కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/15 పేజీలు 4-6
  • ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధనాశ సంతోషానికి దారితీయదు
  • మనకున్న వాటితో సంతృప్తిపడటం
  • సంతోషానికి కీలకం
  • సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం
    తేజరిల్లు!—2018
  • డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
    తేజరిల్లు!—2007
  • జ్ఞాన సంపదలుగల ఒక రాజు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవుని నూతనలోకంలో నిజంగా సంతృప్తికరమైన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/15 పేజీలు 4-6

ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?

రాజైన సొలొమోనుకు డబ్బు విలువ తెలుసు. ఆయనిలా వ్రాశాడు: “నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.” (ప్రసంగి 10:19) స్నేహితులతో కలిసి విందు చేసుకోవడం ఆనందకరంగా ఉండగలదు, అయితే ఆహారాన్ని లేక ద్రాక్షారసాన్ని సంపాదించాలంటే డబ్బు కావాలి. వస్తుపరమైన వాటిని కొనేందుకు డబ్బే అవసరం గనుక, అది “అన్నిటికి అక్కరకు వచ్చును.”

సొలొమోను చాలా ధనికుడైనప్పటికీ, ఐశ్వర్యానికి కూడా తనదైన పరిమితి ఉంటుందని ఆయనకు తెలుసు. వస్తుపర జీవిత విధానం సంతోషానికి దారితీయదని ఆయన గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు.”—ప్రసంగి 5:10.

సంపదగల వ్యక్తి మరింత ఎక్కువ సంపదను సంపాదించాడనుకోండి. సొలొమోను ఇలా చెబుతున్నాడు: “ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు.” (ప్రసంగి 5:11) ఒక వ్యక్తికున్న “ఆస్తి ఎక్కువైన”ప్పుడు, దాని గురించి శ్రద్ధ వహించేందుకు ఎక్కువమంది ప్రజలు అవసరమౌతారు. మరమ్మతు చేసేవారికీ, శ్రద్ధ తీసుకునేవారికీ, పని వాళ్లకూ, భద్రతా సిబ్బందికీ, మరితరులకు అందరికీ వారి సేవల నిమిత్తమై డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దాని కొరకు, మరింత డబ్బు అవసరమౌతుంది.

అలాంటి పరిస్థితి ఒక వ్యక్తి యొక్క సంతోషంపై సూటిగా ప్రభావాన్ని చూపిస్తుంది. సా.శ.పూ. నాల్గవ శతాబ్దంలో జీవించిన గ్రీకు చరిత్రకారుడైన జెనోఫోన్‌, ఐశ్వర్యాన్ని పొందిన ఒక బీదవాడి వ్యాఖ్యానాలను వ్రాశాడు:

“అదేంటి, నావద్ద ఎక్కువ ఉంది గనుక నేను ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నానని . . . మీరు నిజంగా అనుకుంటున్నారా?” అని ఆయన అడుగుతున్నాడు, “అయితే, నేను బీదవానిగా ఉన్నప్పుడు తినడం, త్రాగడం, నిద్రపోవడం విషయంలో నాకు లభించిన సుఖానికంటే ఇప్పుడు లేశమాత్రం కూడా ఎక్కువ సంతోషం లభించడం లేదనే విషయం మీకు తెలియదు. నేను అంత పొందడం నుండి నాకు కలిగిన ఏకైక లాభం, నేను మరి ఎక్కువమంది ఎడల శ్రద్ధ వహించి, ఇతరులకు మరింత ఎక్కువ పంచిపెట్టాలన్నదే, మరి నేను ముందు కలిగివున్న వాటికంటే ఇప్పుడు ఎక్కువ విషయాల ఎడల శ్రద్ధ వహించవలసిన చింత నాకు ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాపై అనేక సంసారాలు తిండికై ఆధారపడతాయి, అనేకులు పానీయానికై ఆధారపడతారు మరి ఎక్కువమంది బట్టలకై ఆధారపడతారు, మరి ఇంకొందరికి వైద్యుల అవసరత కూడా ఉంటుంది; మరి ఒకడు గొఱ్ఱెలపై తోడేళ్లు దాడి చేశాయనో, లేక కొండ చరియపైనుండి ఎద్దులు క్రింద పడిపోయాయని చెప్పేందుకో లేక పశువులకు ఏదో జబ్బు చేసిందని నాకు కథలు చెప్పేందుకు నా వద్దకు వస్తాడు. కాబట్టి నేను తక్కువ కలిగి ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కలిగి ఉన్నందున నాకు మరింత ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని . . . నాకనిపిస్తుంది.”

ప్రజలు మరింత ఎక్కువ ధనాన్ని వెంటాడేందుకుగల మరొక కారణం, “ధనమోసము” అని యేసు పిలిచిన దాని ద్వారా వారు వంచించబడి ఉండటమే. (మత్తయి 13:22) తాము అంత తీవ్రంగా వెంటాడుతున్న ఐశ్వర్యం నుండి తమకు లభిస్తుందని వారు అనుకున్న సంతృప్తినీ లేక సంతోషాన్నీ వారు ఎన్నడూ పొందరు గనుక వారు మోసగించబడ్డారు. తక్కువ సంపద తీసుకురాలేకపోయిన వాటిని మరింత ఎక్కువ సంపద తీసుకువస్తుందని వారు తర్కిస్తారు. కాబట్టి మరింత ఎక్కువ పొందాలనే ఆరాటం ఎడతెగక ఉంటుంది.

ధనాశ సంతోషానికి దారితీయదు

తన వద్ద ఉన్న సంపద ఎడలగల చింత మూలంగా ఐశ్వర్యవంతుడు రాత్రి సుఖనిద్రను అనుభవించలేడు. సొలొమోను ఇలా వ్రాస్తున్నాడు: “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.”—ప్రసంగి 5:12.

తమ సంపదను పోగొట్టుకుంటామేమో అని మరీ ఎక్కువగా చింతించినప్పుడు, నిద్రలేమి కంటే ఎక్కువే సంభవిస్తుంది. పిసినారిని గురించి వివరిస్తూ, సొలొమోను ఇలా వ్రాస్తున్నాడు: “తన దినములన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.” (ప్రసంగి 5:17) తన ధనాన్నిబట్టి సంతోషించే బదులు, తన భోజనానికి ఖర్చు చేస్తున్న డబ్బును బట్టి కూడా తాను చింతిస్తున్నాడా అన్నట్లు అతడు ‘వ్యాకులతతో’ తింటాడు. సమతుల్యతలేని అటువంటి మానసిక దృక్పథం అనారోగ్యానికి దారితీయగలదు. తత్ఫలితంగా, ఇది పిసినారికి మరింత చింత కలిగేందుకు కారణమౌతుంది, ఎందుకంటే మరింత ఎక్కువ ధనాన్ని సమకూర్చుకునేందుకు అనారోగ్యం అడ్డొస్తుంది.

బహుశ ఇది, అపొస్తలుడైన పౌలు వ్రాసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుండవచ్చు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:9, 10) డబ్బు కొరకైన వేటలో ప్రజలు మోసగిస్తారు, అబద్ధాలాడతారు, దొంగిలిస్తారు, వేశ్యావృత్తి చేస్తారు, చివరకు హత్యకూడా చేస్తారు. దాని ఫలితంగా, ఐశ్వర్యాన్ని సంపాదించుకుని దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం మూలంగా భావోద్వేగ, భౌతిక, ఆధ్యాత్మిక బాధలతో గాయపడిన వ్యక్తి మిగులుతాడు. ఇది సంతోషానికి మార్గమని మీకు అనిపిస్తుందా? ఎంతమాత్రం కాదు!

మనకున్న వాటితో సంతృప్తిపడటం

ఐశ్వర్యం ఎడల సమతూకమైన దృక్పథాన్ని గురించి చెప్పేందుకు సొలొమోను ఎక్కువ విషయాలను కలిగివున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు; మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.”—ప్రసంగి 5:15, 18.

ఏ భవిష్యత్తునైతే మనం చూడలేమో దాని కొరకు సంపదను సమకూర్చుకోవడానికి ఆరాటపడడం మనకు ఎన్నడూ సంతోషాన్ని తీసుకురాదని ఈ మాటలు చూపిస్తున్నాయి. మన కష్టార్జితం యొక్క ఫలితాలను ఆనందిస్తూ అందులో సంతృప్తిని కలిగి ఉండటం ఎంతో శ్రేయస్కరం. తిమోతికి వ్రాసిన తన ప్రేరేపిత లేఖలో అపొస్తలుడైన పౌలు అదే విధమైన భావాన్ని వ్యక్తం చేశాడు: “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:7, 8; పోల్చండి లూకా 12:16-21.

సంతోషానికి కీలకం

సొలొమోను ఐశ్వర్యాన్నీ దైవిక జ్ఞానాన్నీ సమృద్ధిగా కలిగివున్నాడు. అయితే ఆయన సంతోషాన్ని జ్ఞానంతో ముడిపెట్టాడు, డబ్బుతో కాదు. ఆయనిలా అన్నాడు: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామెతలు 3:13-18.

వస్తుపరమైన సంపదకంటే జ్ఞానం ఎందుకు ఉన్నతమైనది? సొలొమోను ఇలా వ్రాశాడు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) డబ్బు, దాన్ని కలిగివున్న వ్యక్తి తనకు అవసరమైన వాటిని కొనేందుకు వీలుకలిగించి ఆ విధంగా కొంతమేరకు ఆశ్రయాన్ని ఇచ్చినప్పటికీ, తన జీవితాన్ని అపాయాల్లో పడవేసుకునే రిస్కులు తీసుకోకుండా జ్ఞానం అతణ్ణి సురక్షితంగా ఉంచగలదు. నిజమైన జ్ఞానం ఒక వ్యక్తిని అకాల మరణం నుండి కాపాడటమే కాకుండా, అది దేవుణ్ణి గురించిన సరైన భయంపై ఆధారపడి ఉంటుంది గనుక, అది అతణ్ణి నిత్యజీవాన్ని పొందడం వైపుకు నడిపిస్తుంది.

దైవిక జ్ఞానం సంతోషం వైపుకు ఎందుకు నడుపుతుంది? ఎందుకంటే నిజమైన సంతోషం యెహోవా దేవుడినుండి మాత్రమే వస్తుంది గనుక. మహోన్నతుడికి విధేయతను చూపడం ద్వారానే నిజమైన సంతోషాన్ని పొందవచ్చని అనుభవం నిరూపిస్తోంది. నిత్యం నిలిచే సంతోషం దేవుని ఎదుట అంగీకారయోగ్యమైన స్థానాన్ని కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటుంది. (మత్తయి 5:3-10) బైబిలు అధ్యయనం నుండి మనం నేర్చుకున్న వాటిని అన్వయించుకోవడం ద్వారా, “పైనుండివచ్చు జ్ఞానము”ను మనం వృద్ధిపర్చుకుంటాం. (యాకోబు 3:17) ఐశ్వర్యం మనకు ఎన్నడూ ఇవ్వలేని సంతోషాన్ని అది మనకు ఇస్తుంది.

[4, 5వ పేజీలోని చిత్రం]

ఒక వ్యక్తికి ఏది సంతోషాన్ని ఇవ్వగలదో రాజైన సొలొమోనుకు తెలుసు. మరి మీకు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి