గిలియడ్ స్కూలు “భూదిగంతముల వరకు” మిషనరీలను పంపిస్తోంది
నేటికి యాభై సంవత్సరాలకు పైగా వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ వివిధ దేశాలకు మిషనరీలను పంపిస్తూ వచ్చింది. 1999, సెప్టెంబరు 11న గిలియడ్ స్కూల్లో 107వ తరగతి విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఆ తరగతిలో 11 దేశాల నుండి వచ్చిన 48 మంది విద్యార్థులు ఉన్నారు, వారు 24 దేశాల్లో సేవ చేయటానికి పంపించబడ్డారు. వీరు, యేసు పరలోకానికి ఆరోహణమవ్వటానికి ముందు పల్కిన చివరి మాటల్ని నెరవేర్చటంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన వేలాదిమంది ఇతర మిషనరీల్లో ఒక భాగమౌతారు. తన శిష్యులు “భూదిగంతముల వరకు . . . [తనకు] సాక్షులైయుందురని” యేసు ప్రవచించాడు.—అపొస్తలుల కార్యములు 1:8.
న్యూయార్క్‌లోని ప్యాటర్సన్లో ఉన్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్లో జరిగిన ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం అక్కడి అందమైన పరిసరాల్లో అందరికీ ఆనందాన్ని తీసుకువచ్చింది. పట్టభద్రులౌతున్న విద్యార్థుల బంధువులు, దగ్గరి స్నేహితులు, అతిథులు ఉన్నారు, ఇది వారి ఆనందానికి మరో కారణం. బ్రూక్లిన్, వాల్కిల్లకు ఆడియో, వీడియో కనెక్షన్లు ఏర్పాటు చేయటంతో ఈ కార్యక్రమాన్ని విని చూసి ఆనందించిన వారి పూర్తి సంఖ్య 4,992గా ఉంది.
యెహోవాకూ పొరుగు వారికీ విశ్వసనీయమైన సేవ
“యెహోవావైపు ఎవరున్నారు?” పరిపాలక సభ సభ్యుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి చైర్మన్ అయిన క్యారీ బార్బర్ చేసిన ఉపోద్ఘాత వ్యాఖ్యానాలకు విషయం అది. మోషే కాలంలోని ఇశ్రాయేలీయుల ముందు కూడా అదే ప్రశ్న ఉన్నదని ఆయన వివరించారు. ఇశ్రాయేలీయుల్లో చాలామంది యెహోవావైపు నమ్మకంగా ఉండనందున అరణ్యంలో తమ ప్రాణాలు కోల్పోయారని పట్టభద్రులౌతున్న విద్యార్థులకూ అక్కడ హాజరైన వారికీ గుర్తుచేయబడింది. విగ్రహారాధనలో పడిపోయిన తర్వాత వారు “తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.” (నిర్గమకాండము 32:1-29) అలాంటి ప్రమాదాన్ని గురించే యేసు క్రైస్తవులను హెచ్చరించాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”—లూకా 21:34-36.
తర్వాతి ప్రసంగీకునిగా రైటింగ్ డిపార్ట్మెంట్లోని జీన్ స్మాలీ వచ్చి, విద్యార్థులను “మీరు పారగోరిక్గా [నొప్పినివారిణి] ఉంటారా?” అని అడిగారు. పారీగోరియా అనే గ్రీకు పదం ఇంగ్లీషులో నొప్పిని హరించివేసే ఔషధ ద్రవానికి ఒక పేరుగా స్థిరపడిందని ఆయన వివరించారు. అయితే, అపొస్తలుడైన పౌలు వివరణాత్మకమైన ఈ గ్రీకు వ్యక్తీకరణను కొలొస్సయులు 4:11లో తన తోటి పనివారిని వర్ణించటానికి ఉపయోగించాడు. తెలుగు బైబిలులో దాన్ని “ఆదరణ” అని అనువదించారు.
పట్టభద్రులౌతున్న విద్యార్థులు తమ నియామకాల్లో, నమ్రతతో స్థానిక సహోదర సహోదరీలకు ఆదరణగా ఉంటూ, తోటి మిషనరీలకు సహకారాన్నిస్తూ ప్రేమపూర్వకంగా ఉంటూ ఆధునిక పారగోరిక్లుగా ఉండగలరు.
పరిపాలక సభ సభ్యుడైన డానియెల్ సిడ్లిక్ తర్వాత “బంగారు సూత్రం ప్రకారం జీవించటం” అన్న విషయంపై మాట్లాడారు. యేసు మత్తయి 7:12లో, “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని చెబుతూ ఇచ్చిన ఉదాత్తమైన సూత్రంలో హానిచేయకుండా ఉండటం మాత్రమే కాదు గానీ ఇతరులకు మంచి చేయటం కూడా ఇమిడివుందని వివరించారు.
దీన్ని విజయవంతంగా చేయటానికి మూడు విషయాలు అవసరం: గమనించే కళ్ళు, సౌహార్ద్ర హృదయం, సహాయాన్నందించే చేయి. చివర్లో ఆయనిలా చెప్పాడు: “సహాయం చేయాలన్న తలంపు కలిగితే మనం వెంటనే ఆ సహాయాన్ని అందించాలి. ఇతరులు మనకు ఏమి చేయాలని మనం కోరుకుంటామో మనమూ అదే ఇతరులకు చేయటానికి అసాధారణమైన ప్రయత్నాలు చేయాలి.” నిజ క్రైస్తవత్వాన్ని అభ్యసించటానికి ప్రజలకు సహాయం చేయటానికి ఇతర దేశాలకు వెళ్ళే మిషనరీల విషయంలో ఇది మరీ వాస్తవం.
ఉపదేశకుల హృదయపూర్వకమైన జ్ఞాపికలు
పట్టభద్రులౌతున్న మిషనరీలను గిలియడ్ ఉపదేశకుడైన కార్ల్ ఆడమ్స్ “అభివృద్ధి చెందుతూ ఉండండి” అని ప్రోత్సహించాడు. ఏయే రంగాల్లో? మొట్టమొదటిగా జ్ఞానంలోను, దాన్ని చక్కగా ఉపయోగించటంలోను. బైబిలు వృత్తాంతాల నేపథ్యాలనూ, ఆ వృత్తాంతాలు జరిగిన సందర్భాలనూ గురించి పరిశోధన చేయడం ఎలాగో విద్యార్థులు గిలియడ్‌లో నేర్చుకున్నారు. ఒక్కొక్క వృత్తాంతం వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేయాలో పరిశీలించమని వారికి ప్రోత్సాహం ఇవ్వబడింది. అలా చేస్తూనే ఉండమని వారికి ఉద్బోధ చేయబడింది.
“రెండవదిగా, ప్రేమలో వర్ధిల్లుతూ ఉండండి. ప్రేమను ఎంతగా ప్రదర్శిస్తే అంతగా అది మీలో పెరుగుతుంది, లేకపోతే తరుగుతుంది” అని బ్రదర్ ఆడమ్స్ అన్నారు. (ఫిలిప్పీయులు 1:9) ఇప్పుడు మిషనరీలుగా వారు వేర్వేరు పరిస్థితుల్లో ప్రేమలో వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. మూడవదిగా: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి.” (2 పేతురు 3:18) “ఇది యెహోవా తన కుమారుని ద్వారా చూపించినటువంటి అద్భుతమైన కృప” అని ప్రసంగీకుడు అన్నాడు. “ఆ కృపపట్ల మనం మెప్పుదలను అభివృద్ధి చేసుకుంటుండగా, దేవుని చిత్తాన్ని చేయడంలోనూ ఆయన మనకిచ్చిన పనిని నిర్వర్తించటంలోనూ మనం పొందే ఆనందం పెరుగుతుంది.”
మరో గిలియడ్ ఉపదేశకుడైన మార్క్ న్యూమర్ “సవాళ్ళను ప్రేమతో స్వీకరించండి, మీరు సాధించగలరు” అన్న విషయంపై మాట్లాడారు. ఆయనిలా ఉద్బోధించాడు: “మిషనరీ జీవితంలో సవాళ్ళతో కూడిన పరిస్థితులను ప్రేమతో స్వీకరించటం నేర్చుకోండి, మీరు దాన్ని సాధించగలరు. యెహోవా తాను ప్రేమించే వారికి మాత్రమే క్రమశిక్షణనిస్తాడు. ఒకానొక సలహా సరైన ఆధారం లేనిదని, రాద్ధాంతం చేయటానికే ఉద్దేశించబడినదని, లేక అనుచితమైనదని భావించటానికి బదులుగా, యెహోవాపట్ల ప్రేమా, ఆయనతో మీకున్న సంబంధమూ ఆ సలహాను స్వీకరించటానికి మీకు సహాయం చేస్తాయి.”
మిషనరీ సేవలో అనేకమైన విధులు ఉంటాయని బ్రదర్ న్యూమర్ గుర్తుచేశారు. “కానీ ప్రేమ లేని విధులు మిమ్మల్ని అసంతృప్తుల్ని చేస్తాయి. ప్రేమ లేకపోతే వంట చేయటం, వస్తువులు కొనుగోలు చేయటం, ఆపిల్లను శుభ్రం చేయటం, నీళ్ళను కాచటం వంటి మీ ఇంటి పనులు కూడా భారమైనవిగా తయారు కాగలవు. మీరొక్క క్షణం ఆగి, ‘నేనీ పనులు ఎందుకు చేస్తున్నాను?’ అని ప్రశ్నించుకోవాలి. దానికి జవాబుగా మీరు, ‘నేను చేసే ప్రయత్నాలు తోటి మిషనరీల ఆరోగ్యానందాలకు దోహదపడుతున్నాయి’ అని మీకు మీరు చెప్పుకుంటే అప్పుడు ఆ పనుల్ని చేయటం కష్టంగా ఉండదు. చివరిగా ఆయన ఇలా ఉద్బోధించాడు: “క్రమశిక్షణను అంగీకరించటమైనా, మీ మిషనరీ విధుల్ని నిర్వర్తించటమైనా, లేదా అపార్థాల్ని నివారించటమైనా సమస్తాన్నీ ప్రేమతో తీసుకుంటే మీ నియామకంలో మీరు సహనాన్ని కనపర్చటానికి సాధ్యపడుతుంది. ‘ప్రేమ శాశ్వతకాలముంటుంది.’”—1 కొరింథీయులు 13:8.
విద్యార్థులు స్థానిక సంఘాలతో పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఆనందకరమైన అనేక అనుభవాల్ని తిరిగి ప్రదర్శించే కార్యక్రమానికి గిలియడ్ ఉపదేశకుడైన వాలెస్ లివరెన్స్ నిర్వాహకునిగా ఉన్నారు. ఇంటింటికీ వెళ్ళటానికి తోడు వారు తమ మిషనరీ శిక్షణను ఉపయోగిస్తూ ట్రక్కులు ఆగేచోట్ల, లాండ్రీలలో, రైల్వే స్టేషన్లలో, మరితర స్థలాల్లో ప్రజలతో మాట్లాడారు.
అనుభవజ్ఞులైన మిషనరీలు అభయాన్నిస్తున్నారు
క్రొత్త మిషనరీలు విదేశానికి వెళ్ళినప్పుడు చింతాక్రాంతులవ్వాలా? విదేశీ నియామకంలో ఇమిడివుండే సవాళ్ళను వారు ఎదుర్కోగలరా? తమ దేశానికి క్రొత్తగా వచ్చిన వీరు సఫలులయ్యేలా సహాయాన్నందించటానికి బ్రాంచి కార్యాలయాలు ఏమి చేస్తాయి? వీటికీ మరితర ప్రశ్నలకూ జవాబివ్వటానికి సర్వీస్ డిపార్ట్మెంట్లోని స్టీవెన్ లెట్, రైటింగ్ డిపార్ట్మెంట్లోని డేవిడ్ స్ప్లేన్ ఆ సమయంలో వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్లో బ్రాంచి స్కూలుకు హాజరౌతున్న సహోదరులను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేయబడిన సహోదరులు స్పెయిన్, హాంగ్‌కాంగ్, లైబీరియా, బెనిన్, మడగాస్కర్, బ్రెజిల్, జపాన్ దేశాల్లోని బ్రాంచీల్లో సేవచేస్తున్నారు.
అనుభవజ్ఞులైన ఈ యెహోవా సేవకులు—వీరిలో అనేకులు దశాబ్దాలపాటు మిషనరీలుగా సేవచేశారు—పట్టభద్రులౌతున్న విద్యార్థులకూ అలాగే అక్కడ హాజరైవున్న వారి తల్లిదండ్రులకు బంధువులకు పూర్తి అభయాన్నిచ్చారు. తమ స్వంత అనుభవాలపై, తమ తోటి మిషనరీల అనుభవాలపై ఆధారపడి వారు సమస్యల్నీ చింతల్నీ విజయవంతంగా అధిగమించవచ్చని చూపించారు. వారు ఎదుర్కొనే సమస్య పెద్దదే కావచ్చు “కానీ దాన్ని పరిష్కరించవచ్చు, ఇందుకు సొసైటీ మనకు సహాయం చేస్తుంది” అని మడగాస్కర్‌లోని రైమో క్వోకానెన్ అనే మిషనరీ వ్యాఖ్యానించాడు. “మేము మా నియామకాన్ని ఎంపిక చేసుకోలేదు, మేము దాన్ని పొందాము” అని ఇప్పుడు బ్రెజిల్లో సేవ చేస్తున్న ఓయ్స్టన్ గస్టావ్సన్ చెప్పాడు. “అందుకని దానికి అంటిపెట్టుకుని ఉండటానికి మేము చేతనైనంత చేద్దామని నిర్ణయించుకున్నాము.” తనకు సహాయకరంగా ఉన్నది “మిషనరీ నియామకంలో అప్పటికే సేవచేస్తున్న సహోదరుల సన్నిధానమే” అని జపాన్‌లో సేవచేస్తున్న జేమ్స్ లింటన్ చెప్పాడు. యెహోవాకు సేవచేయటానికి, ఆయన గొఱ్ఱెల మందకు కాపుదలనివ్వటానికి మిషనరీ సేవ ఆనందకరమైన సంతృప్తికరమైన మార్గం.
ఆధ్యాత్మికతను హరించివేసే మహామారిని నివారించడం
పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్ జారజ్ 1946లో ఏడవ గిలియడ్ తరగతి నుండి పట్టభద్రులయ్యారు. ఆయన “ఆధ్యాత్మికంగా సజీవంగా కొనసాగడమనే సవాలు” అనే అంశంపై చివరి ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న దారుణ కృత్యాలను గుర్తిస్తూనే, నిజానికి మానవజాతిపై ఇంకా ఘోరమైన విపత్తులు వచ్చిపడుతున్నాయని ఆయన ఎత్తిచూపించారు.
కీర్తన 91ని సూచిస్తూ బ్రదర్ జారజ్, మన చుట్టూ ఉన్న లక్షలాదిమందికి ఆధ్యాత్మిక రోగాల్ని కలుగజేస్తూ, ఆధ్యాత్మిక అర్థంలో లక్షలాదిమందిని పొట్టనబెట్టుకున్న “తెగులు”నూ ‘పాడుచేయు రోగాన్నీ’ గుర్తించారు. అపవాది, అలాగే వాని దుష్ట విధానంలో భాగస్థులూ యెహోవా సేవకుల్ని బలహీనపర్చటానికీ వారిని ఆధ్యాత్మికంగా హతం చేయటానికీ మానవ మేదస్సుపై ఆధారపడిన వస్తుసంపదలపై ఆధారపడిన ప్రచారాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఈ తెగులు “మహోన్నతుని చాటున నివసించు” వారి మీదికి రాదని యెహోవా హామీ ఇస్తున్నాడు.—కీర్తన 91:1-7.
“సవాలు ఏమిటంటే విశ్వాసంలో ఆరోగ్యంగా ఉంటూ, భద్రమైన స్థలంలో నిలిచివుండటమే” అని బ్రదర్ జారజ్ అన్నారు. “మనం ‘ఆత్మ లేని’ అపహాసకుల్లా ఉండలేము. నేటి సమస్యల్లో ఇది ఒకటి. సంస్థలో ఉన్న మనందరికీ ఎదురయ్యే సమస్య ఇది. ఇది మీ మిషనరీ నియామకంలో మీకు కూడా ఎదురుకాగలదు.” (యూదా 18, 19) కానీ పట్టభద్రులౌతున్న మిషనరీలు తమ నియామకాల్లో ఆధ్యాత్మికతను విజయవంతంగా కాపాడుకోగలరని వారు ప్రోత్సహించబడ్డారు. ఉదాహరణకు, మన సహోదరులు నిషేధాలున్నా, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా, అపహాస్యం చేయబడుతున్నా నాస్తికవాద ప్రచారం కొనసాగుతున్నా, అబద్ధారోపణలు ముంచెత్తుతున్నా రష్యాలో, ఆసియా ఆఫ్రికాల్లోని దేశాల్లో ఎలా సహనాన్ని కనపరుస్తున్నారో పరిశీలించమని వారు ఉద్బోధించబడ్డారు. అనేక సందర్భాల్లో జాతిపరమైన సంఘర్షణల మూలంగా, నిత్యావసరాల కొరతల మూలంగా శారీరక సమస్యలు వీటికి తోడౌతున్నాయి.
ఆధ్యాత్మికతలో కొరత ఏర్పడినప్పుడు “దానికి కారణమైన సమస్యను పరిశీలించటం అవసరం. దేవుని వాక్యంలోని సలహాలను ఉపయోగిస్తూ ఆ సమస్యను పరిష్కరించటానికి పనిచేయటం అవసరం.” బైబిలు మాదిరులు ఇవ్వబడ్డాయి. యెహోషువ తన ధర్మశాస్త్ర ప్రతిని ప్రతిరోజు మననం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించబడ్డాడు. (యెహోషువ 1:8) యోషీయా కాలంలో ధర్మశాస్త్ర ప్రతి దొరికినప్పుడు అందులోని నిర్దేశాలను నమ్మకంగా పాటించినందుకు యెహోవా ఆశీర్వదించాడు. (2 రాజులు 23:2, 3) తిమోతికి బాల్యం నుండే పరిశుద్ధ లేఖనాలు తెలుసు. (2 తిమోతి 3:14, 15) బెరయ వాసులు కేవలం చక్కగా విని మాత్రమే ఊరుకోలేదు: వారు లేఖనాలను ప్రతిదినము పరిశీలించారు గనుకనే వారు “ఘనులైయుండిరి” అని చెప్పబడింది. (అపొస్తలుల కార్యములు 17:10, 11) దేవుని వాక్యాన్ని ఎరిగి దాన్ని ఉపయోగించిన వారిలో ప్రథమ ఉదాహరణ యేసుక్రీస్తు.—మత్తయి 4:1-11.
కార్యక్రమాన్ని ముగిస్తూ బ్రదర్ జారజ్ క్రొత్త మిషనరీలను ఇలా ప్రోత్సహించాడు: “మీరిప్పుడు మీ మిషనరీ నియామకాన్ని నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు, కచ్చితంగా చెప్పాలంటే భూదిగంతముల వరకు వెళ్ళబోతున్నారు. ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండటానికి విరుద్ధంగా సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని మనం అధిగమిస్తే మనం తీర్మానించుకున్న దాన్ని చేయకుండా ఏదీ అడ్డగించలేదు. మీరు అత్యుత్సాహంతో ప్రకటించనైయున్నారు, ఇతరులు మీ విశ్వాసాన్ని అనుకరించేందుకు పురికొల్పనైయున్నారు, మీరు బోధించేవారినీ మమ్మల్నీ యెహోవా సజీవంగా కాపాడాలని మేము మీతోపాటు ప్రార్థిస్తున్నాము. ఆ విధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న ఆధ్యాత్మిక విపత్తునుండి అనేకమంది తప్పించుకోనైయున్నారు. వారు యెహోవా చిత్తం చేయటంలో మనతోపాటు చేరనైయున్నారు. ఆ లక్ష్యాన్ని చేరటానికి యెహోవా మిమ్మల్ని రక్షించునుగాక.”
ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అభినందనలను చైర్మన్ చదివిన తర్వాత పట్టభద్రులౌతున్న విద్యార్థులకు వారి డిప్లొమాలు ఇచ్చే కార్యక్రమం మిగిలింది. అటుతర్వాత విద్యార్థులు మెప్పుదలతో కలిసి వ్రాసిన ఉత్తరాన్ని చదవడం జరిగింది. తాము పొందిన ప్రత్యేక శిక్షణ కోసమై, మిషనరీలుగా “భూదిగంతముల వరకు” వెళ్ళే నియామకాల కోసమై యెహోవాకూ, ఆయన సంస్థకూ వారు ఎంత కృతజ్ఞులై ఉన్నారో కదా!
[29వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 11
పంపించబడిన దేశాల సంఖ్య: 24
విద్యార్థుల సంఖ్య: 48
దంపతుల సంఖ్య: 24
సగటు వయస్సు: 34
సత్యంలో సగటు సంవత్సరాలు: 17
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 107వ తరగతి
ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఉన్నాయి.
1. పేరాల్టా, సి.; హోల్లెన్బెక్, బి.; షా, ఆర్.; హసన్, ఎన్.; మార్టిన్, డి.; హట్చిన్సన్, ఎ. 2. ఎడ్వర్డ్స్, ఎల్.; వేజర్, టి.; సెరూటి, క్యూ.; ఎంట్జ్మింగర్, జి.; డి’ఎలోయిస్, ఎల్.; బాగ్లియెరి, ఎల్. 3. నైట్, పి.; క్రావుస్, ఎ.; కాసుస్కె, డి.; రోజ్, ఎమ్. ఫ్రెడిల్, కె.; నైటో, ఆర్. 4. రోజ్, ఇ.; బాకుస్, టి.; టాలీ, ఎస్.; హమ్బర్ట్, డి.; బెర్న్‌హార్డ్, ఎ.; పేరాల్టా, ఎమ్. 5. డి’ఎలోయిస్, ఎ.; హమ్బర్ట్, డి.; డన్, హెచ్.; గాట్లింగ్, జి.; షా, జె.; సెరూటి, ఎమ్. 6. బాగ్లియెరి, ఎస్.; క్రావుస్, జె.; హోల్లెన్బెక్, టి.; మార్టిన్, ఎమ్.; బెర్న్‌హార్డ్, జె.; హట్చిన్సన్, ఎమ్. 7. బాకుస్, ఎ.; డన్, ఓ.; గాట్లింగ్, టి.; వేజర్, ఆర్.; నైట్, పి.; హసన్, ఓ. 8. నైటో, సి.; టాలీ, ఎమ్.; ఫ్రెడిల్, డి.; కాసుస్కె, ఎ.; ఎడ్వర్డ్స్, జె.; ఎంట్జ్మింగర్, ఎమ్.