ఘోరమైన శ్రమలను తట్టుకోవడం
ఏవా యుసెఫ్సన్ చెప్పినది
హంగెరీ నందలి బుడపెస్ట్లోని ఊయీపెస్త్ జిల్లాలో క్రైస్తవ పరిచర్యకు బయల్దేరే ముందు, ఒక క్లుప్తమైన కూటం కొరకు, ఒక చిన్న గుంపుగా మేము సమావేశమయ్యాము. అది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడానికి కాస్త ముందు, అంటే 1939లోని సంగతి, అప్పుడు హంగెరీలో యెహోవాసాక్షుల ప్రకటనాపని నిషేధించబడి ఉంది. ఆ రోజుల్లో, బైబిలును బహిరంగంగా బోధించడంలో భాగం వహించేవారు తరచూ అరెస్టు చేయబడే వారు.
ఈ కార్యకలాపంలో నేను మొదటిసారిగా భాగం వహించబోతున్నాను గనుక, నేను కాస్త గాబరాగా, ముఖం పాలిపోయి ఉన్నట్లు కనిపించి ఉంటాను. పెద్ద వయస్సువాడైన ఒక క్రైస్తవ సహోదరుడు నా వైపు తిరిగి, ఇలా అన్నాడు: “ఏవా, నువ్వు ఎప్పుడూ భయపడనవసరం లేదు. యెహోవాను సేవించడం మానవులకు అత్యంత గౌరవపూర్వకమైన విషయం.” పరిగణతో కూడిన, బలపర్చేవైన ఆ మాటలు నేను అనేక భయంకరమైన శ్రమలను తట్టుకునేందుకు నాకు సహాయపడ్డాయి.
నేను మునుపు యూదురాలిని
నేను ఒక యూదా కుటుంబంలోని ఐదుగురు పిల్లల్లో అందరికన్నా పెద్దదాన్ని. అమ్మకు యూదామతం నుండి సంతృప్తి లభించలేదు, మరి ఆమె ఇతర మతాలను పరిశీలించడం ప్రారంభించింది. బైబిలు సత్యం కొరకే వెదుకుతున్న మరొక యూదా స్త్రీ అయిన ఎర్జేబెత్ స్లేజింగర్ను ఆమె కలిసినది ఆ విధంగానే. ఎర్జేబెత్ అమ్మను యెహోవాసాక్షులకు పరిచయం చేసింది, దాని ఫలితంగా, నాకు కూడా బైబిలు బోధల్లో ప్రగాఢమైన ఆసక్తి కలిగింది. నేను నేర్చుకుంటున్న విషయాలను త్వరలోనే ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాను.
మరి 1941 వేసవిలో నాకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, డెన్యూబ్ నదిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవా దేవునికి నా సమర్పణను నేను సూచించాను. అమ్మ కూడా అదే సమయంలో బాప్తిస్మం తీసుకుంది, అయితే మేము కొత్తగా కనుగొన్న క్రైస్తవ విశ్వాసాన్ని నాన్నగారు పంచుకోలేదు. నా బాప్తిస్మం అయిన వెనువెంటనే, నేను పయినీరుసేవ చేసేందుకు అంటే పూర్తికాల పరిచర్యలో భాగం వహించేందుకు పథకం వేసుకున్నాను. నేను ఒక సైకిల్ కొనవలసి వచ్చింది, కావున నేను ఒక పెద్ద బట్టల కర్మాగారంలోని లాబొరేటరీలో పని చేయడం ప్రారంభించాను.
శ్రమల ప్రారంభం
నాజీలు హంగెరీని ఆక్రమించుకున్నారు, నేను పని చేస్తున్న కర్మాగారం కూడా జర్మను వారి యాజమాన్యం క్రిందకు వచ్చింది. ఒక రోజు నాజీలకు కట్టుబడి ఉంటామనే ప్రమాణాన్ని పలికేందుకు పనివారందరినీ సూపర్వైజర్ల ఎదుటకు పిలిపించారు. అలా చేయకపోతే గంభీరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని మాకు చెప్పారు. మేము హైల్ హిట్లర్ అని పలుకవలసిన తంతు జరుగుతున్న సమయంలో, నేను గౌరవపూర్వకంగా నిలుచున్నాను కానీ అవసరమైన ఆ క్రియ చేయలేదు. నన్ను అదే రోజు ఆఫీసుకు పిలిచి, నా జీతం ఇచ్చేసి, నన్ను పనిలోనుండి పీకేశారు. ఉద్యోగాల కొరత ఎంతో ఎక్కువగా ఉండేది గనుక, పయినీరు సేవ చేయాలన్న నా పథకాలు ఏమౌతాయని నేను చింతించాను. అయితే, ఆ మర్నాడే, నాకు మరింత మంచి జీతంతో ఒక కొత్త ఉద్యోగం దొరికింది.
ఇప్పుడు పయినీరు చేయాలన్న నా కోరిక నెరవేరగలదు. నేను అనేకమంది పయినీరు సహవాసులతో కలిసి సేవ చేశాను, మరి నా చివరి సహవాసి యులిష్కా ఆస్టలాష్. మేము పరిచర్యలో మా బైబిళ్లను మాత్రమే ఉపయోగించే వాళ్లం, మేము అందించేందుకు మా వద్ద ప్రచురణలు ఉండేవి కావు. మేము ఆసక్తిగల ప్రజలను కలిసినప్పుడు, మేము పునర్దర్శనాలు చేసే వాళ్లం, వాళ్లకు ప్రచురణలను అరువు ఇచ్చే వాళ్ళం.
నేనూ యులిష్కా అనేకసార్లు వేర్వేరు ప్రాంతాల్లో పని చేయవలసి వచ్చేది. ఇది ప్రీస్టుల మూలంగా సంభవించేది, మేము ‘తమ గొఱ్ఱెల’ను దర్శిస్తున్నామనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, యెహోవాసాక్షులు తమను ఒకవేళ దర్శిస్తే వారు తమకైనా లేక పోలీసులకైనా చెప్పాలని ఆయా ప్రాంతాల్లోని ప్రీస్టులు తమ చర్చిల్లో ప్రకటించేవారు. అలాంటి ప్రకటనలను గురించి స్నేహశీలులైన ప్రజలు మాకు చెప్పినప్పుడు, మేము మరొక ప్రాంతానికి వెళ్లిపోయేవాళ్లం.
ఒకరోజు నేనూ యులిష్కా ఒక యౌవనస్థుణ్ని దర్శించాం, అతడు ఆసక్తి చూపించాడు. మేము అతడికి పుస్తకాలను అరువు ఇచ్చేందుకని అతణ్ని పునర్దర్శించేందుకు సమయాన్ని నిర్ణయించాం. అయితే మేము తిరిగి వెళ్లేసరికి అక్కడ పోలీసులున్నారు, మమ్మల్ని అరెస్టు చేసి డునావెచీలోని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. మమ్మల్ని పట్టుకునేందుకు ఆ కుర్రవాడ్ని ఎరలా ఉపయోగించారు. మేము పోలీస్ స్టేషన్ చేరుకున్నప్పుడు మేము అక్కడ ఒక ప్రీస్టును చూశాం, మరి అతడు కూడా అందులో చేరి ఉన్నాడని మేము తెలుసుకున్నాము.
నా అతిఘోరమైన శ్రమ
అక్కడ పోలీస్ స్టేషన్లో, నా వెంట్రుకలన్నీ కత్తిరించేశారు, మరి దాదాపు ఒక డజనుమంది పోలీసుల ఎదుట నేను వివస్త్రగా నిలబడవలసి వచ్చింది. హంగెరీలో మా నాయకుడెవరో తెలుసుకునేందుకు వాళ్లు నన్ను ఇంటరాగేట్ చేశారు. మాకు యేసుక్రీస్తు తప్ప మరో నాయకుడు లేడని నేను వివరించాను. తర్వాత వాళ్లు తమ లాఠీలతో నన్ను నిర్దయగా కొట్టారు, అయినా నేను నా క్రైస్తవ సహోదరుల పేర్లు చెప్పలేదు.
తర్వాత, వాళ్లు నా కాళ్లను కలిపి కట్టి, నా చేతులను నా తలపైగా కలిపి కట్టారు. తర్వాత, ఒకరి తర్వాత ఒకరుగా, ఒక్క పోలీసు వ్యక్తి తప్ప మిగతా అందరూ నన్ను మానభంగం చేశారు. నన్ను ఎంత గట్టిగా కట్టేశారంటే, మూడు సంవత్సరాల తర్వాత కూడా నా చేతులపై ఆ గురుతులు ఉన్నాయి. నా పట్ల వాళ్లు ఎంత పాశవికంగా ప్రవర్తించారంటే, నాకు కలిగిన అత్యంత తీవ్రమైన గాయాలు కాస్త మానేంత వరకూ నన్ను వాళ్లు రెండు వారాలపాటు నేల మాళిగలో ఉంచారు.
ఉపశమన కాలం
తర్వాత నన్ను నాజ్కానిజాలోని ఒక చెరసాలకు తీసుకెళ్లారు, అక్కడ అనేకమంది యెహోవాసాక్షులు ఉన్నారు. మేము చెరసాలలో ఉన్నప్పటికీ, సాపేక్షికంగా ఆనందమయమైన రెండు సంవత్సరాలను గడిపాము. మేము మా కూటాలను అన్నింటినీ రహస్యంగా జరుపుకున్నాం, మేము దాదాపు ఒక సంఘంగానే పని చేశాము. మేము అనియత సాక్ష్యం ఇచ్చేందుకు కూడా మాకు అనేక అవకాశాలు లభించాయి. మా అమ్మకూ నాకూ బైబిలు సత్యాన్ని పరిచయం చేసిన స్త్రీ అయిన ఎర్జేబెత్ స్లేజింగర్ యొక్క స్వంత సహోదరియైన ఓల్గా స్లేజింగర్ను నేను ఆ చెరసాలలోనే కలిశాను.
1944 కల్లా, హంగెరీలోని నాజీలు, హంగెరీకి చెందిన యూదులను అందరినీ అంతమొందించాలని తీర్మానించుకున్నారు. నాజీలు ఆక్రమించుకున్న ఇతర ప్రాంతాల్లో కూడా వారు యూదులను అలాగే క్రమపద్ధతిలో అంతమొందించారు. ఒకరోజు వాళ్లు ఓల్గానూ నన్నూ తీసుకెళ్లేందుకు వచ్చారు. మేము రైల్వే పశువుల బళ్లలోకి నింపబడ్డాం, చెకోస్లవేకియాగుండా సాగిన అత్యంత కష్టతరమైన ప్రయాణం తర్వాత, మేము దక్షిణాది పోలండ్లోని మా గమ్యస్థానానికి చేరుకున్నాము—అదే ఆష్విట్స్ నందలి మరణ శిబిరం.
ఆష్విట్స్లో తట్టుకుని ఉండటం
నేను ఓల్గాతో ఉన్నప్పుడు క్షేమంగా ఉన్నానని భావించాను. ఎంతో కలత కలిగించే పరిస్థితుల్లో కూడా ఆమె హాస్యస్ఫూర్తితో ఉండగలదు. మేము ఆష్విట్స్కి వచ్చినప్పుడు, క్రూరుడని పేరు గాంచిన డా. మింగెల్ ఎదుటకు మమ్మల్ని తీసుకువెళ్ళారు, కొత్తగా వచ్చిన వారిలో పని చేయలేని వారినీ దృఢకాయులనూ వేరు చేయడమే అతడి పని. పనిచేయలేని వాళ్లను గ్యాస్ ఛాంబర్లలోకి పంపించే వాళ్లు. మా వద్దకు వచ్చినప్పుడు, “నీ వయస్సెంత?” అని మింగెల్ ఓల్గాను అడిగాడు.
ధైర్యంగా, మరియు తన కళ్లలో చమత్కారంతో ఆమె “ఇరవై” అని సమాధానమిచ్చింది. వాస్తవానికి ఆమె వయస్సు దానికి రెండింతలు. అయితే మింగెల్ నవ్వేశాడు, ఆమెను కుడి వైపుకు పంపించాడు. అలా ఆమె బ్రదికి ఉండగలిగింది.
ఆష్విట్స్లోని ఖైదీలందరికీ తమ చెరసాల బట్టలపై గురుతులు ఉండేవి,—యూదులకు దావీదు నక్షత్రం ఉండేది, యెహోవాసాక్షులకు ఊదారంగు త్రికోణం ఉండేది. మా బట్టలపై వాళ్లు దావీదు నక్షత్రాన్ని కుట్టబోతుంటే, మేము యెహోవాసాక్షులం గనుక మాకు ఊదారంగు త్రికోణం కావాలని మేము వివరించాము. మేము మా యూదా వారసత్వం విషయమై సిగ్గుపడలేదు కానీ మేము ఇప్పుడు యెహోవాసాక్షులం గనుక మేమలా చేశాం. మమ్మల్ని తన్నడం, కొట్టడం ద్వారా మేము యూదా గుర్తులను అంగీకరించేందుకు మమ్మల్ని బలవంతపెట్టాలని వాళ్లు ప్రయత్నించారు. వాళ్లు చివరకు మమ్మల్ని యెహోవాసాక్షులుగా అంగీకరించేంత వరకూ మేము దృఢంగా నిలిచాము.
కొంత కాలానికి, నాకంటే మూడు సంవత్సరాలు చిన్నదైన నా చెల్లి ఎల్విరాను నేను కలిశాను. ఏడుగురు సభ్యులున్న మా కుటుంబం ఆష్విట్స్కి తీసుకెళ్లబడింది. నేను ఎల్విరా మాత్రమే పని చేసేందుకు పనికి వస్తామని తీర్మానించారు. నాన్నా, అమ్మా, మరియు నా తోబుట్టువుల్లో ముగ్గురు గ్యాస్ ఛాంబర్లలో మరణించారు. ఎల్విరా అప్పట్లో ఒక సాక్షి కాదు, అందుకు క్యాంపులో మేమిద్దరమూ ఒకే స్థలంలో ఉండలేదు. ఆమె సజీవంగా బయటపడింది, అమెరికాకు వలస వెళ్లింది, మరి పెన్సిల్వేనియా నందలి పిట్స్బర్గ్లో ఒక సాక్షి అయ్యింది, తర్వాత 1973లో చనిపోయింది.
ఇతర శిబిరాల్లో తట్టుకోవడం
1944/45 శీతాకాలంలో, రష్యా వారు సమీపిస్తున్నారు గనుక ఆష్విట్స్ని ఖాళీ చేయాలని జర్మనీ వారు తీర్మానించారు. కాబట్టి జర్మనీ యొక్క ఉత్తర భాగంలోని బెర్గన్-బెల్సన్కు మమ్మల్ని తరలించారు. మేము అక్కడికి చేరుకున్న వెంటనే, నన్నూ ఓల్గానూ బ్రౌన్ష్వీక్కు పంపించారు. మిత్రపక్ష రాజ్యాలు వేసిన బాంబుల ద్వారా జరిగిన విధ్వంసం తర్వాత ఏర్పడిన చెత్తను మేము తీసివేయడమే మా పని. ఓల్గా, నేను విషయాలను చర్చించాం. ఈ పని చేయడం మా తటస్థతను భంగపర్చుతుందో లేదో మాకు స్పష్టంగా తెలియలేదు గనుక, మేమిద్దరమూ ఆ పనిలో భాగం వహించకుండా ఉండాలని తీర్మానించుకున్నాము.
మా నిర్ణయం ఎంతో అలజడి రేపింది. మమ్మల్ని తోలు కొరడాలతో కొట్టారు, తర్వాత తుపాకులతో కాల్చే స్క్వాడ్ ఎదుటకు మమ్మల్ని తీసుకెళ్లారు. మేము విషయాన్ని గురించి మళ్లీ ఆలోచించుకునేందుకు మాకు ఒక నిమిషం సమయం ఇచ్చారు, మరి మేము మా మనస్సులను మార్చుకోకపోతే, మమ్మల్ని కాల్చేస్తామని వాళ్లు మాకు చెప్పారు. మేము మా నిర్ణయం తీసేసుకున్నాము గనుక మాకు సమయం అవసరం లేదని మేము చెప్పాం. అయితే, క్యాంప్ కమాండర్ అక్కడ లేడు గనుక, చంపేందుకు ఆజ్ఞాపించగల అధికారం ఆయనకు మాత్రమే ఉంది గనుక, మమ్మల్ని అప్పుడే చంపేందుకు వీలు కుదరలేదు.
అంతవరకు, మేము పూర్తి దినమంతా క్యాంపు ఆవరణలో నిలబడవలసి వచ్చింది. సాయుధులైన ఇద్దరు సైనికులు మమ్మల్ని కాపలా కాచారు, వాళ్లు ప్రతి రెండు గంటలకు డ్యూటీ మారే వాళ్లు. మాకు ఆహారం ఇవ్వబడలేదు, అది ఫిబ్రవరి నెల గనుక చలి మూలంగా మేము చాలా కష్టం అనుభవించాం. ఈ విధమైన పరిస్థితి ఒక వారం వరకూ కొనసాగింది, అయితే కమాండర్ రానేలేదు. కాబట్టి మమ్మల్ని ట్రక్ వెనక భాగంలో ఎక్కించుకుని, బెర్గన్-బెల్సన్కు తీసుకువచ్చారు. అది మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
అప్పటికే ఓల్గా నేనూ ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. నా వెండ్రుకలన్నీ ఊడిపోయాయి, నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. నేను ఎంతో తీవ్రంగా కృషి చేసినా కాస్త పని మాత్రమే చేయగలిగే దాన్ని. ప్రతి దినమూ ఇవ్వబడే చాలా పల్చగా ఉండే క్యాబేజీ సూప్, చిన్న బ్రెడ్ ముక్క మాకు ఎక్కడికీ సరిపోయేవి కాదు. అయితే మేము పని చేయడం తప్పనిసరి, ఎందుకంటే పని చేయలేని వారు చంపబడేవారు. నాతోపాటు కిచెన్లో పని చేసే జర్మన్ సహోదరీలు నేను కాస్త అలసట తీర్చుకునేందుకు సహాయపడే వారు. తనిఖీ చేసే గార్డులు వస్తున్నప్పుడు, ఆ సహోదరీలు నన్ను హెచ్చరించేవారు, అప్పుడు నేను చాలా కష్టపడి పని చేస్తున్న దానిలా పని బెంచి వద్ద నిలబడేదాన్ని.
ఒక రోజు ఓల్గాకు తన పని స్థలానికి వెళ్లేందుకు శక్తి సరిపోలేదు, మరి ఆ తర్వాత మేము ఆమెను చూడలేదు. శిబిరంలో ఉన్న కష్టతరమైన ఆ నెలల్లో నాకు ఎంతో సహాయం చేసిన ధైర్యవంతురాలైన ఒక స్నేహితురాలినీ, సహవాసినీ నేను కోల్పోయాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అభిషిక్త అనుచరురాలిగా, ఆమె తన పరలోక ప్రతిఫలాన్ని వెనువెంటనే అందుకుని ఉంటుంది.—ప్రకటన 14:13.
విడుదల మరియు ఆ తర్వాతి జీవితం
మే 1945లో యుద్ధం అంతమై స్వేచ్ఛ లభించినప్పుడు, నేను ఎంత బలహీనంగా ఉన్నానంటే మమ్మల్ని అణచివేసిన వారి కాడి చివరకు త్రుంచివేయబడిందని నేను ఆనందించేందుకు కూడా నాకు శక్తి చాలలేదు; మరి స్వేచ్ఛ పొందిన వారిని తమ దేశంలోకి తీసుకునేందుకు సుముఖంగా ఉన్న దేశాలకు పంపబడుతున్న గుంపులలో కూడా నేను కలువలేక పోయాను. శక్తిని కూడదీసుకునేందుకు నేను ఆసుపత్రిలో మూడు నెలలు ఉండిపోయాను. దాని తర్వాత నన్ను స్వీడెన్కు తీసుకువెళ్లారు, అది నా కొత్త ఇల్లు అయ్యింది. వెంటనే నేను నా క్రైస్తవ సహోదర సహోదరీలను కలుసుకున్నాను, మరి కొంత కాలానికి నేను క్షేత్రసేవ అనే ప్రశస్తమైన సంపదను తిరిగి పొందాను.
మరి 1949లో నేను లెన్నార్ట్ యుసెఫ్సన్ను వివాహమాడాను, ఆయన యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తగా అనేక సంవత్సరాలు సేవ చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విశ్వాసాన్ని కాపాడుకున్నందు మూలాన ఆయన కూడా చెరసాలలో వేయబడ్డాడు. మేము సెప్టెంబరు 1, 1949లో పయినీర్లుగా కలిసి మా జీవితాన్ని ప్రారంభించాము, మరి మేము బోరాస్ పట్టణానికి నియమించబడ్డాము. మేము అక్కడ గడిపిన మొదటి సంవత్సరాల్లో, ఆసక్తిగల వారితో మేము ప్రతివారం పది బైబిలు పఠనాలను క్రమంగా నిర్వహించే వాళ్లం. బోరాస్లోని సంఘం తొమ్మిది సంవత్సరాల్లో మూడు సంఘాలుగా పెరగడాన్ని చూసే ఆనందం మాకు దక్కింది, మరి ఇప్పుడు అక్కడ ఐదు సంఘాలున్నాయి.
నేను ఎంతో కాలం పయినీరుగా సేవ చేయలేకపోయాను, ఎందుకంటే 1950లో మాకు కుమార్తె పుట్టింది; మరి రెండేళ్ల తర్వాత మాకు ఒక కుమారుడు పుట్టాడు. అలా, నాకు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పుడు, హంగెరీలోని ఒక ప్రియ సహోదరుడు “యెహోవాను సేవించడం మానవులకు అత్యంత గౌరవపూర్వకమైన విషయం” అని నేర్పించిన ప్రశస్తమైన సత్యాన్ని మా పిల్లలకు బోధించగల ఆనందకరమైన ఆధిక్యత నాకు లభించింది.
నా జీవితాన్ని గురించి మళ్లీ ఆలోచిస్తే, యోబు యొక్క సహనాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ శిష్యుడైన యాకోబు చెప్పిన విషయం యొక్క సత్యత్వాన్ని నేను అనుభవించానని గుర్తిస్తున్నాను: “[“యెహోవా,” NW] ఎంతో జాలియు కనికరమును గలవా[డు].” (యాకోబు 5:11) నేను కూడా ఘోరమైన శ్రమలను సహించినప్పటికీ, నేను ఇద్దరు పిల్లలనూ, వాళ్ల భాగస్వాములనూ, మరియు ఆరుగురు మనుమలను—అందరూ యెహోవా ఆరాధకులే—కలిగి ఉండేలా గొప్పగా దీవించబడ్డాను. దానికి తోడు, నాకు అనేకమంది ఆధ్యాత్మిక పిల్లలూ, మనుమలూ ఉన్నారు, వారిలో కొందరు పయినీర్లుగానూ మిషనరీలుగానూ సేవ చేస్తున్నారు. ఇప్పుడు నా గొప్ప నిరీక్షణ మరణమందు నిద్రిస్తున్న ప్రియమైన వాళ్లను కలుసుకోవాలి, మరి వారు తమ జ్ఞాపకార్థ సమాధుల్లోనుండి బయటకు వచ్చినప్పుడు వాళ్లను ఆలింగనం చేసుకోవాలి అన్నదే.—యోహాను 5:28, 29.
[31వ పేజీలోని చిత్రం]
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడెన్నందు పరిచర్యలో
[31వ పేజీలోని చిత్రం]
నా భర్తతో