యునీకే మరియు లోయి—మాదిరికరమైన శిక్షకులు
మనం మన పిల్లలకు ప్రభావవంతమైన మతపర విద్యాభ్యాసాన్ని అందజేయడమన్నది గంభీరమైన బాధ్యత అని యెహోవా సేవకులుగా మనకు తెలుసు. ఎంతో అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ఈ కార్యం అన్ని రకాలైన అవాంతరాలు, కష్టాలతో కూడినదై ఉండవచ్చు. మతపరంగా విభాగించబడిన కుటుంబంలో క్రైస్తవ తల్లి లేక తండ్రి ఈ సవాలును ఎదుర్కుంటున్నప్పుడు అది మరింత కష్టమౌతుంది. అలాంటి పరిస్థితి క్రొత్తదేమీ కాదు. సా.శ. మొదటి శతాబ్దంలో అలాంటి స్థితిలోనే ఉండిన ఒక తల్లి గురించి లేఖనాలు మనకు చెబుతున్నాయి.
యునీకే అనే పేరుగల ఒక స్త్రీ కుటుంబం, దక్షిణ-మధ్య ఆసియా మైనరులోని లికొనియ ప్రాంతంలోగల లుస్త్ర అనే నగరంలో నివసించేది. లుస్త్ర ఎక్కువ ప్రాధాన్యతలేని ఒక చిన్న ప్రాంతీయ నగరం. అది జూల్య ఫెలిక్స్ జెమిన లుస్త్ర అని పిలువబడిన రోమా కాలనీ. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని బందిపోటు దొంగల కార్యకలాపాలను అడ్డగించేందుకు అగస్టస్ సీజర్ (కైసరు ఔగుస్తు) దాన్ని నెలకొల్పాడు. యునీకే యూదా క్రైస్తవురాలు, మతపరంగా విభాగించబడిన ఆ కుటుంబంలో గ్రీసుదేశస్థుడైన తన భర్త, తన కుమారుడు తిమోతి, తన తల్లి లోయిలతో ఆమె నివసించేది.—అపొస్తలుల కార్యములు 16:1-3.
బహుశ, లుస్త్రలో కొంతమందే యూదులు ఉండివుండవచ్చు, ఎందుకంటే అక్కడ యూదుల సమాజమందిరం ఉన్నట్లు బైబిలు ప్రస్తావించడం లేదు, అయితే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ఈకొనియలో కొంతమంది యూదులు నివసించేవారు. (అపొస్తలుల కార్యములు 14:19) కాబట్టి తన విశ్వాసాన్ని అవలంబించడం యునీకేకు అంత సులభమై ఉండకపోవచ్చు. తిమోతి జన్మించిన తర్వాత అతనికి సున్నతి చేయబడలేదన్న వాస్తవం, యునీకే భర్త ఆ తలంపును వ్యతిరేకించి ఉంటాడని కొంతమంది పండితులు భావించేలా చేసింది.
అయితే, అలాంటి నమ్మకాలు కలిగివున్నది యునీకే ఒక్కతే కాదు. తిమోతి తన తల్లి నుండీ, తన అమ్మమ్మ లోయి నుండీ “పరిశుద్ధ లేఖనముల”లో ఉపదేశాన్ని పొందినట్లు తెలుస్తుంది.a అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా ఉద్బోధించాడు: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి [“నమ్మేలా ఒప్పించబడినవి,” NW] యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.”—2 తిమోతి 3:14, 15.
“బాల్యమునుండి” విద్యాభ్యాసం
“బాల్యమునుండి” “పరిశుద్ధ లేఖనముల”ను తిమోతికి బోధించడం జరిగిందని పౌలు చెప్పినప్పుడు, అది పసితనం నుండి అని స్పష్టమౌతుంది. సాధారణంగా అప్పుడే జన్మించిన శిశువును సూచించే గ్రీకు పదాన్ని (బ్రెఫోస్) ఆయన ఉపయోగించడం దీనితో పొందిక కల్గివుంది. (పోల్చండి లూకా 2:12, 16.) అందుకే, యునీకే దేవుడిచ్చిన బాధ్యతను గంభీరంగా తీసుకుని, తిమోతి దేవుని సమర్పిత సేవకుడిగా ఎదిగేందుకు ఆయనకు సహాయం చేయగల శిక్షణనివ్వడాన్ని ఆరంభించడంలో జాప్యం చేయలేదు.—ద్వితీయోపదేశకాండము 6:6-9; సామెతలు 1:8.
తిమోతి లేఖనాధార సత్యాలను ‘నమ్మేలా ఒప్పించబడ్డాడు.’ ఒక గ్రీకు నిఘంటువు ప్రకారం, పౌలు ఇక్కడ ఉపయోగించిన పదానికి, దేని గురించైనా “స్థిరంగా ఒప్పించబడడం; ధృవపర్చబడడం” అని భావం. తిమోతి దేవుని వాక్యం గురించి తర్కించి దాన్ని విశ్వసించడానికి ఆయనకు సహాయం చేసేందుకు ఆయన హృదయంలో దృఢ నమ్మకాన్ని నాటడానికి చెప్పుకోదగినంత సమయం మరియు కృషి అవసరమయ్యాయనడంలో సందేహం లేదు. తిమోతికి లేఖనాల నుండి బోధించడానికి యునీకే మరియు లోయి తీవ్రంగా కృషి చేశారని స్పష్టమౌతుంది. దైవభక్తిగల ఆ స్త్రీలు ఎంత చక్కని ప్రతిఫలాన్ని పొందారో కదా! పౌలు తిమోతి గురించి ఇలా వ్రాయగలిగాడు: “నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొ[నుచున్నాను.] . . . ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.”—2 తిమోతి 1:3-5.
తిమోతి జీవితంలో యునీకే మరియు లోయి ఎంతటి ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించారో కదా! ఈ విషయంలో, రచయితయైన డేవిడ్ రీడ్ ఇలా చెబుతున్నాడు: “తిమోతి మారడాన్ని గూర్చిన వ్యక్తిగత అనుభవం మాత్రమే ప్రాముఖ్యమైనదని అపొస్తలుడు నమ్మివుంటే, ఆయన దాన్నే ఆయనకు సూటిగా జ్ఞాపకం చేసి ఉండేవాడు. కాని తిమోతి విశ్వాసం గురించి ఆయన చెప్పాలనుకున్న మొదటి విషయం ఏమిటంటే, అదే విశ్వాసం అప్పటికే ‘లోయిలోనూ యునీకేలోనూ సజీవంగా’ ఉందన్నదే.” లోయి, యునీకే మరియు తిమోతిలకున్న విశ్వాసాన్ని గురించిన పౌలు వ్యాఖ్యానం, గృహంలో తలిదండ్రులు లేక తాతమామ్మలు ఇచ్చే తొలి లేఖనాధార విద్యాభ్యాసం తరచూ ఒక యౌవనస్థుడి భవిష్యత్ ఆధ్యాత్మిక ఉత్తరాపేక్షలను నిర్ధారించడంలో ప్రాథమికమైనదని చూపిస్తుంది. అది, దేవుని ఎడలా తమ పిల్లల ఎడలా తమకున్న ఈ బాధ్యతను నెరవేర్చడానికి తాము ఏమి చేస్తున్నామనే దాని గురించి కుటుంబ సభ్యులు గంభీరంగా ఆలోచించేలా చేయవద్దా?
లోయి మరియు యునీకే సృష్టించిన గృహ వాతావరణాన్ని గురించి కూడా బహుశ పౌలు ఆలోచిస్తుండవచ్చు. దాదాపు సా.శ. 47/ 48 మధ్య కాలంలో, అపొస్తలుడు తాను లుస్త్రలో మొదటిసారి ఉన్నప్పుడు వారి ఇంటిని దర్శించివుండవచ్చు. బహుశ ఆ సమయంలోనే ఆ ఇద్దరు స్త్రీలు క్రైస్తవులుగా మారి ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 14:8-20) లోయిని తిమోతి యొక్క “అవ్వ” అని సూచించేటప్పుడు పౌలు ఆ పదాలను ఎంపిక చేసుకోవడానికి, బహుశ ఆ కుటుంబంలో వారు ఆనందిస్తుండిన వాత్సల్యపూరితమైన, ఆనందభరితమైన అనుబంధాలు ప్రభావితం చేసివుండవచ్చు. పండితుడైన సెస్లా స్పీక్ ప్రకారం, ఆయన ఉపయోగించిన గ్రీకు పదం (ప్రామాణికమైన, గౌరవపూర్వకమైన టెతెకు బదులుగా మమె) అమ్మమ్మను “పిల్లలు ప్రేమతో పిలిచేందుకు” వాడే పదం, అది ఈ సందర్భంలో “సుపరిచితత్వాన్నీ మమకారాన్నీ” సూచిస్తుంది.
తిమోతి ఇంటినుండి బయల్దేరడం
పౌలు లుస్త్రను రెండవసారి (దాదాపు సా.శ. 50లో) దర్శించినప్పుడు యునీకే యొక్క వివాహస్థితి ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఆమె విధవరాలు అయ్యుండవచ్చునని అనేకమంది పండితులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, తన తల్లీ అమ్మమ్మల ఆధ్వర్యంలో తిమోతి చక్కని యౌవనస్థుడిగా ఎదిగాడు, బహుశ ఆ సమయానికి ఆయన 20 ఏళ్ల వాడైవుండవచ్చు. ఆయన “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.” (అపొస్తలుల కార్యములు 16:2) రాజ్య సువార్తను వ్యాపింపజేయాలనే కోరిక తిమోతి హృదయంలో నాటబడి ఉందన్నది స్పష్టం, అందువల్లే మిషనరీ యాత్రపై వెళుతున్న తనతోనూ సీలతోనూ కలిసి ప్రయాణించడానికి పౌలు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు.
తిమోతి వెళ్లిపోవడానికి సిద్ధమైనప్పుడు యునీకే మరియు లోయి ఎలా భావించి ఉంటారో ఊహించండి! అపొస్తలుడైన పౌలు తమ నగరానికి మొదటిసారి వచ్చినప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడనీ, చనిపోయాడనుకుని విడిచిపెట్టబడ్డాడనీ వారికి తెలుసు. (అపొస్తలుల కార్యములు 14:19) కాబట్టి యౌవనుడైన తిమోతిని వెళ్లనివ్వడం వారికి అంత సులభమై ఉండకపోవచ్చు. బహుశ, ఎంత కాలం ఆయన దూరంగా ఉంటాడు, ఆయన సురక్షితంగా తిరిగి వస్తాడా లేదా అని వాళ్లు ఆలోచించి ఉండవచ్చు. అలాంటి చింతలు ఉండే సాధ్యత ఉన్నప్పటికీ, మరింత ఎక్కువగా యెహోవా సేవ చేసేందుకు ఆయనకు దోహదపడే ఈ ప్రత్యేక ఆధిక్యతను అంగీకరించమని ఆయన తల్లీ మరియు అమ్మమ్మా ఆయనను ప్రోత్సహించారనడంలో సందేహం లేదు.
విలువైన పాఠాలు
యునీకే లోయిలను జాగ్రత్తగా పరిశీలించడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. తిమోతికి ఆధ్యాత్మికంగా చక్కని తర్ఫీదునివ్వడానికి విశ్వాసం వారిని పురికొల్పింది. దైవభక్తి విషయంలో తాతమామ్మలు తమ మనుమల కోసం అలాగే ఇతరుల కోసం ఉంచే పరిణతి చెందిన, స్థిరమైన మాదిరి మొత్తం క్రైస్తవ సంఘానికి తప్పకుండా ప్రయోజనకరమైనది కాగలదు. (తీతు 2:3-5) అలాగే యునీకే మాదిరి, అవిశ్వాసులైన భర్తలు గల తల్లులకు, వారు తమ పిల్లలకు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వవలసిన బాధ్యతనూ, వచ్చే ప్రతిఫలాలనూ జ్ఞాపకం చేస్తుంది. దీనికి కొన్నిసార్లు ఎంతో ధైర్యం అవసరమౌతుంది, ప్రాముఖ్యంగా తండ్రి తన భార్య మత నమ్మకాల ఎడల అనుకూల భావం లేనప్పుడు అలా ధైర్యం అవసరమౌతుంది. క్రైస్తవ భార్య తన భర్త శిరసత్వాన్ని గౌరవించాలి గనుక దానికి యుక్తి కూడా అవసరం.
లోయి మరియు యునీకేల విశ్వాసం, కృషి మరియు స్వయం-త్యాగాలకు, తిమోతి చక్కని మిషనరీ మరియు పైవిచారణకర్తా అయ్యేంతగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడాన్ని చూడడమనే ప్రతిఫలం లభించింది. (ఫిలిప్పీయులు 2:19-22) అలాగే నేడు, మన పిల్లలకు లేఖన సత్యాలను బోధించడానికి సమయం, సహనం, దృఢ నిశ్చయం అవసరం, అయితే నిజంగా కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మతపరంగా విభాగింపబడిన కుటుంబంలో ‘బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు’ బోధించబడిన అనేకమంది మాదిరికరమైన క్రైస్తవ యౌవనులు దైవభక్తిగల తమ తల్లికి లేక తండ్రికి గొప్ప ఆనందాన్ని తెస్తారు. ‘జ్ఞానముగలవానిని కనిన తల్లికి ఆనందం కల్గుతుంది’ అన్న సామెత ఎంత నిజమో కదా!—సామెతలు 23:23-25.
అపొస్తలుడైన యోహాను తన ఆధ్యాత్మిక పిల్లల గురించి ఇలా చెప్పాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 4) నిజంగా, ఇద్దరు మాదిరికరమైన శిక్షకులైన యునీకే మరియు లోయిల వంటి వారమని నిరూపించుకున్న అనేకమంది ఆ మాటల్లో వ్యక్తపర్చబడిన భావననే కల్గివున్నారు.
[అధస్సూచి]
a లోయి తిమోతికి నానమ్మ కాదన్న విషయం, 2 తిమోతి 1:5 నందు “మీ అమ్మా వాళ్ల అమ్మ” అని చేయబడిన సిరియక్ అనువాదం ద్వారా సూచించబడుతుంది.