూ యుక్తిగానూ సమాధానం చెప్పవచ్చని గ్వాటిమాలకు చెందిన రోలాండో మోరాలెస్ సలహా ఇచ్చాడు. ఆ విధమైన సమాధానం ఇవ్వడంలోని ప్రయోజనాలు ఏమిటి? “ప్రజలు నొచ్చుకోరు, మరి మిషనరీలు ఇతరులతో మర్యాదగా వ్యవహరించిన వారౌతారు.”
తమ నియామకాల్లో సహనంతో కొనసాగేందుకు మిషనరీలకు ఏది సహాయం చేయగలదు? గత 12 సంవత్సరాలుగా లైబీరియాలో సేవ చేస్తున్న, 79వ తరగతి గ్రాడ్యుయేట్ అయిన బ్రదర్ పాల్ క్రూడాస్, “తలిదండ్రులు తమ పిల్లలకు దూరంగా ఉండటం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే ఆ కొత్త మిషనరీ ఆ దేశానికీ, ఆ వాతావరణానికీ, ఆ సంస్కృతికీ ఆ ప్రజలకూ అలవాటు పడేందుకు ప్రయత్నిస్తూ ఉండే సమయాలు ఉంటాయి. అప్పుడు తన నియామకాన్ని వదిలి వెళ్లిపోవాలని అతనికి అనిపిస్తుండవచ్చు. ‘నువ్వు లేని లోటు చాలా తీవ్రంగా ఉంది; నువ్వు లేకుండా ఇల్లంతా బోసిపోయి ఉంది’ అని అంటూ వాళ్లు ఆయనకు ఉత్తరం వ్రాశారంటే ఇక ఆయన తన పెట్టే బేడా సర్దుకుని ఇంటి దారి పట్టవచ్చు. ఈ రోజు ఇక్కడున్న బంధువులు అలా చేయకుండా ఉండటం ఎంతో ప్రాముఖ్యం” అని వ్యాఖ్యానించాడు.
ఇంటర్వ్యూల తర్వాత, కార్యక్రమంలోని చివరి ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన థియోడర్ జారజ్ ఇచ్చాడు. “మీ జీవితంలో రాజ్యాన్ని ముందుంచండి” అన్నది ఆయన అంశం. మిషనరీలు తమ దృష్టిని పనిపై కేంద్రీకరించి ఉండి తమ పనిలో ధ్యానభంగం చెందకుండా ఎలా ఉండగలరు? తమ జీవితంలో రాజ్యాసక్తులను ముందుంచేందుకు సహాయం చేసే వ్యక్తిగత బైబిలు పఠనం కొరకు పట్టిక వేసుకోవాలని ఆయన వాళ్లను ప్రోత్సహించాడు. ఆయన, “కొందరు మిషనరీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఈ-మెయిల్ మరియు కంప్యూటర్ వంటి విషయాల్లో మునిగిపోవడం ప్రారంభించారు గనుక వారు వ్యక్తిగత అధ్యయనాన్ని అలక్ష్యం చేశారు. ఏ పరికరాన్ని ఉపయోగించడం విషయంలోనైనా సమతూకాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యపు వ్యక్తిగత అధ్యయనం నుండి మనలను వైదొలగించే దానిపై మితిమీరి సమయాన్ని గడపకుండా ఉండేంత వివేచన మనకు ఉండాలి” అని ఒక సమయానుకూలమైన జ్ఞాపికను ఇచ్చాడు.
బ్రదర్ జారజ్ ప్రసంగం తర్వాత డిప్లొమాలను ఇవ్వడం, తరగతి తరపునుండి మెప్పుకోలు ఉత్తరాన్ని చదవడం జరిగింది. తరగతి ప్రతినిధి ప్రతి ఒక్కరి భావాలను ఈ విధంగా వ్యక్తపర్చాడు: “తన శిష్యులమధ్య ఏ విధమైన ప్రేమ ఉంటుందని యేసు చెప్పాడో దాని స్పష్టమైన రుజువును మేము చూశాం, మరి మేము ఎక్కడ ఉన్నా వాత్సల్యమూ, ప్రేమగల తల్లివంటి సంస్థ మద్దతు మాకు ఉందని ఈ విషయం మాకు అభయాన్నిచ్చింది. అటువంటి మద్దతుతో మేము భూదిగంతముల వరకూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.” 104వ గిలియడ్ తరగతి యొక్క ఆనందమయ గ్రాడ్యుయేషన్ దినానికి అది ఎంతో ప్రేరేపణాత్మకమైన ముగింపు.
[24వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించబడిన దేశాలు: 9
నియమించబడిన దేశాలు: 16
విద్యార్థుల సంఖ్య: 48
వివాహిత జంటల సంఖ్య: 24
సగటు వయస్సు: 33
సత్యంలో సగటు సంవత్సరాలు: 16
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12
[25వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 104వ పట్టభద్రుల తరగతి
ఈ క్రింది లిస్టులో, వరుసలు ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోను పేర్లు ఎడమ నుండి కుడికి పేర్కొనబడ్డాయి
(1) రామెరో, ఎమ్.; హూవర్త్, జే.; బ్లాక్బర్న్-కేన్, డీ.; హోన్గాసర్, ఈ.; వెస్ట్, ఎస్.; టామ్, ఎస్. (2) కోలోన్, డబ్ల్యూ.; గ్లాన్సీ, జే.; కోనో, వై.; డ్రూస్, పీ.; టామ్, ఎస్.; కోనో, టీ. (3) టామ్, డీ.; జెష్మైస్టర్, ఎస్.; గర్డెల్, ఎస్.; ఎల్వెల్, జే.; డానెక్, పీ.; టిబాడో, హెచ్. (4) టేలర్, ఈ.; హిల్డ్రెడ్, ఎల్.; సాంచెస్, ఎమ్.; ఆండర్సన్, సీ.; బాక్నార్, టీ.; హోన్గాసర్, ఈ. (5) హూవర్త్, డీ.; వార్డ్, సీ.; హించ్, పీ.; మెక్‌డోనాల్డ్, వై.; సాంచెస్, టీ.; టామ్, ఓ. (6) డ్రూస్, టీ.; టిబాడో, ఈ.; ఎల్వెల్, డీ.; డానెక్, డబ్ల్యూ.; బ్లాక్బర్న్-కేన్, డీ.; వార్డ్, డబ్ల్యూ. (7) ఆండర్సన్, ఎమ్.; జెష్మైస్టర్, ఆర్.; మెక్‌డోనాల్డ్, ఆర్.; బక్నార్, ఆర్.; గ్లాన్సీ, ఎస్.; గర్డెల్, జీ. (8) రామెరో, డీ.; హించ్, ఆర్.; హిల్డ్రెడ్, ఎస్.; టేలర్, జే.; కోలోన్, ఏ.; వెస్ట్, డబ్ల్యూ.
[26వ పేజీలోని చిత్రం]
104వ తరగతికి ఉపదేశించడంలో భాగంవహించిన సహోదరులు: (ఎడమ నుండి) డబ్ల్యూ. లివరన్స్, యూ. గ్లాస్. కే. ఆడమ్స్, ఎమ్. న్యూమర్