కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/15 పేజీలు 24-27
  • మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించగలరు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన సేవకులను బలపరుస్తాడు
  • ‘ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించండి’
  • మన లోపల ఒక “జ్యోతి”లా
  • ఇనుముతో పదునుపెట్టబడినట్లు
  • ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి మంచి కారణం
  • వజ్రాలు ఎందుకంత ఖరీదైనవి?
    తేజరిల్లు!—1997
  • రాతి నుంచి రత్నానికి
    తేజరిల్లు!—1999
  • ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • పిల్లలారా, యౌవనులారా బాప్తిస్మం తర్వాత ప్రగతి సాధిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/15 పేజీలు 24-27

మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించగలరు

నిజమైన విలువను గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. వజ్రాల విషయంలో కూడా అది వాస్తవం. సానబెట్టిన వజ్రం మెరిసిపోతుంది, అయితే ముడి వజ్రం కేవలం మసగ్గా మెరుస్తుంది. అయినప్పటికీ, ముడి వజ్రంలోపల అందమైన రత్నం ఉండే సాధ్యత ఉంది.

క్రైస్తవులు అనేక విధాలుగా ముడి వజ్రాలను పోలివున్నారు. మనం ఇప్పటికీ పరిపూర్ణతకు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ, యెహోవా విలువైనదిగా ఎంచే ప్రాథమికమైన విలువ మనకుంది. వజ్రాల్లా, మనకందరికీ మన సొంత విశిష్టమైన లక్షణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలన్న హృదయపూర్వక కోరిక మనకుంటే మనలో ప్రతి ఒక్కరం మరింత అభివృద్ధిని సాధించగలుగుతాము. మన వ్యక్తిత్వాలకు సానబెట్టవచ్చు, అప్పుడవి యెహోవాకు మహిమను కలుగజేస్తూ మరింత తేజోవంతంగా ప్రకాశిస్తాయి.—1 కొరింథీయులు 10:31.

వజ్రాన్ని కోసి సానబెట్టిన తర్వాత, ప్రతిఫలించే దాని గుణాలను అధికం చేసే విధంగా అది పొదగబడుతుంది. అలాగే, మనం “నీతియు యథార్థమైన భక్తియుగలవా[రమై], దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు”కుంటే యెహోవా మనల్ని వివిధ నియామకాల్లో “పొదగగల్గుతాడు,” లేక ఉపయోగించుకోగల్గుతాడు.—ఎఫెసీయులు 4:20-24.

వజ్రం తన సహజ స్థితిలో ఉన్నప్పుడు చాలా అరుదుగా మాత్రమే రత్నంలా మెరుస్తుంది, అలాగే అలాంటి ఆధ్యాత్మిక అభివృద్ధి దానంతటదే జరగకపోవచ్చు. తరచూ కలిగే బలహీనత నుండి మనల్ని మనం దూరం చేసుకోవాల్సి ఉండవచ్చు, బాధ్యత చేపట్టే విషయంలో మన దృక్పథాన్ని సరిచేసుకోవాల్సి ఉండవచ్చు, లేక ఆధ్యాత్మిక గాడి నుండి బయటపడడానికి కృషి చేయవలసి ఉండవచ్చు కూడా. కాని నిజంగా అభివృద్ధి సాధించాలనే కోరిక మనకుంటే మనం అభివృద్ధి సాధించగల్గుతాము, ఎందుకంటే యెహోవా దేవుడు మనకు “బలాధిక్యము” నివ్వగలడు.—2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13.

యెహోవా తన సేవకులను బలపరుస్తాడు

వజ్రాలను కోయడానికి కచ్చితమైన జ్ఞానం వల్ల కలిగే నమ్మకం అవసరం, ఎందుకంటే ముడి వజ్రం నుండి ఒక భాగాన్ని కోసివేసామంటే ఇక దాన్ని నష్టపోయినట్లే. తగిన ఆకారాన్ని తీసుకురావడానికి ఖరీదైన పదార్థాన్ని—కొన్నిసార్లు ముడి పదార్థంలోని దాదాపు 50 శాతం వరకు—కోసివేయవలసి ఉంటుంది. మనం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి మనకు కూడా కచ్చితమైన జ్ఞానం వల్ల కలిగే నమ్మకం అవసరం. ప్రాముఖ్యంగా, యెహోవా మనల్ని బలపరుస్తాడనే నమ్మకం మనకుండాలి.

అయితే, మనం అయోగ్యులమన్నట్లు భావించవచ్చు, లేకపోతే మనం ఎక్కువ చేయలేకపోతున్నామని అనుకోవచ్చు. గతంలో, దేవుని నమ్మకమైన సేవకులు కొన్నిసార్లు అలాగే భావించారు. (నిర్గమకాండము 3:11, 12; 1 రాజులు 19:1-4) యిర్మీయా తాను “జనములకు ప్రవక్తగా” దేవునిచే నియమించబడినప్పుడు, “చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని” అన్నాడు. (యిర్మీయా 1:4, 6) యిర్మీయా మితభాషి అయినప్పటికీ, విరోధులైన ప్రజలకు సూటియైన సందేశాలను ప్రకటించిన ధైర్యవంతుడైన ప్రవక్త అయ్యాడు. ఇదెలా సాధ్యమైంది? ఆయన యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాడు. యిర్మీయా తర్వాత ఇలా వ్రాశాడు: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.”—యిర్మీయా 17:7; 20:11.

నేడు, యెహోవా తన యందు నమ్మకముంచే వారిని అలాగే బలపరుస్తాడు. నలుగురు పిల్లల తండ్రీ, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడంలో మందగించినవాడూ అయిన ఎడ్వర్డ్‌a ఇది నిజమని కనుగొన్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “నేను తొమ్మిది సంవత్సరాలుగా యెహోవాసాక్షిగా ఉన్నాను, కానీ నేను ఆధ్యాత్మికంగా ఉన్నచోటునే ఉన్నట్టు ఉండిపోయాను. సమస్యేమిటంటే, నాకు పురికొల్పు సరిగా లేదు, నాపై నాకు నమ్మకం అసలే లేదు. స్పెయిన్‌కు తరలి వెళ్లిన తర్వాత, అక్కడ ఒక చిన్న సంఘానికి వెళ్లేవాడిని, అక్కడ కేవలం ఒక పెద్ద, ఒక పరిచర్య సేవకుడు ఉండేవారు. అక్కడున్న అవసరత దృష్ట్యా, ఆ పెద్ద అనేక పనులను నాకు అప్పజెప్పాడు. నేను నా మొదటి ప్రసంగాలను ఇచ్చినప్పుడు, కూటాల్లో మొదటిసారి భాగాలను నిర్వహించినప్పుడు వణికిపోయాను. అయితే, నేను యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను. పెద్ద ఎప్పుడూ నన్ను మెచ్చుకునేవాడు, మెరుగుపర్చుకోవడానికి యుక్తమైన సలహాలిచ్చేవాడు.

“అదే సమయంలో, నేను ప్రాంతీయ పరిచర్యలో ఎక్కువగా పాల్గొంటూ, నా కుటుంబానికి ఆధ్యాత్మికంగా మరింత శ్రేష్ఠమైన నడిపింపునిచ్చాను. ఫలితంగా, కుటుంబమంతటికీ సత్యం మరింత అర్థవంతమైనదైంది, నేను మరింత సంతృప్తిని పొందాను. నేనిప్పుడు పరిచర్య సేవకుడిని, క్రైస్తవ పైవిచారణకర్త లక్షణాలను పెంపొందించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను.”

‘ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించండి’

ఎడ్వర్డ్‌ గ్రహించినట్లుగా, ఆధ్యాత్మిక అభివృద్ధికి యెహోవా యందు నమ్మకం అవసరం. క్రీస్తువంటి “నవీన స్వభావమును” పెంపొందించుకోవడం కూడా ప్రాముఖ్యమే. అదెలా చేయవచ్చు? ప్రాచీన స్వభావంలో భాగమైన ఆ లక్షణాలను ‘పరిత్యజించడం’ మొదటి అడుగు. (కొలొస్సయులు 3:9, 10) ముడి వజ్రాన్ని మెరిసే రత్నంలా చేయడానికి దాని నుండి అనవసర ఖనిజాలను తీసివేయడం అవసరమైనట్లుగానే, మన నవీన స్వభావం చక్కగా ప్రకాశించేందుకు “లోక సంబంధమైన” దృక్పథాలను తొలగించుకోవడం అవసరం.—గలతీయులు 4:3.

మన నుండి ఎక్కువ కోరబడుతుందేమోననే భయం వల్ల బాధ్యత తీసుకోవడానికి విముఖతతో ఉండడం అలాంటి దృక్పథాల్లో ఒకటి. నిజమే, బాధ్యత అంటే పని, అయితే అది సంతృప్తికరమైన పని. (పోల్చండి అపొస్తలుల కార్యములు 20:35.) దైవభక్తి కల్గివుండడానికి మనం ‘ప్రయాసతో పాటుపడడం’ అవసరమని పౌలు అంగీకరించాడు. మనమలా ఆనందంగా చేస్తాము ఎందుకంటే, మన తోటి క్రైస్తవుల కోసం ఇతరుల కోసం మనం చేసే పనిని ఎన్నడూ మరిచిపోని “జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక” అని ఆయన అన్నాడు.—1 తిమోతి 4:9, 10; హెబ్రీయులు 6:10.

కొన్ని వజ్రాల్లో అవి రూపొందేటప్పుడు “టెన్షన్‌” అని పిలువబడే లోపం ఏర్పడుతుంది గనుక వాటితో జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది. అయితే సానబెట్టే వ్యక్తి, పొలారిస్కోప్‌ అని పిలువబడే పరికరం సహాయంతో ఆ టెన్షన్‌ను కనిపెట్టి, ఆ రాయిపై విజయవంతంగా పని చేయగలుగుతాడు. బహుశ మనం కూడా మన పూర్వ చరిత్రను బట్టో లేక వేదనభరితమైన అనుభవాన్ని బట్టో అంతర్గత టెన్షన్‌తో లేక వ్యక్తిత్వ లోపంతో బాధపడుతుండవచ్చు. మనమేమి చేయవచ్చు? మొదట, మనకై మనం లోపం ఉందని అంగీకరించి, సాధ్యమైనంత మేరకు దాన్ని అధిగమించడానికి నిశ్చయించుకోవాలి. మనం నిశ్చయంగా యెహోవా ఎదుట ప్రార్థనలో మన భారాలను దించుకోవాలి, సాధ్యమైతే ఒక క్రైస్తవ పెద్ద నుండి ఆధ్యాత్మిక సహాయాన్ని కూడా పొందవచ్చు.—కీర్తన 55:22; యాకోబు 5:14, 15.

నికోలస్‌ అలాంటి అంతర్గత టెన్షన్‌ను ఎదుర్కున్నాడు. “మా నాన్న త్రాగుబోతు, ఆయన నాకూ మా చెల్లికీ ఎంతో కష్టం కల్గించాడు” అని ఆయన వివరిస్తున్నాడు. “నేను పాఠశాల విద్యాభ్యాసం ముగించాక సైన్యంలో చేరాను, కాని నా తిరుగుబాటు ధోరణి త్వరలోనే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మత్తుపదార్థాలు అమ్ముతున్నందుకు సైనికాధికారులు నన్ను జైల్లో వేశారు, మరో సందర్భంలో నేనే సైన్యంలో పని చేయడం మానేసి పారిపోయాను. చివరికి, నేను సైన్యంలో పని చేయడం మానుకున్నాను, అయినా సమస్యలు తీరలేదు. మత్తుపదార్థాల దుర్వినియోగం మూలంగా, విపరీతమైన త్రాగుడు మూలంగా నా జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, నాకు బైబిలులో ఆసక్తి ఉండేది, జీవితంలో సంకల్పం కల్గివుండాలని కోరుకునేవాడిని. చివరికి, నేను యెహోవాసాక్షులను కలుసుకుని, నా జీవిత విధానాన్ని మార్చుకుని, సత్యాన్ని హత్తుకున్నాను.

“అయితే, నా వ్యక్తిత్వంలో లోపం ఉందని తెలుసుకుని దాన్ని సవరించుకోవడానికి నేను ప్రయత్నించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అధికారానికి లోబడి ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు, ఎవరైనా సలహా ఇస్తే ఉద్రేకపడిపోయేవాడిని. యెహోవా నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాలనే కోరిక నాకున్నా, ఈ బలహీనత నన్ను ఆటంకపర్చేది. చివరికి, అర్థం చేసుకునే ఇద్దరు పెద్దల సహాయంతో, నాలో సమస్య ఉందని నేను అంగీకరించి వారి ప్రేమపూర్వక లేఖనాధార సలహాను అన్వయించుకోవడం ప్రారంభించాను. అప్పుడప్పుడూ కొంచెం ఉద్రేకం వచ్చినప్పటికీ, ఇప్పుడు నేను నా తిరుగుబాటు ధోరణిని అదుపు చేసుకోగల్గుతున్నాను. యెహోవా నాతో వ్యవహరించిన సహనంతో కూడిన రీతిని బట్టీ, పెద్దల ప్రేమపూర్వక సహాయాన్ని బట్టీ నేనెంతో కృతజ్ఞుడిని. నా ఆధ్యాత్మిక అభివృద్ధి మూలంగా నేను ఇటీవలనే పరిచర్య సేవకునిగా నియమించబడ్డాను.”

నికోలస్‌ కనుగొన్నట్లుగా, లోతుగా పాతుకుపోయిన దృక్పథాలను మార్చుకోవడం అంత సులభం కాదు. మనం కూడా అలాంటి సవాలునే ఎదుర్కోవచ్చు. బహుశ మనం మరీ సున్నిత మనస్కులుగా ఉంటుండవచ్చు. మనం మనకు కల్గిన కష్టాన్ని మనస్సులో ఉంచుకుని ఉండవచ్చు, లేక మనం స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండవచ్చు. దాన్ని బట్టి మన క్రైస్తవ అభివృద్ధి పరిమితమై ఉండవచ్చు. వజ్రాలకు సానబెట్టేవాళ్లు ముడులు అని తాము పిలిచే రాళ్ల విషయంలో ఇలాంటిదే ఎదుర్కుంటారు. వజ్రం రూపొందే సమయంలో రెండు రాళ్లు కరిగి ఒకటిగా ఏర్పడతాయి, అవే ఈ ముడులు. ఫలితంగా, ముడులు రెండు విభిన్న పెరుగుదల విధానాలను కలిగివుంటాయి కాబట్టి వాటి వాటం ప్రకారం వాటిని కోయడం చాలా కష్టమౌతుంది. మన విషయంలో, అనుకూల దృక్పథ “వాటానికీ” అపరిపూర్ణ శరీర “వాటానికీ” మధ్య పోరాటం జరుగుతుండడాన్ని మనం కనుగొంటాము. (మత్తయి 26:41; గలతీయులు 5:17) కొన్నిసార్లు, మన వ్యక్తిత్వంలోని అపరిపూర్ణతలు ఎలాగైనా అంత ప్రాముఖ్యమైనవి కాదులెమ్మని భావిస్తూ, మొత్తానికి పోరాటాన్నే విడిచిపెడదామన్న ఉద్దేశం మనకు కలగవచ్చు. మనమిలా అనవచ్చు, ‘నా కుటుంబమూ నా స్నేహితులూ నన్ను ఎలాగైనా ప్రేమిస్తారు కదా.’

అయితే మనం మన సహోదరులకు సేవ చేస్తూ, మన పరలోక తండ్రిని మహిమపర్చాలంటే, మనం నవీన స్వభావాన్ని ధరించుకోవడం ద్వారా ‘చిత్తవృత్తియందు నూతనపర్చబడవలసిన’ అవసరత ఉంది. నికోలస్‌ మరియు లెక్కలేనంతమంది ఇతరులు సాక్ష్యమిస్తున్నట్లుగా కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. ఒక్క కళంకం ఉన్నా అది మొత్తం వజ్రం విలువను కోల్పోయేలా చేయగలదని వజ్రాలకు సానబెట్టే వ్యక్తికి తెలుసు. అలాగే, మన వ్యక్తిత్వంలోని ఒక బలహీనమైన కోణాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక రూపాన్నే పాడుచేసుకోగలము. అంతకంటే ఘోరంగా, ఒక గంభీరమైన బలహీనత మన ఆధ్యాత్మిక పతనానికి దారితీయవచ్చు.—సామెతలు 8:33.

మన లోపల ఒక “జ్యోతి”లా

వజ్రాలకు సానబెట్టే వ్యక్తి వజ్రంలో ఉండే జ్యోతిని కాపాడడానికి కృషి చేస్తాడు. ఇంద్రధనస్సు ప్రభావం అని పిలువబడేదేదో అది ఏర్పడే విధంగా దాని ముఖాలను ఏర్పాటు చేయడం ద్వారా అలా కృషి చేయడం జరుగుతుంది. వజ్రం లోపల వివిధ వర్ణాల కాంతి వెనక్కు ముందుకు ప్రతిఫలిస్తూ వజ్రాలు మెరిసేలా చేసే జ్యోతిని ఉత్పన్నం చేస్తుంది. అలాగే, దేవుని ఆత్మ మనలో “జ్యోతి” వలె ఉండగలదు.—1 థెస్సలొనీకయులు 5:19, పరిశుద్ధ బైబిల్‌; అపొస్తలుల కార్యములు 18:25; రోమీయులు 12:11.

కాని ఆధ్యాత్మికంగా పురికొల్పబడే అవసరత ఉన్నట్లు మనం భావిస్తే అప్పుడేమిటి? దాన్నెలా చేయవచ్చు? మనం మన ‘మార్గాలను పరిశీలన చేసుకోవాలి.’ (కీర్తన 119:59, 60) దీనిలో, మనం ఆధ్యాత్మికంగా వెనుకబడేలా చేసే వాటిని గుర్తించడమూ, ఏ ఆధ్యాత్మిక కార్యకలాపాలను మనం మరింత అధికంగా చేయవలసిన అవసరత ఉందో నిశ్చయించుకోవడమూ ఇమిడి ఉంటాయి. క్రమమైన వ్యక్తిగత పఠనం ద్వారా మరియు ఎడతెగని ప్రార్థన ద్వారా మనం ఆధ్యాత్మిక మెప్పుదలను అధికం చేసుకోవచ్చు. (కీర్తన 119:18, 32; 143:1, 5, 8, 10) అంతేగాక, విశ్వాసమందు కష్టపడి పనిచేసే వారితో సహవసించడం ద్వారా, ఆసక్తితో యెహోవా సేవ చేయాలనే మన కృతనిశ్చయాన్ని మనం మరింత బలపర్చుకుంటాము.—తీతు 2:14.

లెవీజ్‌ అనే క్రైస్తవ యౌవనస్థురాలు ఇలా అంగీకరించింది: “నేను పయినీరుగా లేక పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా సేవ చేసేందుకు నా పేరును నమోదు చేసుకోక మునుపు క్రమ పయినీరు సేవ గురించి రెండు సంవత్సరాలపాటు ఆలోచించాను. నన్ను ఆటంకపరుస్తున్నదేదీ లేదు, కాని నేను ఒక ప్రశాంతమైన దినచర్యను కలిగివుండేదాన్ని, దానిలో నుండి బయటికి రావడానికి నేను ఎంతమాత్రం ప్రయత్నించలేదు. అప్పుడు హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు. జీవితం క్షణభంగురమైనదనీ, నేను దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనీ గుర్తించాను. కాబట్టి నేను నా ఆధ్యాత్మిక దృక్పథాన్ని మార్చుకున్నాను, నేను పరిచర్యలో ఎక్కువగా పాల్గొంటూ క్రమ పయినీరునయ్యాను. ఈ విషయంలో నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు నాకు ప్రత్యేకమైన సహాయాన్ని అందించారు, వాళ్లు ఎప్పుడూ ప్రాంతీయ సేవా ఏర్పాట్లకు మద్దతునిస్తూ, పరిచర్యలో క్రమంగా నాకు తోడుగా ఉండేవారు. మనం మంచికైనా చెడుకైనా మన సహవాసుల విలువలనూ లక్ష్యాలనూ పంచుకుంటామని తెలుసుకున్నాను.”

ఇనుముతో పదునుపెట్టబడినట్లు

భూమిపై సహజసిద్ధంగా లభించే అతి కఠినమైన పదార్థాలు వజ్రాలే. అందుకే, ఒక వజ్రాన్ని కోయాలంటే మరో వజ్రం అవసరం. ఇది బైబిలు విద్యార్థులకు ఈ సామెతను జ్ఞాపకం చేయవచ్చు: “ఇనుము ఇనుము వల్ల పదును అవుతుంది. అలాగే మనిషి సాటి మనిషి వల్ల చురుకైనవాడు అవుతాడు [“పదును తేలుతాడు,” NW].” (సామెతలు 27:17, పవిత్ర గ్రంథం) ఒక వ్యక్తి ఎలా “పదును తేలుతాడు”? ఒక ఇనుప ముక్కను అదే పదార్థంతో చేయబడిన ఒక కత్తికి పదును పెట్టడానికి ఉపయోగించగలిగినట్లుగానే ఒక వ్యక్తి మరో వ్యక్తికి మేధాసంబంధంగా, ఆధ్యాత్మికంగా పదును పెట్టడంలో సఫలం కావచ్చు. ఉదాహరణకు, మనం ఏదైనా నిరాశను బట్టి కృంగిపోతే, మరో వ్యక్తి ఇచ్చే ప్రోత్సాహం మనల్ని ఎంతగానో ఉత్తేజపర్చగలదు. దుఃఖంతో నిస్తేజమైన మన ముఖం ప్రసన్నంగా మారి మనం పునర్నూతనం చేయబడిన ఆసక్తితో కార్యాలను చేసేలా కోలుకుంటాము. (సామెతలు 13:12) ప్రాముఖ్యంగా సంఘ పెద్దలు లేఖనాధార ప్రోత్సాహాన్నీ, మెరుగుపర్చుకోవడానికి ఉపదేశాన్నీ ఇవ్వడం ద్వారా మనం పదును తేలడానికి మనకు సహాయం చేయగలరు. సొలొమోను చెప్పిన ఈ సూత్రాన్ని వాళ్లు అనుసరిస్తారు: “జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.”—సామెతలు 9:9.

నిజమే, ఆధ్యాత్మిక శిక్షణకు సమయం అవసరం. అపొస్తలుడైన పౌలు తన అనుభవాన్నీ బోధనా పద్ధతులనూ తిమోతితో పది సంవత్సరాలకుపైగా పంచుకున్నాడు. (1 కొరింథీయులు 4:17; 1 తిమోతి 4:6, 16) 40 ఏళ్లపాటు మోషే యెహోషువకిచ్చిన సుదీర్ఘమైన శిక్షణ ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో కాలంపాటు ప్రయోజనాన్ని చేకూర్చింది. (యెహోషువ 1:1, 2; 24:29, 31) ఎలీషా ఏలియా వెంట బహుశ 6 సంవత్సరాలపాటు ఉండి, 60 ఏళ్లపాటు కొనసాగనైవున్న తన పరిచర్యకు అవసరమైన చక్కని శిక్షణను పొందాడు. (1 రాజులు 19:21; 2 రాజులు 3:11) సహనంతో ఎడతెగని శిక్షణనివ్వడం ద్వారా పెద్దలు పౌలు, మోషే, ఏలియాల మాదిరిని అనుసరిస్తారు.

ప్రశంసించడం శిక్షణనివ్వడంలో ప్రాముఖ్యమైన భాగం. చక్కగా నిర్వర్తించబడిన అసైన్‌మెంట్లను గూర్చిన లేక మెచ్చుకోదగిన క్రియలను గూర్చిన యథార్థమైన మెచ్చుకోలు మాటలు, ఇతరులు దేవుడ్ని మరింత ఎక్కువగా సేవించడానికి వారిని పురికొల్పవచ్చు. మెచ్చుకోలు నమ్మకాన్ని పెంపొందింపజేస్తుంది, తద్వారా మన బలహీనతలను అధిగమించేందుకు కృషి చేయడానికి అవసరమైన పురికొల్పు లభిస్తుంది. (పోల్చండి 1 కొరింథీయులు 11:2.) రాజ్య ప్రకటన పనిలోనూ సంఘ సంబంధిత ఇతర కార్యకలాపాల్లోనూ పూర్తిగా నిమగ్నమై ఉండడం ద్వారా కూడా సత్యంలో అభివృద్ధి సాధించడానికి కావలసిన ప్రోత్సాహం లభిస్తుంది. (అపొస్తలుల కార్యములు 18:5) సహోదరుల ఆధ్యాత్మిక అభివృద్ధినిబట్టి పెద్దలు వారికి బాధ్యతలను అప్పగించినప్పుడు, అది వారికి విలువైన అనుభవాన్నిచ్చి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తూనే ఉండాలనే వారి కోరికను బలపర్చగలదు.—ఫిలిప్పీయులు 1:8, 9.

ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి మంచి కారణం

వజ్రాలు అమూల్యమైనవిగా ఎంచబడతాయి. ఇప్పుడు యెహోవా ఆరాధకుల ప్రపంచవ్యాప్త కుటుంబంతో సహవసించ నారంభిస్తున్న వారి విషయంలో కూడా ఇది నిజం. వాస్తవానికి, దేవుడే వారిని అన్యజనులందరి “ఇష్ట” వస్తువులని లేక “అమూల్యమైన” వస్తువులని పిలుస్తున్నాడు. (హగ్గయి 2:7 అధస్సూచి, NW) గత సంవత్సరం, 3,75,923 మంది బాప్తిస్మం పొంది యెహోవాసాక్షులయ్యారు. ఈ అభివృద్ధికి తగినట్లుగా, ‘గుడారపు స్థలమును విశాలపర్చవలసిన’ అవసరం ఉంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించడం ద్వారా—క్రైస్తవ సేవాధిక్యతల కొరకు ముందుకు రావడం ద్వారా—ఈ విస్తరణపట్ల శ్రద్ధ తీసుకోవడంలో భాగం వహించడం సాధ్యమౌతుంది.—యెషయా 54:2; 60:22.

బాంక్‌ లాకర్లలో ఉంచబడి అరుదుగా మాత్రమే చూడడానికి వీలయ్యే అనేక అమూల్యమైన వజ్రాల్లా కాకుండా, మన ఆధ్యాత్మిక విలువ తేజోవంతంగా ప్రకాశించగలదు. మనం మన క్రైస్తవ లక్షణాలకు క్రమంగా మెరుగుపెట్టుకుంటూ వాటిని ప్రదర్శిస్తున్నప్పుడు, మనం యెహోవా దేవుడ్ని మహిమపరుస్తాము. యేసు తన అనుచరులను ఇలా పురికొల్పాడు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:16) నిజంగా, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి ఇది మనకు చక్కని కారణాన్నిస్తుంది.

[అధస్సూచి]

a ఈ శీర్షికలో ప్రత్యామ్నాయ పేర్లు ఉపయోగించబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి