జ్ఞాన సంపదలుగల ఒక రాజు
ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదని మీరు భావిస్తున్నారా? ఎవరైనా మీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే, మీరు సంతోషించరా? మీరు తప్పకుండా సంతోషిస్తారు. బహుశ దాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా మీరు ఆలోచిస్తారు.
ఎంతైనా, జీవితాన్ని మరింత సౌకర్యవంతంగానూ ఆనందదాయకంగానూ చేసేందుకు కొనగల వస్తువులు ఎన్నో ఉన్నాయి. వ్యాధి లేక నిరుద్యోగం వంటి అనుకోని సమస్యలనుండి తప్పించుకునేందుకు డబ్బు “ఆశ్రయాస్పద”మైనదిగా ఉండగలదు.—ప్రసంగి 7:12.
అయితే డబ్బుకూ సంతోషానికీ మధ్యగల సంబంధం ఏమిటి? అనేకులు భావిస్తున్న విధంగా, సంతోషం అనేది సంపద మూలంగా లభించే వస్తువని మీరూ భావిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనడం కష్టతరంగా ఉండవచ్చు, ఎందుకంటే డబ్బును సులభంగా కొలతవేయగలం లేక లెక్కించగలం గానీ సంతోషాన్ని కొలతవేయడం లేక లెక్కించడం చేయలేం గదా. ఎంతైనా మీరు సంతోషాన్ని త్రాసులోపెట్టి తూకం వేయలేరు సుమా.
అంతే కాకుండా, కొంతమంది ధనిక ప్రజలు సంతోషంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఇతరులు మాత్రం దుఃఖంగా ఉన్నారు. బీదవారి విషయంలో కూడా అదే వాస్తవం. అయినప్పటికీ, ఇప్పటికే ధనికులైవున్న వారితోసహా అనేకులు అధిక ధనం మరింత సంతోషాన్ని తీసుకువస్తుందని భావిస్తారు.
అలాంటి విషయాలను గురించి వ్రాసిన ఒక వ్యక్తి ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను. ఆయన ఇంతవరకు జీవించిన వారిలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడు. బైబిలు పుస్తకమైన మొదటి రాజులలోని పదవ అధ్యాయంలో మీరు ఆయన అపార సంపద యొక్క వివరణను చదవగలరు. ఉదాహరణకు, 14వ వచనం చెబుతున్న విషయాన్ని గమనించండి: “ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.” (ఇటాలిక్కులు మావి.) ఆ సంఖ్య 25 టన్నుల బంగారంతో సరిసమానం. నేడు, అంత బంగారం 775,00,00,000 రూపాయలకంటే ఎక్కువ విలువ చేస్తుంది!
అయితే, సొలొమోను ఐశ్వర్యవంతుడు మాత్రమే కాదు; ఆయన దేవుడినుండి జ్ఞానాన్ని ఆశీర్వాదంగా పొందాడు. బైబిలిలా చెబుతుంది: “రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.” (1 రాజులు 10:23, 24) మనం కూడా సొలొమోను జ్ఞానం నుండి ప్రయోజనం పొందగలం, ఎందుకంటే ఆయన వ్రాతలు బైబిలు రికార్డులో ఒక భాగమై ఉన్నాయి. సంపదకూ సంతోషానికీ మధ్యగల సంబంధాన్ని గురించి ఆయనేమి చెప్పాడో మనం పరిశీలిద్దాం.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Die Heilige Schrift - Übersetzt von Dr. Joseph Franz von Allioli. Druck und Verlag von Eduard Hallberger, Stuttgart నుండి పునరుత్పత్తి చేయబడింది