కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/1 పేజీలు 13-19
  • ఎవరు “రక్షింపబడుదురు”?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవరు “రక్షింపబడుదురు”?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రవచనపు రెండు నెరవేర్పులు
  • యెహోవా నామాన్నిబట్టి మనమెలా ప్రార్థిస్తాం?
  • ఆధ్యాత్మిక పరదైసు
  • ఈ విధానాంతం
  • ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా దినము కొరకు కనిపెట్టుకొని యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—యోవేలు
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/1 పేజీలు 13-19

ఎవరు “రక్షింపబడుదురు”?

‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.’ —అపొస్తలుల కార్యములు 2:21.

1. సా.శ. 33 పెంతెకొస్తు పండుగరోజు ప్రపంచ చరిత్రలోని ప్రాముఖ్యమైన రోజు ఎందుకయ్యింది?

ప్రపంచ చరిత్రలో సా.శ. 33 పెంతెకొస్తు ప్రాముఖ్యమైన రోజు. ఎందుకు? ఎందుకంటే ఆ రోజే ఓ క్రొత్త జనాంగం ఉద్భవించింది. మొదట్లో అది ఓ పెద్ద జనాంగమేం కాదు—యెరూషలేములో ఒక మేడగదిలో కూడుకున్న 120 మంది యేసు శిష్యులు మాత్రమే అందులో ఉన్నారు. ఆ కాలంలో ఉనికిలో ఉన్న అనేక జనాంగాలు నేటికి మరువబడినా, ఆ మేడగదిలో ఉద్భవించిన జనాంగం ఇప్పటికీ మనతో ఉంది. మానవాళి ఎదుట తన సాక్షిగా ఉండడానికి దేవుడు నియమించిన జనాంగమిదే గనుక, ఆ వాస్తవం మనందరికి అత్యంత ప్రాముఖ్యమైనదైవుంది.

2. క్రొత్త జనాంగ ఉద్భవాన్ని ఏ అద్భుతకర సంఘటనలు గుర్తించాయి?

2 ఆ క్రొత్త జనాంగం ఉనికిలోనికి రానారంభించినప్పుడు, యోవేలు ప్రవచనార్థక వాక్యాలను నెరవేరుస్తూ ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల్ని గురించి మనం అపొస్తలుల కార్యములు 2:2-4లలో చదువుతాం: “అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండి యున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” ఈ విధంగా, విశ్వాసులైన ఆ 120 మంది స్త్రీపురుషులు ఒక ఆధ్యాత్మిక జనాంగంగా తయారయ్యారు, అపొస్తలుడైన పౌలు తర్వాత “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచిన జనాంగంలో వీరు మొదటి సభ్యులయ్యారు.—గలతీయులు 6:16.

3. యోవేలు ప్రవచించిన ఏ ప్రవచనం సా.శ. 33 పెంతెకొస్తునాడు నెరవేరింది?

3 ఆ “వేగముగా వీచు బలమైన గాలి” ఏమిటోనని విచారించేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. యోవేలు ప్రవచనాల్లో ఒకటి నెరవేరుతుందని అపొస్తలుడైన పేతురు వారికి వివరించాడు. ఏ ప్రవచనం? ఆయన చెప్పినదాన్ని ఆలకించండి: “అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.” (అపొస్తలుల కార్యములు 2:17-21) పేతురు ఉటంకించిన ఈ మాటలు యోవేలు 2:28-32లలో ఉన్నాయి. వాటి నెరవేర్పుకు, యూదా జనాంగానికి మిగిలివున్న కాలం వేగంగా గడచిపోతుందని అర్థం. అవిశ్వాస ఇశ్రాయేలుకు తీర్పుతీర్చే కాలమైన ‘యెహోవా మహాదినము’ సమీపమైంది. అయితే ఎవరు తప్పించుకుంటారు, లేదా రక్షించబడతారు? ఇది దేనికి పూర్వఛాయగావుంది?

ప్రవచనపు రెండు నెరవేర్పులు

4, 5. జరగనైవున్న సంఘటనల దృష్ట్యా, పేతురు ఏ సలహా ఇచ్చాడు, మరి ఆ సలహా ఆయన కాలంలోనే కాక, ఇప్పుడు కూడా ఎందుకు అన్వయించదగినదైవుంది?

4 సా.శ. 33 తర్వాతి సంవత్సరాల్లో, దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలు వర్థిల్లగా, సహజ ఇశ్రాయేలు జనాంగం వర్థిల్లలేదు. సా.శ. 66లో సహజ ఇశ్రాయేలు జనాంగం రోమన్లతో యుద్ధానికి తలపడింది. సా.శ. 70లో ఇశ్రాయేలు జనాంగం దాదాపు ఉనికినే కోల్పోయింది. యెరూషలేమూ, దానితోపాటూ దాని ఆలయమూ నేలమట్టమయ్యేలా కాల్చివేయబడ్డాయి. సమీపిస్తున్న ఆ విషాదకర సంఘటన దృష్ట్యా, పేతురు ఓ చక్కని సలహాను సా.శ. 33 పెంతెకొస్తు పండుగనాడు ఇచ్చాడు. యోవేలు మాటల్ని మరలా ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.” యెహోవా నామమునుబట్టి ప్రార్థించేందుకు ప్రతి యూదుడు వ్యక్తిగతంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. దీనిలో పేతురు చెప్పిన మరితర ఉపదేశాల్ని లక్ష్యపెట్టడం కూడా చేరివుంది: “మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.” (అపొస్తలుల కార్యములు 2:38) పేతురు చెప్పినదాన్ని విన్నవాళ్లు, ఒక జనాంగంగా ఇశ్రాయేలు తిరస్కరించిన యేసును మెస్సీయగా అంగీకరించాలి.

5 యోవేలు ప్రవచించిన ఆ ప్రవచన వాక్కులు, మొదటి శతాబ్దంలో దీనులైన వ్యక్తులపై గొప్ప ప్రభావం చూపించాయి. అయినా, అవి అంతకన్నా గొప్ప ప్రభావాన్ని నేడు కలిగియున్నాయి, ఎందుకంటే ఈ 20వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు యోవేలు ప్రవచనానికి ద్వితీయ నెరవేర్పయి ఉన్నాయని చూపిస్తున్నాయి. అదెలాగో మనం చూద్దాం.

6. పందొమ్మిది వందల పద్నాలుగు సమీపిస్తుండగా, దేవుని ఇశ్రాయేలు గుర్తింపు ఎలా స్పష్టమవ్వడం ఆరంభించింది?

6 అపొస్తలులు మరణించిన తర్వాత, అబద్ధ క్రైస్తవత్వపు గురుగులచే దేవుని ఇశ్రాయేలు మరుగున పడింది. అయితే, 1914లో ఆరంభమైన అంత్యకాలములో, ఈ ఆధ్యాత్మిక జనాంగపు గుర్తింపు మరోసారి స్పష్టమైంది. యేసు చెప్పిన గోధుమలు, గురుగులు ఉపమాన నెరవేర్పులో వలెనే ఇదంతా జరిగింది. (మత్తయి 13:24-30, 36-43) 1914 సమీపిస్తుండగా, అభిషిక్త క్రైస్తవులు అవిశ్వాసులైన క్రైస్తవమత సామ్రాజ్య అబద్ధ సిద్ధాంతాల్ని ధైర్యంగా తిరస్కరిస్తూ, రానైవున్న “అన్యజనముల కాలముల” ముగింపును గూర్చి ప్రకటిస్తూ దాన్నుండి తమను తాము వేరుపరచుకోవడం ఆరంభించారు. (లూకా 21:24) అయితే 1914లో విరుచుకుపడిన మొదటి ప్రపంచ యుద్ధం లేవదీసిన వివాదాంశాలకు వాళ్లు సిద్ధపడలేదు. విపరీతమైన ఒత్తిడి క్రింద, అనేకులు చల్లబడిపోయారు, కొందరు రాజీపడిపోయారు. 1918 నాటికి వారి ప్రకటనాపని దాదాపుగా ఆగిపోయింది.

7. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తునాడు జరిగిన సంఘటనను పోలిన ఏ సంఘటన 1919లో జరిగింది? (బి) 1919లో ఆరంభించి, దేవుని ఆత్మ కుమ్మరించబడడం యెహోవా సేవకులపై ఏ ప్రభావాన్ని చూపించింది?

7 అయితే, అదే స్థితి ఎక్కువకాలం కొనసాగలేదు. 1919లో ఆరంభించి, సా.శ. 33 పెంతెకొస్తును తలపించేరీతిలో యెహోవా తన ప్రజలపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం మొదలుపెట్టాడు. 1919లో అన్య భాషల్లో మాట్లాడటం, బలంగా గాలి వీయడం వంటివి జరుగలేదనుకోండి. అద్భుతాలు జరిగేకాలం గతించిపోయి చాలా కాలమయ్యిందని 1 కొరింథీయులు 13:8లో పౌలు రాసిన మాటలనుండి మనం అర్థం చేసుకుంటాం. అయితే అమెరికాలోని ఒహాయోనందలి సీడార్‌ పాయింట్‌లో జరిగిన సమావేశంలో నమ్మకమైన క్రైస్తవులు నూతనోత్తేజాన్ని పొంది, రాజ్యసువార్తను ప్రకటించే పనిని మరలా ఆరంభించినప్పుడు, 1919లో దేవుని ఆత్మ లభించిందని స్పష్టంగా రుజువైంది. 1922లో వాళ్లు సీడార్‌ పాయింట్‌కు మరలా వచ్చారు, అక్కడ వాళ్లు “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అనే విజ్ఞాపనద్వారా చైతన్యవంతులయ్యారు. మొదటి శతాబ్దంలో జరిగినట్లుగానే, దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడడంవల్ల కల్గిన ప్రభావాల్ని ప్రపంచం బలవంతంగా తెలుసుకోవాల్సి వచ్చింది. సమర్పిత క్రైస్తవులైన ప్రతిఒక్కరూ—స్త్రీలూ, పురుషులూ, యౌవనులూ, వృద్ధులూ ‘ప్రవచించడం’ అంటే “దేవుని గొప్ప కార్యములను” ప్రకటించడం ఆరంభించారు. (అపొస్తలుల కార్యములు 2:11) పేతురు వలెనే, వాళ్లూ “మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని” దీనులైన వ్యక్తులకు ఉద్బోధించారు. (అపొస్తలుల కార్యములు 2:40) ప్రతిస్పందించినవాళ్లు దానినెలా చేయగలిగారు? “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు” అని యోవేలు 2:32లో ఉన్న యోవేలు మాటల్ని లక్ష్యపెట్టుట ద్వారానే.

8. పందొమ్మిది వందల పందొమ్మిది నుండి దేవుని ఇశ్రాయేలు విషయంలో కార్యాలెలా పురోభివృద్ధి చెందాయి?

8 ఆ తొలి సంవత్సరాలనుండీ, దేవుని ఇశ్రాయేలు కార్యకలాపాలు ముందుకే సాగాయి. అభిషిక్తులు ముద్రించబడడం బాగా కొనసాగినట్లు కన్పిస్తుంది. 1930ల నుండీ, భూ నిరీక్షణతో దీనులైన గొప్ప సమూహం కనబడసాగింది. (ప్రకటన 7:3, 9) వారందరిలో అత్యవసరభావం నెలకొనివుంది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్త మత, రాజకీయ, వాణిజ్య విధానాలను నాశనం చేసే భయంకరమైన యెహోవా మహాదినాన్ని మనం సమీపిస్తున్నామని యోవేలు 2:28, 29లలోని ద్వితీయ నెరవేర్పు చూపిస్తోంది. ఆయన మనలను విడిపిస్తాడనే సంపూర్ణ నమ్మకంతో “యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయ”డానికి మనం ప్రతి కారణాన్నీ కలిగి ఉన్నాం!

యెహోవా నామాన్నిబట్టి మనమెలా ప్రార్థిస్తాం?

9. యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించడంలో చేరివున్న కొన్ని విషయాలు ఏవి?

9 యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించడంలో ఏం ఇమిడి ఉంది? యోవేలు 2:28, 29ల పూర్వాపర సందర్భం ఆ ప్రశ్నకు జవాబివ్వడానికి మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు, తన నామాన్నిబట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థననూ యెహోవా ఆలకించడు. యెహోవా మరొక ప్రవక్తయైన యెషయా ద్వారా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను.” తన సొంత జనాంగం చేసిన ప్రార్థనను వినకుండా యెహోవా ఎందుకు తిరస్కరించాడు? ఆయనే ఇలా వివరిస్తున్నాడు: “మీ చేతులు రక్తముతో నిండియున్నవి.” (యెషయా 1:15) రక్తాపరాధులైన లేదా పాపాన్ని అభ్యసిస్తున్న వారెవరైనా సరే వారి ప్రార్థనను యెహోవా వినడు. అందుకే పెంతెకొస్తునాడు పేతురు మారుమనస్సు పొందమని యూదులకు చెప్పాడు. యోవేలు 2:28, 29 వచనాల పూర్వాపర సందర్భంలో, యోవేలు కూడా పశ్చాత్తాపాన్ని గూర్చి నొక్కి చెబుతున్నట్టు మనం చూస్తాం. ఉదాహరణకు, యోవేలు 2:12, 13లను మనం ఇలా చదువుతాం: “ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగల[వాడునై ఉన్నాడు.] . . . గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.” 1919 నుండీ అభిషిక్త క్రైస్తవులు ఈ మాటలకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు తమ వైఫల్యాల విషయమై పశ్చాత్తాపపడి, మరెన్నడూ రాజీపడకూడదనీ లేక అలసిపోకూడదనీ తీర్మానించుకున్నారు. ఇది, దేవుని ఆత్మ కుమ్మరించబడేందుకు మార్గాన్ని తెరచింది. యెహోవా నామమునుబట్టి ప్రార్థించాలనీ, ఆ ప్రార్థన ఆలకించబడాలనీ కోరుకొనే వ్యక్తులు ఇదే పద్ధతిని అనుసరించాలి.

10. (ఎ) నిజమైన పశ్చాత్తాపం అంటే ఏమిటి? (బి) నిజమైన పశ్చాత్తాపానికి యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు?

10 నిజమైన పశ్చాత్తాపం అంటే కేవలం “నన్ను క్షమించండి” అని చెప్పడం కంటే ఎక్కువేనని గుర్తుంచుకోండి. తమ భావాల తీవ్రతను చూపేందుకు ఇశ్రాయేలీయులు తమ వస్త్రాల్ని చింపుకునేవారు. అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు: ‘మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి.’ నిజమైన పశ్చాత్తాపం మన హృదయాంతరాల నుండి వస్తుంది. ‘భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవావైపు తిరుగవలెను’ అని మనము యెషయా 55:7లో చదువునట్లుగా మనం దోషమార్గాన్ని విసర్జించడం ఇందులో చేరియుంది. దీనిలో యేసు ద్వేషించినట్లుగానే పాపాన్ని ద్వేషించడం చేరివుంది. (హెబ్రీయులు 1:9) ఆపై, యెహోవా “కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు[ను]” గనుక విమోచనా క్రయధన బలి ఆధారంగా యెహోవా మనలను క్షమిస్తాడని మనం విశ్వసించగలం. ఆయన మన ఆరాధననూ, ఆధ్యాత్మిక ధాన్యార్పణనూ, పానీయార్పణనూ అంగీకరిస్తాడు. మనమాయన నామాన్నిబట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆలకిస్తాడు.—యోవేలు 2:14.

11. మన జీవితాల్లో సత్యారాధనకు ఏ స్థానం ఉండాలి?

11 కొండమీది ప్రసంగంలో యేసు “మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి” అని చెప్పినప్పుడు ఆయన మనం మనస్సులో ఉంచుకోవాల్సిన మరొకదాన్ని సూచించాడు. (మత్తయి 6:33) మన మనస్సాక్షికి ఉపశమనం కల్గించడానికన్నట్టు ఏదో నామమాత్రమైన రీతిలో చేయాలన్నట్టు మన ఆరాధనను తేలికగా దృష్టించకూడదు. దేవుని సేవకు మన జీవితాల్లో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అందుకే, యెహోవా యోవేలు ద్వారా ఇలా చెబుతున్నాడు: “సీయోనులో బాకా ఊదుడి. . . . జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండియు పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలయును.” (యోవేలు 2:15, 16) నవదంపతుల దృష్టి కేవలం ఒకరిపై ఒకరికి మాత్రమే ఉంటుంది గనుక వాళ్ల అవధానం ప్రక్కకు మళ్లడం సహజమే. అయితే వారి విషయంలో కూడా, యెహోవా సేవే మొదటి స్థానంలో ఉండాలి. మన దేవునికి మనం చేసే సత్యారాధనలో సమకూడడంకన్నా, ఆయన నామాన్నిబట్టి ప్రార్థన చేయడంకన్నా ఏదీ ముందుండకూడదు.

12. గత సంవత్సరపు జ్ఞాపకార్థ దినాచరణ రిపోర్టులో ఏ అనుకూలమైన పురోభివృద్ధి జరగడానికి గల ఏ అవకాశం కన్పించింది?

12 దీన్ని మనస్సులో ఉంచుకుని, 1997వ సంవత్సరపు యెహోవా సాక్షుల సేవా నివేదిక ద్వారా వెల్లడి చేయబడిన గణాంక వివరాల్ని మనం పరిశీలిద్దాం. గత సంవత్సరపు రాజ్య ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 55,99,931—ఇది నిజంగా స్తుతికర్తల గొప్ప సమూహమే! జ్ఞాపకార్థ దినానికి 1,43,22,226 మంది హాజరయ్యారు అంటే ప్రచారకుల సంఖ్యకన్నా దాదాపు 85 లక్షలకన్నా ఎక్కువమందే హాజరయ్యారు. అద్భుతమైన అభివృద్ది జరిగే అవకాశం ముందున్నదని ఈ సంఖ్య చూపిస్తోంది. ఆ 85 లక్షల మందిలో చాలామంది ఆసక్తిగల వ్యక్తులుగా లేక బాప్తిస్మం పొందిన తల్లిదండ్రుల పిల్లలుగా ఇప్పటికే యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేస్తున్నారు. మరెంతోమంది మొదటిసారిగా ఒక కూటానికి హాజరౌతున్నవారిగా ఉన్నారు. వాళ్లలా హాజరుకావడం వాళ్లను గురించి బాగా తెలుసుకొని, వాళ్లు మరింత అభివృద్ధి సాధించడానికి సహాయాన్నందించే చక్కని అవకాశాన్ని యెహోవాసాక్షులకు ఇచ్చింది. అయితే, ప్రతి సంవత్సరమూ జ్ఞాపకార్థ దిన ఆచరణకూ, ఇతరత్రా కొన్ని కూటాలకూ హాజరౌతున్న వ్యక్తులున్నారు, కానీ వాళ్లంతకు మించి ఏ విధమైన అభివృద్ధినీ చూపరు. అలాంటి వాళ్లు కూటాలకు హాజరయ్యేందుకు సదా ఆహ్వానితులే. అయితే, యోవేలు ప్రవచన వాక్కులను జాగ్రత్తగా ధ్యానిస్తూ, యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించినప్పుడు ఆయన తప్పక వాళ్ల ప్రార్థనను వినాలంటే వాళ్లు ఏ అదనపు చర్యలు తీసుకోవాలో ఆలోచించమని మేం వారిని కోరుతున్నాము.

13. మనమిప్పటికే యెహోవా నామాన్నిబట్టి ప్రార్థిస్తున్నట్లైతే, ఇతరుల ఎడల మనమే బాధ్యతను కల్గివున్నాం?

13 అపొస్తలుడైన పౌలు దేవుని నామాన్నిబట్టి చేసే ప్రార్థనకు సంబంధించిన మరో అంశాన్ని నొక్కి తెలియజేశాడు. రోమీయులకు రాసిన తన పత్రికలో ఆయన యోవేలు ప్రవచన వాక్కులను ఉల్లేఖించాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.” ఆ తర్వాత, ఆయనిలా తర్కించాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు?” (రోమీయులు 10:13, 14) అవును, ఇంతవరకూ యెహోవాను ఎరుగని ఇతరులనేకులు ఆయన నామాన్నిబట్టి ప్రార్థించడం అవసరం. యెహోవాను ఇప్పటికే ఎరిగియున్న వాళ్లకు ప్రకటించే బాధ్యతేగాక వారలా యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించగల్గేందుకు సహాయం చేయవలసిన బాధ్యత కూడా ఉంది.

ఆధ్యాత్మిక పరదైసు

14, 15. యెహోవాను ప్రీతిపర్చే రీతిలో ఆయన నామాన్నిబట్టి యెహోవా ప్రజలు ప్రార్థిస్తుండడాన్నిబట్టి వాళ్లే పరదైసు ఆశీర్వాదాల్ని అనుభవిస్తున్నారు?

14 అభిషిక్తులూ, వేరే గొర్రెలూ విషయాన్ని అదే రీతిలో దృష్టిస్తారు. తత్ఫలితంగా, యెహోవా వారిని ఆశీర్వదిస్తున్నాడు. “యెహోవా తన దేశమునుబట్టి రోషముపూని [“ఆసక్తి కల్గి,” NW] తన జనులయెడల జాలి చేసికొనెను.” (యోవేలు 2:18) 1919లో, యెహోవా తన ప్రజలను పునరుద్ధరించి, వారిని తన ఆధ్యాత్మిక క్రియాశీలక సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, ఆయన వారి ఎడల ఆసక్తినీ, జాలినీ చూపించాడు. ఈ క్రింది మాటల్లో యోవేలు వర్ణించినట్లుగా అది నిజంగానే ఒక ఆధ్యాత్మిక పరదైసే: “దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను. పశువులారా, భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును, ద్రాక్షచెట్లు[ను] సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును.”—యోవేలు 2:21-24.

15 ఎంత ఆహ్లాదకరమైన దృశ్యమోగదా! పశువుల మందలతోపాటూ ఇశ్రాయేలులో జీవించడానికి అవసరమైన మూడు ప్రాథమిక నిత్యావసరాలైన ధాన్యం, ఒలీవనూనె, ద్రాక్షారసం సమృద్ధిగా అందజేయబడతాయి. మన కాలంలో, ఆ ప్రవచనార్థక వాక్కులు నిశ్చయంగా ఆధ్యాత్మిక రీతిలో నెరవేరాయి. మనకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్నంతటినీ యెహోవా మనకు దయచేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన అలాంటి సమృద్ధినిబట్టి మనం సంతోషించమా? నిజంగా, మలాకీ ప్రవచించినట్లుగానే, మన దేవుడు ‘ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాడు.’—మలాకీ 3:10.

ఈ విధానాంతం

16. (ఎ) యెహోవా ఆత్మ కుమ్మరించబడడం మన కాలం విషయంలో ఏ ప్రాముఖ్యతను కల్గివుంది? (బి) భవిష్యత్తులో ఏమి జరుగనుంది?

16 దేవుని ప్రజల పరదైసు స్థితిని గూర్చి ప్రవచించిన తర్వాత యోవేలు యెహోవా పరిశుద్ధాత్మ కుమ్మరించబడటాన్ని గూర్చి ప్రవచించాడు. పేతురు పెంతెకొస్తునాడు ఈ ప్రవచనాన్ని ఉటంకించినప్పుడు, ఇది “అంత్యదినముల యందు” నెరవేరినట్లు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 2:17) వెనుకటికా కాలంలో దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు అది యూదా విధానానికి అంత్యదినములు ఆరంభమయ్యాయనే భావాన్నిచ్చింది. ఈ 20వ శతాబ్దంలో దేవుని ఇశ్రాయేలు మీద దేవుని ఆత్మ కుమ్మరించబడడమంటే మనం ఈ ప్రపంచ విధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నామని భావం. దీని దృష్ట్యా, మనకు భవిష్యత్తు ఏం కలిగివుంది? యోవేలు ప్రవచనం మనకిలా చెబుతోంది: “ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.”—యోవేలు 2:30, 31.

17, 18. (ఎ) యెహోవా దేవుని ఏ భయంకరమైన మహాదినం యెరూషలేము మీదకి వచ్చింది? (బి) భవిష్యత్తులో రానైయున్న యెహోవా దేవుని భయంకరమైన మహాదినం తప్పక వస్తుందనే విషయం ఏం చెయ్యడానికి మనల్ని ప్రేరేపించాలి?

17 ఆ ప్రవచన వాక్కులు సా.శ. 66లో యూదాలో వాస్తవం కానారంభించాయి. అలా సంఘటనలు, నిరాటంకంగా కొనసాగి సా.శ. 70లో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం యొక్క తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ కాలంలో, యెహోవా నామాన్ని ఉన్నతపర్చని వారి కోవలో ఉండటం ఎంత భయానకమో కదా! నేడు, అటువంటి భయంకర సంఘటనలు త్వరలోనే సంభవించబోతున్నాయి, అప్పుడు యెహోవా చేతిలో ఈ యావత్‌ ప్రపంచ విధానం నాశనం చేయబడుతుంది. రక్షణ ఇప్పటికీ సాధ్యమే. ప్రవచనమింకా ఇలా చెబుతోంది: “యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) యెహోవా నామాన్ని తెలిసికొన్నందుకు యెహోవాసాక్షులు నిజంగా కృతజ్ఞులై ఉన్నారు. వాళ్లు ఆయన నామాన్నిబట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వారిని రక్షిస్తాడనే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగియున్నారు.

18 సమస్త కోపాగ్నితో యెహోవా దేవుని విశిష్టమైన ఆ మహాదినం ఈ లోకం మీద విరుచుకుపడినప్పుడు, ఏం జరుగుతుంది? ఈ విషయం చివరి పఠనశీర్షికలో చర్చించబడుతుంది.

మీరు జ్ఞప్తికి తెచ్చుకోగలరా?

◻ యెహోవా తన ఆత్మను తన ప్రజలపై మొదట ఎప్పుడు కుమ్మరించాడు?

◻ యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించడంలో చేరివున్న కొన్ని విషయాలేవి?

◻ యెహోవా దేవుని విశిష్టమైన మహాదినం సహజ ఇశ్రాయేలుపైకి ఎప్పుడు వచ్చింది?

◻ నేడు యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించే వారిని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు?

[15వ పేజీలోని చిత్రం]

సా.శ. 33 పెంతెకొస్తునాడు ఒక క్రొత్త జనాంగం ఉద్భవించింది

[17వ పేజీలోని చిత్రం]

ఈ శతాబ్దపు తొలి భాగంలో, యోవేలు 2:28, 29ల నెరవేర్పుగా యెహోవా తన ఆత్మను తన ప్రజలపై మరలా కుమ్మరించాడు

[18వ పేజీలోని చిత్రం]

యిహోవా నామాన్నిబట్టి ప్రార్థించేలా ప్రజలకు సహాయం చెయ్యాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి