కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/1 పేజీలు 8-13
  • యెహోవా దినము సమీపంగా ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా దినము సమీపంగా ఉంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కీటకాల దాడి
  • ‘మత్తులారా, మేల్కొనండి’!
  • ‘యాజకులారా మీ రొమ్ములను బాదుకొనుడి’
  • ‘యెహోవా దినము వచ్చుచున్నది’
  • ‘యెహోవా ఆలస్యం చేయువాడు కాడు’
  • ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • యెహోవా దినము కొరకు కనిపెట్టుకొని యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ముదటి శ్రమ—మిడతలు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/1 పేజీలు 8-13

యెహోవా దినము సమీపంగా ఉంది

“పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి.”—యోవేలు 1:2.

1, 2. యూదాలోని ఏ పరిస్థితినిబట్టి తన శక్తివంతమైన ప్రవచనాన్ని ప్రవచించేందుకు యెహోవా యోవేలును ప్రేరేపించాడు?

“ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును.” ఎంతటి గంభీరమైన ప్రకటనో కదా! అది తన ప్రవక్తయైన యోవేలు ద్వారా తన ప్రజలకు దేవుడు ప్రకటించిన సందేశం.

2 యోవేలు 1:15 నందలి ఆ మాటలు యూదాలో బహుశ సా.శ.పూ. 820వ సంవత్సరంలో రాయబడ్డాయి. అప్పట్లో ఆ దేశం పచ్చని పర్వతాలతో అలరారుతుండేది. ఫలాలకూ, ధాన్యాలకూ కొదువేలేదు. పచ్చికబయళ్లు విశాలంగానూ, పచ్చగానూ ఉండేవి. కానీ, ఎక్కడో ఘోరమైన దోషం ఉన్నట్టు కనబడుతోంది. బయలు ఆరాధన యెరూషలేములోనూ, యూదా దేశంలోనూ వర్థిల్లుతోంది. ప్రజలు ఈ అబద్ధదేవత ఎదుట తాగి తందనాలాడుతూ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారు. (పోల్చండి 2 దినవృత్తాంతములు 21:4-6, 11.) దీన్నంతటినీ ఇలాగే కొనసాగడానికి యెహోవా అనుమతిస్తాడంటారా?

3. యెహోవా దేన్ని గురించి హెచ్చరించాడు, మరి దేశాలు దేనికోసం సిద్ధమవ్వాలి?

3 ఈ విషయంలో యోవేలు గ్రంథం, సందేహానికి తావులేకుండా జవాబిస్తోంది. యెహోవా దేవుడు తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకుని, తన పరిశుద్ధ నామాన్ని పవిత్రపరచుకుంటాడు. యెహోవా మహాదినం సమీపమైంది. అప్పుడు దేవుడు “యెహోషాపాతు లోయలో” జనాంగాలన్నింటిపైకీ తీర్పును అమలుపర్చనై ఉన్నాడు. (యోవేలు 3:12) సర్వశక్తిమంతుడైన యెహోవాతో తలపడడానికి వారిని సంసిద్ధులు కానివ్వండి. యెహోవా మహాదినాన్ని మనం కూడా ఎదుర్కొంటున్నాము. కాబట్టి మన కాలానికీ, గతకాలానికీ సంబంధించిన యోవేలు ప్రవచన వాక్కుల్ని మనం నిశితంగా పరిశీలిద్దాం.

కీటకాల దాడి

4. యోవేలు హెచ్చరించిన సంఘటన ఎంత గొప్పదై ఉంటుంది?

4 తన ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెబుతున్నాడు: “పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.” (యోవేలు 1:2, 3) పెద్దలూ, సామాన్య ప్రజానీకమూ తమ జీవితకాలంలోగానీ లేక తమ పితరుల జీవితకాలంలోగానీ జరుగని సంఘటన ఏదో జరగబోతుందని ఎదురు చూశారు. అది మూడో తరానికి చెందినవాళ్లు కూడా గుర్తుంచుకోగల్గేంత అసాధారణమైన సంఘటన కాబోతుంది! ఈ గుర్తించుకోదగిన సంఘటన ఏమైవుంది? అదేంటో తెల్సుకోవడానికి, మనం వెనుకటికి యోవేలు కాలంలో జీవిస్తున్నట్లుగా ఊహించుకుందాం.

5, 6. (ఎ) యోవేలు ప్రవచించిన తెగులును వర్ణించండి. (బి) ఆ తెగులుకు మూలకారకుడు ఎవరు?

5 ఆలకించండి! యోవేలు దూరంనుండి వస్తున్న ఓ భీకరధ్వనిని వింటున్నాడు. ఆకాశం నల్లబడింది, కటిక చీకటి కమ్ముకుంటోండగా ఆ వింతైన ధ్వని అంతకంతకూ ఉద్ధృతమౌతోంది. అటు తర్వాత పొగలాంటి మేఘం క్రిందికి దిగనారంభించింది. అది కోట్లాది సంఖ్యలోనున్న కీటకాల దండు. అవి ఎంత వినాశనాన్ని కలుగజేస్తాయో గదా! ఇప్పుడు యోవేలు 1:4 చూడండి. దండెత్తి వచ్చిన ఈ కీటకాల్లో అటు ఇటు తిరుగాడే రెక్కలుగల మిడుతలు మాత్రమే లేవు. ఓహ్‌, అవే కాదు, వేరేవి కూడా ఉన్నాయ్‌! వస్తున్న ఆ గొప్ప దండులో ఆకలిగొనియున్న పసరు పురుగులు కూడా ఉన్నాయి. గాలివాటానికి కొట్టుకొచ్చిన మిడుతలు ఆకస్మికంగా వచ్చిపడ్డాయి, వాటి శబ్దం రథాల ధ్వనిని పోలివుంది. (యోవేలు 2:5) వాటికున్న విపరీతమైన ఆకలి కారణంగా, కోట్ల సంఖ్యలో ఉన్న ఆ కీటకాలు ఉన్నఫళంగా చక్కని పరదైసు భూమిని ఎడారిభూమిగా మార్చివేయగలవు.

6 గొంగళి పురుగులు కూడా తరలి వస్తున్నాయి. ఆకలితో నకనకలాడుతున్న గొంగళి పురుగుల విస్తారమైన దండు, మొక్కలు తమ పచ్చదనాన్ని కోల్పోయేంతవరకూ వాటి ఆకులన్నింటినీ, ముక్కలు ముక్కలుగా కొరికి పారవేయగలవు. మరి అవి విడిచిపెట్టినదానిలో ఎక్కువ భాగాన్ని మిడుతలు స్వాహా చేసేస్తాయి. ఇక మిడుతలు విడిచిపెట్టినదాన్ని కాస్తా, వేగంగా కదిలే బొద్దింకలు గుటుక్కుమనిపిస్తాయి. అయితే దీన్ని గమనించండి: యోవేలు 2వ అధ్యాయం 11వ వచనంలో, మిడుతల దండును దేవుడు “తన సైన్యము”గా గుర్తిస్తున్నాడు. అవును, దేశాన్ని పాడుచేసి, తీవ్రమైన క్షామాన్ని కలుగచేసే మిడుతల తెగులుకు ఆయనే మూలకారకుడు. ఎప్పుడు? ‘యెహోవా దినానికి’ కాస్త ముందుగానే.

‘మత్తులారా, మేల్కొనండి’!

7. (ఎ) యూదా మతనాయకుల పరిస్థితి ఏమైవుంది? (బి) నేటి క్రైస్తవ మతసామ్రాజ్య నాయకులు ఏ విధంగా అలనాటి యూదా మతనాయకుల్ని పోలిన స్థితిలో ఉన్నారు?

7 “మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారలారా, రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశనమాయెను” అని ఆజ్ఞాపించినప్పుడు, భక్తిహీన గుంపైన యూదా మత నాయకులు ప్రత్యేకపరచబడ్డారు. (యోవేలు 1:5) అవును, యూదాలోని ఆధ్యాత్మిక త్రాగుబోతులు ‘మేలుకోవాలనీ,’ మత్తు వీడాలనీ వారికి తెలియజేయబడింది. అయితే ఇది కేవలం ప్రాచీనకాల చరిత్రేనని తలంచకండి. యెహోవా మహాదినానికి ముందు ఇప్పుడు కూడా, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు సర్వోన్నతుని నుండి వచ్చే ఈ ఆజ్ఞను లక్ష్యపెట్టలేనంతగా అలంకార భావంలో పూర్తిగా క్రొత్త ద్రాక్షారసంలో మత్తులై ఉన్నారు. యెహోవా దేవుని భీకరమైన ఆ మహాదినాన్నిబట్టి వాళ్లు తమ మత్తునుండి మేల్కొన్నప్పుడు, వాళ్లెంతగా ఆశ్చర్యానికి గురౌతారో గదా!

8, 9. (ఎ) మిడుతల్నీ, అవి తీసుకొచ్చిన తెగులు ప్రభావాన్నీ యోవేలు ఎలా వర్ణిస్తున్నాడు? (బి) నేడు, ఆ మిడుతలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?

8 మిడుతల ఆ గొప్పదండును చూడండి! “లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది. వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడు సింహపు కాటువంటిది. అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి. నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను. పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.”—యోవేలు 1:6-8.

9 ఇది యూదాపై దండెత్తే మిడుతల ‘జనాంగాన్ని’ గూర్చిన అంటే క్రిమికీటకాదులను గూర్చిన ప్రవచనం మాత్రమేనా? కాదు. అంతకన్నా ఎక్కువ భావమే దీనికుంది. యోవేలు 1:6వ వచనంలోనూ, ప్రకటన 9:7వ వచనంలోనూ మిడుతలు దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహించాయి. ఆధునిక కాలంలో ఈ మిడుతల దండు, యెహోవా దేవుని అభిషిక్త మిడుతల సైనికశక్తే తప్ప మరేదీకాదు. యేసు యొక్క ‘వేరే గొర్రెలకు’ చెందిన దాదాపు 56,00,000 మంది ఇప్పుడు వారితో చేర్చబడ్డారు. (యోహాను 10:16) మీరు యెహోవా ఆరాధకుల ఈ గొప్ప సమూహంలో భాగస్థులై ఉన్నందుకు సంతోషంగా లేరా?

10. యూదాపై మిడుతల తెగులు చూపించిన ప్రభావం ఏమైవుంది?

10 యోవేలు 1:9-12 మిడుతల తెగులువల్ల కలిగిన ప్రభావాల్ని గూర్చి మనం చదువుతాం. ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చిన క్రిమికీటకాదుల దండు, ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. కాయధాన్యాలూ, ద్రాక్షామద్యమూ, తైలమూ కొరవడడంతో అవిశ్వాసులైన యాజకులు తమ విధులు నిర్వర్తించలేకపోయారు. కాయధాన్యాలు లేకుండా భూమినీ, ఫలాల్లేకుండా ఫలవృక్షాలనూ మిడుతలు పాడుచేసినందుకు భూమి కూడా అంగలార్చింది. ద్రాక్షాతోటలు పాడుకావడంతో, త్రాగుబోతులూ, ఆధ్యాత్మిక త్రాగుబోతులు కూడా అయిన బయలు దేవతారాధకులకు ఇక ద్రాక్షమద్యం లేకుండా పోయింది.

‘యాజకులారా మీ రొమ్ములను బాదుకొనుడి’

11, 12. (ఎ) దేవుని యాజకులమని నేడు చెప్పుకుంటున్నదెవరు? (బి) ఆధునికకాల మిడుతల తెగులు క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులను ఎలా ప్రభావితం చేసింది?

11 ఆ తిరుగుబాటు యాజకుల కొరకు దేవుని సందేశం ఏమిటో వినండి: “యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి [“రొమ్ములను బాదుకొనుడి”, NW]. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి.” (యోవేలు 1:13) యోవేలు ప్రవచనపు మొదటి నెరవేర్పు జరుగుతున్నప్పుడు, లేవీవంశ యాజకులు బలిపీఠమునొద్ద సేవచేసేవారు. అయితే చివరి నెరవేర్పు సంగతేమైవుంది? నేడు, క్రైస్తవమత సామ్రాజ్య పాదిరీలు తాము దేవుని పరిచారకులమని, ‘యాజకులమని’ చెప్పుకుంటూ ఆయన బలిపీఠమునొద్ద సేవచేసే అధికారాన్ని తమకు ఆపాదించుకున్నారు. అయినా, దేవుని ఆధునిక-కాల మిడుతలు తరలివస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతోంది?

12 క్రైస్తవమత సామ్రాజ్య ‘యాజకులు’ యెహోవా ప్రజలు కార్యాచరణలో ఉండడాన్ని చూసి, వారిచ్చే దైవిక తీర్పు హెచ్చరికను విన్నప్పుడు, వాళ్లు భీతిచెందుతున్నారు. రాజ్య సందేశపు వినాశకర ప్రభావాన్నిబట్టి, వాళ్లు విసుగుతోనూ, ఉగ్రతతోనూ రొమ్ము కొట్టుకొంటున్నారు. తమ మందలు తమ చేయి జారిపోతుండగా వాళ్లు అంగలారుస్తున్నారు. తమ పచ్చికబయళ్లు తమ పచ్చదనాన్ని కోల్పోతుండడంతో, వాళ్లు తమ ఆదాయానికి వాటిల్లిన నష్టాన్ని చూసి గోనెపట్ట కట్టుకొని రాత్రంతా గడుపుతూ రోదించనివ్వండి. త్వరలోనే, వాళ్లు తమ యాజకవృత్తిని కోల్పోతారు! వాస్తవానికి, వాళ్ల అంతం సమీపించింది గనుక రాత్రంతా రోదించండని దేవుడు వాళ్లకు చెబుతున్నాడు.

13. ఒక గుంపుగా మొత్తం క్రైస్తవమత సామ్రాజ్యం యెహోవా హెచ్చరికకు అనుకూలంగా ప్రతిస్పందిస్తుందా?

13 యోవేలు 1:14 ప్రకారంగా, పశ్చాత్తాపపడి సహాయం కోసం “యెహోవాను బతిమాలుకొనుట”పై మాత్రమే వారి నిరీక్షణ ఆధారపడి ఉంది. క్రైస్తవ మత సామ్రాజ్య పాదిరీ వర్గమంతా యెహోవావైపు తిరుగుతుందని మనం ఎదురు చూడవచ్చా? కాదనుకోండి! వారిలో కొంతమంది వ్యక్తులు యెహోవా హెచ్చరికకు ప్రతిస్పందించవచ్చు. కానీ ఒక వర్గంగా ఈ మత నాయకుల, వారిననుసరించే చర్చి సభ్యుల ఆధ్యాత్మిక క్షామము కొనసాగుతుంది. ప్రవక్తయైన ఆమోసు ఇలా ప్రవచించాడు: “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.” (ఆమోసు 8:11) మరోవైపున, ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా దేవుడు ప్రేమతో దయచేస్తున్న గొప్ప ఆధ్యాత్మిక విందుకు మనమెంత కృతజ్ఞులమోగదా!—మత్తయి 24:45-47.

14. మిడుతల తెగులు దేనికి పూర్వగామిగా ఉంది?

14 మిడుతల తెగులు అప్పుడూ, ఇప్పుడూ ఏదొక దానికి పూర్వగామిగానే ఉంది. దేనికి? యోవేలు మనకు స్పష్టముగా తెలియజేస్తూ, ఇలా చెబుతున్నాడు: “ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును.” (యోవేలు 1:15) నేడు దేవుని మిడుతల దండు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న దాడులు, యెహోవా భీకరమైన మహాదినం సమీపమైందని స్పష్టంగా సూచిస్తున్నాయి. దుష్టులమీద ఆ దైవిక తీర్పు తీర్చబడి, విశ్వసర్వాధిపతిగా యెహోవా దిగ్విజయుడయ్యే ఆ ప్రత్యేక తీర్పుదినం కొరకు నీతిమంతులంతా ఖచ్చితంగా ఎదురుచూస్తారు.

15. దేశం పాడుబడిన స్థితిలో ఉన్న దృష్ట్యా, దైవిక హెచ్చరికలను లక్ష్యపెట్టేవారు ఎలా ప్రతిస్పందిస్తారు?

15 యోవేలు 1:16-20 చూపిస్తున్నట్లుగా, ప్రాచీన యూదాలో ఆహారం నాశనమైపోయింది. అలాగే ఆనందం కూడా నిలిచిపోయింది. ధాన్యపుకొట్లు ఖాళీకాగా, కళ్లపుకొట్లు నేలకూలాయి. మిడుతలు ఆ దేశపు పచ్చికను పాడుచేయడం మూలంగా పచ్చిక బయళ్లు లేనందున పశువులు మేతలేక అల్లాడిపోగా, గొర్రెలమందలు నాశనమయ్యాయి. ఎంతటి విపత్తో కదా! అలాంటి పరిస్థితుల్లో, యోవేలుకు ఏమి సంభవించింది? 19వ వచనం ప్రకారంగా, ఆయనిలా చెప్పాడు: “యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను.” ఈనాడు కూడా, అనేకమంది దైవిక హెచ్చరికల్ని లక్ష్యపెట్టి విశ్వాసంతో యెహోవా దేవునికి మొఱ్ఱపెడుతున్నారు.

‘యెహోవా దినము వచ్చుచున్నది’

16. “దేశనివాసులందరు” ఎందుకు వణకాలి?

16 దేవునినుండి వచ్చిన ఈ ఆజ్ఞను ఆలకించండి: “సీయోను కొండమీద బాకా ఊదుడి. నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. . . . దేశనివాసులందరు వణకుదురు గాక.” (యోవేలు 2:1) ఆ విధంగా ఎందుకు ప్రతిస్పందించాలి? ప్రవచనమిలా జవాబిస్తోంది: ‘యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమాయెను. . . . ఆ దినము అంధకారమయముగా ఉండును. మహాంధకారము కమ్మును. మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి.’ (యోవేలు 2:1, 2) యెహోవా మహాదినానికి నిజమైన అత్యవసర భావం జోడించబడింది.

17. మిడుతల తెగులుచే యూదా దేశమూ, దేశ ప్రజలూ ఎలా ప్రభావితమయ్యారు?

17 ఏదెను తోటలాంటి దాన్ని ఎందుకూ కొరగాని పాడు స్థలంగా మార్చేటువంటి, అలుపూ సొలుపూ ఎరుగని మిడుతల ప్రవచనార్థక దర్శన ప్రభావాన్ని ఊహించండి. మిడుతల దండును గూర్చిన వర్ణనను వినండి: “వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.” (యోవేలు 2:4-6) యోవేలు కాలంలో మిడుతల తెగులు కలిగినప్పుడు, బయలు ఆరాధకుల వ్యధ పెరిగి, వారికి కలిగిన గొప్ప వ్యాకులత వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కన్పించింది.

18, 19. దేవుని ప్రజల నేటి కార్యకలాపాలు ఎలా మిడుతల తెగులును పోలివున్నాయి?

18 క్రమంగానూ, అలుపులేకుండా దూసుకు వచ్చిన మిడుతలను ఏదీ ఆపుజేయలేకపోయింది. అవి “శూరుల”వలె పరిగెత్తాయి, ప్రాకారాల్ని సహితం దాటుకొని వెళ్లాయి. వాటిలో కొన్ని ‘ఆయుధాల మీద పడిననూ, మిగతావి తమ త్రోవ విడువలేదు.’ (యోవేలు 2:7, 8) దేవుని ఆధునిక-కాల అలంకారిక మిడుతల దండుకు అది ఎంత చక్కని ప్రవచనార్థక వర్ణనో గదా! నేడు కూడా, యెహోవా మిడుతలదండు నేరుగా ముందుకు వెళుతోంది. వ్యతిరేకతయనే ఏ ‘ప్రాకారమూ’ వారిని ఆటంకపర్చలేదు. జర్మనీ నాజీ పరిపాలనా కాలంలో హిట్లరుకు జైకొట్టడానికి నిరాకరించినందుకు ‘ఆయుధాల మీద పడిన’ వేలాది సాక్షులవలెనే వాళ్లు మరణించడానికైనా ఇష్టపడతారు గానీ, దేవుని ఎడల తమ యథార్థత విషయంలో రాజీపడరు.

19 దేవుని ఆధునిక-కాల మిడుతలదండు క్రైస్తవ మత సామ్రాజ్య ‘పట్టణములో’ సమగ్రమైన సాక్ష్యాన్నిచ్చింది. (యోవేలు 2:9) వాళ్లు ప్రపంచవ్యాప్తంగా అలా చేశారు. వాళ్లు యెహోవా సందేశాన్ని ప్రకటిస్తుండగా, కోట్లాది గృహాల్లో ప్రవేశిస్తూ, వీధుల్లో ఉన్న ప్రజల్ని సమీపిస్తూ, ఫోన్లద్వారా వారితో మాట్లాడుతూ, సాధ్యమైన ప్రతి మార్గంలో వారిని కలుసుకుంటూ వాళ్లింకా అనేక ఆటంకాల్ని అధిగమిస్తూనే ఉన్నారు. నిజానికి, వాళ్లు వందలకోట్ల బైబిలు సాహిత్యాల్ని పంచిపెట్టారు. వాళ్లు ఇంటింటనూ, బహిరంగంగానూ చేసే నిర్విరామ పరిచర్యలో అనేకానేక సాహిత్యాల్ని ఇంకా ఇంకా పంచిపెడతారు.—అపొస్తలుల కార్యములు 20:20, 21.

20. ఆధునికకాల మిడుతలకు మద్దతునిస్తున్నదెవరు, ఏ ఫలితాలతో?

20 అతి పెద్దదైన మిడుతల దండు, సూర్య చంద్ర నక్షత్రాల్ని కమ్మివేసేంత పెద్ద మేఘంవలే ఉందని యోవేలు 2:10 చూపిస్తోంది. (పోల్చండి యెషయా 60:8.) ఈ సైనికశక్తి వెనుక ఎవరున్నారనే విషయంలో ఏదైనా సందేహముందా? కీటకాల గొప్పధ్వనికి పైగా యోవేలు 2:11లోని ఈ మాటల్ని మనం వింటాం: “యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదైయున్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చునది, బలముగలది. యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడెవడు?” అవును, యెహోవా దేవుడు తన మహాదినానికి ముందు, అంటే ఇప్పుడు తన మిడుతల సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.

‘యెహోవా ఆలస్యం చేయువాడు కాడు’

21. ‘యెహోవా దినం దొంగవలె’ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?

21 యోవేలు వలెనే అపొస్తలుడైన పేతురుకూడా యెహోవా మహాదినాన్ని గురించి మాట్లాడాడు. ఆయనిలా రాశాడు: “ప్రభువు [“యెహోవా,” NW] దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.” (2 పేతురు 3:10) అపవాదియైన సాతాను ప్రభావం క్రింద, దుష్ట ప్రభుత్వమనే “ఆకాశములు” దేవునినుండి వేరై పోయిన మానవులనే “భూమిని” పరిపాలిస్తున్నాయి. (ఎఫెసీయులు 6:12; 1 యోహాను 5:19) యెహోవా మహాదినాన కలిగే దైవిక కోపాగ్ని వేడికి ఈ సూచనార్థక భూమ్యాకాశాలు తప్పించుకోలేవు. అంతేగాక, “మనమాయన వాగ్దానమునుబట్టి” ఈ భూమ్యాకాశాల స్థానే “క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

22, 23. (ఎ) యెహోవా దేవుని దయాపూర్వకమైన దీర్ఘశాంతానికి మనమెలా ప్రతిస్పందించాలి? (బి) యెహోవా దినం సమీపించడాన్ని చూసి మనమెలా ప్రతిస్పందించాలి?

22 ప్రస్తుతకాలంలోని అవధానాన్ని మళ్ళించే విషయాలన్నింటినిబట్టీ, విశ్వాస పరీక్షలనుబట్టీ మనం మన కాలాల్లోని అత్యవసరదృష్టిని పోగొట్టుకోవచ్చు. అయితే, సూచనార్థక మిడుతలు అంతకంతకూ ముందుకు సాగుతుండగా, అనేకమంది రాజ్య సందేశానికి ప్రతిస్పందిస్తున్నారు. దేవుడు దీనికి సమయాన్ని అనుమతించినా, ఆయన చూపించే దీర్ఘశాంతాన్ని ఆలస్యమని ఎంచకూడదు. “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు [“యెహోవా,” NW] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”—2 పేతురు 3:9.

23 యెహోవా మహాదినము కొరకు మనం వేచి ఉంటుండగా, 2 పేతురు 3:11, 12లలో రాయబడిన పేతురు మాటల్ని హృదయంలోకి తీసుకుందాం: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టియు, పంచ భూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను.” అంతం రావడానికి ముందే రాజ్యసువార్తను ప్రకటించడంలో క్రమంగానూ, అర్థవంతంగానూ భాగంవహించడం ద్వారా యెహోవా మిడుతల దండుతోపాటూ కలిసి సాగిపోవడమనేది ఆ క్రియల్లోనూ, చర్యల్లోనూ నిశ్చయంగా చేరియుంది.—మార్కు 13:10.

24, 25. (ఎ) యెహోవా మిడుతల దండు చేసే పనిలో భాగంవహించే ఆధిక్యతకు మీరెలా ప్రతిస్పందిస్తారు? (బి) యోవేలు ఏ అర్థవంతమైన ప్రశ్నను లేవదీశాడు?

24 యెహోవా భయంకరమైన ఆ మహాదినం వచ్చేంతవరకూ దేవుని మిడుతల దండు తమ పనిని ఆపవు. ఆపజాలని ఈ మిడుతల శక్తి ఉనికిలో ఉండటమే యెహోవా దినం సమీపంగా ఉందనడానికి గుర్తింపదగిన రుజువైయుంది. యెహోవా దేవుని భయంకరమైన ఆ మహాదినము రాకముందు, చివరి ముట్టడిలో దేవుని అభిషిక్త మిడుతలతోనూ, వారి సహవాసులతోనూ కలిసి సేవచేస్తున్నందుకు మీరు సంతోషించడంలేదా?

25 యెహోవా మహాదినము ఎంత గొప్పగా ఉంటుందో గదా! ఈ ప్రశ్నను అడగడంలో ఆశ్చర్యంలేదు: “దానికి తాళగలవాడెవడు?” (యోవేలు 2:11) ఈ ప్రశ్నా, మరనేకమైన ఇతర ప్రశ్నలూ దీని తర్వాతి రెండు శీర్షికల్లో పరిశీలించబడతాయి.

మీరు వివరించగలరా?

◻ యూదాపై కీటకాల తెగులును గూర్చి యెహోవా ఎందుకు హెచ్చరించాడు?

◻ యోవేలు ప్రవచన ఆధునికకాల నెరవేర్పులో, యెహోవా దేవుని మిడుతలు ఎవరైవున్నారు?

◻ మిడుతల తెగులుకు క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు ఎలా ప్రతిస్పందిస్తారు, వారిలో కొందరు దాని పర్యవసానాలను ఎలా తప్పించుకోగలరు?

◻ 20వ శతాబ్దంలో మిడుతల తెగులు ఎంత విస్తారంగా ఉంది, మరి అది ఎంతవరకూ కొనసాగుతుంది?

[9వ పేజీలోని చిత్రం]

కీటకాల తెగులు దానికన్నా మరీ భయంకరమైన తెగులుకు పూర్వగామిగా ఉంది

[క్రెడిట్‌ లైను]

మోడుబారిన వృక్షం: FAO photo/G. Singh

[10వ పేజీలోని చిత్రం]

ఆధునికకాల మిడుతల తెగులు వెనుక యెహోవా దేవుడు ఉన్నాడు

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

మిడుత: FAO photo/G. Tortoli; మిడుతల దండు: FAO photo/Desert Locust Survey

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి